–  ఎస్‌.లలిత

‘‘కన్నులనే కిటీకీల నుంచే విశ్వసౌందర్యాన్ని ఆత్మ ఆస్వాదిస్తుంది. ఓ చిన్న ప్రకృతి దృశ్యం విశ్వ సంకేతాలను తనలో ఇముడ్చుకుంటుందని ఎవరు ఊహించ గలరు?

– ఇటాలియన్‌ శిల్పి, చిత్రకారుడు లియోనార్డో డావిన్సి

——

‘నేను చెబుతూనే ఉన్నాను. కారులో కాకుండా… హాయిగా అందరితో కలిసి… రైలులో వెళితే చక్కగా ఉంటుందని… నువ్వే.. ప్రకృతి, అడవి, జలపాతాలు, గాడిద గుడ్డు, నా శ్రాద్ధమంటూ కారులో బయలు దేరించావు. చూడు ఇప్పుడేమయ్యిందో…!’ -నా భార్యపైన విపరీతమైన కోపం వచ్చింది నాకు.

‘మీకు ఈ మధ్య కాలంలో అసహనం పెరిగిపోయింది. అయినదానికీ, కాని దానికీ నా మీద విరుచుకు పడుతున్నారు. నా మీద కోపగించు కుంటే సమస్యకు పరిష్కారం దొరకదు కదా? మీ సబార్డినేట్స్‌ను కసిరినట్లు నన్ను ట్రీట్‌ చేస్తున్నారు మీరు…’ – నా భార్య నా మీద కయ్య్‌మంది…

శ్రీకాకుళం జిల్లాలో, ఓ రెవెన్యూ డివిజన్‌కు నేనో గ్రూప్‌ వన్‌ అధికారిని. అధికారం ఇచ్చిన దర్పం నాక్కొంచెం ఎక్కువని నన్నందరూ ఆడిపోసు కుంటారు. కానీ, కొండ మీది కోతినైనా సరే సాధించే వరకూ నాకు నిద్రపట్టదు.

‘మీరు క్రమంగా సున్నితత్వం కోల్పోతున్నారు…’ ఇది నా భార్య నాకు చేసే కంప్లయింట్‌…

నిజమే…! నా భార్య ప్రకృతి ప్రేమికురాలు. నేను, నా పిల్లలు ఒకరకం ఆవిడ ఒక రకం. ఒకే ఇంట్లో రెండు వర్గాలు.

వారం రోజులు క్రిందట నేను ఓ అరెకరం నేల కొన్నాను. వంశధార నది ఒడ్డున. దాంట్లో మామిడి, వేప, కొబ్బరి చెట్లున్నాయి. వాటిని కొట్టించి ఓ మంచి ఇల్లు కట్టుకోవాలని నా ప్లాన్‌..

‘వద్దండి.. మనకంటూ ఇంద్రభవనం అవసరం లేదు. చక్కని నదీతీరం.. చెట్లు.. గాలి.. ప్రకృతి మధ్య వెన్నెల్లో, వర్షంలో ఆనందాన్ని ఆస్వాదిద్దాం. అవసర మైన చోటు వరకు చెట్లను కొట్టండి. మిగిలినవి అలా ఉంచేయ్యండి.. ప్లీజ్‌..’ – అది ఆమె వరుస..

ప్రేమ..! ఈ శషభిషలు మధ్య ఇంటి నిర్మాణం ఆగిపోయింది..

అయినా.. ఏమిటో దీనికా ప్రకృతి

ప్రస్తుతానికి వస్తే..

నా బాల్యమిత్రుని తమ్మునికి పెళ్లి జగదల్‌ పూర్‌లో. రెండు గ్రూపులుగా ఒకరు బస్సులో, ఒకరు కె.కె.లైన్‌ పాసింజర్‌ రైలులో వెళ్లిపోయారు.

మా ఆవిడ, ‘మనమిద్దరం లాంగ్‌ డ్రైవ్‌ చేసుకొంటూ సరదాగా కారులో వెళదామండి. పిల్లలకు పరీక్షల సమయం. అమ్మ ఎలాగూ వారి వద్ద ఉంటుంది. సరదాగా ఆ అడవి మార్గాన సన్నని రోడ్డుపైన, ఒకవైపు లోయలు.. మరోవైపు ఎత్తైన కొండలు… పచ్చని ప్రకృతి మధ్య… మీరు, నేను… ఎన్ని సంవత్సరాలైందో… ప్లీజ్‌..’ అంది..

ఎందుకో ఆమె మాటను కాదనలేకపోయాను…

ఆవిడకూ డ్రైవింగ్‌ వచ్చు..

విశాఖపట్నం నుంచి జగదల్‌పూర్‌ దాదాపు మూడు వందల కిలోమీటర్ల దూరం. రైలు, బస్సు సౌకర్యం ఉంది. సాలూరు, సుంకీ, జైపూర్‌ (ఒడిషా) మీదుగా వెళ్లవచ్చు. జైపూర్‌ వరకు రోడ్డు బాగుంటుంది. అక్కడి నుంచి గంటకు పదిహేను మైళ్ల వేగంతో కూడా ప్రయాణం చేయలేని పరిస్థితి. సన్నని బాటలు. పక్కా రోడ్లు లేవు..

చత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌ మధ్యలో ఉంది జగదల్‌పూర్‌. అటవీ ప్రాంతం.. మైదానప్రాంతం.. లోయలు.. కొండలు.. దట్టమైన అటవీ ప్రదేశాల మధ్య ప్రయాణం కొనసాగించవలసి వస్తుంది. మధ్యమధ్య పది పదిహేను ఇళ్లతో చిన్నచిన్న గూడేల లాంటి ప్రాంతాలుంటాయి.. మావోయిస్టులు నిరంతరం సంచరించే ప్రాంతం..

ఈమధ్యనే కుసుమ ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి.. నల్వాజుడుం అధ్యక్షుడు మాధవ వర్మను పక్కా ప్రణాళికతో చంపారు మావోయిస్టులు..

చత్తీస్‌ఘడ్‌లో ఓ ఐదు ప్రాంతాలు షెల్టర్‌ జోన్స్‌ ఉన్నాయి. వాటిలో జగదల్‌ పూర్‌ ఒకటి. జగదల్‌పూర్‌`జైపూర్‌ మధ్య అటవీ ప్రాంతంలో ప్రయాణమంటే కొంచెం భయపడవలసినదే.. కాని సామాన్యులకు ఇవి అనవసరం కదా…

అవసరమైన తినుబండారాలు, టాంక్‌ నిండా పెట్రోలు పోయించుకొని… అవసరమైన మందులు, నీళ్ల బాటిల్స్‌ వంటి వాటితో ప్రయాణం మొదలు పెట్టాము. అరకు, బొర్రా, శివలింగాపురం చూసుకొని జైపూర్‌ మీదుగా వెళ్లాలనేది ప్లాన్‌..

ప్రయాణం సాఫీగానే జరిగింది. అవసరమయిన చోట ఆగుతూ.. బొర్రాగుహలను, అరకు అందాలను ఆస్వాదించి హాయిగా ప్రయాణం చేస్తున్నాం. మధ్య మధ్య మాఆవిడ డ్రైవింగ్‌ చేసింది. సరదాగా ముందుకు సాగుతున్నాం. ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన మా ప్రయాణంలో ఎన్నెన్నో సరదాలు.. సరసాలు.. సంతోషాలు.. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా ఈ రీతిగా లాంగ్‌ డ్రైవ్‌ ప్లాన్‌ చేయాలని డిసైడయిపోయాను.

నాకు కూడా ఎందుకో ప్రకృతి అందాలపైన మమకారం పెరిగింది.

‘అవునుగాని.. నీకెందుకోయి.. ప్రకృతిపైన మమకారం..’ అడిగాను మా ఆవిడను.

కారు నడుతున్న ఆవిడ చెప్పడం ప్రారంభించింది.

‘పరోక్షంగా తానుండి, ప్రత్యక్షంగా ప్రకృతి రూపంలో మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు పరమాత్మ. సూర్యాస్తమయంలోని అందాలను, చంద్రోదయం లోని సౌందర్యాన్ని, చుక్కలు పొదిగిన ఆకాశాన్ని.. తొలకరి కురిసిన వేళప్పుడు పరిమళాన్ని ఆస్వాదించిన వేళ.. అప్రయత్నంగా సృష్టికర్తపట్ల ఆరాధనా భావం కలిగి చేతులెత్తి నమస్కరించాలని పిస్తుంది. కానీ.. ఆధునిక మానవుడి పెను శాపమేమిటంటే ప్రకృతితో సాహచర్యం చేసే సమయం లేకపోవటం.. వేకువనూ, వెన్నెలనూ.. పూలనూ.. వాటి పరిమళాలనూ.. ఎగిరే పక్షులను.. కడలిని.. కెరటాలను.. వాటి మధ్యగల లయబద్ధ మైన అనుబంధాన్ని గమనించి తన్మయం చెందే గుండె తడి ఇంకిపోతున్నది. ఒక్కసారి చుట్టూ గమనించండి. ప్రకృతిలోని నిశ్శబ్దం.. లాలిత్యం.. సందేశం..’

ఆగింది.. ఆమె ముఖంలో తన్మయత్వం.. సందేశం, మెరుపులు. నిజమే! ఆమె మాటలు వింటూంటే.. ప్రకృతి ప్రేమికులు అదృష్టవంతులని పిస్తుంది..

‘సరే.. భోజనం సంగతి చూడండి.. మేడమ్‌ గారూ..!’

‘ఎస్సార్‌..’ అని నవ్వి.. కారును పక్కకు తీసి ఆపింది.. ముందుగానే సిద్ధం చేసుకొన్న పులిహోర, బొబ్బట్లు.. దద్ద్యోజనం తిని కడుపునిండా నీళ్లు తాగి.. చిన్నపాటి ఖాణా పైన కూర్చున్నాం దగ్గరగా..

ఆ దారంట వెళుతున్న.. ఓ యువజంట.. మమ్మల్ని చూసి నవ్వింది… మేము చేతులూపాం..

తరువాత.. మా మధ్య కొంతసేపు నిశ్శబ్దం…

పావుగంట గడిపి బయలుదేరాం..

దూరంగా కొండల మధ్య దట్టమైన మబ్బులు. సమయం పన్నెండు కావస్తున్నది. వేగంగా గంటకు అరవై, డెబ్బైల మధ్య ప్రయాణం కొనసాగిస్తే, సాయంత్రం ఐదు, ఆరు మధ్య జగదల్‌పూర్‌ చేరుకోవచ్చు..

దట్టమైన మబ్బులు.. నల్లని భూతాల్లా.. వస్తున్నాయి.

కారును వేగంగా నడుపుతున్నది నా భార్య.. ముదితల్‌ నేర్వంగరాని విద్య గలదే.. అనిపించింది..

‘ఆ మబ్బులను చూసారా.. ఎంతందంగా ఉన్నాయో.. ప్రకృతి అందాలను ఆస్వాదించవలసిన మనిషి, గాలిని.. నీటిని.. కాలుష్యంతో కబళించి వేస్తున్నాడు.. వన్య ప్రాణులను తన స్వార్థానికి పణంగా పెడుతూ.. ప్రకృతి సమతౌల్యాన్ని మంటగలుపుతూ.. ప్రకృతి వైపరీత్యాల రూపంలో పరమాత్మ ప్రదర్శించే ప్రకోపానికి గురవుతున్నాడు..

మహాకవి కృష్ణశాస్త్రి ‘ఇక హిమవంతము వలదు.. ఇక నిశీధము వలదు.. నీ సన్నిధియే దేవదేవా!.. ఒక వసంతము పైన నొక ప్రభాతములోన.. ప్రకటింప దేవదేవా’ అన్నారు.

అన్ని ప్రయాణాలు సుఖంగా జరిగిపోతే.. చెప్పుకోనేందుకు, నేర్చుకొనేందుకు ఏముంటుంది కనుకా…!?

జైపూర్‌.. చక్కని సిటీ.. తెలుగువారు దాదాపు ఎనభైశాతం ఉన్నారు.. కాని ఎవరూ తెలుగు మాట్లాడరు.. అంతా రైల్వేలో పనిచేస్తున్న వారే..

ఇక్కడి నుంచి.. ముందుకు వేగంగా వెళ్లే అవకాశం లేదు.. సమయం కోసం వాచీ చూసు కొన్నాను.. రెండు గంటలు కావస్తున్నాది.. మబ్బులు దట్టంగా ఉన్నాయి.. ఇప్పుడో.. అప్పుడో వర్షం వచ్చేలా ఉంది.. జగదల్‌పూర్‌ వరకూ రోడ్లు దరిద్రంగా ఉంటాయి.. వర్షం కూడా వస్తే చెప్పనవసరం లేదు.. దారిలో పలకరించే నాథుడు కూడా ఉండదు.

కారును.. నేను నడపడానికి నిశ్చయించుకొని.. డ్రైవర్‌ సీట్లో కూర్చున్నాను.. వేగంగా పోనిస్తున్నాను..

కుసుమ చేరుకున్నాం.. అటవీ ప్రాంతం.. జనాభా రెండు వేలకు మించదేమో… గిరిజనులే.. కోయిలే.. కొండ జాతి..

గాలి చల్లగా వీస్తున్నాది.. కుసుమ పరిధి దాటి.. మరింత అటవీ ప్రాంతానికి చేరుకున్నాము.. రోడ్డు అధ్వాన్నంగా ఉంది.. మెల్లగా వర్షం ప్రారంభ మయ్యింది.. ఎర్రని నీరు.. రోడ్డుపైన.. ప్రక్కన చేరుతున్నది..

వైపర్స్‌ శబ్దం తప్ప.. మా మధ్య మాటలు లేవు..

మంచి.. నట్టడవి ప్రాంతం.. కీచురాళ్ల రొద.. దూరంగా పేరు తెలియని పిట్ట వికృతంగా అరుస్తున్నది.. నా భార్య.. నా భుజంపైన తలవాల్చి కళ్లు మూసుకొంది.. భయపడుతున్నట్లుగా ఉంది..

ఇంతలో.. హఠాత్తుగా చిన్నపాటి కుదుపుతో కారు ఆగిపోయింది..

నాకేం చేయాలో తెలియలేదు. పెట్రోలు సమస్య కాదు. ఏదో సాంకేతిక సమస్య. ఏం చేయాలి? వర్షం సన్నగా పడుతున్నది. రైన్‌ కోటు తీసి వేసుకొని కారు దిగాను. డిక్కీలో నుంచి సామాను తీసి, కారు ముందుకు వచ్చి.. ఓపెన్‌ చేసి చూడసాగాను.. నా అర్ధ జ్ఞానం.. అర్థం కాలేదు..

కాలం గడుస్తున్నది. ఐదు, ఆరు దాటుతున్నాది.. నాలో అసహనం బయలుదేరింది. అది కాస్తా కోపంగా మారింది. చీకటి రాత్రులు.. వర్షం.. ఒంటరిగా ఏం చేయాలి? ఎలా ఉండాలి? భగవంతుడా ఏమిటీ పరీక్ష? ఉద్యోగం వచ్చిన తరువాత తొలిసారిగా దేవుడ్ని ప్రార్థించాను. నా భార్య మీద విరుచుకుపడ్డాను..

క్రమంగా చీకట్లు ముసురుకుంటున్నాయి. రాత్రవుతున్న కొద్దీ అడవి చైతన్యమవుతోంది. మావోయిస్టులు తిరుగాడు ప్రాంతం. వన్యప్రాణులు నీటికి.. ఆహారం కోసం స్వేచ్ఛగా సంచరించే ప్రాంతం. బస్తరు ప్రాంతం ఇక్కడకు దగ్గరే. మంత్రగాళ్లకు ఆ ప్రాంతం ప్రసిద్ధి అంటారు.

నా భార్య ఏడుస్తున్నాది. నేను కోపాన్ని కంట్రోల్‌ చేసుకున్నాను. ఆమె దగ్గరకు వెళ్లా..

‘ఊరుకో.. బాధపడకు.. ఆలోచిస్తాను… తినడానికి సామాన్లున్నాయి.. భయంలేదు.. నేను.. ఫోన్‌ చేస్తాను.. జగదల్‌పూర్‌ వచ్చేసినట్లే.. డోన్ట్‌ వర్రీ..’ అని ఓదార్చాను.. కాని.. నాకు.. ఆమెకు కూడా తెలుసు.. పరిస్థితి ఎంత జటిలమో!

సమయం ఏడు వస్తున్నాది.. ఆకలి లేదు.. వర్షం ఆగింది.. చల్లని గాలి వీస్తున్నాది.. సెల్‌ అందుకొని.. నా మిత్రునికి ఫోన్‌ చేసాను. సిగ్నల్స్‌ లేవు..

ఇంతలో.. ఏదో.. అలికిడయింది.. మనుషులు వస్తున్నట్టుగా ఉన్నారు.. దూరంగా లాంతరు వెలుగు.. దాదాపు పదిమంది దాకా ఉండవచ్చు.

దీపాలు.. మా సమీపానికి వస్తున్నాయి. వచ్చేశాయి.. వారంతా మా కారు దగ్గరకు వచ్చారు. వారి శరీరం నుంచి పసరు వాసన. వారి నోటి నుంచి కుళ్ళు వాసన. కోయిలాలు.. కొండజాతి వారు.. చిత్రమైన వేషధారణలో ఉన్నారు..

మమ్మల్ని వారి వెంట తీసుకుపోయారు.

ఎందుకు…? ఏమో…?

వారు ఏర్పాటు చేసిన గుడిసెలో పడుకున్నాం. నిద్రరాలేదు. దోమలు భయంకరంగా శబ్దం చేస్తున్నాయి. అందరూ అలాగే నిద్రపోయారు. హాయిగా.. ఎలా సాధ్యమది…

నాకు, నా భార్యకు విసరటానికి ఇద్దరిని ఏర్పాటు చేసారు. బయట వర్షం ఎక్కువయ్యింది..

ఆ ఇద్దరూ అలా తెల్లవార్లు విసురుతూనే ఉన్నారు..

తెల్లవారింది. వారిద్దరినీ చూసి నా కళ్ళంట నీరు. నాలో ఏదో పశ్చాత్తాపం. నా భార్య పసిపాపలా వారితో కలిసిపోయింది. దగ్గరున్న ఏటి వద్దకు వెళ్లాం.చల్లని నీటిలో స్నానం చేశాం. నా మిత్రుని ఫోన్‌ పనిచేస్తున్నాది. సిగ్నల్‌ అందుతున్నాయి.. పరిస్థితి చెప్పాను. గంటలో మెకానిక్‌ను పంపు తున్నానన్నాడు..

అంతలో దూరంగా.. ఓ పిచ్చుక గూడు కనిపించింది. నాకెందుకో.. నా రెండో పాప.. ఒకసారి, ‘నాన్నా.. నాకో పిచ్చుక గూడు కావాలి కొనిపెట్టవా?’ అని అడిగింది.

అది గుర్తుకు వచ్చి.. నా ప్రక్కనున్న గిరిజనుడికి అది చూపించి, హిందీలో అది కావాలని అడిగాను, ఎంతైనా ఇస్తానన్నాను…

అతను నవ్వుతూ నిలబడ్డాడు కాని ఆ గూడు తీసి ఇవ్వటానికి అంగీకరించ లేదు.. నా అహం దెబ్బతింది.. నాలోని మరో మనిషి బయటకు వచ్చాడు.. అధికారిననే అహంకారం బుసలు కొట్టింది. వంద దగ్గర ప్రారంభమయిన నా పాట ఐదువేలు వరకూ వెళ్లింది.

అయినా అతను చలించలేదు.

చివరకు ‘ఏం కావాలి.. ఎంతకావాలి..?’ అన్నాను గర్వంగా..

‘మీరేమిచ్చినా.. దానిని తీసి ఇవ్వను.. ఇవ్వలేను.. అన్నాడు వినయంగా..

అతని కళ్లలో ఇది అని చెప్పలేని దయ.. జాలి.. ప్రేమ.. నాకు కనిపించాయి.. గౌతముడు హంస కోసం చెప్పిన మాటల్లా ఉన్నాయి.

ఆశ్చర్యంగా… ఎందుకని అడిగాను..

అతను చెప్పిన సమాధానం నన్ను విస్మయపరిచింది..

‘సార్‌.. తన పిల్లల కోసం ఆ తల్లి పక్షి ఎంత కష్టపడి ఆ గూడు కట్టుకుందో నేను చూసాను. అలా గతంలో కట్టుకున్న గూటిని ఎవరో తెంపుకుపోతే.. తన గూడు ఏమైపోయిందో తెలియక తల్లిపక్షి చెట్లన్నీ వెతికి, వెతికి అరచిన బాధ నాకు తెలుసు! మరో గూడు కట్టుకొనే వరకు ఆ పక్షి తన పిల్లలను ఎండ నుంచి .. వాన నుంచి కాపాడుకోలేక రెక్కల మాటున దాచుకుంటూ పడ్డ కష్టాలు నాకు తెలుసు’ అన్నాడు.. సన్నగా నవ్వుతూ.. ఆ నవ్వు చల్లగా ఉంది.. హాయిగా ఉంది.. సిద్ధార్దుని నవ్వులా ఉంది.. పసిపాప నవ్వులా ఉంది..

నా కనులు చెమర్చాయి..చదువు.. అధికారం.. గర్వం ఉన్న నాలో ఆ మామూలు కుర్రాడిలో ఉన్నపాటి మానవీయత కూడా లేదు.. ప్రకృతి నియమాలను.. మూగజీవాల మనోవేదనను.. అర్థం చేసుకోలేని అజ్ఞానం నాది..

ఇంతలో నా భార్య వచ్చింది..

నా మిత్రుడు పంపిన మెకానిక్‌ వచ్చాడు..

కారు బాగయింది.. మేము బయలుదేరాం…

వారంతా.. ఒకరి చేయి ఒకరు పట్టుకొని.. వరుసగా నిలుబడి మాకు వీడ్కోలు చెప్పారు.

వారికి సౌకర్యాలు లేవు.. కాని వారు సుఖంగా, ప్రశాంతంగా ఉన్నారు.

వైద్య సదుపాయాలు లేవు.. కాని.. ఆరోగ్యంగా, ధృఢంగా ఉన్నారు.

చదువు సంధ్యలు లేవు.. కాని.. సంస్కారముంది. సాటివారి కష్టాలకు స్పందించి.. సహాయమందించే మానవీయతా కోణముంది..

వారు ప్రకృతి పుత్రులు.. వారికి ప్రకృతి చదువు చెబుతుంది.. వైద్యమం దిస్తుంది.. ఐక్యతగా ఉండ మని చెబుతుంది.. వారు అలా నడుచుకుంటారు..

నేనో పాఠం నేర్చుకొన్నాను.

అటువంటి పచ్చటి పరిసరాలకు ఎంత దగ్గరగా ఉంటే.. మన జీవితం అంత రసవంతమవుతుంది. మనిషి ఎదుర్కొంటున్న ఎన్నోరకాల శారీరక, మానసిక సమస్యలకు పరిష్కారం హరిత సాహచర్యం లోనే లభిస్తుందన్నది వైద్యుల మాట. ఆహారమిచ్చి, విశ్రాంతినిచ్చి, ఆ ఆరడుగుల నేలనిచ్చి, కాల్చేందుకు కట్టెలనిచ్చిన ప్రకృతికి మనిషి ఏం చేస్తున్నాడు..!?

కనీసం కృతజ్ఞతలైనా చూపనవసరం లేదా..? భద్ర పరచుకోవలసిన బాధ్యత లేదా..?

కారు మెల్లగా వెళుతున్నాది..

మనం కొన్న నేలలో చిన్ని ఇల్లు కట్టుకొందాం.. మిగిలినదంతా నీ ఇష్టానికే వదిలేస్తాను. సరేనా?’ అన్నాను నా భార్యతో..

ఆమె మొహంలో ఆనందం..

ఔను మరి.. స్త్రీలు కూడా ప్రకృతిలో భాగమే కదా..!

రచయిత్రి పరిచయం

ఏకలవ్య పాఠశాల గుమ్మలక్ష్మీపురంలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నాను. నా మొదటి కథ తానా కథల పోటీలో ఎంపికైంది. ఇప్పుడు నాకథకు బహుమతిని ప్రకటించి ప్రోత్సహించిన జాగృతి వార పత్రిక సంపాదక వర్గానికి, న్యాయ నిర్ణేతలకు ధన్యవాదాలు.

– లలిత షావుకారు, ఏకలవ్య ఉపాధ్యాయిని


వచ్చేవారం కథ .. లడ్డూ పెడతా గోవిందా

– కె.ఎ. మునిసురేష్‌ పిళ్లె

About Author

By editor

Twitter
YOUTUBE