పోగొట్టుకున్న కంచుకోటను తిరిగి కైవసం చేసుకుంది బీజేపీ. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు పూర్తి భిన్నంగా.. కాంగ్రెస్‌ను   ఓడిరచి ఘన విజయం సాధించింది ఛత్తీస్‌గడ్‌ కమలదళం. 2018 ఎన్నికల్లో 90 సీట్లలో కేవలం 15 స్థానాలకే పరిమితమైన బీజేపీ , ఐదేళ్లలో అసాధారణ రీతిలో పుంజుకుని  54 స్థానాలతో  మేజిక్‌ ఫిగర్‌ దాటింది. కాంగ్రెస్‌ పాలనలో జరిగిన తప్పులను ఎండగట్టి విజయం సాధించింది. కాంగ్రెస్‌ 35 చోట్ల గెలుపొందింది.  గోండ్వానా గణతంత్ర పార్టీకి ఒక్క సీటు వచ్చింది.

ఈ కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి టీఎస్‌ సింగ్‌ దేవ్‌ సహా భూపేశ్‌ బఘేల్‌ సర్కారులో కొందరు మంత్రులకు పరాజయం తప్పలేదు. సింగ్‌ దేవ్‌ తన సొంత నియోజకవర్గం అంబికాపుర్‌లో 94 ఓట్ల తేడాతో ఓడిపోయారు. హోంమంత్రి తమ్రాధ్వజ్‌ సాహు, వ్యవసాయ శాఖ మంత్రి రవీంద్ర చౌబే సహా మొత్తం 9 మంది మంత్రులు పరాజయం పాలయ్యారు. ఈసారి అసెంబ్లీలో రాజవంశీయులకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కాంగ్రెస్‌, బీజేపీ, ఆప్‌ నుంచి పోటీ చేసిన ఏడుగురు రాజవంశీయులు ఓటమి చెందడమే ఇందుకు కారణం

ఎదురుదెబ్బ నేపథ్యంలో..

ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ వరుసగా 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండటంతో ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడి 2018 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. అప్పుడు రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన భూపేష్‌ బఘెల్‌ పలు సంక్షేమ, ప్రజాకర్షక పథకాలు ప్రారంభించారు. రైతులు, గిరిజనులు, పేదలను ఎవరినీ వదలకుండా అందరికీ సాయం అందేలా చూశారు. ముఖ్యంగా వరికి ఆయన అందిస్తున్న బోనస్‌ సూపర్‌ హిట్టయింది. మళ్లీ గెలిస్తే పథకాన్ని మరింత విస్తరిస్తామని కూడా కాంగ్రెస్‌ ప్రకటించింది. భూమిలేని కార్మికులకు వార్షిక ఆర్థిక సాయం రూ.10 వేలకు పెంచుతామని, కేజీ టు పీజీ ఉచిత విద్య, 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్‌ సహా పలు హామీలెన్నో కాంగ్రెస్‌ ఇచ్చింది.

మోదీ గ్యారంటీలు

కాంగ్రెస్‌ ఎన్నికల వాగ్దానాలకు పోటీగా బీజేపీకీ కూడా ‘మోదీ గ్యారంటీలు’ పేరుతో పథకాలు ప్రకటించింది. క్వింటాల్‌కు రూ.3,100 చొప్పున ఎకరాకు 21 క్వింటాళ్లను సేకరిస్తామని పేర్కొంది. ప్రతి వివాహితకూ ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, పీఎం ఆవాస్‌ యోజన కింద 18 లక్షల ఇళ్ల నిర్మాణం, పేదలకు రూ.500కే వంట గ్యాస్‌ సిలిండర్‌, కాలేజీ విద్యార్థులకు ప్రయాణ భత్యం, నిరుపేద కుటుంబంలో పుట్టే ఆడపిల్లకు రూ.1.5 లక్షలు తదితరాలెన్నో ప్రకటించింది. ఇవన్నీ ప్రజలపై బాగా ప్రభావం చూపాయి. చివరికి బఘెల్‌ సంక్షేమ పథకాలు, కాంగ్రెస్‌ కొత్త హామీల కంటే బీజేపీ ‘మోదీ గ్యారంటీ’ల వైపే ప్రజలు మొగ్గు చూపారు.

‘మహదేవ్‌’ ఆరోపణలు…

పోలింగ్‌ సమీపిస్తున్న సమయంలో వెలుగు చూసిన మహదేవ్‌ బెట్టింపు ఆరోపణలు కాంగ్రెస్‌ను దెబ్బతీశాయి. సీఎం బఘెల్‌పై ముసురుకున్న బెట్టింగ్‌ యాప్‌ ముడుపుల ఆరోపణలు కాంగ్రెస్‌కు బాగా చేటు చేశాయి. ఈ ఉదంతంలో ఒక కొరియర్‌ను అరెస్టు చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రకటించడం, దుబాయ్‌కి చెందిన మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ నుంచి బఘెల్‌కు ఏకంగా రూ.508 కోట్ల మేరకు ముడుపులు అందించినట్టు అతడు చెప్పాడని పేర్కొనడం సంచలనం రేపింది.

దీనికి తోడు బొగ్గు గునులు, ఆవు పేడ సేకరణ పథకం, డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫౌండేషన్‌, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వంటి వ్యవహారాల్లో అవినీతికి పాల్పడినట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంది. వీటికి సంబంధించిన కేసుల్లో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్‌ షా వంటి బీజేపీ అగ్రనేతలు వీటిని విమర్శనాస్త్రాలుగా ఎక్కు పెట్టి బఘెల్‌ సర్కార్‌ను దోషిగా చూపే ప్రయత్నం చేశారు. ఛత్తీస్‌గడ్‌ కాంగ్రెస్‌కు ఏటీఎంగా మారిందనే ఆరోపణలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది బీజేపీ.

గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతాలు, ముఖ్యంగా బస్తర్‌ డివిజన్‌లో మత మార్పిడిపై గత రెండేళ్లలో అనేక గొడవలు జరిగాయి. క్రైస్తవ మతంలోకి మారిన గిరిజనులు, మారని వారి మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అయితే మత మార్పిడులకు పాల్పడిన వారిని ప్రభుత్వం కాపాడటం విమర్శలకు దారి తీసింది. ఈ పరిణామాలు ప్రజల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకతను పెంచాయి.

మాట తప్పిన అధిష్టానం

కాంగ్రెస్‌ పార్టీ 2018లో ఛత్తీస్‌గఢ్‌లో అధికారం చేపట్టినప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం రాజవంశస్తుడైన టీఎస్‌ సింగ్‌ దేవ్‌ కూడా పోటీ పడ్డారు. అయితే అధిష్టానం భూపేష్‌ బఘెల్‌కు సీఎం పదవి కట్టబెడుతూ సింగ్‌దేవ్‌లో ఒక ఒప్పందం కుదుర్చకుంది. దీని ప్రకారం తొలి రెండున్నరేళ్లు బఘేల్‌, తదుపరి రెండున్నరేళ్లు సింగ్‌దేవ్‌ ముఖ్యమంత్రి పదవిలో ఉంటారు. అయితే ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లు గడచినా సింగ్‌దేవ్‌కు ఈ పదవి దక్కలేదు. దీంతో అధిష్టానంపై ఆగ్రహంతో రగిలిపోయారాయన. ఈ అంతర్గత విభేదాలు కాంగ్రెస్‌ ఓటమికి దారి తీశాయి

కలిసొచ్చిన ప్రక్షాళన

ఛత్తీస్‌గఢ్‌లో 2018లో ఓటమి తర్వాత బీజేపీ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ పార్టీ విభాగం అధ్యక్షుడిని మూడుసార్లు మార్చింది. అసెంబ్లీలో విపక్ష నేతను కూడా ఇటీవల మార్చింది. మాజీ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ను సైతం పక్కన పెట్టింది. పార్టీని నడిపించే బలమైన నాయకుడు లేకపోవడం లోటే అయినా ఏకపక్ష నాయకత్వం, కుటుంబ రాజకీయాలు ఉండరాదని ప్రధాని నరేంద్ర మోదీ భావించారు. అందుకే మోదీ కరిష్మాతోనే ఛత్తీస్‌గఢ్‌ లోనూ పోరాడాలని బీజేపీ నిర్ణయించింది. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ నినాదంతో కమలదళం ప్రజల్లోకి వెళ్లింది. ఇందులో బీజేపీ అనూహ్యంగా విజయం సాధించింది.

ప్రధాని మోదీ ప్రచారం

వీటన్నింటికీ తోడుగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలతో హోరెత్తించారు. డబుల్‌ ఇంజన్‌ సర్కారుకు అవకాశమిస్తే అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తామని చెప్పుకొచ్చారు. అధికారమే లక్ష్యంగా ఛత్తీస్‌గడ్‌లో మోదీ, అమిత్‌ షా సుడిగాలి పర్యటనలు చేశారు. కేంద్ర మంత్రులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రెండు విడతల్లో జరిగిన పోలింగ్‌ కోసం 40 మంది స్టార్‌ క్యాంపెయి నర్లను రంగంలోకి దించింది కమలదళం. అభ్యర్థుల్లో ప్రముఖ నటులు, మాజీ ఐఏఎస్‌ అధికారులకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓట్లును మలచుకోవడంలో సఫలమైంది.

సత్తా చాటుకున్న కూలీ

సీఎం భూపేష్‌ బెఘెల్‌ సంతుష్టీకరణ రాజకీయాలకు చెంప పెట్టులాంటి పరిణామం ఒకటి ఈ ఎన్నికల్లో చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఒక అభ్యర్థి విజయం అందరి దృష్టినీ ప్రధానంగా ఆకర్శించింది. అతడు దినసరి కూలీ ఏడుసార్లు ఎంఎల్‌ఎగా గెలిచిన అభ్యర్థిని ఓడిరచాడు. సాజా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎ రవీంద్ర చౌబే మీద బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈశ్వర్‌ సాహు 5,527 ఓట్ల మెజారిటితో గెలుపొందాడు. సాహు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక కారణం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయన సాజా అసెంబ్లీ నియోజకవర్గంలోని బీరాన్‌పూర్‌ గ్రామంలో మతపరమైన అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు చనిపోయారు. వారిలో ఈశ్వర్‌ సాహు కుమారుడు భువనేశ్వర్‌ సాహు కూడా ఉన్నాడు. ఈ ఘటనలో భూపేష్‌ బఘెల్‌ ప్రభుత్వం దోషులను శిక్షించంలో విఫలమైంది. ఎమ్మెల్యే రవీంద్ర చౌబే దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించ లేదు. ఒక మతస్తులను ప్రభుత్వం వెనుకేసుకు వచ్చిందనే విమర్శలు వచ్చాయి.

సాహు కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించినట్లు తెలిసింది. కానీ ఈశ్వర్‌ సాహు దానిని తీసుకోవడానికి నిరాకరిం చాడు. నిందితులకు శిక్ష పడాల్సిందేని డిమాండ్‌ చేశాడు. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఈశ్వర్‌ సాహు బీజేపీ టికెట్‌ మీద పోటీ చేశారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రవీంద్ర చౌబేను ఓడిరచి ప్రతీకారం తీర్చుకున్నాదు.

About Author

By editor

Twitter
YOUTUBE