సంపాదకీయం

శాలివాహన 1945 శ్రీ శోభకృత్‌  మార్గశిర శుద్ధ షష్ఠి – 18 డిసెంబర్‌ 2023, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ప్రత్యేక కాశ్మీర్‌ గానానికి భారత సుప్రీం కోర్టు ముగింపు పలికింది. తన చారిత్రక తీర్పుతో ఉదారవాదుల చివరి ఆశలపై నీళ్లు చల్లుతూ ఆర్టికల్‌ 370 రద్దును సమర్ధించింది. నిన్నటి వరకూ అక్కడి రాజకీయ కుటుంబాలకు, వేర్పాటు వాదులకు, పాకిస్తానీ ఐఎస్‌ఐ మిలిటెంట్లకు పాడి ఆవులా ఉన్న జమ్ముకశ్మీర్‌ కోసం ప్రత్యేక ప్యాకేజీలు అనే ఎటిఎంను శాశ్వతంగా మూసివేసింది. అన్ని వివాదాలకు తెరదించుతూ, 70 ఏళ్లుగా ఉన్న గందరగోళాన్ని పరిష్కరించేసింది. ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆగస్టు 5, 2019న భారత పార్లమెంటు ఆర్టికల్‌ 370ను రద్దు చేయడాన్ని ఏకగ్రీవంగా సమర్ధించడమే కాదు, ఆ పనిచేసేందుకు రాష్ట్రపతికి గల అధికారాన్ని సమర్ధించింది. సహజంగానే ఈ తీర్పును అధికారం పక్షం ఆహ్వానించగా, ప్రతిపక్షాలు మాత్రం మింగలేక కక్కలేక విలవిలలాడిపోతున్నాయి.

జమ్ముకశ్మీర్‌్‌కు ప్రత్యేక హోదాను తొలగించడంతోపాటు లద్దాక్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడాన్ని సమర్ధిస్తూ ధర్మాసనం 3 తీర్పులను వెలువ రించింది. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌, జస్టిసెస్‌ ఎస్‌ కె కౌల్‌, సంజీవ్‌ ఖన్నా, బిఆర్‌ గవాయ్‌, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం జమ్ముకశ్మీర్‌్‌ రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్రహోదాను పునరుద్ధరించ వలసిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. దీనితో పాటుగా, లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతాన్ని చేయడాన్ని అంగీకరిస్తూ, ఇందులో చట్ట వ్యతిరేకత ఏమీ లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్టికల్‌ 3 (ఎ) కింద పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర అసెంబ్లీని సంప్రదించా ల్సిన అవసరం పార్లమెంటుకు లేదు. ఇందుకు తాజా ఉదాహరణ ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణే. నాటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపినప్పటికీ, పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదింప చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని యూపీయే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైనమే.

రాజ్యాంగ సభ రద్దు అయింది కనుక ఆర్టికల్‌ 370 శాశ్వతత్వాన్ని సంతరించు కుందన్న గుప్కార్‌ నాయకులు, జమాత్‌ తరఫున వాదనలను కొట్టివేస్తూ, కశ్మీర్‌ రాజ్యాంగ సభ 1957లోనే రద్దు అయి దానికి కాలం చెల్లిపోయినందున, రాష్ట్రపతి దానిని కొట్టేయవచ్చని న్యాయమూర్తులు స్పష్టం చేయడం ఆ నాయకుల చేత హాహాకారాలు చేయిస్తోంది. ముఖ్యంగా, కశ్మీర్‌ భారత్‌లో విలీనం అయిన తర్వాత దానికి ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని, అది అంతిమంగా భారత ప్రభుత్వం వద్దే ఉందంటూ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ చేసిన వ్యాఖ్యలు నిన్నటి వరకూ చక్కర్లు కొట్టిన కశ్మీరియత్‌, కశ్మీర్‌ ప్రత్యేకతల గురించిన వదంతులు, కథలలో ఎంత వాస్తవికత ఉందో వెల్లడిరచాయి. ముఖ్యంగా, అక్కడ రాష్ట్రపతి పాలన విధించినప్పుడు అందులో కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ, ఈ కేసులో రాష్ట్రపతి ఎటువంటి దుర్భావనలతోనూ ఉత్తర్వులను జారీ చేసిన ఆధారాలు లేవని ఆయన వ్యాఖ్యానించడం, దానికోసం వాదించిన వారికీ నిరాశ కలిగింది.

డిసెంబర్‌ 11వ తేదీకి ఒక ప్రాముఖ్యత ఉంది. కశ్మీర్‌ కోసం ‘ఏకతా యాత్ర 11 డిసెంబర్‌1991న కన్యాకుమారి నుంచి ప్రారంభమై 26 జనవరి 1992 లాల్‌చౌక్‌లో త్రివర్ణ జెండాను ఎగురవేయడంతో ముగిసింది. సుబ్రహ్మణ్య భారతి జయంతి, గురు తేజ్‌బహద్దూర్‌ ‘బలిదాన్‌ దివస్‌’ కూడా అయిన డిసెంబర్‌ 11న ఈ అంశంపై తీర్పు వెలువడడం యాదృచ్ఛికం. మరొక చిత్రమైన విషయం ఏమిటంటే, ఈ యాత్రలో నాడు సామాన్య కార్యకర్తగా ఉన్న నేటి ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ పాత్ర పోషించడం. అంతిమంగా, 2023లో దేశాన్ని ఏకం చేసి, ఆ యాత్ర లక్ష్యాన్ని ప్రధాని మోదీ నెరవేర్చారు.

ముఖ్యంగా, జస్టిస్‌ కౌల్‌ ఇచ్చిన తీర్పులో, 1980ల నుంచి జమ్ముకశ్మీర్‌లో జరిగిన మానవహక్కుల ఉల్లంఘనలపై ‘ట్రూత్‌ అండ్‌ రీకన్సీలియేషన్‌ కమిటీ’ వేయాలంటూ చేసిన సూచన అక్కడి రాజకీయ నాయకులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఎందుకంటే, జమ్ముకశ్మీర్‌లో ఒక పథకం ప్రకారం, పాకిస్తాన్‌ సహాయ సహకారాలతో హింసాత్మక చర్యలు ప్రారంభం అయ్యి, అంతిమంగా కశ్మీరీ పండితుల తరిమివేతకు దారి తీశాయి. అయితే, ఈ చర్యలకు ప్రతిచర్యలుగా భద్రతా దళాలు చేసినవిగా చెబుతున్న తప్పిదాలనే భూతద్దంలో పెట్టి చూపారు తప్ప రెండవ వైపు నుంచి జరిగినవి చూపలేదు. ఈ కమిషన్‌ వేయడం ద్వారా వాటిని వెలుగులోకి తీసుకురావడమే కాదు, కశ్మీరీ పండితులు నిర్భయంగా తమ జన్మస్థానాలకు వెళ్లడానికి ఇది మార్గం సుగమం చేస్తుంది.

కాగా, ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానం జమ్ముకశ్మీర్‌కు కీలకమైన అంశంపై తీర్పును వెలువరిస్తుండగా, నిన్నటివరకూ ఉత్తరాది రాష్ట్రాలపై విషయం చిమ్మిన డిఎంకె ఎంపి ఎంఎం అహ్మద్‌, ‘‘ప్రతి జాతికీ స్వయం నిర్ణయాధికారం ఉంటుంది, అది కాశ్మీర్‌ ప్రజలకు కూడా వర్తిస్తుంద’’ంటూ ద్రవిడ సిద్ధాంతవేత్త రామస్వామి వ్యాఖ్యలను పార్లమెంటులో వినిపించడం పట్ల రాజ్యసభ స్పీకర్‌ దన్‌ఖడ్‌ తీవ్రంగా స్పందిస్తూ, వాటిని తొలగించారు. ఇక, రాచరికంలా కశ్మీర్‌ను తరతరా లుగా పాలిస్తున్న అబ్దుల్లాలు, ముఫ్తీల బాధ కూడా చెప్పనలివికాదు. మోదీ గద్దె దిగగానే తాము తిరిగి 370 అధికరణాన్ని పునరుద్ధరిస్తామంటూ చేస్తున్న వ్యాఖ్యలు వారి ఉక్రోషాన్ని, నిస్సహాయతను పట్టి చూపుతున్నాయి.

నిజానికి కశ్మీరీ ప్రజలు 370 అధికరణాన్ని ఎత్తివేయడాన్ని స్వీకరించారు. ఇప్పుడు వారు తమ జీవన ప్రమాణాల పెరుగుదల గురించి ఆలోచిస్తున్నారు. మధ్యప్రాచ్యం నుంచి వస్తున్న పెట్టుబడుల కారణంగా అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి, అక్కడక్కడ పాతవాసనలు వచ్చినప్పటికీ, అక్కడి ప్రజలు శాంతియుతమైన జీవనాన్ని కోరుకుంటున్నారనేది వాస్తవం.

About Author

By editor

Twitter
YOUTUBE