– డా॥ ఎమ్. సుగుణరావు
వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
‘మానసిక వ్యాధుల చికిత్సా కేంద్రం’ అనే బోర్డు ఉన్న ఆ ఆసుపత్రి ముందు ఒక కారు వచ్చి ఆగింది. దాంట్లోంచి దిగాడు పాతికేళ్ల యువకుడు. ‘డాక్టర్ హిమకర్’ అనే నేమ్ ప్లేట్ ఉన్న గది ముందు ఆగి, బయట నుంచున్న అటెండెంట్‌తో ‘డాక్టర్‌గారిని కలవాలి. అపా యింట్మెంట్ ఉంది. నా పేరు శివ’’ అని చెప్పాడు.
‘‘లోపల పేషెంట్‌ను చూస్తున్నారు. వారు వచ్చిన తర్వాత వెళ్దురుగాని, కూర్చోండి’’ అని అనడంతో అతను అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. పావుగంట తర్వాత లోపల ఉన్న పేషెంట్ బయటికి వెళ్లిపోవడంతో ‘‘మీరు వెళ్లొచ్చు’’ అనడంతో అతను లోపలికి కదిలాడు.
లోపల విశాలమైన ఆ గదిలో తెల్లగా, అక్కడక్కడ నెరిసిన జుట్టుతో ఉన్న యాభై ఏళ్ల డాక్టర్ హిమకర్ వచ్చిన శివ వంక చూసి, మందహాసం చేస్తూ ‘‘కూర్చోండి. ఏమిటి మీ సమస్య?’’ అన్నాడు. ‘‘సమస్య నాది కాదు, మా నాన్న గారిది’’ కూర్చుంటూ చెప్పాడు శివ.
‘‘వారిని తీసుకొచ్చారా?’’ అన్నాడు హిమకర్,
‘‘లేదు. మీతో ముందు మాట్లాడాలి’’ అన్నాడు.
‘‘సరే… చెప్పండి’’ అన్నాడు హిమకర్, తన రివాల్వింగ్ ఛైర్లో వెనక్కివాలి.
‘‘మా నాన్నగారి వయసు యాభై దాటింది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయారు. ఆయనకు చావు భయం ఉంది. ఆయనకు సాధారణంగానే వ్యాధులంటే భయం. పైగా మా ఫ్యామిలీ హిస్టరీలో హైపర్‌టెన్షన్, డయాబిటిస్‌తో మా పూర్వీకులు చనిపోయిన చరిత్ర ఉంది’’ అన్నాడు శివ.
‘‘అది సహజమే! అందరికీ ఏ మూలో చావుభయం ఉంటుంది’’ అన్నాడు హిమకర్.
ఆ మాటలకు వెంటనే శివ – ‘‘మా నాన్నగారికి ఈ మధ్య ఆ భయం మరీ ఎక్కువయ్యింది. చావును గుర్తుకు తెచ్చుకొని బెంగ పడిపోతున్నారు. తనకు ఏదైనా ప్రాణాంతక వ్యాధులు వస్తాయని కుంగిపోతున్నారు. దానికి కారణం- ఈ మధ్యనే జరిగిన ఒక సంఘటన.’’
‘‘ఏమైంది?’’ అన్నాడు హిమకర్, శివ వంక ఆసక్తిగా చూసి.
‘‘మా నాన్నగారు కోయంబత్తూర్లో ఇంజినీరింగ్ చదివారు. వారిది 1989 వ బ్యాచ్. నెల క్రితం బ్యాచ్ మేట్స్ గెట్-టుగెదర్ చెన్నైలో జరిగింది. అప్పుడు జరిగిన ఆ సంఘటన గురించి మీకు చెబుతాను…
చెన్నైలోని హెరీటల్ ఫెయిల్ఫీల్డ్ మేరియట్. ఐదు నక్షత్రాలు హెరీటల్లో జరుగుతోంది ఆ సమావేశం. దాదాపు 200 మంది పట్టే ఆ విశాలమైన ఏ.సి. హాలు వెనుక 1989 బ్యాచ్ – కోయంబత్తూర్ ఇంజినీరింగ్ విద్యార్ధుల ఆత్మీయుల కలయిక’’ అనే ఫ్లెక్సీ వేలాడుతోంది. ఆ వేదిక మీదికి యాభై ఏళ్లు దాటిన ఒక వ్యక్తి మైకుతో ప్రత్యక్షమయ్యాడు.
‘‘మిత్రులారా! మనం యాభై ఏళ్ల వయసులో ఇలా కలవడం సంతోషంగా ఉంది. ఈ సమావేశం ముందు ఇప్పుడు మన మధ్యలేని మన మిత్రులు ఐదుగురు గురించి జ్ఞాపకం చేసుకుందాం. వారు రాజన్, రాఘవరావు, రమణ ప్రసాద్, రాజేంద్ర కుమార్, రవిచంద్ర. వీరిలో రాజన్ హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. రాఘవరావు కేన్సర్‌తో చనిపోయాడు. రమణ ప్రసాద్ కిడ్నీ ఫెయిల్యూర్, రాజేంద్ర కుమార్ కోవిడ్‌తో చనిపోయాడు. రవిచంద్రది రోడ్ యాక్సిడెంట్.’’ ఆ మాటలకు అందరూ లేచి నిలబడి, కాసేపు కళ్లు మూసుకొన్నారు.
హిమకర్, శివ మొహంలోనికి సూటిగా చూసి, ‘‘అవును. చనిపోయిన మిత్రులకు నివాళి పాటించడం మామూలే. దానికి మీ నాన్నగారు అంతగా రియాక్ట్ అవవలసిన అవసరం ఏముంది?’’ అన్నాడు హిమకర్. ఆ మాటలకు శివ, ‘‘మీరు గమనించారా? చనిపోయిన వారి పేర్లు రాజన్, రాఘవరావు, రమణప్రసాద్, రాజేంద్రకుమార్, రవిచంద్ర. వీరందరి పేర్లలో ఒక పోలిక ఉంది’’ అన్నాడు శివ.
‘‘అవును. ఈ పేర్లన్నీ ఇంగ్లీషు అక్షరం ‘R’ తో, తెలుగు అక్షరం ‘ర’ తో మొదలవుతాయి. దానికి మీ నాన్నగారు ఎందుకు భయపడుతున్నారు’’ అన్నాడు.
‘‘మా నాన్నగారి పేరు కూడా ఇంగ్లీషు అక్షరం ‘R’తో, తెలుగు అక్షరం ‘8’తో మొదలవుతుంది కాబట్టి. మా నాన్నగారి పేరు రాజామోహన్’’ చెప్పాడు శివ.
‘‘ఓప్‌ా…’’ అంటూ షాక్ తిన్నట్టు చూసాడు హిమకర్.
‘‘అన్నట్టు రాజామోహన్ గారంటే ప్రముఖ పారిశ్రామికవేత్త, శివ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ రాజా మోహన్ గారు కదా!?’’ అన్నాడు, శివ మొహంలోనికి పరిశీలనగా చూసి.
‘‘అవును. మా నాన్నగారు ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత కొంత కాలం ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేసి ఆ తర్వాత పరిశ్రమలు స్థాపించి పారిశ్రామికవేత్తగా ఎదిగారు’’ అన్నాడు.
‘‘అవును. నాకు తెలుసు. భారతదేశంలోని పారిశ్రామికవేత్తల జాబితాలో వారి పేరు కూడా గణనీయం. ఇంతకీ ఇప్పుడు మీరెందుకు వచ్చినట్టు?’’ అన్నాడు డాక్టర్ హిమకర్.
‘‘దయచేసి మీరే ఒకసారి రావాలి మా ఇంటికి. అదయినా ఒక సైకియాట్రిస్ట్‌గా కాదు… ఆయన వైద్యం కోసం వచ్చినట్టుగా ఆయనకు తెలియకుండా రావాలి’’ అన్నాడు శివ.
‘‘నేనా..! నేను రావడం ఆయనకు ఉపయోగపడు తుందని అనుకోను. ఆయనకు తెలియకుండా ఏ విధంగా ఆయనకు వైద్యం చేయాలి?’’ అన్నాడు డాక్టర్ హిమకర్.
ఆ మాటలకు వెంటనే శివ, ‘‘దయచేసి నా మాట వినండి. ఆయన తుమ్మినా, దగ్గినా భయపడు తున్నాడు. ఇంకో ముఖ్య విషయం- రెండు రోజుల క్రితం కడుపులో ఏదో వికారంగా ఉందంటూ అందరినీ భయపెట్టారు. తనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని అర్థరాత్రి పూట అందరినీ లేపి, సిటీ కార్డియాక్ సెంటర్‌కి తీసుకెళ్లమన్నారు. వారు పరీక్షలన్నీ చేసి, ఏమీ సమస్య లేదని, ఆయనకు ఎసిడిటీ ఉందని ఒక టాబ్లెట్ ఇచ్చి పంపారు.’’ ఆ మాటలకు హిమకర్ ఆలోచనలో పడి, వెంటనే అన్నాడు- ‘‘మీ నాన్నగారు తన పేరులో ‘R’ ఉందని భయపడు తున్నారు. అంత చదువుకున్న ఆయన ఇన్ని పరిశ్రమలను అవలీలగా నడుపుతోన్న వ్యక్తి ఇంత చిన్న కారణానికి అనవసరపు భయాన్ని తెచ్చుకుంటున్నారనిపిస్తోంది. ఆ విషయం ఆయనకు మీరే వివరించండి’’ అన్నాడు.
‘‘అదంతా అయ్యింది. అయితే మా నాన్న బ్యాచ్‌లో ఆ చనిపోయిన వారందరికీ ఇంకో సిమిలారిటీ ఉంది. వాళ్లంతా 1972వ సంవత్సం, జనవరి నెలలో పుట్టారు.’’
ఆ మాటలు పూర్తయిన వెంటనే హిమకర్ అన్నాడు- ‘‘అయితే ఏంటి?’’
శివ ఆ మాటలకు చిన్నగా నవ్వి, ‘‘మా నాన్నగారు 1972, జనవరిలో పుట్టారు. అలా చనిపోయిన మిత్రుల జన్మతేదీ ఒకటి కావడంతో ఆయన భయం మరింత పెరిగింది. ఆయనలాగే కొంతమంది బ్యాచ్ మేట్స్‌కు కూడా చావు భయం పట్టుకుంది. వారంతా సమూహంగా ఏర్పడ్డారు. వాట్సాప్‌లో కలుస్తు న్నారు. వాళ్లలో కొంతమంది ఈ ఊరివాళ్లే. ఈరోజు సాయంత్రం వారంతా మా ఇంట్లో కలుస్తున్నారు. మీరు ఒక సైకియాట్రిమీ సేవలు అందిస్తారని వారికి చెప్పాను. అందుకే మీరు సాయంత్రం మా ఇంటికి రావలసి వుంది’’ అన్నాడు.
‘‘సరే… మీరింతగా చెబుతున్నారు కాబట్టి నేను వచ్చి మీ నాన్నగారిని కలుస్తాను’’ అన్నాడు హిమకర్.
‘‘చాలా ధన్యవాదాలు. మీకు రావడానికి వాహనం ఏర్పాటు చేస్తాను. అలాగే మా ఇంటికి వచ్చినందుకు ఫీజు చెల్లిస్తాం. నేను మీకు ఫోన్ చేసి కారు పంపుతాను. ధన్యవాదాలు డాక్టరుగారూ…’’ అంటూ శివ ఆ రూమ్ లోంచి బైటికి కదిలాడు.
ఆ రోజు సాయంత్రం తన ఇంటికి శివ కారు పంపడంతో అతని తండ్రిగారైన రాజా మోహన్ గారిని కలవడానికి బయలుదేరాడు. వారి ఇంటికి చేరుకునేసరికి ఇంటి బైట శివ హిమకర్ కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు, అదో నాలుగంతస్తుల భవనం. ఇంటి చుట్టూ బలమైన ప్రహరీ గోడ. విశాలమైన గేటు, నీలం దుస్తులు వేసుకున్న సెక్యూరిటీ గార్డు. శివ హిమకర్‌ను తీసుకొని లోపలికి వెళ్లాడు. విశాలమైన ఆ గదిలో దాదాపు పదిమంది కూర్చున్నారు. వారి ఎదురుగా తెల్లగా, పొడుగ్గా టి-షర్డు, జీన్ ప్యాంటు వేసుకున్న వ్యక్తే శివ నాన్నగారు అనుకున్నాడు.
వెంటనే ఆయనకు పరిచయం చేసి ‘‘ఈయన డాక్టర్ హిమకర్. మిమ్మల్ని కలవడానికి వచ్చారు’’ అంటూ పరిచయం చేసాడు.
‘‘సంతోషం! మాకు మీలాంటివారి సలహాలు అవసరం’’ అన్నాడు రాజా మోహన్ చిన్నగా నవ్వి. ‘‘ఇక్కడికి రావడం మీకన్నా నాకే ఉపయోగం. నేను సైకియాట్రిస్ట్‌ను, మానసిక సమస్యలు ఎదురైన వారికి కౌన్సెలింగ్ చేస్తాను. ఈ మధ్య వృద్ధాప్యం గురించి, చావు గురించి భయపడే కేసులు ఎక్కువ వచ్చాయి. అయితే మీరు ఏజింగ్, అంటే వయసు మీరే ప్రక్రియను రివర్స్ చేసే దిశగా ఆలోచన చేస్తున్నారని తెలిసి వచ్చాను. దీని గురించి లేటెస్ట్ పద్ధతులు, పరిశోధనల గురించి నాకు వివరాలు కావాలి’’ అన్నాడు. ‘‘మంచిది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వీళ్లంతా నా బ్యాచ్‌మేట్స్. వీళ్లంతా బాగా స్థిరపడిన వారు. విదేశాలలో వ్యాపారం చేస్తున్నారు.’’
పరిచయం అయిన తర్వాత రాజామోహన్ చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘కాలిఫోర్నియాకు చెందిన జాన్సన్ అనే వ్యాపారవేత్త వయసు 45 ఏళ్లు. ఇప్పుడు 18 ఏళ్ల యువకుడిలా కనబడాలని సంవత్సరానికి 14 కోట్లు ఖర్చుపెడుతున్నాడు. ఒక వైద్యుల బృందం జాన్సన్‌కు వృద్ధాప్య ఛాయలు చేరకుండా చికిత్స చేస్తున్నారు. ఆయనకు ఇంట్లోనే ఒక ల్యాబ్ ఉంది. ఆయన మీద పరీక్షించిన శాస్త్రవేత్తలు ఒక విషయం కనుక్కున్నారు. అది అంతకుముందే కొలంబియా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు తెలుసుకొన్న విషయం. మన దేహంలో టారిన్ అనే రసాయన పరిమాణం ముసలితనంలో తగ్గుతుంది. దాన్ని పాలు, మాంసం, చేపలలో ఉంటుందని కనుక్కు న్నారు. కోతులు, ఎలుకలకు అది ఇవ్వడంతో అవి చాలా ఆరోగ్యంగా యవ్వన స్థితికి చేరుకున్నాయి. 60 ఏళ్లు పైబడిన వారికి ఈ టారిన్ ఇవ్వడంతో వారిలో మధుమేహం, రక్తపోటు తగ్గాయి. అలాగే మసాచ్యుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమెరికా పరిశోధకులు కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆయుష్షును పెంచే మూడు రకాల ఔషధ మూలకాలను కనుక్కున్నారు. మన శరీరంలో కొన్ని కణాలు చనిపోకుండా అలాగే ఉండి శరీరంలో జబ్బులను కలుగజేసే రసాయనాలను పుట్టిస్తాయి. వీటిని అమర వార్ధక్య కణాలు అంటారు. వీటిని అరికట్టే మందు తయారుచేసే దిశగా పరిశోధనలు సాగుతూ ఉన్నాయి’’ ఆయన చెప్పడం ఆపాడు. తన ప్రక్కనే ఉన్న సీసాలో మంచినీళ్లు త్రాగాడు.
వింటున్న హిమకర్, ఆయన ప్రక్కనే కూర్చున్న మిత్రుల వంక చూశాడు. వారి మొహాల్లోని దిగులు కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఉత్సాహంగా చెపుతున్నా రాజమోహన్ ముఖంలోని భయం కూడా అర్థ్ధమైపోయింది. మళ్లీ రాజామోహన్ చెపుతోన్న మాటల వైపు దృష్టి సారించాడు.
‘‘ప్రస్తుతం శాస్త్రవేత్తలు నాలుగు రకాలైన ప్రోటీన్లను కనుక్కున్నారు. అవి మన చర్మ కణాల్లోకి ప్రవేశపెడితే అవి మూలకణాలుగా మారిపోతాయి. వాటికి మన శరీరంలోని ఏ కణంగానైనా మారే శక్తి ఉంటుంది. అంటే చర్మకణం, బోన్ సెల్, మజిల్ సెల్, న్యూరాన్, వైట్ బ్లడ్ సెల్… వీటి గురించి జెన్నిఫర్ దౌడ్న వంటి నోబెల్ గ్రహీతలు పరిశోధన చేస్తున్నారు. మనకు అందుబాటులో ఉండే పళ్లల్లో లభించే ‘సి’ విటమిన్, నువ్వులలో ఉండే గ్లైసీన్ వంటి పనితీరును పరిశీలిస్తున్నారు. ఇవి ఏజింగ్‌ను తగ్గిస్తాయి.’’
ఇంకో ముఖ్య విషయం – ‘‘ఈ మధ్యనే గూగుల్ మాజీ శాస్త్రవేత్త రే కర్ణు వయిల్ ఒక ప్రకటన చేశారు. ‘నానోబాట్లు’ సాయంతో మరో ఏడు సంవత్సరాల్లో అంటే 2030 వ సంవత్సరానికల్లా మనిషి కలకాలం జీవిస్తాడని ప్రకటించాడు’’ అన్నాడు.
ఆ మాటలకు హిమకర్, ‘‘నానోబాట్లు అంటే ఏమిటి?’’ అన్నాడు.
‘‘అవి అతి చిన్న సూక్ష్మ రోబోలు. నానో టెక్నాలజీ సాయంతో సృష్టించబడే సూక్ష్మస్థాయి రేణువులు. మనిషి టెక్నాలజీ సహాయంతో నానోబాట్లు సాంకేతికంగా ఉపయోగించడం వలన మరణాన్ని జయిస్తాడని చెబుతున్నారు. ఈ అతి సూక్ష్మమైన రోబోలు 50-100 నానోమీటర్ల వెడల్పుతో ఉంటాయి. ఇవి వృద్ధాప్యాన్ని, జబ్బులను ఆపుతాయి. కణస్థాయిలో శరీరాన్ని మరమ్మతు చేస్తాయి. మన జీర్ణకోశ వ్యవస్థలో రక్తనాళాలలో తిరిగి అవసరమైన పోషకాలను శరీరానికి అందిస్తాయి. అవసరమైన వాటి గురించి వ్యక్తిగత వైర్లెస్ నెట్వర్క్ ద్వారా మనకు కాల్ చేస్తాయి. అనవసరమైన ఆహారాన్ని విసర్జన రూపంలో బైటికి పంపిస్తాయి. ఈ నానోబాట్లు గురించి 2005 సంవత్సరంలోనే కర్జువయిల్ ‘ద సింగులారిటీ ఈజ్ నియర్’ అనే పుస్తకం రాసాడు. ఇప్పటికీ నానోబాట్లు వైద్యరంగంలో మంచి మార్పులు తీసుకువస్తున్నాయి. వీటిని మనం ఉపయోగించుకుందాం’’ అన్నాడు.
వారి మాటలు విన్న హిమకర్, ‘బాబోయ్… వీళ్లు చాలా దూరం వెళ్లిపోతు న్నారు. ఏకంగా వృద్ధాప్యానికి ఎర్రజెండా చూపే ప్రయత్నం చేస్తున్నారు. వృద్ధాప్యాన్ని ఎలా జయించాలో పథకాలు రూపొందిస్తున్నారు. ఇది కూడా ఒక మానసిక జబ్బు ఏమో… ఇప్పుడు తను వేదాంతం చెబితే తన మీద దాడి ఖాయం! తను వారికి కౌన్సెలింగ్ చేస్తే తన మాటలు వినకపోగా అది వికటించే ప్రమాదం ఉంది. బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం – ఇది జీవితచక్రం. ఇది తెలుసుకుంటే మనసును మాయపొర కమ్మదు’ మనసులో అనుకున్నాడు.
వెంటనే వారితో అన్నాడు, ‘‘నాకు తెలిసిన ఒక పెద్దాయనది 99 ఏళ్ల వయసు. ఆయన పేరు జ్ఞానమూర్తి. అలాంటి పెద్దవారిని కలిస్తే వారి జీవన నేపథ్యం, అలవాట్లు తెలుస్తాయి. మీకు కొంత విషయం అవగతమౌతుంది. మీకిష్టమైతే వారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను’’ అన్నాడు హిమకర్. ఆ మాటలకు అక్కడ ఉన్నవారంతా చప్పట్లు కొట్టారు.
‘‘సరే, వెళదాం’’ అన్నాడు.
‘‘అయితే ఒక వారం తర్వాత ఆయన్ని కలుద్దాం. నా కారులో ఇక్కడికి వస్తాను. అందరం మీ ఇంటి నుంచే బయలుదేరదాం’’ అన్నాడు హిమకర్.
‘‘సరే, మంచిది’’ అన్నాడు రాజామోహన్, రెండు చేతులు జోడిరచి.
‘‘నమస్కారం’’ అంటూ హిమకర్ ఆ గదిలోంచి బైటికి నడిచాడు.
బైటికి వెళ్తన్న హిమకర్‌ను అనుసరిస్తూ శివ ఆయనను కారు వరకు సాగనం పాడు. ‘‘ఏంటి సార్, మా నాన్నాగారు, వారి మిత్రుల మాటలు విన్నారు కదా… ఏమనుకుంటున్నారు?’’ అన్నాడు.
‘‘వాళ్లంతా ఒక అయోమయ స్థితిలో ఉన్నారు. ఒక కాల్పనిక ప్రపంచంలోకి వెళ్లిపోయారు. ఒకవైపు దిగులుగా ఉన్నా మరోవైపు ఎలాగైనా మరణాన్ని జయించే ప్రక్రియ దిశగా పరుగెత్తుతున్నారు. అయినా మీ నాన్నగారు, వారి సహచరులు పడుతోన్న అర్థ్ధరహిత మృత్యుభయం గురించి అయితే మాత్రం ఇది పిచ్చికి పరాకాష్ఠ. దీనికి నివారణే ముఖ్యం. వారం తర్వాత ఆ పెద్దాయనను కలుస్తాం కదా… చూద్దాం’’ అంటూ కారు ఎక్కాడు.
వారం రోజుల తర్వాత ఆ ఊళ్లోనే వున్న 99 ఏళ్ల వయోవృద్ధుడు జ్ఞానమూర్తి ఇంటికి రాజామోహన్‌ను, ఆయన సమూహ మిత్రుల్ని తీసుకొని బయలుదేరాడు హిమకర్. ఆ ఊరి చివర ఉన్న ఒక పాతకాలపు రంగు వెలసిన డాబా ఇల్లు. వెళ్లేసరికి ఆయన మంచం మీద ఉన్నాడు. ముడతలు పడిన దేహం, వంగిపోయిన శరీరం. దాదాపు ఎముకల గూడుకు తెల్లపంచె, తెల్లచొక్కా కట్టినట్టుంది. కళ్లు మాత్రం మెరుస్తున్నాయి.
హిమకర్ మంచం మీద పడుకున్న ఆయనతో, ‘‘తాతయ్య గారూ! మిమ్మల్ని చూడడానికి వచ్చారు. మీలా ఇంత కాలం బ్రతికిన వృద్ధుల ఆశీస్సులు పొందడానికి వీళ్లంతా వచ్చారు. మీ జీవితవిధానం తెలుసుకోవాలి అనే తపనతో వచ్చారు’’ అన్నాడు.
ఆ మాటలకు ఆయన బోసినవ్వు నవ్వాడు. ‘‘నాకు ఒక కూతురు, ఐదుగురు కొడుకులు. పదహారుమంది మనవళ్లు, మనవరాళ్లు.’’
అతను చెబుతోన్న మాటలు నూతిలోంచి వచ్చే మాటలుగా వినబడుతున్నాయి. మెల్లగా కూడబలుక్కుని మాట్లాడుతున్నాడు.
మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘నేను చదువుకున్నా వ్యవసాయమే వృత్తిగా బ్రతికాను. 70 ఏళ్ల వయసు వచ్చినా పొలం పనులు చేశాను. 80 ఏళ్ల తర్వాత మాత్రమే నా ఆరోగ్యం కొంచెం క్షీణించింది. నాతో పుట్టినవాళ్లంతా చనిపోయారు. నా అన్నలు, తమ్ముళ్లు. అలాగే నా పిల్లలు. చాలామంది పోయారు.’’
ఆ మాటలకు, ‘‘మీకు 99 ఏళ్ల వయసు. ఇంకో సంవత్సరం దాటితే నిండు నూరేళ్లు’’ అన్నాడు రాజమోహన్.
‘‘సెంచురీ కొట్టడం దేనికి?’’ అని ప్రశ్నించాడు ఆ పెద్దాయన.
ఆ మాటలకు ఒక్కసారి షాక్ తిన్నట్టు చూసారు రాజమోహన్ సహా మిగతా సహచరులు.
‘‘మరణం జీవితానికి వ్యతిరేకం కాదు, అది జీవితంలో ఒక భాగం. మనం ఎవరిదగ్గరైనా అప్పు తీసుకున్నామనుకో, అది తిరిగి ఇవ్వడానికి భయపడతామా? భయపడం. అలాగే మన దేహాన్ని రుణంగా తీసుకున్నాం. ఈ భూమియే రుణదాత. దాన్ని తిరిగి సమర్పించడమే జీవితం. మనందరం రుణగ్రస్తులమే!’’ ఆయన ఒక్కొక్కటీ కూడబలుక్కొని మాట్లాడుతున్న మాటలు ఆ గదిలోని అందరికీ ఏదో ఔషధంలా పని చేస్తున్నట్టు అనిపించాయి.
వెంటనే రాజామోహన్ అన్నాడు, ‘‘మనం ప్రేమించిన వారందరినీ విడిచిపెట్టి పోవాలంటే భయం వేస్తోంది’’ అన్నాడు.
ఆ మాటలకు ఆ పెద్దాయన మళ్లీ నవ్వి, ‘‘ఈ చావుభయాన్ని ఏమంటార్రా అబ్బాయ్?’’ అన్నాడు హిమకర్ వైపు తిరిగి.
‘‘దీన్ని థరటోఫోబియా అంటారు. కారణం లేకుండానే ఈ మృత్యుభయం ఆవరిస్తుంది’’ చెప్పాడు హిమకర్..
అంతలో ఎక్కడినుంచో ‘ఓం త్రయంబకం యజామహే – సుగంథిమ్ పుష్ఠివర్ధనమ్ – ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోమృక్షీయ’ అంటూ వినిపించింది, ఆ చుట్టుప్రక్కల ఉన్న ఏదో గుడిలోంచి. ‘‘ఈ శ్లోకం అర్థం ఏంటంటే, నేను పండిపోవాలి. దోసపండు తనను తాను ముచ్చిక నుండి విడిపోతుంది. అలా ఆత్మ శరీరం నుంచి వెళ్లిపోతున్నప్పుడు నేను సాక్షిభూతంగా పడిపోతున్న శరీరాన్ని చూడాలి. అంతేతప్ప, ఈ మృత్యుంజయ మహామంత్రం అర్థ్ధం అకాల మరణాన్ని ఆపమని కాదు’’ ఆయన ఆ మాటలు చెప్పగానే రాజమోహన్ సహా అక్కడున్న వారంతా ఆలోచనలో పడ్డారు.
‘‘ఇక నేను పడుకుంటాను’’ అంటూ ఆయన చేతులు ఊపాడు. అందరూ ఆ గదిలోంచి బైటికి వచ్చారు. బైట నుంచున్న డెబ్బయ్ ఏళ్ల వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ‘‘ఒరేయ్ హిమకర్… మా నాన్నతో చాలా ఇబ్బందైపోతోంది. ప్రభుత్వానికి ఒక దరఖాస్తు పెట్టుకున్నాడు. చూశావా ఈ ఉత్తరం’’ అంటూ జేబులోంచి ఒక కాగితం తీసి ఇచ్చాడు. ఆ కాగితంలో ఉన్న విషయం గట్టిగా పైకి చదివాడు.
‘‘నాలాంటివారి కోసం స్వచ్ఛంద మృత్యు వైద్యాలయాలు ఏర్పాటు చేయాలి. అది ఆత్మహత్య క్రిందికి రాదు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల ప్రకారం సహజ మరణం క్రిందే లెక్క. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ జీవితాన్నించి గౌరవ ప్రదంగా తప్పుకోవాలి. – ఇట్లు జ్ఞానమూర్తి.’’
ఆ ఉత్తరంలోని విషయం హిమకర్ చదవడం పూర్తి చేయగానే. ‘‘చూశావురా ఈ ఉత్తరం పోస్ట్ చేశావా? లేదా? అని రోజూ విసిగిస్తున్నాడు. అందరూ నిండు నూరేళ్లు జీవించాలనుకుంటారు. మా నాన్న కూడా అలా జీవించాలనే మా కోరిక. కానీ అది ఆయనకు ఇష్టం లేనట్టుంది’’ అంటూ నిర్లిప్తంగా నవ్వాడు జ్ఞానమూర్తి గారి కొడుకు.
‘కొంతమంది వృద్ధాప్యాన్ని, చావును ఎలా ఎదుర్కోవాలో పోరాడుతూ ఉంటే ఆ పెద్దాయన తనకు స్వచ్ఛంద మృత్యువు కావాలని కోరుకుంటు న్నాడు’ అంటూ తనలో తాను గొణుక్కున్నాడు.
అక్కడున్న వారికి ఆ మాటలు వినిపించి నట్టున్నాయి. అందరూ మౌనం దాల్చారు. ఆ తర్వాత అందరూ కార్లు ఎక్కడంతో అక్కడి నుంచి కార్లు కదిలాయి.
నెల రోజుల తర్వాత తన క్లినిక్‌లో పేషెంట్లతో బిజీగా ఉన్న హిమకర్ ఫోన్ మ్రోగింది. అవతల నుంచి ‘‘సార్… మీకు చాలా ధన్యవాదాలు. మా నాన్నగారు పూర్తిగా మారిపోయారు. ఇప్పుడు ఇదివరకు ఉన్న ఆ భయం లేదు. ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటున్నారు. అందుకు మీకు ధన్యవాదాలు’’ అన్నాడు శివ.
‘‘ఇదంతా ఎలా జరిగింది? ఆ 99 ఏళ్ల జ్ఞానమూర్తి గారి మాటల ప్రభావమా?’’ అన్నాడు హిమకర్.
‘‘అవును. ఆయన ఆ రోజు చెప్పిన విషయాల గురించి చాలా రోజులు ఆలోచిస్తూ ఉండిపోయారు. ఆయన తన బ్యాచ్‌మేట్స్ ఐదుగురు చనిపోవడం గురించి వారు పుట్టిన తేది, తన జన్మదినం రోజుతో సరిపోవడంతో చాలా మధన పడేవారు. ఈలోగా ఒక విషయం తెలిసింది’’ అన్నాడు.
‘‘ఏంటి?’’ అన్నాడు ఆసక్తిగా.
‘‘ఆ చనిపోయిన మిత్రుల పూర్తి పేర్లు మా నాన్నగారికి తెలిసాయి. రాజన్ పూర్తి పేరు సౌందర్య రాజన్. రాఘవరావు పూర్తి పేరు విజయ రాఘవరావు. రమణ ప్రసాద్ పూర్తి పేరు లీలా వెంకట రమణ ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్ పూర్తి పేరు శ్రీకర రాజేంద్ర ప్రసాద్. అలాగే రవిచంద్ర పూర్తి పేరు నెపోలియన్ రవిచంద్ర. ఇవన్నీ ఒకే అక్షరంతో ఉండే పేర్లు కాదు. మిత్రులు షార్ట్కట్ పేరుతో పిలుచుకోవడంతో అనవసరమైన భయానికి లోనయ్యారు’’ అన్నాడు శివ.
‘‘ఓప్‌ా… మై గాడ్… టీకప్పులో తుఫాను. మరి అందరూ ఒకే సంవత్సరంలో పుట్టారని, తాను కూడా అదే సంవత్సరమని భయపడ్డారు కదా!?’’ అన్నాడు.
‘‘దానిమీద కూడా క్లారిటీ వచ్చింది. ఆ చనిపోయినవారి పుట్టిన సంవత్సరాలు వేరే వేరే. స్కూల్లో చేర్చడం కోసం వారి తల్లిదండ్రులు మార్చినట్టుగా తెలిసింది’’ అన్నాడు శివ.
ఆ మాటలకు పక పక నవ్విన హిమకర్, ‘‘చూశావా… అంతా అనవసరంగా చిన్న చిన్న విషయాలకు మీ నాన్నగారి లాంటి మేధావులు, వారి సహచరులు కూడా ఎంత అలజడి సృష్టించు కున్నారో!’’ అన్నాడు హిమకర్.
‘‘అంతా మన మంచికే సార్…’’ అన్నాడు శివ.
‘‘అంటే…!’’ అర్థంకాక అడిగాడు హిమకర్.
‘‘మా నాన్నకు పూర్తిగా జ్ఞానోదయం అయిన తర్వాత ఒకరోజు నన్ను పిలిచి చెప్పాడు. నేను చాలా సిల్లీగా ఆలోచించాను. ఆ పెద్దాయన కాస్త కళ్లు తెరిపించాడు. దాంతో ఒక విషయం అర్థమైంది’’ అంటూ నా చేతులు పట్టుకొని ‘‘నేను చనిపోయి నప్పుడు అందరూ ఏడుస్తారు కదా!’’ అన్నాడు నాన్న నవ్వుతూ. ‘‘ఏంటి అలా అంటావు?’’ అన్నాను నేను భయంగా.
‘‘కంగారుపడకు. నేను పుట్టినప్పుడు అందరూ సంతోషించి ఉంటారు. నేను మాత్రం గుక్కపట్టి ఏడ్చి ఉంటాను. అది పుట్టిన వారందరికీ సహజం. అయితే చనిపోయినప్పుడు అందరూ నా కోసం ఏడ్చినా నేను మాత్రం నవ్వుతూ పోవాలి. అలా పోవాలంటే నా జీవితం సఫలం కావాలి. ఇంతకాలం నేను నా స్వార్ధం కోసం చూసుకున్నాను. కోట్లు ఖర్చుపెట్టి మృత్యువును దూరం చేయాలనుకొనే పథకం మా మిత్రులతో పాటు రూపొందించాను. అది నాలాంటి వారికి మాత్రమే సాధ్యం. మరి కనీస వైద్య సదుపాయం దొరకని అభాగ్యుల పరిస్థితి ఏమిటి? అదే నా ఇప్పటి ఆలోచన. నాన్న చెప్పింది ఇదే!’’ చెప్పడం పూర్తి చేసి శివ ఫోన్ పెట్టేశాడు.
‘అనాయాసేన మరణం – వినాదైన్యేన జీవనం’ అంటే కష్టాలు లేని సుఖమైన జీవితం. నొప్పి లేని చావు. ఇదే కదా మనిషికి కావలసింది. ఆలోచిస్తూ ఉండి పోయాడు హిమకర్.