జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్
ప్రస్తుతం దేశంలో మూడు ప్రధాన సంఘటనలు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొదటిది ఛత్తీస్‌గఢ్ ముఖ్య మంత్రి భూపేష్ భగెల్‌పై మహాదేవ్ బెట్టింగ్ యాప్‌నకు సంబంధించిన ఆరోపణలు కాగా, లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను విచారణకు ఈడీ ఆదేశించడం, దాన్ని ఆయన తిరస్కరించడం రెండో ప్రధాన అంశం. ఇక మూడవది తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రాపై పార్లమెంటరీ నైతిక విలువల (ఎథిక్స్) కమిటీ ఇచ్చిన నివేదిక! వీటిల్లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిపై వచ్చిన ఆరోపణల టైమింగ్ ఇక్కడ ముఖ్యం.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు ఈ ఆరోపణలకు సంబంధించిన వీడియో విడుదల కావడం రాజకీయాలను కుదిపేసింది. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్సే తిరిగి అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్న తరుణంలో బీజేపీ విడుదల చేసిన వీడియో, ముఖ్యమంత్రి భూపేష్ భగెల్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే కాదు, ఆయన్ను డిఫెన్స్‌లో పడేసిందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఇది ఎన్నికలపై ఎంతమేర ప్రభావం చూపిందనేది ఫలితాలే వెల్లడిస్తాయి. ఇక అవినీతి వ్యతిరేక పోరాటమే తమ లక్ష్యమని ఘోషించే అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ విచారణకు ఎందుకు నిరాకరించారన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. విచారణలో తాను సచ్ఛీలుడనని నిరూపించుకొని, బీజేపీని ధైర్యంగా ఎదుర్కొనవచ్చు కదా? అన్న ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం లేనప్పటికీ, బీజేపీ`ఏఏపీల మధ్య జరుగుతున్న ఈ పోరు ఏ దరికి చేరుతుందో చెప్పడం కష్టం. ఇక మూడవది తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రాపై వచ్చిన ఆరోపణలపై ఆమె నిర్లక్ష్యంగా స్పందించిన తీరు ఎవరి మెప్పును పొందలేదు. లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు ఒక పారిశ్రామికవేత్త నుంచి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు నిజం కావడం, నిజమైన ప్రజాస్వామ్యవాదులు తలదించుకోవాల్సిన అంశం. ఇప్పటికీ ఆమెలో పశ్చాత్తాపం మాట అట్లా ఉంచితే, అదే నిర్లక్ష్యం, అదే అహంకార ధోరణి కొనసాగడం దిగజారిన రాజకీయ నైతిక విలువలకు పరాకాష్ట!
ఛత్తీస్‌గఢ్‌లో దుమారం
హై ప్రొఫైల్ స్కాండల్‌కు సంబంధించిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పెను దుమారం రేపుతోంది. రాష్ట్రంలో తొలి,రెండవ దశ ఎన్నికల పోలింగ్ నవంబర్ 7, 17వ తేదీల్లో జరిగాయి. ఈ బెట్టింగ్ యాప్ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ భగెల్ ఎదుర్కొంటున్న ఆరోపణలు, రెండు విడతలుగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావ కాశాలను కొంతమేర దెబ్బతీస్తాయనడంతో ఎంత మాత్రం సందేహం లేదు. ఈడీ విడుదల చేసిన ఈ మెయిల్ ప్రకటన ప్రకారం, మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ముఖ్యమంత్రి భూపేష్ భగల్‌కు రూ.508 కోట్లు లంచంగా చెల్లించగా, ఇందులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖర్చుకోసం ఉపయోగించాల్సిన రూ.5.39కోట్లను రాయ్‌పూర్‌లోని ఒక హోటల్ నుంచి సీజ్ చేసినట్లు ఈడీ పేర్కొంది. మహాదేవ్ యాప్ నిర్వాహకులు అసీమ్‌దాస్ అనే కొరియర్ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో నగదును ఛత్తీస్‌గఢ్‌కు తరలిస్తుండగా తాము పట్టుకున్నామ తెలిపింది. తమ సోదాల సందర్భంగా అరెస్టయిన కొరియర్‌ను, ఇంత పెద్దమొత్తంలో నగదును చెల్లింపులు జరపడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ప్రత్యేకంగా పంపారని, ఎన్నికల ఖర్చుల కోసం ‘భగెల్’ అనే రాజకీయనేతకు చెల్లించేందుకు ఈ మొత్తాన్ని తీసుకెళుతున్నట్టు అసిమ్ దాస్ అంగీకరించాడని కూడా ఈడీ స్పష్టం చేసింది. 2022 జులై నుంచి అమల్లోకి వచ్చిన మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద మహాదేవ్ బెట్టింగ్ యాప్‌పై ఈడీ విచారణ మొదలుపెట్టింది. రణబీర్ కపూర్ వంటి సినీ నటులను కూడా ఈడీ విచారణకు పిలిచిన క్రమంలో ముఖ్యమంత్రి భూపేష్ భగెల్ పేరు వెలుగులోకి వచ్చింది. నిజానికి ఆన్‌లైన్ బెట్టింగ్ వేదిక అయిన ఇందులో పోకర్, కార్డ్ గేమ్స్, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫూట్‌బాల్, క్రికెట్ వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు యదేచ్ఛగా కొనసాగుతాయి. ఇదిలావుండగా మహాదేవ్ బెట్టింగ్ యాప్‌తో పాటు మరో 21 యాప్‌లను ప్రభుత్వం నిషేధించినట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ప్రకటించడం కొసమెరుపు!
శుభమ్ సోనీ వీడియో
ఇదిలావుండగా మహాదేవ్ బెట్టింగ్ యాప్‌నకు అధినేతగా చెప్పుకుంటున్న శుభమ్ సోని, తాను విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ, సౌరభ్ చంద్రార్కర్, రవిఉప్పల్‌లు దీనికి సలహాదార్లుగా పనిచేస్తున్నారన్నారు. ‘సౌరభ్ చంద్రాకర్ గతంలో ఫ్రూట్ జ్యూస్ వ్యాపారి. రవి ఉప్పల్‌కు సహచరుడు. వీరిద్దరూ ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారని’ ఈడీ ఆరోపిస్తోంది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారు వినోద్‌వర్మ తనకు, భూపేష్ భగల్‌కు మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారని శుభమ్ సోని తన వీడియోలో ఆరోపించారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్‌నకు తానే అధినేతనని, 2021లో దీన్ని నెలకొల్పానని ఇందుకు సంబంధించిన రుజువులు పేపర్ రూపంలో ఉన్నాయని కూడా స్పష్టం చేశాడు. తాను భిలాయ్‌లో చిన్నస్థాయిలో ప్రారంభించిన ఈ గాంబ్లింగ్ బిజినెస్ లాభాలతో నడుస్తోందని, దీంతో ప్రజల దృష్టిలో పడటంతో, క్రమంగా తన స్నేహితులు ఇబ్బందుల్లో పడటం మొదలైందన్నాడు. ఈ నేపథ్యంలో రక్షణ కోసం తాను వినోద్ వర్మకు నెలకు రూ.10 లక్షలు చెల్లిస్తూ వస్తున్నానని కూడా ఆ వీడియోలో పేర్కొన్నాడు. అయితే తన స్నేహితులు మళ్లీ ఇబ్బందుల్లో పడటంతో తాను ముఖ్యమంత్రి భూపేష్ భగల్‌ను కలవగా, వ్యాపారాన్ని యు.ఎ.ఇ.కి విస్తరించాలని ఇచ్చిన సలహా మేరకు తాను దుబాయ్ వెళ్లి, అక్కడ నిర్మాణ రంగంలో ఉన్న భిలాయ్‌కి చెందిన ఇద్దరిని భాగస్వాములను చేసుకున్నానన్నాడు. ఒకపక్క యు.ఎ.ఇ.లో తమ వ్యాపారం లాభాలతో నడుస్తుండగానే, భిలాయ్‌లో తన అనుచరుల అరెస్ట్‌లు మాత్రం ఆగలేదన్నాడు. అప్పుడు తాను ఛత్తీస్‌గఢ్‌కు వచ్చి అప్పటి ఎస్.పి. ప్రశాంత్ అగర్వాల్‌ను కలిసిన తర్వాత తాను ముఖ్యమంత్రిని ఫోన్‌లో సంప్రదించినప్పుడు, ఆయన రూ.508కోట్లు కావాలని కోరారని ఆరోపించారు. ఈ మొత్తంతో పాటు, ప్రశాంత్‌జీ చెప్పిన విధంగా చేశానని కూడా ఆయన చెప్పాడు. అయినప్పటికీ తనకు సమస్యలు కొనసాగుతుండటంతో, వీటి నుంచి బయట పడేందుకు తాను భారత్‌కు వచ్చినట్టు తెలిపాడు. అసిమ్‌దాస్ అనే కొరియర్‌ను రూ.5.39కోట్ల నగదుతో సహా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఆరోపణలతో కూడిన వీడియో బయటకు రావడం గమనార్హం.
‘ఇదంతా బీజేపీ కుట్ర’
ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన అసిమ్‌దాస్ బీజేపీకి సన్నిహితుడని, ఈ సందర్భంగా సీజ్ చేసిన వాహనం కూడా ఆ పార్టీ వ్యక్తిదేనని భూపేష్ భగెల్ ఆరోపిస్తూ, కేవలం ఎన్నికల్లో తనను అప్రతిష్ట పాలు చేయడానికే కేంద్ర ప్రభుత్వం ఈడీ అస్త్రాన్ని ప్రయోగించిందని ఆరోపించారు. ‘‘బీజేపీ వీడియోను, ఈడీ ఒక పత్రికా ప్రకటన విడుదల చేయడాన్ని చూస్తుంటే ఈ రెండిరటికి సన్నిహిత సంబంధాలున్నాయన్నది స్పష్టమవుతోంది’’ అని భూపేష్ భగెల్ వ్యాఖ్యానించారు. అనుమానిత ఆన్‌లైన్ బ్యాంక్ ఖాతాలను తక్షణమే ఫ్రీజ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సహా విపక్షాలు ఈ అవినీతి వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన సమయాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఓటమి భయంతోనే బీజేపీ ఈ విధమైన చర్యలకు పాల్పడుతోందని ఆరోపించాయి. ప్రాథమిక విచారణ లేకుండా ముఖ్యమంత్రి పేరును ఏ విధంగా ప్రకట స్తారంటూ విరుచుకుపడ్డాయి. ఇదే సమయంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కుమారుడిపై చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆరు నిమిషాల నిడివి కలిగిన వీడియోను కాంగ్రెస్ విడుదల చేసి, దీనిపై ఈడీ తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో తొలిదశ పోలింగ్‌కు కేవలం నాలుగు రోజుల సమయం ఉన్న తరుణంలో ఈడీ రూ.508 కోట్ల అవినీతి కేసులో ముఖ్యమంత్రి భూపేష్ భగల్ పేరును కావాలనే పేర్కొనడంలో కుట్ర ఉందని కాంగ్రెస్ తీవ్రంగా మండిపడిరది. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ కమ్యూనికేషన్ వింగ్ ప్రెసిడెంట్ సుషి ఆనంద్ శుక్లా.. ‘ఇదంతా బీజేపీ కుట్రలో భాగం’ అంటూ చేస్తున్న ఆరోపణలు, వీడియో దెబ్బకు వెలవెల బోతున్నాయి. మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారం ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీకి ఒక అస్త్రంలా మారగా, తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ సర్వశక్తులను ఒడ్డాల్సి వస్తోంది.
ఈ యాప్‌కి సంబంధించిన తాజా వీడియో బీజేపీకి పెద్ద అస్త్రాన్నివ్వడమే కాదు, ఒక్కసారిగా ముఖ్యమంత్రి భూపేష్ భగెల్‌ను స్వీయరక్షణలోకి పడేసింది. భూపేష్ భగెల్ , కమల్‌నాథ్, అశోక్ గెహ్లాట్‌లు కాంగ్రెస్‌కు కలెక్షన్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షులు జె.పి. నడ్డా ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా సరిగ్గా ఇటువంటి ప్రకటన చేసిన తర్వాత నడ్డా ఈ విధంగా ఆరోపణలు చేయడం గమనార్హం. బీజేఈపి ఫైర్ బ్రాండ్ స్మృతి ఇరానీ కూడా కాంగ్రెస్‌పై విరుచుకు పడ్డారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు వర్సెస్ బీజేపీ పరస్పర ఆరోపణల యుద్ధం కొనసాగుతోంది.
మహువా మొయిత్రా
లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త హీరానందానీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎం.పి.మహువా మొయిత్రా డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపిన 15 మందితో కూడిన ఎథిక్స్ కమిటీ, ఆమె చర్యలు అత్యంత అభ్యంతరకం మైనవి, అనైతికమైనవి, హేయమైనవి, నేరపూరిత మైనవని పేర్కొంటూ ఎం.పి.పై కఠిన చర్యలు తీసు కోవాలని సిఫారసు చేసింది. అంతేకాదు ఆమెను ఎంపీగా కొనసాగించరాదని, ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దుచేయాలని నైతిక విలువల కమిటీ సిఫారసు చేయడం తాజా పరిణామం. అంతకుముందు కమిటీ విచారణకు హాజరైన మొయిత్రా, ఛైర్మన్ తనను అభ్యంతరకరమైన ప్రశ్నలు అడిగారంటూ విచారణను వాకౌట్ చేశారు. ఆమె ఆరోపణలను కమిటీ తిప్పి కొట్టడమే కాదు, ఆమె వ్యవహారశైలిపై న్యాయ, సంస్థాగత కాలపరిమితితో దర్యాప్తు చేపట్టాలని భారత ప్రభుత్వం కోరింది. నిజానికి ఈ నివేదికలోని అంశాలను పరిశీలించి ఆమోదించ డానికి నవంబర్ 9న లోక్‌సభ ప్రత్యేక సమావేశం జరపాలని కమిటీ నిర్ణయించినప్పటికీ, 500 పేజీలతో కూడిన కమిటీ నివేదిక వివరాలను నవంబర్ 8న ఒక వార్తాసంస్థ వెలుగులోకి తేవడంతో ప్రపంచానికి తెలిసింది. ఈ నివేదికను లోక్‌సభ శీతకాల సమావేశాల సందర్భంగా స్పీకర్‌కు సమర్పించనున్నారు. ఒకవేళ అదే జరిగితే కమిటీలోని విపక్ష సభ్యులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి (కాంగ్రెస్), కున్వర్ దానిష్ అలీ (బీఎస్పీ)లు దీన్ని విభేదిస్తూ నోట్ ఇచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే కాంగ్రెస్ నైజం ఏంటో మరోసారి స్పష్టం కాగలదు. దీనిపై లోక్‌సభలో చర్చలు జరిపి తర్వాతి చర్యలు తీసుకుంటారు.
ఇదిలావుండగా మహువా మొయిత్రాపై తానుచేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు లోక్‌పాల్ ఆదేశించిందని బీజేపీ ఎం.పి. నిశికాంత్ దూబే వెల్లడిరచడం మరో తాజా పరిణామం. ‘‘జాతి భద్రతను పణంగా పెట్టిన అవినీతి వ్యవహారంలో మొయిత్రాపై సి.బి.ఐ. దర్యాప్తునకు ఈరోజు లోక్‌పాల్ ఆదేశించింది’’ అని దూబే ‘ఎక్స్’లో తెలిపారు. అయితే లోక్‌పాల్ నుంచి ఎటువంటి అధికార ప్రకటన వెలువడలేదు. దీనిపై మొయిత్రా స్పందిస్తూ సి.బి.ఐ. ముందుగా ఆదానీ గ్రూపుపై వచ్చిన బొగ్గు అవినీతి వ్యవహారంపై దర్యాప్తు జరపాలని కోరడం ఆమె నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం.
కేజ్రీవాల్ ఉదంతం
మనీలాండరింగ్ కేసులో నవంబర్ 2న విచారణకు హాజరు కావాలని ఈడీ, ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీచేయడంతో బీజేపీ, ఏఏపీల మధ్య పరస్పర విమర్శల దాడులు పరాకాష్టకు చేరుకున్నాయి. కేవలం తమ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలన్న కక్షతోనే బీజేపీ ఈ విధంగా చేస్తున్నదని ఏఏపీ తీవ్రంగా విమర్శించగా, లిక్కర్ స్కామ్‌లో కీలక పాత్రధారి అయిన కేజ్రీవాల్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ ప్రతి విమర్శలకు దిగింది. ఏఏపీకి చెందిన ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్, అతీష్‌లు విలేకర్లతో మాట్లాడుతూ, భారత ప్రభుత్వం, ఢిల్లీ, పంజాబ్‌ల్లో ఏఏపీ సమర్థ పాలన చూసి బీజేపీ భయపడుతోందని, అందువల్లనే కేజ్రీవాల్‌ను ఏదో విధంగా జైలుకు పంపి పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నదంటూ ఆరోపించారు. ‘సమన్లలో స్పష్టత లేదు. సాక్షిగా లేదా అనుమానితుడిగా విచారణకు హాజరుకావాలని పేర్కొనకపోవడంతో ఈ విచారణకు హాజరు కావడంలేద’ని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అదీకాకుండా తనను ముఖ్యమంత్రి లేదా పార్టీ నేషనల్ కన్వీనర్…ఏ హోదాలో విచారణకు రమ్మని పిలిచారంటూ ఆయన ప్రశ్నించారు. ఇదిలావుండగా న్యాయనిపుణుల ప్రకారం ఇ.డి. సమన్లను మూడుసార్లు తిరస్కరిం చవచ్చు. ఆ తర్వాత ఈడీ నాన్‌బెయిలబుల్ వారంట్ జారీచేసి, నిర్ణీత తేదీన కోర్టుకు హాజరు కావాలని కోరవచ్చు. అప్పటికీ కేజ్రీవాల్ ఖాతరు చేయకపోతే అరెస్ట్ చేయవచ్చు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో తీవ్ర స్థాయిలో అవకతవకలు జరిగాయని సి.బి.ఐ, ఈడీ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ లిక్కర్ విధానాన్ని ఏఏపీ ప్రభుత్వం 2021లో ఢిల్లీలో అమలు చేసి, ఏడాది కాలంలోనే దాన్ని ఉపసంహరించుకుంది. లిక్కర్ డీలర్‌షిప్‌ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, పెద్ద మొత్తంలో అక్రమంగా సేకరించిన మొత్తాన్ని ఎన్నికల్లో ఖర్చు కోసం వినియోగించారన్నది దర్యాప్తు సంస్థల ఆరోపణ. ఏఏపీ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లు ఈ కేసులో ఇప్పటికే అరెస్టయ్యారు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సి.బి.ఐ. కేజ్రీవాల్‌ను తొమ్మిది గంటల పాటు విచారించింది. ఇది కేవలం తన పార్టీని దెబ్బతీయ డానికి చేసిన కుట్రగా కేజ్రీవాల్ ఆరోపించారు. అప్పటికే ఢిల్లీ, పంజాబ్‌ల్లో అధికారంలో ఉన్న ఏఏపీ, గోవాలో పాగా వేయాలని చూస్తున్న సమయం అది.