– క్రాంతి
కేరళలోని కొచ్చిలో జరిగిన యెహోవాస్ విట్నెసెస్ ప్రార్థనా సమావేశాల్లో పేలుళ్లను దేశ ప్రజలు రెండు రోజుల్లోనే మర్చిపోయి ఉంటారు. అదే సమయంలో మలప్పురంలో పాలస్తీనాకు మద్దతుగా జరిగిన సభలో ఉగ్రవాద సంస్థ హమాస్ నాయకుడు వర్చువల్‌గా పాల్గొనడం దేశ ప్రజల దృష్టిని పెద్దగా ఆకర్షించలేదు. ఈ రెండు ఘటనలకు సంబంధం ఉందా? అసలు కేరళకు ఉగ్రవాద సంస్థలకు లింకులు ఏమిటి? పేలుళ్లకు ఒక వ్యక్తిని బాధ్యుడిని చేసి కేసును తప్పుదోవ పట్టించడానికి అక్కడి వామపక్ష ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రపంచంలో ఎక్కడ ఏ ఘటనలు జరిగినా దాని ప్రభావం మన దేశంలోని కేరళపై మొదట పడుతుంది. తాజాగా కొచ్చి నగర సమీపంలో జరిగిన పేలుళ్ల ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించ డంతో పాటు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కలమస్సేరీలోని జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో అక్టోబర్ 29న ఉదయం 9.40కి ఓ పేలుడు సంభవించింది. కొద్దిసేపటికే మరికొన్ని పేలుళ్లు. ఈ ఘటనలో తొలుత ముగ్గురు మరణిం చారు. తర్వాత మృతుల సంఖ్య ఐదుకి చేరింది. 40మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్రైస్తవ మతానికి చెందిన ‘యెహోవాస్ విట్నెసెస్’ వర్గం నిర్వహించిన మూడు రోజుల ప్రార్థనా కార్యక్రమంలో దాదాపు 2,500 మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. వీరంతా చుట్టుపక్కల ప్రాంతాలైన వరపుజ, అంగమలి, ఎడప్పడి నుంచి వచ్చారు.
ప్రార్థన సమయంలో అందరూ కళ్లు మూసుకొని ఉండగా.. హాలు మధ్యలో భారీ పేలుడు జరిగింది. అనంతరం మరో రెండు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అక్కడ ఉన్నవారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది రక్తమోడుతూ కనిపిం చారు. ఘటనా స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ కన్వెన్షన్ సెంటర్ లోపలి వైపు నుంచి తాళం వేసి ఉండటంతో క్షతగాత్రులను తరలించడంలో కొంత జాప్యం చోటు చేసుకొంది. బాధితులను కలమస్సేరీ మెడికల్ కాలేజీ, ఎర్నాకులం జనరల్ హాస్పిటల్, కొట్టాయం మెడికల్ కాలేజీలకు తరలించారు
మొదటి రెండు పేలుళ్లు శక్తిమంతమైనవిగా, మూడోది తక్కువ తీవ్రత కలిగినదిగా పోలీసులు గుర్తించారు. పేలుళ్ల సమాచారం తెలియగానే కేరళ రాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు రంగంలోకి దిగారు. ఈ పేలుళ్లకు టిఫిన్ బాక్సులో ఇంప్రూవైస్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) ఉపయోగించినట్లు ప్రాథమిక ఆధారాలు దొరికాయి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ), ఇంటెలిజెన్స్ బ్యూరో బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన యెహోవాస్ విట్నెసెస్ ప్రార్థనా సమావేశాల్లో రెండో రోజున ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఓ తీర్మానం చేయడం గమనార్హం.
కేంద్ర హోం మంత్రి ఆరా!
ఇదో దురదృష్టకర ఘటనని, దీనిపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆయనకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితులను ఆరా తీశారు. దర్యాప్తు కోసం కేంద్ర దర్యాప్తు బృందాలను పంపిస్తున్నట్లు చెప్పారు. సీఎం విజయన్ 20మంది సభ్యులతో కూడిన దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
పేలుళ్లకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఇది ఉగ్రవాద చర్యా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అనేది ఇప్పుడే చెప్పలేమని రాష్ట్ర డీజీపీ షేక్ దార్వేశ్ సాహెబ్ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే, ద్వేషపూరిత సందేశాలు పంపేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పేలుళ్ల నేపథ్యంలో, 14 జిల్లాల్లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశంలోని ప్రముఖ నగరాల్లో భద్రతాబలగాలు అప్రమత్తం అయ్యాయి. దేశ రాజధాని ఢల్లీితోపాటు ముంబయిలోనూ హై అలర్ట్ విధించారు.
లొంగిపోయిన నిందితుడు
కలమస్సెరీలో దుర్ఘటన జరిగిన కొద్ది గంటల తర్వాత తానే వరుస పేలుళ్లకు పాల్పడ్డానంటూ డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి త్రిసూర్ జిల్లా కొడాకర పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. తాను కూడా ‘యెహోవాస్ విట్నెసెస్’గ్రూప్ సభ్యుడినేనని చెప్పారు. పేలుళ్లకు రెండు నెలల ముందు దుబాయ్ నుంచి తిరిగి వచ్చి పేలుళ్లకు పాల్పడ్డాడని మార్టిన్ చెప్పాడని పోలీసులు అంటున్నారు. మార్టిన్ కుటుంబం కొచ్చి సమీపంలో ఐదేళ్లుగా అద్దెకు ఉంటోంది.
గల్ఫ్‌లో ఫోర్‌మన్‌గా పనిచేస్తున్న సమయంలో ఇంటర్నెట్, యూట్యూబ్‌లో చూసి బాంబు తయారీ నేర్చుకున్న తాను, కేవలం 3 వేల రూపాయల ఖర్చుతో ఈ బాంబులను తయారు చేసినట్టు డొమినిక్ మార్టిన్ చెప్పాడు. బాణసంచా తయారీలో ఉపయోగించే తక్కువ గ్రేడ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)తో ఈ బాంబులు తయారు చేసినట్లు తెలిపాడు. దాదాపు ఎనిమిది లీటర్ల పెట్రోలును త్రిపుణితుర నుంచి కొనుగోలు చేశాననీ, ఇతర మెటీరియల్స్, మందుగుండు సామగ్రిని కొనుగోలుకు సంబంధించిన సమాచారాన్ని కూడా వెల్లడిరచాడు. తన ఇంట్లోనే ఎసెంబుల్ చేసి, అక్టోబర్ 29న ఉదయం 7 గంటలకు యెహోవా విట్నెస్ కన్వెన్షన్ సెంటర్‌లోని కుర్చీల కింద పెట్టాడు. ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నవారే లక్ష్యంగా ప్లాస్టిక్ కవర్లలో పెట్రోల్ నింపిమొత్తం ఆరుచోట్ల ఉంచాడు. అనంతరం వాటిని రిమోట్ కంట్రోల్‌తో పేల్చివేశాడు.
ఎందుకు బాంబులు పెట్టానంటే..
మార్టిన్ పోలీసులకు లొంగిపోయే ముందు సోషల్ మీడియాలో వీడియో సందేశాన్ని పోస్ట్ చేశాడు. ‘యెహోవాస్ విట్నెసెస్’ గ్రూప్‌లో తాను 16 ఏళ్ల పాటు పని చేశానని అందులో తెలిపాడు. ఈ సంస్థ దేశద్రోహ, విద్రోహ పూరిత బోధన చేస్తోందన్నాడు. సమాజానికి, పిల్లలకు తప్పుడు విలువలను ప్రచారం చేస్తోందని ఆరోపించాడు. పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడంతో ఈ వరుస పేలుళ్లకు పాల్పడినట్టు మార్టిన్ పేర్కొన్నాడు. పేలుళ్లను అడ్డుకోవాలని తాను ముందుగానే సవాల్ చేస్తే.. ఎవరూ పట్టించుకోలేదని అన్నాడు.. మరోవైపు మార్టిన్ మానసిక పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ పేలుళ్లలో ఇతరుల ప్రమేయంపై కూడా పరిశీలిస్తున్నామని కొచ్చి పోలీసు కమిషనర్ అక్బర్ తెలిపారు.
డొమినిక్ మార్టిన్‌పై ఐపీసీలోని సెక్షన్ 302 (హత్యకు శిక్ష), పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ 3తో పాటు, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)లోని సంబంధిత సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. మార్టిన్‌కు నవంబర్ 6న ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు 10 రోజుల (నవంబర్ 15 వరకూ) పోలీసు కస్టడీ విధించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం కొచ్చిలోని ఆయన్ని వివిద óప్రాంతాలకు పట్టుకెళ్లింది. పలరివట్టంలోని ఎలక్ట్రికల్ షాప్‌కు తీసుకెళ్లగా.. ఇక్కడే ఐఈడీ తయారీకి ఉపయోగించే భాగాలను కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు. కొనుగోలు చేసిన వస్తువుల బిల్లులు కూడా నిందితుడి వద్ద ఉన్నాయని పోలీసులు తెలిపారు. మార్టిన్ తమ్మనంలో అద్దెకు తీసుకున్న ఇంటితో పాటు త్రిసూర్ జిల్లాలోని లాడ్జి, తీసుకెళి ఆధారాలు సేకరించింది దర్యాప్తు బృందం. ఆయన ఆదాయ వనరులు, అంతర్జాతీయ సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కేరళ సీఎం ఢిల్లీలో ఏం చేస్తున్నారు?
కొచ్చి పేలుళ్ల సమయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఎక్కడున్నారు? అక్టోబర్ 29వ తేదీన ఢిల్లీలోని సీపీఎం ప్రధాన కార్యాలయం ముందు ‘గాజాపై ఇజ్రాయెల్ దాడులకు’ వ్యతిరేకంగా నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రకాశ్ కరాత్‌తో పాటు అగ్రనాయకులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్‌కు భారత ప్రభుత్వం మద్దతు ఇస్తోందని ఏచూరి, పినరయి సహా సీపీఎం నాయకులందూ తప్పు పట్టారు. పాలస్తీనా ప్రజలపై దాడులను ఆపాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో కొచ్చిలో బాంబు పేలుడు జరిగింది. ఈ వార్త తెలియగానే విజయన్ హడావిడిగా తిరువనంతపురానికి తిరిగి వచ్చారు..
‘కేరళలో క్రైస్తవులపై దాడులు జరుగుతుంటే పినరయ్ విజయన్ ఢిల్లీలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు’ అని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ట్వీట్‌తో ఆయన ఇరకాటంలో పడ్డారు. కేరళలో జిహాద్ కోసం హమాస్ టెర్రరిస్టు సంస్థ బహిరంగంగా పిలుపునిచ్చినా పట్టించుకో కుండా సిగ్గుమాలిన, బుజ్జగింపు రాజకీయాలతో రాష్ట్రం పరువు తీస్తున్నారని రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు..
హమాస్‌కు మద్దతుగా సభ
కొచ్చి పేలుళ్లకు మూడు రోజుల ముందు కేరళలోని మలప్పురంలో జమాతే ఇస్లామీ సంస్థకు అనుబంధంగా ఉన్న సాలిడారిటీ యూత్ మూవ్‌మెంట్ పాలస్తీనాకు మద్దతు పేరుతో ఓ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హమాస్ అగ్రనాయకుడు, మాజీ అధ్యక్షుడు ఖలీద్ మషాద్ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. త్రిపుర ప్రభుత్వం 2021లో యూఏపీఎ చట్టం కింద అరెస్టు చేసిన మీర్ ఫైజల్ అనే వ్యక్తి ఇందులో పాల్గొన్నారు. ‘సేవ్ పాలస్తీనా’ ముసుగులో ఉగ్రవాద సంస్థ హమాస్‌ను కీర్తిస్తూ, ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తూ ఇంత బహిరంగంగా సభ నిర్వహించినా కేరళ పోలీసులు, అక్కడి ప్రభుత్వం మౌనం దాల్చడం విమర్శలకు దారి తీస్తోంది. ఈ విషయంలో సీఎం పినరయ్ విజయన్ ఎందుకు పట్టించుకోవడంలేదని కేరళ బీజేపీ చీఫ్ కె.సురేంద్రన్ ట్వీట్ చేశారు. మలప్పురంలో హమాస్‌కు మద్దతుగా జరిగిన ఈ సమావేశం తర్వాత కొచ్చి పేలుళ్లు జరగడంపై అనుమానాలు రావడంతో పినరయ్ ఇరకాటంలో పడ్డారు.. ఈ సభపై ఇప్పటి వరకూ ఎలాంటి కేసును నమోదు చేయలేదు అక్కడి వామపక్ష ప్రభుత్వం.
రాజీవ్ చంద్రశేఖర్‌పై కేసు
మలప్పురంలో హమాస్‌కు మద్దతుగా సభ, కొచ్చి పేలుళ్ల ఘటనతో ఉక్కిరి బిక్కిరవుతున్న కేరళ ప్రభుత్వం ఈ కోపాన్ని పరోక్షంగా బీజేపీ మీద చూపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది. వివిధ వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తూ.. శాంతి భద్రతలను రెచ్చగొడుతున్నారని రాజీవ్ చంద్రశేఖర్‌పై ఆరోపణ.
‘‘అవినీతి ఆరోపణలతో అపఖ్యాతి పాలైన సీఎం పినరయి విజయన్‌చే సిగ్గు లేకుండా బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారు. ఢల్లీిలో కూర్చుని ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు, కేరళలో జిహాద్‌కు టెర్రరిస్ట్ సంస్థ హమాస్ ఇచ్చిన బహిరంగ పిలుపులు.. అమాయక క్రైస్తవులపై దాడులు, బాంబు పేలుళ్లకు కారణమవుతున్నాయి’’ అంటూ రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ట్వీట్ కలకలం రేపింది. కేరళలో సంఘ విద్రోహ శక్తులు బలపడు తున్నాయని, ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
అయితే రాజీవ్‌చంద్రశేఖర్ వ్యాఖ్యల్లో మతపర మైన ఎజెండా ఉందని సీఎం పినరయ్ ఎదురు దాడికి దిగారు. ప్రాథమిక దశలో ఉన్న దర్యాప్తుపై ఏమాత్రం గౌరవం లేదని విరుచుకుపడ్డారు. చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎవరు ప్రకటనలు చేసినా, కేంద్ర, రాష్ట్ర మంత్రులైనా వారిపై కేసులు నమోదు చేస్తామని సీఎం ప్రకటించారు.
మరోవైపు సామాజిక మాధ్యమాల్లో మతతత్వాన్ని రెచ్చగొట్టే సందేశాలను వ్యాప్తి చేస్తున్నారంటూ కేరళ ప్రభుత్వం 54 కేసులు నమోదు చేసింది. కొచ్చి పేలుళ్ల వెనుక పీపుల్ డెమోక్రటిక్ పార్టీ నాయకుడు అబ్దుల్ నజీర్ మౌదనీకి సంబంధం ఉందా? అనే అనుమానితులలో ఓ మహిళా వ్లాగర్ లసిత పాలక్కల్, శ్రీరాజ్ ఆర్ అనే వ్యక్తిపై కూడా ఉన్నారు.
కేరళ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి
రాజీవ్ చంద్రశేఖర్‌పై పెట్టిన కేసును రాజకీయం గానూ, న్యాయపరంగానూ ఎదుర్కొంటామని బీజేపీ ప్రకటించింది. కొచ్చి పేలుళ్లను ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్‌తో పాటు హమాస్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చిన ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ ఎమ్మెల్యే ఎం.కే మునీర్, సీపీఎం నేత స్వరాజ్‌లపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని కేరళ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ ఆరోపించారు. మలప్పురంలో హమాస్‌కు మద్దతుగా కార్యక్రమాన్ని నిర్వహించిన ఇస్లామిస్ట్ గ్రూప్‌పై కేసు నమోదు చేయకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు.
మరోవైపు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హమాస్‌ను బుజ్జగిస్తున్నారని ఆరోపిస్తూ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసుకున్న ఇండీ కూటమి భాగస్వాములైన వీరిద్దరూ తనపై కేసు పెట్టారని.. కేరళలో దశాబ్దాలుగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎస్‌డీపీఐ, పీఎఫ్‌ఐలకు వీరు అతిపెద్ద బుజ్జగింపుదారులని ఆరోపిస్తూ మరో ట్వీట్ చేశారు రాజీవ్ చంద్రశేఖర్. ఇలాంటి బుజ్జగింపుదారుల వల్లనే దేశంలో అనేకమంది అమాయకులు, భద్రతాదళాల సిబ్బంది ప్రాణాలు పోతున్నాయని ఆరోపించారు
పేలుళ్ల వెనుక ఉగ్రకోణం ఉందా?
కొచ్చి పేలుళ్ల వెనుక ఉగ్రకోణం ఉందా? కేరళ ప్రభుత్వం అసలు విషయాలను దాస్తోందా? మలప్పురంలో హమాస్ అనుకూల సభకు కొచ్చిలో యహోవాస్ విట్నెస్ ప్రార్థనా కార్యక్రమంలో పేలుళ్లకు ఎక్కడా లింకు కనిపించదు. కానీ ఈ మొత్తం వ్యవహారాన్ని జాగ్రత్తగా దర్యాప్తు చేస్తే అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. సాధారణంగా కేరళలో నాటు బాంబులు ఎక్కువగా వాడుతారు. కానీ కొచ్చి ఘటనలో ఐఈడీని ఉపయోగించారు. ఈ దాడిలో ఉగ్రవాద జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..
పేలుళ్లకు పాల్పడ్డానని ప్రకటించుకున్న డొమినిక్ మార్టిన్ విషయంలో ప్రాథమికంగా ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. యహోవాస్ విట్నెస్‌తో విభేదించి తాను పేలుళ్లకు కుట్ర పన్నానని, యహోవాస్ విట్నెస్ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని..వారిలో దేశభక్తి లేనందునే బయటకు వచ్చానని అతను చెప్పుకొచ్చాడు. సంస్థతో విభేదాలు ఉంటే బయటకు వచ్చే స్వేచ్ఛను కాదనలేం.. కానీ పేలుళ్లకు కుట్ర పన్నాల్సిన అవసరం ఏమిటి? మార్టిన్ చెప్తున్నది వాస్తవం కాదని తెలుస్తోంది..
మార్టిన్ పేలుళ్లు జరిగిన కొచ్చి నుంచి 86 కిలోమీటర్ల దూరంలోని త్రిశూరు జిల్లాలో కడక్కర పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఇందు కోసం ఆయన నాలుగు గంటలపాటు ప్రయాణంచగా, ఈ వ్యవధిలో ఎందుకు కనిపెట్టలేక పోయారు? అంటే మార్టిన్ త్రిశూరులో ఉంటే, కొచ్చిలో ఇంకెవరైనా బాంబు పెట్టారా?
మన దేశంలో ఇప్పటి వరకూ జరిగి ఉగ్రవాద ఘటనలు, పేలుళ్ల వెనుక ఏదైనా సంస్థకానీ, కొందరు వ్యక్తులు కానీ ఉన్నట్లు తేలింది. కొచ్చి ఘటనను గమనిస్తే ఒక వ్యక్తి మాత్రమే ఇంత పెద్ద కుట్ర పన్నాడంటే నమ్మలేం.. ఇందుకు పకడ్బందీ ప్రణాళిక అవసరం. ఎంతో శిక్షణ పొందిన వారే ఈ పని చేయగలరు.. మార్టిన్‌కు ఎవరో శిక్షణ ఇచ్చి ఉండాలి. అంటే మార్టిన్‌ను ముందు పెట్టుకొని మరెవరో ఈ కుట్ర పన్నినట్లు అర్థమవుతోంది. ఆయన వాడిన ‘దేశభక్తి’ పదం జాతీయవాద సంస్థలను ఇరికించే కుట్రగా కనిపిస్తోంది. అసలు వ్యక్తులను కాపాడేందుకే డొమినిక్ మార్టిన్‌ను ముందు పెట్టి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందా?
హమాస్‌తో కేరళకు లింకులు ఏమిటి?
కొచ్చిలో జరిగిన యహోవాస్ విట్నెస్ ప్రార్థనా సమావేశాల్లో ఇజ్రాయెల్‌ను సమర్థించడం ఇక్కడ గమనించాలి. ఇందుకు పూర్తి వ్యతిరేకంగా మరోవైపు మలప్పురంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా జమాతే ఇస్లామీ-సాలిడారిటీ యూత్ మూవ్‌మెంట్ సభ జరగడం కూడా గమనించాలి. ఎక్కడో ఖతార్‌లో దాగి ఉన్న హమాస్ అగ్రనాయకుడు ఖాలీద్ మషాద్ వీరికి ఎలా అందుబాటులోకి వచ్చారు?. వర్చువల్‌గా మాట్లాడేందుకు సాలిడారిటీ యూత్ మూవ్‌మెంట్ ఉపాధ్యక్షుడు సీటీ సుహైబ్ హమాస్ నాయకుడిని ఎలా సంప్రదించాడు? కేరళ వ్యక్తులకు హమాస్‌తో ఎలా లింకులు ఏర్పడ్డాయి?
ఐసిస్, అల్‌ఖైదా ఈ సంస్థల్లో పని చేసేందుకు కేరళ నుంచి పెద్ద సంఖ్యలో వెళ్లారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వంతో పాటు, విపక్ష కాంగ్రెస్ పార్టీ సంతుష్టీ కరణ విధానాలు పాటిస్తున్నాయి. తాజాగా ఈ రెండు పార్టీలు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతుగా బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా కేరళ ప్రభుత్వం వాస్తవాలు దాస్తోందా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నిలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసం వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతు న్నాయి. ఈ దశలో పేలుళ్ల వెనుక ఉగ్రకోణం ఉందా? అనేది తేలాలంటే జాతీయ దర్యాప్తు సంస్థ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌లను రంగంలోకి దింపాల్సిందే..
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్