ఆశ్వీయుజ అమావాస్య నాటి దీపావళిలానే ఆ తరువాత వచ్చే కార్తిక పౌర్ణమికి అనేక విశిష్టతలు ఉన్నాయి. ప్రధానంగా ఆ అమావాస్య మానవ దీపావళి కాగా, ఈ పౌర్ణమి ‘దేవ దీపావళి’ అని వ్యవహరిస్తారు. కార్తిక పున్నమి శివరాత్రితో సమానమైనదని చెబుతారు. శ్రీమహావిష్ణువు మత్స్యావతారం దాల్చింది, బృందాదేవి తులసి మొక్కగా అవతరించిందీ, కార్తికేయ అవతరణ ఆ రోజే. సిక్కు మతస్థాపకుడు గురునానక్‌ దేవ్‌ ఈ పున్నమినాడే జన్మించారు. కార్తిక శుద్ధ ద్వాదశి నుంచి పౌర్ణమి తిథులను ‘చాతుర్వర్థకాలు’ అంటారు. ఆ నాలుగు రోజుల పాటు అఖండ దీపాన్ని వెలిగించడం వల్ల శివకేశవుల అనుగ్రహం సిద్ధిస్తుందని చతుర్వర్గ చింతామణి పేర్కొంది. ఈ మాసమంతా దీపాలు వెలిగించినా, కార్తిక పూర్ణిమనాడు తప్పని సరిగా దీపాలు పెట్టడం సంప్రదాయం. ఆ రోజున స్వగ్రామంలో దీపారాధన చేసినా కాశీలో చేసినంత పుణ్యమని విశ్వాసం. ఈ మాసంలో ఒక్క దీపం వెలిగించినా జన్మజన్మల పాపాలు నశిస్తాయని అంటారు.

చంద్రుడు పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ నెలకు కార్తికమనే పేరు వచ్చింది.హరిహరులను ఏకకాలంలో అర్చించే మాసం ఇది. అందులోనూ పౌర్ణమి తిథిని విశేషంగా చెబుతారు. పూర్ణచంద్రుడు వెలిగేవేళ హరిహరులకు నిర్వహించే అభిషేకాలు, దీపారాధన మంచి ఫలితాలు ఇస్తాయని విశ్వాసం.

దీపం జ్ఞానానికి, శాంతికి, సంపదకు ప్రతీక అని, సృష్టి స్థితి లయకారకులు, వారి దేవేరులు అందులోనే నిక్షిప్తమై ఉంటారని ప్రతీతి.

‘దీపాగ్రే వర్తతే విష్ణుః దీప మధ్యే మహేశ్వరః

దీపాంతేచ తదా బ్రహ్మ దీపం త్రైమూర్తికం విదుః

దీపాగ్రే వర్తతే లక్ష్మీ దీప మధ్యే చ పార్వతీ

దీపాంతే శారదా ప్రోక్త దీపం శక్తి మయం విదుః’… దీపం కుంది భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో శివుడు,అగ్రభాగాన శ్రీ మహావిష్ణువు నెలవై ఉంటారు. వారి పత్నులూ ఆ క్రమంలోనే ఉంటారని ప్రత్యేకంగా చెప్పనపసరం లేదు. త్రిమూర్తులు సకల దేవతల ప్రతినిధులు కనుక సమస్త దేవతాగణం దీపాన్ని ఆశ్రయించి ఉంటారని చెబుతారు.

‘దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం

దీపేన హరతే పాపం దీపలక్ష్మీ నమోస్తుతే’!!.. దీపం పరబ్రహ్మ స్వరూపం. అంధకారాన్ని పోగొడు తుంది. దీపం జ్ఞానానికి సంకేతం. నిర్లక్ష్యం, అజ్ఞానం అనే చీకటిని పారదోలుతుంది. పరిసరాలను శక్తిమంతం చేస్తుంది. దీపంలోని విద్యుదయస్కాంత శక్తి ఆ ప్రాంత ఉష్ణోగ్రత, గాలులపై ప్రభావం చూపుతుందని శాస్త్రజ్ఞులు చెబుతారు. మంగళప్రదం, సౌభాగ్యకరమైన దీపారాధనతో దేవతలు త్వరగా ప్రసన్నులవుతారట. దీపారాధనకు ఆధ్మాత్మికంగా, సాంస్కృతికంగా ఎంతో విశిష్టత ఉంది. ఇళ్లలోని పూజా మందిరాల నుంచి గర్భాలయాల వరకు దీపారాధనలుÑ సదస్సులు గోష్ఠులు జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభం కావడం తెలిసిందే. అందులోనూ కార్తికంలో పౌర్ణమి నాడు వెలిగించే దీపం సర్వశ్రేయోదాయకమని పురాణాలు చెబుతున్నాయి.

‘దీపదో లభతే విద్యాం/దీపదో లభతే శ్రుతం/దీపదో లభతే ఆయుః/దీపదో లభతే దివమ్‌’.. (దీపం వెలిగించినవారు విద్యావంతులు, జ్ఞానవంతులు, ఆయుష్మంతులవుతారు. మోక్షం పొందుతారు)అని ఆర్యోక్తి. దీపాలు పితృదేవతలకు మోక్ష ద్వారాలు లాంటివి.

కార్తిక పున్నమి వేడుకలు ఈ మాస శుద్ధ ఏకాదశి నాడే మొదలవుతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్లిన శ్రీమహావిష్ణువు కార్తిక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొనడం అందుకు కారణంగా చెబుతారు. ఈ మాసానికి శ్రీహరి ‘దామోదర’ నామంతో అధినాయకుడిగా ఉంటాడు. అందుకే ‘నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమస్తుతే’ అని ప్రార్థిస్తారు. సర్వలోకాలను గుప్తగతిని బొజ్జలో దాచుకున్నవాడు దామోదరుడు (‘దామములు’ అంటే లోకాలు). ‘ఉదరం’ అంటే పొట్ట. ‘దామము’ అంటే తాడు అనీ అర్థం ఉంది. చిన్నకృష్ణుడి అల్లరి భరించలేని తల్లి యశోద, ఆయనను తాడుతో రోలుకు కట్టిన కథ తెలిసిందే. ‘దామము’తో బంధించింది కనుక దామోదరుడు అయ్యాడని చెబుతారు.

కార్తికదీపం విశిష్టత గురించి శ్రీమద్భాగవతంలో ఉంది. బలి చక్రవర్తి యజ్ఞం చేసి త్రివిక్రముడి మూడవ అడుగుతో రసాతలానికి చేరినది ఈ మాసంలోనే. ‘నా యజ్ఞం పరిసమాప్తి కాకుండానే యజ్ఞఫలం అనే నీ దర్శనం కలిగించావు. కానీ నిన్ను ఆరాధించలేకపోయాను. ఆ దోషం తొలగేలా వరం అనుగ్రహించు. నా అహాన్ని హరించి రసాతలానికి పంపి, చక్రవర్తిని చేసి అడగకుండానే ద్వారక పాలకుడవు అయ్యావు. నీ ఈ ఔదార్యాన్ని అందరూ తెలుసుకోవాలి. నీ దయతో నాకు దక్కిన సంపదల వంటివే అందరికీ దక్కాలి. అందుకు కార్తికమాసం ఆరంభం నుంచి (దీపావళి మరునాటి నుంచి) ప్రతి ఇంటా దీపకాంతులు వెదజల్లాలి. అలా చేసిన వారందరికి సంపదలు అనుగ్రహించు. శుక్ల పాడ్యమి నుంచి పున్నమి దాకా ఇళ్లలో, బహుళ పాడ్యమి నుంచి ఆమావాస్య వరకు ఆలయాలలో దీపారాధన (ఇదే దేవ దీపావళి) కొనసాగేలా అనుగ్రహించు’ అని బలి చక్రవర్తి వేడుకున్నాడట. దేశంలోని శైవ క్షేత్రాలలో తలమానికమైన వారణాసిలో గంగానదీ తీరంలో ‘దేవ దీపావళి’ని అత్యంత వైభవంగా నిర్వహి స్తారు. కార్తిక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు అయిదు రోజుల పాటు గంగా మహోత్సవం వైభవోపేతంగా జరుగుతుంది.

త్రిపురాసుర వధ జరిగింది ఆ రోజేనని పురాణ గాథ. మహేశ్వరుడు మూడు రోజుల పాటు పోరాడి త్రిపురాసురులను సంహరించినందున ఈ పౌర్ణమిని ‘త్రిపురాసుర పౌర్ణమి/త్రిపురారి పౌర్ణమి’ అనీ వ్యవహరిస్తారు. ముల్లోకాలను ముప్పతిప్పలు పెట్టిన త్రిపురాసుర వధతో సంతసించిన దేవతలు ఆనాడు దీపావళి పండుగ చేసుకున్నారని ప్రతీతి. తారకాసుర వధతో, ఆయన ముగ్గురు కుమారులు తారకాక్షుడు, కాలాక్షుడు, విద్మున్మాలి (త్రిపురాసురులు) ప్రతీకారేచ్ఛతో రగిలిపోయి బ్రహ్మ గురించి తపస్సు చేశారు. ‘రథం కాని రథం, విల్లుకాని విల్లు, నారి కాని నారి, బాణం కాని బాణంతో తమ ముగ్గురు సోదరులను ఏకకాలంలో ఎదిరించి పడగొట్టే వరకు చావు రాకుండా ఉండాలి’ అని బ్రహ్మ నుంచి వరం పొందారు. ఆ వరగర్వంతో సోదరత్రయం లోకకంట కులయ్యారు. వారి ఆగడాలతో భీతిల్లిన దేవతలు పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నారు. త్రిపురాసురుల సంహారంలో శివుడికి సహకరించేందుకు దేవతలు ముందుకు వచ్చారు. భూమి రథంగా, సూర్య చంద్రులు దాని చక్రాలుగా, నాలుగు వేదాలు అశ్వాలుగా, బ్రహ్మదేవుడు సారథిగా, మేరు పర్వతం విల్లుగా, ఆదిశేషువు వింటినారిగా, శ్రీమహావిష్ణువు అస్త్రంగా మారగా`పరమేశ్వరుడు దనుజ సంహారాన్ని పూర్తి చేశాడు. కనుకనే, కార్తిక పున్నమి నాడు శివుడిని శుద్ధ జలాలలో అభిషేకించి, మారేడు దళాలు, జిల్లేడు పూలతో అర్చిస్తారు. దీని వల్ల విశేష ఫలితాలు లభిస్తాయంటారు.

కార్తిక మాసంలో ప్రతిరోజూ శుభప్రదమైనదే. వాటిలో సోమవారం అత్యంత పావనమైనదిగా పరిగణిస్తారు. ఆ వారానికి చంద్రుడు అధిపతి. చంద్రుడు శివుడి సిగలో వెలుగుతుంటాడు కనుక ఆరోజు ఉపవాసం విశేష ఫలితాన్నిస్తుందంటారు. అందులోనూ సోమవారంతో కలిసి వచ్చే పౌర్ణమి మరీ పుణ్యదాయకమని పౌరాణికులు చెబుతారు. ఆ రోజును ‘మహాకార్తి’ అంటారు. ఈ పౌర్ణమి నాడు తులసీ, ఉసిరిచెట్టుకూ ప్రత్యేక పూజలు నిర్వహించడం సంప్రదాయం. దీనిని ‘ధాత్రిపూజ’ (ధాత్రి అంటే ఉసిరిక)అంటారు. ఇందులో లక్ష్మీదేవి ఆవాసమై ఉంటుందంటారు. తులసిని పరదేవతా స్వరూపంగా పూజిస్తారు. ఈ మాసంలో ఒకసారైనా ఉసిరిచెట్టుకు ఎనిమిది దీపాలు పెట్టి, ఎనిమిది ప్రదక్షిణలు చేయడం వల్ల ఆమె అనుగ్రహ పాత్రులవుతారని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజున ఉపవాసం ఉండి సాయంవేళ 365 ఒత్తులతో దీపాలను వెలిగించాలని, రోజుకో ఒత్తి వంతున ఏడాదిని సూచిస్తాయని చెబుతారు. అయితే శక్తి కలిగిన వారు (భక్తులు) ఉపవాస దీక్ష పాటిస్తారు. లేనివారు చంద్రదర్శనం తరువాత పూజలు చేసి, భోజనం చేస్తారు. దీనినే పూర్ణిమ వ్రతం అంటారు. ఆ రోజున కొన్ని ప్రాంతాలలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు.

 కార్తిక పున్నమినాడే జన్మించిన సిక్కు మతస్థాపకుడు గురునానక్‌ దేవ్‌ బాల్యం నుంచి దైవచింతనతో పురాణాలను అధ్యయనం చేశారు. పరస్పర విరోధ భావనతో జీవిస్తున్న మతాల మధ్య సమరసత సాధన కోసం సిక్కు మతాన్ని స్థాపించారు. పంజాబీ భాషలో ‘సిక్కు’ అంటే శిష్యుడని అర్థం. సామాజిక వర్గాల మధ్య అసమానతలు తగ్గించడం, మహిళల పట్ల గౌరవ భావం పెంపొదించడం ఆశయాలుగా కృషి చేశారు.

ఈ పున్నమి నాడు శ్రీశైలం సహా కొన్ని శైవ క్షేత్రాలలో జ్వాలాతోరణం నిర్వహిస్తారు. రాక్షస సంహరణ తరువాత శివునికి దృష్టిదోషం నివారణతో పాటు ఆయన విజయానికి గౌరవ సూచకంగా పార్వతీదేవి తొలుత ఈ ఉత్సవాన్ని నిర్వహించినట్లు ఐతిహ్యం. దీపకాంతులతో ధగధగలాడే జ్వాలా తోరణం కింది నుంచి భక్తులు ఉత్సాహంగా పరుగులు పెడతారు. ఇలా చేయడం వల్ల సకల పాపాలు నివారణమవుతాయని విశ్వసిస్తారు. అరుణాచలంలో ఈ రోజున వెలిగించే దీప దర్శనా నికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. మహిళలు తమ సోదరుల క్షేమం, అభివృద్ధిని కోరుతూ పూజలు చేస్తారు. తమిళనాడు, కేరళ, శ్రీలంకల్లో భగవతి అనుగ్రహం కోరుతూ పూజలు చేస్తారు. బ్రహ్మదేవుడికి గల అరుదైన ఆలయం గల రాజస్థాన్‌లోని పుష్కర క్షేత్రంలో ఆయన ప్రీత్యర్థం ఏటా కార్తిక శుద్ధ ఏకాదశి నుంచి పున్నమి వరకు పుష్కరమేళా జరుగుతుంది. అప్పుడు పెద్ద సంఖ్యలో ఒంటెలు అక్కడికి చేరు కుంటాయి. ఇది ఆసియాలోనే అతి పెద్ద ఒంటెల ఊరేగింపుగా గుర్తింపు పొందింది.

– డా॥ ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE