ఏదైనా ప్రాజెక్టు కడితే సాధారణంగా ఆ ప్రభుత్వానికి పేరు వస్తుంది. ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. ఎన్నికల్లో కలసి వస్తుంది. చిరకాలం అది మనుగడ సాగించాలి. కానీ, తెలంగాణలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత అధునాతనంగా నిర్మించామని, దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అని చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలువునా ముంచేందుకు సిద్ధంగా ఉంది. మూణ్ణాళ్ల ముచ్చటగా తేలిపోయింది. ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చు మొదలు.. ఇతర నిర్వహణ వ్యయం ఖజానాను గుల్ల చేస్తున్నాయి. ఇంతలోనే మేడిగడ్డ ప్రాజెక్టులో పగుళ్ల వార్త. నిజానికి దీనిని ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో రాజకీయంగా ఉపయోగించుకోలేదు. అది బీఆర్‌ఎస్‌కు దక్కిన ఊరట. రేపు అసెంబ్లీ ప్రారంభమై, ఏ ప్రభుత్వం ఏర్పడినా మేడిగడ్డ మెడ మీద కత్తిలా వేలాడుతూనే ఉంటుంది. ఆ ప్రాజెక్టు లేదా ఆనకట్ట పునర్నిర్మాణం తప్ప మార్గం లేదని నిపుణులు చెబుతున్నారు.
గత యేడాది భారీ వర్షాలకు ప్రాజెక్టుకు సంబంధించిన కోట్ల రూపాయల విలువైన బాహుబలి మోటార్లు మునిగిపోయాయి. ఈ యేడాది చూసు కుంటే అదే ప్రాజెక్టు పరిధిలోని శ్రీలక్ష్మీ బ్యారేజీగా చెప్పుకునే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోయింది. ఇంకొన్ని చోట్ల బ్యారేజీల వద్ద సమస్యలు తలెత్తాయని కూడా అంతర్గతంగా చెప్పుకుంటున్నారు. ఈ కారణంగా శ్రీపాదసాగర్ ప్రాజెక్టు దిగువ నుంచి మొదలు రామగుండం గోదావరిఖని నుంచి కాళేశ్వరం ఎగువ దాకా గోదావరిలో నీళ్లను ఖాళీ చేశారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రాజెక్టు డిజైన్, ప్లానింగ్‌పైనే విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సర్కారుకు అనుకూలత కన్నా ప్రతికూలతలే చేకూరుస్తోందన్న వాదనలు ఎక్కువయ్యాయి. విమర్శలు, ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు.. కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మరిన్ని తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
గడిచిన ఏడాది గోదావరికి వచ్చిన వరదల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన రెండు పంప్ హౌస్‌లు నీట మునిగాయి. ఆ ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు గోదావరి నదిపై మేడిగడ్డ, అన్నారం, కన్నెపల్లి ప్రాంతాల్లో పంపుహౌస్‌లు నిర్మించారు. వీటిలో అన్నారం, కన్నెపల్లి పంప్ హౌస్‌లు మునిగిపోయాయి. కన్నెపల్లి పంప్ హౌస్‌లో బాహుబలి మోటార్లను అమర్చారు.ఈ రెండు పంప్ హౌస్‌లు నీట మునిగిన తర్వాత.. డీవాటరింగ్ చేయడానికి చాలా సమయం పట్టింది. కన్నెపల్లి నీళ్లన్నీ తోడిన తర్వాత చూస్తే మోటార్లు పూర్తి స్థాయిలో పాడైపోయినట్లుగా తేలింది. ప్రొటెక్షన్ వాల్, క్రేన్లు, లిఫ్టు కూలడంతో మోటార్లు ధ్వంసం అయ్యాయి. అన్నారం పంప్‌హౌజ్‌లోనూ మోటార్లు దెబ్బతిన్నాయి. ఇక, ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీ వంతు వచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ వంతెన ఒక్కసారిగా కొంతమేర కుంగింది. మేడిగడ్డ బ్యారేజీలోని రెండు పిల్లర్లు పెద్ద శబ్దంతో కుంగిపోయాయి. భారీ శబ్ధంతో బ్యారేజీ 7వ బ్లాక్‌లోని 20వ నంబర్ పిల్లర్ రెండు ఫీట్ల మేర కుంగిపోయింది. దీనితో దానికి ఇరువైపులా ఉన్న 19, 21వ పిల్లర్లపైనా ప్రభావం పడిరది. ఫలితంగా, 18 ,19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన కుంగిపోయింది. ఈ క్రమంలో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఎన్నికల వేళ కలకలం రేపింది. మొత్తానికి ప్రజల్లో ఆలోచనను రేకెత్తించింది.
అసలే పోలింగ్ తేదీ సమీపిస్తోంది. రాజకీయ పార్టీలన్నీ క్షేత్రస్థాయిలోకి వెళ్లిపోయాయి. నియోజకవర్గాల్లో పరిస్థితి రణరంగాన్ని తలపిస్తోంది. నిత్యం నియోజకవర్గాలన్నీ ఆయా పార్టీల అధినేతలు, అగ్రనేతల బహిరంగ సభలతో హోరెత్తిపోతున్నాయి. ఈ సమయంలోనే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోవడం తీవ్ర స్థాయిలో చర్చను లేవనెత్తింది. దీంతో, ప్రభుత్వం వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఈ పరిణామానికి, ప్రభుత్వం, అధికారయంత్రాంగం బాధ్యులు కాదన్న కోణంలో ప్రతిస్పందన వచ్చింది. అయితే, అది కూడా వికటించిన పరిస్థితి నెలకొంది.
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోవడంతో లక్ష్మి బ్యారేజీలో నీటిని దిగువకు వదిలేశారు. అయితే, అది మరువక ముందే అన్నారం బ్యారేజీలో రెండు గేట్ల వద్ద లీకేజీని గుర్తించారు. నీరు లీకవుతుండటం అధికారుల దృష్టికి రావడంతో వెంటనే ఆ అంశం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని అన్నారం బ్యారేజీ గేట్లు మూసి వేసిన తర్వాత కూడా 28, 38 గేట్‌ల ద్వారా కొంత నీరు బయటకు వెళ్లడాన్ని గమనించారు. నీటిపారుదల శాఖ అధికారులు చిన్నబోట్లలో ఇసుక బస్తాలు వేసి నీటి ప్రవాహాన్ని నిరోధించేందుకు చర్యలు చేపట్టారు. అధికారులు కూడా ఒక గేటు ఎత్తి 2,357 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
నిరుపయోగంగా మిగిలింది
ఈ యేడాది అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీలోని ఒక పిల్లర్ భూమి లోకి కుంగిపోగా, మరో ఆరు పిల్లర్లూ దెబ్బతిన్నాయి. బ్యారేజీ కుంగిపోవడం ప్రారంభించడంతో నీటిపారుదలశాఖ అధికారులు పోలీసుల సాయంతో బ్యారేజీని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రాజెక్టు కట్టి నాలుగేళ్లు కూడా కాకముందే ఇలాంటి ప్రధాన సమస్యలు తలెత్తుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యింది. ఈ క్రమంలోనే నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించింది. బ్యారేజీ కుంగిన ప్రాంతాన్ని పరిశీలించి, బ్యారేజీలో సాంకేతిక సామర్థ్యాన్ని అంచనా వేసి కేంద్రానికి, రాష్ట్రానికి నివేదిక పంపించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ ఇంజనీర్ల వైఫల్యం, డిజైన్ లోపం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని ఆ నివేదికలో తేల్చి చెప్పింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలుగా నిర్థారించింది. అన్నారం బ్యారేజీ పియర్స్ కింద బుంగలు ఏర్పడడానికి కూడా ఇదే కారణమని తేల్చింది. ఇదే డిజైన్‌తో నిర్మించిన సుందిళ్ల బ్యారేజీకి కూడా ముప్పు పొంచి ఉందని నివేదికలో చెప్పింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం పునాది కింద ఇసుక కొట్టుకుపోయింది. ఫౌండేషన్‌కు ఉపయోగించిన మెటీరియల్ సరిగ్గా లేదు. బ్యారేజీపై రోడ్డు ఉండడం సాంకేతిక వైఫల్యం అయ్యింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పూర్తి స్థాయిలో విఫలం అయ్యాయి. బ్యారేజీని నీటిపై తేలేటట్టు చేసి, కాంక్రీట్ స్ట్రక్చర్ నిర్మించారు. 7వ బ్లాక్‌లోని 11 పిల్లర్లను పునాదులతో సహా తొలగించాలి. మరమ్మతు చేయరాదు, మిగతా బ్లాకులు కూడా ఇలానే ఉంటే బ్యారేజ్ మొత్తం కొత్తది కట్టాలి. కేంద్ర బృందం ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే.. ‘మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే.. ప్లానింగ్, డిజైనింగ్, క్వాలిటీ, కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ అంశాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.. ప్లానింగ్ ప్రకారం డిజైన్ జరగ లేదు.. రూపొందించిన డిజైన్ ప్రకారం కూడా నిర్మాణం జరగలేదు..’ అని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ టీమ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. నిర్మాణంలో డ్యామ్ సేఫ్టీ యాక్ట్(2021) నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించా రని, ఇది ఘోర తప్పిదమని కేంద్ర బృందం తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదంవల్ల ప్రజల జీవితాలకు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని తేల్చింది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్‌ను పూర్తిగా తొలగించి పునర్నిర్మించాలని సూచించింది. ఇతర బ్లాక్‌లతో పాటు మిగిలిన రెండు రిజర్వాయర్ల సైతం బలహీనంగా ఉన్నందున మరమ్మతులు, తనిఖీ పూర్తయ్యేదాకా నీళ్లు నిల్వ చేయవద్దని స్పష్టం చేసింది.
కుంగిన మేడిగడ్డ సహా కాళేశ్వరం బ్యారేజీలన్నీ ప్రమాదంలో ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు నిల్వ చేయవద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నివేదికను ఇచ్చాక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, నీటి పారుదల శాఖ అధికారులు వాస్తవాన్ని గ్రహించారు. పొరపాటును అంగీకరించి దిగివచ్చారు. బ్యారేజీలు ప్రమాదంలో ఉన్నట్లు తమ పరిశీలనలోనూ తేలడంతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని బ్యారేజీలను గుట్టుగా ఖాళీ చేసేశారు. తొలుత మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ, ఆ తర్వాత అన్నారం సరస్వతి బ్యారేజీల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేసిన ఇంజినీర్లు, ఆ తర్వాత సుందిళ్ల పార్వతి బ్యారేజీ గేట్లను కూడా ఎత్తివేశారు. ఫలితంగా సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరందించే 23 టీఎంసీల నీళ్లన్నీ వృథాగా సముద్రం పాలయ్యాయి.
అయితే, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయిన ఘటన మరవక ముందే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో నాణ్యతా లోపం బయటపడిరది. ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం వద్ద నిర్మించిన సరస్వతి బ్యారేజీలోని రెండు గేట్ల వద్ద జరిగిన లీకేజీతో నీరు ఉబికి వచ్చింది. బ్యారేజీలో 38 నుంచి 40 పిల్లర్ల మధ్య ప్రాజెక్టుకు బుంగ ఏర్పడిరది. వరద నీరు విడుదలయ్యే ప్రదేశంలో అడుగు నుండి నీరు పైకి ఉబికి వచ్చింది. ఇది గమనించిన వెంటనే అప్రమత్తమైన ఇంజనీరింగ్ అధికారులు ఇసుక సంచులు వేసి ఊటలను నిలువరించే ప్రయత్నం చేశారు. బుడగలు వచ్చే ప్రదేశంలో ఇసుక, మెటల్ నింపిన సంచులను వేయించారు. ఈ ఊటలతో పాటు నీటిలోని ఇసుక ఉబికి పైకివస్తే ప్రమాదమని అధికారులు భావించి.. అప్పటికే సరస్వతి బ్యారేజీలో 8 టీఎంసీల నీళ్లుండగా గేట్లు తెరిచి దాన్ని కూడా ఖాళీ చేశారు. ఈలోగా కేంద్ర బృందం నివేదిక ఇవ్వడంతో అధికారులు మరింత అప్రమత్త మయ్యారు. తర్వాత సుందిళ్లనూ ఖాళీ చేశారు. మొత్తంగా మేడిగడ్డ కుంగిన కారణంగా మూడు రిజర్వాయర్లలోని 23 టీఎంసీలను ఖాళీ చేసేశారు. బ్యారేజీలలో నీళ్లన్నీ దిగువకు వదలడంతో గోదావరి నది ఇప్పుడు వెలవెల బోతోంది. నాలుగేళ్ల క్రితం నాటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఇటు ఎగువన గోదావరిఖనిలో, కాస్త దిగువన మంథనిలో నాలుగేండ్లుగా నిండుగా కనిపించిన గోదావరి నది ఇప్పుడు బోసిపోయింది. నదిలో రెండు వైపులా ఒడ్డును తాకుతూ ప్రవాహం ఉండేది. కానీ, ఇప్పుడు నీరు ఖాళీ అవడంతో ఇసుక తేలి కనిపిస్తున్నది. ఈ కారణంగా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో గోదావరికి ఒడ్డున ఉన్న పంట భూములు కూడా బయటపడ్డాయి. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగడంతో ఎగువనున్న అన్నారం బ్యారేజీలోకి ఎత్తిపోతలు నిలిచిపోవడంతో పాటు.. ఇప్పటికే బ్యారేజీలో ఉన్న నీళ్లు కూడా పూర్తిగా దిగువకు వదిలేయడంతో మంథని గోదావరిలోను ఇదే పరిస్థితి. గోదావరి రెండు పాయలుగా విడిపోయింది. పుష్కర ఘాట్ వద్ద నీటిమడుగు, నది మధ్యలో చిన్నపాటి రాతి గుట్ట కనిపిస్తోంది, అలాగే నాలుగేళ్లుగా నీటిలో మునిగి ఉన్న రామలింగేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తుండగా రెండు రోజులుగా ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు. ఒకప్పటి గోదావరిని మళ్లీ చూస్తున్నామని పుణ్య స్నానానికి వచ్చిన భక్తులు చెబుతున్నారు. గోదావరిలో నీరు తగ్గిందని తెలిసి చాలామంది చూసేందుకు వస్తున్నారు.
వెంటాడుతున్న లోపాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్ట్ కాళేశ్వరం. దాదాపు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును గొప్పగా ప్రచారం చేసుకుంటోంది బీఆర్‌ఎస్ సర్కార్. విపక్షాలు మాత్రం ఆది నుంచి కాళేశ్వరాన్ని తెల్లఏనుగు అనే అభివర్ణిస్తున్నాయి. విపక్షాలు ఆరోపిస్తున్నట్లే మొదటి మూడేళ్లపాటు కాళేశ్వరం మోటార్లు పని చేయలేదు. భారీ వర్షాలతో ప్రాజెక్ట్ నుంచి నీటిని ఎత్తిపోయాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత రెండేళ్లు వరదలకు ముందే 35 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసినా తర్వాత భారీ వర్షాలకు వరదలు రావడంతో ఎత్తిపోసిన నీరంతా మళ్లీ నదిలో కలిసి పోయింది. ఈ క్రమంలోనే గత యేడాది జూలైలో గోదావరి నదికి భారీ వరదలు వచ్చినప్పుడు సరస్వతీ బ్యారేజీగా పిలుచుకుంటున్న అన్నారం బ్యారేజీ, కన్నెపల్లి బ్యారేజీ పూర్తిగా మునిగిపోయాయి. దీంతో కాళేశ్వరం బాహుబలి మోటర్లు జలమయమయ్యాయి. కన్నెపల్లి పంపు హౌస్‌లోకి భారీగా వరద చేరడంతో 17 బాహుబలి మోటార్లు నీటిలో మునిగిపోయాయి. పంప్ మోటార్లపైన 10 మీటర్ల ఎత్తు వరకు నీరు చేరి, బురద ముంచెత్తింది. మోటార్లు రన్ చేయాలంటే నీటితో పాటు బురదను ఎత్తిపోయాల్సిన పరిస్థితి వచ్చింది. అటు మంథని మండలంలో ఉన్న అన్నారం సరస్వతీ పంప్ హౌస్ కూడా నీట మునిగింది. మొత్తం 12 మోటర్లలోకి నీళ్లు చేరాయి. ఈ పరిణామం నీటిపారుదల శాఖకు తలకుమించిన భారంగా మారిపోయింది. మేడిగడ్డ గ్రామం వద్ద ఉన్న కన్నెపల్లి పంప్‌హౌస్ పూర్తిగా ధ్వంసమవగా, పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలో గోదావరి ఎగువన అన్నారం వద్ద ఉన్న మరో మెగా పంప్ హౌస్‌కు కూడా భారీ నష్టం వాటిల్లింది. వీటిని పునరుద్ధరించడానికి దాదాపు రూ. 1500 కోట్లు ఖర్చయినట్లు అంచనా.
కరెంటు బిల్లుతో రాష్ట్ర ఖజానా ఖాళీ
కేసీఆర్ ఆనాలోచిత నిర్ణయం వల్ల లక్షల కోట్ల రూపాయలు నిరుపయోగం అయ్యాయని విమర్శలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. గత యేడాది వరదల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌస్‌లు మునిగిపోయే సమయానికి ప్రాజెక్టు నిర్మించి మూడేళ్లు గడిచాయి. ఆ మూడేళ్ల కరెంటు బిల్లుల లెక్కలు చూసిన వాళ్లందరికీ కళ్లు బైర్లు కమ్మాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తొలి ఏడాది 2019-20లో 66 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా.. రూ. 1105.82 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. ఇక, రెండో ఏడాది 2020-21లో 33 టీఎంసీల నీటిని తరలించగా రూ. 984.77 కోట్ల బిల్లు వచ్చింది. మూడో ఏడాది 2021-22లో తొలి ఆరు నెలలు చూస్తే.. మూడేళ్లలో మొత్తం రూ. 3,600 కోట్ల విద్యుత్ బిల్లు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయక సాగర్‌కు నీళ్లను ఎత్తిపోశారు. ఇందుకోసం మూడేళ్లలో రూ. 866.21 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. ఈ లెక్కన చూస్తే ఒక టీఎంసీ నీటి ఎత్తిపోతకు రూ.25.7 కోట్ల రూపాయల కరెంట్ బిల్లు వచ్చిందని అధికారులు లెక్కలు వేశారు. ఈ రకంగా చూసుకుంటే ఎకరం సాగు కోసం కరెంట్ బిల్లే 21 వేల 810 రూపాయలు వస్తుందని లెక్క కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 19 పంప్ స్టేషన్లు నిర్మించారు. మొత్తం 82 మోటార్లు బిగించారు. ఇందుకోసం 4 వేల 627 మెగావాట్ల పవర్ అవసరం అవుతుందని ప్రభుత్వం మొదట అంచనా వేసింది. యూనిట్‌కు రూ. 6.30ల చార్జ్ పడుతుందని, ఈ లెక్కన ఏడాదికి 8 వేల 541 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
మరోవైపు ప్రభుత్వ అధికారులు మొదటి మూడేళల్లో 140 టీఎంసీల నీటిని కాళేశ్వరం నుంచి ఎత్తిపోశామని చెప్పినా.. అందులో వినియోగించింది సగం కూడా లేదంటున్నారు సాగునీటిరంగ నిపుణులు. 2001 జూలై మొదటి వారంలో మూడు పంప్‌హౌస్‌లను ఆన్ చేసి నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తి పోశారు. అయితే తర్వాత భారీ వర్షాలు రావడంతో గోదావరికి వరద వచ్చింది. ఎల్లంపల్లి గేట్లు ఎత్తి ఆ నీటిని అనివార్యంగా దిగువకు వదిలేశారు. దీంతో మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీటిని ఎల్లంపల్లి ద్వారా మళ్లీ నదిలోకి పంపించారు. దీనిపై అప్పట్లో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుతో నిర్వహణా భారం తప్ప పెద్దగా ఉపయోగం లేదని అంటున్నారు. ఈ కరెంటు బిల్లుల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగుచేసే ఆయకట్టు మొత్తాన్ని ఈ యేడాది భారీగా తగ్గించారు. ఎందుకంటే.. ఈ ప్రాజెక్టు నీటిద్వారా సాగుచేసే ఎకరాల మొత్తం పెంచితే. కరెంటు బిల్లు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తుందని ప్రభుత్వం గ్రహించింది.
వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో 37 లక్షల 50వేల ఎకరాలకు సాగునీరు అందు తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రాజెక్టు వ్యయం ఆధారంగా ఈ మేరకు లెక్కలు వేసింది. కానీ, గడిచిన ఏడాది వరదల్లో పంప్‌హౌస్‌లు మునిగిపోకముందే 2022 ఖరీఫ్ సాగునీటి ప్రణాళికలో వీటిని పక్కన పెట్టేసింది. అన్ని మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా 39 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వం ఖరీఫ్ సాగునీటి ప్రణాళిక ప్రకటించింది. అందులో కేవలం 57 వేల ఎకరాలకే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగు నీరు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రాజెక్టు ప్రారంభించిన మూడో ఏడాదిలో 57 వేల ఎకరాలకే ఎందుకు పరిమితం చేశారో అన్నది చాలామందికి అంతుచిక్కలేదు. గోదావరి నీటిని కూడా 5.70 టీఎంసీలే ఎత్తిపోయాలని నిర్ణయించింది. ఎందుకంటే ఎత్తిపోతల కరెంటు బిల్లులు వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఆ అనుభవంతోనే కాళేశ్వరం ద్వారా కేవలం 57 వేల ఎకరాలకే నీరు ఇవ్వాలని అధికారులు కుదించారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ప్రకటించిన 37 లక్షల 30 వేల ఎకరాలకు కాళేశ్వరం నీళ్లిస్తే రాష్ట్ర ఖాజానా ఖాళీ అవుతుందని గ్రహించే ఈ నిర్ణయం తీసుకున్నారని సాగునీటిరంగ నిపుణులు నిర్థారణకు వచ్చారు.
జాతీయ హోదా డిమాండ్ వెనుక
వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు రాష్ట్రప్రభుత్వం అధికారికంగా ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా అడగలేదని చెబుతున్నారు. లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసిన తర్వాత దానికి వయబులిటీ లేదని నిర్థారణ అయ్యాక.. ఆ సమస్యను పక్కదారి పట్టించేందుకే తెలంగాణ ప్రభుత్వం జాతీయ హోదా గురించి డిమాండ్లు మొదలు పెట్టిందని అంటున్నారు. జాతీయ హోదా కావాలంటే దాని నీటి లభ్యత, విద్యుత్, తాగునీరు, పునరావాసం, అంతర్‌రాష్ట్ర, సమస్యలు, ఆర్థిక వెసులుబాటు పరిశీలించి సీడబ్ల్యూసీ అనుమతి ఇస్తుంది. అప్పుడు ప్రాజెక్టు అడ్వైజరీ కమిటీ క్లియరెన్సు ఇస్తుంది. ఆ తర్వాత జాతీయ హోదాకు హైవపర్ స్టీరింగ్ కమిటీ ప్రతిపాదన చేస్తుంది. అప్పుడు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ పరిశీలించి ఆమోదం ఇస్తుంది. ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్ ఆమోదం వస్తుంది. అప్పుడే జాతీయ ప్రాజెక్టుగా పూర్తిస్థాయి అనుమతి లభిస్తుంది. ఇవి ఏవీ లేకుండా ప్రాజెక్టు కట్టేసి, జాతీయ హోదా డిమాండ్ చేయడం, కేవలం వైఫల్యాల నుంచి తప్పించుకునే ప్రయత్నమే అన్న వాదనలు ఉన్నాయి.
ఇంజనీరింగ్ అద్భుతం!
నిర్వహణ అంతులేని భారం
గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే భారీ ఎత్తి పోతల పథకం అని అప్పటి టీఆర్‌ఎస్.. ఇప్పటి బీఆర్‌ఎస్ నేతలు కోరస్ పాడారు. ఇదొక ఇంజనీరింగ్ అద్భుతమని, కేసీఆర్ అపర భగీరథుడని, కాళేశ్వరం ప్రాజెక్టులో ఉపయోగించినవి బాహుబలి మోటార్లని అప్పట్లో ప్రతిచోటా ప్రచారం చేశారు. కానీ ప్రపంచ అద్భుత కాళేశ్వరం, కేసీఆర్ రీ ఇంజనీరింగ్ ప్రాజెక్టు గోదావరి వరద ఉధృతికి కకావికలమైంది. మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటులో పాతుకు పోయింది. అప్పటి వరదల్లో బాహుబలి మోటార్లు తుక్కుతుక్కయ్యాయి. ఇప్పుడు మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటు, అన్నారంలో బుంగలు కాళేశ్వరం కీర్తిని అమాంతం పాతాళంలోకి పాతరేశాయి. ఆగమేఘాల మీద పనులు, హడావిడి రీ ఇంజ నీరింగ్‌లు, పంపు హౌస్‌లు కనీస నాణ్యతని, భద్రతను గాలికొదిలి నిర్మించడం చూస్తే.. ఇప్పుడు దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నీరు పల్లమెరుగుతుందన్న సహజత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ.. ప్రకృతి నియమాలను కాలదన్ని నీటి ప్రవాహానికి ఎదురొడ్డి తోడిపోస్తామంటూ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేయించారన్న ఆరోపణలు ఇప్పుడు బలపడుతున్నాయి. బడ్జెట్ పెంచుకోవాలనే.. ఫలితంగా పంచుకోవాలనే బడా కాంట్రాక్ట్ లీడర్ డ్రివెన్ ప్రాజెక్టే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ప్రజాప్రయోజన ప్రాజెక్టు కాదని, సుస్థిర ప్రాజెక్ట్ అసలే కాదని విమర్శకులు కోడైకూస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు వరద గేట్ల సామర్థ్యం రెండున్నర, మూడు లక్షల క్యూసెక్కులు, కానీ, గేట్ల ప్రీబోర్డుపై నుంచి వచ్చిన ఆరున్నర లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని నిలబడిరది. కానీ, కాళేశ్వరం విషయంలో జరిగింది వేరు. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినా.. దాని సుస్థిరతపై శ్రద్ధ లేకపోవడం వల్లే మునిగిందంటున్నారు. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించి ఉంటే ఇంత విధ్వంసం ఉండేది కాదని, మంచిర్యాల, మంథని, రామగుండం, గోదావరిఖని ప్రాంతాల్లో ప్రజల ఆవాసాలు, వేల ఎకరాల పంటలు మునిగి, వందల కోట్ల నష్టం జరిగేది కాదని వాదిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పనిచేసినా నష్టమే, చేయకున్నా నష్టమే. ప్రాజెక్టు నడిస్తే ఏటా ఖర్చు రూ. 15వేల కోట్లు. అయినా ప్రతిపాదిత లక్ష్యం మేరకు చిట్ట చివరివరకు నీళ్లు ఇవ్వడం అసాధ్యం. ఎక్కడి వరకు ఎత్తిపోతలు పంటలకు ఆర్థికంగా అనువుగా ఉంటుందో, అక్కడి వరకే కాళేశ్వరంను కట్టడి చేయాలి. లేకపోతే అది తెలంగాణను మింగేసే పరిస్థితి వస్తుంది. గోదావరి నుంచి నీటిని అనేక దశల్లో మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లకు ఆపైన కూడా ఎత్తిపోయడం, కోట్ల రూపాయల కరెంటు బిల్లులు ఇతరత్రా భారం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టులా మారుతుందన్న వాదనలు చుట్టుముడుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై ఎన్నికలవేళ విపక్షాలన్నీ కేసీఆర్‌కు ఉచ్చు బిగుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందంటూ ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ఇక, భారతీయ జనతాపార్టీ నేతలు మరింత దూకుడుగా ముందుకెళ్తున్నారు. రాష్ట్రస్థాయి నేతల నుంచి జాతీయస్థాయి నేతలు, కేంద్రమంత్రులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అవినీతి మయమన్న ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక, ప్రచారంలో భాగంగా తెలంగాణకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా.. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్రంగా విచారణ జరిపించి కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఇదే అంశంపై దృష్టపెడతా మని హెచ్చరించారు.
– సుజాత గోపగోని : సీనియర్ జర్నలిస్ట్