– డి. అరుణ

పాముకి పాలుపోసి పెంచితే అది మనను కూడా కాటేస్తుందన్న విషయం తెలిసీ తెహ్రెక్‌ ఇ తాలిబాన్‌ పాకిస్థాన్‌ (టిటిపి) పుష్టిగా పెరిగేందుకు దోహదం చేసిన పాకిస్థాన్‌ నేడు అది చిమ్ముతున్న విషాన్ని తట్టుకోలేక అల్లాడిపోతున్నది. దాని కార్యకలాపాలను నియంత్రించమంటూ పొరుగుదేశంలో అధికారంలో ఉన్న తమ తాలిబన్‌ సోదరులను కోరినప్పటికీ, వారు అది మీ అంతర్గత సమస్య అంటూ స్పష్టం చేయడంతో ఆగ్రహించిన పాక్‌ ఒక అమానవీయ ఘట్టానికి తెరలేపింది. వాస్తవానికి వారి మధ్య ప్రపంచమంతా భావించేంత సన్నిహిత సంబంధాలు లేవు. మతం ఆధారంగా పాకిస్తానీయులు తాలిబన్లు తమ సోదరులని భావించినప్పటికీ, ఆ సోదరభావం కొన్ని విషయాలకే పరిమితమంటూ ఎప్పటికప్పుడు తాలిబన్‌ వారికి తెలియచెప్తూనే ఉన్నది. ఎందుకంటే, ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు రేఖ అయిన డ్యురాండ్‌ లైన్‌ అస్తిత్వాన్ని ఇతర ప్రభుత్వాలు సరే తాలిబన్‌ సైతం గుర్తించదు. అందుకు కారణం, ఆ రేఖను పష్తూన్‌ తెగలు నివసించే ప్రాంతంలో నిట్టనిలువుగా గీయడం.


ప్రస్తుతం దేశంలో టిటిపి ఆధ్వర్యంలో జరుగుతున్న దాడులకు పాక్‌ ఆగ్రహించింది. పాకిస్తాన్‌ భద్రతా దళాలపైనే కాదు, వారు పెంచి పోషించి, ముద్దుగా సాకుతున్న తీవ్రవాద సంస్థలకు సంబంధించిన కీలక వ్యక్తులు కూడా గుర్తు తెలియని వారి చేతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. దీనితో సహనం కోల్పోయిన పాక్‌ తమ దేశంలో నివసిస్తున్న ఆఫ్గన్‌ శరణార్థుల హస్తం ఇందులో ఉందంటూ తిరిగి వారి దేశానికి పంపిస్తున్నామంటూ ప్రకటించడమే కాదు, తక్షణమే దానిని నిర్దాక్షిణ్యంగా అమలులో పెట్టింది. దీనిపై తాలిబన్లు స్పందించారు కానీ వారు ఆశించిన రీతిలో కాదు. వారు ఇందుకు మీరే మూల్యం చెల్లిస్తారంటూ హెచ్చరించారు. ప్రస్తుతం వారిని ఆఫ్గన్లు తమ దేశంలోకి అనుమతించక పోవడంతో వారు రెండు దేశాల మధ్య సరిహద్దులలో దయనీయమైన స్థితిలోఉన్నారు.

 పాక్‌ తమ దేశంలో నుంచి వెళ్లగొట్టిన లక్షలాదిమంది ఆఫ్గన్లకు ఈ శీతాకాలంలో ఆవాసం కల్పించడమంటే తాలిబన్లకు తక్షణమే సాధ్యమయ్యే విషయం కాదు. కొండ ప్రదేశమైన ఆఫ్గన్‌లో శీతాకాలంలో చలి మైనస్‌ డిగ్రీలలోకి వెళ్లిపోతుంది. ఈ చలికి తట్టుకోలేక మనుషులు మరణించడం కూడా కద్దు. ఈ నేపథ్యంలో నవంబర్‌ నెలలో పాకిస్థాన్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం నిస్సందేహంగా అమానవీయం. రెండు మూడు తరాలుగా పాక్‌లో నివసిస్తున్న వారిని, చట్టబద్ధమైన పత్రాలు కలిగి ఉన్నవారినీ కూడా తిప్పి పంపు తుండడంతో అమాయక ఆఫ్గన్లు అల్లాడి పోతున్నారు. తిప్పి పంపే ప్రక్రియ ప్రారంభమైన తర్వాత టిటిపి దాడులు పెరగడంతో పాక్‌ ఉగ్రంగా స్పందించింది. తాము తాలిబాన్‌ ప్రభుత్వానికి తమ గుర్తింపును ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించింది. చిత్రమేమిటంటే, పాకిస్తాన్‌లో ప్రస్తుతం ఉన్నది ఆపద్ధర్మ ప్రభుత్వం. సాధారణంగా ఆపద్ధర్మ ప్రభుత్వాలకు ఇంతటి భారీ నిర్ణయాలు తీసుకునే అవకాశముండదు. కారణం, వారు స్వయంగా మెజారిటీ కలిగినవారు కాకపోవడం. కానీ, పాకిస్తాన్‌ తాత్కాలిక ప్రధాని అన్వరుల్‌ హక్‌ కాకడ్‌ మాత్రం అంతర్జాతీయ పరిణామాలకు దారి తీయగల నిర్ణయాలను ప్రకటించేస్తున్నారు.

వాస్తవానికి, ఆఫ్గన్‌ శరణార్ధులు కేవలం పాకిస్తాన్‌లో మాత్రమే లేరు. వారు పాక్‌ తర్వాత అత్యధిక సంఖ్యలో ఇరాన్‌లో, తర్వాత తజకిస్తాన్‌, టర్కీ, ఉజ్బె కిస్తాన్‌లో కూడా ఉన్నారు. వారి పరిస్థితి కూడా అత్యంత దయనీయం. ఇందుకు తోడుగా, ప్రతిదేశంలోనూ వీరికి పరిమిత హక్కులు, కనీస లాభాలు తప్ప పౌరసత్వానికి స్పష్టమైన మార్గం లేదు.

సౌదీ నిధులతో పాకిస్తాన్‌లోని మదరాసాలలో విద్యనార్జించినవారు తాలిబన్‌. ఈ సంస్థను 1990వ దశకం మధ్యలో ఒంటికంటి ముల్లా మహ్మద్‌ ఒమర్‌ కాందహార్‌లో స్థాపించాడు. పాకిస్తాన్‌ వీరిని పెంచి పోషించడంలో కీలక పాత్రను పోషించింది. ముఖ్యంగా, 1980వ దశకంలో సోవియట్‌ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడేందుకు తన శిక్షణా శిబిరాలు ఒకదానిలో మొల్లా ఒమర్‌కు శిక్షణను ఇచ్చింది. ఆ సంస్థ నాయకత్వానికి సురక్షితమైన ఆశ్రయాన్ని కల్పించడమే కాదు, సైనిక, దౌత్యపరమైన అంశాలపైనా, నిధుల సేకరణపైనా సలహాల నిస్తుండేది. అందుకే, తాలిబన్‌పై పాకిస్తాన్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ)కు ఉన్నంత పట్టు మరే సంస్థకు, దేశానికీ లేదు. అయితే, తాలిబన్‌ మాత్రం ఐఎస్‌ఐకు పూర్తిగా లొంగలేదు. 1990వ దశకం చివర్లో ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ ఆఫ్గనిస్తాన్‌ ప్రభుత్వాన్ని తాలిబన్లు ఏర్పాటు చేసినప్పుడు, దానిని చట్టబద్ధమైన దానిగా గుర్తించిన మూడు దేశాలలో పాక్‌ కూడా ఒకటి కాగా, మిగిలినవి సౌదీ అరేబియా, యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్‌. అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌లాడెన్‌కు, తాలిబన్లకు మధ్య పొత్తును కుదిర్చింది కూడా ఐఎస్‌ఐ యేనంటూ 9/11 కమిషన్‌ పేర్కొన్నదంటే, ఆ సంస్థ ఏ స్థాయిలో తాలిబన్‌తో అనుబంధాన్ని కలిగి ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.

 9/11 సంఘటన నేపథ్యంలో అమెరికా తీవ్రవాదంపై యుద్ధాన్ని ప్రకటించి, ఆఫ్గన్‌పై దాడులను ప్రారంభించినప్పుడు తాలిబన్‌ నాయకత్వం, కరుడుగట్టిన తాలిబన్‌ నాయకులు, కార్యకర్తలు కాందహార్‌ నుంచి పాకిస్తాన్‌ వైపు పారి పోయి, క్వెట్టా నగరం పరిసరాల్లో, బెలూచిస్తాన్‌లో స్థిరపడ్డారు. 2004 నాటికి తాలిబన్‌ను ఏకం చేసి ఆఫ్గనిస్తాన్‌లో యుద్ధాన్ని ఒమర్‌ ప్రారంభించాడు. ఈ సమయంలో పాక్‌ వారికి కీలక సహాయాన్ని, తోడ్పాటును అందించింది. అప్పుడు పాక్‌ సహాయం లేకపోయి ఉంటే తాలిబన్‌ ఎన్నటికీ కోలుకునేవారు కాదు. తాలిబన్‌ ఉనికికి సంబంధించిన ప్రతి అంశంలోనూ పాక్‌ జోక్యం చేసుకుంటూ వచ్చింది. మూడేళ్ల కిందట అమెరికా ఆఫ్గన్‌ను ఖాళీచేసి వెళ్లిన వెంటనే తాలిబన్‌ తమ ప్రభుత్వాన్ని ప్రకటించు కున్నప్పుడు కూడా నాటి ఐఎస్‌ఐ అధిపతి హమీద్‌ ఫైజ్‌ ఆఫ్గన్‌లోని ఒక హోటల్‌లో కనిపించడం, అప్పటి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆఫ్గన్‌ ` పాక్‌ భాయీ భాయీ అన్నట్టుగా వ్యాఖ్యానించడం, తాలిబన్‌ ప్రభుత్వాన్ని వెంటనే గుర్తించడం అత్యంత సహజంగా జరిగిపోయాయి.

ఆఫ్గనిస్తాన్‌ను తమ ఐదవ ప్రావిన్సులాగా పాక్‌ భావిస్తూ వచ్చింది. ముఖ్యంగా, తొలి తాలిబన్‌ ప్రభుత్వ సమయంలోలా తాము హవా చెలాయించ వచ్చనుకుంది. కానీ, అది తొలి తాలిబన్‌ ప్రభుత్వం నుంచే వస్తున్న సంకేతాలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయిందా లేక విస్మరించిందా అన్నది పాక్‌కే తెలియాలి. 1990వ దశకం చివర్లో ముల్లా ఒమర్‌ అధికారంలో ఉన్నప్పుడు కూడా బ్రిటిష్‌ 1890ల్లో ఆఫ్గన్‌ ` పాకిస్తాన్‌ మధ్య గీచిన సరిహద్దు, ‘డ్యురాండ్‌ లైన్‌’ చట్టబద్ధతను గుర్తించేందుకు తిరస్కరించాడు. పాకిస్తానీ నగరాలలో సైన్యం, ఐఎస్‌ఐలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ, డజన్ల కొద్దీ తీవ్రవాద దాడులకు పాల్పడిన పాకి స్తానీ తాలిబన్‌కు ఆఫ్గన్‌ తాలిబన్‌ కొంత సహాయాన్ని అందిస్తుంటుంది. పాకిస్తానీ తాలిబన్‌ కూడా ముల్లా ఒమర్‌ను తమ నాయకుడిగా గుర్తిస్తుంది, ఒమర్‌ కూడా దాడులకు పాల్పడుతున్న పాకిస్తానీ తాలిబన్‌ను బహిరంగంగా విమర్శించలేదు.

పాక్‌ యూ టర్న్‌కి కారణం?

తాలిబన్‌తో ఇంత సన్నిహిత సంబంధాలు ఉన్నా, పాక్‌ ఇప్పుడు యూటర్న్‌ తీసుకోవడానికి కారణం ఏమిటన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. దీనికి సమాధానంగా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అందులో మొదటిది, ప్రస్తుతం పాక్‌ ఆర్ధిక సంక్షోభంలో ఉండి, తన పౌరులకేసరైన ఆహారాన్ని, జీవనాన్ని అందించలేక పోతున్నది. ఈ సమయంలో అదనంగా దాదాపు 23 లక్షలమందికి ఆహారాన్ని అందించడం తేలికైన విషయం కాదు. ప్రధానంగా పాక్‌ ఈ వాదననే బయిట చెలామణి చేస్తోంది. అయితే, టిటిపి పాకిస్తాన్‌ వ్యాప్తంగా నిర్వహిస్తున్న దాడులు, వ్యక్తులను హననం చేస్తున్న తీరు, ఆఫ్గన్‌ ప్రభుత్వం వారిని నియంత్రించకపోవడం పాక్‌ నాయకత్వం సహనానికి పరీక్ష పెడుతున్నాయని, అందుకే ఏమీ చేయలేక, శరణార్థులపై పడ్డారని అనేవారు లేకపోలేదు. వీటన్నింటినీ మించిన కారణం మరొకటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే విదేశీ సంస్థలు ఇచ్చే నిధులు. అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో పాక్‌ నిలవడాన్ని ఆ దేశ సైన్యం, నాయకులు విపరీతంగా క్యాష్‌ చేసుకున్నారు. ఆఫ్గన్‌లో తీవ్రవాదంపై యుద్ధం పేరుతోనూ అమెరికా నుంచి ఇయు నుంచి డాలర్లను తీసుకున్నారు. అలాగే, యుద్ధం కారణంగా ఆఫ్గన్‌లో ఉండలేక పారిపోయి వచ్చిన శరణార్థులను చూపి, వారికి తామేదో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్న పేరుతో ఐక్యరాజ్య సంస్థ హక్కుల సంస్థ (యుఎన్‌సిఆర్‌) నుంచి, ఇయు నుంచి, మానవ హక్కుల సంస్థల నుంచి మిలియన్ల కొద్దీ డాలర్ల రూపంలో భారీ ఎత్తున నిధులు అందుకున్నారు. కొవిడ్‌ `19 అనంతర ప్రపంచం ఆర్ధిక మాంద్య పరిస్థితులను ఎదుర్కొం టున్న నేపథ్యంలో ఈ నిధులు తగ్గడంతో పాటుగా, ఐఎంఎఫ్‌ కూడా అప్పు ఇచ్చేందుకు అనేక షరతులను పెడుతోంది. ఐఎంఎఫ్‌ నుంచి మరింత రుణాన్ని అందుకునేందుకే, టిటిపి చేత తమపై దాడులను ఐఎస్‌ఐ చేయించుకుని, తాము కూడా తీవ్రవాద బాధితులమే అని చూపేందుకు ప్రయత్నం చేస్తోందనే అనే వర్గం లేకపోలేదు.

జాతీయతా భావాలకు ప్రాధాన్యమిస్తున్న తాలిబన్‌?

పాకిస్తాన్‌కు, ఆఫ్గనిస్తాన్‌కు మధ్య ఎప్పుడూ ఉద్రిక్తభరితమైన సంబంధాలే ఉంటూ వచ్చాయి. పాకిస్తాన్‌ సృష్టిని, ఉనికిని ఐక్యరాజ్య సమితిలో గుర్తించడానికి ఈ ప్రపంచంలో నిరాకరించిన ఏకైక దేశం ఆఫ్గనిస్తానే! తాలిబన్‌కు, పాకిస్తాన్‌కు కేవలం టిటిపి విషయంలో మాత్రమే అభిప్రాయబేధాలు ఏర్పడలేదు. ఇందుకు మూలం వేరొకటి. ఎక్కువగా పష్తూన్లు ఉన్న సమూహంగా, పష్తూన్‌ జాతీయతా వాదాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశీయంగా ఆమోదయోగ్యతను పొందేందుకు తాలిబన్‌ ప్రయత్ని స్తోంది. పష్తూన్‌ ప్రజలు అత్యంతగా తిరస్కరించేది పాకిస్తాన్‌` ఆఫ్గనిస్తాన్‌ మధ్య బ్రిటిష్‌ వారు గీచిన సరిహద్దు రేఖ ‘డ్యురాండ్‌ లైన్‌.’ దీనిని 19వ శతాబ్దంలో ఏర్పరచినప్పటి నుంచీ తాలిబన్‌ ప్రభుత్వం సహా ఆఫ్గన్‌కు చెందిన ఏ ప్రభుత్వమూ గుర్తించలేదు. ఇది ఆఫ్గనీయులకు అత్యంత ఉద్వేగ పరమైన విషయం కూడా. వాస్తవంగా, ఆధునిక కాలంలో ఆఫ్గన్‌ నాయకులు అనేకమంది పాక్‌లో గల 35 మిలియన్లమంది పష్తూన్‌ మైనార్టీని కూడా కలుపుకుని ‘పష్తూనిస్తాన్‌’ను ఏర్పాటు చేయాలని కలలు కన్నారు. పాకిస్తానీలతో కాకుండా కొత్త స్నేహితులను చేసుకునేందుకు, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి కాలంలో చైనా వైపు తిరిగారు. కాగా, ఇప్పటివరకూ చైనా తాలిబన్‌ ప్రధానంగా కోరుకునే అంతర్జాతీయ గుర్తింపును, విదేశీ పెట్టుబడులను అందించ లేదు. చైనాకు వ్యతిరేకంగా ఉన్న తీవ్రవాద గ్రూపుల నుంచి తమను కాపాడితే బదులుగా భారీ బెల్ట్‌ అండ్‌ రోడ్‌ పెట్టుబడులను పెట్టే అవకాశం గురించి మాట్లాడుతున్నప్పటికీ కొద్ది కాలం కిందట సెంట్రల్‌ ఏసియా పెట్రోలియం అండ్‌ గ్యాస్‌ (సిఎపిఇఐసి)కి సంబంధించి 540 మిలియన్‌ డాలర్ల చమురు ఒప్పందం ఒక్కటి మాత్రమే నిర్దిష్టంగా చేసుకున్నది. కాగా, 2011లో చేసుకున్న ఒప్పందమే ఇప్పటివరకూ అమలుకానప్పుడు ఇది ఎలా అవుతుందన్నది ప్రశ్నార్థకమే.

ఈ రకంగా చైనా నిరాశ పరచడంతో, తాలిబన్‌ సంప్రదాయ, సాపేక్షంగా సానుకూల కలిగిన భారత్‌` ఆఫ్గనిస్తాన్‌ సంబంధాలపై తన దృష్టిని మరల్చింది. ఒకప్పుడు భారతీయ లక్ష్యాలపై దాడులు చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొన్నవారు సహా తాలిబన్‌ అధికారులు, నిలిచిపోయిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించవలసిందిగా కోరడం, అందుకు న్యూఢల్లీి అంగీకరించడం జరిగాయి. మూసివేసిన దౌత్యకార్యాలయానికి సాంకేతిక బృందాన్ని పంపి, జూన్‌ 2022లో కాబూల్‌కు సీనియర్‌ అధికారుల బృందాన్ని భారత్‌ పంపింది. తర్వాత విమాన వాణిజ్య కారిడార్లను పునఃప్రారం భించి, ఇరాన్‌లోని చాబహార్‌ పోర్టు ద్వారా మానవీయ సహాయాన్ని అందించడాన్ని తిరిగి ప్రారంభించింది. చాబ హార్‌, ఆఫ్గనిస్తాన్‌ల ద్వారా మధ్య ఆసియా వాణిజ్యాన్ని పెంపొందించాలన్నది భారత ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యం. తాలిబన్‌ అధికారంలోకి రావడం అన్నది ఆఫ్గనిస్తాన్‌ ప్రాముఖ్యతను భారత్‌కు తగ్గించలేదు. నిదానంగా భారత్‌ తన స్నేహాన్ని తాలిబన్‌ ప్రభుత్వంతో పెంచుకుంటూ వస్తున్నది. సోవియట్‌ 1979లో ఆఫ్గన్‌పై దాడి చేసినప్పటి నుంచీ కాబూల్‌లో తమకు అనుకూలమైన పాలకులను గద్దెక్కించి, వ్యూహాత్మక గాఢతను పెంచుకునే విధానాన్ని ధ్వంసం చేసేందుకు భారత్‌కు ఇప్పుడు అవకాశం కలిగింది. అందుకే, స్వయంప్రతిపత్తిగల విదేశాంగ విధానానికి మద్దతు ఇచ్చే జాతీయవాద తాలిబన్‌ వర్గాలకు భారత్‌ ప్రాధాన్యతను ఇస్తున్నది. దక్షిణాసియాలో చైనా ప్రవేశించందన్న భావనతో ఉన్న భారత్‌, తాలి బన్‌ వ్యూహాత్మక విస్తరణకు ప్రధాన సహాయకారిగా చైనా ఉండడాన్ని ఇష్టపడక పోవడంతోనే ఈ ప్రాధాన్యతను ఇస్తున్నది.

వాస్తవానికి కాశ్మీర్‌లో దీర్ఘకాలం పాటు దాడులకు పాల్పడిన తీవ్రవాద ఇస్లామిస్టు సంస్థలు లష్కర్‌ ఎ తోయిబా (ఎల్‌ఇటి), జైష్‌ ఎ మహమ్మద్‌ (జెఇఎం)కు తాలిబన్‌ గతంలో ప్రోత్సహించింది. పాకిస్తాన్‌ భద్రతా వ్యవస్థతో సంప్రదాయంగా సంబంధాలు కలిగి ఉన్న హక్కానీ నెట్‌వర్క్‌ ప్రస్తుత తాలిబన్‌ ప్రభుత్వంలో ప్రముఖ పాత్రను పోషించడం కూడా భారత్‌కు ఆందోళన కలిగించే అంశమే. అయినప్పటికీ, భారత్‌ తన ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఉండవలసిందే. ఆటగాళ్లు వేరైనప్పటికీ, ఆఫ్గన్‌ కోసం గొప్ప క్రీడ కొనసాగుతోంది.

డ్యురాండ్‌ లైన్‌ చరిత్ర

ఆఫ్గన్‌, బ్రిటిష్‌ ఇండియా మధ్య 1893లో సర్‌ మోర్టిమర్‌ డ్యురాండ్‌ సరి హద్దు గీతను గీసినప్పుడు తమ సామ్రాజ్య ప్రయోజనాన్ని నెరవేర్చి ఉండవచ్చు, కానీ ఈ గీత ఆ ప్రాంత మూలవాసులైన పష్తూన్లు నివసించే ప్రాంతాన్ని నిట్ట నిలువుగా చీల్చడంతో, తర్వాతి కాలంలో వారు రెండు విరోధ శక్తుల మధ్య నలిగిపోయారు. దీనితో పాక్‌ ఏర్పడిన తర్వాత ఇరుదేశాల మధ్య గంభీరమైన సైనిక శత్రుత్వాలు, సామాజిక `ఆర్ధిక విబేధాలు, భౌగోళిక ` రాజకీయ ఘర్షణలకు తావిచ్చింది. ఈ ప్రాంతం తీవ్రవాద సంస్థలకు, హింసాత్మక విద్రోహకర శక్తులకు, నేర సంస్థలకు కేంద్రం అయ్యి, అస్థిరత్వాన్ని పెంచి పోషించడమే కాక, ఇరు దేశాల మధ్య ఆయుధాల సేకరణలో పోటీని ప్రోత్సహిస్తోంది.

ఉత్తరాన పామిర్‌ పర్వతాల నుంచి దక్షిణాన అరేబియా సముద్రం వరకు 2,430 కిమీలు డ్యురాండ్‌లైన్‌ విస్తరించి ఉంది. ఉత్తరంలోని మంచుకప్పిన పర్వతాల నుంచి మధ్యలో గల సారవంతమైన భూములలో నుంచి దక్షిణంలో ఉన్న పొడి, బంజరు భూముల వరకూ ఉంటుంది. అంతేకాదు, ఈ రేఖ పష్తూ న్‌ గిరిజన ప్రాంతాల నుంచి, దక్షిణంగా ఉన్న బెలూచిస్తాన్‌ ప్రాంతం గుండా వెడుతూ, సరిహద్దుకు అటూ ఇటూ నివసించే పష్తూన్‌ జాతిని, బెలూచీలను, ఇతర తెగలను రాజకీయంగా విడదీస్తుంది. ఫెడరల్‌ పాలనలో ఉన్న గిరిజన ప్రాంతాలను, ఖైబర్‌ పఖ్తూన్‌క్వాను, బెలూచిస్తాన్‌, గిల్గిత్‌ బల్టిస్తాన్‌ (జమ్ము ` కాశ్మీర్‌లో భాగం) గుండా వెడుతూ ఉత్తర, పశ్చిమ పాకిస్తాన్‌ను, ఆఫ్గన్‌కు చెందిన ఈశాన్య, దక్షిణ ప్రావిన్సుల నుంచి విడదీస్తుంది.

రష్యా భయంతోనే నిర్ణయం

19వ శతాబ్దంలో రష్యా శరవేగంగా మధ్య ఆసియాలోకి దూసుకు వస్తోం దంటూ ఆందోళన చెందిన బ్రిటిషర్లు ఈ చర్యకు ఒడిగట్టారు. పష్తూన్‌ తెగలను రష్యా తమపైకి ఉసిగొల్పుతుందేమోనన్న బ్రిటిషర్ల ఆందోళనగా మారడంతో, వారు ఒక సరిహద్దు రేఖను గీయాలని నిర్ణయించుకున్నారు. నేరుగా ఆఫ్గనిస్తాన్‌ను నియంత్రించాలన్న ఆతృతతో రెండుసార్లు ఆ దేశంతో యుద్ధానికి తలపడి ఓడి పోయారు. దీనితో ఈ ప్రాంతాన్ని బఫర్‌ స్టేట్‌గా మార్చాలని సంకల్పించి, రష్యన్ల నుంచి కాపాడు కునేందుకు అంటూ ఆఫ్గన్‌ అమీర్‌ అబ్దుర్‌ రెహమాన్‌కు బ్రిటిష్‌ ప్రభుత్వం సైనిక ఆయుధాలను సరఫరా చేసింది. అంతేకాదు, 1893లో సరిహద్దు ఒప్పందానికి తెరలేపే ముందు తమ ఆర్ధిక, భౌగోళిక రాజకీయ, అవసరాలు నెరవేరేలా సాధ్యమైనంత ప్రాంతాన్ని కలుపుకోవాలని బ్రిటిష్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

అసలు ‘ఆఫ్గన్‌’ అన్న భావనే పష్తూన్‌ జాతితో సంబంధాలను కలిగి ఉండడం అన్న భావన నుంచి పుట్టింది. సంస్కృతి, చరిత్ర, రక్తసంబంధం కారణంగా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న జనాభాలో సగాన్ని డ్యురాండ్‌ రేఖ విడ దీసింది. నిజానికి ఆఫ్గన్‌ అమీర్‌ కూడా పష్తూన్‌ ప్రాంతాలను విడదీయడానికి అంత తేలికగా ఇష్టపడలేదుట. ఆయన ఎందుకు అలా మొండిపట్టు పడుతున్నాడో కూడా తాడూ బొంగరం లేని బ్రిటిష్‌ అధికారులకు అర్థం కాలేదుట! సహజ వనరులు పెద్దగా లేకుండా, జనాభా కూడా తక్కువగా ఉన్న వజీరిస్తాన్‌ను ఎందుకు ఉంచుకోవాలను కుంటున్నావంటూ డ్యురాండ్‌ అమీర్‌ అబ్దుర్‌ రెహ్మాన్‌ను అడిగినప్పుడు అతడు ఒకే ఒక్క మాట చెప్పాడుట `‘నామ్‌’ (ప్రతిష్ఠ) కోసం అని. కానీ బ్రిటిషర్లకు అదేమిటో అర్థం కాక, దానిని అమీర్‌ కుళ్లుమోతుతనం, పిచ్చి అని భావించారు. వాస్తవంగా ఇది అధికార రాజకీయాలతో సన్నిహితంగా సంబంధం ఉన్న భావన. ఆఫ్గన్‌పై ఎప్పుడూ పష్తూన్ల ఆధిపత్యం ఉంటూ వచ్చింది, అమీర్‌ కూడా పష్తూనే, అటువంటప్పుడు పష్తూన్‌ ప్రాంతాలను వదులు కోవడం అంటే పష్తూన్‌ తెగల మద్దతును కోల్పో వడమే అవుతుంది. పైగా, పష్తూన్‌ తెగలు ఎప్పుడూ ఇతర తెగలు, ప్రభుత్వేతర, ఇతర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అమీర్‌కు తోడ్పాటుగా ఉంటూ వచ్చాయి. ఈ తెగలకు కాబూల్‌కు సంబంధం లేదని బ్రిటిషర్లు భావించినా, బహిర్గత శతృవుల నుంచి రక్షణకు, సంక్షేమానికి సంబంధించి వారు ఆఫ్గన్‌ ప్రభుత్వంపైనే వాస్తవంగా ఆధారపడి ఉన్నారు. అమీర్‌ మధ్యకాలానికి సంబంధించిన రాచరిక విలువల కోణం నుంచి ఆలోచించగా, బ్రిటిషర్లు ఆధునిక స్వతంత్ర ప్రతిపత్తి భావనతో అంతర్జాతీయ సరిహద్దు గురించి ఆలోచించారు.

 బ్రిటిష్‌ అహంకార ఫలితం

ఈ సరిహద్దు రేఖను గీసే ముందే నా ప్రాంతాల నుంచి వారిని వేరు చేస్తే, వారు నాకూ ఉపయోగ పడరు, మీకూ పడరు. మీరు ఎప్పుడూ వారితో పోరాడుతూ ఉండడమో లేక, వారి వల్ల ఇతర సమస్యలను ఎదుర్కొంటూ ఉండడమో జరు గుతుంది. వారు ఎప్పుడూ దోపిడీ చేస్తూనే ఉంటారు అంటూ అమీర్‌ బ్రిటిషర్లను అప్పుడే హెచ్చరించా డుట. కానీ బ్రిటిషర్లు తమ అహంకారంతో గిరిజన జనాభాల, జాతిని, భాషను, విలువలను, కోరికలను అర్థం చేసుకోకుండా ఈ రేఖను గీశారు. ఒకరకంగా చెప్పాలంటే దక్షిణాసియాలో ఉన్న రెండు దేశాల మధ్య ప్రస్తుత సంఘర్షణలకు, పోరాటాలకు దోహదం చేసింది బ్రిటిష్‌ సామ్రాజ్యమే. పాకిస్తాన్‌ అవతరించిన తర్వాత, పష్తూన్‌ నాయకుడు ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ తమ ప్రజలు పాకిస్తాన్‌లో కలవడానికి ఇష్టపడడం లేదని, కనుక రిఫరెండం ద్వారా వారి నిర్ణయాన్ని తెలుసుకోవాలని ప్రతిపాదించాడు. ఫలితంగా చేసిన రిఫరెండం అటు పాక్‌లో లేదా భారత్‌లో చేరే ప్రత్యామ్నాయాన్ని ఇచ్చాయి తప్ప స్వాతంత్య్రం లేదా ఆఫ్గనిస్తాన్‌లో చేరే అవకాశాన్ని ఇవ్వలేదు. కనుక ఖాన్‌ పార్టీ పష్తూన్లకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే, అటు బ్రిటిష్‌, మరోవైపు ముస్లిం లీగ్‌ తెచ్చిన బలమైన ఒత్తిడి కారణంగా స్వల్ప సంఖ్యలో పష్తూన్లకు ఓటు వేసే అవకాశం కల్పించడంతో, అత్యంత తక్కువ మార్జిన్‌తో పాకిస్తాన్‌ అనుకూల ఫలితం వచ్చింది.

పష్తూన్ల ప్రత్యేక సంస్కృతి

నేటి దక్షిణ ఆఫ్గనిస్తాన్‌కు చెందిన పష్తూన్లు ఉమ్మడి పూర్వీకులు, చారిత్రిక నేపథ్యం, విశిష్టమైన నైతిక నియమావళి, ప్రవర్తనా నియమాలు, ఆధ్యాత్మికత, మతపరమైన అస్తిత్వాన్ని కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద (పితృస్వామిక) ఖండ వంశ జాతి సమూహం. పష్తూన్ల పితృస్వామిక నైతిక నియమావళిని ‘పష్తూన్‌వలీ’ లేదా ‘పఖ్తూన్‌వలీ’ అంటారు. ఈ పాలనా వ్యవస్థను, న్యాయశాస్త్రాన్ని నేటివరకూ వారు పరిరక్షించుకుంటున్నారు. ముఖ్యంగా ఇది గ్రామీణ గిరిజన ప్రాంతాలలో అమలులో కనిపిస్తుంది. కేవలం పష్తూన్లే కాక ఆ ప్రాంతానికి సమీపంలో నివసించే జాతులు కూడా దీనిని అనుసరిస్తాయి.

ఆత్మ గౌరవం, స్వేచ్ఛ, న్యాయం, ఆతిథ్యం, ప్రేమ, క్షమ, సాహసం, ధర్మం, ప్రతీకారం, అందరి పట్ల (ముఖ్యంగా అతిథులు, అజ్ఞాతవ్యక్తుల) సహనం, స్త్రీలు, గౌరవం, భూమిని కాపాడుకోవడాన్ని ‘పష్తూన్‌వలీ’ ప్రోత్సహిస్తుంది. ఇందులో అనేక విషయాలు మన సనాతన ధర్మానికి దగ్గరగా ఉన్నట్టు ఉం డడంలో ఆశ్చర్యం లేదు. ఆఫ్గన్‌ అంటే గాంధార దేశమే కదా? ‘పష్తూన్‌వలీ’ సారాన్ని, అర్థాన్ని ఆవిష్కరించడం అన్నది ప్రతి పష్తూన్‌ వ్యక్తిగత బాధ్యత. మొత్తంగా చెప్పాలంటే, డ్యురాండ్‌ రేఖ ఇద్దరు ఇరుగుపొరుగుల మధ్య అభద్రత, అసంపూర్ణత భావాలను పెంచడమే కాకుండా, తమకంటూ ఒక ప్రాంతం, గొంతుక లేని స్థానిక పష్తూన్‌ ప్రజల అస్తిత్వానికి సంబంధించి అనేక సంక్లిష్ట సమస్యలను తలెత్తేలా చేసింది.

ఒకవైపు ప్రపంచమంతా అనుమానంగా చూసిన తాలిబన్‌ తమ సంస్కృతిని విడవకుండా, ప్రధాన స్రవంతిలో కలిసేందుకు మార్గాలను అన్వేషిస్తున్న సమయం లో పాక్‌ రెచ్చగొట్టే చర్యకు వారు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సిన విష యం. ఏమైనా వ్యూహాత్మక భౌగోళిక ప్రదేశంలో ఉన్నామన్న పాక్‌ గర్వాన్ని చాబహార్‌ పోర్టు ద్వారా మార్గాన్ని కనుగొని భారత్‌ అణచివేస్తోందన్నది వాస్తవం.ఈ మొత్తం పరిణామాలు చిలికి చిలికి గాలివాన అయితే పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇరుగుపొరుగు దేశాలకు ఆందోళన కలిగించే విషయమే.

About Author

By editor

Twitter
YOUTUBE