తాము అధికారంలోకి వస్తే బీసీ వర్గానికి చెందిన వారిని ముఖ్యమంత్రిని చేస్తామని, ఎస్సీ వర్గీకరణ వేగవంతం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు పార్టీల మేనిఫెస్టోలు వెలువడ్డాయి. ఎన్నికల మేనిఫెస్టోలలో ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు ఉచితాలను ప్రకటించడం నేటి వాస్తవం. బీజేపీ తనదైన శైలిలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు గురించి మాట్లాడుతూ, తాము వస్తే రాష్ట్రానికి ఎంత లాభదాయకంగా ఉంటుందో వివరించింది. ముస్లింలకు ప్రస్తుతం అమలు చేస్తున్న 4శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని, ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని, సంవత్సరానికి నాలుగు ఉచిత గ్యాస్‌ సిలెండర్లను ఇస్తామని, పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై పన్నులు తగ్గిస్తాం అంటూ బీజేపీ ఇచ్చిన హామీలు దిగువ వర్గాలకు, మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకుని ఇచ్చినవే. దీనితో పాటు మహిళలకు, విద్యార్ధులకు, రైతులకు కూడా కొన్ని ఉచితాలను, హామీలను ప్రకటించింది.

మైనార్టీల పట్ల ప్రేమ

 కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక తర్వాత రెండవ దక్షిణాది రాష్ట్రాన్ని చేజిక్కించుకోవాలని విజయమో వీర స్వర్గమో స్థాయిలో పోరాడుతోంది. అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు పరోక్షంగా ఎఐఎంఐఎం మద్దతునిస్తున్న నేపథ్యంలో, రాష్ట్రంలోని ముస్లింలను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ‘ముస్లిం డిక్లరేషన్‌’ను ప్రకటించింది. ఇదే అత్యంత వివాదాస్పదమైంది. వక్ఫ్‌ ఆస్తులను కాపాడుతామని, ఆలయ భూములను అమ్మి అయినా మైనార్టీలను ఆదుకుంటామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంతరెడ్డి అన్నట్టుగా సోషల్‌ మీడియా సైట్లలో విపరీతంగా ప్రచారం జరిగింది. తాను ఆ మాటలు అనలేదని రేవంత్‌ రెడ్డి ఖండిరచారు. ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని బీఆర్‌ఎస్‌, ముస్లిం డిక్లరేషన్‌ ప్రకటించి కాంగ్రెస్‌ పార్టీ తమ బుజ్జగింపు ధోరణిని చాటుకున్నాయి.

బీజేపీ మేనిఫెస్టో

– తెలంగాణ ప్రగతి పథానికి 25 అంశాల కార్యాచరణను బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అవి:

– గతంలో చెప్పినట్టే ఈ మేనిఫెస్టోలోను ఏటా సెప్టెంబరు 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

– బైరాన్‌పల్లి, పరకాలలో అమరులైన వారిని స్మరించుకుంటూ ఆగస్టు 27ను ‘రజాకార్ల దుష్కృత్యాల సంస్మరణ’ దినంగా నిర్వహిస్తారు.

– రజాకారులకు, నిజాంకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన వారి సంస్మరణ కోసం హైదరాబాద్‌లో ఓ స్మారకం, మ్యూజియం నిర్మిస్తారు.

– బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో జరిగిన కాళేశ్వరం, ధరణి వంటి వివిధ అవినీతిపై, ఆర్థిక అవకతవకలపై రిటైర్డ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిటీ నియమిస్తారు.

– రాష్ట్రంలోని 52% వెనుకబడిన వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ, బీసీ అభ్యర్థిని సీఎంను చేస్తారు.

– ఎస్సీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించేలా ఎస్సీ ఉపవర్గీకరణను వేగవంతం చేసే చర్యలు చేపడతారు.

– 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు.

– మేడారం జాతరకు జాతీయ స్థాయి గుర్తింపు.

– పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు.

– సింగరేణి ఉద్యోగులకు ఆదాయపన్ను రీ ఇంబర్స్మెంటు.

– ద్రవ్యోల్బణం తగ్గించడంతోపాటు సామాన్య పౌరులకు ఊరట కల్గించేందుకు ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే పెట్రోల్‌, డీజిల్‌ మీద వ్యాట్‌ తగ్గింపు. మిగిలిన కొన్నిచోట్ల వ్యాట్‌ తగ్గించినప్పటికీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తగ్గించలేదు.

–  ధరణి స్థానంలో ‘మీ భూమి’ యాప్‌

– అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్‌ కార్డులు

– పసుపు నగరంగా నిజామాబాద్‌.

– రాష్ట్రంలోని రైతుల ఎరువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎరువుల సబ్సిడీ (ఎకరానికి రూ.18వేలు) తోపాటుగా.. చిన్న, సన్నకారు రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు రూ.2,500 ఇన్పుట్‌ అసిస్టెన్స్‌ అందిస్తాం.

– ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన జాతీయ పసుపు బోర్డు ద్వారా రాష్ట్రంలో ఉత్పత్తయ్యే పసుపు విలువ మరింత పెరగనుంది.  ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటుచేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు బాటలు వేస్తారు.

– వరిపై రూ.3,100 మద్దతు ధరను అందిస్తారు. పసుపు కోసం మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ను ఏర్పాటు చేస్తారు. తెలంగాణలో ఉత్పత్తయిన మొత్తం బియ్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.

– ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన ద్వారా రైతులకు ఉచిత పంట బీమా సౌకర్యం కల్పిస్తారు.

– ఉజ్జ్వల లబ్థిదారులకు ఉచితంగా ఏడాదికి 4 గ్యాస్‌ సిలిండర్లు..

– ఆడబిడ్డ భరోసా పేరుతో నవజాత ఆడ శిశువుల పేరు మీద ఫిక్స్డ్‌ డిపాజిట్‌. 21 ఏళ్లు వచ్చిన తర్వాత రూ.2 లక్షలు పొందవచ్చు. డిగ్రి, ప్రొఫెషనల్‌ కోర్సుల్లో చేరే విద్యార్థినులకు ఉచిత ల్యాప్టాప్‌లు.

– స్వయం సహాయక బృందాలకు నామమాత్రమైన రూపాయి వడ్డీకే రుణాలు.

– యూపీఎస్సీ తరహాలోనే గ్రూప్‌`1, గ్రూప్‌`2 సహా టీఎస్పీఎస్సీ పరీక్షలను ఆర్నెల్లకోసారి పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

– ఆసక్తి గల రైతులకు ఆరోగ్యకరమైన ఆవును ఉచితంగా అందిస్తారు.

– అర్హత కలిగిన కుటుంబాలకు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఏడాదికి రూ.10 లక్షల ఉచిత ఆరోగ్య కవరేజీ. ఆర్థికంగా వెనుకబాటుకు గురైన కుటుంబాలకు ఏడాదికోసారి ఉచిత వైద్య పరీక్షలు చేయిస్తారు.

– కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా హక్కును పొందేందుకు ట్రైబ్యునల్‌ ముందు రాష్ట్రం తరపు వాదనలు సమర్థవంతంగా వినిపిస్తారు.

– ఉద్యోగస్తులు, పింఛనర్లకు ప్రతినెల 1వ తేదీనే వేతనాలు ఇచ్చేలా చూస్తారు.

– వివిధ చట్టాలను ఏకీకృతం, సమన్వయం చేసి ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదాను రూపొందించే కమిటీని ఏర్పాటుచేస్తారు.

– గ్రామాల్లోని అర్హులైన పేదలకు ఇంటి పట్టాలను అందిస్తారు.

– వయోవృద్థులకు ఉచితంగా అయోధ్య, కాశీ యాత్ర.

– తెలంగాణకు చెందిన ఎన్నారైలు, గల్ఫ్‌ నివాసితుల సంక్షేమం కోసం ప్రత్యేక నోడల్‌ విభాగం/మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేస్తారు.

– నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణ.

– డిగ్రీ లేదా ఇతర ప్రొఫెషనల్‌ బాలికలకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు.

– రీఇంబర్స్‌మెంటు బకాయిలు.. వన్టైం సెటిల్మెంటు.

– జిల్లాకో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తారు.

– రీజినల్‌ రింగురోడ్డు, ఔటర్రింగ్‌ రైలు ప్రాజెక్టులు. ఉడాన్‌ విమానాశ్రయాలు..

– కాళేశ్వరం ప్రాజెక్టు భద్రత. నీటి ట్రైబ్యునల్‌ ఏర్పాటు గురించి కూడా ఈ మేనిఫెస్టోలు హామీలు ఉన్నాయి. బీజేపీ తనదైన శైలిలోనే ఇటు హిందుత్వ జాడలను, అటు సంక్షేమం నీడను సమంగా అందిస్తూ తన మేనిఫెస్టోను తయారు చేసింది.

మొత్తంగా 119 అసెంబ్లీ స్థానాలకు ఈసారి 2,898మంది అభ్యర్ధులు బరిలో ఉండగా, ఎందు కైనా మంచిదని రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్‌ పట్ల కూడా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. సంప్రదాయంగా ఆయన పోటీ చేసే గజ్వేల్‌ స్థానంలో 114 నామినేషన్లు దాఖలు కాగా, పోటీ చేస్తున్న రెండవ స్థానం కామారెడ్డిలో 58 నామినేషన్లు దాఖలయ్యాయి. వీరిలో ఎక్కువ మంది స్వతంత్ర అభ్యర్ధులే కావడం వల్ల ఎన్నికల రోజు వరకూ ఎవరు నిలుస్తారో, వెనక్కి తగ్గుతారో తెలియకున్నా, తుది పోరులో కేసీఆర్‌ కనీసం పదిమందితో పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

About Author

By editor

Twitter
YOUTUBE