– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ జర్నలస్ట్‌

ఆమె జీవితకాలం 94 ఏళ్లు.

మరో ఆరు వసంతాలుంటే, శతాయుష్కురాలు.

1904లో జననం. 1998లో అస్తమయం.

అంటే, తాను మనను వీడివెళ్లి ఇప్పటికి సరిగ్గా పాతిక సంవత్సరాలు.

డిసెంబర్‌ మూడోతేది తన స్మృతి సందర్భం

ఇంతకీ ఆ పేరు పసల అంజలక్ష్మి. తెలుగుతేజం. గోదావరి ప్రాంతం అత్తిలి వాస్తవ్యురాలు.

శ్రీమంతుల ఇంట పుట్టింది. సిరిమంతుల ఇంటినే మెట్టింది. ఉన్న సంపాదన, సంపద అంతా సమాజానికే అర్పించింది. భరతమాత దాస్యవిముక్తి కోసం ఎంత పోరాడాలో అంతగానూ పోరు సాగించింది. జీవితమంతా సాహసమే. బాల్యం నుంచి వృద్ధాప్యం దాకా.

స్వాతంత్య్ర సమరంలో ముందు నిలిచిన ఆ దంపతుల తనయకు సాక్షాత్తూ భారత ప్రధాని హృదయాభివాదం చేశారు. ‘మీ పేరులోనూ భారతీయత వెల్లవిరుస్తోందమ్మా’ అంటూ కృష్ణభారతికి నమస్సుమాలందించారు. ఎంత గొప్ప పేరు పెట్టారు మీ తల్లిదండ్రులు అని ఎంతగానో కొనియాడారు నరేంద్ర మోదీ.

ఆ ధన్యజీవనుల నేపథ్యం, మరిన్ని వివరాలు ఇప్పుడు…

ఆ ఊరిపేరు దాసుళ్ల కుముదవల్లి. అత్తిలి ప్రాంత పల్లె. వెంకటరామయ్య, వెంకమ్మ. పేరు, తీరులోనూ అన్ని విధాలా సామీప్యత. తొలినుంచీ దేశభక్తి భావనలున్నవారు. వారికి జన్మించింది అంజలక్ష్మి. బడిలో అంతగా చదువుకోలేదు. సంఘాన్ని మాత్రం చిన్నప్పటి నుంచే చదువుతూ వచ్చింది. ఇంటాబయటా కూడా జాతీయతా స్ఫూర్తి తొణికిసలాడుతున్న ఆనాటి వాతావరణం అది. అంతా చూస్తూ అన్నీ వింటూ, ఎన్నో తెలుసుకుంటూ ఉంటుండగానే బాల్యమంతా గడిచింది.

అటు తర్వాత కృష్ణమూర్తితో వివాహం. ఆయనది కూడా గోదావరి ప్రాంతమే. విప్పర్రు గ్రామం. ధనం, గుణం రెండూ బలంగా నిండిన చక్కటి కుటుంబం.

ఉభయుల ఆలోచనలూ పరిపూర్ణంగా కలిశాయి. ప్రత్యేకించి అలనాటి జాతీయోద్యమం వైపు చూపు మళ్లేలా చేశాయి. ఇద్దరూ ఎన్నెన్నో చర్చించుకునే వారు. విముక్తి ఉద్యమ తీరుతెన్నులను క్షుణ్ణంగా పరిశీలిస్తుండేవారు. భావాలు పంచుకుని, పరిణితి సముపార్జించుకొని, అందరికీ ఆదర్శప్రాయులై నిలిచారు అంజలక్ష్మి జంట.

ముద్దుల కుమార్తెకు తండ్రి పేరులోని ‘కృష్ణ’ జత చేరింది. భారతదేశ ప్రీతికి అనుసారంగా ‘భారతి’ అనీ జోడిరచటం అయింది. అంతా కలిపి కృష్ణభారతి.

అన్యోన్య దాంపత్యం గడుపుతున్న ఆ జంట జాతీయతావాద భావనలు అమోఘం. వారి కార్యాచరణ దృక్పథం అపురూపం. ఆ దంపతులు ఒకనాడు బాపూజీని కలిసి మాట్లాడారు. అది 1921వ సంవత్సరం. అంటే, ఇప్పటికి దరిదాపు శతాబ్దం కిందటి మాట. గాంధీజీని కలుసుకుని తిరిగి తాడేపల్లి గూడెం పరిసరాలకు వచ్చారిద్దరూ.

ఆ రోజుల్లో పరివ్యాప్తమైన సహాయనిరాకరణ ఉద్యమం అంజలక్ష్మి జంటను విశేషంగా ఆకర్షించింది. ప్రచారం చేయడమే కాదు, నేరుగా రంగంలోకి దిగి ఆ ఉద్యమ నాయకులుగా సత్వరమే ఎదిగారిద్దరూ. స్వస్థలంలోనే ఉద్యమం బాధ్యతలను అత్యంత సమర్థంగా నిర్వర్తించారు.

అందులో భాగమా అన్నట్లు, ఆమె సదాసర్వదా ఖద్దరు వస్త్రాలే ధరించేవారు. భారతీయత ఉట్టిపడుతుండేది తనను ఎవరు ఎప్పుడు ఎక్కడ చూసినా!

‘తెల్లదొరల్ని తరిమికొడదాం. ఆ పాలకులకు మనం ఏ విధంగానూ సహకరించకూడదు. నిరాకరించాలి. వాళ్లు తిరిగి వెళ్లిపోయే వరకూ ఉద్యమ అగ్ని రగులుతూనే ఉండాలి. రగిలిద్దాం. వ్యాప్తిచేద్దాం. సహాయనిరాకరణ అంటే ఏమిటో ఆంగ్లేయులకు రుచి చూపిద్దాం’ అంటూ ప్రసంగాలు చేశారు అంజలక్ష్మి, ఆమె శ్రీవారు కూడా.  అనేక మందిని కూడగట్టి, పోరాటదీప్తిని విస్తృతపరిచారు . పికెటింగ్‌ నిర్వహించారు. ఊరూరా, ఇంటింటా తిరుగుతూ ఖద్దరు దుస్తులను  అమ్ముతుండేవారు. రాట్నం గురించి విస్తృత ప్రాచుర్యానికి తెచ్చారు. ‘విదేశీయత వద్దు ` స్వదేశీయతే ముద్దు’ అని వేనోళ్ల చాటారు వారు.

అది 1929. దేశమంతటా పర్యటిస్తున్నారు మహాత్మాగాంధీ. ఆ క్రమంలోనే గోదావరి పరిసర ప్రాంతాల్లోని చాగల్లుకు చేరుకున్నారు. అక్కడి ఒక ఆశ్రమంలో బసచేశారాయన.ఆయనను కలుసు కున్నారు అంజలక్ష్మి దంపతులు. జాతీయోద్యమ నిర్వాహణ రీతికి అన్ని విధాల ప్రభావితురాలైన ఆమె అప్పుడే అక్కడికక్కడే తన ఒంటిమీద నగలను, ఇతర ఆభరణాలను పోరాటనిధికి సమర్పించారు. తమ పసిబిడ్డ ఒంటిమీద ఉన్న గొలుసులను అర్పించారు. అంతటితో ఆగలేదు…

‘మహాత్మాజీ! ఇప్పుడేకాదు ` ఇక ఎప్పుడు బంగారు ఆభరణాలు వేసుకోను. కుటుంబంలో ఎవ్వరూ స్వర్ణాన్ని ధరించబోం. ఇది నా మాట, ప్రతిజ్ఞ’ అని ప్రకటించారు ఆమె.

అనంతర కాలంలో…

సమాజ సంస్కరణలతోనే కాలమంతా గడిపారు అంజలక్ష్మి. అంటరాని తనాన్ని నిర్మూలించటానికి ఎంతో చేశారు. చెప్పటమే కాదు… చేసి చూపించారు. కొందరు దళిత అమ్మాయిలను తానే దత్తత తీసుకున్నారు, చదువు చెప్పించారు, బాగోగులన్నీ చూశారు.

నిత్యం అన్నదానం చేస్తుండేవారామె. ఆకలి తీర్చడం కంటే మించిన పుణ్యకార్యం ప్రపంచంలో మరేది లేదనే వారు. తదుపరి రోజుల్లో ఉద్యమం మరెంతో ఊపందుకుంది. నిరసన కార్యక్రమాల్లో మమేకమయ్యారామె. ప్రదర్శనలు, ఊరేగింపులు, నినాదాలు, బైఠాయింపులు… ఇంకా ఎన్నెన్నో ప్రక్రియలు.

ఊరుకుంటారా ఆంగ్ల పాలకులు? పోలీసులను ప్రయోగించారు. అంజలక్ష్మి అరెస్టు జరిగింది.  ఆరునెలల కఠిన కారాగారవాసం విధించారు. తమిళనాడులోని నాటి మద్రాసు (చెన్నై), వేలూరు, ఇతర కారాగారాలకు తరలించారు. శిక్షాకాలం ముగియకుండానే, కొన్ని ప్రత్యేక పరిణామాల వల్ల ఆమె విడుదలయ్యారు. తన పోరు పటిమ అనంతం. కాబట్టే నాటి ఆంగ్ల శాసనాలని ధిక్కరించే ప్రక్రియలలో పూర్తిగా పాల్గొన్నారు. శాసన ఉల్లంఘన ఉద్యమమన్నమాట.

నిర్వాహక ఉద్యమ వేదికగా భీమవరాన్ని నిర్ణయించారు. సభాద్యక్షులు అంజలక్ష్మి, భర్త కృష్ణ మూర్తే! పోలీసు బలగాలు రంగ ప్రవేశం చేసాయి. సదస్సు జరగకుండా అడ్డుపడ్డాయి. అన్ని వైపుల దిగ్బంధం జరిగేలా తెగించాయి.

జంకుతారా ఉద్యమవాదులు? ఇతర నాయకులతో కలిసి సమావేశ స్థలికి చేరుకున్నారు ఆమె.  ఎక్కడి నుంచి బయలుదేరారో, ఏ విధంగా నడచి వచ్చారో, ఏ వాహనాన్ని వినియోగించారో, పోలీసు అధికారులకే అంతుపట్టలేదు. పతీ సమేతంగా ప్రత్యక్షమయ్యారా ధీరనేత. ఇరువురూ అక్కడి భవంతి మీద పతాకాన్ని ఎగురువేశారు.

దిమ్మతిరిగి పోయింది. పోలీసులకు!

అప్పటికే ఆమె గర్భవతి. ఆరు నెలలు. శారీరకంగా ఎంత ఇబ్బంది ఉన్నా అసలు ఏ మాత్రం లక్ష్యపెట్టలేదు. బిలబిలా కమ్ముకున్నారు పోలీసులు. విముక్త పోరాటవాదుల్ని చెదరగొట్టాలని చూశారు. లాఠీలకు పని పెట్టారు. అయినా వెనుతిరగలేదు ఉద్యమశ్రేణి. పైగా, ఇంకెంతో ముందుకు వచ్చింది.

అంజలక్ష్మిని నిర్బంధించారు పోలీసులు. 10 నెలలు జైలు శిక్ష పడిరది.

వేలూరు కారాగార గదిలోనే రోజులు గడిచిపోయాయి. ప్రసవమూ అక్కడే. కన్ననూరు కారాగారానికి ఆమెను తరలించడమూ అయింది.

పసికందుతోనే జైలునుంచి విడుదలయ్యారామె.

అన్ని అవరోధాలనూ అధిగమించి వచ్చిన అంజలక్ష్మికి ఊరూవాడా జేజేలు పలికింది. కాలపరిణామ క్రమంలో మరెన్నో మార్పులు చేర్పులు చోటు చేసున్నాయి. సంస్కరణ రంగంలో అగ్ర స్థానాన నిలిచారామె. ఎన్ని దానధర్మాలు చేశారో, ఎన్ని వందల మందిని ఆదుకున్నారో లెక్కేలేదు. ధనమంతటినీ పేదల బాగుదలకే వ్యయం చేశారు. బాధితులకు అండదండగా నిలిచారు. ప్రధానంగా వైద్యం మీదనే ఆమె దృష్టి కేంద్రీకరణ. విప్పర్రు ప్రాంతంలోని తన నివాసంలోనే వైద్య వసతులు ఏర్పాటు చేశారు. ప్రధాన స్థాయిన వైద్య నియామకం జరిపారు. సహాయకులుగా భార్యాభర్తలు ఉన్నారు.

ఉద్యమం, సేవ`ఇవి ఆ దంపతులకు కళ్లు. అంతలో స్వాతంత్య్రం వచ్చేసింది. దేశానికి విముక్తి లభించింది. పరపాలకుల పీడన వదిలింది.

స్వపాలనకు సదవకాశం కలిగింది.

‘జీవన సౌఖ్యామృతమ్ము

చిందిన కళ్యాణి నేను

నీ జీవిత పరిపూర్ణత

నిలిపిన అర్ధాంగి నేను’

అనేలా ఉందామె జీవనయానం. కొంతకాలమ య్యాక, అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి. ‘ఒక్కనాడు నా దేశము’ అనుకునే పరిస్థితులొచ్చాయి. ఆశ్రితజన కల్పకమై అఖిలాశలు పాలించిన వైనం మారింది. ‘వివిధ రూప విద్యోన్నతి, విశిష్టమై వెలయగవలె / వైద్యవిద్య జనసేవా/ భావమ్ము వహింపగవలె’ అనిపించసాగింది.

దురాశా పిశాచా దంష్ట్ర

తుత్తునియలు కావలె!

నిరాశోపహత జాతికి

నిత్యతుష్టి నిలువగవలె!

అనేలా తయారైంది వాతావరణం. ‘ఆనాడే స్వాతంత్య్రవ ు్మర్థవంతమై నిలుచును / ఆనాడే నా స్వరాజ్యమానందమ్మందించును’ అనేకునేట్లు చేసింది పరిణామ పరంపర.

స్వాతంత్య్రానంతర స్థితిలో చీకటి వెలుగు లున్నాయి. ముఖ్యంగా రాజకీయ రంగం తీరుతెన్నులు మారిపోయింది. అనుకూలంగా కాదు/జనహితానికి వ్యతిరేకంగా!

‘ఆకాశం అందుకునే ధరలొకవైపు

అదుపులేని నిరుద్యోగ మింకొకవైపు

అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు

అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు…’ అనిపిస్తోంది అంతా. అందుకే రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు అంజలక్ష్మి. త్యాగం, దీక్ష, పట్టుదలలను సొంతం చేసుకునేలా కొంతమంది  నటిస్తున్నారు. త్యాగచరితుల, ధీరయోధుల కృషి ఫలితాల్ని కొంతమంది తమకే అనుకూలంగా వాడుకుంటున్నారు. అదొక విషపరిణామం. మన స్వాతంత్య్ర పోరాట వీరుల్ని బాధించే అంశం!

ఇదంతా గమనించిన అంజలక్ష్మి ఇక పూర్తిగా సేవారంగానికే సమయం, ధనం, శ్రమ, అంతటినీ కేటాయించారు.

రాజకీయ, పాలనారంగాల్లో మళ్లీ మార్పులు. ప్రధానంగా, ఆమె సేవానిరతిని  కేంద్రం ఎంతగానో కొనియాడిరది. స్వాతంత్య్ర రజతోత్సవాల సందర్భంగా (1972) ఆహ్వానించి ఘనంగా సత్కరించింది. 1998లో దేశరాజధాని నగరం నుంచి ప్రత్యేక ఆహ్వానం వచ్చిందామెకు. తర్వాత`

అది అంతర్జాతీయ వనితా దినోత్సవ సందర్భం.

ప్రముఖులంతా ఆమెను వేదికపైకి సగౌరవంగా ఆహ్వానించారు. దేశాభిమానానికి పర్యాయ పదంగా నిలిచిన ఆ పడతికి అభినందన చందనాలం దించారు. ఆ సంతృప్తీ సంతోషాలతో ఆమె వృద్ధాప్య దశ చరితార్థమైంది.

దేశ, రాష్ట్ర రాజధాని నగరాల్లో అంజలక్ష్మికి పలు సత్కారాలు. ఆ పరంపర  కొనసాగుతుండగానే, డిసెంబరు మాసంలో తమ తీపి గుర్తులను మిగిల్చి  వెళ్లిపోయారు.

నిరుడు ఒక సమావేశ సందర్భంగా గోదావరి ప్రాంతం భీమవరాన్ని సందర్శించిన ప్రధానమంత్రి,  అంజలక్ష్మి దంపతుల కుమార్తెతో ప్రత్యేకించి సంభాషించారు. కృష్ణభారతికి నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఆమె కూడా ఆయనకు ప్రత్యేకంగా అభివాదం చేసి, గౌరవ ప్రపత్తి కనబరచి, ఒక కమనీయ దృశ్యాన్ని అలా   ఆవిష్కరించారు.

అమ్మా అంజలక్ష్మీ! మీకు భారతజాతి జేజేలు పలుకుతోందమ్మా!

About Author

By editor

Twitter
YOUTUBE