శాలివాహన 1945 శ్రీ శోభకృత్ కార్తిక పూర్ణిమ – 27 నవంబర్ 2023, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. పౌరులు ఓటు వేస్తారు. గెలిచిన రాజకీయ పక్షం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. స్థూలంగా చూస్తే అంతే! కానీ సూక్ష్మంగా చూస్తే ఒక దేశం లేదా ఒక రాష్ట్రం సగర్వంగా తలెత్తుకు సాగడానికీ, లేదా కొన్ని తరాలు ఇక్కట్లలో కూరుకుపోవడానికీ కూడా ఎన్నికలు, ఆ సమయంలో ఓటర్లు తీసుకున్న నిర్ణయాలే కీలకం. ఆ క్షణంలో ప్రదర్శించే విజ్ఞత అమృతోపమానమైనది. చెడ్డవాళ్లు చట్టసభలకు వెళ్లి శాసన నిర్మాణం చేస్తున్నారంటే, మంచిపౌరులు ఓటు హక్కుకు దూరంగా ఉన్న ఫలితమే. ఎన్నికలలో ఒక ఓటరు ప్రదర్శించిన అజ్ఞానం కూడా ఆ వ్యవస్థ మూలాల మీద ప్రభావం చూపిస్తుందని మరచిపోవద్దంటారు పెద్దలు. ఒక సమాజ వైవిధ్యంGసామాజిక న్యాయంGవిచక్షణ R ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యమనే ఆ జ్యోతిని అఖండంగా వెలుగుతూ ఉండేటట్టు చేసేదే ఓటు హక్కు. ఎన్ని కోట్ల ఓట్లు ఉన్నా, అందులో ప్రతి ఒక్కటి లెక్కలోకి తీసుకునేది మాత్రమే కాదు, వ్యవస్థ నిర్మాణంలో, ప్రస్థానంలో ప్రాధాన్యం వహించగలిగేదే. దేని అస్తిత్వం దానిదే.
ప్రజాస్వామ్యం పరిఢవిల్లింది కాబట్టే దేశం ఇంత పురోగమించింది. దీనిని కాదనలేం. కానీ వలసపాలకుల నుంచి స్వాతంత్య్రాన్నీ, తద్వారా ప్రజాస్వామ్యాన్నీ భారత్‌లో ప్రతిష్టించిన జాతీయవాదం మీద దాడి పెరుగుతున్నది. దేశ ఔన్నత్యానికి కారణమైన భిన్నత్వానికి వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇది సెక్యులరిజం పేరుతో మెజారిటీ ప్రజల మనోభావాలను కించపరిచే క్రమంలో జరుగుతున్నది. ఒకే మతం, ఒకే విశ్వాసం, ఒకే ప్రవక్త ఉండాలన్న వాదాన్ని ప్రపంచం నెత్తిన రుద్దే ఉన్మాదులకు సెక్యులరిజం పేరుతో ఎర్రతివాచీ పరుస్తున్నారు. మిగిలిన విశ్వాసాలను పెకలిస్తామన్న నినాదాల పట్ల మౌనం దాల్చడాన్ని మత సామరస్యమని నమ్మిస్తున్నారు. ఈ ధోరణులను నిరసించినవారిని హిందూ మతోన్మాదులని ముద్ర వేస్తూ, ఆ ఉన్మాదానికి బలం చేకూరుస్తున్నారు. ఇది ఈ దేశంలోని కొద్దిమంది, కొన్ని ఇతర దేశాల అండతో చేస్తున్నారు. అయినా మెజారిటీ ప్రజల సహనం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్నది. ఆ మెజారిటీల ఆత్మ గౌరవాన్నీ, అదే సమయంలో సహనాన్నీ పరీక్షించే పరిస్థితులు కొనసాగరాదు. అందుకు ఓటును ఆయుధంగా చేసుకోవాలి. ఓటు కేవలం హక్కు కాదు, అదొక శక్తి. అదొక ఆయుధం.
భారత ఎన్నికల సంఘం తాజా సమాచారం ప్రకారం దేశంలో 6 జాతీయ పార్టీలు, 54 రాష్ట్ర పార్టీలు, దాదాపు 2,600 చిల్లరమల్లర పార్టీలు ఉన్నాయి. ఇందులో అత్యధిక పార్టీలు ఈ దేశంలో మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించేవి కావని నిస్సందేహంగా చెప్పవచ్చు. అయినా ఎందుకు బతుకుతున్నాయన్న ప్రశ్న సహజం. దానికి సమాధానం – హిందువుల దౌర్బల్యం. ఈ దౌర్బల్యానికి ఇప్పటికీ గురి అవుతూనే ఉండడం, ఇంకా ఇంకా దగా పడుతూనే ఉండడం సరికాదు. ఓట్లు మెజారిటీ ప్రజలవీ, ప్రయోజనాలు మైనారిటీలవీ` ఎంత చిత్రమైన పరిస్థితి?
దేశ రాజకీయాలలో సడేమియాల్లా వ్యవహరిస్తున్న ప్రాంతీయ పార్టీల విన్యాసాల గురించి చెప్పుకోవలసిన సందర్భమిది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వాటి చరిత్ర ఒక్కలా ఉంది. వేర్పాటువాదం, అవినీతి, హిందూ వ్యతిరేకత, ఫెడరలిజం పట్ల వైమనస్యం, ఒకరి జేబు సంస్థగా మారిపోవడం వాటిలో సాధారణంగా కనిపిస్తున్నాయి. కశ్మీర్‌ను ఈ దుస్థితికి తెచ్చిన నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమాక్రటిక్ పార్టీ, పంజాబ్‌లో అకాలీదళ్, ఢల్లీిలో ఆమ్ ఆద్మీ పార్టీ, బెంగాల్‌లో టీఎంసీ, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ, తెలంగాణలో బీఆర్‌ఎస్, తమిళనాడులో డీఎంకే ఫెడరల్ వ్యవస్థకీ, సమగ్రతకీ పోటీ పడి చేటు చేస్తున్నాయి. ఈ పార్టీలలో ఎక్కువ మంది నాయకులు, మంత్రులు జైళ్లలో ఉన్నారు. లేదా బెయిల్ మీద ఉన్నారు. ఇంకొందరు జైలు బాటలో ఉన్నారు. జీఎస్టీ, నీట్, రైతు చట్టాలు, యూసీసీ, నూతన విద్యా విధానం ఏ విధానంలోను, నిర్ణయంలోను కేంద్రంతో అవి కలసిరావు. కారణం` ఆ నిర్ణయాలు మంచివే అయినా, మార్పు రాజ్యాంగ పరిధిలోనే జరిగినా.. బీజేపీ ప్రభుత్వాన్ని సమర్ధిస్తే మైనారిటీ ఓట్లు పోవచ్చని వాటి భయం. మరి ప్రజా ప్రయోజనం మాటేమిటి? నిజంగా కేంద్ర నిర్ణయాలన్నిటినీ ప్రజలు నిరాకరించారని ఆ పార్టీలు చెప్పగలవా? సర్జిల్ స్ట్రైక్స్‌ను శంకించే జాతీయ పార్టీ ఇక్కడ ఉంది. చైనాను, పాకిస్తాన్‌ను చూసి నేర్చుకోమని చెప్పడానికి నిస్సిగ్గుగా వేదికలెక్కుతున్న పార్టీ అది. శత్రుదేశం పాకిస్తాన్‌తో పోటీ పడుతూ అంతర్జాతీయ వేదికల మీద భారతదేశం పరువు తీయడానికి కూడా ఆ పార్టీ వెనుకాడదు. ఒకే చట్టం, ఒకే దేశం అనడానికి వీల్లేదంటుంది ఈ పార్టీయే.
తన పట్ల, తన సమాజం పట్ల ఒక ఓటరుకు ఉండే నిబద్ధతను పోలింగ్ బూత్‌లో అతడు తీసుకునే నిర్ణయమే నిర్ధారిస్తుంది. ఓటు హక్కు వినియోగించుకునే వేళ ఉద్విగ్నత ఎంత వాస్తవమో, మేధోశక్తి పాత్ర కూడా అంతే వాస్తవం. ప్రతి ఎన్నికకు ఓటుకు రేటు పెరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ పెరగవలసింది ఓటర్ల విజ్ఞత. ఓటరు విజ్ఞతతో మెలగాలని విన్నవించడం, కోరుకోవడం ఆదర్శం కోసం కాదు. భ్రమ అంతకంటే కాదు. దేశ తక్షణావసరం. ఇలాంటి విన్నపం కూడా ఎన్నికల అభ్యర్థుల విన్నపం వంటిదనుకోవడం సరికాదు. ఈ ప్రజాస్వామ్యాన్నీ, స్వేచ్ఛనీ, వైవిధ్యాన్నీ నిలబెడుతున్న మెజారిటీ ప్రజల సామరస్య ధోరణిని అవహేళన చేసే, చేతగా నితనంగా పరిగణించే ఏ నాయకుడినైనా చట్టసభలకు పంపడం ప్రమాదం. అలాంటి పార్టీకి పట్టం కట్టడం మన నాగరికతనే కాదు, మన స్వరాజ్య సమరయోధుల స్ఫూర్తినీ, రక్తతర్పణలనీ, త్యాగాలనీ కూడా దగా చేయడమే. ఇది ఏ సమాజం, ఏ తరం కూడా చేయడానికి సిద్ధపడకూడదు.