తెలంగాణ ఏర్పడిన తరువాత నవంబర్ 30న మూడోసారి అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ ఎన్నికలలో అయినా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. భారతీయ జనతాపార్టీ మాత్రం తన సామాజిక సమరసతను రుజువు చేసుకోవడానికి ఈ ఎన్నికలను ఉపయోగించుకుంటున్నది. సామాజిక సమరసత ఎన్నికల అంశం కాకపోయినా, ఆ అంశం పట్ల తనకున్న నిబద్ధతను చాటడానికి ఆ పార్టీ ఈ ఎన్నికలను ఉపయోగించుకోవలసిన వాతావరణం ఏర్పడిరది. ఈ ఎన్నికలలో బీజేపీని ఆశీర్వదిస్తే బీసీ వర్గం వారిని ముఖ్యమంత్రిని చేస్తామని ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. దాదాపు మూడు దశాబ్దాలుగా సాగుతున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్) వర్గీకరణ సమస్యను సుఖాంతం చేస్తామని కూడా ఆ పార్టీ హామీ ఇవ్వడం మరొక పరిణామం. బీసీని తెలంగాణ ముఖ్యమంత్రిగా నియమిస్తామని ప్రకటించిన తొలి జాతీయ స్థాయి రాజకీయ పక్షం బీజేపీయే. దీనితో బీసీ ముఖ్యమంత్రి అంశం, వర్గీకరణ సమస్యకు పరిష్కారం అన్న బీజేపీ రెండు ప్రకటనలకు తెలంగాణలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ప్రాధాన్యం ఏర్పడిరది. ప్రకటించినట్టయింది. ఇకనైనా ఈ మేరకు జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఒక వర్గం మీడియా, మేధావులు ఆపడం మంచిది. బీజేపీ బీఆర్‌ఎస్‌కు బీటీం అంటూ కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలకు సమాధానం చెబుతూ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్‌కు సీ టీం అని అన్నారు. ఆ రెండు పార్టీలు ఒకే నాణేనికి రెండు ముఖాలనీ, రెండూ కుటుంబ వారసత్వ పార్టీలేనని విమర్శించారు.
నవంబర్ 11న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఎస్‌సీల సభకు కూడా ప్రధాని మోదీ హాజరయ్యారు. ఎవరో కొద్దిమంది మినహా టీవీ చర్చలలో ఈ సభలో మోదీ ఇచ్చిన హామీ, ఎస్సీ వర్గీకరణ పనిని పూర్తి చేస్తారనే చెప్పడం విశేషం. మోదీ ఒక మాట ఇచ్చారంటే దానిని ఏదో విధంగా అమలు చేస్తారనే వారంతా అభిప్రాయపడ్డారు. మోదీ మీద ఈ విధమైన నమ్మకం దేశ ప్రజలలో ఉన్నది. ఎంఆర్‌పీఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగ మాటలలో కూడా ఇదే నమ్మకం ధ్వనించింది. మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభ పేరుతో జరిగిన ఆ కార్యక్రమంలో మోదీ ఏమన్నారు?
1994 నుంచి ఎంఆర్‌పీఎస్ ఎస్‌సీ వర్గీకరణ డిమాండ్‌తో పోరాటం చేస్తున్నది.షెడ్యూల్డ్ కులాల కింద గుర్తింపు పొందినవారిలో నిజానికి ఆ సౌకర్యం కొందరికే పరిమితమవుతున్నదని ఎంఆర్‌పీఎస్ ఆరోపణ. అంటే మాదిగ, దాని ఉపకులాలు ఆ సౌకర్యానికి నోచుకోలేకపోతున్నాయి. కాబట్టి ఎస్‌సీ ఉపకులాలను వర్గీకరించి జనాభా ఆధారంగా రిజర్వేషన్‌లలో వాటాను నిర్ణయించాలని ఆ సంస్థ కోరుతున్నది. మంద కృష్ణమాదిగ ఎంఆర్‌పీఎస్‌ను ఈ లక్ష్య సాధన కోసమే స్థాపించారు. ఈ సభకు గ్రేటర్ హైదరాబాద్ నుంచే కాకుండా, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున మాదిగ ఉపకులాల వారు పొటెత్తారు. సభకు ఎం ఆర్‌పీఎస్ ప్రస్తుత అధ్యక్షుడు నాగరాజు అధ్యక్షత వహించారు.
ఎస్‌సీ వర్గీకరణ కోసం ఎంఆర్‌పీఎస్ చేస్తున్న పోరాటం న్యాయమైనదని ప్రధాని మోదీ అంగీకరించారు. అందుకు బీజేపీ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తాయని చెప్పారు. ఈ సమస్య ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి, తగు నిర్ణయం వచ్చిన తరువాత ఎస్‌సీ వర్గీకరణ అమలుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. ఇలాంటి సభకు ప్రధాని హాజరైనందుకు మాదిగలు ఎంతో సంతోషించిన సంగతి కృష్ణ మాదిగ ఉపన్యాసం, భావోద్వేగం రుజువు చేశాయి. ప్రధాని కూడా ఆయనను తన సోదరునిగా సంబోధించారు. నిజానికి వర్గీకరణ అంశాన్ని బీజేపీ ఎన్నికల అంశంగా పరిగణించలేదు. మోదీ పర్యటన ముగిసిన తరువాత కూడా కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి తమ పార్టీ వైఖరి గురించి ఇంకొంచెం వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు.ఎస్సీ వర్గీకరణకు కేంద్రం సానుకూలంగా ఉందని సుప్రీంకోర్టుకు తెలియచేయడంతో పాటు, ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటు చేసి ప్రక్రియను వేగవంతం చేయవలసిందిగా కూడా కోరతామని ఆయన అన్నారు. ఒకవేళ కోర్టు ద్వారా సాధ్యంకాదని అని పిస్తే చట్టం తేవడానికి కూడా తాము ప్రయత్నిస్తామని కేంద్రమంత్రి చెప్పారు. కేంద్రం తాజాగా ఏర్పాటు చేసే టాస్క్‌ఫోర్స్ కమిటీ వర్గీకరణ చేపట్టాలా వద్దా అన్న అంశం మీదకాదనీ, ఆ అంశం మీద ఉన్న ఇతర అడ్డంకులు ` కోర్టు కేసు లు, ఇతర ప్రాధాన్యతాంశాలు రోజువారీ పర్య వేక్షించేందుకేనని ఆయన వివరించారు.
వర్గీకరణ కూడా అందరి ఆమోదంతో సాధించవలసిన అంశాల జాబితాలోనే వస్తుందను కోవచ్చు. ప్రధాని మోదీ ప్రకటన వెలువడగానే మాలమహానాడు నాయకుల నుంచి సహజంగానే ఆగ్రహం వ్యక్తమైంది. వారి ఆగ్రహాన్ని అర్ధం చేసుకోవచ్చు. అలాగే వారు కూడా సాటి ఎస్సీ వర్గీయుల న్యాయబద్ధమైన డిమాండ్‌నూ, కోర్టుల నిర్ణయాన్నీ గౌరవించేందుకు సిద్ధపడడం అవసరం కాదా? నిజానికి ఈ వర్గంలోని కొందరు ప్రముఖులు కూడా వర్గీకరణ డిమాండ్‌లోని న్యాయం గురించి సానుకూలంగానే ఉన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇక, కాంగ్రెస్ కానీ, బీఆర్‌ఎస్, కమ్యూనిస్టులు అంతా మోదీ ప్రకటనను ఎన్నికల విన్యాసంగానే పరిగణిస్తే ఆశ్చర్యం లేదు. ఏ సామాజిక అంశాన్నయినా దానిని వాస్తవంగా పరిశీలించే, మంచిచెడులు బేరీజు వేసే లక్షణం వీటిలో ఎప్పుడో నశించింది. వాటిలో దృష్టిలో ఏదైనా ఎన్నికల అంశమే. చిరకాలంగా దళితులను ఆ పార్టీలు ఓటు బ్యాంకుగానే చూశాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎస్‌సీ వర్గీయుల మనోభావాలను గుర్తించడానికి ఏనాడూ ముందుకు రాలేదు. డాక్టర్ అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదు సరికదా, అవమానించింది. బీజేపీ మాత్రమే ఆయనకు మరణాతనంతర పురస్కారంగా భారతరత్నను చేసింది. బీఆర్‌ఎస్ ముందురూపం టీఆర్‌ఎస్ అయితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చింది. నిజానికి అలాంటి హామీ బీఆర్‌ఎస్ నేత కేసీఆర్ నుంచి వచ్చింది. కాబట్టి ప్రజలు నమ్మా రని అనడానికి పెద్ద అవకాశం లేదు. అందుకే పట్టించుకోలేదని అనిపిస్తుంది. తరువాత ఆ ఊసే లేదు. ఎస్‌సీలపై కమ్యూనిస్టులకు ఉన్న అభిమానం ఎప్పుడో రుజువైంది. ఆ పార్టీ జెండా 75 ఏళ్లకు పైగా ఆ వర్గం మోసింది. కానీ పార్టీ జవసత్వాలన్నీ ఉడిగిన తరువాత గానీ దళితుడికి అగ్ర నాయకత్వం రాలేదు. కాంగ్రెస్ సహా అన్ని పార్టీల పంచన చేరి రెండు మూడు స్థానాలు దేబరించే పరిస్థితికి రెండు వామపక్షాలు చేరాయి.
బీఆర్‌ఎస్‌కు ఎప్పుడు ఎదురుగాలి వీచినా ఆ పార్టీ నాయకులు ప్రాంతీయ తత్త్వాన్ని రెచ్చగొట్టడానికి అస్త్రాలు బయటకు తీస్తూ ఉంటారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కూడా బలమైన పోటీ ఇస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ మళ్లీ తెలంగాణ ద్రోహులు అంటూ ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నం ప్రారంభిం చింది. దేశాన్ని తాము తప్ప వేరొకరు పాలించడం సరికాదన్న భావన కాంగ్రెస్ లో కరుడగట్టుకుని ఉంటుంది. అలాగే తెలంగాణను తాము తప్ప వేరొకరు పాలించరాదన్నదే బీఆర్‌ఎస్ అగ్రనేతల విశ్వాసం. అక్కడ కాంగ్రెస్ అంటే నెహ్రూ `గాంధీ కుటుంబం. ఇక్కడ బీఆర్‌ఎస్ అంటే కల్వకుంట్ల కుటుంబమే. కాళేశ్వరం, మేడిగడ్డ జనవనరుల పథకాల మీద అంత రగడ జరుగుతున్నా వాటి గురించి కనీసం ప్రస్తావించకపోవడం, ప్రజలను మరచిపోయేటట్టు చేయడం ఆ పార్టీకే చెల్లింది. ఆ రెండు కుంగిపోయి ప్రమాదం అంచున ఉన్న సంగతి అసలు ఈ ఎన్నికలలో ఒక అంశం కావలసి ఉన్నా, అలా జరగలేదు. ఎన్నికలు రాగానే పక్క రాష్ట్రాల నుంచి, ఢల్లీి నుంచి గుంపులు గుంపులుగా వస్తుంటారని బీఆర్‌ఎస్ నాయకులు వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. అప్రజాస్వామికం కూడా. బీఆర్‌ఎస్ పేరుతో కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లి వస్తున్నారు. దీనిని ఎలా చూడాలో ఆ పార్టీ నాయకులే చెబితే బావుంటుంది.
ఈ ఎన్నికలకు మరొక ప్రత్యేకత ఉభయ కమ్యూనిస్టు పార్టీల వైఖరి. నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్న రీతిని వదలలేదు కామ్రేడ్లు. కొద్దికాలం క్రితమే జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలలో గులాబీ దళానికి మద్దతు ఇచ్చిన కమ్యూనిస్టులు ఈసారి కేసీఆర్ దయకు నోచుకోలేకపోయారు. సంవత్సరం నిండ కుండానే గులాబీదళాధిపతికి ఎర్రజెండాల మీద మొహం మొత్తింది.ఈసారి కాంగ్రెస్ శిబిరం దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనకున్న క్రామేడ్లకు పాక్షిక భిక్షే దొరికింది. సీపీఎంను పక్కన పెట్టి, సీపీఐతో కలసి వెళ్లడానికి కాంగ్రెస్ అంతిమంగా నిర్ణయించుకుంది. ఈ ఇద్దరు మొదట కాంగ్రెస్ ముందు నిలబడి మొదట 19 నుంచి మొదలు పెట్టి చివరికి తలా రెండు సీట్లు ధర్మం చేయమని దేబరించారు. కొసరుగా భవిష్యత్తులో ఎమ్మెల్సీ సీట్లు కూడా దయ చేయించమని కోరారు. కాంగ్రెస్ తాత్సారం చేసింది. ఆఖరికి సీపీఎం ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. సీపీఐ కాంగ్రెస్‌తోనే ప్రయాణించాలని నిర్ణయించింది. సీపీఎం విడిగా పోటీ చేస్తేనే కాంగ్రెస్ లాభమని టీపీసీసీ విశ్లేషించు కుందని వినికిడి. ఈ విషయాన్నే సీపీఎం తెలంగాణ నాయకుడు తమ్మినేని వీరభద్రం ఒక తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తాను అనుకున్నట్టే ఇప్పుడు 19 స్థానాలలో సీపీఎం పోటీ చేస్తున్నది. దాయాదికి మిగి లిన చోట్ల మద్దతు ఉండదు గాని, సీపీఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తున్న కొత్తగూడెంలో మాత్రం(కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్నప్పటికీ) సీపీఎం మద్దతు ఇస్తుందంట. మిగిలిన చోట్ల కాంగ్రెస్‌ను శత్రువుగానే చూస్తుందన్న మాట. కానీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని కొత్తగూడెం నుంచి పోటీ చేయ రాదని అదే పార్టీకి చెందిన ఎనిమిది మంది కౌన్సిలర్లు తేల్చి పారేశారు. అది పార్టీ అంతర్గతం అనుకోండి! ఒక విదూషకుడికి ఏ మాత్రం తీసిపోని సీపీఐ సీనియర్ నాయకుడు కె. నారాయణకు ఇప్పుడు బీఆర్‌ఎస్ మూలాలు ఢల్లీిలో ఉన్నాయని హఠాత్తుగా జ్ఞానోదయమయింది. లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు చేస్తారన్న మాట రాగానే బీఆర్‌ఎస్ వెళ్లి బీజేపీని శరణువేడిరదని అన్నారాయన. కాబట్టి ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్టేనని ఆయన తేల్చి పారేశారు. అసలు కల్వకుంట్ల కుటుంబానికి వాటాలు లేకుండా ఒక ప్రాజెక్టు కూడా అనుమతి పొందడం లేదని అన్నారు. నిజానికి మునుగోడు ఉప ఎన్నిక సమయానికే కాళేశ్వరం మీద ఆరోపణలు తారస్థాయికి చేరాయి. అలాగే ఫామ్ హౌస్ గురించి చెప్పిన మాట కూడా ఇలాంటిదే. 15 ఎకరాల సీఎం ఫామ్‌హౌస్ ఇప్పుడు రెండువందల ఎకరాలకు చేరిందని నారాయణ ప్రకటించడం హాస్యాస్పదం.
కేసీఆర్ పొత్తును నిరాకరించిన మరుక్షణమే కమ్యూనిస్టుల మాటమారింది.ఏ రోటి దగ్గర ఆ పాట పాడగలిగే ప్రతిభ వారి సొంతం కాబట్టి, అప్పుడు పడ తిట్టిన కాంగ్రెస్‌తో ఇప్పుడు ఎందుకు అంటకాగవలసి వచ్చిందో తాత్వికతకు పడికట్టు పదాలు అద్ది మరీ చెప్పారు. మొన్నటి మునుగోడు ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్‌లను ఓడిస్తాం అన్నారు కామ్రేడ్లు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ను ఓడిస్తాం అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు రెండేసి స్థానాల వంతున ఇవ్వడానికి అంగీకరించింది. అయితే మేం ఇచ్చిన స్థానాలు మాత్రమే తీసుకోండని షరతు విధించింది. పెట్టేవాడి చేయి పైనే ఉంటుంది మరి! ఇక్కడే విభేదాలు వచ్చాయి. మునుగోడు ఎన్నికలవేళ ఈ రెండు పార్టీలు చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఎవరైనా ముక్కున వేలేసుకుంటారు. ఇంతకీ సీపీఎం, సీపీఐ అయినా కలసి పోటీ చేస్తున్నాయా? అదీ లేదు. కానీ కమ్యూనిస్టుల ఐక్య తకు తాము కట్టుబడే ఉన్నామని తమ్మినేని మరొక్కమారు విసుగులేకుండా ప్రకటించారు.
తెలుగుదేశం తెలంగాణ శాఖ ఈ ఎన్నికలలో పోటీ చేయడంలేదని ప్రకటించి తన బలాన్ని తానే ఇంకాస్త తగ్గించుకుంటున్నది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి చంద్రబాబునాయుడు, లోకేశ్ తెలుగుదేశం ఈసారి పోటీ చేయడం లేదని ప్రకటించారు. దీనితో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పదవికి రాజీనామా చేశారు. గులాబీ కండువా కప్పుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంతో కలసి ప్రయాణిస్తానని ఇదివరకే చెప్పిన జనసేన పార్టీ ఈ ఎన్నికలలో తెలంగాణలో బీజేపీతో కలసి పోటీ చేస్తున్నది. ఎనిమిది సీట్లు బీజేపీ కేటాయించింది. ఇక్కడ తెలుగుదేశం పోటీలో లేదు కాబట్టి పవన్ కల్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారా? అది త్వరలోనే తేలుతుంది. కాంగ్రెస్‌తో కుమ్మక్కయి తెలుగుదేశం ఎన్నికలకు దూరంగా ఉందని కొందరు తెలుగుదేశం కార్యకర్తలు ఆరోపించడం కొసమెరుపు. దీని మీద పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాల్సిందే. స్వరాష్ట్రంలో సర్వేలు, బీజేపీతో జత కట్టాలన్న కోరిక, దానికి బీజేపీ నుంచి సంకేతాలు రాకపోవడం ఇవన్నీ చూస్తే తెలుగుదేశం ఒక అసాధారణ సందిగ్ధంలో మునిగి ఉన్న వాస్తవం అర్ధమవుతుంది. రెండుమూడేళ్లు ఎంతో హడావిడి చేసిన వైఎస్ షర్మిల కూడా ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే ఆమె తన బీఆర్‌ఎస్ వ్యతిరేక వైఖరిని వీడలేదని అర్ధమ వుతుంది. కానీ కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో బీఎస్‌పీ బరిలోకి దిగింది. పోటీ మాత్రం బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యనే ఉంటుందన్నది వాస్తవం. హైదరాబాద్ పాత నగరంలో ఎంఐఎం బలంగా ఉన్నప్పటికీ టిక్కెట్ల విషయంలో కొంత గందరగోళం ఏర్పడిరది. ఆ పార్టీ ఎన్ని సీట్లు గెలిచినా అవన్నీ బీఆర్‌ఎస్ ఖాతా కిందకే వస్తాయి.
– జాగృతి డెస్క్