రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు, హామీలను బుట్టదాఖలు చేయడమే కాదు… వనరులన్నీ దోచుకోవడం, అవినీతిని ప్రోత్సహించడం, ప్రశ్నించిన గొంతులను నలిపేయడం, పోలీసులతో అక్రమ కేసులు పెట్టించడం, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం, భారీగా పన్నులు వేసి, కరెంటు ఛార్జీలు పెంచి ఆర్థిక భారం మోపడం, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకపోవడం, నిరుద్యోగులకు జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌విడుదల చేయకపోవడం, పారిశ్రామికవృద్ధి చేయక పోవడం, రైతులకు ఆర్ధిక సహకారం లేకపోవడం… ఇలా ఒకటేమిటి..? వైసీపీ ప్రభుత్వం  అన్నివర్గాలకు  వ్యతిరేకంగా పనిచేస్తూ ఆయా రంగాలలో విఫలమైందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల పట్ల పూర్తి అశ్రద్ధ్ద వహించింది.  మూడు రాజధానుల పేరుతో అమరావతిని అభివృద్ధి చేయక భూములిచ్చిన రైతులకు వాగ్దాన భంగం చేసి వారిని ముప్పతిప్పలు పెడుతోంది. పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సర్పంచుల ఖాతాలకు జమచేసిన ఆర్ధిక సంఘం నిధులను దారి మళ్లించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన సీపీ•ఎస్‌ ‌హామీకి  తూచ్‌ ‌చెబుతూ, ఇప్పుడు జీపీఎస్‌ను అమలులోకి తెస్తోంది.

వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ఏ ఒక్క వర్గాన్ని సంతృప్తి పరచలేదు సరికదా వారికి కొత్త సమస్యల సృష్టించి తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా? ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించేద్దామా? అని అన్ని వర్గాలు ఎదురుచూస్తున్నారు.

అదుపులేని ఆర్ధిక భారం

ప్రభుత్వం పన్నుల భారాలు మోపి ఆర్ధిక భారాలు సృష్టించిందని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. అసలే కరోనా వల్ల ఉపాధి కోల్పోయి, జీతాలు పెరగక సమస్యలు పాలైన కుటుంబాలను పన్నులు, ఛార్జీల భారం గుక్క తిప్పుకోనివ్వడం లేదు. వారు అప్పుల పాలైపోతు న్నారు. సర్‌ ‌ఛార్జి, ట్రూ అప్‌ ‌ఛార్జీలంటూ విద్యుత్‌ ‌ఛార్జీల పెంపుతో గతంలో రూ.400 వచ్చే బిల్లు రెట్టింపు అయిందని ఆందోళన వ్యక్తమవుతోంది. బస్సు ఛార్జీలు పెంచారు. కేంద్రం పెట్రోలు, డీజిల్‌ ‌ధరలు తగ్గించినా రాష్ట్రం ఆ దిశగా చర్యలు తీసుకో లేదు. ఆస్తి పన్నులు పెంచారు. మరుగుదొడ్లపై పన్ను, చెత్తపై పన్నులు వేశారు. ఇలా ప్రతి సాధారణ కుటుంబంపై సగటున నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఆర్ధిక భారం పడింది. ఇది తీవ్ర అసంతృప్తికి దారితీసింది.

నిరుద్యోగులకు రిక్తహస్తం

వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పక్కన  పెట్టి నిరుద్యోగులకు రిక్తహస్తం చూపింది. 2.41 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీచేస్తామనిచ, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ‌విడుదల చేస్తామనే హామీలు జాడ లేకుండా పోయాయి. కాంట్రాక్టు ఉద్యోగాలు రెగ్యులర్‌ ‌చేస్తామన్నారు. పల్లె ప్రజలు ఉపాధి కోసం పట్టణాలకు వలస పోనవసరం లేకుండా గ్రామాల్లోనే ఉపాధి కల్పిస్తామన్నారు. కాని అధికారంలోకి వచ్చాక ఏ హామీని అమలు చేయలేదు. జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌ప్రకటించలేదు. మెగా డీఎస్సీ లేదు. నిరుద్యోగుల పోరాటంతో దిగి వచ్చి ఇటీవల పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ ‌చేయ లేదు. ఔట్‌ ‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తున్నారు. నవరత్నాల పథకాల అమలు కోసం వార్డు సచివాలయ ఉద్యోగాలు ప్రకటించి భర్తీ చేశారు. వాలంటీర్ల పేరుతో తమ అనుచరులకు ప్రభుత్వం ద్వారా జీతం ఇప్పించి పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటున్నట్లు విపక్షాల ఆరోపణ.

 అసలు రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్యపై కూడా ప్రభుత్వం వద్ద సమాచారం లేదు. రాష్ట్రంలో కొత్తగా ఒక్క పరిశ్రమ ఏర్పడలేదు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాల యాల్లో మోడల్‌ ‌కెరియర్‌ ‌కేంద్రాలు ఏర్పాటు చేసినా, వాటిలో నిరుద్యోగుల పేర్లను నమోదు చేసుకోవడం లేదని విద్యార్ధి, యువజన సంఘాలు చెబుతున్నాయి. జాబ్‌ ‌మేళాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఆర్భాటమేనని ఈ సంఘాల ఆరోపణ. జాబ్‌మేళాల్లో సైతం బోగస్‌ ‌కంపెనీలే వస్తున్నాయని, నిరు ద్యోగుల నుంచి డబ్బు ఆశిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.

ఉద్యోగుల మండిపాటు

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో పాత పెన్షన్‌ ‌విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించిన వైసీపీ అధినేత జగన్‌ ‌మోహనరెడ్డి, ముఖ్య మంత్రి అయి 52 నెలలు అయినా దానిని అమలు చేయలేదు. పాత పెన్షన్‌ ‌విధానం అమలులో పడే ఆర్ధిక భారం గురించి అప్పుడు ఆలోచించకుండా ప్రకటించడం తమను మోసం చేసినట్లే అని ప్రభుత్వోద్యోగులు అంటున్నారు. అంతేకాదు వారితో సంప్రదించ కుండానే కొత్తగా జీపిఎస్‌ ‌పెన్షన్‌ ‌పథకాన్ని అమలు చేసేందుకు చట్టం చేయడాన్ని కూడా వీరు వ్యతిరేకిస్తున్నారు. తమ గోడు చెప్పుకునే వేదిక లేకుండా దుర్మార్గపాలన సాగుతోందని, హక్కుల కోసం ఉద్యమిస్తుంటే సర్కారు అరెస్టులు, దాడులకు పాల్పడుతున్నదని కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి.

రైతుల ఆగ్రహం

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీవ్ర నిరాశను కలిగించింది. వారికి గిట్టుబాటు ధరలు అందడం లేదు. ధాన్యానికి సకాలంలో చెల్లింపులు జరగక మిల్లర్లకే తక్కువ ధరకు అమ్ము కుంటున్నారు. రైతులకు సబ్సిడీపై ఇచ్చే యంత్ర పరికరాలు, ఉద్యాన రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాల పంపిణీని మూడేళ్ల తరువాత తూతూ మంత్రంగా అయిందని పించారు. రైతులకు 12 వేలు ఆర్ధిక సహాయం చేస్తామని నవరత్నాల పథకంలో హామీ ఇచ్చి రూ.7,500 మాత్రమే ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలు కలిపి మొత్తం రూ.13,500 సహాయాన్ని తామే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోందని రైతులు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించక పోవడంతో కౌలు రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 32 లక్షల మంది ఉంటే ఐదు లక్షల మందికి కార్డులు ఇచ్చారని, వాటిలోనూ 50 శాతం బోగస్‌వేనని, రైతు భరోసా ఇవ్వకపోవడంతో నష్టపోతున్నామని కౌలు రైతులు వాపోతున్నారు. తమకు గుర్తింపు కార్డులు, రైతు భరోసా, పంట రుణాలు, ఇ-క్రాప్‌ ‌బుకింగ్‌, ఇన్పుట్‌ ‌సబ్సిడీ, పంట బీమా సౌకర్యం తదితర పథకాలు వర్తింప చేయాలని కోరుతున్నారు.

సర్పంచుల కినుక

వైసీపీ ప్రభుత్వం తమను తీవ్రంగా వంచించిం దని సర్పంచులు మండి పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.8 వేల కోట్లను కూడా దారి మళ్లించిందని విమర్శిస్తున్నారు. పైగా సమాంతరంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చి తమకు రాజ్యాంగం కల్పించిన హక్కులను అడ్డుకుంటోందని ఆరోపిస్తున్నారు. గ్రామ సచివాలయాల కన్వీనర్లు, వాలంటీర్లతో పాటు అధికార పార్టీ తెచ్చిన గృహ సారథుల కారణంగా తాము ఉత్సవ విగ్రహాలుగా మారిపోయామంటున్నారు. సచివాలయ వ్యవస్థ పంచాయతీలో భాగమేనని ప్రభుత్వం మొదట ప్రకటించినా, 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల అనంతరం వాటిపై సర్పంచుల పర్యవేక్షణ, ఉద్యోగులకు సెలవు మంజూరు అధికారాలను తీసేసిందని దీంతో సచివాలయ ఉద్యోగులు తమను లెక్కచేయడం లేదంటున్నారు. గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాల అమలు, లబ్ధిదారుల ఎంపిక వంటివి తమకు తెలియకుండానే జరిగి పోతున్నాయంటు న్నారు. ఎంతో ఖర్చుచేసి గెలిచి అధికారం లేక పోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల ముందు గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సర్పంచులు ప్రభుత్వం నిధులివ్వక పోవడంతో కేంద్రం ఇచ్చే ఆర్ధిక సంఘం నిధులపై భరోసాతో తమ డబ్బులను కొందరు ఖర్చుచేశారు. కొందరు అప్పులు చేసి ఖర్చుచేశారు. కాని ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంతో సర్పంచులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. ఇలా నిధులు, హక్కులు, అధికారాలు లేక సర్పంచులు ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

కార్మికుల నిరసన

మద్యం, ఇసుక పాలసీలపై కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గత ప్రభుత్వం కంటే తక్కువ ధరకు ఇసుకను అందిస్తామన్న వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్త పాలసీ పేరుతో ఆరు నెలల పాటు ఇసుకను అందుబాటులోకి లేకుండా చేసింది. కృత్రిమ డిమాండ్‌ను సృష్టించింది. కాని ఇసుక బ్లాక్‌ ‌మార్కెట్‌లో రెండింతల ధరకు లభించింది. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి దూరం అయింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా ఆర్థిక సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినా పట్టించుకోలేదు. కార్మికులు పనుల్లేక అప్పులపాలై, ఉన్నది అమ్ముకుని, ఆకలితో మరణించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక కార్మికుల్లో ఎక్కువ మంది మద్యం తాగే వారున్నారు. కొత్త మద్యం పాలసీ పేరుతో ప్రభుత్వం తానే దుకాణాలు తెరచి మద్యం అమ్మింది. గతంలో లభించే బ్రాండ్‌లను తీసేసి నాణ్యతలేని మద్యాన్ని రెండు రెట్లు అధిక ధరలకు విక్రయించి తమ జేబులు కొల్లగొట్టినట్లు మద్యపానప్రియులు ఆరోపిస్తున్నారు. వీరంతా ప్రభుత్వంపై మండిపడుతూ ఎప్పుడూ ప్రభుత్వాన్ని దించేద్దామా అని ఎదురుచూస్తున్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీల అసంతృప్తి

తమకోసం ఖర్చుచేయాల్సిన రూ.30 వేల కోట్ల సబ్‌ ‌ప్లాన్‌ ‌నిధులు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని ఎస్సీ, ఎస్టీలు ఆరోపిస్తున్నారు. తమ జీవనోపాధికి అమలుచేస్తున్న 27 సంక్షేమ పథకాలు రద్దు చేశారని, తమ పిల్లలకు విదేశీ విద్యను దూరం చేసినట్లు దళితులు విమర్శిస్తున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో తమపై దాడులు పెరిగాయని ఆరోపిస్తున్నారు. తమకు కేటాయించాల్సిన సబ్‌ ‌ప్లాన్‌ ‌నిధులు రూ.75,760 కోట్లు దారి మళ్లించారని బీసీలంటు న్నారు. తమకు ఆర్థిక సహకారం అందిస్తామంటూ ఏర్పాటు చేసిన కులాల కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేయక నిర్వీర్యం చేసిందని ఆరోపిస్తు న్నారు. తమకు స్వయం ఉపాధి, జీవనోపాధి వంటి వాటికోసం ప్రభుత్వం కేటాయించిన 30కి పైగా సంక్షేమ పథకాలు రద్దు చేశారని వీరు ఆవేదన చెందుతున్నారు.

– టీఎన్‌ ‌భూషణ్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE