ప్రపంచీకరణ పుణ్యమా అని విశ్వమే ఒక కుగ్రామంగా మారి, ఒకరిపై ఒకరు ఆధారపడి జీవిస్తున్న ప్రపంచ దేశాలు, ఈ కాలంలో సంభవించే యుద్ధ దుష్పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పటికే అనుభవిస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధమే ప్రపంచానికి తలనొప్పిగా మారిన క్రమంలో ఇప్పుడు పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య ప్రారంభమైన ‘యుద్ధం’ ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందోనని ప్రజలూ, చాలా దేశాలూ కలవర పడుతున్నాయి. అక్టోబర్ 7వ తేదీన వేకువన ‘ఆపరేషన్ అక్సా స్టార్మ్’ పేరుతో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హరాకత్ అల్ మక్వామా అల్ ఇస్లామియా (హమాస్) వేలాది రాకెట్ల ప్రయోగంతో హఠాత్తుగా మొదలు పెట్టిన ఈ యుద్ధం వల్ల క్షణాలలో కనీసం వేలాది మంది అసువులు బాశారు. దాడి మొదలైన కొంత సేపటికే ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ తాము ‘యుద్ధంలో ఉన్నట్టు’ ప్రకటించారు. ఇజ్రాయెలీల పండుగ షబ్బత్ వేళ ఈ దాడి జరిగింది. యుద్ధంలో ఉగ్రవాద సంస్థ హమాస్ ముందు ఉంది. వెనుక మాత్రం కొన్ని దేశాలే ఉన్నాయి.
ఈ ఇరు ప్రాంతాల మధ్య ఉద్రిక్తతలు ఈనాటివి కాకపోయినా, ఈ స్థాయిలో హమాస్ దాడికి దిగడం మొదటిసారి. విచక్షణారహితమైన జన హననం, అమాయక ప్రజలను బందీలుగా తీసుకుపోవడం ప్రపంచాన్ని నిశ్చేష్టులను చేశాయి. ప్రపంచాన్నేమిటి? ఇజ్రాయెల్‌కే జరుగుతున్నదేమిటో అర్థం చేసుకుని, ప్రతిస్పందించడానికి కొన్ని గంటలు పట్టిందని అంటున్నారు. ఈ ఘటనలో చోటు చేసుకున్న ప్రాణనష్టం, హఠాత్పరిణామం అమెరికాలోని 9/11ను తలపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
1948లో ఆవిర్భవించిన ఇజ్రాయెల్ అనేక పర్యాయాలు పాలస్తీనియన్లతో యుద్ధాలకు దిగింది. 1956లో సూయజ్ సంక్షోభం, 1967లో ఆరురోజుల యుద్ధం, 1973లో యోమ్ కిప్పర్ యుద్ధం…ఇలా ఇజ్రాయెల్ ఎప్పుడూ చుట్టూ ఉన్న అరబ్ దేశాల కారణంగా యుద్ధ సన్నద్ధతను జీవన విధానంగా మార్చుకున్నట్టు కనిపిస్తుంది. ఈసారి మాత్రం ఇజ్రాయెల్ దిమ్మెరపోయేలా దాడులు జరగడంతో ప్రపంచానికి ఇజ్రాయెల్ పెంచిన ఆధునిక సాంకేతిక, రక్షణ పరిజ్ఞానాల పట్ల భ్రమలు తొలిగిపోనట్లు చెబుతున్నారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ తాము యుద్ధాన్ని ఎదుర్కొంటున్నామని బహిరంగంగా ప్రకటించారు. గాజా ప్రాంతంలో విద్యుత్ కోత, ఇతర నిత్యావసరాలు సహా ఏ వస్తువుల రవాణా ఉండదని స్పష్టం చేశారు. దీనితో హమాస్ తీవ్రవాదులు అంధకారంలోనే పోరు సాగిస్తున్నారు. 2007లో ఈజిప్టు మద్దతుతో ఈ తీరప్రాంతంపై హమాస్ పట్టు సాధించింది. అప్పటి నుంచీ ఈ ప్రాంతం వారి కబంధ హస్తాల్లోనే ఉండి ఇజ్రాయెల్ కంట్లో నలుసులా తయారైంది.
1970వ దశకంలో నాటి ప్రధాని గోల్డా మీర్ పాలస్తీనియన్ల అరాచకాలను ఖండిస్తూ, ‘మా పిల్లలను చంపినందుకు మేము మిమ్మల్ని క్షమించగలం. కానీ, మీ పిల్లల్ను మేము చంపేలా చేసినందుకు మిమ్మల్ని మేము ఎప్పటికీ క్షమించలేం,’ అన్న మాటల బాటలో నేడు ఇజ్రాయెల్ వైఖరి, పోరాటం సాగుతోంది.
ప్రస్తుతం ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులలో గాజాలో గల ఏడు మసీదులు ధ్వంసం అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవైపు మరణాలు, విద్యుత్ లేకపోవడం, మంచినీరు సహా నిత్యావసర వస్తువుల సరఫరా నిలిపివేతతో గాజాలో ప్రజలు అల్లాడుతున్న నేపథ్యంలో హమాస్ కాల్పుల విరమణ చర్చలకు సిద్ధమేనని ప్రకటించింది. కానీ హమాస్ సభ్యులందరినీ సమూలంగా తుడిచిపెట్టే వరకూ చర్చలు లేవంటూ ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోను ఖతార్‌లో విలాసవంతమైన జీవితాలు సాగిస్తున్న హమాస్ నాయకత్వాన్ని ఎవ్వరూ ప్రశ్నించకపోవడం ఆశ్చర్యకరమైన అంశం.
ఈ యుద్ధంతో అటు మధ్య ఆసియా, ఇటు భారత్ కూడా అప్రమత్తమైనాయి. తమ చిరకాల మిత్రదేశం ఇజ్రాయెల్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మద్దతు ప్రకటించారు. ఈ దాడిలో హమాస్ తీవ్రవాదులు బందీలు చేసిన, హత్య చేసిన వారిలో విదేశీయులు ఉండడం ఆయా దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నది.
అసలు ఏం జరిగింది?
ఏడో తేదీ ఉదయం 6.30 గంటలు. ఇంకా ముప్పాతిక మంది ఇజ్రాయెలీలు నిద్ర కూడా లేవలేదు. వారు ‘షబ్బత్’ (మత సంప్రదాయంగా పాటించే విశ్రాంతి)లో ఉన్నారు. ఈ లోపలే పెద్దగా సైరన్, కర్ణభేరి దెబ్బతినేలా రాకెట్ శబ్దాలు వినిపించడంతో ప్రజలు ఉలిక్కిపడి లేచారు. తొలి కొద్ది గంటలలోనే దాదాపు 5000 రాకెట్లను హమాస్ ప్రయోగించినట్టు వార్తలు వచ్చాయి. ఈ తీవ్రవాదులు ఇరు ప్రాంతాల మధ్య కంచెను కూలదోసి, పారాగ్లైడర్ల ద్వారా ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడి అమాయక ప్రజలపై తమ ప్రతాపాన్ని చూపడం ప్రారంభించారు. బాలాది వృద్ధ పర్యంతం ఎవరినీ వదలకుండా హమస్ తీవ్రవాదులు విచక్షణారహితంగా హతమార్చడం ప్రారంభించారు. రోడ్లపై ఉన్నవారిని, ముఖ్యంగా యువతులను బందీలుగా పట్టుకున్నారు. వారిపై అత్యాచారాలు జరిపి, తమ ప్రాంతానికి తీసుకువెళ్లి వివస్త్రలను చేసి ఊరేగించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో కోకొల్లలుగా పోస్ట్ చేశారు. ముఖ్యంగా, ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలో సంగీత విభావరి కోసం చేరిన యువతీ,యువకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి, మరణించిన యువతులపై బతికి ఉన్నవారి ఎదుట అత్యాచారం చేయడం అన్నది ఎవరి రక్తాన్నైనా మరిగించే విషయం. ఇంత జరుగుతున్నా, సోషల్ మీడియాలో ఇజ్రాయెల్‌కు ప్రతికూలంగా పలువురు మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. హమాస్ సమర్ధకులు ఇజ్రాయెలీల అత్యాచారాలను బయిటపెడుతున్నారు.
సైరన్ వినిపించగానే, తమ సురక్షిత స్థానాల పేరుతో భూగృహంలో నిర్మించుకునే కట్టడాలలోకి వెళ్లేలోపే, ఈ తీవ్రవాద మూకలు ఇళ్లలోకి ప్రవేశించి, రాక్షసుల్లా ప్రవర్తించారని వార్తలు వచ్చాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాలు రంగంలోకి దిగడానికి ఆలస్యం కావడంతో అధికారిక లెక్కల ప్రకారం 700కు పైగా ఇజ్రాయెలీలు మరణించినట్టు ఆ సాయంత్రానికి ప్రకటించారు. ఈ సంఖ్య నానాటికీ పెరుగుతుంది. అంతేకాదు, హమాస్ ఆక్రమించుకున్న మూడు గ్రామాల కోసం ఇరువురి మధ్య పోరాటం సాగుతూనే ఉంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం, సోమవారం వరకూ యుద్ధం కొనసాగుతూ, ఇది ఇప్పుడే ఆగేది కాదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఆదివారం నుంచి గాజాలో దాక్కుని ఉన్న తీవ్రవాదులను హననం చేయడం, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెలీ సైనిక దళాలు ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి, గాజా ప్రాంతంలో అటు పాలస్తీనియన్లతో పాటు, ఇజ్రాయెలీలు కూడా జీవిస్తూ ఉండడం వల్ల ఇజ్రాయెలీ భద్రతా దళాలు కొంత అప్రమత్తతను పాటించినా, వెనక్కి మాత్రం తగ్గడం లేదు.
నిఘా వైఫల్యం
ప్రపంచ నిఘా సంస్థలలోనే అత్యంత ప్రముఖమైన, ప్రాచుర్యం పొందిన ‘మొస్సాద్’ ఈ దాడి విషయంలో ముందస్తు సమాచారాన్ని సేకరించలేకపోవడం, అప్రమత్తతతో ఉం డకపోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి లోను చేస్తోంది. ఇజ్రాయెల్ జాతీయ నిఘా సంస్థ మొస్సాద్. సీఐఏ తర్వాత ఏడువేల మంది బలమైన సిబ్బంది, మూడు బిలియన్ల బడ్జెట్‌తో నడిచే అతిపెద్ద నిఘా సంస్థ. పాలస్తీనా తీవ్రవాద గ్రూపులు, లెబనాన్, సిరియా, ఇరాన్ సహా పలు శత్రుదేశాలలో ఏజెంట్లు, నెట్‌వర్క్ కలిగిన ఈ సంస్థ విఫలం కావడం ఆశ్చర్యమే. సరిగ్గా ఐదు దశాబ్దాల కింద అంటే, 1973 అక్టోబర్ 6 నుంచి 25 వరకు ఈజిప్టు, సిరియా నాయకత్వంలోని అరేబియా దేశాలు, ఇజ్రాయిల్‌కు మధ్య సాగిన యోమ్ కిప్పర్ యుద్ధం లేదా రమదాన్ యుద్ధ సమయంలో కూడా మొస్సాద్ ఇలాగే విఫలమైనట్టు విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, కాలానుగుణంగా గాజా- ఇజ్రాయెల్ సరిహద్దులలో కెమెరాలు, గ్రౌండ్ మోషన్ సెన్సార్లు వంటి హైటెక్ భద్రతా ఏర్పాట్లు, నిత్యం సైనిక పహరాలు హమస్ తీవ్రవాదులు లోపలకు చొరబడటాన్ని ఎలా పసిగట్టలేకపోయాయనే ప్రశ్నలు తల ఎత్తడమే కాదు, మొస్సాద్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బతిన్నది. ముఖ్యంగా, అక్టోబర్ 9న ఈజిప్టుకు చెందిన ఒక నిఘా అధికారి, గాజా నుంచి పని చేస్తున్న తీవ్రవాద సంస్థ ఏదో పెద్ద ఎత్తున చేసేందుకు ప్రణాళికలు వేస్తోందంటూ పదే పదే హెచ్చరికలు చేసినప్పటికీ, విస్మరించారని, తమ దృష్టినంతా వెస్ట్ బ్యాంక్‌పైనే కేంద్రీకరించారని పేర్కొన్నట్టు అక్కడి దినపత్రికలు ప్రచురించడంతో మొస్సాద్ ముఖం దాచుకునేందుకు పరుగులు తీస్తున్నట్టు కనిపిస్తోంది.
ఇజ్రాయెల్ అంతర్గత రాజకీయాలే కారణమయ్యాయా?
నిన్న మొన్నటివరకూ ఇజ్రాయెల్ అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రస్తుత ప్రధాని బెంజిమెన్ నెతెన్యాహూ ప్రవేశపెట్టిన న్యాయ సంస్కరణలకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. రోజువారీ నిరసనలు, హర్తాళ్లు నిత్యకృత్యం అయ్యాయి. నెతన్యాహూ తన అవినీతిని దాచుకునేందుకే ఈ సంస్కరణలు ప్రవేశపెట్టారనే భావనలోకి ప్రజలు వెళ్లారు. వాస్తవానికి ఇజ్రాయెల్‌కు లిఖితపూర్వక రాజ్యాంగం లేదు. వారు ప్రభుత్వ పనితీరును క్రమబద్ధీ కరించేందుకు పూర్వ సంప్రదాయాలు, కట్టుబాట్లపై ఆధారపడతారు. ప్రజల ఆగ్రహానికి గురైన నెతన్యాహూ 2021లో తన పదవికి రాజీనామా చేసి సంకీర్ణ ప్రభుత్వానికి తావిచ్చారు. మరు ఏడాదే జరిగిన ఎన్నికలలో తన పార్టీ గెలుపుకు బాటలు వేసి, తిరిగి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. ఆ తర్వాతే ఆయన న్యాయసంస్కరణలపై దృష్టి కేంద్రీకరించి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ఈ అంతర్గత కల్లోలాల వల్లనే ప్రభుత్వం హమాస్ తీవ్రవాదులపై దృష్టి పెట్టలేకపోయిందనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే, మన దేశంలోలా కాకుండా, తమ దేశంపై దాడి జరిగినప్పుడు ఇజ్రాయెల్‌లోని పార్టీలన్నీ ఏకమై నెతన్యాహూకు తమ మద్దతును ప్రకటించాయి. అక్కడ, బయిట ఉన్న కొన్ని వామపక్ష శక్తులు నెతన్యాహూ తక్షణమే రాజీనామా చేయాలని కోరుకుంటున్నప్పటికీ, ప్రజలు కానీ, మిగిలిన పార్టీలు కానీ ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు కనిపించడం లేదు.
అంతేకాదు, ఐరోపా దేశాలు సరే, యుఎఇ వంటి మధ్య ఆసియా ముస్లిం దేశం కూడా ఇజ్రాయెల్‌కే మద్దతు ప్రకటించడం ఆయనకు ఒక సానుకూల అంశం.
భారత్, మధ్యప్రాచ్యం, ఐరోపా కారిడార్
ఇటీవలే న్యూఢిల్లీలో జరిగిన జి20 సమావేశంలో ఈ కారిడార్‌ను నిర్మించడానికి అంగీకారం కుదిరింది. ఈ దాడి కారణంగా మధ్య ప్రాచ్యంలోని దేశాలు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా, అనుకూలంగా చీలిపోవడం వల్ల ఈ కారిడార్ పనులకు విఘాతం కలిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బిఆర్‌ఐ)కు ప్రతిగా నిర్మిస్తున్నదని, ఇది భారత్‌కు వ్యూహాత్మక ప్రాముఖ్యం కలిగి ఉన్న ప్రాజెక్టని చెబున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే, ఐరోపా మార్కెట్లతో భారత్‌కు ప్రత్యక్షమార్గం ఏర్పడి, భారత్, మధ్య ప్రాచ్యం నడుమ వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. మధ్యప్రాచ్యంలో ఈ యుద్ధం వల్ల ఉద్రిక్తతలు, అస్థిరతలు పెరిగితే ఇక్కడ వాణిజ్యం, పెట్టుబడులకు ఎవరూ ముందుకు రారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
కాగా, ఇందుకు వ్యతిరేకమైన వాదన కూడా వినిపిస్తున్నది. తాత్కాలికంగా ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోయినా, అంతిమంగా ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేస్తారని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ప్రారంభమైన యుద్ధం, ఇటు ఇస్లామిక్ తీవ్రవాదులను తుడిచిపెట్టి, అక్కడ శాంతి ఏర్పడేందుకు దోహదం చేస్తుందని అనేవారు లేకపోలేదు. ఇప్పటికే, హమాస్ స్థావరాలతో పాటు లెబనాన్ సరిహద్దులలోని హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ స్థావరాలపై కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇవి ఆ ప్రాంతంలో తీవ్రవాదాన్ని తుడిచిపెట్టేందుకు జరుగుతున్నవే అంటున్నారు.
ఇది రాజకీయ చదరంగమా?
ఇటీవలే తమ పౌరులు కొందరి విడుదల కోసం అమెరికా ప్రభుత్వం ఇరాన్‌కు కొన్ని బిలియన్ల డాలర్లను విడుదల చేసింది. ఈ ధీమాతోనే ఇరాన్ హమాస్‌ను ప్రత్యక్షంగా సమర్ధిస్తోంది. కాగా, ఒక్క నెల ముందు, అంటే జి20 సమావేశంలో ఈ కారిడార్ ప్రకటన వెలువడే ముందు ఇరాన్, సౌదీ అరేబియా దౌత్యపరమైన సంబంధాలను పునరుద్ధరించుకున్నాయి.
అలాగే, ఇజ్రాయెల్‌తో దౌత్యపరమైన సంబంధాలకు సుముఖతను చూపిన సౌదీ అరేబియా ఇప్పుడు హమాస్‌ను సమర్ధిస్తోంది. కానీ, తమ దేశం సర్వతోముఖాభివృద్ధి చెందాలని అమెరికాను ప్రతిఘటించి మరీ పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆ దేశ పాలకుడు మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ క్రమంలో తీవ్రవాదులను నిజంగా సమర్ధిస్తారా అన్నది కూడా ప్రశ్నే. వ్యూహాత్మక భౌగోళిక రాజకీయ చదరంగంలో ఏ పావులు ఎందుకు కదులుతున్నాయో అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది.
ఈ క్రమంలోనే అమెరికా స్పందనను అర్థం చేసుకోవలసి ఉంటుందేమో! ఈ దాడిని ఖండించేందుకు అమెరికా చాలా సమయం తీసుకున్నది. భారత ప్రధాని మోదీ ఖండించినట్టుగా బైడెన్ ప్రకటన వెలువడలేదు. దాడి ప్రారంభమైన సాయంత్రానికి అమెరికా ఖండనే కాక, ఆయుధాల సరఫరా గురించి ప్రకటన వెలువడింది. యుకె ప్రధాని రుషీ సునాక్ కూడా ఈ దాడిని ఖండిస్తూ, ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించారు.
ఇంతటి మానవ హక్కుల ఉల్లంఘన జరుగు తున్నా, ఉదారవాదులు, మానవహక్కుల గురించి మాట్లాడేవారు ఖండించకపోవడం ఒక అంశమైతే, అలా చెప్పుకునే అదే మత సంప్రదాయానికి చెందిన జర్నలిస్టులు కొందరు సోషల్ మీడియాలో వచ్చిన వీడియోల కింద వాళ్లకలా జరగాల్సిందే అని వ్యాఖ్యలు పెట్టి దిగజారుడుతనాన్ని బయిట పెట్టుకున్నారు.
– జాగృతి డెస్క్