సంపాదకీయం
శాలివాహన 1945 శ్రీ శోభకృత్ ఆశ్వీయుజ బహుళ విదియ – 30 అక్టోబర్ 2023, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
మూర్ఖుల మనసు రంజింపచేయడం ఎంత కష్టమో ఏనాడో తేల్చాడు శతకకారుడు. అందునా అహంకారం తలకెక్కిన రాజకీయరంగ మూర్ఖుల మనసు మార్చడం బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాదు. నిజం చెప్పాలంటే వాళ్ల మనసులు మారతాయని కాని, అహంకారం వదులుతుందని గాని, మూర్ఖత్వం కరుగుతుందని కాని ఆశపడడం దురాశ మాత్రమే. ‘ఇండియా’ పేరుతో ఆర్భాటంగా ఆరంభమైన సరికొత్త పాత కూటమి ప్రముఖులు వ్యవహరిస్తున్న తీరు చూశాక శతకకారుడి అంచనా అద్భుతమనిపిస్తుంది. అదేం వింతో మరి! ఎన్నికలు ప్రకటించినప్పుడల్లా విచ్ఛిన్నమైపోవడానికి విపక్ష ‘ఇండియా’ సమాయత్తమవుతూ ఉంటుంది. త్వరలో జరగబోయే అసెంబ్లీల ఎన్నికలలోను ఇది పునరావృతం కాబోతున్నది.
‘ఇండియా’ భాగస్థుల మధ్య తాజా మంటకు కారణం మధ్యప్రదేశ్‌లో పొత్తులు, సీట్ల పంపకాలూను. అంతేకాదు, కులగణన నినాదం మీద హక్కు కూడా అందులో కాస్త ఆజ్యం పోసింది. మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య వచ్చిన సీట్ల పంపకం విభేదాలు బాగా ముదిరేటట్టే కనిపిన్నాయి. సీట్ల పంపకం గురించి అడిగినప్పుడు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ‘అఖిలేశ్, వకిలేశ్ ఇవన్నీ వద్దు సోదరా!’ అంటూ సదరు విలేకరికి కాస్త వెగటుగానే సమాధానం ఇచ్చారు. మధ్యప్రదేశ్ ఎన్నికల బరినుంచి సమాజ్‌వాదీ తప్పుకుంటే భేషుగ్గా ఉంటుందంటూ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్‌రాయ్ చేసిన సూచనతో అఖిలేశ్ గుర్రుగా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో సీట్ల పంపకం గురించి పెద్ద నాయకులు ఆ విధంగా స్పందిస్తే తాను సైతం ప్రతిస్పందించకుండా ఉండడం కూడా సాధ్యం కాదంటూ అఖిలేశ్ ‘ఇండియా’ కూటమి మిథ్య అన్నంత వరకు వెళ్లారు. కులగణన ఘనత తమకే దక్కాలని, ఇందులో కాంగ్రెస్‌కు కాస్త కూడా వాటా లేదని సమాజ్‌వాదీ వంటి పార్టీలు అభిప్రాయపడున్నాయి మరి!
కాంగ్రెస్ పార్టీకి పొత్తు సమ్మతం కాకపోతే ఆ విషయం చెప్పాలి. అంతేగాని మాకు వ్యతిరేకంగా కుట్రలు చేయకూడదు. మమ్మల్ని మోసం చేయాలని చూడ కూడదు అని పెద్ద మాటలే అఖిలేశ్ సంధించారు. తాము అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలలోను కులగణన చేపడతామని కాంగ్రెస్ చెప్పడం అఖిలేశ్‌కు నచ్చడంలేదు. అసలు ఈ నినాదంతో ఎన్నికల బరిలో దిగడానికి ఆ పార్టీకి హక్కే లేదన్నది అఖిలేశ్ వాదన. ఇప్పుడు తాము అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలలోను కులగుణన చేపడతామని చెబుతున్న ఈ కాంగ్రెస్ గతంలో తాము చేసిన కులగణన వివరాలు మాత్రం బయటపెట్టలేదని అఖిలేశ్ ప్రశ్నిస్తున్నారు. అసలు శతాధిక సంవత్సరాల పార్టీలో ఇంత గందరగోళం ఏమిటి అంటూ కూడా ఆయన నిలదీశారు. ఈ క్రమంలోనే తెలిసో తెలియకో కొన్ని దేవ రహస్యాలు కూడా చెప్పేశారు. ఇక్కడ ప్రశ్న ఏమిటీ అంటే విశ్వసనీయత. కాంగ్రెస్ వ్యవహార సరళి ఇలాగే ఉంటే ఆ పార్టీ వెనకాల ఎవరు ఉంటారు? అని అన్నారాయన. బీజేపీ అనేది చాలా వ్యవస్థీకృతమైన పార్టీ అని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి, ఈ మాత్రం ఎందుకు తెలియకుండా ఈ గందరగోళంతో అలాంటి పార్టీతో పోరాడదామనుకుంటే సాధ్యం కాదని తెలుసుకోండని కూడా అఖిలేశ్ హితవు పలికారు. కూటమి, పొత్తు ధర్మాల ఆధారంగా మాకు స్థానాలు కేటాయించే ఉద్దేశమే లేకపోతే చర్చలు కూడా దండగేనని కూడా ఎస్పీ నాయకుడు తలంటారు. ఇండియా కూటమి పొత్తులనేవి జాతీయ ఎన్నికల వరకేనని మధ్యప్రదేశ్ పరిణామాల బట్టి అర్థమవుతుందని కూడా తేల్చారు ఎస్పీ నేత. కమల్‌నాథ్ మాటలు అఖిలేశ్‌ను బాగానే రెచ్చగొట్టాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో ఈ రకంగా మాట్లాడినవారికి రేపు ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల సమయంలో మాతో చర్చించడానికి వచ్చినప్పుడు సమాధానం చెప్పగలం అని కూడా హెచ్చరించారు. సరిగ్గా ఇదే మర్యాద చేస్తామని కూడా చెప్పేశారు. మధ్యప్రదేశ్ ఎన్నికల బరి నుంచి సమాజ్‌వాదీ వైదొలగకపోతే అంతిమంగా బీజేపీకే లబ్ధి చేకూరు తుందని రాయ్ చేసిన విశ్లేషణను అఖిలేశ్ కొట్టిపారేశారు. ఘోసి (యూపీ) అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తప్పుకున్న విధంగానే ఎంపీలో సమాజ్‌వాదీ తప్పుకోవాలని రాయ్ మెలిక పెట్టారు. ఇది కూడా అఖిలేశ్‌కి నచ్చలేదు. రాయ్ ఓ శుంఠ, ఆయన అలాగే చెబుతాడు అని కూడా అనేశారు. ఘోసీ ఎన్నికకు ఒక ప్రత్యేకత ఉంది. ఇండియా కూటమి ఏర్పడిన తరువాత జరిగిన తొలి ఎన్నిక ఇదే. ఇక్కడ ఎస్సీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థిపై 42వేల భారీ మెజారిటీతో గెలిచారు. ఆ సమయంలో ఆర్‌ఎల్‌డీ, కాంగ్రెస్ పార్టీ ఎస్పీకి మద్దతు ఇచ్చాయి. ఇది గుర్తు పెట్టుకునయినా సమాజ్‌వాదీ మధ్యప్రదేశ్‌లో పోటీ చేయరాదని కాంగ్రెస్ ఆశ. అసోం పీసీసీ నేత భూపేన్ బోరా ప్రకటన కూడా ఈ నేపథ్యంలోనే వెలువడిరది. రాష్ట్రంలోని 14 స్థానాలకు తాము పోటీ చేస్తామని ఆయన అన్నారు. ఇక్కడ తాము అంటే కాంగ్రెస్‌తో కలసి వచ్చే పార్టీలని కూడా ఆయన భాష్యం చెప్పారు. మూడు ప్రాంతీయ పార్టీలు కలసి రావడం లేదని కూడా చెప్పేశారు. అందులో ఒకటి ఎస్పీ అన్నదే ఆయన ఉద్దేశం. మరొక ప్రాంతీయ పార్టీ ఆప్ కూడా ఇండియాలో ఉంటూనే మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో అభ్యర్థుల జాబితాలు ప్రకటించేసింది.
ఇదంతా చూస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా కూటమిని ఘమండియా అని వ్యాఖ్యానించడం (అహంకారుల కూటమి) సరైనదేనని తేలిందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. వీళ్లంతా అట్టహాసంగా ఇండియా అన్న పేరు పెట్టుకున్నందుకైనా సమైక్యంగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే, ఇండియా అని పేరు పెట్టి, ఎన్నికల నగారా మోగగానే చీలికలు పేలికలుగా చెదిరిపోవడమే బాధాకరంగా ఉంటుంది. ముందు ముందు ఎన్ని కలహాలు వస్తాయో! భాగస్వాములు ఎన్ని తిట్టు కుంటారో! ఎన్ని ముక్కలు చేస్తారో! అన్నిసార్లు ‘ఇండియా’ని చీల్చాలా?