తెలంగాణ ప్రభుత్వం వేలాది మంది నిరుద్యోగులను ఇంకోసారి భంగపాటుకు గురిచేసింది. ప్రతిష్టాత్మకమైన గ్రూప్‌-1 ‌పోటీ పరీక్ష రెండోసారి కూడా రద్దయ్యింది. రూ. లక్షలు ఖర్చుచేసి నెలలు, సంవత్సరాల పాటు పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయిన అభ్యర్థులకు ఈ పరిణామం శరాఘాతమైంది. ఈ వ్యవహారం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి న్యాయస్థానం ముందు బొక్కబోర్లా పడింది.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ (‌టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌-1 ‌ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో దారుణంగా విఫలమైందని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది, నోటిఫికేషన్‌కు విరుద్ధంగా పరీక్ష నిర్వహించారని, బయోమెట్రిక్‌ ‌సహా భద్రతా ఫీచర్లన్నీ పట్టించుకోలేదని ఉన్నత న్యాయ స్థానం పేర్కొంది.

అభ్యర్థుల సంతకాల్లో తేడాలను గుర్తించడం లోనూ టీఎస్‌పీఎస్సీ విఫల మైందని, అత్యంత పకడ్బందీగా నిర్వహించాల్సిన పరీక్షల్లో 258 మంది ఓఎంఆర్‌ ‌షీట్లు అదనంగా ఎలా జతచేశారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ విషయాన్ని టీఎస్‌పీఎస్సీ కౌంటర్‌ అఫిడవిట్‌లో పేర్కొనక పోగా, తప్పుడు వివరాలతో కౌంటర్‌ ‌దాఖలు చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ ఏడాది జూన్‌ 11‌వ తేదీన నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తున్నామని, నోటిఫికేషన్‌ ‌ప్రకారం పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశిస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పు ప్రభుత్వానికి మరోసారి చెంపపెట్టులా పరిణమించింది.

టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలను అమలు చేయలేదని, బయోమెట్రిక్‌ ‌తీసుకోకుండా పరీక్ష నిర్వహించినందున పరీక్షను రద్దు చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై ఇరువర్గాల వాదనలను విన్న జస్టిస్‌ ‌పి.మాధవీదేవి నేతృత్వంలోని ధర్మాసనం ఆగస్టు 3న రిజర్వు చేసిన తీర్పును, సెప్టెంబర్‌ 23‌న వెలువరించింది.

ఇదీ టీఎస్‌పీఎస్సీ బండారం

నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా బయో మెట్రిక్‌ ‌తదితర సెక్యూరిటీ ఫీచర్లను అమలు చేయలేదని, పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ దారుణంగా విఫలమైందని పిటిషనర్ల తరఫున సీనియర్‌ ‌న్యాయవాది గిరిధర్‌రావు, న్యాయవాది బి.నర్సింగ్‌ ‌వాదనలు వినిపించారు. నోటిఫికేషన్‌ను అమలు చేయకుండా నిర్వహించిన పరీక్ష చెల్లదని, దానిని రద్దు చేయాలని కోరారు. గత ఏడాది అక్టోబరులో మొదటిసారి గ్రూప్‌-1 ‌ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించినప్పుడు హాల్‌ ‌టికెట్లపై హోలోగ్రాం వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయని, ఆ పరీక్ష పేపర్‌ ‌లీకేజీ కారణంగా రద్దయిందని, పేపర్‌ ‌లీకేజీ వ్యవహారం బయటపడ్డ తర్వాత టీఎస్‌పీఎస్సీ మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉండగా.. ఆలస్య మవుతోందని, ఖర్చు ఎక్కువ అవుతుందన్న కారణంతో భద్రతా ఫీచర్లను ఎత్తేసిందని, ఇది చెల్లదని వాదించారు. ఐడీ ప్రూఫ్‌ల తనిఖీ.. సంతకాల తనిఖీ సరిగా జరగలేదని, అంతా ఇన్విజిలేటర్లే చూసుకున్నారని చెప్పడం సరికాదని, దరఖాస్తు చేసినప్పటి అభ్యర్థుల సంతకాలకు, నామినల్‌ ‌రోల్స్‌లో పెట్టిన సంతకాలకు సరిపోలేదని, ఈ విషయాన్ని ఏ ఇన్విజిలేటర్‌ ‌కూడా గుర్తించలేదంటే తప్పు జరిగినట్లే అని, చిన్న తప్పు అయినా.. పెద్ద తప్పు అయినా తప్పు తప్పే అని కోర్టులో స్పష్టం చేశారు. నామినల్‌ ‌రోల్స్‌లో సంతకాల వెరిఫికేషన్‌ ‌విషయంలోనూ టీఎస్‌పీఎస్సీ విఫలమైందని తెలిపారు. జూన్‌ 11‌వ తేదీన (రెండోసారి) జరిగిన పరీక్షలో 2,33,248 ఓఎంఆర్‌ ‌షీట్లు వచ్చాయని టీఎస్‌పీఎస్సీ పేర్కొందని, కానీ, 17 రోజుల తర్వాత జారీ చేసిన వెబ్‌నోట్‌లో 2,33,506 ఓఎంఆర్‌ ‌షీట్‌లను స్కానింగ్‌ ‌చేసినట్లు పేర్కొందని మరి 258 ఓఎంఆర్‌ ‌షీట్‌లు అదనంగా ఎక్కడి నుంచి వచ్చాయని సందేహాలు వెలిబుచ్చారు. బయోమెట్రిక్‌ ‌తీసుకుని ఉంటే ఈ తేడా వచ్చేది కాదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఎలాంటి తప్పులు జరగలేదనడంలో అర్థం లేదని, పేపర్‌ ‌లీకేజీ వ్యవహారంలో ఏ-1గా ఉన్న ప్రవీణ్‌కు పరీక్ష రాయడానికి ఎన్‌వోసీ ఇచ్చి కూడా విధుల్లో ఉంచారని గుర్తు చేశారు. ఇన్ని ఆరోపణలు, వైఫల్యాలున్న పరీక్షను రద్దు చేయకుండా ఉండటం చట్టవిరుద్ధమని.. పరీక్షను రద్దు చేయాలని కోరారు.

సమర్థించుకునే ప్రయత్నం!

టీఎస్‌పీఎస్సీ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘మొదటిసారి నిర్వహించిన గ్రూప్‌-1 ‌పరీక్షలో లీకేజీ జరిగిందని తెలిసిన వెంటనే ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుని ఆ పరీక్ష•ను రద్దు చేసింది. టీఎస్‌పీఎస్సీ రెండోసారి పరీక్షను పకడ్బందీగా పూర్తిచేసింది. నామినల్‌ ‌రోల్స్‌లో సంతకాలు సరిపోలలేదన్న వాదనలో పస లేదు. ఒక మహిళా అభ్యర్థి వివాహం జరిగిన తర్వాత మారిన ఇంటి పేరుతో సంతకం చేశారు. బయోమెట్రిక్‌ ‌స్థానంలో ఆధార్‌ ‌వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డు వెరిఫికేషన్‌ అత్యంత కచ్చితత్వంతో జరిగింది. పిటిషనర్లు తప్ప లక్షల మంది అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. దురుద్దేశంతో కూడిన ఈ పిటిషన్లను కొట్టేసి ఫలితాల వెల్లడికి, మెయిన్స్ ‌పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలి’ అని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి మాల్‌ ‌ప్రాక్టీస్‌కు అవకాశం లేదు’ అని స్పష్టం చేశారు.

టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు ప్రశ్నల మీద ప్రశ్నలు

మొదటిసారి నోటిఫికేషన్‌లో పేర్కొన్న భద్రతా ఫీచర్లు, నిబంధనలు అటు టీఎస్‌పీఎస్సీకి, ఇటు అభ్యర్థులకు తప్పనిసరి అని అర్థమవుతోందని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘స్టేట్‌ ఆఫ్‌ ‌తమిళనాడు వర్సెస్‌ ‌జి.హేమలత’ కేసును ప్రస్తావిస్తూ, పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌నోటిఫికేషన్‌లో పేర్కొన్న సూచనల అమలు తప్పనిసరని సుప్రీంకోర్టు తీర్పును గుర్తుచేసింది. చట్టానికి ఉన్నంత శక్తి పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌సూచనలకు ఉంటుందని, హైకోర్టు తన అధికారాల ద్వారా వాటిని సవరించడం లేదా మినహాయింపులు ఇవ్వడం గానీ చేయలేదని సుప్రీంకోర్టు పేర్కొందని గుర్తుచేసింది. ‘పాత నోటిఫికేషన్‌లోని నిబంధనలను సవరించే అధికారం టీఎస్‌పీఎస్సీకి ఉన్నప్పటికీ దానికి ఎలాంటి సవరణలు లేకుండానే రెండోసారి (జూన్‌ 11‌న) పరీక్ష నిర్వహించారు. బయోమెట్రిక్‌ ‌సహా పాత నిబంధనలను అమలు చేయలేమని అనుకున్నప్పుడు గ్రూప్‌-4 ‌తరహాలోనే అనుబంధ లేదా సవరణ నోటిఫికేషన్‌ ‌జారీచేయాలి. సవరించలేనప్పుడు నోటిఫికేషన్‌ను యథాతథంగా అమలు చేయాల్సిందే. నోటిఫికేషన్‌లో పేర్కొన్న భద్రతా చర్యలను పాటించకపోవడం ద్వారా టీఎస్‌పీఎస్సీ ఇంపర్స నేషన్‌కు అవకాశం ఇచ్చింది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. టీఎస్‌పీఎస్సీ తెలిపిన ఉదాహరణల్లోనే ఒకరిద్దరి సంతకాల్లో తేడాలు ఉన్నట్లు తెలుస్తోందని, వాటిని పరీక్ష సందర్భంగా గుర్తించడంలో విఫలమయ్యారని వ్యాఖ్యానించింది. తుది తీర్పు సందర్భంగా టీఎస్‌పీఎస్సీ తప్పిదాలను ప్రస్తావించకపోతే విధి నిర్వహణలో తాము విఫలమైనట్లేనని ధర్మాసనం కఠినంగా వ్యాఖ్యా నించింది. కనీస ఆలోచన లేకుండా కౌంటర్‌ అఫిడవిట్‌ ‌దాఖలు చేశారని అభిశంసించింది. పరీక్షకు ఎంతమంది అభ్యర్థులు హాజరయ్యారనే వివరాలను సరిపోల్చుకోకుండానే కౌంటర్‌ ‌వేశారని పేర్కొంది. ఓఎంఆర్‌ ‌షీట్ల విషయంలో పొంతనలేని వివరణలను బట్టి టీఎస్‌పీఎస్సీ అటు పరీక్ష నిర్వహణలో, ఇటు అభ్యర్థుల హాజరు డేటాను సరిపోల్చుకోవడంలో విఫలమైనట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.

ప్రిలిమినరీ పరీక్ష స్క్రీనింగ్‌ ‌పరీక్ష మాత్రమేనని, ఈ పరీక్షలో పలువురు అభ్యర్థులు అక్రమ పద్ధతుల్లో అర్హత సాధించినా, మెయిన్‌ ‌పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న టీఎస్‌పీఎస్సీ వాదనను ధర్మాసనం తప్పుబట్టింది. అక్రమ పద్ధతుల్లో అర్హత సాధించిన వారి వల్ల కొంతమంది మెరిట్‌ ‌కలిగిన అభ్యర్థులు మెయిన్స్‌కు ఎంపిక కాకుండా పోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది. వారికి న్యాయం జరిగేందుకు గ్రూప్‌-1 ‌ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేస్తున్నామని, బయోమెట్రిక్‌ ‌సేకరణ సహా నోటిఫికేషన్‌లో పేర్కొన్న అన్ని సూచనలను పాటిస్తూ మళ్లీ పరీక్ష నిర్వహించాలని నిర్దేశించింది.

ధనిక రాష్ట్రంలో నిధుల కొరతా!

గ్రూప్‌-1 ‌ప్రిలిమినరీ పరీక్షలో బయోమెట్రిక్‌ అమలు చేసేందుకు కోటి యాభై లక్షల రూపాయలు ఖర్చవుతుందని, ఇప్పటికిప్పుడు ఆ మొత్తాన్ని సమకూర్చుకోలేకే ఆ విధానాన్ని తొలగించామని టీఎస్‌పీఎస్‌సీ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనల సందర్భంగా స్పష్టంచేశారు. అయితే, న్యాయస్థానం ఈ వాదనను తీవ్రంగా ఆక్షేపించింది. దేశంలోనే సంపన్న రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణలో కొలువులు భర్తీచేసే కమిషన్‌ ‌దుస్థితి ఇదన్న విమర్శలు చుట్టుముడుతున్నాయి. సంక్షేమ పథకాలకు, భారీ ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసే ప్రభుత్వం, అత్యంత కీలకమైన గ్రూప్‌-1 ‌పరీక్షల నిర్వహణకు కేవలం కోటిన్నర రూపాయలు ఇవ్వలేదా? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నిజానికి, నోటిఫికేషన్లు జారీచేసినప్పుడల్లా నిధుల కొరత లేకుండా గతంలో ప్రభుత్వాలు స్పెషల్‌ ‌ఫండ్‌ ‌విడుదల చేసేవి. కానీ ఇప్పుడు, గ్రూప్‌-1 ఉద్యోగ నియామకాల ప్రకటన వెలువడిన తర్వాత సర్కారు ప్రత్యేక నిధులేమీ ఇవ్వలేదు. కనీసం గ్రూప్‌-1 ‌మొదటిసారి పరీక్ష రద్దు అయ్యాక కూడా నిధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదు. నిధుల సమస్య తీవ్రంగా ఉన్నందునే పరీక్ష నిర్వహణకు సంబంధించిన భద్రతాపరమైన అంశాల్లో టీఎస్‌పీఎస్సీ రాజీ పడాల్సి వచ్చిందని స్పష్టమవుతోంది. పోలీసు కానిస్టేబుల్‌, ‌సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ‌పోస్టులు,గురుకుల ఉపాధ్యాయుల పోస్టులు, జూనియర్‌ ‌లెక్చరర్ల భర్తీకి….ఇలా ప్రతి పోటీ పరీక్షకు అభ్యర్థుల నుంచి రూ. వెయ్యి వంతున రుసుం వసూలు చేస్తున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఏమీ విడుదల చేయడం లేదు. దాంతో, ఖర్చంతా దరఖాస్తు రుసుము ద్వారానే వసూలు చేస్తున్నారు. కానీ, రాష్ట్రంలోనే అత్యున్నత పరీక్షగా భావించే గ్రూప్‌-1 ‌పరీక్షకు మాత్రం టీఎస్‌పీఎస్సీ రూ.200 దరఖాస్తు రుసుముగా నిర్ణయించింది.

దరఖాస్తు రుసుం అందరికీ అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంది. అయితే పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలంటే అన్ని భద్రతా చర్యలూ తీసుకోవడానికి ఒక్కొక్కరికి దాదాపు రూ.1000 వరకూ ఖర్చవుతుంది. దీని ప్రకారం, ఒక్కో దరఖాస్తుకు అదనంగా అయ్యే ఖర్చు సొమ్ము రూ. 800 టీఎస్‌పీఎస్సీకి ఎలా సమకూరుతుంది. నిజానికి, ఈ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. సర్కారు తన బాధ్యతను విస్మరించినందునే గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్ ‌రెండోసారి రద్దుకు ప్రధాన కారణమని స్పష్టమవుతోంది.

కొలువుల నినాదం ఎక్కడ?

కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో ‘కొలువులు ఇస్తాం’ అంటూ ప్రధానంగా నినాదం ఎత్తుకుంది. కానీ, తొమ్మిదేళ్లు పూర్తయిన తర్వాత కానీ గ్రూప్‌-1 ‌నోటిఫికేషన్‌ ‌విడుదల కాలేదు. ఎట్టకేలకు, నోటిఫికేషన్‌ ఇచ్చినా.. తొలిసారి పేపర్‌ ‌లీకేజీతో పరీక్షను రద్దు చేసింది. నిరుద్యోగ యువతతో పాటు, ఉన్న ఉద్యోగాలు వదులుకుని కొందరు, సుదీర్ఘకాలంపాటు సెలవులు పెట్టుకుని ఇంకొందరు కోచింగ్‌ ‌సెంటర్లకు లక్షలాది రూపాయలు చెల్లించుకుని రాత్రింబవళ్లు పరీక్షలకు తయారైన అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒకసారి జరిగిన పొరపాట్లను సరిద్దుకుని ముందుకు సాగాల్సిన టీఎస్‌పీఎస్సీ, జూన్‌ 11‌వ తేదీన పరీక్ష తేదీని ప్రకటించడంలోనూ దుందుడుకుతనాన్ని ప్రదర్శించింది. కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థులు కోరినా, తమ నిర్ణయమే ఫైనల్‌ అన్నట్లు వ్యవహరించింది. ప్రభుత్వ తీరుతో ఆర్థిక, మానసిక, శారీరక క్షోభ రూపంలో తాము మూల్యం చెల్లించుకోవలసి వస్తోందని అభ్యర్థులు మండిపడుతున్నారు.

– సుజాత గోపగోని, 6302164068,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE