సుందర హర్మ్యాలు, మణిమయ భవనాలు, స్వర్ణద్వారాలు, సువాసనలు వెదజల్లే పుష్పాలు, ఉద్యానవనాలతో, సరస్సులతో కొండపైన ఉన్న లంక కైలాసంలా, ఆకాశానికి తగిలించిన సుందర చిత్రపటంలా వానరసేనకు అగుపించిందం టాడు వాల్మీకి మహర్షి. ఆయన రామాయణంలో రావణరాజ్యం శ్రీలంక వర్ణన ఇది. ఆ స్వర్ణద్వారాలు, మణిమయ భవనాలు లేకున్నా ఆధునిక శ్రీలంక సుందర ఉద్యానవనాలు, కలవలూ తామరలతో కొలనులు, అద్దాల వంటి రహదారులు, వృక్షసంపదతో ఎలాంటి వారినైనా ఆకట్టుకునేలా ఉంది. ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రజలు ప్రశాంతంగా, చిరునవ్వుతోనే కనిపిస్తారు. ఇటీవలే దేశ అధ్యక్ష భవనంపై దాడి చేసి, తిరుగుబాటు చేసింది వీరేనా అని ఎవరికైనా అనిపించకమానదు. పుట్టిన చోట దాదాపు కనుమరుగైనా, అక్కడ మాత్రం క్రీపూ రెండవ శతాబ్దం నుంచి నేటివరకూ బౌద్ధం నిరాటంకంగా కొనసాగుతున్నది.
బౌద్ధం అత్యున్నత స్థాయిలో విలసిల్లిన రాజ్యం శ్రీలంక. మౌర్య చక్రవర్తి అశోకుని కుమారుడు మహేంద్రుడు, కుమార్తె సంఘమిత్రలు క్రీపూ రెండవ శతాబ్దంలో పరిచయం చేసిన బౌద్ధాన్ని నేటికీ అనుసరిస్తున్నారు. నాటి పాలకుడైన దేవానామ్ పియ-తిస్స ఆహ్వానంతో వెళ్లిన మహేంద్రుడు బౌద్ధానికి అంకురార్పణ చేశారు. మహేంద్రుడు అనుయాయులతో కలసి అనురాధపురానికి 8 మైళ్ల దూరంలో గల మిహినతలె కొండ (పురాతన శాసనలు దొరికిన స్థలం)కు చేరుకుని తిస్సకు బౌద్ధ బోధనలను వినిపించి, బౌద్ధంలోకి తీసుకువచ్చారు. తర్వాత రాజు ఆహ్వానం మేరకు మహామేఘ ఉద్యానవనంలో స్థిరపడిన బౌద్ధ భిక్షువులు మొదట రాచకుటుంబానికీ, అనంతరం సామాన్య ప్రజలకూ బోధించడం ప్రారంభించారు. సంఘమిత్ర మూల బోధివృక్షం నుంచి ఒక కొమ్మను తీసుకునివెళ్లి అనురాధపురంలో నాటిందని చెబుతారు. నాటి నుంచి నేటివరకూ బౌద్ధులు ఆ బోధివృక్షాన్ని పరిరక్షించు కుంటూ వస్తున్నారు.
ఒకటవ శతాబ్దంలో ఆ దేశపాలకుడైన వత్తగామిని పాలనలో బౌద్ధ భిక్షువులు ఆలోక విహారంలో సమావేశమై, ‘త్రిపీఠిక’లను పాళీ భాషలో తొలిసారి రచించారు. వాస్తవానికి ప్రముఖ తెరవాద బౌద్ధ తత్వవేత్త ఆచార్య బుద్ధఘోషుడు నేటి ఆంధప్రదేశ్‌లోని పలనాడు జిల్లా, పిడుగురాళ్లకు సమీపంలోని కోటనెమలిపురకు చెందినవాడని చరిత్రకారుడు డాక్టర్ శివనాగిరెడ్డి చెప్తున్నారు. బుద్ధఘోషుడు అక్కడి నుంచి శ్రీలంకకు వెళ్లి అక్కడి కొండగుహలలో నివసించి క్రీశ 5వ శతాబ్దంలో ‘విశుద్ధిమగ్గ’ను రచించారని ఆయన చెప్పారు.
బౌద్ధంలో ప్రధాన స్రవంతులు
బౌద్ధంలో హీనయాన, మహాయాన అన్నవి రెండు ప్రధాన స్రవంతులుగా కొనసాగుతున్నాయి. బుద్ధుని నిర్యాణానంతరం వెంటనే మహా కాశ్యపుడి అధ్యక్షతన జరిగిన తొలి సంఘ సమావేశంలోనే స్తవిరవాదులు లేక తెరవాదులు బుద్ధుడు సన్యాసుల జీవన విధానంలో పాటించవలసిన పది సూచనలు, నిషేధాలను పాటించి తీరాలని పట్టు బట్టినప్పుడు అత్యధికులు తిరస్కరించారు. ఆ తరువాత వారు రెండుగాచీలిపోయి అత్యధికులు తమను తాము మహాసంఘికులుగా అభివర్ణించుకున్నారు. ఈ తొలి చీలికే అనంతర కాలంలో, తెరవాద, మహాయాన, వజ్రయాన (మహాసంఘిక స్రవంతి ఒక్కటే 283 బిసిఇ నాటికి మూడు భిన్న శాఖలకు జన్మనిచ్చిందనే వాదన ఉంది)గా విస్తరించింది. వాస్తవానికి ఇంకా అనేక స్రవంతులు వచ్చాయని చరిత్రకారులు చెబుతున్నారు. వారిలో ఎన్ని చీలికలు, శాఖలు పుట్టుకువచ్చినప్పటికీ వారంతా కూడా బుద్ధుని బోధల సారాంశాన్ని, దార్శనికతను అంగీకరించారు. సిద్ధాంత వ్యాఖ్యానంలోను, కొన్ని ఆచరణలలోనూ భేదాల కారణంగా భిన్న శాఖలు పుట్టుకువచ్చాయి.
శ్రీలంకలో తెరవాద బౌద్ధం
బుద్ధుడి తొలి బోధనలు పాళీ సాహిత్యంలో కనిపిస్తాయి. అవి తెరవాద సిద్ధాంతానికి చెందినవై ఉన్న కారణంగా దీనిని బౌద్ధంలోనే అత్యంత సంప్ర దాయ సిద్ధాంతంగా భావిస్తారు. అందుకే తెరవాదులు బౌద్ధ మత స్థాపకుడి దార్శనికతకు అతి సమీపంగా ఉండేది తామేనని ప్రకటించుకుంటారు. వీరు ప్రధానంగా మూడు శిక్షణలపై (త్రిశిక్ష) దృష్టిపెడ తారు. ఈ సిద్ధాంతం ప్రకారం బుద్ధుడి బోధనలు అత్యంత సరళమైనవి. శీల (నైతిక వర్తన), సమాధి (ధ్యానం) ప్రజ్ఞ (వివేచన/ వివేకం). వీటిని అష్టాంగమార్గంలో భాగంగా, బుద్ధఘోషుడి స్ఫూర్తితో పాటిస్తారు. తెరవాదులు వ్యక్తిగతంగా బుద్ధ బోధనలను పాటించడం ద్వారా నిర్వాణాన్ని పొందా లని అంటే, మహాయానులు ప్రతి జీవికీ నిర్వాణాన్ని కోరుకుంటారు. అలాగే తెరవాదంలో విగ్రహాలు, గుర్తులు వంటివాటికి చోటు ఉండదు కానీ మహా యానంతో అలా కాదు. శ్రీలంకలో ప్రధానంగా తెరవాదమే ఉన్నప్పటికీ, నాటి రాజులు మహాయానంతో కూడా ప్రభావితం కావడంవల్ల అనేక బుద్ధ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇక్కడ విహారంలోనూ, ఆరామంలోనూ మనకు ప్రముఖంగా కనిపించే విగ్రహం శయన బుద్ధ విగ్రహం. అనంత పద్మనాభుడిని తలపించేలా శయనించిన బుద్ధ విగ్రహం మనకు పలు విహారాలలో , ఆలయాలలో కనిపిస్తుంది.
ఆరామ, విహారాలమయం అనురాధపురం
బౌద్ధాన్ని స్వీకరించిన దేవానామ్ పియ తిస్స దగ్గర నుంచి పాండ్యుల వరకు అందరూ అనురాధ పుర రాజ్యంలో బౌద్ధాన్ని పోషించారు. అక్కడి విహారాలు, స్తూపాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవు. వాటి సౌందర్యం, శిల్పకళా నైపుణ్యం అద్భుతం. క్రీపూ నాటి కట్టడాల నుంచి క్రీశ వరకూ నిర్మించిన విహారాల వరకూ ఎన్నింటినో చూసేందుకు, ప్రార్ధనలు జరిపేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. యునెస్కో కొన్ని ప్రాంతాలను ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించి, వాటి పునరుద్ధరణకు నడుం కట్టింది.
రువాన్‌వెలిసేయ
అనురాధపురంలో తప్పక దర్శించవలసిన స్తూపమిది. క్రీపూ 140లో దాదాపు 300 అడుగుల ఎత్తులో నాటి పాలకుడు దుత్తగామిని నిర్మాణాన్ని ప్రారంభించగా, చోళులు అనురాధపురాన్ని జయించిన తర్వాత దీనిని పూర్తి చేశారంటారు. ఈ స్తూపాన్ని ‘మహా స్తూపం’ అంటారు. చాలాకాలంగా ఆదరణ లేక శిథిలావస్థకు చేరిన ఈ స్తూపాన్ని ఇటీవలనే పునరుద్ధరించి, పునర్ వైభవం తెచ్చారు.ఈ స్తూపానికి ప్రధాన భక్కువుగా వెన్ పల్లెగామ హేమరతన తెరవ్యవహరిస్తున్నారు. పండుగలలోనే కాదు, వారాంతంలో వేలాది మంది భక్తులు వచ్చి, అక్కడి బోధివృక్షానికి కూడా పూజలు చేస్తారు.
అభయగిరి విహార
అత్యంత ప్రాచీనమైన అభయగిరి విహారాన్ని దర్శించకపోతే, బౌద్ధం అన్నది శ్రీలంకలో ఎంతటి విస్తృత స్థాయిలో విలసిల్లిందో అర్ధం కాదు. ప్రపంచంలోనే ఎక్కువ శిథిలాలు కలిగిన ప్రదేశాలలో ఒకటిగా, ఆ దేశంలో పవిత్రమైన బౌద్ధ యాత్ర చేయవలసిన ప్రాంతంగా దీనిని పరిగణిస్తారు. ఈ ప్రదేశాన్ని క్రీపూ 2వ శతాబ్దంలో నిర్మించారు. ఇది క్రీశ 1వ శతాబ్దంనాటికి అంతర్జాతీయ సంస్థగా ఎదగడమే కాదు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పండితులను ఆకర్షించి, అన్ని రకాల బౌద్ధ తాత్వికతలకు స్థానమిచ్చింది. అనేక అంతస్తులతో భిక్షువుల కోసం భవనాలు నిర్మించారు. నగరానికి ఉత్తర దిక్కున ఉండే ఈ విహారంలో, ఈత కొలనులు, స్తంభాల వరుసలతో మండపాలు, ‘సందకద పహానలు’ (అర్థ చంద్రాకారంలో సంసార చక్రానికి సంకేతంగా రాతిలో చెక్కి ఉంటుంది -చంద్రశిల అంటారు) చెక్కారు. శ్రీలంకలో ఏ విహారానికి లేదా బౌద్ధ ఆలయాలకు వెళ్లినా ఈ చంద్రశిల అనేది ప్రముఖంగా మనకు తారసపడుతుంది. అనురాధ పురంలో ఉన్న దాదాపు పదిహేడు బౌద్ధ కేంద్రాలలో ‘అభయగిరి’ అతిపెద్దది. అక్కడి ఐదు ప్రధాన విహారాలలో అత్యంత విశాలమైనది.
ఇంతటి ప్రాముఖ్యం కలిగినప్పటికీ, ఆదరణలేక శిథిలమైన ఈ ప్రాచీన స్తూపాన్ని అభయగిరి దగాబా అంటారు. శ్రీలంకలోని కేంద్ర సాంస్కృతిక నిధి రూ. 519.5 మిలియన్లతో (3.9 మిలియన్ అమెరికన్ డాలర్లు)తో 2015 నాటికి పునరుద్ధ రించింది. వాస్తవానికి బుద్ధుడి దంతం అసలు సంరక్షకులు ఈ ఉత్తర విహారం వారే. కాలక్రమంలో దానిని అక్కడి నుంచి తరలించి కాండీ పట్టణంలోని ఆలయంలో ఉంచారు.
సమాధి బుద్ధ
అనురాధపురంలోనే మరొక దర్శనీయ కేంద్రం మహామేవనవ పార్కులోని సమాధి బుద్ధుని విగ్రహం. క్రీశ 4-6వ శతాబ్దాల కాలంలో చెక్కిన ఈ విగ్రహం శ్రీలంకలోని బుద్ధుడి విగ్రహాలన్నింటిలోకీ ప్రత్యేకమై నది. ధ్యానముద్రలో కనిపించే ఈ ఏడు అడుగుల మూడు అంగుళాల విగ్రహం ఆయన తొలి జ్ఞానోదయ క్షణాల నాటి భంగిమగా అభివర్ణిస్తారు. ఇది పవిత్ర బోధివృక్షం కలిగిన ఆలయం చుట్టూ ఉన్న నాలుగు విగ్రహాలలో ఒకటిగా చెప్తారు. అయితే,ఈ ఒక్కటి మాత్రమే ఇంతవరకు దాడులను, ప్రకృతి బీభత్సాలను తట్టుకొని నిలిచింది.
బుద్ధుడు పద్మాసనంలో కూర్చుని, రెండు అరచేతులను తెరిచి ఒకదానిపై ఒకటి ఉంచిన ధ్యాన ముద్రలో కనిపిస్తాడు. ముఖంలో సంతోషం, దయ రెండూ ఉట్టిపడేలా చెక్కడం విశేషం. ఈ ప్రతిమలో కనిపించే హస్తముద్రలు ఇతర విగ్రహాలలో కనిపించే వాటికంటే పూర్తి భిన్నమైనవి.
పవిత్ర దంత ఆలయం, కాండీ
కాండీలో చూడవలసిన ప్రదేశాలలో బుద్ధుని దంతం ఉన్న పవిత్ర ఆలయం ప్రధానమైంది. బుద్ధుడి మహా పరినిర్వాణానంతరం, ఈ దంతాన్ని కళింగలో భద్రపరచి, రాజైన గుహశివ ఆదేశాల మేరకు యువరాణి, హేమామాలి, ఆమె భర్త దంత రహస్యంగా శ్రీలంకకు తీసుకువచ్చారుట. అనురాధ పురాన్ని (క్రీపూ 301-328) సిరిమేఘవన్న పాలిస్తున్నకాలంలో వారు లంక పట్టణ ద్వీపాన్ని చేరుకుని, రాజుకు దంతాన్ని అప్పగించారు. మహారాజు అనురాధపురంలో నేటి ‘ఇసురుమునియ’ అయిన మేఘవిహారంలో ప్రతిష్ఠించారు. దానిని పరిరక్షించే బాధ్యత రాజులదే కావడం, అనంతర కాలంలో ఆ దంతం ఎవరి దగ్గర ఉంటే వారికే పాలించే హక్కు దక్కడం సంప్రదాయంగా మారింది. ప్రస్తుతమున్న ఆలయ నిర్మాణాన్ని విమధర్మ సురియా-1, క్రీశ 1595లో పూర్తి చేశాడు. ఈ ఆలయంపై ఆధునిక కాలంలో జనతా విముక్తి పెరమునా (జేవీపీ), లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్‌టిటిఇ) దాడులు చేశాయి. భవనం కొద్దిగా దెబ్బతిన్నది. దీనిని పునరుద్ధరిస్తున్నారు
వాస్తవానికి శ్రీలంకకు బుద్ధుని భిక్షాపాత్ర, ఆయన కుడి కంటి ఎముక, ఆయన కేశం, తర్వాత క్రీ.శ.4లో బుద్ధుని దంతం వచ్చాయని కొందరు చరిత్రకారుల భావన. బహుప్రాచుర్యంలో ఉన్నది మాత్రమే బుద్ధుని దంతం కలిగిన ఆలయం మాత్రమే.
కెలేనియా ఆలయం (కెలేనియా రాజ మహా విహార)
కొలొంబోకు ఈశాన్యంలో 11 కిమీ దూరంలో కెలేనియా బౌద్ధ ఆలయం ఉంది. ప్రజల విశ్వాసం ప్రకారం తనకు జ్ఞానోదయమైన ఎనిమిదేళ్లకు, ఆఖరుసారి అంటే మూడోసారి బుద్ధుడు వచ్చినప్పుడు దీనిని నిర్మించారు. అంటే బిసిఇ 500 నాటిది. మహావన్స పత్రాల ప్రకారం, ఈ ఆలయంలో మణిమయ సింహాసనంపై కూర్చుని బుద్ధుడు బోధనలు చేసేవాడట. ఆధునికకాలంలో మహారాజు కీర్తి శ్రీరాజసింఘ కాలంలో ఈ ఆలయాన్ని పునర్ని ర్మించారు. 20వ శతాబ్దంలో మెరుగులు దిద్దారు. ఇక్కడ దర్శనమిచ్చే శయన బుద్ధుడు అనంత పద్మనాభస్వామిని తలపిస్తాడు. కెలేనియాలోనే కాక అనురాధపురాలోని అనేక విహారాలలో కూడా శయనబుద్ధుడి విగ్రహాలుండడం విశేషం.
ఈ ఆలయంలో కళాకారుడు సోలియా మెండిస్ చిత్రించిన శ్రీలంకలో బౌద్ధం, బుద్ధుని జీవితం, జాతక కథల నుంచి ఘట్టాలు యాత్రికులను ఆకట్టుకుం టాయి. ఈ ఆలయంలో 18 అడుగుల ఎత్తైన బోధిసత్వ అవలోకతేశ్వర రాతి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. సంఘమిత్ర బోధి మహావృక్షపు కుడి కొమ్మని తీసుకువచ్చి, నాటి రాజుకు అందిస్తున్న చిత్రం వీటిలో ఉంది. కాగా, ఇక్కడి బోధివృక్షం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసి, నీరు అర్పించడం సంప్రదాయం.
గంగారామయ ఆలయం
కొలంబోలో గల అతి ముఖ్యమైన ఆలయాలలో గంగారామ విహారం ఒకటి. బీరా కొలను పక్కనే స్థితమై ఉన్న ఈ విహారం 19వ శతాబ్దం చివరినాటికి పూర్తి చేశారు. ఇక్కడి శిల్పకళ శ్రీలంక, థాయ్‌లాండ్, భారతీయ, చైనా శిల్పకళల సమ్మిళితంగా ఉంటుంది. ఈ ఆలయంలో విహార మందిరం, చైత్యంతో పాటుగా ఒక మ్యూజియం కూడా ఉన్నది. ఈ మ్యూజియంలో పైన పేర్కొన్న అన్ని దేశాల నుంచి సేకరించిన, బుద్ధ విగ్రహాలతో పాటు, పురాతన వస్తువులు కనిపిస్తాయి. ముఖ్యంగా, అన్ని రకాల విలువైన రాళ్లతో మలచిన బుద్ధుని విగ్రహాలు ఇక్కడ ఆకర్షణగా చెప్పవచ్చు. ఇక్కడ గ్రంథాలయంలో పలు దేశాల నుంచి సేకరించిన గ్రంథాలు కనిపిస్తాయి. ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏమిటంటే, వారు భిన్న మతాలనూ ఆహ్వానిస్తారు. అమెరికా, టాంజేనియా వంటి ఇతర దేశాలలో దమ్మాన్ని ప్రచారం చేసేందుకు పలు కేంద్రాలను స్థాపించ డంలో కీలక పాత్రను పోషించిన ఆలయం ఇది.
ప్రాచీనకాలం నుంచీ భారత్, శ్రీలంకల మధ్య సాంస్కృతిక, రాజకీయ, సామాజిక, వాణిజ్య సంబంధాలు బలంగా ఉంటూ వచ్చాయి. ముఖ్యంగా బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉండడం వల్ల అనేకమంది శ్రీలంకవాసులు తమ వారసత్వ మూలాలు భారత్‌లో ఉన్నాయంటారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు 2,500 ఏళ్ళ వెనక్కి వెడతాయి. తమ సాంస్కృతిక సంబంధాలను పునరుద్ధరించు కోవడంలో భాగంగా 2012లో బుద్ధుడు జ్ఞానోదయం పొందిన (సమబుద్ధత్వ జయంతి అంటారు) 2600 సంవత్సరాన్ని ఉమ్మడి కార్యక్రమాల ద్వారా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా, కపిలవస్తుకు చెందిన పవిత్ర అవశేషాలను ఆ ఏడాది ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు పది ప్రదేశాలలో ప్రదర్శించగా, శ్రీలంక జనాభాలో 15 శాతమైన మూడు మిలియన్ల మంది ఈ పవిత్ర అవశేషాలను దర్శించి అర్చించుకున్నారు.
తెలంగాణ – శ్రీలంకల మధ్య బౌద్ధ మైత్రి
బుద్ధవనం – సెంట్రల్ కల్చరల్ ఫండ్
రాజకీయాల మాట ఎలా ఉన్నా ఇరు దేశాల ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాలు అనాదిగా బలంగానే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని బుద్ధవనం, శ్రీలంక సాంస్కృతిక విభాగం మధ్య బౌద్ధ సర్క్యూట్ వ్యాప్తికి జరుగుతున్న ప్రయత్నాలు అత్యంత చురుకుగా సాగుతున్నాయి. ఇటీవలే బుద్ధవనం ప్రాజెక్టు, శ్రీలంక కల్చరల్ అండ్ హెరిటేజ్ సంయుక్తంగా నిర్వహించిన ఎక్స్‌చేంజ్ పోగ్రాంలో భాగంగా జర్నలిస్టుల బృందం ఒకటి శ్రీలంకలో పర్యటించింది. అందులో భాగంగానే పలు బౌద్ధ పర్యాటక కేంద్రాలను సందర్శించింది.
తెలంగాణలో 279 ఎకరాలలో బౌద్ధ ఇతి వృత్తంతో అభివృద్ధి చేసిన ప్రాంతం బుద్ధవనం. సిద్ధార్థ గౌతముని సుప్రసిద్ధమైన, వినయశీల, సరళ జీవితం గురించి, బుద్ధ చరిత వనం, జాతక పార్క్, ధ్యాన వనం, స్తూప వనం, మహాస్తూపంతో పాటుగా అంతర్గత బౌద్ధ వారసత్వ మ్యూజియం ఇక్కడ ఉన్నాయి. మహాస్తూపంలో శిల్పకళా సంపద పర్యాటకులను సమ్మోహన పరుస్తుంది.
నాగార్జునసాగర్‌లోని నాగార్జునకొండలో 1954-60ల మధ్య జరిపిన తవ్వకాలలో మహా స్తూపాలు, చైత్యాలు, ఇతర కళాఖండాలు, కొన్ని ఆలయాలు బయిటపడ్డాయి. వాటిని అలాగే ఉంచితే ముంపునకు గురవుతాయి కనుక వాటిని నాగార్జున కొండలోని మ్యూజియంలో ఉంచారు. ప్రసిద్ధ బౌద్ధ ఆచార్యుడు నాగార్జునుడు ఇక్కడి వాడే.మహాయాన బౌద్ధానికి నాగార్జునకొండ ప్రముఖ కేంద్రం. బౌద్ధ దమ్మాన్ని వ్యాప్తి చేసేందుకు అనేక బౌద్ధ స్రవంతులు ఇక్కడ అధ్యయన పీఠాలను నెలకొలిపాయి.
బుద్ధవనంలో హాలివుడ్ భాగస్వామ్యంతో చిత్రం
దాదాపు దశాబ్దం కిందట బుద్ధుడి జీవితంపై సిద్ధార్థ గౌతమ పేరుతో గగన్ మాలిక్ హీరోగా బాలీవుడ్ చిత్రం విడుదలైంది. ప్రస్తుతం దానికి రెండో భాగాన్ని, హాలివుడ్-బాలీవుడ్ సంయుక్త నిర్మాణంలో శ్రీలంకలోనూ, బుద్ధవనం లోనూ చిత్రీకరిస్తున్నారు. ఇందుకు సంబందించిన అవగాహన పత్రంపై బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, చిత్ర నిర్మాత సంతకాలు చేశారు. అక్టోబర్ ఆఖరుకు హీరో తదితరులు బుద్ధవనం ప్రాజెక్టును సందర్శించ నున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హీరో గగన్ మాలిక్ తాను బుద్ధుని జీవితంతో ఎలా ప్రభావితమై, బౌద్ధాన్ని స్వీకరించింది.
శ్రీలంక కేంద్ర సాంస్కృతిక నిధి
శ్రీలంకలోని సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించి, నిర్వహించడం ద్వారా దాన్ని యావత్ ప్రపంచానికీ బౌద్ధ వారసత్వాన్ని అందించేలా చేయడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్న సంస్థ ఇది. భారత్‌లో, ముఖ్యంగా తెలంగాణలో బుద్ధవనం ప్రాజెక్టుతో కలిసి పని చేసే అవకాశాలను ఇరు పక్షాలూ అన్వేషిస్తున్నాయి. బుద్ధ పర్యాటక సర్క్యూట్‌ను పెంపొందించడం ద్వారా ఇరు దేశాలూ లాభపడవచ్చన్నది వారి భావన. ఈ సంస్థ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ గామిని రణసింగె భారత్ నుంచి వెళ్లిన జర్నలిస్టుల బృందానికి తమ దేశంలోని గ్రామీణ వ్యవస్థను, అనుబంధంగా ఉన్న చెరువులను, ఆలయాలను, అక్కడి జీవన, వ్యవహారశైలిని పరిచయం చేశారు. ప్రతి గ్రామానికీ ఒక చెరువు, ఒక బౌద్ధ ఆలయం, గ్రామం మొదట్లో వినాయకుడు, ఆ గ్రామ క్షేత్ర పాలకుడి విగ్రహాలు చూసినప్పుడు భారతీయులకు తమ దేశం గుర్తురాక మానదు.
– డి. అరుణ