ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి చర్యలు చేపట్టినా, ప్రజా జీవితాన్ని ఎంత సుఖవంతం చేసేందుకు కృషి చేస్తున్నా, వాటిని వేటినీ పట్టించుకోకుండా, దేశానికి వ్యతిరేకంగా రంథ్రాన్వేషణ చేస్తూ రాయడమే తమ బాధ్యతగా భారతీయ మీడియాలోని ఒక వర్గం భావిస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఒక వర్గపు భావజాలాన్ని కలిగి ఉన్నవారే మేధావులని, వారి దృక్పథమే శాశ్వత సత్యమని కొందరు జర్నలిస్టులు భావిస్తుంటారు. అందుకే, తొమ్మిదేళ్ల మోదీ పాలనను, నాయకత్వాన్ని అంతర్జాతీయంగా అందరూ ప్రశంసిస్తున్నా, వీరు మాత్రం ఈకలు పీకడమే ధ్యేయంగా పని చేస్తుంటారు. కేవలం దేశీయ పత్రికలలోనే కాదు, విదేశీ పత్రికలలో కూడా దేశానికి వ్యతిరేకంగా కట్టుకథలు రాస్తూ, అందుకు ప్రతిఫలంగా తాయిలాలు పొందడం కొందరు జర్నలిస్టులకు అలవాటుగా మారింది. తాము పేదల పక్షమని చెబుతూ, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించే వీరు ప్రభుత్వపు పనుల పట్ల సానుకూలంగా స్పందించే జర్నలిస్టులకు పేర్లు పెడుతుంటారు. వీరిని ‘గోదీ మీడియా’ అని హేళన చేస్తుంటారు. తమకు ఇష్టమైన పార్టీల చేత అటువంటివారిని నిషేధింపచేస్తూ తామేదో చాలా గొప్ప విజయాన్ని సాధించినట్టు భావిస్తుంటారు. పైగా, తప్పు చేసినప్పుడు ప్రభుత్వం దండించబోతే, పత్రికా స్వేచ్ఛకు ముప్పు అంటూ తమ గుంపుతో కలిసి గగ్గోలు పెడుతుంటారు. ఇటువంటి వారు ఇచ్చే సమాచారంతో రూపొందించే ప్రపంచ సూచీలలో భారత్ ఎప్పుడూ అట్టడుగులో ఉంటూ రావడంలో ఆశ్చర్యమేముంది?
ఈ వారంలో ‘న్యూస్ క్లిక్’ అనే వెబ్ పోర్టల్‌పై ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి, ఈ న్యూస్ పోర్టల్‌తో సంబంధం ఉన్న అనేక ప్రదేశాలపై దాడులు జరిపింది. ఇందులో న్యూస్ క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పురకాయస్త, జర్నలిస్టులు అభిసార్ శర్మ, ఊర్మిలేష్, పరంజయ్ గుహ ఠాకూర్థా వంటి వారు కూడా ఉన్నారు. ఇందులో కొందరు జర్నలిస్టులను ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కోసం తమ కార్యాలయానికి తీసుకువెళ్లారు. న్యూస్‌క్లిక్ అధిపతి పురకాయస్తను, హెచ్‌ఆర్‌ను పోలీసులు అరెస్టు చేసి, మిగిలినవారిని ప్రస్తుతానికి వెనక్కి పంపారు. అంతేనా, వారి లాప్‌టాప్‌లో, మొబైల్ ఫోన్ల నుంచి వారు తొలిగించిన డేటాను పోలీసులు రికవర్ చేశారు.
సీనిమా ఫక్కీలో పక్కా వ్యూహంతో దాడులు
తాము దాడి చేయబోయేది మీడియా సంస్థ కావడంతో, తమపై బురద పడకుండా ఉండేందుకు ఢిల్లీ పోలీసుల ప్రత్యేక సెల్ పకడ్బందీగా వ్యవహరించి, పక్కా ఆధారాలను సేకరించిన తర్వాతే దాడికి దిగింది. ఈ దాడి జరిగే ముందు 45 రోజులపాటు ఈ ప్రత్యేక బృందం రహస్య దర్యాప్తు నిర్వహించింది. ఈ దర్యాప్తులో భాగంగా సాంకేతిక పర్యవేక్షణ, ఆర్ధిక విశ్లేషణ, పోర్టల్‌లో వారు పోస్ట్ చేసే విషయాంశాల అధ్యయనాన్ని చేశారు. అనంతరం, అనుమానితులను ఎ, బి, సి అంటూ మూడు వర్గాలుగా విభజించారు. ‘ఎ’ వర్గంలో న్యూస్‌క్లిక్ అధిపతి, హెచ్‌ఆర్‌తో పాటు మరో నలుగురు అనుమానితులు ఉన్నారు. ఈ ఆపరేషన్‌లో 400-450మంది పోలీసులను భిన్న బృందాలుగా విడదీసి, అనుమానితుని ప్రొఫైల్‌ని బట్టి వారిని అక్కడకు పంపారు. ఆగస్టు 17న యూపీఏ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఢిల్లీ పోలీసులు తొలుత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి సేకరించిన పత్రాలపైనే ఆధారపడ్డారు.
అనంతరం, భారత సార్వభౌమత్వానికి ముప్పు వంటి నేరారోపణల కారణంగా ఈ దర్యాప్తు ఈడీ పరిధి ఆవలకు విస్తరించింది. దర్యాప్తు కోసం, అందులో భాగంగా సాంకేతిక పర్యవేక్షణ చేయడం కోసం పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ఒక ఆంగ్ల దినపత్రిక పేర్కొంది. ఆర్ధిక దర్యాప్తుపై దృష్టి కేంద్రీకరించిన బృందం, అనుమానితుల అనధికారిక చెల్లింపులు, ప్రయాణ చిట్టాలు సహా బ్యాంకు లావాదేవీలు, కార్పొరేట్ ఫైలింగ్స్ సహా వేలకొద్దీ పత్రాలను పరిశీలించింది. మరొక బృందం పోర్టల్‌లోని విషయాలను అధ్యయనం చేయడం, వీడియోలను, వ్యాసాలను విశ్లేషించి, ఏదైనా డేటాను డిలీట్ చేశారేమో చూసే పనిలో నిమగ్నమై సమాచారాన్ని సేకరించింది.
ఈ పరిశోధకులు అంతా చైనా జాడలను కనిపెట్టడంపై దృష్టిని కేంద్రీకరించారు. గతవారం ప్రాథమిక దర్యాప్తు పూర్తి అయిన తర్వాత, రెండు రోజుల పాటు రహస్య సమావేశాలను నిర్వహించు కున్న పోలీసు అధికారులు అనుమానితుల వర్గాన్ని బట్టి పోలీసుబృందాలను కూర్చారు. ఈ దాడులకు సంబంధించిన సమాచారం ఎక్కడా బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. దిగువస్థాయి పోలీసులకు దాడులు జరుపబోయే ప్రదేశానికి సమీపంలో ఉదయం 5 గంటలకల్లా సిద్ధంగా ఉండమని చెప్పారే తప్ప పూర్తి చిరునామా ఇవ్వలేదు. అవసరమైన మేరకు మాత్రమే పోలీసులకు సమాచారం ఇచ్చారట. కేటగిరి ఎ లో పురకాయస్త వంటి వారు ఉండగా, కేటగిరీ బి లో మధ్య స్థాయి అధికారులు, జర్నలిస్టులు ఉన్నారు. చివరి కేటగిరీ కన్సల్టెంట్లకు సంబంధించింది. ఇంతవరకూ వీరి పాత్రను నిర్వచించలేదు. మొత్తం మీద వివిధ రాష్ట్రాలలో 50మంది అనుమానితులపై దాడులు చోటు చేసుకున్నాయి.
న్యూస్ క్లిక్‌పై చర్యలు ఎందుకు?
ఆగస్టు నెలలో ఈ వర్గం జర్నలిస్టులంతా ‘శాశ్వత అక్షర సత్య’ పత్రికగా భావించే ‘న్యూయార్క్ టైమ్స్’లో అమెరికన్ బిలియనీర్, వామపక్షవాది, చైనా ప్రభుత్వ ప్రచార యంత్రాంగంతో సన్నిహితంగా పనిచేసే నైవేలీ రాయ్ సింఘమ్ ప్రపంచవ్యాప్తంగా నిధులు అందించే మీడియా సంస్థల నెట్‌వర్క్‌లో న్యూస్ క్లిక్ పోర్టల్ కూడా ఉందనే విషయాన్ని ఒక వ్యాసం ద్వారా బయిటపెట్టింది. ఈ సంస్థలు తమ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ, చైనా గొప్పదనాన్ని ప్రచారం చేసేందుకు ఉద్దేశించిన నిధులు ఇవి. ఈ సింఘం ‘భారీ సాఫ్ట్‌వేర్ సంస్థాధిపతి’, బిలియనీర్. ఈ వార్త వెలువడిన అనంతరం ఆగస్టు 17న కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 153ఎ (రెండు వర్గాల శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 120 బి (నేరపూరిత కుట్ర) కింద న్యూస్ క్లిక్‌పై కేసులు నమోదు చేశారు.
దాడులు చేసిన పోలీసులు న్యూస్ క్లిక్‌కు సింఘమ్ పంపిన ఇమెయిళ్లను స్వాధీనం చేసు కున్నారు. ఇందులో కోవిడ్ మహమ్మారి సమయంలో చైనా తన దేశంలో ఎంతటి మహత్తరమైన చర్యలు తీసుకున్నది, ఇతరులకన్నా ముందే ఎలా వాక్సిన్ కనుగొన్నది, అది ఎంత ప్రభావంతమైనదో, భారత్ ఎలా విఫల మైందో పట్టి చూపుతూ, వ్యాస పరంపర రాయాని ఇందులో కోరారు. ఆ సమయంలో భారత్‌లో పరిస్థితి భయావహంగా ఉందని, మోదీ ప్రభుత్వం అదుపు చేయడంలో విఫలమైందనీ వచ్చిన వ్యాసాల వెనుక ఎంత డబ్బు పారిందో ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు.
ఎవరీ నైవేలీ రాయ్ సింఘం?
మొన్నటివరకూ అమెరికాలో అతి భారీ సాఫ్ట్‌వేర్ కంపెనీని నడిపిన వ్యాపారవేత్త నైవేలీ రాయ్ సింఘం. తండ్రి ఆర్చిబాల్డ్ విక్రమరాజా సింఘం శ్రీలంకకు చెందినవారు. మార్క్సిస్టు అయిన ఆర్చిబాల్డ్ ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చి అక్కడే స్థిరపడ్డారు. నైవేలీ అక్కడే పుట్టిపెరిగి, వ్యాపారం చేశారు. ప్రస్తుతం షాంఘాయిలో నివసిస్తున్నట్టుగా చెప్తున్న రాయ్ సింఘం కూడా తండ్రిలానే మార్క్సిస్టు. అందువల్లనే అతడు చైనా కమ్యూనిస్టు పార్టీకి అతి సన్నిహితంగా ఉంటాడని చెప్తుంటారు. ఇతడు అమెరికాలో ఉన్న సమయంలో కూడా చైనాకు అనుకూలంగా ప్రచారం చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక ఎన్జీవోలకు, న్యూస్‌క్లిక్ వంటి న్యూస్ పోర్టళ్లకు నిధులు అందిస్తుండేవాడు. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రచార విభాగానికి సన్నిహితంగా ఉండే సింఘం, ఇతర దేశాలలో చైనా గొప్పతనాన్ని ప్రచారం చేయించ డంలో కీలక పాత్ర పోషిస్తుంటాడు.
ప్రస్తుతం కేవలం ‘న్యూస్‌క్లిక్’ మాత్రమే కాదు, తీస్తా సెతిల్‌వాద్ అధిపతిగా ఉన్న ‘ట్రై కాంటినెంటల్’ సంస్థపై కూడా పోలీసులు దాడులు నిర్వహించడంతో ఆమె పేరు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఈ సంస్థ గొడుగున నడుస్తున్న ‘సబ్‌రంగ్ ఇండియా’ పోర్టల్ కూడా ‘న్యూస్‌క్లిక్’ లానే ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంలో మునిగి ఉండడం ప్రధాన కారణం.
చిత్రమైన విషయమేమిటంటే, ఇటువంటి సంస్థలన్నింటికీ ఆర్ధిక సహాయాన్ని అందించేది సింఘమే అయినప్పటికీ, అది ప్రపంచాన్ని చుట్టి, ఇచ్చినవాడికి సంబంధం లేనట్టుగా కొత్త సంస్థ లేక వ్యక్తిపేరుతో ఈ సంస్థలను చేరుతుంది. దీనినే క్లుప్తంగా ‘మనీలాండరింగ్’ అని కూడా అనవచ్చు. తీస్తా సంస్థలకు వచ్చే నిధులు ‘ట్రై కాంటినెంటల్ గ్లోబల్’ నుంచి వస్తాయి. అమెరికా నుంచి పని చేస్తున్న ఈ సంస్థకు అధిపతిగా విజయ్‌ప్రసాద్ అనే భారతీయ నామధేయుడే వ్యవహరిస్తున్నాడు. సింఘం పంపిన డబ్బు ముందుగా అమెరికా వెళ్లి అక్కడి ట్రైకాంటినెంటల్ నుంచి న్యూస్‌క్లిక్, సబరంగ్ వంటి సంస్థలకు, ఎన్జీవోలకు వస్తుంది. అచ్చంగా చైనా గొప్పతనాన్ని పట్టి చూపుతూ, దేశీయ ప్రభుత్వాన్ని తక్కువగా చూపేందుకు ఉద్దేశించిందే ఈ డబ్బు.
చైనా ఇన్‌ఫ్లూయెన్స్ ఆపరేషన్లు (ప్రభావితం చేసే కార్యకలాపాలు)
నిఘా వర్గాల పరిభాషలో ఇన్‌ఫ్లూయెన్స్ ఆపరేషన్లుగా పిలిచే ఈ కార్యకలా పాలకు నిధులను అందించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గొప్ప దేశంగా చైనా తన పరపతిని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా వీరు పలు రకాల స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించి, నిధులు అందిస్తుంటారు.
ఉదాహరణకు జెండర్ ఈక్వాలిటీ, పర్యావరణ మార్పుపై పని చేసేవారికి, ఎంపిక చేసిన జర్నలిస్టులకు నిధులు ఇస్తుంటారు. వీటిని అందుకున్నవారు తమ దేశాలలోని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా లేని సమస్యలు ఉన్నట్టుగా లేక గోరంత సమస్యను కొండంతగా చూపి ప్రచారం చేస్తూ, అక్కడి ప్రభుత్వాల పట్ల ప్రజలకు ప్రతికూల భావన వచ్చేలా వ్యవహరిస్తుంటారు. ఇక జర్నలిస్టులైతే ‘స్వతంత్రత’ పేరుతో ఇష్టంవచ్చినట్టుగా విషయాలను వక్రీకరించి, వ్యాఖ్యానిస్తూ, దానిని ఎదుర్కొన్న వారిపై ఇష్టం వచ్చినట్టు ముద్రలు వేసి దున్నేస్తూ ఉంటారు. ఈ నిధుల వితరణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా, పలు సంస్థలు, జర్నలిస్టులతో ఒక గొలుసు నెట్‌వర్క్ ఏర్పడటమే కాదు, సోషల్ మీడియా సైట్లలో ఒకరి ట్వీట్‌ను మరొకరు రీట్వీట్ చేస్తూ తాము కావాలనుకున్న వాతావరణాన్ని సృష్టిస్తారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోగానే ప్రపంచ మీడియా దానికి స్పందించడం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
దీనిని ‘5వ తరం సమాచార ప్రచార యుద్ధం’ అని వ్యవహరిస్తారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చేపట్టిన ఈ ప్రచారం డబ్బు తిన్న జర్నలిస్టుల ‘స్వతంత్ర అభిప్రాయం’ ముసుగులో అక్కడి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాస్తుంటారు. సాధారణంగా, వామపక్ష జర్నలిస్టులు స్వతంత్ర అభిప్రాయమనే మాటను ఎక్కువగా ఉపయోగించడం మనం వింటుంటాం. ఈ స్వతంత్ర అభిప్రాయాలే ఆయా దేశాలలో విధానాలను, రాజకీయాలను ప్రభావితం చేస్తుంటాయి. మన దేశం విషయమే తీసుకుంటే, సీఏఏ, ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, కిసాన్ ఆందోళన్ వంటివన్నీ కూడా అమలు కాకుండా ఇటువంటివారు, సంస్థలు అడ్డుకున్నాయి. ప్రతి దేశంలోనూ తమ పౌరుల విషయంలో ఒక నేషనల్ రిజిస్ట్రీ ఉంటుంది. కానీ మన దేశంలో దాని అమలును వ్యతిరేకించారు.
ఇక సీఏఏ విషయంలో మైనార్టీలకు అన్యాయం జరుగుతుందంటూ ఎంత దుష్ప్రచారం జరిగిందో తెలియనది కాదు. కిసాన్ ఆందోళన విషయం చెప్ప నక్కర్లేదు. సాక్షాత్తు ప్రధానమంత్రే దానిని ఉపసంహ రిస్తున్నట్టు స్వయంగా ప్రకటించారు. ఈ ఉద్యమా లన్నింటి వెనుక ఉన్న స్వచ్ఛంద సంస్థలు, వారి గొంతుకను నలుమూలలా ప్రతిధ్వనింప చేసేందుకు గల న్యూస్‌క్లిక్ వంటి సంస్థలు నాడు పండుగ చేసుకున్నాయి. ప్రతికూల వార్తలు, అబద్ధపు వార్తలు ఈ ఉద్య మాల సమయంలో వీరవిహారం చేసిన వైనాన్ని ఇంకా ప్రజలు మరచిపోలేదు. ఇవేవీ తెలియని సామాన్య ప్రజలు అనేకమంది ఇటువంటి అబద్ధపు ప్రచారాలను నమ్మేస్తుంటారు. పైకి అత్యంత సాధారణంగా కనిపించే ఈ వ్యవహారం అనేకానేక పొరలలో నడుస్తుంటుంది. పోలీసులు ఈ పొరలన్నింటినీ ఒలిచి ఈ వ్యవహారం వెనుక ఉన్నది సింఘం అన్న విషయాన్ని కనుగొన్నారు.
న్యూస్‌క్లిక్‌పై దాడి అనంతరం కొందరు జర్నలిస్టులు తమకు దానితో ఏం సంబంధం లేదని, తాము ఆ సంస్థకు కన్సల్టెంట్లం మాత్రమేనని చెప్పుకుంటూ, తాము అమాయకులమని రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారి భావజాలా నికి చెందిన కొందరు జర్నలిస్టులు మాత్రం దీనిని మీడియాపై దాడిగా అభివర్ణిస్తూ అత్యంత విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఇదే జర్నలిస్టులు ఆర్నబ్ గోస్వామిని అరెస్టు చేసినప్పుడు ఖండించకపోగా, సంబరాలు చేసుకున్నారు. ఇటీవలే ఇండి కూటమి 14మంది జర్నలిస్టుల కార్యక్రమాలను ఖండించి, నిషేధిస్తూ జారీ చేసిన జాబితా వెనుక వీరి ప్రేరణే ఉందని పలువురు పేర్కొంటున్నారు. అంతేనా, కాంగ్రెస్, దాని మిత్రపక్ష పాలిత రాష్ట్రాలలో చిన్నవార్తలకు కూడా అరెస్టు అయిన జర్నలిస్టుల గురించి వీరు మాట్లాడరు. తమకు భిన్నంగా ఎవరు సత్యం చెప్పినా కూడా ‘వాట్సాప్ యూనివర్సిటీ’లో చదువుకున్నవారంటూ గేలి చేసే ఈ గొప్ప జర్నలిస్టులు ఇప్పటివరకూ ‘దేవతావస్త్రాలు ధరించిన రాజు’ల్లా తిరిగారు. కానీ వారి విషయాలన్నీ ఒక్కొక్కటిగా బయిటకు వస్తున్న క్రమంలో వారి సత్యాన్ని వారూ గ్రహించుకోవాలి.
మణిపూర్‌లోనూ అగ్నికి ఆజ్యం
ఇప్పటికీ మణిపూర్ అగ్నిజ్వాలలా ప్రజ్వరిల్లడం వెనుక ఇటువంటి శక్తుల ప్రచారం, ప్రోత్సాహమే ఉన్నాయని తెలుస్తోంది. ఒక టీవీ ఛానెల్‌లో మాట్లాడుతూ, తాను మణిపూర్‌లో పర్యటిస్తున్న సమయంలో చైనా నుంచి వచ్చిన ఒక జర్నలిస్టును కలిశానని అయితే, భారతీయ ప్రముఖ జర్నలిస్టు ఒకరు అక్కడి పరిస్థితి గురించి ఆ విదేశీ జర్నలిస్టును తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేశారని గోవా క్రానికల్ ఎడిటర్ సావియో రోడ్రిగ్స్ పేర్కొన్నారు. వాస్తవాలతో సంబంధం లేకుండా ఆ సీనియర్ జర్నలిస్టు తన దృక్పధాన్ని మాత్రమే ఆ విదేశీ జర్నలిస్టుకు చెప్పడం ఎంతవరకు సమంజసమని కూడా ఆయన ప్రశ్నించారు. నిజానికి పాశ్చాత్య దేశాలు, చైనా నుంచి వస్తున్న నిధులే అక్కడి అగ్నికి ఆజ్యాన్ని పోస్తున్నాయి. ఈ విషయాన్ని బయట పెట్టకుండా, తాము కూడా అందులో ఒక ముక్కను జర్నలిస్టులు కొందరు పంచుకుంటున్నారు.
అటు పాశ్చాత్య దేశాలు, ఇటు చైనా కూడా భారతదేశ పురోగతిని ఏదో ఒకరకంగా అడ్డుకు నేందుకు, ఇక్కడ బలహీన ప్రభుత్వం ఏర్పడేందుకు తమ వంతు కృషి చేస్తున్నాయి. భారత్‌లో పూర్తి మెజారిటీగల, స్థిరమైన ప్రభుత్వం వారి ఆటలను సాగనివ్వడం లేదు. అందుకే, ఎక్కడా తుపాకీ పేలకుండా ఈ ‘పొగలేని యుద్ధా’లకు వారు పాల్పడుతున్నారు.
– జాగృతి డెస్క్