‌కృష్ణారావు చొప్పరపు, 8466864969

19వ ఆసియా క్రీడల్లో భారత్‌ ‌సరికొత్త చరిత్ర సృష్టించింది. క్రీడాకారుల స్వేదానికి, అంకితభావానికి ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత తోడు కావడంతో ‘శత’పతకాల వర్షం కురిసింది. గత 71 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా 107 పతకాలతో భారత్‌ ‌పతకాల పట్టిక నాలుగో స్థానంలో సగర్వంగా నిలిచింది. చైనా వినువీధిలో 28 సార్లు మువ్వన్నెల జెండా రెపరెపలకు తోడు జాతీయ గీతాలాపనతో భరతజాతి మెరిసి మురిసింది.

చైనాలోని హాంగ్జు వేదికగా ముగిసిన 19వ ఆసియా క్రీడలు భారత క్రీడాశక్తిని ప్రపంచం ముందు సరికొత్తగా ఆవిష్కరించాయి. 1951లో మొదలైన ఆసియా క్రీడల్లో తన ప్రస్థానం ప్రారంభించిన భారత్‌ ‌శత పతకాల లక్ష్యాన్ని చేరటానికి 7 దశాబ్దాల పాటు వేచిచూడాల్సి వచ్చింది.

పతకాల హోరు

చైనా గడ్డపై గత రెండు వారాలుగా సాగిన 45 దేశాల ఈ క్రీడా సమరంలో 655 మంది అథ్లెట్ల భారీ సైన్యంతో పాల్గొన్న భారత్‌.. ‌రికార్డు స్థాయిలో మొత్తం 107 పతకాలు గెలుచుకొంది. ఇందులో 28 బంగారు, 31 రజత, 48 కాంస్యాలతో సహా మొత్తం 107 పతకాలతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. 72 సంవత్సరాల ఆసియా క్రీడల చరిత్రలో మొట్టమొదటిసారిగా పతకాల శతకం నమోదు చేసింది.ఐదేళ్ల క్రితం జకార్తా వేదికగా ముగిసిన 18వ ఆసియా క్రీడల్లో 18 స్వర్ణాలతో సహా మొత్తం 70 పతకాలు మాత్రమే సాధించిన భారత్‌ ‌కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే తన పతకాల సంఖ్యను 107కు పెంచుకోగలిగింది.

పతకాల పట్టికలో 4వ స్థానం

1951 ప్రారంభ ఆసియా క్రీడల పతకాల పట్టిక రెండో స్థానంలో నిలిచిన భారత్‌.. 1962 ‌జకార్తా గేమ్స్‌లో 3వ స్థానం సంపాదించింది. ఆ తరువాత అత్యుత్తమంగా ప్రస్తుత క్రీడల్లో మాత్రమే 4వ స్థానం సంపాదించగలిగింది.

క్రీడల రెండో రోజునే టీమ్‌ ‌విభాగంలో షూటింగ్‌ ‌జట్టు ‘బంగారు’ బోణీ కొట్టడంతో మొదలైన భారత్‌ ‌పతకాల వేట చివరి రోజు వరకూ అప్రతిహతంగా కొనసాగింది. కబడ్డీ పురుషుల, మహిళల విభాగాలలో స్వర్ణాలతో పాటు.. క్రికెట్‌ ‌పురుషుల బంగారు పతకం సైతం దక్కడం, దానికి బ్యాడ్మింటన్‌ ‌పురుషుల డబుల్స్ ‌స్వర్ణం తోడు కావడంతో మొత్తం 107 పతకాలతో భారత్‌ ‌పతకాల వేట ముగిసింది.

అథ్లెటిక్స్‌లో అత్యధికం

ట్రాక్‌ అం‌డ్‌ ‌ఫీల్డ్‌లో భారత్‌ అత్యధికంగా 6 స్వర్ణాలతో సహా 29 పతకాలు సాధిస్తే.. షూటింగ్‌లో 22 పతకాలు సొంతం చేసుకొంది. కేవలం షూటింగ్‌లోనే భారత్‌కు 7 స్వర్ణాలు దక్కడం విశేషం. పురుషుల రైఫిల్‌ ‌షూటింగ్‌లో ఐశ్వర్య ప్రతాప్‌ ‌సింగ్‌ ‌తోమర్‌, ‌మహిళల పిస్టల్‌ ‌షూటింగ్‌లో ఈషా సింగ్‌ ‌చెరో నాలుగు పతకాలు సాధించారు. గత క్రీడల పురుషుల జావలిన్‌ ‌త్రో విభాగంలో సాధించిన స్వర్ణాన్ని భారత స్టార్‌ అథ్లెట్‌ ‌నీరజ్‌ ‌చోప్రా ప్రస్తుత క్రీడల్లో సైతం నిలుపుకొన్నాడు. 88.88 మీటర్ల రికార్డుతో తిరుగులేని విజేతగా నిలిచాడు. ఇక, విలువిద్యలో 5 స్వర్ణాలతో సహా మొత్తం 9 పతకాలు భారత్‌ ‌గెలుచుకొంది. ఆర్చర్లు జ్యోతి సురేఖ, ఓజాస్‌ ‌చెరో మూడు బంగారు పతకాలు చొప్పున సాధించడం ద్వారా విజయవంతమైన అథ్లెట్లుగా నిలిచారు. ఓవరాల్‌గా పురుషుల విభాగంలో 52, మహిళల విభాగంలో 46, మిక్స్‌డ్‌ ‌విభాగాలలో 9 పతకాలను భారత అథ్లెట్లు సాధించగలిగారు. మొత్తం 34 మంది అథ్లెట్స్ ‌రెండుకు మించి పతకాలు గెలుచుకొన్నారు.

అలుపెరుగని వీరుడు సౌరవ్‌

‌స్క్వాష్‌ ‌పురుషుల సింగిల్స్‌లో గత ఆరు ఆసియా క్రీడల్లో పాల్గొంటూ వచ్చిన భారత వెటరన్‌ ‌స్టార్‌ ‌సౌరవ్‌ ‌గోశాల్‌ ‌తన ఆఖరి ప్రయత్నంలో పురుషుల టీమ్‌ ‌గోల్డ్‌తో పాటు, వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించాడు. మిక్స్‌డ్‌ ‌డబుల్స్‌లో దీపిక పల్లికల్‌- ‌స్వర్ణజీత్‌ ‌సింగ్‌ ‌జోడీ బంగారు పతకం అందుకొన్నారు. మహిళల టీమ్‌, ‌మిక్స్‌డ్‌ ‌డబుల్స్ ‌విభాగాలలో భారత టీనేజ్‌ అథ్లెట్‌, 15 ‌సంవత్సరాల అనాహత్‌ ‌సింగ్‌ ‌రెండు కాంస్య పతకాలతో తన ఆసియా క్రీడల ప్రయాణాన్ని ప్రారంభించింది. బ్రిడ్జి క్రీడలో 65 సంవత్సరాల జగ్గీ శివదాసానీ భారత్‌కు రజత పతకం అందించిన అత్యంత పెద్ద వయసున్న అథ్లెట్‌గా రికార్డుల్లో చేరారు.

————————-

‘తెలుగు వెలుగులు’

19వ ఆసియా క్రీడల్లో భారత రికార్డు పతకాల సాధనలో తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు సైతం తమ వంతు పాత్ర పోషించారు. షూటింగ్‌, ‌బ్యాడ్మింటన్‌, ఆర్చరీ, బాక్సింగ్‌, ‌చదరంగం, అథ్లెటిక్స్ అం‌శాలలో రాణించారు. మహిళల బాక్సింగ్‌, ‌పురుషుల క్రికెట్‌, ‌షూటింగ్‌ అం‌శాలలో తెలంగాణ అథ్లెట్లు పతకాలు తెస్తే, విలువిద్య, బ్యాడ్మింటన్‌, అథ్లెటిక్స్ ‌విభాగాలలో ఆంధప్రదేశ్‌ అథ్లెట్లు బంగారు పంట పండించారు.

3 స్వర్ణాల బెజవాడ ఆర్చర్‌

ఆం‌ధప్రదేశ్‌కు చెందిన స్టార్‌ ఆర్చర్‌ ‌జ్యోతి సురేఖ మూడు విభాగాలలో మూడు బంగారు పతకాలు సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది. కాంపౌండ్‌ ‌విభాగంలో మహిళల వ్యక్తిగత, టీమ్‌ ‌విభాగాలతో పాటు మిక్స్‌డ్‌ ‌డబుల్స్ అం‌శంలో సైతం బంగారు పంట పండించింది. మిక్స్‌డ్‌ ‌డబుల్స్‌లో ఓజాస్‌ ‌దేవ్‌ ‌తాలేతో జంటగా బరిలో నిలిచిన జ్యోతి సురేఖ తొలి బంగారు పతకం అందుకొంది. కొరియా జోడీతో జరిగిన బంగారు పతకం పోరులో 159- 158 పాయింట్ల తేడాతో భారత్‌ ‌విజేతగా నిలిచింది. మహిళల టీమ్‌ ‌విభాగం గోల్డ్ ‌మెడల్‌ ‌పోరులో చైనీస్‌ ‌తైపీ జట్టుపై 230- 229 పాయింట్ల తేడాతో భారత్‌ ‌విజయం సాధించడంలో జ్యోతి సురేఖ, అదితీ గోపీచంద్‌ ‌స్వామి, ప్రణీత్‌ ‌కౌర్‌లతో కూడిన భారతజట్టు సఫలమయ్యింది. మహిళల వ్యక్తిగత విభాగంలో సైతం జ్యోతి సురేఖకు ఎదురే లేకుండా పోయింది. బంగారు పతకం కోసం జరిగిన పోరులో కొరియా ఆర్చర్‌ను కంగు తినిపించడం ద్వారా జ్యోతి సురేఖ స్వర్ణాల హ్యాట్రిక్‌ను పూర్తి చేసింది. 19వ ఆసియా క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించిన ఏకైక తెలుగు అథ్లెట్‌ ‌ఘనతను సంపాదించింది.

హైదరాబాదీ షూటర్‌ అరుదైన ఘనత

మహిళల పిస్టల్‌ ‌షూటింగ్‌ ‌విభాగంలో హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన 19 సంవత్సరాల ఈషా సింగ్‌ ఏకంగా నాలుగు పతకాలు సాధించడం ద్వారా భారత్‌కు మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాలకు సైతం గర్వకారణంగా నిలిచింది.

గచ్చిబౌలిలోని షూటింగ్‌ ‌రేంజ్‌లో ఓనమాలు దిద్దుకొని మహారాష్ట్రలోని గగన్‌ ‌నారంగ్‌ అకాడమీలో శిక్షణ పొందిన ఈషా సింగ్‌ 25 ‌మీటర్ల పిస్టల్‌ ‌టీమ్‌ ‌విభాగంలో బంగారు పతకం సాధించింది. ఇదే అంశం వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించడం ద్వారా తన పతకాల సంఖ్యను రెండుకు పెంచుకొంది. అంతటితో ఆగిపోకుండా 10 మీటర్ల ఎయిర్‌ ‌పిస్టల్‌ ‌టీమ్‌, ‌వ్యక్తిగత విభాగాలలో రజత పతకాలు సొంతం చేసుకొంది. మొత్తం 4 పతకాలు గెలుచుకోడం ద్వారా తనకుతానే సాటిగా నిలిచింది.

నిఖత్‌ ‌జరీన్‌ ‌చేజారిన స్వర్ణం

మహిళల బాక్సింగ్‌ 50 ‌కిలోల విభాగంలో బంగారు పతకం సాధించడం ఖాయమనుకున్న తెలంగాణ బాక్సర్‌ ‌నిఖత్‌ ‌జరీన్‌..‌సెమీ ఫైనల్లో ఓటమితో కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచ చాంపియన్‌గా ఉన్న నిఖత్‌ను ఆసియా క్రీడల సెమీస్‌లో దురదృష్టం వెంటాడింది. థాయ్‌ ‌బాక్సర్‌ 3-2 ‌పాయింట్లతో నిఖత్‌పై సంచలన విజయం సాధించడం ద్వారా బంగారు ఆశల్ని వమ్ము చేసింది.

పురుషుల క్రికెట్‌లో తిలక్‌ ‌వర్మకు స్వర్ణం

పురుషుల క్రికెట్లో బంగారు పతకం సాధించిన భారత జట్టులో హైదరాబాదీ బ్యాటర్‌ ‌తిలక్‌ ‌వర్మ సైతం సభ్యుడిగా ఉన్నాడు. భారత జట్టు ఫైనల్‌ ‌చేరడంలో తిలక్‌ ‌వర్మ అజేయహాఫ్‌ ‌సెంచరీతో నిలిచాడు.

బ్యాడ్మింటన్‌ అపూర్వ విజయం

బ్యాడ్మింటన్‌ ‌పురుషుల టీమ్‌ ‌విభాగంలో భారత్‌ ‌తొలిసారిగా గోల్డ్ ‌మెడల్‌ ‌రౌండ్‌ ‌చేరుకోవడంలో ఆంధప్రదేశ్‌ ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్‌, ‌సాయి సాత్విక్‌ ‌ప్రధాన పాత్ర పోషించారు. దక్షిణ కొరియాతో జరిగిన సెమీస్‌ ‌పోరులో భారత్‌ 3-2‌తో సంచలన విజయం సాధించడంలో సింగిల్స్ ‌ప్లేయర్‌ ‌కిడాంబి శ్రీకాంత్‌, ‌డబుల్స్‌లో సాయి సాత్విక్‌- ‌చిరాగ్‌ ‌శెట్టి కీలకంగా వ్యవహరించారు. రెండు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు నెగ్గి 2-2తో సమ ఉజ్జీలుగా నిలిచిన సమయంలో జరిగిన నిర్ణయాత్మక ఆఖరి సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ అసాధారణ విజయంతో జట్టును తొలిసారిగా ఫైనల్స్ ‌చేర్చగలిగాడు. బంగారు పతకం కోసం ఆతిథ్య చైనాతో జరిగిన పోరులో భారత్‌ 2-3‌తో పోరాడి ఓడి రజత పతకంతో సరిపెట్టుకొంది. డబుల్స్‌లో సాయిసాత్విక్‌ ‌జోడీ కీలక విజయం సాధించినా.. ఆఖరి సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ ‌పరాజయం పాలయ్యాడు.

విశాఖ రన్నర్‌ ‌జ్యోతికి రజతం

తన కెరియర్‌లో తొలిసారిగా ఆసియా క్రీడల మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ‌బరిలోకి దిగిన విశాఖ కమ్‌ ఆం‌ధప్రదేశ్‌ ‌రన్నర్‌ ‌జ్యోతి యర్రాజీ రజత పతకంతో సరిపెట్టుకొంది. ఆసియా చాంపియన్‌ ‌హోదాలో రేస్‌లో పాల్గొన్న జ్యోతికి అదృష్టం కలసి వచ్చింది. వాస్తవానికి కాంస్య పతకం సాధించిన జ్యోతికి.. ప్రత్యర్థి చైనా రన్నర్‌ ‌ఫౌల్‌ ‌చేయడంతో.. రజత పతకం దక్కింది.

చెస్‌లో అర్జున్‌ ఇరగేసి, పెంటేల హరికృష్ణ

చదరంగం పురుషుల టీమ్‌ ‌విభాగంలో రజత పతకం సాధించిన భారత జట్టు సభ్యుల్లో తెలంగాణ గ్రాండ్‌ ‌మాస్టర్‌ అర్జున్‌ ఇరగేసి, ఆంధ్ర గ్రాండ్‌ ‌మాస్టర్‌ ‌పెంటేల హరికృష్ణ ఉన్నారు.

క్రీడారంగంలో తెలుగు రాష్ట్రాలు ఏమాత్రం వెనుకబడి లేవనటానికి తెలంగాణ, ఆంధప్రదేశ్‌లకు ప్రాతినిథ్యం వహించిన అథ్లెట్లు సాధించిన పతకాలే నిదర్శనంగా నిలిచిపోతాయి.

——————

ప్రధాని మోదీ కల.. నెరవేరిన వేళ..

ఆసియా క్రీడల్లో వందకుపైగా పతకాలు సాధించడం ద్వారా భారత్‌ ‌క్రీడాశక్తిగా ఎదగాలని, ప్రపంచం ముందు సగర్వంగా నిలవాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ స్వప్నమని, దానిని భారత అథ్లెట్లు సాకారం చేయగలిగారని భారత ఒలింపిక్‌ ‌సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష కొనియాడారు.

ఆసియా క్రీడల 7 దశాబ్దాల చరిత్రలో భారత్‌ ‌రికార్డు స్థాయిలో 107 పతకాలు సాధించడం వెనక ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత, గత దశాబ్ద కాలంగా కేంద్ర ప్రభుత్వం ఆచరించిన క్రీడావిధానం ఉన్నాయనే చెప్పాలి. భారత్‌ను తిరుగులేని క్రీడాశక్తిగా తీర్చిదిద్దటానికి ప్రధాని ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారులు రాణించడానికి వీలుగా తగిన వనరులు సమకూర్చడంతో పాటు వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ వచ్చారు. క్రీడాకారులు, క్రీడాప్రముఖులతో నిరంతర సంబంధాలను కొనసాగిస్తూ ప్రధాన మోదీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

జకార్తా వేదికగా 2018లో ముగిసిన ఆసియా క్రీడల్లో 70 పతకాలు మాత్రమే సాధించిన భారత్‌.. ‌కేవలం ఐదేళ్ల కాలంలోనే 107 పతకాలకు చేరుకోడం వెనక కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ, భారత ఒలింపిక్‌ ‌సంఘం కసరత్తు, కృషి ఎంతో ఉన్నాయి. గతంలో క్రీడల మంత్రిగా పనిచేసిన కిరణ్‌ ‌రిజిజు, ప్రస్తుత క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌లు సైతం తమ వంతు బాధ్యతల్ని అంకితభావంతో నిర్వర్తించారు.

కొత్తగా.. సరికొత్తగా

భారత అథ్లెట్లు తొలిసారిగా అశ్వక్రీడల డ్రెస్సాజ్‌ ‌విభాగంలో బంగారు పతకం, టేబుల్‌ ‌టెన్నిస్‌ ‌మహిళల డబుల్స్‌లో రజత పతకం, బ్యాడ్మింటన్‌ ‌పురుషుల డబుల్స్‌లో బంగారు పతకం, విలువిద్య కాంపౌండ్‌ ‌విభాగాలలో అరుదైన పతకాలు సాధించింది. విలువిద్య కోసం ఎన్టీపీసీతో 5 సంవత్సరాల పాటు 115 కోట్ల రూపాయల పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. విలువిద్య క్రీడకు అవసరమైన అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు, క్రీడాపరికరాలు అందుబాటులో ఉంచడం కోసం 15 కోట్ల రూపాయలను అదనంగా వ్యయం చేసింది. దక్షిణ కొరియా, ఇటలీ దేశాలకు చెందిన విఖ్యాత శిక్షకుల్ని రప్పించడానికి  2 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. భారత్‌కు చెందిన 50 మంది శిక్షకులను విదేశీ సెమీనార్‌లకు పంపడం ద్వారా అత్యాధునిక నైపుణ్యాలు సమకూర్చుకోడానికి కృషి చేసింది. సైకాలజిస్టులు, పౌష్టికాహార నిపుణులు, స్ట్రెంత్‌ అం‌డ్‌ ‌కండిషనింగ్‌ ‌నిపుణులకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను సమకూర్చడం కోసం మరో 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ప్రభుత్వం తీసుకొన్న ఈ చర్యల వల్ల 2018లో 2 పతకాలు మాత్రమే సాధించిన భారత ఆర్చర్లు తాజా క్రీడల్లో 5 బంగారు పతకాలు సాధించగలిగారు. మహిళల విభాగంలో జ్యోతి సురేఖ, పురుషుల విభాగంలో ఓజాస్‌ ‌మూడేసి స్వర్ణ పతకాలు సాధించడం ద్వారా దేశానికే గర్వకారణంగా నిలిచారు.

2018 ఆసియా క్రీడల్లో  భారత్‌ 18 ‌రకాల క్రీడల్లో పతకాలు సాధిస్తే..2022 (తాజా) ఆసియా క్రీడల్లో 22 రకాల క్రీడల్లో పతకాలు సంపాదించింది. గత క్రీడలతో పోల్చి చూస్తే షూటింగ్‌లో 20 నుంచి 29కి పతకాల సంఖ్యను పెంచుకొంది. ట్రాక్‌ అం‌డ్‌ ‌ఫీల్డ్‌లో సైతం భారత్‌ ‌తన పతకాల సంఖ్యను గణనీయంగా పెంచుకోగలిగింది. పురుషుల జావలిన్‌ ‌త్రోలో స్వర్ణ, రజతాలు రెండు భారత్‌కే దక్కాయి. పురుషుల 3 వేల మీటర్ల స్టీపుల్‌ ‌చేజ్‌లో అవినాశ్‌ ‌సాబ్లే, మహిళల 5 వేల మీటర్ల పరుగులో పారుల్‌ ‌చౌదరీ ‘బంగారు’ విజయాలు అరుదైనవిగా మిగిలిపోతాయి.

క్రికెట్‌, ‌కబడ్డీలో రెండుకు రెండు

క్రికెట్‌ ‌పురుషుల, మహిళల విభాగాలలో భారత్‌ ‌రెండుకు రెండు బంగారు పతకాలు సొంతం చేసుకొంది. కబడ్డీ పురుషుల, మహిళల విభాగాలలో సైతం భారత జట్లు స్వర్ణ విజయాలు సాధించాయి. చదరంగం పురుషుల, మహిళల విభాగాలలో భారత్‌ ‌రజత పతకాలతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహిళల గోల్ఫ్ ‌వ్యక్తిగత విభాగంలో ఆదితీ అశోక్‌ ‌రజత, రోలర్‌ ‌స్కేటింగ్‌లో రెండు కాంస్య, కనోయింగ్‌లో ఓ కాంస్య పతకం భారత్‌ ‌కు అదనంగా దక్కాయి.

బాడ్మింటన్‌లో సరికొత్త చరిత్ర

చైనా, కొరియా, జపాన్‌, ‌మలేసియా, ఇండోనీషియా దేశాల ఆధిపత్యం కొనసాగిన బ్యాడ్మింటన్‌లో భారత్‌ ‌సరికొత్త శక్తిగా అవతరించింది. పురుషుల టీమ్‌ ‌విభాగంలో రజత, వ్యక్తిగత విభాగంలో ప్రణయ్‌ ‌కాంస్య, డబుల్స్‌లో తొలిసారిగా బంగారు పతకాలతో భారత షట్లర్లు చరిత్ర సృష్టించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా 655 మంది సభ్యుల భారీ బృందంతో 38 రకాల క్రీడాంశాలలో పోటీకి దిగిన భారత్‌ 28 ‌స్వర్ణాలతో సహా మొత్తం 107 పతకాలతో పతకాల పట్టిక నాలుగో స్థానంలో నిలవడంలో ప్రభుత్వ క్రీడావిధానం, ప్రోత్సాహకాలు ఎంతగానే ఉపకరించాయి. ఈ ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రమే దక్కుతుంది.

 వచ్చే ఏడాది పారిస్‌ ‌వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో సైతం భారత క్రీడాకారులు ఇదే జోరు కొనసాగించాలని, విశ్వక్రీడా వేదికపైన సైతం మెరిసి మురవాలని కోరుకుందాం!

—————–

హాకీలో స్వర్ణోదయం!

ఆసియా క్రీడల్లో 9 ఏళ్ల విరామం తర్వాత భారత్‌ ‌హాకీ జట్టు బంగారు పతకాన్ని  గెలుచుకొంది. ఫైనల్లో విజేత జపాన్‌ను 5-1 గోల్స్‌తో చిత్తు చేయడం ద్వారా పారిస్‌ ఒలింపిక్స్ ‌బెర్త్ ‌ఖాయం చేసుకొంది.

ఒలింపిక్స్ ‌హాకీ చరిత్రలో ఎనిమిది సార్లు బంగారు పతకాలు సాధించిన భారత్‌.. ఆసియా క్రీడల్లో మాత్రం 2014 వరకూ మూడుసార్లు మాత్రమే విజేతగా నిలువగలిగింది. అంతర్జాతీయ హాకీలో గత మూడేళ్లుగా అత్యంత నిలకడగా రాణిస్తూ 3వ ర్యాంక్‌కు చేరిన భారత జట్టు.. ప్రస్తుత ఆసియా క్రీడల్లో స్థాయికి తగ్గట్టుగా రాణించింది. పూల్‌ – ఏ ‌లీగ్‌ ‌నుంచి నాకౌట్‌ ‌ఫైనల్‌ ‌వరకూ భారీ విజయాలు నమోదు చేయగలిగింది.సెమీ ఫైనల్లో దక్షిణ కొరియాను 5-3 గోల్స్‌తో ఓడించిన భారత్‌కు.. బంగారు పతకం పోరులో ఎదురే లేకపోయింది. ఆట రెండో క్వార్టర్‌ ‌ప్రారంభానికే 3-0 గోల్స్‌తో జపాన్‌పై తిరుగులేని ఆధిక్యం సంపాదించిన భారత్‌ ఆ ‌తర్వాత ప్రత్యర్థికి ఓ గోల్‌ ఇచ్చినా ఆఖరి క్వార్టర్‌ ‌గోలుతో 5-1తో విజేతగా స్వర్ణపతకం అందుకొంది.

ఆట మొదటి క్వార్టర్‌ 15‌వ నిమిషంలో సుర్జీత్‌ ‌సింగ్‌ ‌భారత్‌కు తొలి గోల్‌ అం‌దించాడు. ఆ తర్వాత మన్‌‌ప్రీత్‌ ‌సింగ్‌ ‌పెనాల్టీ కార్నర్‌ ‌ద్వారా రెండో గోల్‌ ‌సాధించాడు. అమిత్‌ ‌రోహిదాస్‌ ‌మూడో గోల్‌ ‌సాధించడం ద్వారా భారత్‌ ‌దూకుడు కొనసాగించింది. ఆట 4వ క్వార్టర్‌లో భారత్‌ ఆధిక్యాన్ని అభిషేక్‌ 4-0‌కు పెంచాడు. జపాన్‌ ‌తరఫున సెరెనా తనాకా గోల్‌ ‌నమోదు చేశాడు. ఆట ముగిసే క్షణాలలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ ‌ప్రీత్‌ ‌గోల్‌గా మలచడం ద్వారా 5-1తో విజయం పూర్తి చేశాడు.

1966 నుంచి 2023 వరకు

1951 నుంచి భారత్‌ ఆసియా క్రీడల్లో పాల్గొంటూ వచ్చినా.. ప్రస్తుత 2023 గేమ్స్ ‌వరకూ నాలుగు సార్లు మాత్రమే చాంపియన్‌గా నిలువగలిగింది. 1966లో తొలిసారిగా ఆసియా క్రీడల బంగారు పతకం సాధించిన భారత్‌ ఆ ‌తర్వాత 1998, 2014 గేమ్స్‌లో సైతం స్వర్ణాలు సాధించింది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో కాంస్య పతకానికి మాత్రమే పరిమితమైంది. కేవలం నాలుగేళ్ల విరామంలోనే తిరిగి బంగారు పతకం అందుకోగలిగింది. ఆసియా క్రీడల హాకీ చరిత్రలో పాకిస్తాన్‌ అత్యధికంగా 9 సార్లు బంగారు పతకాలు సాధిస్తేచ దక్షిణ కొరియా, భారత్‌ ‌చెరో నాలుగు సార్లు స్వర్ణాలు సాధించడం ద్వారా ఆ తర్వాతి స్థానాల్లో నిలువగలిగాయి.

పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత

భారత జట్టు హాంగ్జు ఆసియా క్రీడల విజేతగా నిలవడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టినట్లయ్యింది. ఆసియా క్రీడల విజేతగా నిలవడం ద్వారా వచ్చే ఏడాది పారిస్‌ ‌వేదికగా జరిగే 2024 ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సంపాదించగలిగింది.

మహిళా జట్టుకు కాంస్య పతకం

మహిళల విభాగంలో భారత హాకీ జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకొంది. సెమీఫైనల్లో చైనా చేతిలో ఓటమితో కంచు పతకం కోసం జపాన్‌తో పోరాడాల్సి వచ్చింది. గత క్రీడల విజేత జపాన్‌ను భారత్‌ 2-1 ‌గోల్స్‌తో అధిగమించడం ద్వారా మూడోస్థానం సంపాదించగలిగింది.

—————–

పతకాల వెనుక త్యాగం, స్వేదం!

19వ ఆసియాక్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్లలో భారత్‌లోని భిన్నవర్గాలకు చెందినవారు ఉన్నారు. రాజవంశీకుల నుంచి రోజువారీ కూలీ వరకూ, కవలపిల్లల తల్లి నుంచి కూరగాయల వ్యాపారి కుమార్తె వరకూ వివిధ క్రీడల్లో పతకాలు సాధించడం ద్వారా భారత మువ్వన్నెల జెండాను రెపరెప లాడించిన వారే. ఈ పతక విజేతల వెనుక కుటుంబసభ్యుల త్యాగం, సంవత్సరాల తరబడి సాధన చేస్తూ చిందించిన స్వేదంతో పాటు అంకితభావం, పట్టుదల ఉన్నాయి.

రోజువారీ కూలీ.. ఆసియాక్రీడల్లో పతక విజేత!

హాంగ్జు ఆసియాక్రీడల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన 35 కిలోమీటర్ల మిక్స్‌డ్‌ ‌రేస్‌ ‌వాక్‌లో మంజు రాణీతో కలసి భారత్‌కు కాంస్య పతకం సాధించి పెట్టిన 24 సంవత్సరాల రాంబాబు పడిన కష్టం చూస్తే అతను సాధించిన విజయం ఎంత అమూల్యమైనదో తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో అత్యంత వెనుకబడిన సోనేభద్ర జిల్లాలోని బేహురా గ్రామానికి చెందిన ఓ రోజువారీ కూలీ కుటుం బంలో జన్మించిన రాంబాబు.. తల్లి, ముగ్గురు అక్కచెల్లెళ్ల కోసం తండ్రితో కలసి రోజువారీ పనులకు వెళుతూ ఉండేవాడు. అతనికి స్వతహాగా ఆటలంటే చెప్పలేని ఇష్టం. దైనందిన జీవితంలో నడక ఓ భాగంగా మారింది. 50 కిలోమీటర్ల దూరం నడచినా అలుపుసొలుపు లేని పటుత్వం ఉంది. అదే చివరకు అతనికి వరంగా మారింది. జాతీయస్థాయిలో నిర్వహించిన సుదూర నడక పోటీలలో పాల్గొంటూ భారత సైనికదళంలో సిపాయి ఉద్యోగం సంపాదించాడు. ఆ తర్వాత నుంచి  వెనుదిరిగి చూసిందిలేదు. 23 సంవత్సరాల వయసుకే ప్రపంచ పోటీలలో పాల్గొని 27వ స్థానంలో నిలిచాడు. హాంగ్జు ఆసియాక్రీడల్లో 35 కిలోమీటర్ల రేస్‌ ‌వాక్‌లో  2 గంటల 57 నిముషాల 54 సెకన్ల రికార్డుతో కాంస్య విజేతగా నిలిచాడు.

జావలిన్‌ ‌కోసం అప్పులు చేసి….

పురుషుల జావలిన్‌ ‌త్రోలో రజత పతకం సాధించిన ఒడిషా బల్లెంవీరుడు కిశోర్‌ ‌కుమార్‌ ‌జెనా నిధుల లేమితో అల్లాడాడు. పూరీ జిల్లాలోని కొతసాహీ గ్రామానికి చెందిన అతను  ఓ నిరుపేద కుటుంబంలో పుట్టినా క్రీడల్లో రాణించేలా తండ్రి, ఇతర కుటుంబసభ్యులు ఎంతగానో ప్రోత్సహించారు. ఫుట్‌బాల్‌, ‌వాలీబాల్‌ ‌క్రీడల్లో రాణిస్తూ వచ్చిన కిశోర్‌ ‌జెనా బల్లెం విసరటం పట్ల ఆసక్తిని పెంచుకొన్నాడు. తగిన శిక్షకుడు లేకుండానే సాధన మొదలు పెట్టాడు.రూ. 28 వేల  ఖరీదు గల సొంత జావలిన్‌ ‌సమకూర్చుకోడానికి జెనా కుటుంబం పడిన పాట్లు అన్నీఇన్నీ కావు. ఒడిషా ప్రభుత్వ సహకారంతో జాతీయస్థాయి అథ్లెట్‌గా ఎదిగిన అతను ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించే స్థాయికి ఎదిగాడు.ఆసియాక్రీడల జావలిన్‌ ‌త్రోలో విజేత నీరజ్‌ ‌చోప్రాకు గట్టిపోటీ ఇచ్చి 87.54 మీటర్ల రికార్డుతో రజత పతకం అందుకొన్నాడు. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు సైతం అర్హత సంపాదించాడు. దేశానికి పతకంతో పాటు తమ రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిన కిశోర్‌ ‌జెనాకు ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ ‌పట్నాయక్‌  ‌కోటీ 50 లక్షల రూపాయలు నజరానాగా ప్రకటించారు.

కూరగాయల వ్యాపారి కుమార్తె విజయం..

ముంబై శివారులోని దహీసార్‌ ‌ప్రాంతంలో తోపుడుబండి మీద కూర గాయాలు అమ్ముకుంటూ వచ్చిన మొత్తంతో కుటుంబసభ్యులు తీర్చిదిద్దిన అథ్లెట్‌ ఐశ్వర్య అద్భుతాలు సృష్టించింది. ఆసియాక్రీడల మహిళల 400 మీటర్ల రిలేలో రజత పతకం సాధించిన భారతజట్టులో సభ్యురాలిగా ఉన్న తన కుమార్తె ఐశ్వర్యను చూసి కైలాశ్‌ ‌మిశ్రా పొంగిపోతున్నాడు. తాను కూరగాయలు అమ్మిన కష్టం వృథా కాలేదని, తన కుమార్తె దేశానికి పతకం సాధించి పెట్టడం గర్వకారణంగా ఉందని మురిసిపోతున్నాడు. ముంబై పరిసర ప్రాంతాలలో జరిగే మారథాన్‌ ‌పరుగు పోటీలలో పాల్గొంటూ వచ్చిన ప్రైజ్‌ ‌మనీతో కుటుంబానికి అండగా నిలిచిన ఐశ్వర్య ఇప్పుడు ఆసియాక్రీడల పతక విజేత. మహిళల 400 మీటర్ల పరుగులో నాలుగోస్థానంలో నిలిచిన ఐశ్వర్య రిలేలో మాత్రం రజత పతకం అందుకోగలిగింది.

మాతృప్రేమను పక్కనపెట్టి..

ఆసియాక్రీడల స్క్వాష్‌ ‌మిక్స్‌డ్‌ ‌డబుల్స్ ‌విభాగంలో హరిందర్‌ ‌పాల్‌ ‌సింగ్‌ ‌సంధూతో కలసి బంగారు పతకం సాధించిన దీపిక పల్లికల్‌ ‌తన కవల పిల్లలకు గత రెండుమాసాలుగా దూరంగా ఉన్నారు. భారత మాజీ క్రికెటర్‌, ‌ప్రస్తుత కామెంటీటర్‌ ‌దినేశ్‌ ‌కార్తీక్‌ను వివాహం చేసుకొన్న దీపిక.. కవలల తల్లిగా పిల్లల బాగోగులు చూసుకోడం కోసం గత నాలుగేళ్లుగా స్క్వాష్‌ ‌క్రీడకు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే.. కఠోరసాధనతో తిరిగి భారతజట్టులో చోటు సంపాదించడం ద్వారా ఆసియా క్రీడల్లో పాల్గొనగలిగింది. పోటీల సన్నాహాల కోసం గత రెండుమాసాలుగా పిల్లలకూ దూరం కావడం బాధ, అపరాధ భావాన్ని కలిగించాయని, అయితే దేశం కోసం తాను సాధించినంగారు పతకం విలువ ఏంటో తన పిల్లలు రానున్న కాలంలో తెలుసుకొంటారని తన స్వర్ణ పతక విజయానంతరం  చెప్పింది.

————–

తెలుగు అథ్లెట్లకు ప్రోత్సాహమేదీ?

హాంగ్జు ఆసియా క్రీడల్లో భారత్‌ ‌రికార్డు స్థాయిలో బంగారు పతకాలు సాధించడంలో విజయవాడ కమ్‌ ఆం‌ధ్ర ఆర్చర్‌ ‌జ్యోతి సురేఖ వెన్నం మూడు స్వర్ణాలతో తన వంతు పాత్ర పోషించినా ఆదరణ, ప్రోత్సాహం అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. 19వ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్లను పంజాబ్‌, ఒడిషా రాష్ట్రాలు ఆకాశానికి ఎత్తేసి కోట్ల రూపాయలు నజరానాగా కుమ్మరిస్తుంటే, తెలుగు రాష్ట్రాలలో ఆ పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. కేవలం అభినందన సందేశాలతో ఇటు తెలంగాణ, అటు ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రులు మమ అనిపించారు.

విజయవాడ శివారులోని తాడేపల్లిలో నివాసం ఉంటున్న జ్యోతి సురేఖ తల్లిదండ్రుల్ని ఇటు మీడియా ప్రతినిధులు కానీ, అటు క్రీడాసంఘాల అధికారులు కానీ పలకరించిన పాపాన పోలేదు. జ్యోతి సురేఖ తండ్రి సురేంద్ర తన కుమార్తె సాధించిన విజయాలకు కృతజ్ఞతగా తమ నివాసానికి సమీపంలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్లి వచ్చారు. గత కొద్ది సంవత్సరాలుగా తమ కుటుంబం చేసిన, చేస్తూ వచ్చిన త్యాగాలకు తగిన ఫలం దక్కిందన్నారు. అయితే, ఇతర క్రీడాకారులకు ఇచ్చిన ప్రాధాన్యం తన కుమార్తెకు లభించకపోవడం దురదృష్టకరమని జ్యోతి తండ్రి వాపోతున్నారు.

 ఆస్తులు అమ్మి ఆర్చరీ

జ్యోతి సురేఖను అంతర్జాతీయ ఆర్చర్‌గా తీర్చిదిద్దడం కోసం తన కుటుంబం అతిపెద్ద త్యాగమే చేసిందని, ఆస్తులు తెగనమ్ముకొని మరీ అండగా నిలిచామని గుర్తు చేసుకున్నారు. గత ఏడాది వరకూ తమకు సొంత ఇల్లు లేదని, ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం చేస్తున్న తమ కుమార్తె 70 లక్షల లోను తీసుకుంటే గానీ సొంత ఫ్లాట్‌ను సమకూర్చుకోలేక పోయామని చెప్పుకొచ్చారు.

నాన్‌ ఒలింపిక్‌ అం‌శం కావడమే శాపమా?

విలువిద్య క్రీడలో రికర్వ్, ‌కాంపౌండ్‌ అన్న రెండు విభాగాలున్నాయి. అయితే, కాంపౌండ్‌ ‌తరగతి ఆర్చరీ ఒలింపిక్స్ అధికారిక క్రీడాంశాలలో లేకపోడం జ్యోతి సురేఖ పాలిట శాపంగా మారిందని క్రీడావిశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ ‌స్థాయిలోనే పతకాలు సాధించే అవకాశం ఉంది. ఒలింపిక్స్‌లో మాత్రం కాంపౌండ్‌ ఆర్చరీ ఓ ప్రధాన అంశం కాకపోడంతో ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోడం లేదన్న విమర్శ సైతం ఉంది.

అంతర్జాతీయ స్థాయిలో 30 స్వర్ణాలు

జ్యోతి సురేఖ గత దశాబ్ద కాలంలో అంతర్జా తీయ, ప్రపంచ, ఆసియా, కామన్వెల్త్ ‌విభాగాల విలువిద్య కాంపౌండ్‌ ‌విభాగంలో 30కి పైగా బంగారు పతకాలు సాధించింది. అయినా తన కుమార్తెకు తగిన ప్రోత్సాహం లేదంటూ జ్యోతి సురేఖ తల్లిదండ్రులు నిరాశ వ్యక్తంచేస్తున్నారు.

పురుషుల జావలిన్‌ ‌త్రో విభాగంలో రజత పతకం సాధించిన కిశోర్‌ ‌కుమార్‌ ‌జెనాకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ ‌పట్నాయిక్‌ ‌కోటీ 50 లక్షల రూపాయలు నజరానాగా ప్రకటించారు. హాకీలో బంగారు పతకం సాధించిన ఒక్కో ఆటగాడికి 5 లక్షల రూపాయలు చొప్పున అందించారు. అదే.. తెలంగాణ షూటర్‌ ఈషా సింగ్‌, ఆం‌ధ్ర ఆర్చర్‌ ‌జ్యోతి సురేఖలు ఏమాత్రం ఖర్చులేని, ప్రచారానికి మాత్రమే ఉపయోగపడే అభినందన సందేశాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

————–

భారత బంగారు కొండలు వీరే

  1. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ ‌రైఫిల్‌ ‌టీమ్‌ ‌విభాగంలో దివ్యాంశ్‌ ‌సింగ్‌ ‌పన్వార్‌, ‌రుద్రాక్ష పాటిల్‌, ఐశ్వర్యప్రతాప్‌ ‌సింగ్‌ ‌తోమర్‌లతో కూడిన భారతజట్టు తొలి బంగారు పతకం అందు కొంది.
  2. క్రికెట్‌ ‌మహిళల విభాగంలో శ్రీలంకను ఓడించడం ద్వారా భారత్‌కు రెండో స్వర్ణం దక్కింది.
  3. అశ్వక్రీడ డ్రెస్సేజ్‌ ‌టీమ్‌ ‌విభాగంలో అనూష్‌ అగర్వాలా, హృదయ్‌ ‌విపుల్‌ ‌చద్దా, సుదీప్తి హజేలా, దివ్యాకృతి సింగ్‌లతో కూడిన భారత జట్టు స్వర్ణ విజేతగా నిలిచింది.
  4. అశ్వక్రీడ డ్రెస్సేజ్‌ ‌వ్యక్తిగత విభాగంలో అనూష్‌ అగర్వాలా భారత్‌కు 4వ స్వర్ణం అందించాడు.
  5. షూటింగ్‌ ‌పిస్టల్‌ ‌మహిళల టీమ్‌ ‌విభాగంలో మను బాకర్‌, ఈషా సింగ్‌, ‌రిథిమ సంగ్వాన్‌లతో కూడిన భారత జట్టు ఐదో స్వర్ణం అందుకుంది.
  6. షూటింగ్‌ ‌రైఫిల్‌ ‌మహిళల 50 మీటర్ల 3 పొజిషన్‌ ‌వ్యక్తిగత విభాగంలో సిప్ట్ ‌కౌర్‌ ‌సమ్రా బంగారు పతకం సాధించింది.
  7. షూటింగ్‌ ‌పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ ‌పిస్టల్‌ ‌టీమ్‌ ‌విభాగంలో సర్బజోత్‌ ‌సింగ్‌, అర్జున్‌ ‌సింగ్‌ ‌చీమా, శివ నర్వాల్‌లతో కూడిన భారతజట్టు 7వ స్వర్ణం సంపాదించింది.
  8. షూటింగ్‌ ‌రైఫిల్‌ ‌పురుషుల 50 మీటర్ల టీమ్‌ ‌విభాగం 3 పొజిషన్‌ ‌ఫైనల్లో ఐశ్వర్య ప్రతాప్‌ ‌సింగ్‌ ‌తోమర్‌, ‌స్వప్నిల్‌ ‌కుశాలే, అఖిల్‌ ‌షరోన్‌లతో కూడిన భారతజట్టు 8వ బంగారు పతకం సాధించింది.
  9. షూటింగ్‌ ‌మహిళల 10 మీటర్ల ఎయిర్‌ ‌పిస్టల్‌ ‌వ్యక్తిగత విభాగంలో పాలక్‌కు స్వర్ణం.
  10. టెన్నిస్‌ ‌మిక్సిడ్‌ ‌డబుల్స్‌లో రోహన్‌ ‌బొపన్న-రుతుజా భోంస్లేల జోడీకి స్వర్ణం.
  11. స్క్వాష్‌ ‌పురుషుల టీమ్‌ ‌విభాగంలో అభయ్‌ ‌సింగ్‌, ‌సౌరవ్‌ ‌గోశాల్‌, ‌మహేశ్‌ ‌మంగోకర్‌లకు స్వర్ణం.
  12. షూటింగ్‌ ‌పురుషుల ట్రాప్‌ ‌టీమ్‌ ‌విభాగంలో జోర్వార్‌ ‌సింగ్‌, ‌కీనన్‌ ‌డరియస్‌, ‌ప్రథ్వీరాజ్‌ ‌తొండైమాన్‌లకు స్వర్ణం.
  13. పురుషుల షాట్‌పుట్‌లో తేజిందర్‌ ‌పాల్‌ ‌సింగ్‌ ‌తూర్‌కు స్వర్ణం.
  14. పురుషుల 3 వేల మీటర్ల స్టీపుల్‌ ‌చేజ్‌లో అవినాశ్‌ ‌సబ్లేకి స్వర్ణం.
  15. మహిళల 5 వేల మీటర్ల పరుగులో పారుల్‌ ‌చౌధరికి స్వర్ణం.
  16. మహిళల జావలిన్‌ ‌త్రోలో అన్ను రాణీకి స్వర్ణం.
  17. ఆర్చరీ మిక్స్‌డ్‌ ‌డబుల్స్‌లో ఒజాస్‌- ‌జ్యోతి సురేఖ జోడీకి స్వర్ణం.
  18. పురుషుల జావలిన్‌ ‌త్రోలో నీరజ్‌ ‌చోప్రాకు స్వర్ణం.
  19. పురుషుల 400 మీటర్ల రిలేలో అనాస్‌ ‌మహ్మద్‌ ‌యాహ్యా, అమోజ్‌ ‌జేకబ్‌, ‌మహ్మద్‌ అజ్మల్‌, ‌రాజేశ్‌ ‌రమేశ్‌ ‌ల జట్టుకు స్వర్ణం.
  20. ఆర్చరీ మహిళల కాంపౌండ్‌ ‌టీమ్‌ ‌విభాగంలో జ్యోతి సురేఖ, అదితి గోపిచంద్‌ ‌స్వామి, పర్నీత్‌ ‌కౌర్‌ ‌కు స్వర్ణం.
  21. స్క్వాష్‌ ‌మిక్స్‌డ్‌ ‌డబుల్స్‌లో దీపిక పల్లికల్‌-‌హరిందర్‌ ‌పాల్‌ ‌సింగ్‌ ‌సంధూలకు స్వర్ణం.
  22. పురుషుల హాకీలో భారత్‌కు స్వర్ణం.
  23. ఆర్చరీ మహిళల కాంపౌండ్‌ ‌వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖకు స్వర్ణం.
  24. ఆర్చరీ పురుషుల కాంపౌండ్‌ ‌వ్యక్తిగత విభాగంలో ఓజాస్‌ ‌ప్రవీణ్‌ ‌దేవ్‌ ‌తాలేకి స్వర్ణం.
  25. మహిళల కబడ్డీలో భారత్‌కు స్వర్ణ పతకం.
  26. పురుషుల కబడ్డీలో భారత్‌కు స్వర్ణం.
  27. బ్యాడ్మింటన్‌ ‌పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ ‌సాయిరాజ్‌- ‌చిరాగ్‌ ‌శెట్టిల జోడీకి స్వర్ణం.
  28. క్రికెట్‌ ‌పురుషుల విభాగంలో రుతురాజ్‌ ‌గయక్వాడ్‌ ‌నాయకత్వంలోని భారత జట్టుకు స్వర్ణం.

About Author

By editor

Twitter
YOUTUBE