వారంలో ఒక పూట భోజనం మానేయండి అంటూ సాక్షాత్తు నాటి దేశ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పిలుపునిచ్చిన రోజులవి. పిఎల్-480 కార్యక్రమం కింద యుఎస్‌ఎ నుంచి గోధుమలతో వచ్చే ఓడల కోసం నిత్యం ఎదురు చూస్తున్న రోజులు కూడా అవే. ఓడ రావాలి. కడుపు నిండాలి. రుతుపవనాలలో అస్థిరతలు, విత్తనాల కొరత, మట్టిలో తక్కువ ఉత్పాదక శక్తి వెరసి తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల నడుమ నిత్య జీవితం గడుస్తున్న రోజులు కూడా అవే. ఒక పక్కన పాకిస్తాన్‌తో యుద్ధం, మరొకవైపు కరవు పరిస్థితులు… ఇటువంటి ప్రతికూలతలో అటు రైతాంగానికీ, ఇటు పోరాడుతున్న జవాన్లకీ స్ఫూర్తినిచ్చేందుకు శాస్త్రి ‘జై జవాన్.. జై కిసాన్’ అంటూ 1965లో నినాదాన్ని ఇచ్చారు. ఆ నేపథ్యమే దేశంలో ‘హరిత విప్లవానికి’ బీజాలు వేసింది. మనం ఆ యుద్ధాన్నీ గెలిచాం, కొద్ది సంవత్సరాలలో ఆహార భద్రతనూ సాధించాం. భారత ఆర్థిక చరిత్రలో ఇదొక ప్రత్యేక ఘట్టం. ఈ ఘట్టానికి కేంద్రబిందువుగా కనిపించే శాస్త్రవేత్త మాన్‌కొంబు సాంబశివన్ స్వామినాథన్ (ఆగస్ట్ 7, 1925-సెప్టెంబర్ 28, 2023). రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో ఆయన రూపొందించిన సిఫారసులు కూడా చరిత్రాత్మకమైన పాత్రను నిర్వహిస్తున్నాయి. వ్యవసాయశాస్త్రం క్షేత్రస్థాయిలో దుష్పరిణామాలకు కారణమవుతుంటే, సంస్కరించడానికి వెనుకాడని వాస్తవిక దృష్టి ఉన్న శాస్త్రవేత్త స్వామినాథన్.
శతాబ్దాల వలస పాలన దేశాభివృద్ధినీ, వ్యవ సాయాన్నీ ప్రతికూలంగా ప్రభావితం చేసింది. జాతి నిర్మాణానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి వనరులు తగ్గాయి. ఫలితమే-ఆహార ధాన్యాల దిగుమతుల కోసం అమెరికా వంటి దేశాల వైపు చూడడం.
నాటి భారత ప్రధానులు, లాల్ బహదూర్‌శాస్త్రి, ఇందిరా గాంధీ కాలంలోనే హరిత విప్లవ బీజాలు పడి మొలకలు వచ్చాయి. దానికి సూత్రధారులు నోబెల్ గ్రహీత నార్మన్ బోర్లాగ్, ఎంఎస్ స్వామినాథన్. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో 1968లో హరిత విప్లవం ప్రారంభమైంది. అత్యధిక పంట దిగుబడిని ఇచ్చే గోధుమ విత్తనాలతో ప్రారంభమైన ఈ విప్లవం దేశంలో ప్రతి ఒక్కరి ఆకలినీ తీర్చే ప్రయత్నం చేసింది. అందుకే స్వామినాథన్‌ను హరిత విప్లవ పితామహుడిగా పిలుస్తారు. ఈ పరిణామం మీద కొన్ని వ్యతిరేకాభి ప్రాయాలు ఉన్నాయి. అవి కొట్టి పారేయలేనివే కూడా. అయినా ఒక విపత్కర దశ నుంచి రైతాం గాన్ని కాపాడిన పరిణామంగా హరిత విప్లవానికి స్థానం ఉంది. దేశాన్ని మిగులు ఆహారధాన్యాల దశకు తీసుకువెళ్లిన పరిణామంగా కూడా ఖ్యాతి గడిచింది.
హరిత విప్లవం
అధిక దిగుబడినివ్వగల విత్తన రకాలు, తగిన సాగునీటి సౌకర్యాలు, ఎరువులు ఇచ్చే అవకాశం హరిత విప్లవం కల్పించడంతో పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లలోని సేద్యం నాటకీయంగా మెరుగుపడింది. ‘‘1947లో భారత్ స్వాతంత్య్రాన్ని సాధించిన సమయంలో ఏడాదికి 6 మిలియన్ టన్నులను మాత్రమే ఉత్పత్తి చేసేవారం. 1952 నాటికి అది ఏడాదికి 10 మిలియన్ టన్నులకు పెరిగింది. కానీ 1964-1968 మధ్య గోధుమల వార్షిక ఉత్పత్తి 10 మిలియన్ టన్నుల నుంచి 17 మిలియన్ టన్నులకు పెరిగింది. అది ఒక్కసారిగా వచ్చిన మార్పు, అందుకే దీనిని విప్లవాత్మక చర్యగా పిలుస్తా’’రని, స్వామినాథన్ అనేవారు. ఇది రైతులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అంతకుముందు, విదేశీ నిపుణులు భారత్‌ను ‘షిప్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్’’ (నౌక నుంచి నోటికి) అంటూ తక్కువ చేసి మాట్లాడేవారు.
ఒకవైపు వరి, మరొకవైపు గోధుమల అధిక దిగుబడి రకాల రూపకల్పనపై స్వామినాథన్ సహా పలువురు పరిశోధకులు, శాస్త్రవేత్తలు పనిచేశారు. అయితే, భారతదేశంలో హరిత విప్లవానికి ఆధార భూతమైన ఎక్కువ నీరు, ఎరువులకు ప్రతిస్పందించే నూతన జన్యు రకం లేదా నారు రకాన్ని పరిచయం చేయాలన్న ప్రాథమిక వ్యూహాత్మక దార్శనికత మాత్రం స్వామినాథన్‌దేనని ఒక పత్రిక పేర్కొనడాన్ని ఎవ్వరూ కొట్టి పారేయలేరు. కాగా, స్వామినాథన్ తొలుత వరి, గోధుమ రకాలపై చేసిన పరిశోధనలలో కొన్ని విఫలం అయ్యాయి. పొట్టి రకం వంగడాలను అభివృద్ధి చేయాలన్న ఆయన ప్రయత్నం విఫలమైంది. ఎందుకంటే, నారు పొట్టిదైతే, గింజ కూడా పొట్టిదే అవుతుంది.
ఈ క్రమంలో పొట్టి రకం గోధుమ విత్తనాలను అభివృద్ధి చేసిన అమెరికన్ సైంటిస్టు ఆర్విల్ వోగెల్‌ను కలుసుకున్నారు. ఆయనే నార్మన్ బోర్లాగ్‌ను కలువవలసిందిగా స్వామినాథన్‌కు సూచించారు. అప్పటికే బోర్లాగ్ మెక్సికోలో వోగెల్ లాగానే గోధుమ రకాలను తయారు చేసి, ప్రయోగాలు చేస్తున్నారు. అవి భారతదేశానికి సరిపోతాయని సూచించడంతో, స్వామినాథన్ భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఇకార్)లో ఈ గోధుమల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ రకంగా, 1963లో పొట్టిరకం గోధుమ పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించడం, ఐదేళ్లలోనే అది ‘గోధుమ విప్లవం’గా రూపుదాల్చింది. ఈ విజయానికి గుర్తుగా నాటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రత్యేక స్టాంపును విడుదల చేశారు.
సేద్యం, ఆరోగ్యంపై దృష్టి
హరిత విప్లవం ప్రారంభమైన ఒక దశాబ్ద కాలంలోనే భారత్ ఆహార కొరత దేశం నుంచి ఆహారధాన్యాల మిగులు దేశంగా అవతరించింది. ఈ రకంగా ఆహార కొరత సమస్యను పరిష్కరించిన అనంతరం స్వామినాథన్ నాటి పాలకులు విస్మరిస్తున్న అంశాలపై తన దృష్టి ఇతర అంశాలపైకి మళ్లించారు. పౌష్టికాహార కొరత కారణంగా, మహిళల్లో, పిల్ల్ల మరణాల రేటు పట్ల విధానకర్తల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. దీనితోపాటు, తక్కువ బరువుతో జన్మిస్తున్న నవ జాత శిశువుల విషయాన్ని కూడా ఆయన ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. భారతదేశం, దక్షిణాసియాలోని పలు దేశాలలో పుడుతున్న శిశువుల్లో ప్రతి మూడవ శిశువు తక్కువ బరువుతో ఉంటోంది. తల్లికి, గర్భంలో పిండంగా ఉన్న సమయంలో వారికి సరైన పౌష్టికాహారం లభించకపోవడంతో ఇటువంటి శిశువులు జన్మిస్తున్నారని, ఇటువంటి వారిలో మెదడు సరిగా అభివృద్ది చెందకపోవడం సహా, వయోజన జీవితంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు.
హరితవిప్లవ దుష్పరిణామాలు
భారతదేశం తగినంత ఆహారాన్ని అందివ్వడంలో గొప్ప పాత్రను పోషించినప్పటికీ, హరిత విప్లవం పలు అంశాలలో విమర్శలను ఎదుర్కొంది. ముఖ్యంగా, దానిని అత్యధిక ఉత్పాదకత ఉన్న రాష్ట్రాలలో ప్రవేశపెట్టడంతో అది అప్పటికే సంపన్నులైన రైతులకు తోడ్పడిందనే విమర్శ వినిపించింది. ఈ విషయాలను స్వామినాథన్ 1968లోనే గుర్తించి, దేశవాళీ విత్తనాలను వదిలి అత్యధిక దిగుబడిని ఇచ్చే కొత్త వంగడాలను వేస్తూ, నేల సారాన్ని పరిరక్షించకపోతే, మిగిలేది ఎడారులే నని అప్పుడే హెచ్చరించారు. ముఖ్యంగా విచక్షణా రహితంగా పురుగు మందులు, ఎరువులు వంటి వాటిని ఉపయోగించడం, భూగర్భజలాలను అశాస్త్రీయంగా వాడడం వంటివన్నీ అంతిమంగా నష్టాలను కలిగిస్తాయని హెచ్చరించారు.
ఆయన అప్పుడు చేసిన హెచ్చరికలను రైతులు పెడచెవిన పెట్టడంతో నేడు పంజాబ్ వంటి రాష్ట్రాలలో ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దేశంలో వాణిజ్య పంటలను పండించే పలు రాష్ట్రాలలో కూడా విచక్షణా రహితంగా భూగర్భ జలాలను వాడడంతో నీటికి కరవు వచ్చి అవి ఎడారులలా మారుతున్న వైనాన్ని మనం చూస్తున్నాం.
నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్
(ఎన్‌సిఎఫ్- రైతాంగ సమస్యలపై జాతీయ కమిషన్)
వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం, అప్పులలో చిక్కుకు పోవడం, ప్రభుత్వం తగిన చేయూతనివ్వకపోవడం వంటి కారణాలతో 1990ల నుంచి, 2000వ దశకం దాకా దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారాయి. ఈ సమస్య లను పరిశీలించి, అందుకు తగిన పరిష్కారాలను సూచించవలసిందిగా 18 నవంబర్ 2004లో ఎంఎస్ స్వామినాథన్ నాయకత్వంలో నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్‌ను నాటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్‌సిఎఫ్ నాలుగు నివేదికలను (డిసెంబర్ 2004లో, ఆగస్టు 2005లో, డిసెంబర్ 2005లో, ఏప్రిల్ 2006) అందించింది. ఐదవది, అంతిమ సిఫారసుల దస్త్రాన్ని అక్టోబర్ 4, 2006లో సమర్పించింది. వేగవంతమైన, మరింత సమ్మిళిత వృద్ధిని సాధించేందుకు కమిటీ సూచనలు చేసింది. ఈ సిఫారసులకు విశేష ప్రాధాన్యం ఉంది.
స్వామినాథన్ కమిటీ పరిశీలనలు, సూచనలు
వ్యవసాయ సంక్షోభం రైతాంగ ఆత్మహత్యలకు దారి తీస్తోంది. వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణాలలో – భూ సంస్కరణల అజెండా పూర్తి చేయకపోవడం, నీటి నాణ్యత, పరిమాణం, సాంకేతిక శ్రమ, అలసట, వ్యవస్థాగత రుణాలు తగినంతగా, సమయానికి అందుబాటులో లేకపోవడం, మార్కెటింగ్ అవకాశాలకు హామీ లేకపోవడం కారణమని ఆ సిఫారసులు తేల్చి చెప్పాయి. వీటితో పాటుగా వాతావరణ పరిస్థితులు కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని కమిటీ తెలిపింది. దీనికి పరిష్కారంగా రైతులకు భూమి, జలం, జీవ వనరులు, రుణం, బీమా, సాంకేతిక, విజ్ఞాన నిర్వహణ, మార్కెట్లు వంటి ప్రాథమిక వనరుల అందుబాటుపై రైతులకు నియంత్రణ ఉండాలని సూచించారు. వ్యవసాయాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలని ఎన్‌సిఎఫ్ సూచించింది.
భూ సంస్కరణలు
పంటలు పండించడానికి, పశువుల మేత కోసం కూడా భూమి అందుబాటులో ఉండాలంటే భూసంస్కరణలు అవసరమని కమిటీ సూచించింది. భూ యాజమాన్యంలో అసమానత ప్రతిఫలించడాన్ని పట్టి చూపింది. 1991-92లో గ్రామీణ కుటుంబాలలో సన్న, చిన్నకారు రైతుల యాజమాన్యంలో ఉన్న భూమి 3శాతంగా ఉండగా, భూస్వాముల యాజమాన్యంలో ఉన్న భూమి దాదాపు 10 నుంచి 54శాతం వరకూ ఉందని పేర్కొంది. దీనికి సీలింగ్, మిగులు, బీడు భూముల పంపిణీతో పాటు మంచి వ్యవసాయ భూములను, అటవీ ప్రాంతాలను వ్యవసాయేతర ప్రయోజనాల కోసం కార్పొరేట్ రంగానికి మళ్లించడాన్ని నిరోధించాలని కూడా కమిటీ కోరింది. ఉమ్మడి వనరుల ఆస్తికి గిరిజనులు, పశుపాలకులకు కాలానుగుణంగా అడవులలోకి ప్రవేశించేందుకు, పశువులను మేపే హక్కులకు హామీ ఇవ్వడం, వాతావరణం, పర్యావరణం, ప్రదేశం, నిర్ధిష్ట కాలాన్ని బట్టి భూమిని ఉపయోగించే నిర్ణయాలను అనుసంధానం చేయగల సామర్ధ్యం ఉండే జాతీయ భూ వినియోగ సలహా సేవా సంస్థ ఏర్పాటు చేయడం కూడా అవసరమని తెలియచేసింది. వ్యవసాయ భూమి పరిమాణం, ప్రతిపాదిత వినియోగ స్వభావం, కొనుగోలుదారు వర్గం ఆధారంగా వ్యవసాయ భూముల అమ్మకాలను క్రమబద్ధం చేసేందుకు ఒక యంత్రాంగం ఏర్పాటు చేయాలని సూచించింది.
నీటి పారుదల
మొత్తం 192 మిలియన్ హెక్టార్ల స్థూల వ్యవసాయ భూమిలో 60 శాతం మాత్రమే వర్షాధార భూమి. ఇది మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో 45 శాతానికి దోహదం చేస్తోంది.
రైతులందరికీ నిలకడగా, సమానంగా నీరు అందుబాటులోకి తెచ్చి తోడ్పడేందుకు సమగ్రమైన సంస్కరణలు అవసరమని ఈ సిఫారసులు చెప్పాయి. వర్షపు నీటిని సంరక్షించి, నీటి సరఫరాను పెంచడం, జలాశయాలు నిండేలా చూడడం తప్పనిసరి పక్రియగా పరిగణించాలని అవి సూచించాయి. నిర్ధిష్టంగా ప్రైవేటు బావులను లక్ష్యంగా చేసుకొని ‘మిలియన్ వెల్స్ రీఛార్జి’ కార్యక్రమాన్ని ప్రారంభించ డమూ అవసరమని తేల్చాయి. 11వ పంచవర్ష ప్రణాళికలో నీటిపారుదల రంగంలో పెట్టుబడులను తగినంతగా పెంచాలనీ, ఇందులో ఉపరితల జల వ్యవస్థలు, భూగర్భ జలాల రీఛార్జి కోసం మైనర్ ఇరిగేషన్, ఇతర నూతన పథకాలను అమలు చేసేలా నిధులను అందించాలని కోరింది.
వ్యవసాయ ఉత్పాదకత
భూమి విస్తీర్ణంతో పాటుగా, ఉత్పాదక స్థాయులు రైతు ఆదాయాన్ని నిర్ధారిస్తాయి. అయితే, భారతదేశ వ్యవసాయ యూనిట్ ఉత్పాదకతను ఇతర దేశాలతో పోలిస్తే అత్యంత తక్కువగా కనిపిస్తుంది. వ్యవసాయ ఉత్పాదకతలో అధిక వృద్ధిని సాధించడం కోసం ఎన్‌సిఎఫ్ సూచనలు చేసింది. నీటిపారుదల, మురుగునీటి వ్యవస్థ, భూమి అభివృద్ధి, జల సంరక్షణ, పరిశోధనాభివృద్ధి, రహదారి అనుసంధా నత తదితర వ్యవసాయ సంబంధిత మౌలిక సదుపాయాలలో ప్రభుత్వ పెట్టుబడుల గణనీయంగా పెంచడం అందులో ఒకటి. సూక్ష్మపోషకాల లేమిని కనుగొనే ఏర్పాట్లతో ఆధునిక భూపరీక్షా ప్రయోగ శాలల జాతీయ నెట్‌వర్క్ ఏర్పాటు చేయడం మరొ కటి. నేల ఆరోగ్యం, నీటి పరిమాణం, నాణ్యతను, జీవవైవిధ్యాన్ని సంరక్షించడంతో పాటు రైతు కుటుంబాలకు కూడా తోడ్పడే విధంగా వ్యవసా యాన్ని ప్రోత్సహించాలి. చిన్న, సన్నకారు రైతులకు సమయానికి, తగినంత రుణాన్ని అందించడం అన్నది ప్రాథమిక అవసరమని ఈ సిఫారసులు పేర్కొన్నాయి.
ఆహార భద్రత
ఆహారభద్రతకు సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థ అమలు చేయాలి. ఇందుకు అవసరమయ్యే మొత్తం సబ్సిడీకి స్థూలదేశీయ ఉత్పత్తిలో ఒక్కశాతం సరిపోతుందని సూచిం చింది. ఇంకా-పంచాయ తీలు, స్థానిక సంస్థల భాగస్వామ్యంతో జీవిత కాలం పోషకాహర మద్దతును అందించే కార్యక్రమాలను పునర్ వ్యవస్థీకరించాలని సిఫారసులు చెప్పాయి. సమగ్ర ఆహార, రక్షణ పద్ధతి ద్వారా సూక్ష్మ పోషకాల లోపం వల్ల సంభవించే దాగి ఉన్న ఆకలిని తొలగించాలి. ధాన్యం నిల్వ, ప్రతిచోటా నీరు అన్న సూత్రం ఆధారంగా మహిళా స్వయం సహాయక బృందాలు కమ్యూనిటీల ద్వారా ఆహారం, జల బ్యాంకుల ఏర్పాటు, నిర్వహణను ప్రోత్సహించాలి. వ్యవసాయ సంస్థల లాభ దాయకతను, చిన్న, సన్నకారు రైతుల ఉత్పాదకత, నాణ్యతను మెరుగు పరిచి, గ్రామీణ వ్యవసాయేతర జీవనోపాధులకు ఏర్పాట్లు చేయాలి. పనికి ఆహారపధకం, ఉపాధి హామీ పథకంలోని ఉపయుక్తమైన అంశాలను కొనసాగిస్తూ జాతీయ ఆహార భద్రతా చట్టానికి రూపకల్పన చేయాలి. నిరుపేదల వినియోగం పెంచడం ద్వారా ఆహార ధాన్యాలకు డిమాండ్‌ను పెంచి, వ్యవసాయ పురోగతిని ముందుకు తీసుకువెళ్లేందుకు అత్యవసరమైన ఆర్ధిక పరిస్థితులను సృష్టించవచ్చు.
రైతుల ఆత్మహత్యల నివారణ
ఆంధప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, రాజస్తాన్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో స్వామినాథన్ కమిటీ ఏర్పాటుకు ముందు దశాబ్దం పాటు రైతుల ఆత్మహత్యలు అత్యధిక సంఖ్యలో నమోదు అయ్యాయి. ఆ నేపథ్యంలో రైతాంగం సమస్యలకు ప్రాధాన్యమిచ్చి పరిష్కరించవలసిందిగా ప్రభుత్వాలకు ఎన్‌సిఎఫ్ సూచించింది. సరసమైన రీతిలో ఆరోగ్య బీమాను అందించి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పునరుద్ధరించాలి. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ను ప్రాధాన్యతాంశంగా పరిగణించి ఆత్మ హత్యలు జరుగుతున్న ప్రాంతాలకు విస్తరింప చేయాలి. రైతాంగ సమస్యలకు ప్రభుత్వం నుంచి సత్వర ప్రతిస్పందన కోసం రైతుల ప్రాతినిధ్యంతో రాష్ట్ర స్థాయి రైతాంగ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. ఉపాధికి ఆర్ధిక సహాయం అంటే రుణంతో పాటుగా సాంకేతికత, నిర్వహణ, మార్కెట్ల అందుబాటు, వంటి అంశాలలో సేవలను అందించే విధంగా సూక్ష్మ ఆర్ధిక విధానాలను పునర్వ్యవస్థీకరించాలి. ప్రతి పంటకూ బీమాను వర్తింపచేయడం, దీనిని మూల్యాంకన చేసే యూనిట్‌గా బ్లాక్‌ను కాక గ్రామాన్ని ఆధారంగా చేసుకోవడం అవసరమని కమిటీ అభిప్రాయపడింది. వృద్ధాప్య తోడ్పాటు, ఆరోగ్య బీమా ప్రొవిజన్‌తో సామాజిక భద్రతను కల్పించాలి. చెరువులకు పునర్ వైభవం తేవాలి. పానీ పంచాయితీలుగా జల స్వరాజ్‌ను సాధించే లక్ష్యంతో ప్రతి గ్రామం పని చేయాలి. నాణ్యమైన విత్తనాలు, ఇతర ఎరువులు సరైన సమయంలో, సరైన ప్రదేశంలో సరసమైన ధరలలో అందుబాటులో ఉంచాలి. రైతులకు గరిష్ట ఆదాయాన్ని అందించే తక్కువ రిస్కు, తక్కువ ఖర్చుతో కూడిన సాంకేతికతలను సూచించాలి. ఎందుకంటే, బీటి పత్తి వంటి అత్యధిక ఖర్చుతో కూడిన సాంకేతికతలను ఉపయోగించిన రైతులు పంట విఫలమైతే తేరుకోలేరు. మెట్ట ప్రాంతాలలో జీలకర్ర వంటి జీవనాధార పంటలకు మార్కెట్ జోక్యానికి సంబంధించిన పథకాలు కావాలి. ధరల హెచ్చు తగ్గుల నుంచి రైతులను కాపాడేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని కమిటీ కోరింది. ఈ సిఫారసు ఎంతో ఆదరణ పొందింది. అంతర్జాతీయ ధరల నుంచి రైతులను సంరక్షించేం దుకు దిగుమతి సుంకాలపై తక్షణ చర్యలు తీసుకోవాలి. రైతాంగ సంక్షోభం ఏర్పడిన ప్రదేశాలలో గ్రామ విజ్ఞాన కేంద్రాలు లేదా జ్ఞాన్ చౌపల్‌ల ఏర్పాటు చేయాలి. ఇవి వ్యవసాయం, వ్యవసాయేతర ఉపాధులకు సంబంధించి డిమాండ్ ఉన్న విషయాల గురించి సమాచారమివ్వడమే కాకుండా, మార్గదర్శక కేంద్రాలుగా కూడా పని చేస్తాయి. ఆత్మహత్య పోకడలను త్వరగా గుర్తించేందుకు ప్రజా అవగాహనా ప్రచారాలు నిర్వహించాలి.
రైతులలో పోటీతత్వాన్ని ప్రోత్సహించేందుకు కనీస మద్దతు ధరల అమలును మెరుగుపరచాలని కమిషన్ సిఫారసు చేసింది. వరి, గోధుమలకే కాక ఇతర పంటలకు కూడా మద్దతు ధరను కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా చెప్పింది. అలాగే, చిరుధాన్యాలను, ఇతర పోషకాహార పప్పు దినుసులను పిడిఎస్‌లో శాశ్వతంగా జోడించాలి. సగటు ఉత్పత్తి వ్యయం కంటే ఎంఎస్‌పీ 50శాతం ఎక్కువగా ఉండాలి. మార్కెటింగ్, నిల్వ, వ్యవసాయ ఉత్పత్తి శుద్ధి వంటివన్నీ కూడా గ్రేడింగ్, బ్రాండింగ్, ప్యాకేజింగ్‌ను ప్రోత్సహించి, స్థానిక ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లను సృష్టించడం ద్వారా భారతీయ మార్కెట్ ఒకే దిశగా పయనిం చేందుకు రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి మార్కెటింగ్ కమిటీ చట్టాలు (ఎపిఎంసి చట్టాలు).
భారతదేశంలో కార్మికులకు సంబంధించిన వ్యవస్థాగత మార్పులు చాలా నిదానంగా జరుగు తున్నాయి. 1961లో వ్యవసాయంలో ఉన్న కార్మికశక్తి 75.9 శాతం కాగా, 1999-2000 నాటికి అది 59.9శాతానికి పడిపోయిన సంగతితో ఇది అర్ధమవుతుంది. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయమే అత్యధికంగా ఉపాధిని కల్పించే రంగం. కనుక, భారతదేశంలో ఉపాధి వ్యూహం ద్విముఖంగా ఉండాలని స్వామినాథన్ కమిషన్ అభిప్రాయపడింది. ఇందుకు ఆర్ధిక వ్యవస్థ వృద్ధిని వేగవంతం చేయాలి. కార్మిక శక్తి ఎక్కువ అవసరం అయిన రంగాలపై దృష్టి పెట్టి, ఈ రంగాలు వేగంగా వృద్ధి చెందేలా చూడాలి. మౌలిక కార్మిక ప్రమాణాలక• చేటు లేకుండా అవసరమైన మార్పులు చేసి కార్మిక మార్కెట్ల పనితీరును మెరుగుపరచాలి. అలాగే వ్యవసాయేతర ఉపాధిని ప్రోత్సహించేందుకు వాణిజ్యం, రెస్టారెంట్లు, హోటళ్లు, రవాణా, నిర్మాణం, మరమ్మతులు, నిర్దిష్ట సేవలలో ఉపాధి అవకాశాలను అభివృద్ధి చేయాలి. రైతులు ఇంటికి తీసుకువెళ్లే నికర ఆదాయం, ప్రభుత్వోద్యోగులతో పోల్చదగినదిగా ఉండాలి.
జీవవనరులు
తమ పౌష్టికాహారం కోసం, ఉపాధి భద్రత కోసం భారతదేశంలోని గ్రామీణ ప్రజలు విస్తృతమైన స్థాయిలో జీవవనరులపై ఆధారపడతారు. అందుకు స్వామినాథన్ నివేదిక ఇలాంటి సూచనలు చేసింది. ఔషధ మొక్కలు, చమురు దిగుబడినిచ్చే మొక్కలు, లాభదాయకమైన సూక్ష్మజీవులు సహా కలపయేతర అటవీ ఉత్పత్తులకు వంటి జీవవైవిధ్యంలో ప్రాముఖ్యం కలిగి ఉన్న సంప్రదాయ హక్కులను పరిరక్షించాలి. పంటలను, వ్యవసాయానికి ఉపయోగపడే జంతువులతో పాటు, చేపల పెంపకం సహా పరిరక్షించడం పెంచడం జరగాలి. దేశీయ జాతులను ఎగుమతి చేయడం, ఉత్పత్తిని పెంచుకునేందుకు తగిన జాతులను దిగుమతి చేసుకోవడం ద్వారా సంకర జాతి పశువుల ఉత్పాదకతను పెంచేందుకు అనుమతించాలి కూడా.
స్వామినాథన్‌ను వరించిన అవార్డులు, బిరుదులు
భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా మన్ననలు అందుకున్న స్వామినాథన్ మొట్టమొదటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్‌ను 1987లో అందుకున్నారు. అందులో భాగంగా ఇచ్చిన 250,000 డాలర్ల ధనాన్ని ఆయన చెన్నైలో తారామణిలో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటుకు ఉపయోగించారు. ఇది వ్యవసాయ పరిశోధనపై ప్రపంచ స్థాయి సంస్థ మాత్రమే కాదు థింక్ ట్యాంక్ కూడా. ప్రజాసేవకు భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారాలు అయిన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్‌ను పొందిన స్వామినాథన్‌కు దాదాపు 90 గౌరవ డాక్టరేట్లు ఉన్నాయి. స్వతంత్రం రాక ముందు ప్రపంచమంతా కూడా భారత్‌కు గౌరవ మర్యాదలు ఉండేవంటే అందుకు కారణం మన శాస్త్రవేత్తలు, కళాకారులు. సంక్షోభాలతో నిండిన స్వతంత్ర భారతావని కూడా శాస్త్రసాంకేతిక రంగాలలో వెనకబడిపోకుండా ఉండడానికి కూడా కారణం వారే. సీవీ రామన్, శ్రీనివాస రామానుజన్, జేసీ బోస్, హోమీ జే బాబా, ఏపీజే అబ్దుల్ కలాం వంటివారు ఈ ప్రతిష్టను నిలిపారు. ఆ కోవలోని వారే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్.
బెంగాల్ కరవును చూసి చలించి….
మద్రాస్ ప్రెసిడెన్సీలోని కుంభకోణంలో స్వామినాథన్ ఎం. సాంబశివన్, పార్వతి తంగమ్మళ్‌కు జన్మించారు. కేరళలోని అలప్పుఝ జిల్లాకు చెందిన సాంబశివన్ కుంభకోణంలో జనరల్ సర్జన్. కొడుకు కూడా తండ్రిలాగే డాక్టర్ కావాలని కన్నవారు కోరుకున్నా, స్వామినాథన్ మాత్రం జంతుశాస్త్రం ప్రధానాంశంగా ఉన్నత విద్యను ప్రారంభించారు. కానీ 11 ఏళ్ల వయసులోనే స్వామినాథన్ తండ్రిని కోల్పోయారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, 1943లో సంభవించిన బెంగాల్ మహా కరవు ప్రభావాలను, యావత్ దేశంలోనూ బియ్యం కొరతతో అల్లాడుతున్న ప్రజలను చూసిన తర్వాత ఆయన వ్యవసాయంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రచురించిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘‘అది 1942లో గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చిన కాలం. 1942-43లోనే బెంగాల్ కరవు వచ్చింది. మేం చాలామందిమి ఆ కాలంలో ఆదర్శవాదులుగా ఉన్న విద్యార్ధులం, స్వతంత్ర భారతదేశానికి తామేమివ్వగలమని మమ్మల్ని మేము ప్రశ్నించుకున్నాం. కేవలం బెంగాల్ కరవు కారణంగా, వ్యవసాయ విద్యనభ్యసించాలని, వైద్య కళాశాలకు బదులు కోయంబత్తూరులోని వ్యవసాయ కళాశాలకు వెళ్లాను,’’ అన్నారు. బెంగాల్ కరవులో మూడు మిలియన్ల మంది వరకూ మరణించారని అధికారిక లెక్కలు చెప్తున్నా, వాస్తవంలో ఆ లెక్క ఎన్నో రెట్లు ఎక్కువ. ఈ కరవు, కృత్రిమమైనది. రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు ఆహారధాన్యాలను తన వలస కాలనీల నుంచి సేకరించాలన్న బ్రిటిష్ విధానాల ఫలితంగా సంభవించింది.
చిన్న రైతు అయినా పెద్ద రైతు అయినా లబ్ధిపొందేలా విత్తనాలు తయారు చేయడం తన లక్ష్యంగా ఉండేదని స్వామినాథన్ చెప్పారు. ఐరోపా, యుఎస్‌లలోను పని చేశారు. సారవంతమైన నేల, నీటి నిర్వహణలకు ప్రతిస్పందించగల అత్యధిక దిగుబడిని ఇచ్చే రకాలను అభివృద్ది చేసే పని 1954లో ఆయన కటక్‌లోని సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చేరాక ప్రారంభించారు.
– జాగృతి డెస్క్