అక్టోబర్ 20 మూలా నక్షత్రం
దేశంలోని అష్టాదశ పీఠాలు సహా అనేకానేక శక్తిక్షేత్రాలలో ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి నుంచి దేవీ నవరాత్రుల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. వీటిలో అతి ముఖ్యమైన మూలానక్షత్రంతో కూడిన సప్తమి తిథి నాడు జగన్మాతను సరస్వతీ అలంకారంలో అర్చిస్తారు. దుష్టశిష్టణ, శిక్షణరక్షణ కోసం అవత రించిన శక్తి స్వరూపిణి జగన్మాత సరస్వతీ అవతారంతో శుంభునిశుంభులనే దానవులను సంహరించింది.
మానవజాతి సకల దోషాలను హరించడంతో పాటు జ్ఞానజ్యోతిని వెలిగించ సంకల్పించిన దుర్గామాత సరస్వతీ అవతారంతో అనుగ్రహించారు. ‘దైవం మంత్రాధీనం’ అంటారు సద్గురువులు. ఆ మంత్రాలకు అధిదేవత సరస్వతీ మాత. అనంతమైన అక్షర మహిమతోనే జ్ఞానం వెలుగులు విరచిమ్ముతుంది. మాతృమూర్తులలో, నదులలో, దేవతలలో ఉత్తమమైనది సరస్వతి (‘అంబీతమే నదీతమే దేవీతమే సరస్వతి’) అని రుగ్వేదవాక్కు. సరస్వతీ నదీ తీరంలోనే వేదకాలపు నాగరికత వర్థిల్లిందని, ప్రకృతిలోని మార్పుల కారణంగా ఆ నది అదృశ్యమై అంత ర్వాహినిగా ప్రవహిస్తోందని చరిత్ర చెబుతోంది.
శారదాంబను ఒక్కొక్క తీరుగా అభివర్ణిస్తారు, అర్చిస్తారు. వ్యాస భగవానుడు సరస్వతిని వేదమాతగా, కాళిదాసు మాతంగిగా అభివర్ణించగా, ఇంకొందరు రాజశ్యామలగా కొలుస్తారు. సాహిత్య వేత్తలకు సరస్వతి అత్యంత పూజనీయురాలు. ఆదికవి నన్నయ్య మహాభారత రచనకు ‘శ్రీవాణీ….’ అని శ్రీకారం చుట్టారు. లక్ష్మీస్వరూపిణీగా సంపదను, సరస్వతిగా జ్ఞానాన్ని, పార్వతిగా శక్తిని ప్రసాదించే దుర్గమ్మను ‘అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ….’ పద్యంలో ‘కృపాబ్ధి ఇచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’ అంటూ కృపా సముద్రురాలైన జగన్మాత విద్యాప్రదాయినిగా కవిత్వ సంపద ఇస్తుందని పోతనామాత్యుడు అభివర్ణించాడు. శ్రద్ధాభక్తులతో అర్చిస్తే చదువుల తల్లి ప్రసన్నురాలై జ్ఞానభిక్ష ప్రసాదిస్తుందని విశ్వాసం. ఆ క్రమంలోనే మూలానక్షత్రం సందర్భంగా పిల్లలతో పాఠశాలల్లో సరస్వతీ పూజ నిర్వహిస్తారు. బడి ఈడు పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేపడతారు.
సరస్వతీ అమ్మవారిని ‘సర్వశుక్లాం శుద్ధరూపం’ అన్నారు. ‘తెల్లని వస్త్రం ధరించిన సరస్వతీదేవి కాంతిమంత వదనంతో, చల్లని చిరునవ్వు వెదజల్లుతుంటుంది. ఆమె ధరించే తెలుపు రంగు చీరను స్వచ్ఛతకు, ఆమె వాహనం శ్వేత హంసను ఆత్మలకు మూలమైన పరమాత్మకు సంకేతంగా చెబుతారు. హంస పాలను, నీటిని వేరు చేస్తున్నట్లే మనిషిలోని మంచి చెడులను బేరీజు వేస్తూ, పాల లాంటి ‘మంచి’ని అమ్మవారు వాహనంగా చేసుకొని జగతికి దిశానిర్దేశం చేస్తారని చెబుతారు.
శంకరభగవత్పాదులు నెలకొల్పిన నాలుగు ఆమ్నాయపీఠాలలో దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం మొట్ట మొదటిది. అక్కడ శరన్నవరాత్రుల సందర్భంగా చదువుల తల్లిని విశేష అలంకారాలతో అర్చిస్తారు. విజయనగర సామ్రాజ్య సంస్థాపనా చార్యులు విద్యారణ్య మహర్షి (14 శతాబ్దం) ప్రారంభించిన దర్బార్ సంప్రదాయంగా వస్తోంది.
‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే..’ అనే ఆర్యోక్తికి జ్ఞాన ప్రదాయిని సరస్వతీ దేవి హేతువు. విద్యవల్ల వినయం, వినయం వల్ల పాత్రత, పాత్రతవల్ల ధనం, ధనం వల్ల ధర్మం, దాని కారణంగా ఐహికాముష్మిక సుఖమూ కలుగుతాయని ఆర్యవాక్కు. ఇన్ని ప్రసాదించే విద్యామాతకు అక్షరాంజలి.
– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్ జర్నలిస్ట్