నాటి అమెరికా విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్ మన పెరట్లో పాములను పెంచితే అవి పక్కవారినే కాదు మనను కూడా కాటేస్తాయంటూ పొరుగు దేశమైన పాకిస్తాన్‌కు హితవు చెప్పడం, వారు దానిని పెడచెవిన పెట్టడం మనకు తెలిసిన విషయమే. కానీ వారు ఇప్పుడు దాని ఫలితాలను అనుభవిస్తున్నట్టు కనిపిస్తోంది. అవకాశం కల్పించుకుని మరీ మన దేశంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహించిన పాకిస్తాన్ ఇప్పుడు దాని దెబ్బకు కుదేలవుతున్నది. బెలూచీలు, టిటిపి వారు చేస్తున్న దాడులు పాక్‌ను అల్లాడిస్తున్నాయి. ముఖ్యంగా పోలీసులను, రక్షణ దళాలను లక్ష్యంగా చేసుకుని మరీ దాడులు జరుగుతుండడంతో, తీవ్రవాదం రుచి ఎంత చేదుగా ఉంటుందో పాక్‌కు ప్రత్యక్షంగా తెలుస్తోంది.
పాకిస్తాన్ ప్రభుత్వ అండ, ప్రోత్సాహంతో భారత్‌లో పెచ్చరిల్లిన ఉగ్రవాదులు ఆ దేశంలోనే అనామకుల చేతిలో బలైపోతుండడం అటు తీవ్రవాదులనే కాదు, పాక్ ప్రభుత్వాన్ని కూడా కలవర పెడుతున్నది.
ఇటీవలి కాలంలో విదేశాలలో 16మంది భారత వ్యతిరేక తీవ్రవాదులను, కార్యకర్తలను గుర్తు తెలియని గన్‌మెన్ కాల్పులు జరిపి చంపివేయడం సంచలనాన్ని రేకెత్తిస్తోంది. కేవలం పాకిస్తాన్‌లోనే కాక కెనెడాలో కూడా ఈ హత్యలు జరుగుతుం డడంతో ఆ దేశాలు ఇవి భారత గూఢచారి సంస్థ రిసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (ఆర్‌ఎడబ్ల్యు -రా) చేస్తోందంటూ తీవ్ర ఆరోపణలకు దిగుతున్నాయి. ఇస్లామిక్ తీవ్రవాదులే కాదు, ఖలిస్తానీ తీవ్రవాదులు కూడా ఇటువంటి ఘటనలలో మరణించారు. దాదాపు 2021లో ప్రారంభమైన ఈ కాల్చివేతలు ఈ ఏడాది మరీ ఉధృతం కావడంతో ఇవి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.
ఇటీవలే లష్కర్- ఎ- తాయిబా (ఎల్‌ఇటి) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు (కొందరు మేనల్లుడు అని అంటున్నారు) కమాలుద్దీన్ సయీద్‌ను 26 సెప్టెంబర్ 2023న కరాచీ నుంచి దుండగులు ఎత్తుకుపోగా, ఎల్‌ఇటి సహ వ్యవ స్థాపకుడు, అగ్ర సిద్ధాంతకర్త ముఫ్తీ కైజర్ ఫరూక్‌ను కరాచీలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపడంతో ఐఎస్‌ఐ కూడా ఉలిక్కి పడిందని చెప్తున్నారు. హఫీజ్ సయీద్ కుడి భుజంగా వ్యవహరిస్తున్న ఫరూక్ హత్యతో గత 19నెలల్లో విదేశాలలో హత్యలకు గురైన వారిసంఖ్య 16కు చేరుకుంది. ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు అటు సయీద్‌కు, ఇటు అతడి సంస్థలు జమాయిత్- ఉద్- దావా, ఎల్‌ఇటికి పెద్ద దెబ్బ అని చెప్పక తప్పదు.
భారత వ్యతిరేక తీవ్రవాదులను విదేశాలలో హననం చేయడం అన్నది శ్రీనగర్ నవాకదళ్‌కు చెందిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ జమ్ము అండ్ కాశ్మీర్ (ఐఎస్‌జెకె) అగ్ర కమాండర్ అయిజాజ్ అహ్మద్ అహంగర్ అలియాస్ అబూ ఉస్మాల్ అల్- కాశ్మీరీని 18 జులై 2019న ఆఫ్గానిస్తాన్‌లో హత్య చేయడంతో ప్రారంభమయ్యాయని చెప్పకతప్పదు. అయితే, అది పెద్దగా సంచలనాన్ని రేకెత్తించ లేదు. అనంతరం, ఐసి 814 విమానాన్ని హైజాక్ చేసిన జైష్- ఎ-మహమ్మద్ కార్యకర్త మిస్త్రీ జహూర్ ఇబ్రహీం అలియాస్ జహీద్ అఖూంద్‌ను 1 మార్చి 2022న కరాచీలో గుర్తు తెలియని గన్‌మెన్ కాల్చివేయడంతో ఈ వరుస కాల్చివేతల ప్రహసనం ప్రారంభమైందని చెప్పవచ్చు. అదే సంవత్సరం 19 సెప్టెంబర్‌న నేపాల్ రాజధాని ఖాట్మండు బయట కశ్మీరీ తీవ్రవాదం తోనూ, ఐఎస్‌ఐతోనూ సన్నిహిత సంబంధాలు కలిగిన మహమ్మద్ లాల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
ఈ హత్యలు కేవలం ఇస్లామిక్ తీవ్రవాదులనే కాక ఖలిస్తానీ తీవ్రవాదులను కూడా లక్ష్యంగా చేసుకుని జరుగుతుండడంతో ఆ సంస్థలు, ఆ దేశాలు ఇందులో భారత్ పాత్ర ఉందని అనుమానిస్తున్నాయి. పంజాబ్ పోలీసు కేంద్రకార్యాలయంపై ఆర్‌పిజి దాడి సహా అనేక భారత్ వ్యతిరేక తీవ్రవాద కార్యకలా పాలకు పాల్పడిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ తీవ్రవాది హర్వీందర్ సింగ్ సంధు అలియాస్ రిండా లాహోర్‌లోని సైనిక ఆసుపత్రిలో డ్రగ్ ఓవర్‌డోస్‌తో అనుమానాస్పద పరిస్థితులలో 19నవంబర్ 2022న మరణించడం కూడా ఈ క్రమంలోనే అనుమానాలకు తావిచ్చింది.
హిజ్బుల్ ముజాహిదీన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రధాన కార్యకర్త బషీర్ అహ్మద్ పీర్ అలియాస్ ఇంతియాజ్ ఆలమ్‌ను 20 ఫిబ్రవరి 2023న గుర్తు తెలియని గన్‌మెన్ పాకిస్తాన్‌లోని రావల్పిండిలో కాల్చి చంపారు. వారం తిరక్కుండానే 26 ఫిబ్రవరిన అల్బదర్ ముజాహిదీన్ మాజీ కమాండర్ సయ్యద్ ఖలీద్ రజాను కరాచీలో గుర్తుతెలియని గన్‌మెన్ కాల్చి చంపడంతో పాకిస్తానీయులు ఉలిక్కి పడ్డారు. మరొక వారం తిరిగేసరికి, అంటే 4 మార్చిన ప్రముఖ జిహాదీ తీవ్రవాది, సిద్ధాంతవేత్త అయిన సయ్యద్ నూర్ షోలాబార్‌ను పాకిస్తాన్, ఖైబర్ పఖ్తూన్‌వాలోని బారా ఖైబర్‌లో గుర్తు తెలియని గన్‌మెన్ హననం చేశారు.
తమ కార్యకలాపాలకు ఒక నెలపాటు విరామమిచ్చిన ఈ గుర్తుతెలియని గన్‌మెన్ 6 మే 2023న భారత దేశంలో మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది, ఖలిస్తానీ కమెండో ఫోర్స్ అధిపతి పరమ్‌జీత్ సింగ్ పంజ్వార్‌ను లాహోర్‌లో కాల్చి చంపారు. మరునెల లోనే కార్యనిర్వహణా పద్ధతి మారింది. మరొక ఖలిస్తానీ వేర్పాటువాది, గతంలో లండన్‌లోని భారతీయ రాయబారి కార్యాలయంపై దాడి చేసిన అవతార్ సింగ్ ఖండా యుకె, బర్మింగ్‌హాంలోని ఆసుపత్రిలో 15 జూన్ 2023న అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు.
ఇక, భారత వ్యతిరేక యాక్టివిస్టు, మాజీ తీవ్రవాది అయిన హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కెనెడా, బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలోని గురుద్వారా బయిట గుర్తు తెలియని వ్యక్తులు 18 జూన్ 2023న కాల్చి చంపారు.
మరొక నెల విరామానంతరం, ఆగస్టు 5న జమాత్-ఉద్-దావా కార్యకర్త ముల్లా సర్దార్ హుస్సేన్ అరైన్‌ను కరాచీ సింధ్‌లోని నవాబ్‌షా జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు. కాగా, ఈ హత్యకు, ఇటువంటి మరికొన్ని హత్యలకు సింధుదేశ్ రెవెల్యూషనరీ ఆర్మీ బాధ్యత తీసుకుని, అవి తామే చేసినట్టు ప్రకటించుకుంది. ఆ తర్వాత, 8 సెప్టెంబర్ 2023న జమ్మూలోని పూంచ్ ప్రాంత ఎల్‌ఇటి అగ్ర కమాండర్ మహమ్మద్ రియాజ్ అలియాస్ అబూ ఖాసింను పాక్ ఆక్రమిత్ కశ్మీర్‌లోని రావల్‌కోట్‌లోని ఒక మసీదులో గుర్తుతెలియని గన్‌మెన్ కాల్చి చంపడం పాక్ భదత్రా దళాలను కూడా సంచల నానికి గురి చేసింది. నాలుగు రోజులు తిరుగ కుండానే 12 సెప్టెంబర్ 2023న హిజ్బుల్ ముజా హిదీన్, ఎల్‌ఇటి అగ్ర కార్యకర్త అయిన జియావుర్ – రెహ్మాన్‌ను కరాచీలోని గులిస్తాన్-ఎ- జౌహార్ జిల్లాలో గుర్తు తెలియని బైకర్లు కాల్చి చంపారు. అతడు జామియా అబూబాకర్ సంస్థకు అధికారిగా ఉన్నాడని తెలుస్తోంది.
తప్పించుకు తిరుగుతున్న ఖలిస్తానీ తీవ్రవాది అర్షదీప్ సింగ్‌కు కుడిభుజంగా ప్రాచుర్యం పొందిన సుఖదూల్ సింగ్ అలియాస్ సుఖ దునుకెను 21 సెప్టెంబర్ 2023న కెనెడాలోని విన్నిపెగ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు.
భారత్ పాత్రపై ఆరోపణలు
గుర్తు తెలియని వ్యక్తులు చంపినవారందరూ ఏదో ఒకరకంగా భారతదేశంలో తీవ్రవాద కార్యకలా పాలకు పాల్పడినవారు లేదా వాటిని ప్రోత్సహించిన వారు కావడంతో అటు పాకిస్తాన్, ఇటు కెనెడా కూడా ఈ హత్యలకు భారతే బాధ్యత వహించాలని వేలెత్తి చూపుతున్నాయి. ముఖ్యంగా ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణంలో భారత్ హస్తం ఉందంటూ కెనెడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఈ ఉదంతాన్ని అడ్డం పెట్టుకుని తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, భారతదేశంతో ప్రస్తుతం దౌత్యపరమైన సంబంధాలు అత్యంత సవాళ్లతో కూడుకుని ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. సెప్టెంబరు నెలలో తమ పార్లమెంటులో భారత ప్రభుత్వాన్ని ఈ హత్యకు బాధ్యులని చేస్తూ విమర్శల వర్షం కురిపించారు. ఖలిస్తానీ సిక్కుల ఓటు బ్యాంకును అమూల్యంగా భావించే ట్రూడోను ఇప్పుడు పలువురు విశ్లేషకులు, కమెడియన్లు కూడా ‘జస్టిండర్ ట్రూడో’ అని పిలుస్తున్నారు. కాగా, ఈ ఆరోపణలు నిరాధారమైనవంటూ న్యూఢిల్లీ కొట్టి పారేసింది. అంతేకాకుండా ఇక్కడి కెనెడా రాయబార కార్యాలయంలో 41మంది దౌత్య సిబ్బందిని లేదంటే వారికిచ్చే దౌత్యపరమైన మినహా యింపులను ఉపసంహరించుకుంటామని హెచ్చ రించడంతో, ట్రూడో ప్రభుత్వం దిగివచ్చి సింగపూర్‌కి, కౌలాలంపూర్‌కు గడువుకన్నా ముందే పంపించారు. భారత్‌తో ప్రైవేటుగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటామని పేర్కొంది.
ఈ దౌత్యపరమైన సమస్యలను పరిష్కరించేం దుకు కెనెడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ తాము భారత్‌తో ప్రైవేటుగా చర్చలను కొనసాగిస్తామంటూ చెప్పారు. నిజ్జర్ హత్యానంతరం నెలకొన్న దౌత్యపరమైన వివాదాన్ని గోప్యమైన చర్చల ద్వారా పరిష్కరించుకుంటామంటూ జోలీ చెప్పడంతో, కెనెడా ఒక మెట్టు దిగిందనే విషయం స్పష్టమైంది.
కాగా, ఖలిస్తానీ తీవ్రవాదుల హత్యలు కేవలం మాదక ద్రవ్యాల ముఠా తగాదా అనే వాదన కూడా వినిపిస్తున్నది. ఇటీవలే ఎన్‌ఐఎ ఖలిస్తానీ తీవ్రవాది అర్షదీప్ సింగ్ అలియాస్ అర్ష్ దల్లా సహచరులనేక మందిపై దాడులు చేసి అరెస్టు చేసింది. సీమాంతర మాదకద్రవ్య తీవ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నందునే వీరిని అరెస్టు చేసినట్టు పేర్కొంది. అటు పాకిస్తాన్‌లోనూ, ఇటు కెనెడాలోనూ గల ఖలిస్తానీ తీవ్రవాదులతో సంబంధాలు కలిగిన నేర సిండికేట్లపై జరిగిన దాడులలో పలువురిని అదుపులోకి తీసుకుంది. లారెన్స్ బిష్ణోయ్, దునేకా, హారీ మార్, నరేందర్ అలియాస్ లాలీ, కాలా జతేరీ, దీపక్ తిను వంటి కరడుగట్టిన నేరగాళ్ల ఆచూకీ కోసం ఈ దాడులు జరిగాయి. వీరందరికీ కూడా కెనెడా, పాక్‌లో ఉన్న మాదక ద్రవ్యాల సిండికేట్లతో సంబంధాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
పాక్ వ్యవహారం
వరుసగా పాక్‌లో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో మరణిస్తున్న తీవ్రవాదుల విషయంలో రక్షణ, ఇతర వర్గాలు భారతదేశం హస్తం ఉందనే ఆరోపణలు చేస్తున్నాయి. అయితే, ఈ హత్యలు చేస్తున్నది పాకిస్తాన్ సైన్యం, ఐఎస్‌ఐదేనని రక్షణ వర్గ, జియో పొలిటికల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశంలో తీవ్రవాదాన్ని రెచ్చగొట్టేందుకు వీరిని పెంచి పోషించిన పాకిస్తాన్ నేడు పలు రకాల వత్తిడుల కారణంగా తాను పాలు పోసి పెంచిన పాములను హరిస్తోందన్నది వారి వాదన. పూర్తి రాజకీయ, ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ ఐఎంఎఫ్ నిధులు తెచ్చుకునేందుకు కూడా అనేక షరతులకు తల ఒగ్గవలసి వస్తోంది.
ఈ క్రమంలో తమ పెరట్లోనే తీవ్రవాదాన్ని రూపుమాపాలనే షరతు కారణంగా కూడా ఈ చర్యలు తీసుకొని ఉండవచ్చని కొందరు వాదిస్తుండగా, ప్రస్తుతం సైన్యం, ఐఎస్‌ఐ వద్ద ఒకప్పటిలా నిధులు లేకపోవడం, ఇటువంటి వైట్ ఎలిఫెంట్‌లను పోషించడం ఖర్చుతో కూడుకున్న విషయం కావడం వల్లే వారిని ఇలా గుర్తు తెలియకుండా హతమారుస్తోందని వాదించేవారూ లేకపోలేదు. మరొక కోణంలో, పాకిస్తాన్ ఎప్పుడు సంక్షోభంలో పడినా పెద్దన్నల్లా ఆదుకునే యుఎఇ, సౌదీ అరేబియాలు ప్రస్తుతం భారత్‌తో సత్సంబం ధాలను నెరుపుతుండడం, వారే తమ దేశాలలో సంస్కరణలకు పూనుకోవడం వంటి కారణాల వల్ల పాకిస్తాన్‌ను కూడా హెచ్చరించి ఉంటారనే వాదన కూడా వినిపిస్తున్నది.
ఏది ఏమైనప్పటికీ, మెరుపు మెరిసినట్టుగా తళుక్కుమని ప్రత్యక్షమై, దుష్ట శిక్షణ చేసి మాయమై పోతున్న ఆ గుర్తు తెలియని వ్యక్తులకు పాకిస్తాన్ లోనూ, భారత్‌లోనూ అనేకమంది కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.
ఇరు దేశాలకూ చిరాకుగా మారిన వారి మరణంతో, ఇటువంటి కార్యకలాపా లను ప్రోత్సహించి, పాల్పడేవారి సంఖ్య తగ్గి, దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆలోచనా పరులైన పాకిస్తానీయులు భావిస్తున్నారు. ఏమైనప్పటికీ, ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరన్నది ఇప్పటికీ అక్కడి రక్షణ సంస్థలు కనుగొనలేకపోవడం ఆశ్చర్యమే!
– డి. అరుణ, సీనియర్ జర్నలిస్ట్