జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌కొత్త పార్లమెంట్‌ ‌భవంతిలో తొలి సమావేశం చరిత్రకు ఎక్కింది. ఇరవైఏడేళ్లుగా నానుతున్న మహిళా బిల్లుకు కొత్త భవనంలో జరిగిన తొలి సమావేశాలు, ప్రత్యేక సమావేశాలు ఆమోదముద్ర వేశాయి. రెండు వ్యతిరేక ఓట్లు మినహాయిస్తే, లోక్‌సభ, రాజ్యసభ మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు జే కొట్టాయి. 27 ఏళ్లుగా పడిగాపులు పడి ఉన్న బిల్లును కేవలం 48 గంటలలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదింప చేశారు. ఇందులో చాకచక్యాన్ని చూడడం, రాజకీయ వ్యూహాన్ని వెతకడం కంటే, ఆధునిక కాలానికి అవసరమైన ఒక గొప్ప సంస్కరణను దర్శించడం మంచిది. ఆ రాజకీయ చాతుర్యానికీ, వ్యూహానికీ ఒక ఆదర్శం ఉంది. అందుకే భారతీయులంతా ఈ బిల్లును, దీనిని అమలులోకి తెచ్చిన ఎన్డీయే మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక మహిళ రాష్ట్రపతి పదవిలో ఉండగా ఈ బిల్లు ఆమోదానికి నోచుకోవడం మరొక ప్రత్యేక సందర్భమే. ఈ బిల్లుకు ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చిన పేరు నారీశక్తి వందన్‌ అభియాన్‌.

‌ధర్మం, సహనాలకు ఒక బలహీనత ఏంటంటే ద్రోహానికి, వంచనకు తేలిగ్గా గురికావడం! సమానహక్కుల విషయంలో సహనమూర్తులైన స్త్రీల కు ప్రపంచ వ్యాప్తంగా జరిగిందీ…జరుగుతున్నదీ ఇదే. కానీ ఇందుకు రువాండా మినహాయింపు. దిగువసభలో 61% ప్రాతినిధ్యాన్ని కల్పించడం ద్వారా మహిళల సమాన హక్కుల విషయంలో ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచింది. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో ప్రస్తుత వేగంతోనే దేశాలు కోటాలు నిర్దేశిస్తూ పోతే, వారు పురుషులతో సమానస్థాయికి రావడానికి మరో 300 ఏళ్లు పడుతుందని యు.ఎన్‌. ‌మహిళ నివేదిక వెల్లడిం చించినా అందుకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనదేశానికి వస్తే 27 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన మహిళా బిల్లును పితృస్వామ్య భావజాలాన్ని వీడని రాజకీయ పార్టీలు తమ వితండవాదాలతో అడ్డుకోవడంతో ఇప్పటివరకు అమలుకు నోచలేదు. ఈ ఇరవయ్యేడేళ్ల నిరీక్షణ ఇప్పటికి ఫలించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మహిళా బిల్లును పార్లమెంట్‌ ఉభయ సభలు ఆమోదించడంతో మహిళాభ్యుదయ చరిత్రలో మరో అధ్యాయం ప్రారంభమైంది. లోక్‌సభలో కేవలం ఇద్దరు సభ్యులు బిల్లును వ్యతిరేకించగా, రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించడం మారిన పార్టీల వైఖరిని స్పష్టం చేస్తున్నది.

 కేంద్ర, రాష్ట్ర చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ను కల్పించడానికి వీలుకల్పించే ‘రాజ్యాంగ 128వ సవరణ బిల్లు-2023’ను ‘నారీశక్తి వందన్‌ అభియాన్‌’ అధికారిక నామంతో ‘సంసద్‌ ‌భవన్‌’‌లో పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి అర్జున్‌రామ్‌ ‌మేఘ్‌వాల్‌ ‌సెప్టెంబర్‌ 19 ‌ప్రవేశపెట్టిన బిల్లు ఎనిమిది గంటల చర్చ తర్వాత ఆమోదం పొందింది.నూతన పార్లమెంట్‌ ‌భవనం ‘సంసద్‌ ‌భవన్‌’‌లో ప్రవేశపెట్టిన తొలిబిల్లుగా చరిత్ర సృష్టించిన నారీశక్తి వందన్‌ అభియాన్‌కు అనుకూలంగా 454 మంది సభ్యులు ఓటుచేయగా ఇద్దరు వ్యతిరేకించారు. అనంతరం ఈ బిల్లును సెప్టెంబర్‌ 21‌న ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టగా 11 గంటల చర్చ అనంతరం ఏకగ్రీవంగా ఆమోదించింది. సభకు హాజరైన 215మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయడంతో మహిళా బిల్లుకు ఉభయసభల ఆమోదం లభించింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం 181కి పెరుగుతుంది. ప్రస్తుతం మొత్తం 542మంది లోక్‌సభ సభ్యుల్లో మహిళలు 78 మంది మాత్రమే! రాజ్యసభ సభ్యుల సంఖ్య 224 కాగా, మహిళా సభ్యుల సంఖ్య 24కే పరిమితమైంది. అంటే 2023 పార్లమెంట్‌ ఉభయసభల్లో మహిళా ప్రతినిధుల సంఖ్య 102. కొత్తగా అమల్లోకి రాబోయే ఈ మహిళా రిజర్వేషన్‌ ‌చట్టం 15 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన మహిళలకు, ఈ రిజర్వేషన్‌లోనే తగిన సీట్లు కేటాయిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా చర్చ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన తర్వాత, జనగణన, నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలను కొత్త ప్రభుత్వం చేపడుతుందన్నారు. ఈ రెండూ ముగిసిన తర్వాత మహిళా రిజర్వేషన్‌ ‌చట్టం అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం విపరీతంగా పెరిగిన జనాభా నేపథ్యంలో, జనసంఖ్యకు అనుగుణంగా ఈ నియోజక వర్గాల పునర్‌వ్యవస్థీకరణ జరుపుతారు. ఈ బిల్లు పూర్తిగా అమల్లోకి రావాలంటే 50% రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం తప్పనిసరి. ఈ పక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే మహిళా రిజర్వేషన్‌ అమల్లోకి వస్తుంది.

వ్యతిరేకించిన ఎంఐఎం

లోక్‌సభలో ఏఐఎంఐఎం పార్టీకి చెందిన అసదుద్దీన్‌ ఒవైసీ, ఇంతియాజ్‌ ‌జలీల్‌లు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేసి ఉండవచ్చునన్న వార్తలు వచ్చాయి. అసదుద్దీన్‌ ఒవైసీ ఈ బిల్లుపై సభలో మాట్లాడుతూ ఇది ‘సవర్ణ’ మహిళలకు మాత్రమే ప్రయోజనకరమని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో ఓబీసీ, ముస్లిం మహిళలకు తగిన కోటా ఇవ్వక పోవడం వల్ల వారి ప్రాతినిధ్యానికి బిల్లు ఎంతమాత్రం ప్రయోజనకారి కాదంటూ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ముస్లిం మహిళలు దేశ జనాభాలో 7శాతం ఉంటే పార్లమెంట్‌లో వారి ప్రాతినిధ్యం 0.7శాతం మాత్రమేనని ఆయన వాదించారు. ఇప్పటివరకు 690 మంది మహిళలు లోక్‌సభకు ఎన్నికైతే వారిలో 25 మంది మాత్రమే ముస్లిం మహిళలని ఆయన పేర్కొన్నారు. ఓబీసీలు, మైనారిటీ మహిళల రిజర్వేషన్‌ ‌ప్రస్తావన లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కినా, కాంగ్రెస్‌ ‌సహా విపక్షాలు బిల్లుకు మద్దతివ్వడం విశేషం.

మహిళా రిజర్వేషన్‌బిల్లు-2010

నిజానికి 27 సంవత్సరాలుగా మహిళా రిజర్వేషన్లపై దేశవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చట్టసభల్లో 1/3వ వంతు సీట్లు మహిళలకు కేటాయించేందుకు వీలుకల్పించే ‘మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు’ లేదా 108వ రాజ్యాంగ సవరణ బిల్లు పేరుతో మార్చి 9, 2010న నాటి యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. రొటేషన్‌ ‌ప్రాతిపదికన మహిళలకు సీటు రిజర్వ్ ‌చేసేందుకు ఈ బిల్లులో ప్రతిపాదించారు. అంటే ప్రతి మూడు వరుస సాధారణ ఎన్నికలకు ఒకసారి రొటేషన్‌ ‌ప్రాతిపదికన సీటు కేటాయిస్తారు. మార్చి 9, 2010న రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపినప్పటికీ, లోక్‌సభలో దీనిపై ఓటింగ్‌ ‌జరగకపోవడంతో పెండింగ్‌లో పడింది. ఫలితంగా 2014, 2019 సంవత్సరాల్లో ఈ బిల్లు మురిగిపోయింది. 2010లో సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌ ‌యాదవ్‌ ‌వంటి విపక్షనేతలు తాము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదంటూనే ఓబీసీలు, మైనారిటీ మహిళలకు రిజర్వేషన్‌ ‌సదుపాయం కల్పించాలని డిమాండ్‌ ‌చేయడంతో బిల్లు ఓటింగ్‌కు నోచుకోలేదు. నిజానికి అన్ని పాలక సంస్థల్లోనూ మహిళలకు రిజర్వేషన్‌ ‌కల్పించాలని బిల్లులో పేర్కొన్నారు. కానీ స్టాండింగ్‌ ‌కమిటీ కేవలం కేంద్ర పార్లమెంట్‌, ‌రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీకు ఈ సదుపాయాన్ని పరిమితం చేయాలన్న సిఫారసును ప్రభుత్వం ఆమోదించి బిల్లులో చేర్చింది.

అరకొర ప్రాతినిధ్యం

2023 లోక్‌సభలో మొత్తం సభ్యుల్లో మహిళల సంఖ్య 15% కంటే తక్కువే! అదేవిధంగా వివిధ రాష్ట్రా అసెంబ్లీలను పరిశీలిస్తే మహిళల పట్ల వివక్ష చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధప్రదేశ్‌, అరుణాచల్‌‌ప్రదేశ్‌, అస్సాం, గోవా, గుజరాత్‌, ‌హిమాచల్‌‌ప్రదేశ్‌, ‌కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, ‌మహారాష్ట్ర, మణిపూర్‌, ‌మేఘాలయ, ఒడిషా, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, పుదుచ్చేరి అసెంబ్లీలలో మహిళల ప్రాతినిధ్యం 10%కంటే తక్కువ. లోక్‌సభ విషయంలో తొలినుంచి పరిశీలిస్తే, క్రమంగా మహిళల సంఖ్య పెరుగుతూ వచ్చినప్పటికీ అది తగినంత స్థాయిలో లేకపోవడం విషాదం. మొదటి లోక్‌సభలో వీరి ప్రాతినిధ్యం 1%కు మాత్రమే పరిమితం కాగా ప్రస్తుత 17వ లోక్‌సభలో 14%గా ఉంది. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్స రాలు దాటినా మహిళల పట్ల దేశంలో వ్యక్తమయ్యే సానుకూలత కేవలం ‘మాటలకే’ పరిమితమన్న సత్యాన్ని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. 2019 సాధారణ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 716మంది మహిళా అభ్యర్థులు పోటీపడగా, 78మంది లోక్‌సభలోకి ప్రవేశించగలిగారు. 2014లో  లోక్‌సభలోకి అడుగిడిన 62 మంది మహిళా ప్రతినిధులతో పోలిస్తే ఇది కొంచెం నయం.

అడ్డంకుల చరిత్ర

1987లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ, నాటి కేంద్రమంత్రి మార్గరెట్‌ ఆల్వా నేతృత్వంలో 14మందితో కూడిన ఒక కమిటీని ఏర్పాటుచేసి, మహిళల స్థితిగతుల మెరుగుకు అవసరమైన సిఫారసులు చేయమని కోరారు. తర్వాత రాజీవ్‌ ‌ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించింది. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్‌ ‌సదుపాయం కల్పించాలన్నది ఈ బిల్లు సారాంశం. లోక్‌సభ దీన్ని ఆమోదించి నప్పటికీ, 1989లో రాజ్యసభ తిరస్కరించడంతో ఈబిల్లు అటకెక్కింది.1993లో అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు 73వ, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలను అమల్లోకి తెచ్చారు. వీటి ప్రకారం గ్రామ పంచాయతీల్లో 1/3వ వంతు విలేజ్‌ ‌కౌన్సిల్‌ ‌లీడర్‌ ‌లేదా సర్పంచ్‌ ‌స్థానాలను మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ కేటాయింపునకు ఏ విధమైన నిబంధనలు పేర్కొనకపోయినప్పటికీ పంచాయతీ రాజ్‌ ‌సంస్థల్లో మహిళలకు 33.3శాతం రిజర్వేషన్‌ను ఈ చట్టాలు తప్పనిసరి చేశాయి. తర్వాత ఇదే విధానాన్ని అసెంబ్లీలకు, లోక్‌సభకు వర్తింప జేసేందుకు ఒక దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందిం చారు. ఇదిలావుండగా హెచ్‌.‌డి. దేవెగౌడ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి సారి 11వ లోక్‌సభలో 81వ రాజ్యాంగ సవరణ బిల్లు పేరుతో సెప్టెంబర్‌ 12, 1996‌న మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లును ప్రవేశపెట్టింది. అప్పుడు ఈ బిల్లును ఉమ్మడి పార్లమెంటరీ బోర్డు పరిశీలనకు పంపారు. రాజ్యాంగ సవరణ తర్వాత ఓబీసీ మహిళలకు చట్టసభల్లో రిర్వేషన్‌ ‌సదుపాయం కల్పించవచ్చునని ఈ ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసినప్పటికీ 11వ లోక్‌సభ రద్దు కావడంతో ఈ బిల్లు మురిగిపోయింది. ఎట్టకేలకు నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ మహిళా బిల్లుకు లోక్‌సభ ఆమోదాన్ని పొందడంలో విజయం సాధించింది.

1900లోనే ఉద్యమాలు

1947కు ముందు బ్రిటిష్‌ ఇం‌డియా వలస పాలనలో స్త్రీపురుషులకు ఓటు హక్కు ఉండేది కాదు. అటువంటి కాలంలోనే అంటే 1900 ప్రాంతంలోనే స్త్రీలకు ఓటు హక్కు గురించి దేశంలో ఉద్యమాలు ప్రారంభమయ్యాయంటే ఆశ్చర్యమనిపించవచ్చు కానీ ఇది నిజం. మహిళలకు రిజర్వేషన్ల కల్పన విషయంలో 1920-30 మధ్యకాలంలో నిరంతరం జరిపిన చర్చల ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఓటు వేసేందుకు నాటి బ్రిటిష్‌ ‌ప్రభుత్వం అంగీకరించింది. మన దేశంలో స్త్రీపురుషులకు మొట్టమొదటిసారి అధికారికంగా ఓటు హక్కు కల్పించిన ఘనత మద్రాస్‌ ‌ప్రావెన్స్‌కే దక్కుతుంది. 1921లో మద్రాస్‌ ‌ప్రావెన్స్‌లో అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం నాటి బ్రిటిష్‌ ‌రికార్డుల్లో భూమిని ఆస్తిగా కలిగినవారు ఈ ఓటుహక్కుకు అర్హులని ఈ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. విచిత్రమేమంటే ఈ చట్టంలో అక్షరాస్యత, భర్తలకు ఆస్తి హక్కు వంటి అంశాలపై విధించిన పరిమితుల కారణంగా దేశంలో పెద్ద సంఖ్యలో మహిళలు ఓటు హక్కుకు దూరంగానే ఉండిపోవాల్సి వచ్చింది. స్వాతంత్య్రా నంతరం 1950లో భారత ప్రభుత్వం స్త్రీపురుషులకు అధికారికంగా ఓటు హక్కు కల్పించిన తర్వాత 1962లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 46.63% మంది మహిళలు తమ ఓటు హక్కును వినియో గించుకున్నారు. 1984 నాటికి ఇది 58.10%కి పెరిగింది. పురుషులు 1962లో 63.31% ఓటు హక్కు వినియోగించుకోగా 1984 నాటికి 68.18%కు పెరిగింది. ఈ శాతం క్రమంగా పెరుగుతూ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించు కున్న మహిళల సంఖ్య, పురుషులను దాటిపోయింది. ఈ ఎన్నికల్లో 67.18% మహిళలు ఓటు హక్కును వినియోగించుకోగా, పురుషుల్లో ఇది 67.01% మాత్రమే. ఓటింగ్‌లో మహిళా చైతన్యానికి ఇది నిదర్శనం. ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే దేశంలోని 2/3 వంతు రాష్ట్రాల్లో మహిళల ఓటింగ్‌ ‌పురుషుల కంటే అధికంగా నమోదు కావడం విశేషం.

1974లో భారత్‌లోని ‘యునైటెడ్‌ ‌నేషన్స్ ‌కమిషన్‌ ఆన్‌ ‌ది స్టేటస్‌ ఆఫ్‌ ఉమెన్‌’ ‌స్థానిక సంస్థల్లో మహిళలకు పూర్తిస్థాయి రిజర్వేషన్లు కల్పించాలని కోరినప్పటికీ 1993లో నాటి పి.వి. నరసింహారావు ప్రభుత్వం 73, 74 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చే వరకు ఇది పూర్తిస్థాయిలో అమలుకాలేదు. ఈ రిజర్వేషన్ల కల్పన తర్వాత రాజకీయాల్లో అప్పటివరకు 4-5% మధ్యకే పరిమితమైన స్త్రీల భాగస్వామ్యం 25-40%కు పెరిగింది. అయితే ఆంధప్రదేశ్‌, ‌బిహార్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ‌జార్ఖండ్‌, ‌కేరళ, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్తాన్‌, ‌త్రిపుర, ఉత్తరాఖండ్‌ ‌రాష్ట్రాలు ఈ రిజర్వేషన్‌ను 50%కు పెంచడం గమనార్హం. నిజానికి 73వ రాజ్యాంగ సవరణకు ముందే మహిళలకు రిజర్వేషన్‌ను అమలు పరచిన ఘనత బిహార్‌ ‌రాష్ట్రానికి దక్కుతుంది.1992లో రాష్ట్రంలో 28,069 మంది మహిళలు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం వహించగా 1997 నాటికి వీరి సంఖ్య 28,595కు పెరగడం విశేషం. కానీ పేద మహిళలు పంచాయతీ సభ్యత్వ స్థానాలకే పరిమితం కావడం, సర్పంచ్‌ ‌స్థానాల్లో అగ్రకుల మహిళలే ఉండటం ఇంకా కొనసాగుతున్నది.

ప్రధాన పార్టీల్లో మహిళల స్థానం

రాజకీయ భాగస్వామ్యం అంటే కేవలం ‘ఓటింగ్‌’‌కు మాత్రమే పరిమితం కావడం కాదు. నిర్ణయాలు తీసుకోవడం, రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం, రాజకీయ చైతన్యం వంటివి కూడా ఇందులో భాగంగా ఉంటాయి. నిజం చెప్పాలంటే భారత్‌లో మహిళలు ఓటింగ్‌లో పాల్గొనడమే కాదు, వివిధ రాజకీయ పార్టీల్లో దిగువస్థాయుల్లో పురుషులతో పోలిస్తే వీరి సంఖ్యే అధికం! ఓటింగ్‌లో పాల్గొనడం, రాజకీయ చైతన్యం అనేవి మహిళలు రాజకీయాల్లో పాల్గొనడానికి బలమైన వేదికలు. దేశంలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ, ఇండియన్‌ ‌నేషనల్‌ ‌కాంగ్రెస్‌లు ప్రధాన జాతీయ పార్టీలుగా కొనసాగుతున్నాయి. కమ్యూనిస్టు పార్టీలు గతంలో ప్రధాన జాతీయ పార్టీలుగా కొనసాగినా అవి తమ ప్రాభవాన్ని కోల్పోయి అవసానదశకు చేరుకున్నాయి. మహిళల విషయంలో ఈ మూడు పార్టీలు మంచి ప్రాధాన్యమిచ్చాయనే చెప్పాలి. భారతీయ జనతాపార్టీకి మహిళా మోర్చా, కాంగ్రెస్‌కు అఖిల భారత మహిళా కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇం‌డియాకు నేషనల్‌ ‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియన్‌ ఉమెన్‌ అనే పేర్లతో మహిళా విభాగాలున్నాయి. తొలినాళ్లలో కాంగ్రెస్‌ ‌పేదరికంపై ప్రధానంగా దృష్టిపెట్టి సంక్షేమ పథకాలకే ప్రాధాన్యమిచ్చినప్పటికీ 2004తర్వాత పార్టీ తన పంథాను మార్చుకొని అన్ని స్థాయిల్లో 33% రిజర్వేషన్‌ను మహిళలకు అమలు చేసింది. 2009లో కాంగ్రెస్‌ ‌లోక్‌సభకు తొలి మహిళా స్పీకర్‌ను నామినేట్‌ ‌చేసింది. భారత తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్‌ అభ్యర్థిత్వానికి మద్దతు పలికింది. ఇక భారతీయ జనతాపార్టీ వివిధ నాయకత్వ కార్యక్రమాలను అమలుపరచడం ద్వారా పార్టీలో మహిళా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించింది. 33% రిజర్వేషన్‌ ‌ను అమలు చేయడమే కాకుండా పార్టీలో మహిళా నాయకులు వివిధ స్థాయిలకు పోటీ చేసేందుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని కూడా అందించింది. మత ప్రసక్తిలేని ‘ఉమ్మడి పౌర చట్టానికి’ మహిళల మద్దతును కూడగట్టడం బీజేపీ సాధించిన గొప్ప విజయం. ఎస్‌టీ వర్గానికి చెందిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి మద్దతునిచ్చి, బీజేపీ దేశ చరిత్రలో ఇంకొక ఘనతకు చోటు కల్పించింది. 2007లో సుమన్‌ ‌కృష్ణకాంత్‌ అధ్యక్షతన ‘యునైటెడ్‌ ఉమెన్‌ ‌ఫ్రంట్‌’ ఏర్పాటైంది. పార్లమెంట్‌లో మహిళలకు 50% రిజర్వేషన్‌ ‌కల్పించాలనేది ఈ వేదిక డిమాండ్‌.

2019 ‌సాధారణ ఎన్నికల్లో తమిళనాడుకు చెందిన నామ్‌ ‌తమిళర్‌ ‌కచ్చి పార్టీ రాష్ట్రంలోని 40 లోక్‌సభ స్థానాల్లో 50శాతం సీట్లలో మహిళా అభ్యర్థులను రంగంలోకి దించి మహిళా సాధికారత పట్ల తన నిబద్ధతను చాటుకుంది. ఇంత జరిగినా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు 1947 నుంచి ఇప్పటివరకు ప్రధానమంత్రిగా ఒకరు, రాష్ట్రపతిగా ఇద్దరు మహిళలే పనిచేయడం విషాదం.

1950 నుంచి ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీచేసే మహిళల సంఖ్య ఏడురెట్లు పెరిగినప్పటికీ జనాభాపరంగా వారి ప్రాతినిధ్యం ఇంకా చాలా తక్కువే. దేశంలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల ఓటర్లకు దాదాపు సమాన స్థాయికి చేరుకున్న తరుణంలో ఈ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందడం విశేషం. ప్రస్తుతం దేశంలో నమోదైన 950 మిలియన్‌ ఓట్లర్లలో సగం మహిళలే. గత కొన్ని దశాబ్దాలుగా పరిశీలిస్తే, ప్రతి ఎన్నికలకు మహిళా ఓటర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అదీకాకుండా ఓటింగ్‌ ‌విషయంలో పురుషులతో పోలిస్తే స్త్రీలు భిన్నంగా ఆలోచిస్తారు. ముఖ్యంగా పురుషులు యథాతథ స్థితి కొనసాగాలని భావిస్తే, స్త్రీలు మార్పు కోరుకుంటారు. బిహార్‌ ‌వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తీరును పరిశీలించిన నిపుణులు గమనించిన ప్రధాన అంశమిది.

రాజకీయ చైతన్యం

దేశంలో మహిళా సంస్థలు 1900 సంవత్సరంలోనే ప్రారంభమైనప్పటికీ వాటి పాత్ర నామమాత్రమే. 1950-70 మధ్యకాలంలో కూడా అవి నిర్వహించిన పాత్ర పరిమితమే. ఆ తర్వాతనే మహిళల్లో రాజకీయ చైతన్యం విస్తృతం కావడం గమనిస్తాం. మనదేశంలో మొట్టమొదటి మహిళా సంస్థ ‘భారత్‌ ‌స్త్రీ మండల్‌’. ఇది 1910లో ఏర్పాటైంది. పురుషుల దాష్టీకానికి బలైన మహిళలను ఆదుకోవడమే లక్ష్యంగా అప్పట్లో నెలకొల్పారు. తొలినాళ్లలో మహిళా సంస్థలు పురుషుల సహకారంతోనే ఏర్పాటై, స్త్రీవిద్య, ఉపాధి వంటి అంశా లకు మాత్రమే పరిమితమయ్యాయి. 1927లో ఏర్పాటైన ‘ఆల్‌ ఇం‌డియా ఉమెన్‌ ‌కాంగ్రెస్‌’ (ఎఐడబ్ల్యుసి) దేశంలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ మహిళా సంస్థ. ఈ సంస్థకు దేశ వ్యాప్తంగా 500 శాఖలుండేవి. శారదా చట్టం, మెటర్నిటీ బెనిఫిట్‌ ‌యాక్ట్ , ‌హిందూ కోడ్‌ ‌బిల్లులు అమల్లోకి రావడంలో ఈ సంస్థ కీలకపాత్ర పోషించింది. స్త్రీవిద్యకు అత్యంత ప్రాముఖ్యమిచ్చి సంస్థ తన కార్యకలాపాలు కొనసాగించడం ద్వారా1952, 1960 మధ్య కాలంలో హిందూ కోడ్‌ ‌బిల్లులు అమల్లోకి రావడంలో కీలకపాత్ర పోషించింది.

 1970 దశకంలో దేశంలో స్త్రీవాదం ఊపందుకుంది. 1974 లో దేశంలో మహిళల స్థితిగతులపై ఏర్పాటుచేసిన కమిటీ సమర్పించిన నివేదిక తర్వాతికాలంలో స్త్రీపురుష సమానత్వంకోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి దోహదపడింది. ముఖ్యంగా మహిళల్లో నిరక్షరాస్యత, శిశు మరణాలు, స్త్రీపురుష నిష్పత్తిలో తేడా, పేదరికం వంటి అంశాలను ఈ నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. ఈ అంశాలు తర్వాతి కాలంలో ఉమ్మడి పౌరసత్వం, మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు, మహిళల పట్ల లైంగిక హింస వంటి అంశాలను ప్రధానంగా లేవనెత్తడానికి దోహదం చేసింది. 1970 నాటి చిప్కో ఉద్యమాన్ని మనదేశంలో విజయవంతమైన మహిళా ఉద్యమంగా పేర్కొంటారు. ఉత్తరాఖండ్‌లో అడవుల నరికివేతకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం ఇది. 1972లో మధుర అత్యాచార కేసు, 1979లో తర్వీందర్‌ ‌కౌర్‌ ‌వరకట్న హత్య, 1987లో రూప్‌కన్వర్‌ ‌సతీసహ గమనం, 1992లో భన్వారీదేవిపై జరిపిన సామూహిక అత్యాచారం, 2012లో న్యూఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచార సంఘటనల నేపథ్యంలో మహిళా ఉద్యమాలు, స్త్రీలపై జరిగే అత్యాచారాలపై ప్రధానంగా దృష్టి సారించి పోరాటం సలిపాయి.

ప్రపంచ దేశాల్లో మహిళల స్థానం

ప్రస్తుతం మొత్తం 15 దేశాలకు అధినేతలుగా, 16 దేశాల్లో ప్రభుత్వంలో అత్యున్నత స్థానాల్లో మహిళలు కొనసాగుతున్నారు. ఆరుదేశాల్లో మహిళల ప్రాతినిధ్యం 50% లేదా అంతకు మించి ఉంది. అవి వరుసగా రువాండా (61%), క్యూబా (53%), నికరాగువా (52%), మెక్సికో (50%), న్యూజి లాండ్‌ (50%), ‌యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ (50%). 23 ‌దేశాలు 40% లేదా అంతకుమించి మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నాయి. వీటిల్లో 13 యూరప్‌, ఆరు ఆఫ్రికా, మూడు లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ ‌దేశాలు, ఒక ఆసియా దేశం ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే రువాండా పార్లమెంట్‌లో అత్యధికంగా అంటే మొత్తం 80 స్థానాల్లో 49 మంది మహిళా సభ్యులు (61%) ఉన్నారు. దక్షిణాఫ్రికా (46.2%), ఆస్ట్రేలియా (38.4%), ఫ్రాన్స్ (37.8%), ‌జర్మనీ (35.1%), యు.కె (34.5%), కెనడా (30.7%), యు.ఎస్‌ (28.7%)‌ల్లో మహిళా ప్రాతినిధ్యం ఫరవాలేదను కున్నా దక్షిణ కొరియా (19.1%), బ్రెజిల్‌ (17.5%), ‌జపాన్‌ (10%)‌ల్లో క్రమంగా దిగజారడం గమనార్హం.

ఇక మన పొరుగుదేశం పాకిస్తాన్‌ 2002‌లో మహిళలకు మొత్తం 357 సీట్లలో 60 (17%) రిజర్వ్ ‌చేసింది. ఫిలిప్పీన్స్ ‌దిగువసభలోని మొత్తం 311 సీట్లలో 85 (29%) మంది మహిళా ప్రతినిధులు న్నారు. ఆగ్నేయాసియా దేశాల్లో మహిళా ప్రాతినిధ్యం అధికంగా కలిగిన దేశం ఫిలిప్పీన్స్. ఇక బంగ్లాదేశ్‌ ‌విషయానికొస్తే మొత్తం 350 స్థానాల్లో 50 సీట్లు మహిళలకు రిజర్వ్ ‌చేశారు. బంగ్లాదేశ్‌ ‌దిగువ సభ జాతీయ సంసద్‌లో ప్రస్తుతం 73 (20%) మంది మహిళా ప్రతినిధులుండటం విశేషం. 1990 ప్రాంతం లో నేపాల్‌, అర్జెంటీనాలు రాజకీయ పార్టీలు మహిళలకు రిజర్వ్ ‌చేయాల్సిన కనీస కోటాను నిర్దేశించాయి. విశేషమేమంటే ఫ్రాన్స్, ‌దక్షిణకొరియా, నేపాల్‌లు అభ్యర్థుల జాబితాలో మహిళలకు 50శాతం వరకు గరిష్టంగా నిర్దేశించడం విశేషం. అర్జెంటీనా, కోస్టారికా వంటి దేశాలు తమ రాజకీయ పార్టీలు మహిళలకు కేటాయించాల్సిన కోటాలను నిర్దేశించాయి. ప్రస్తుతం ఈదేశాల్లో 36శాతం మహిళల ప్రాతినిధ్యం ఉంది. దక్షిణాఫ్రికా, జర్మనీ, స్వీడన్‌ ‌దేశాల్లోని రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా తమకు తామే మహిళలకు కోటాలను అమలుచేస్తూ, అత్యధిక మహిళా ప్రాతినిధ్యానికి దోహదం చేస్తున్నాయి. ఎరిట్రియా, టాంజానియా వంటి దేశాల్లో కూడా మహిళలకు నిర్దిష్ట కోటాలు కొనసాగుతున్నాయి.

2021 నాటికి 132 దేశాలు మహిళలకు కోటాను అమలుచేస్తుండగా, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దిగువ సభల్లో మహిళల సగటు ప్రాతినిధ్యం 26.7% శాతం కాగా స్థానిక సంస్థల్లో 35.5%. నిజానికి పార్లమెంట్‌లో మహిళా ప్రాతినిధ్యం విషయంలో అమెరికా, యు.కె. దేశాలతో పాటు భారత్‌కు కూడా ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ చరిత్ర ఏమీ లేదు. లోక్‌సభలో మహిళా ప్రాతినిధ్యం విషయంలో 185 దేశాల్లో మనదేశం స్థానం 141. ఇది చాలు స్త్రీలపట్ల మన వైఖరి ఎట్లా ఉన్నదనేది తెలుసు కోవడానికి! ఇప్పుడు 33% రిజర్వేషన్‌ అమలు చేయడం ద్వారా అంతర్జాతీయంగా మనదేశ స్థానం గణనీయంగా మెరుగుపడుతుందనడంలో సందేహం లేదు.


ఇప్పుడు దేశమే ఆమె కుటుంబం!

మహిళా బిల్లు ఆహ్వానించదగినదే. ఇదొక చారిత్రక ఘట్టం. ఈ హక్కును వినియోగించు కుంటూనే భారతీయ స్త్రీలు కుటుంబానికీ ప్రాముఖ్యమిస్తూ, సమయం చిక్కినప్పుడల్లా సమాజానికీ తన సహాయాన్ని అందించగలరు.

ప్రపంచంలో మిగిలిన ఏకైక ప్రకృతి ఆరాధనా సంస్కృతి సనాతన ధర్మం.

సనాతన ధర్మం భారతదేశ ఆత్మ.

ప్రకృతి ఆరాధనలో ప్రకృతి, ప్రకృతి స్వరూప మైన స్త్రీ ఆరాధన కూడా ఉంటాయి. ఒకప్పుడు ప్రపంచమంతా ప్రకృతి ఆరాధన ఉండేది.

అబ్రహాము/ ఎడారిలో కొత్త మతాలు పుట్టి ప్రకృతి ఆరాధన పద్ధతిని నాశనం చేసి తమ మతాన్ని రుద్దాయి.

అలా ప్రపంచంలో ఉన్న అన్ని ఆరాధన పద్ధతులు పోయి, ఎడారి మతాలు మాత్రమే మిగిలాయి. మహిళల వెనకబాటుతనం వీటితో జరిగిన చేటు.

భారతదేశంలో ఇంకా ప్రకృతి ఆరాధన సనాతన ధర్మ సంస్కృతి మిగిలి ఉండటానికి కారణం ఈ దేశ స్త్రీమూర్తులు. ఆ చరిత్రలో స్త్రీ అన్ని రంగాలలోను ముందంజలోనే కనిపిస్తుంది.

ఈ సంస్కృతిని కాపాడుతూ ముందు తరాలకు అందించే బాధ్యతని అలుపెరగకుండా కృషి చేస్తుంది సనాతని స్త్రీ.

యూరోప్‌, ఇం‌గ్లండ్‌, ఇటలీ, న్యూజీలాండ్‌ ‌వంటి దేశాలు 18,19 శతాబ్ద కాలంలో మహిళల పోరాటాలు చూసి వారికి ఓట్‌ ‌హక్కు ఇచ్చాయి.

ఆదే సమయంలో భారత్‌ ‌బ్రిటిష్‌ అత్యాచారాలను వ్యతిరేకిస్తున్న తరుణం.

1947లో బ్రిటిష్‌ ‌జాతి వెళ్లిపోయాక 1950లో భారతదేశ రాజ్యాంగ నిర్మాణం చేసుకున్నప్పుడు ఎలాంటి పోరాటాలు లేకుండానే ఈ దేశ స్త్రీలకు ఓటు హక్కు దక్కింది.

దానికి కారణం హిందూ సమాజం స్త్రీని సహజంగా దేవీ స్వరూపంగా చూడటం, ఈ సంస్కృతి ద్వారా ఆమెకు సముచిత స్థానం సమాజం ఇవ్వటమే.

అందుకే ఇందిరాగాంధీని భారతీయ సమాజం చాలా సులువుగా ప్రధానిగా ఒప్పుకుంది.

యూరోప్‌ ‌వంటి దేశాల్లో ప్రకృతి ఆరాధనను అనుసరించే సమూహానికి చెందిన స్త్రీలను ‘విచ్‌ ‌హంటింగ్‌’ ‌పేరిట ఎడారి మత సిద్ధాంతులు సజీవ దహనం చేసేవారు.

అదే సమయంలో భారత్‌ ‌లోని గురుకులాలలో రిషికలు ఉండేవారు, రిషిక అంటే నేటి ఉపాధ్యాయురాలు.

రిషికలు గురుకులాల్లో అన్ని అంశాలనూ బోధించేవారు.

భారత విద్యా వ్యవస్థలో విద్యార్ధినుల శాతంతో పాటు శిక్షకుల శాతం కూడా ఎక్కువే.

క్షాత్రధర్మంలోనూ భారతీయ మహిళలు తమ సామర్థ్యాన్ని చూపించారు.

అవసరానికి అనుగుణంగా వంటింట గంటే తిప్పే భారతీయ స్త్రీ కలం, ఖడ్గం కూడా తిప్పగలిగే శక్తి స్వరూపిణి.

ఏ విధంగా చూసినా రాజకీయాల్లో కూడా స్త్రీలు రాణించగలరు.

కాకపోతే రాజకీయం అనేది హృదయంతో కాకుండా బుద్ధితో పనిచేయాల్సిన రంగం.

స్త్రీలు కఠిన నిర్ణయాలు తీసుకొని అందరి శ్రేయస్సు కోసం పని చేయాలి.

ఒకవేళ ప్రపంచం మొత్తం స్త్రీలే దేశాధినేతలుగా ఉంటే యుద్ధాలు జరగవు.

ఏ దేశం ఇంకో దేశం మీద యుద్ధం ప్రకటించవు గాక ప్రకటించవు.

స్త్రీల అంతరంగం కరుణతో నిండి ఉంటుంది.

పురుషుడు కరుణాంతరంగంతో ఆలోచించలేడు.

కాబట్టి క్షాత్ర ధర్మంలో స్త్రీలు ఉంటే ఆ దేశం సంపన్నంగా ఉంటుంది.

అది ప్రకృతికి అనుకూలం కూడా.

– మౌనిక సుంకర, హైకోర్టు న్యాయవాది, తెలంగాణ


దేశ శ్రేయస్సుకు అవసరం

నారీశక్తి వందనం పేరుతో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందడం చాలా చాలా సంతోషకరమైన విషయం. 15 సంవత్సరాలు అమలులో ఉండే ఈ బిల్లు సెప్టెంబర్‌ 19‌న న్యాయ శాఖా మంత్రి రాం మెఘ్వాల్‌ ‌మొదట లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

మన రాజ్యాంగంలో లింగ వివక్ష లేకుండా అందరికీ సమాన హక్కులు ఉండాలని స్వాతంత్రం సాధించుకున్న నాడే అనుకున్నాం. కానీ నేటికీ పార్లమెంటులో పురుషుల ఆధిపత్యమే కనిపి స్తున్నది. మహిళల సామర్ధ్యం, నైపుణ్యం, మేధస్సు తన కుటుంబానికే కాదు సమాజానికీ, దేశానికీ కూడా చాలా అవసరం. పాలనాదక్షతతో రాజకీయ చతురతతో ఆర్థిక సంస్కరణలతో ఎందరో మహిళలు పరిపాలన అందించిన ఉదాహరణలు శతాబ్దాల మన చరిత్రలో ఎన్నో ఉన్నాయి. మహిళలు ఎందులోనూ వెనుకబడి లేరు. వెనక్కి ఉంచారు.

 1989లో పట్టణ, స్థానిక సంస్థలలో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్‌కై పార్లమెంటులో ప్రవేశపెట్టబడిన బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందినా కింది సభలో మింగి వేశారు. రాజ్యాంగ సవరణ బిల్లు 72, 73 ద్వారా మళ్లీ ప్రవేశపెడితే గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలలో 33% రిజర్వేషన్లు ఆమోదించడం జరిగింది.

ప్రస్తుతం రెండు లక్షల 50 వేల గ్రామ పంచాయతీలలో 14 లక్షల మంది మహిళా ప్రతినిధులు, 59 వేల మంది అధ్యక్షురాండ్రు ఉన్నారు. 50 శాతం మహిళలు పంచాయతీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 75% పంచాయతీ ప్రతినిధులకు గ్రామం గురించి అవగాహన ఉన్నది. కేంద్ర ప్రభుత్వంలో 11 మంది మహిళలు మంత్రులుగా ఉన్నారు. దేశ జనాభాలో సగ భాగమైన మహిళల భాగస్వామ్యం అన్ని రంగాలలో ఉండాలి. రాజకీయాలు ఏమి అంటరానివి కాదు. విద్య వైద్య, ఆర్థిక,సాంస్కృతిక, సురక్ష రంగాలలో మహిళలకు అవగాహన ఉండదు అనేది పెద్ద పొరపాటు. అసలు ఈ రంగాలకు మహిళలే నాయకత్వం వహిస్తే దేశ పురోగతి ఇంకాస్త వేగంగా, సానుకూల దృక్పథంతో సాగుతుంది. ప్రభుత్వ ఆలోచనలు నిధులు, పథకాలు మొదలైన విషయాలు తెలుసుకోవడం, వాటి అమలుపై ఆలోచించడం, అమలు చేయించడం వంటివి మహిళలు సమర్థంగా చేయగలరు. ఈ అంశాలపై ఆందోళనలు, పోరాటాలు చేయడమే కాదు. ప్రజా చైతన్యం కూడా కలిగించే సత్తా ఉన్నవాళ్లు మహిళలు. ఇటువంటి చరిత్రాత్మకమైన బిల్లును తెచ్చిన నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఈనాటి మహిళాలోకం తన అభిమానాన్ని ప్రకటించాలి.

– విజయభారతి, హైకోర్టు న్యాయవాది, తెలంగాణ


లింగవివక్షపై కొన్ని నిజాలు

*    2022 సెప్టెంబర్‌లో యు.ఎన్‌. ఉమెన్‌ ఒక నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ప్రస్తుత ప్రగతి వేగంతోనే ముందుకు సాగితే, పూర్తిస్థాయి లింగ సమానత్వ సాధనకు 300 ఏళ్లు పడుతుంది!

*    2015లో ప్రపంచ లక్ష్యాలపై సంతకాలు చేసిన తర్వాత కూడా లింగ సమానత్వం విషయంలో ప్రపంచం సాధించిన ప్రగతి చాలా స్వల్పం.

*   అప్పటినుంచి ప్రపంచంలోని 1/3వ వంతు దేశాల్లో ఈదిశగా సాగిన ప్రగతి శూన్యం. 18 దేశాల్లో లింగ సమానత మరింత దిగజారింది. వెనీజులా, అఫ్ఘ్ఘానిస్తాన్‌, ‌బెలారస్‌, ‌కువైట్‌, ఈక్వెడార్‌ ‌దేశాల్లో పరిస్థితి మరింత దారుణస్థితికి చేరుకుంది.

*     2022లో లింగ సమానత్వం విషయంలో అత్యంత అథమస్థితిలో ఉన్న దేశాలు సూడాన్‌, ‌యెమెన్‌, అఫ్ఘానిస్తాన్‌, ‌చాద్‌.

*     ప్రపంచ వ్యాప్తంగా 380 మిలియన్ల మహిళలు దుర్భర దారిద్య్రంలో బతుకులీడుస్తున్నారు.

*     ఇప్పటికీ చాలా ప్రపంచ దేశాల్లో గర్భస్రావంపై పరిమితులుండగా, మరికొన్ని దేశాల్లో దీన్ని చట్టవిరుద్ధంగా పరిగణిస్తున్నారు. లైంగిక, ప్రత్యుత్పత్తి వ్యవస్థల ఆరోగ్యం, హక్కులు అనేది లింగ సమానత మిషన్‌కు అత్యంత కీలకం. కానీ 1.2బిలియన్ల (15-49 మధ్య వయస్కులు) మహిళలు ఇటువంటి దేశాల్లో దుర్భర జీవనం గడుపుతున్నారు. గర్భస్రావాన్ని పూర్తిగా నిషేధించిన దేశాల్లో ఉన్న మహిళల సంఖ్య 102 మిలియన్లు.

*    ఏటా ప్రపంచవ్యాప్తంగా నాలుగు మిలియన్ల 18 సంవత్సరాల లోపు వయస్కులైన బాలికల వివాహాలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని చాలాదేశాల్లో ఇంకా బాల్యవివాహాల పీడ వదలడంలేదు.

*  2021 ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచంలో 20-24 మధ్య వయస్కులైన మహిళల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు 18 సంవత్సరాల లోపు వివాహమైనవారే. బంగ్లాదేశ్‌ ‌లోని ధనవంతులైన వారి కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు బలవంతంగా బాల్యవివాహాలు చేస్తున్నారు. అమెరికాలో క్రైస్తవ కుటుంబాకు చెందిన బాలికలు బాల్యవివాహ బాధితులే. మయన్మార్‌లో నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికలను చైనాలో పెద్ద వయస్కులతో బలవంతంగా వివాహాలు జరుపుతున్నారు.

*      2030 నాటికి బాల్యవివాహాలను పూర్తిగా అరికట్టాలంటే ప్రస్తుతం కొనసాగుతున్న ప్రగతి వేగం కంటే 17రెట్లు ఎక్కువ వేగం అవసరం.

*     ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదు నిమిషాలకు ఒక మహిళ లేదా బాలిక హత్యకు గురవుతున్నారు.

*      2021 చివరినాటికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రతికూల పరిస్థితుల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో స్వస్థలాలను వీడి మరోచోట జీవిస్తున్న మహిళల సంఖ్య 44 మిలియన్లు.

*     ప్రపంచవ్యాప్తంగా 130మిలియన్ల మంది బాలికలు పాఠశాల విద్య కు దూరంగా ఉన్నారు.

*    కొవిడ్‌ ‌మహమ్మారి కారణంగా 2020లో ప్రపంచ వ్యాప్తంగా మహిళ లు అదనంగా 512 బిలియన్‌ ‌గంటలు లేదా 57వేల దశాబ్దాల వేతనంలేని శ్రమకు గురయ్యారు.

*   2021లో ప్రతి ముగ్గురు స్త్రీలల్లో ఒకరికి ఆహారభద్రత కరవైంది.

*    2022 జులై నాటికి ప్రపంచవ్యాప్తంగా చట్టసభల్లో మహిళలు 26.7% మాత్రమే ఉన్నారు. 23 దేశాల్లో వీరి సంఖ్య 10శాతం కంటే తక్కువే!

*     పురుషుడు సంపాదించే ఒక డాలరులో ఒక మహిళ సంపాదన 77 సెంట్లు మాత్రమే. అంటే పనికి సమానవేతనం లభించడంలేదు.

About Author

By editor

Twitter
YOUTUBE