ఆంధప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటును కంప్ట్రోలర్‌ అం‌డ్‌ ఆడిటర్‌ ‌జనరల్‌ (‌కాగ్‌) ‌తప్పుబట్టింది. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని 2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్‌ ‌నివేదికలో వ్యాఖ్యానించింది. రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, భూ సమీకరణ కోసం చేసిన వేల కోట్ల రూపాయల ఖర్చు నిష్ఫలమైందని, రూ.వందల కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు నిరుపయోగంగా మారాయని పేర్కొంది. ముఖ్యంగా 2019 నుంచి రాజధాని అమరావతిలో పనులన్నీ నిలిచిపోవడం వల్ల ప్రభుత్వానికి ఆర్ధికపరమైన ఇబ్బందులు తలెత్తాయని కాగ్‌ ‌తన నివేదికలో తెలిపింది.

ఆంధప్రదేశ్‌లో అమలు చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థపై కంప్ట్రోలర్‌ అం‌డ్‌ ఆడిటర్‌ ‌జనరల్‌ (‌కాగ్‌) ‌తీవ్ర విమర్శలు చేసింది. గ్రామ, వార్డు స్థాయుల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండానే ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ, స్థానిక స్వపరిపాలన కోసం ఉద్దేశించిన రాజ్యాంగ స్ఫూర్తిని నీరు గార్చిందని ఆక్షేపించింది. అందుకే స్వపరిపాలన సాధించేందుకు వార్డు కమిటీలను ఏర్పాటుచేయాలని, వార్డు కమిటీలు, ఏరియా సభలతో సచివాలయాలను అనుసంధానం చేయాలని సిఫార్సు చేసింది. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసేందుకు జిల్లా ప్రణాళిక కమిటీలను, నగరాల్లో మహానగర ప్రణాళిక కమిటీలు ఏర్పాటు కాలేదని కాగ్‌ ‌పేర్కొంది. స్థానిక సంస్థల అవసరాలు, ఉమ్మడి ప్రయోజనాల అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఆక్షేపిస్తూ, తక్షణమే డీసీసీ, ఎంసీసీలు ఏర్పాటు చేయాలని సూచించింది.

వైసీపీ ప్రభుత్వం 2019 జూలైలో వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది. ఒక్కొక్క వార్డు సచివాలయంలో 10 మంది వార్డు కార్యదర్శుల చొప్పున 37,880 పోస్టులతో ప్రభుత్వం 3,786 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న బిల్‌ ‌కలెక్టర్‌, ‌వర్క్ ఇనస్పెక్టర్‌•, ‌ట్యాప్‌ ఇనస్పెక్టర్‌•, ‌ఫిట్టర్‌, ‌టీపీ ట్రేసర్‌ ‌పోస్టుల(2434)ను అందులో విలీనం చేశారు. అలాగే, 70,888 వలంటీర్లను ఎంపిక చేసింది.

పంచాయతీలపై ప్రభావం

గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల పేరుతో సృష్టించిన సమాంతర వ్యవస్థ వల్ల పంచాయతీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గ్రామ సచివాల యాల కన్వీనర్లు, వాలంటీర్లతో పాటు అధికార పార్టీ తెచ్చిన గృహసారథుల కారణంగా సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. సచివాలయ వ్యవస్థ పంచాయతీలో భాగమేనని ప్రభుత్వం మొదట ప్రకటించినా, 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల అనంతరం వాటిపై సర్పంచుల పర్యవేక్షణ, ఉద్యోగులకు సెలవు మంజూరు అధికారాలను తీసేసింది. దీంతో సచివాలయ ఉద్యోగులు సర్పంచులను లెక్కచేయడం లేదు. గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాల అమలు, లబ్ధిదారుల ఎంపిక వంటివి సర్పంచులకు తెలియకుండానే జరిగిపోతున్నాయి.

గ్రామ సచివాలయాల పేరిట ప్రభుత్వం పంచాయతీలను అణచివేస్తోందని సర్పంచులు ఆరోపిస్తూ, ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులివ్వదు. కేంద్రమిచ్చే నిధులను చెప్పకుండా లాగేసు కుంటోంది. పన్నుల రూపంలో వచ్చే నిధుల్ని కరెంటు బిల్లుల పేరిట జమ చేసుకుంటోంది. పాలకవర్గం ఉన్నా పెత్తనం మాత్రం వేరొకరిదిగా కొనసాగు తోంది. దీంతో నిధులు, హక్కులు, అధికారాలు లేక సర్పంచులు నిరాశ, నిస్పృహ చెందుతున్నారు.

ఆస్తి పన్ను వసూళ్లపైనా…

ఆస్తిపన్ను వసూలు చేసే అధికారం స్థానిక సంస్థలకే ఉన్నప్పటికీ, ఆ విధానం ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వద్దనే ఉందని కాగ్‌ ‌గుర్తు చేసింది. సొంత ఆదాయాన్ని సమకూర్చుకునే పూర్తి స్వయం ప్రతిపత్తి స్థానిక సంస్థలకు లేకుండా పోయిందని ఆక్షేపించింది. ఆస్తి పన్నును మదింపు చేసేందుకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకాలు అందించేందుకు ఆస్తి పన్ను బోర్డును ఏర్పాటు చేయాలని 13వ ఆర్థిక సంఘంలోనే చేసినసూచనలు అమలుకు నోచలేదని పేర్కొంది. పట్టణాల్లో తాగునీటి సరఫరా, పారి శుధ్యం, ఇతర అంశాల్లో ప్రణాళికల కోసం సరైన విధానాలు లేనందున, ఈ అంశాలను స్థానిక సంస్థలకు అప్పగించాల్సి ఉందని కాగ్‌ ‌సిఫార్సు చేసింది.

అమరావతిని నీరుగార్చారు

రాజధాని అమరావతి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కాగ్‌ ‌తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. భూ సమీకరణ కోసం చేసిన వేల కోట్ల రూపాయల ఖర్చు నిరుపయోగంగా మారిందని, ఇప్పటికే రూ. వందల కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు నిష్ఫలంగా మారాయని పేర్కొంది. రాజధానికి అవసరమైన భూమిలో 70 శాతాన్ని భూసమీకరణ ద్వారా సేకరించాలని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా రానున్న కాలంలో భారీ ఆర్థిక భారం పడనుందని కాగ్‌ ‌పేర్కొంది. గ్రీన్‌ఫీల్డ్ ‌రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఎంచుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకున్న కీలక పరిమితులు, రాజధాని అభివృద్ధికి భూమి వాస్తవ అవసరాలను అంచనా వేసేందుకు చేపట్టిన సాధ్యా సాధ్యాల అధ్యయన వివరాలను గత ప్రభుత్వం వెల్లడించలేదని కాగ్‌ ‌పేర్కొంది. రాజధాని మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌రూపకల్పనకు కన్సల్టెంట్ల విషయంలో త•గిన విధానాన్ని అనుసరించకుండా నామినేటెడ్‌ ‌పద్ధతిలో ఎంపిక చేశారని పేర్కొంది. రాజధానికి సంబంధించి రూ.1,09,023 కోట్ల అంచనాతో డీపీఆర్లు రూపొందించినప్పటికీ వీటిలో రూ.46,400 కోట్ల మేర డీపీఆర్లను నీతిఆయోగ్‌కు సమర్పించలేదని వెలుగులోకి తెచ్చింది. డీపీఆర్లు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ కేంద్రం వివరణ కోరినా గత సర్కారు సమర్పించలేదని తెలిపింది. 2019 నుంచి నిర్ణయించిన ప్రణాళిక కోసం కనీసం బడ్జెట్‌ ‌సహకారం అందించేందుకు కూడా ప్రయత్నం జరగలేదని తెలిపింది. రూ.33,476 కోట్లు రుణంగా సమీకరించుకోవాల్సి ఉండగా, కేవలం 8,540 కోట్లు మాత్రమే సమీకరించుకున్నారని పేర్కొంది. ‘రాజధాని నగర అభివృద్ధిపై విధానపరమైన మార్పు కారణంగా 55 ప్యాకేజీలపై అనిశ్చితి నెలకొంది. ఈ ప్యాకేజి పనులు పూర్తి చేసేందుకు రూ. 28,048 కోట్లు కావాల్సి ఉంది’ అని కాగ్‌ ‌పేర్కొంది. వీటి భూ సమీకరణకు సీఆర్‌డీఏ రూ.2,245 కోట్లు వ్యయం చేసిందని, ఇలా సేకరించిన భూమి అంతా నిరుపయోగంగా పడి ఉందని విమర్శించింది.

ఎల్పీఎస్‌ ‌లేఅవుట్ల పట్ల నిర్ల్యక్ష్యం

రాజధానికి భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన ఎల్పీఎస్‌ ‌లేఅవుట్లను 14 జోన్లుగా విభజించారు. వాటిలో రెండు జోన్లకు ఇంకా టెండర్లు పిలవలేదు. మిగతా 12 జోన్లలో మౌలిక వసతుల పనులను 16 ప్యాకేజీలుగా విభజించారు. వాటిలో రూ.13,802.75 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి పనులు ప్రారంభించగా, 2021 సెప్టెంబరు నాటికి రూ.183.04 కోట్లే ఖర్చు పెట్టారు. రైతులకు మూడేళ్లలో స్థలాలు అభివృద్ధిచేసి ఇస్తామన్న హామీ నెరవేర లేదు. దాదాపు సిద్ధమైన వాటినీ అందుబాటు లోకి తేలేదు. అమరావతి పరిపాలన నగరంలో నిర్మాణ పనుల్ని గత ప్రభుత్వం రూ. 6,848.58 కోట్లతో చేపట్టింది. షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 2018 -మార్చి 2021 మధ్య మొత్తం పనులు పూర్తికావాలి. వీటిని 19 ప్యాకేజీలుగా విభజించగా ఆరు ప్యాకేజీల పనులే 25-95 శాతం పూర్తయ్యాయి. రూ.1,505.22 కోట్లు వెచ్చించి చేపట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారుల నివాస గృహాలు వృథాగా పడి ఉన్నాయి. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సాయమూ లేదు.

 రాజధానిలో మౌలిక వసతుల నిర్మాణానికయ్యే రూ.55,343 కోట్లలో సీఆర్డీఏ 2016-2023 మధ్య వివిధ రూపాల్లో రూ.11,487 కోట్లు సమీకరించు కోగలిగింది. 2019 నుంచి రాజధాని నిర్మాణానికి ఎలాంటి సాయం అందలేదు. సీఆర్డీఏ హడ్కో, బ్యాంకుల కన్సార్టియం, బాండ్ల రూపంలో రూ.5,013.60 కోట్లు సమీకరించింది. కానీ ప్రధాన మౌలిక వసతులు, ఎల్పీఎస్‌ ‌లేఅవుట్ల అభివృద్ధి పనుల్లో ఆశించిన పురోగతి లేదు. పనులు చేసినా, చేయకపోయినా ఈ రుణాలపై భవిష్యత్తులో రూ. 3,428.12 కోట్ల వడ్డీ చెల్లించాలి.

చేసిన పనులన్నీ వృథా

రాజధానిని జాతీయ రహదారి-16తో కనకదుర్గ వారధి వద్ద అనుసంధానం చేసే సీడ్‌ ‌యాక్సెస్‌ ‌రోడ్డు 21.34 కి.మీ.గాను 14.47 కి.మీ.లే పూర్తయింది. కృష్ణానదిపై రూ.1,387 కోట్లతో ప్రతిపాదించిన ఐకానిక్‌ ‌బ్రిడ్జిని ఈ ప్రభుత్వం నిలిపివేసింది. దానిపై డిజైన్లు, డ్రాయింగ్‌ల కోసం పెట్టిన రూ.2.22 కోట్లు వృథా అయ్యాయి. ఎల్పీఎస్‌ ‌లేఅవుట్లలో పిచ్చి మొక్కలు తొలగించడానికి మే, 2017-మే, 2018 మధ్య రూ.10.87 కోట్లు వెచ్చించారు. 2019 మేలో ప్రభుత్వం పనులు నిలిపివేసి, రైతులకు ఇవ్వకపోవడంతో ఆ నిధులు వృథా అయ్యాయి.

 రాజధానిలో 1,691 ఎకరాల్లో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి సింగపూర్‌కు చెందిన అసెండాస్‌-‌సింగ్బ్రిడ్జి, సెంబ్‌ ‌కార్ప్ ‌సంస్థల కన్సార్టియం, అమరా వతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్‌) ‌సంయుక్తంగా అమరావతి డెవలప్‌మెంట్‌ ‌పార్టనర్స్ (ఏడీపీపీఎల్‌) ‌పేరుతో కంపెనీ ఏర్పాటు చేశాయి. జగన్‌ ‌ప్రభుత్వం ఆ ప్రాజెక్టును అర్ధంతరంగా రద్దుచేసి, ఏడీపీపీఎలు లిక్విడేట్‌ ‌చేయడంతో ప్రభుత్వానికి రూ.11.16 కోట్ల నష్టం వాటిల్లింది.

 ఇండో-యూకే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌హెల్త్ (ఐయూఐహెచ్‌)‌కి ఎకరం రూ. 50 లక్షల చొప్పున 150 ఎకరాలను 2016లో ప్రభుత్వం కేటాయిం చింది. ఆ సంస్థ సీఆర్డీఏకి రూ.24.90 కోట్లు చెల్లించింది. గడువులోగా ప్రాజెక్టు చేపట్టనందుకు సీఆర్డీఏ ఆ సంస్థకు భూకేటాయింపును 2019 ఏప్రిల్‌లో రద్దు చేసింది. ఆ సంస్థ కట్టిన డబ్బు జప్తుచేయాలి. కానీ, ఆ సంస్థ విజ్ఞప్తి మేరకు సీఆర్డీఏ నిబంధనలకు విరుద్ధంగా 2020 జనవరిలో ఆ నిధుల్ని తిరిగి చెల్లించింది. గుత్తేదారుల• రాజధానిలో తమ మెటీరియల్‌, ‌పరికరాలు ఉంచుకోవడానికి ఎకరం రూ. లక్ష చొప్పున సీఆర్డీఏ లీజుకిచ్చింది. కానీ గుత్తేదారు సంస్థల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు. వారి బకాయి రూ.4.09 కోట్లు.

గుత్తేదారులకు 30 పనులకు రూ.1,282.83 కోట్లు మొబిలైజేషన్‌ అడ్వాన్స్ ఇచ్చారు. అందులో రూ.338. 57 కోట్లే రికవరీ చేశారు. 2021 సెప్టెంబరు నాటికి రూ.944.26 కోట్లు వారి వద్దే ఉన్నాయి. రాజధానిలో వివిధ అవసరాలకు మట్టి తవ్వుకున్న గుత్తేదారుల నుంచి రూ.12.83 కోట్లు వసూలు చేయాలి. కృష్ణా కరకట్టకు, నదికి మధ్యలో రూ.7.85 కోట్లతో సీఆర్డీఏ ప్రజావేదిక (గ్రీవెన్స్ ‌సెల్‌) ‌నిర్మించింది. అనుబంధ వసతుల కోసం మరో రూ.4.06 కోట్లు వెచ్చించింది. ఆ భవన నిర్మాణానికి జలవనరులశాఖ, సీఆర్‌డీఏ ప్రణాళికా విభాగం నుంచి అనుమతులు తీసుకోలేదు. ఈ ప్రభుత్వం దాన్ని కూలగొట్టడంతో మొత్తం రూ.11.91 కోట్ల ప్రజాధనం వృథా అయింది.

 రాజధానిలో సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రూ. 97.69 కోట్ల అంచనా వ్యయంతో 20 ఎకరాల్లో డాక్టర్‌ ‌బి.ఆర్‌.అం‌బేడ్కర్‌ ‌స్మృతివనాన్ని గత ప్రభుత్వం తలపెట్టింది. 125 అడుగుల అంబేడ్కర్‌ ‌విగ్రహంతో పాటు పలు వసతులు కల్పించాలని తలపెట్టింది. రూ.44.61 కోట్లు ఖర్చుచేశాక, పనులు నిలిపివేయడంతో ఆ మొత్తం వృథా అయింది.

– వల్లూరు జయప్రకాష్‌ ‌నారాయణ, ఛైర్మన్‌,‌సెంట్రల్‌ ‌లేబర్‌ ‌వెల్ఫేర్‌ ‌బోర్డు,

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ.

About Author

By editor

Twitter
YOUTUBE