‘‘శతేషు జాయతేశూర సహస్రేషుచ పండిత ।
వక్తా శత సహస్రేషు, దాతా భవతి వానవా ।’’
వందలమందిలో ఒక శూరుడు ఉంటాడు. కొన్నివేల మందిలో ఒక పండితుడు ఉంటాడు. కొన్ని లక్షల మందిలో ఒక వక్త ఉంటాడు. కాని కొన్ని లక్షల మందిలో ఒక్క దాతైనా ఉంటాడో ఉండడో చెప్పలేం. బుడ్డా వెంగళరెడ్డి కొన్ని లక్షలమందిలో అపురూపంగా కనబడే మహాదాత.
ఈనాటి కడప జిల్లాలోని జమ్మలమడుగు తాలూకా, కర్నూలు జిల్లాలోని కోవిలకుంట్ల తాలూకాలను కలిపి పూర్వం ‘రేనాడు’ అనేవారు (కొందరి ప్రకారం రెడ్డినాడు).
1866లో రాయలసీమ దారుణమైన క్షామానికి గురైంది. అది ధాత నామ సంవత్సరం. అందుకే చరిత్రలోనే దాని పేరు ‘ధాత కరవు’గా స్థిరపడింది. అనంతపురం మండలంలో ప్రారంభమై మొత్తం రాయలసీమను చుట్టబెట్టింది. అంతటి క్షామంలో బుడ్డా వెంగళరెడ్డి మూడు నెలలు ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకున్నారు. 12 పాతర్ల ధాన్యం ఖర్చు చేశారు (12×120=1440 బస్తాలు). తన దగ్గరున్న ధాన్యం నిండుకుంటే, మిత్రుల దగ్గర ధాన్యం అప్పు చేసి క్షుధార్తులను ఆదుకున్నారు. అయితే, ‘దాత దరిద్రౌ కృపణో ధనాడ్య:’ (ధనాఢ్య దాత దరిద్రుడౌతాడు, పిసినిగొట్టు కోటీశ్వరుడు అవుతాడు). వెంగళరెడ్డి విషయంలోనూ ఇది రుజువైంది.
లఘు వీరగాథలలో వెంగళరెడ్డి పాట ప్రశస్తమైనది. అంత ఖ్యాతి రాయలసీమలో మరొక పాటకు లేదు. బస్సులలోనూ, రైళ్లల్లోనూ ఈ పాటను బిచ్చగాళ్లు పాడుతూ ఉంటారు. ముఖ్యంగా కుంటి, గ్రుడ్డివారు ఎక్కువ పాడు కుంటారు. వెంగళరెడ్డి రేనాటి దానకర్ణుడు. రేనాటి సీమకు ఉయ్యలవాడ నరసింహ రెడ్డి సూర్యుడు కాగా, వెంగళరెడ్డి చంద్రుడు. ఈ సూర్యచంద్రులిరువురు ఉయ్యలవాడ వారే.1822లో జన్మించిన వెంగళరెడ్డి 1900లో మరణించాడు. సైరా నరసింహారెడ్డి విప్లవ కాలంలో వెంగళరెడ్డి యువకుడు. వెంగళరెడ్డి దానశీలతకు అబ్బురపడిన విక్టోరియా మహారాణి 1866లో స్వర్ణ పతకం బహూకరించింది. ఇది ఉయ్యలవాడలో వారి వంశస్థుల దగ్గర ఇప్పటికీ ఉంది (ఆచార్య తంగిరాల సుబ్బారావు విక్టోరియా రాణి పతకాన్ని తాను చూసినట్లు 17-4-1966న నమోదు చేశారు. మేలిమి బంగారంతో చేసిన 20 తులాల ఆ పతకం వడ్డాణం మాదిరి ఉన్నది). ఈ పతకం ముందు భాగంలో ఆంగ్లంలోనూ వెనుక తెలుగులోనూ ఇలా రాసి ఉంది.
Presented to Buddha Vengala Reddy as a token of the high appreciation of Her Majesty’s Government of his munificent Liberality to his destitute countrymen in the famine of 1866 (1866 సంవత్సరంలో క్షామం సంభవించినప్పుడు నిరాధారంగా మిగిలిన సాటి ప్రజానీకం పట్ల ప్రదర్శించిన ఉత్కృష్టమయిన ఔదార్యానికి గుర్తుగా హర్ మెజస్టీ రాణి ప్రభుత్వం బుడ్డా వెంగళరెడ్డికి ఇచ్చిన బహుమానం).
పూర్వం నుండి వీరగాథల (Ballads) లోనూ, వీరగాథానికల (Balladings) లోనూ తరచు యుద్ధవీరుల ప్రశంస సంప్రదాయం. పేరంటాండ్ర కథలలోను, కట్ట పదాలలోనూ త్యాగ వీరత్వం ఉంటుంది. దాన వీరమును ప్రశంసించు కథానికలు కన్నడ తెలుగులో కొన్ని ఉన్నాయి. మానవసేవే మాధవసేవగా భావించి కరవు కాటకాల సమయంలో సాటి మానవులకు తమ సర్వస్వం ఇచ్చిన కలియుగ దానకర్ణులపై గూడ జానపదులు భక్తి ప్రపత్తులతో పాటలు పాడుతూ ఉంటారు. రాయలసీమలో బుడ్డా వెంగళరెడ్డి, యాదాళ్ల నాగమ్మ, చిన అండ్లూరి శివమ్మ, మోదిన ఫకర్‌దిన్ వంటి వారిపై ఇలాంటి పాటలు ఉన్నాయి. నెల్లూరు మండలంలో కోడూరి బాలకోటారెడ్డిపైన, గోదావరి మండలంలో డొక్కా సీతమ్మ పైన కూడా ఇలాంటి పాటలు పుట్టాయి. ఇవి కేవలం ప్రశంసలే. అయితే, జానపద గేయాలు (Folk songs) అని అంటాం. కానీ గాథానికలు కానేరవు కాని వీటిలో వెంగళరెడ్డి, డొక్కా సీతమ్మపైన వచ్చిన పాటలలో గాథా కథనం ఉన్నది. అందుచేత ఇవి వీరగాథానికలే. ఆచార్య తంగిరాల ‘రేనాటి సూర్యచంద్రులు’ (ఉయ్యలవాడ నరసింహారెడ్డి యుద్ధ వీరగాథ, విప్లవకాలం క్రీ।।శ।। 1845-1847; బుడ్డా వెంగళరెడ్డి దాన వీరగాథానిక, జీవితకాలం క్రీ।।శ।। 1822-1900) అనే పరిశోధన గ్రంథం రాశారు. వెంగళరెడ్డి దానధర్మాలపై ఎన్నో కథలు, జనపదాలలో వ్యాప్తిలో ఉన్నాయి. రాయలసీమ జానపదులు ఇలా పాడుకుంటున్నారు.
ఉత్తరాది ఉయ్యాలవాడలో ఉన్నది- దరమం సూడరయా
నేటికి బుడ్డా వెంగళరెడ్డీ – దొడ్ద ప్రెబువని తెలియదయా
దొడ్డ ప్రభువనీ దొరలు మెచ్చగా – ఇడుపున గూర్చోనుండనయా
ధాత కరవులో తమ ప్రాణాలు నిలిపిన రాయలసీమ దానకర్ణుడిని జనం ఇలా దీవిస్తారు.
దానం, ధరమం గ్యానం తెలిసీ – ధరమరాజువలె ఏలెనయా
సచ్చిన బతికిన ఎంగళరెడ్డికి – స్వర్గలోకమే ఉన్నదయా!
పున్నెం సేసిన వెంగల్‌రెడ్డి పూలపానుపూ ఉండునయా
మాటా సొచ్చం తెలిసిన ప్రెబువని – మల్లెపూల పాన్పేతురయా,
అలాగే కొన్ని కథనాలు: మండు వేసవిలో ఓ బ్రాహ్మణుడు, దాహంగా ఉంది మజ్జిగ ఇమ్మన్నాడట వెంగళరెడ్డి భార్యను. ఆమె బద్ధ్దకించి లేదన్నదట. వెంగళరెడ్డికి కోపం వచ్చి పాడిలేని ఇంట ఆవు ఎందుకంటూ ఆ ఆవునే దానం చేశాడు. ఇలాంటిదే మరొకటి- ఒక బ్రాహ్మణుడు తన కుమారునికి ఉపనయనం చేసుకుంటానంటే మొలనున్న బంగారు మొలత్రాడును దానం చేసిన మహాదాత వెంగళరెడ్డి. మరో సంఘటన. ఓ ఫకీరు స్త్రీ వచ్చి కట్టుకోవడానికి ఏదైనా చీర ఇమ్మన్నదట. వెంగళరెడ్డి భార్య పుట్టింటివారు పెట్టిన పట్టుచీరను ఆ బిచ్చగత్తెకు ఇచ్చివేశాడట. అది చూసి వెంగళరెడ్డి భార్య దానమిచ్చిన పట్టుచీర తీసుకొని వేరే నూలు చీర ఇచ్చిందట. దానితో •వెంగళరెడ్డి బాధపడి బిచ్చగత్తెకు కొత్త పట్టుచీర కొని ఇచ్చాడట.
మరో ఐతిహ్యం: వెంగళరెడ్డి దగ్గర బలిసిన యెద్దొకటి ఉండేది. ఊరిలోని సన్నకారు రైతులు (మాల, మాదిగ) మీరు ఆ ఎద్దును దానం చేస్తే, మా దగ్గర ఓ ఎద్దుంది. ఆ జతను బండిగట్టి జీవనయానం కొనసాగించగలమన్నారట. వెంగళరెడ్డి తన ఎద్దును దానం ఇచ్చాడు. విషయం తెలిసిన వెంగళరెడ్డి సొంత పనివారు ఆ రైతులను చితకబాది ఆ ఎద్దును తోలుకొచ్చేశారట. ఈ విషయం తెలిసి వెంగళరెడ్డి ఆ రైతులకు చికిత్స చేయించి మళ్లీ ఆ ఎద్దును వారికే ఇచ్చాడట. కానీ ఆ రైతులు పునరాలోచన చేసి ఈ దానకర్ణుడి ఎద్దును మనం తీసుకుంటే వ్యవసాయం చేయలేడు, పంటలు పండవు. కరవు ప్రాంతంలో భోజనం పెట్టేవాడుండడని తిరిగి వెంగళరెడ్డికే అప్పజెప్పారట.
ఒకనాడు వెంగళరెడ్డి గుర్రం మీద చెన్నపట్నం వెళుతున్న సంగతి తెలిసి నలుగురు శత్రువులు చంపడానికి పథకం వేశారు. ఇంతకీ ఆ నలుగురిలో ఒకడు రెడ్డి గారి అభిమానే. కాబట్టి రహస్యంగా ఆ వార్తను ముందే వెంగళరెడ్డికి చేరవేశాడట. అనుకున్న ప్రకారం ఆయన వెళుతుండగా అడ్డగించారట. నాయన మీరు భోజనం చేసి ఎన్నిరోజులైందో! మంచి భోజనం పెడతాను, తిన్నాక చంపమన్నాడట. వాళ్లు రెడ్డిగారి కాళ్లపై పడ్డారట. వాళ్లకు భోజనం పెట్టించి, బియ్యం ఇచ్చి పంపాడట. తనను చంపబోతున్నారన్న తెచ్చిన వ్యక్తిని తానే పెంచి, వివాహం కూడా చేశాడు. వెంగళరెడ్డి ఎన్ని రకాల దానాలు చేశాడో చెప్పే ఈ పాటలో ఒకచోట ఈ వర్ణన ఉంది.
హరి నారాయణ అన్న వారికీ అన్న వస్తరము లిప్పించెనయా
గోయిందాయని పాడే జనులకు – గోవు దానమే చేసెనయా
పాలు లేని పసిబాలురకెల్లా – పాల సలేంద్రలు పెట్టెనయా
పెళ్లిళ్లు కాని బీద జనులకూ – పెళ్లిళ్లే సేయించెనయా
కాలులేని కఠమొండి వాళ్లకు – ఒంటెద్దు బళ్లు సేయించెనయా
కుంటివాళ్లకూ గుడ్డివాళ్లకూ- ఈడూ జోడూ మనుములు సూసీ
పెళ్లిళ్లే సేయించెనయా – పెళ్లిళ్లే సేయించెనయా
ఉయ్యలవాడలో ఉన్న వెంగళరెడ్డి వంశీకులు నేటికి ఉగాదికి ఆయన సమాధి దగ్గర దివ్యాంగులకు, అంధులకు పంచ భక్ష్య పరమాన్నాలు పెడతారు. పెద్ద ఎత్తున అన్నదానం చేస్తారు. వేలాదిగా బిచ్చగాళ్లు వస్తారు. వీరంతా భోజనానికి ముందు వెంగళరెడ్డికి విక్టోరియా మహారాణి ఇచ్చిన స్వర్ణ పతకాన్ని తప్పనిసరిగా కన్నుల కద్దుకొంటారు. అంధులు చేతులతో తాకి ఆ చేతులను ముద్దు పెట్టుకొంటారు. వెంగళరెడ్డి అన్నదానమే చేసేవారు. ధనదానం చేసేవారు కాదు. మనిషి ప్రాణాలు నిలిపేది పరబ్రహ్మ స్వరూపమైన అన్నమేనని ఆయన నమ్మకం.
రేనాటిచంద్రుడి గురించి పాణ్యం సోదరకవులు (పాణ్యం నరసరామయ్య, పాణ్యం లక్ష్మీనరసయ్య) ఇలా రాశారు.
కలియుగ దానకర్ణుడనగా నుతికెక్కుచు, నాంగ్ల రాజ్ఞిచే
గలిత యశస్సువర్ణ పతకంబు బహూకృతి పొందినట్టియ
య్యలఘడు దానశీల మహితాత్ముడు, వేంగళరెడ్డి గారికిన్
సులలిత జన్మభూమి యగుచున్, గణనీయతగాంచె మీదటన్
– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు