‌కరోనా వారియర్‌ ‌పేరు మారు మోగుతోంది. మొత్తం ప్రపంచమంతటా కాటిలిన్‌ ‌కరికో పేరే ప్రతిధ్వనిస్తోంది. విశ్వాన్ని వణికించిన మాయల మహమ్మారి కొవిడ్‌-19. అం‌దులోని ప్రతీ అక్షరమూ రాకాసి రూపుగా మారి కరాళ నర్తనం చేస్తుంటే ఆసాంతం గడగడలాడలేదా జగతి? అంతటి ప్రాణాపాయ స్థితిలో ‘నేను ఉన్నా’ అంటూ ముందుకొచ్చి పోరాటయోధగా నిలిచి గెలిచారు కాటలిన్‌! ‌వినూత్న రీతిన టీకాల పరంగా తనదైన పరిశోధన కేతనాన్ని ఎగురవేసి, వైద్యశాస్త్ర రంగాన ఈ సంవత్సరం నోబెల్‌ ‌పురస్కార విజేత అయ్యారు. పలురంగాలతో పాటు వైద్యంలోనూ సాటిలేని మేటికి ఏటా ఈ పురస్కృతి పరిపాటి. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రకోవిదుడు ఆల్ఫ్రెడ్‌ ‌నోబెల్‌. ‌స్వీడిష్‌ ‌వాసి అయినా ఊరూవాడ అందరికీ చిరపరిచిత పేరు కాదూ అది! విశేష కృషి, విలక్షణ లక్ష్యం,విశిష్ట ఆచరణం నిండిన వారికే డిసెంబర్‌లో నోబెల్‌ ‌స్మృతి సంచికగా అవార్డు ప్రదానం జరుగుతుంది. అంతటి బహూకృతిని మరో శాస్త్రకారుడితో సంయుక్తంగా అందుకోనున్న కాటలిన్‌ ఇప్పుడు మానవ సేవానాయిక. హంగరీలో పుట్టి అమెరికాలో ఉంటున్న ఆమె గురించి ఎంతైనా తలచుకోవచ్చు.

‘చెట్టు చేమలందో, గట్టు పుట్టలయందో

జంతుజాలమందో జన్మమిడిన్‌

 

‌బతికియుదును గదా’ అని మనిషి అనుకున్న రోజులవి!

‘ఇక భరించజాలనీ భయంకర బాధ

బతుకు దుఃఖతప్తం మహానరక ప్రాయం

ఆయువేదీ, ఔషధం ఇంకెక్కడ’ అని తల్లడిల్లిన కాలమిది.

అదిగో, సరిగ్గా ఆ రోజుల్లోనే విభిన్నయత్నం సాగించారు కాటలిన్‌. ‌వ్యాధి నిరోధక టీకాల విధానంపైన చూపునంతటినీ కేంద్రీకరించారు. అప్పట్లో ఉన్నదల్లా కేవలం సంప్రదాయ పద్ధతి. అత్యంత సూక్ష్మమైన వైరస్‌ ‌విష పదార్థాలు ఇతర జీవుల కణాలపైన విరుచుకుపడితే, విజృంభించేది వ్యాధులే మరి. ఆ విపత్కర వాతావరణం నుంచి మానవాళిని పరిరక్షించాలంటే; లక్షిత రీతిన వైరస్‌లనో, వాటి భాగాలనో ఇబ్బడిముబ్బడిగా పెంపు చేయాల్సి ఉంది. అటు తర్వాతే శుద్ధీకరణ జరపాల్సి ఉంటుంది. క్రమానుగత దశలన్నీ అయ్యాకే, వ్యాక్సిన్ల ఉత్పత్తి సాధ్యమవుతుంది. అంటే, నిర్ణీత వైరస్‌లను దేహభాగంలోకి చేర్చాలి. అదే అంతకు ముందటి వరకూ ఉన్న రీతి. అందుకు భిన్నమైన ఆలోచన చేశారు కాటలిన్‌. ‌జన్యు సంకేత తీరుతెన్నులను సమూలంగా సమగ్రంగా పరిశీలిం చారు. ప్రస్తుతం పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ప్రాచార్యురాలిగా ఉంటున్న తాను వేరే యోచనకు శ్రీకారం చుట్టారు. నిశ్చిత వైరస్‌లోని ఎంపిక భాగాన్ని ఉత్పత్తి చేయడం పెద్ద పని. ఆ మేర కణాలకు ఆదేశాలనేవి ఉంటుంటాయి. వాటిని అవగాహనకు తెచ్చుకో వాల్సింది మన లోపలి కణాలే. అప్పుడే ప్రొటీన్స్ (‌కృత్తులు) రూపుదిద్దుకుంటాయి. ఫలితంగా శరీరం ఫలవంతంగా వ్యాపితమవుతుంది. టీకా ప్రభావానికి సానుకూలత అప్పుడే సిద్ధిస్తుంది. ఇదీ కాటలిన్‌ ‌పరిశోధనకు సంబంధించిన కీలాకాంశం.

శ్రమఫలితం

ఆమె శోధన, సాధన అంతటితో ఆగలేదు. మరింత వేగంగా దూసుకెళ్లింది. తయారీ కృత్తుల వల్లనే మనిషిలోని వ్యాధి నిరోధక వ్యవస్థ స్పందిస్తుందని రుజువైంది. అంటే అర్థం…. యాంటీ బాడీలు, తదితర ప్రయోజనకర కణాలు విడుదల కావడం. దీంతో, ఇక ముందు ఎప్పుడైనా వైరస్‌ ‌దాపురిస్తే, స్పందన పక్రియ వేగవంతమవుతుంది. దానివల్ల ఇన్‌ఫెక్షన్ల బెడద ఎదురుకాదు. దీనంతటినీ ప్రభావాత్మకంగా రూపొందించారామె. మెసెంజర్‌ ‌పద్ధతిగా దీన్ని అభివర్ణించారు. అయితే ఇదంతా ప్రయోగశాల ఫలితమే, వృద్ధికి పర్యవసానమే. దీన్ని (తయారీ) శరీరంలోనికి చేరిస్తే, ప్రతి చర్య ఉండదా? అనవచ్చు. ఉంటుంది తప్పకుండా. మరి ఈ అవరోధాన్ని ఎదుర్కోవడం ఎలా? అనే దానిపైనే ఆ శాస్త్రజ్ఞురాలు చూపు సారించారు. నిరంతర శ్రమ పర్యవసానంగా ఫలితం సాధించగలిగారు. అదే ‘అద్భుత ఔషధంబు, ఆయురారోగ్యత మఖిల శుభకరమ్ము..ఆర్తి హరమ్ము’ అనేలా ఫలించింది. పలు జాగ్రత్తలతో టీకాలను ఆవిష్కరించడం, వాటిని అన్ని విధాలా వృద్ధిపరచడం సాధ్యమైంది. ఎటువంటి సంక్రమణ వ్యాధినైనా తిప్పికొట్టగలిగే మందుకు మార్గం కంటి ముందు కనిపించింది. చికిత్స రంగంలో సరికొత్త అధ్యాయం ప్రత్యక్షమైంది. శాస్త్ర విజ్ఞాన పటిమల్లనే కొవిడ్‌కు వ్యాక్సిన్లు లభించినట్లయిందని ఆ వనితా పరిశోధనమణి తేటతెల్లం చేశారు. కాబట్టే అత్యున్నత పురస్కారం తనను ఏరికోరి వరించి వచ్చినట్లయింది.

ప్రయోగాల వెలుగులో…

కారు చీకట్లో కాంతిరేఖలా ప్రభవించింది కాటలిన్‌ ‌శాస్త్ర శోధన, వైరస్‌ను నిలువరించ ఔషధ వృద్ధికి కృషి ఎంతో ముమ్మరమైంది. ఈ క్రమంలో ఎంతగా పరిశ్రమించారో; శక్తి సమయం, వనరులను ఎంత పరిపూర్ణంగా వెచ్చించారో ఆమెకు మాత్రమే బాగా బాగా తెలుసు. ఇలా వైద్య విభాగాన పరమోన్నతికి అర్హత సాధించి గెలుపుబావుటా ప్రదర్శించిన లలనల్లో తాను పదమూడోవారు. జీవిత స్వప్నాన్ని సాకారం చేసుకున్న కాటలిన్‌కు ఇప్పుడు ఏడు పదులలోపు వయసు. తన బాల్యం పేదరికంలో గడిచింది. ఊళ్లో చిన్నపాటి ఇల్లు. అందులోనే ఇరుకు ఇరుకుగా నివాసం. తల్లిదండ్రులు శ్రమజీవులు. అంతటి బీదరికంలోనూ ఆమె ప్రతిభ ఎంతెంతో వికసించింది. బయాలజీలో డిగ్రీ చేశారు. బయో కెమిస్ట్రీలో పీహెచ్‌డీ సాధించారు. హంగరీలోనే బయోలాజికల్‌ ‌రీసెర్చి సెంటర్‌ ‌పరంగా పరిశోధనలూ ప్రయోగాలూ నిర్వహించారు. అటు తర్వాత అమెరికా పయనం. ఆ దంపతులకు ఒకరే సంతానం. ఫిల్‌డెల్షియాలో ఉన్న యూనివర్సిటీ కేంద్రంగా పరిశోధన పక్రియల్ని ఆమె వేగవంతం చేశారు. ఆ వర్సిటీ నుంచి ప్రోత్సాహకాలు స్వీకరించారు. కృషిలో భాగంగా తాను చేసిన కొన్ని ప్రతిపాదనలు స్వీకరణకు, మరికొన్ని తిరస్కరణకు! అయినా నిరాశ చెందకుండా రాత్రింబవళ్లూ ప్రయోగాల పరంపర కొనసాగిస్తూ వచ్చారు. నిధులలేమి ఎదురైనా వెరవలేదు. వృత్తిపరంగా నిరాశలు చుట్టుముట్టినా జంకనూ లేదు. లక్ష్యం నెరవేరేందుకు ఎంత చేయాలో అంతా చేశారు. దూషణభూషణ తిరస్కారాలను సమంగా స్వీకరించిన సహనశీలి. అదే తత్వం ఆమెను ఇవాళ నోబెల్‌ ‌విజేతగా నిలిపింది.

నవోత్తేజం అంటే ఇదే

‘విరిగిపోవును లెమ్ము వెలుగు వెల్లువలలో

ఘోర దారిద్య్రాంధకార ధార,

కరిగిపోవును సుమ్ము కలుషితాంతః

కల్పింతంబైన రణమేఘ డంబరమ్ము’

తొలగిపోవును లెమ్ము ధూమకేతు క్షోభ

రూపుదాల్చిన అనారోగ్య పీడ,

అణగిపోవును సుమ్ము అక్రమ వ్యాపార

సంభూత భయద దౌర్జన్య కాండ

కాంతి శాంతి సుఖమ్ము భాగ్యమ్ము నొసగు

నవారోగ్య కాంతి శోభిల్లులెమ్ము

బహువిధారిష్టములు భస్మపటలమగును

కొత్త వెలుగుల జగతి తళుకొత్తు సుమ్ము’

అనేలా బాధలూ, వ్యాధులూ దారిద్య్రాలూ అన్నింటినీ తొలగతోస్తూ కాటలిన్‌ ‌సృజించిన పక్రియ ప్రపంచానికి వెలుగుదివ్వె అయింది. ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకుని ముందడుగు వేసిన ఆ శాస్త్రికారిణికి మహోన్నత పురస్కృతి దరిచేరింది. నగదు మొత్తాన్ని చాలా మటుకు పెంచారు నోబెల్‌ ‌నిర్వాహకులు. ఈ పురస్కారం ఎందరెందరో శాస్త్రవేత్తలు అందునా మహిళా పరిశోధకులకు ఉద్దీపన. వ్యాధిపైన పోరు యోధురాలికి పరమోత్కృష్ట సంభావనను నిఖిలావని అంతా స్వాగతిస్తోంది. వనితా శక్తి సంపన్నతకు ముక్తకంఠంతో జేజేలు పలుకుతోంది. జయోస్తు.

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE