– వింజనంపాటి రాఘవరావు
దాహంగా ఉన్నప్పుడు లీటరు ‘మినరల్ వాటర్’ తాగి ఆ సీసా పడిస్తే మనం వాతావరణాన్ని కలుషితం చేసినట్లేనా? ఇది ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను అడిగిన ప్రశ్న. విద్యార్థుల సమాధానాన్ని మీరు తేలికగా ఊహించగలరు. ప్లాస్టిక్ వాతావరణాన్ని కలుషితం చేస్తుంది అని. కానీ ఈ సమాధానానికి మీకు మూడోవంతు మార్కులే వస్తాయి. మీరు ఆశ్చర్యపోతారు, తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయి? అని. ఈ ప్రశ్న సమాధానాలను కొంచెం లోతుగా విశ్లేషిద్దాం.
ప్రశ్నలో రెండు భాగాలున్నాయి. ఒకటి ప్లాస్టిక్ సీసా. రెండు, మినరల్ వాటర్. మనం సహజంగా ‘నీటి’ని విస్మరిస్తాం. ప్లాస్టిక్ గురించి మాత్రమే ఆలోచిస్తాం. నిజానికి మినరల్ వాటర్ కూడా వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. ముందుగా నీటి గురించి చర్చిద్దాం. ‘మినరల్ వాటర్’ ఎలా తయారవుతుందో అందరికీ తెలుసు. భూగర్భజలాన్ని మోటార్ ద్వారా పైకి తోడి, ఓవర్ హెడ్ ట్యాంకులోకి పంపుతారు. తర్వాత దానిలో కరిగిన రూపంలో ఎక్కువగా ఉన్న లవణాలను ‘రివర్స్ ఆస్మాసిస్’ అనే పక్రియ ద్వారా తొలగిస్తారు. ఈ పక్రియకు ఒక ప్రత్యేక యంత్రం అవసరం. నీటిని తోడటానికి ‘రివర్స్ ఆస్మాసిస్’ చేయటానికి విద్యుచ్ఛక్తి అవసరం.
లీటరు నీరు బోరు బావి నుండి ఓవర్ హెడ్ ట్యాంకులోకి చేరాలంటే కరెంటు ఖర్చవుతుంది. ఈ కరెంటు ఉత్పత్తి కావాలంటే శిలాజ ఇంధనాలైన బొగ్గు, డీజిల్ వంటి వాటిని మండించి, తద్వారా వచ్చిన శక్తిని విద్యుత్‌గా మారుస్తారు. అంటే మనం కుళాయి ద్వారా వాడే ప్రతి నీటి చుక్క వెనుక కొంత బొగ్గు, లేదా ఇంధనం మండించాలి. బొగ్గును మండించినపుడు శక్తితోపాటు కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, నత్రజని వాయువుల వంటివి విడుదలౌతాయి. ఈ వాయువులను హరిత స్పృహ వాయువులు అంటారు. ఇవి వాతావరణాన్ని కలుషితం చేస్తాయని మనకు తెలుసు. మనం చేసే పని వలన హరిత గృహ వాయువులు విడుదలైతే, దానిని ఆ పనికి సంబంధించిన కర్బన పాదముద్ర (కార్బన్ ఫుట్ ప్రింట్) అంటారు.
లీటరు ‘మినరల్ వాటర్’ తయారు కావాలంటే సుమారుగా 1.39 లీటర్ల బోర్‌వెల్ నీరు అవసరం. అంటే తయారైన ప్రతి లీటర్ మినరల్ వాటర్‌కి మూడువందల తొంభై మిల్లీ లీటర్ల నీరు వృథాగా పోతుందన్న మాట. అదే సోడా తయారీకి 2.02 లీటర్లు, బీరుకు 4 లీటర్లు, వైన్‌కు 4.74 లీటర్లు, హార్డ్ ఆల్కాహాల్ తయారీకి 34.55 లీటర్ల నీరు కావాలి. రోజులో మనం మూడు నుండి నాలుగు లీటర్ల నీరు తాగుతాం. ఆ నీటి తయారీలో సుమారు ఒకటిన్నర లీటర్ల నీరు ఉపయోగించకుండానే మురుగు కాలువలోకి వెళ్లిపోతుంది. నలుగురు సభ్యులుండే ఇంటి నుంచి ‘మినరల్ వాటర్’ తయారీ వలన రోజుకు ఆరు లీటర్ల నీరు వృథాగా మురుగుగా మారుతుంది. రోజూ ఇరవై రెండు లీటర్లపైగా నీటిని ‘బోర్‌వెల్’ నుండి ట్యాంకులోకి చేర్చటానికి అవసరమైన విద్యుత్ ద్వారా వచ్చే కాలుష్యం దీనికి అదనం.
లీటరు మినరల్ వాటర్ తయారీకి అవసరమైన విద్యుత్ తయారీకి సుమారుగా రెండు వందల యాభై గ్రాముల బొగ్గు మండించాలి. ‘మినరల్ వాటర్’ బాటిల్‌ను దుకాణాలకు చేర్చటానికి మరికొంత ఇంధనం ఖర్చవుతుంది.
ఇక ప్లాస్టిక్ బాటిల్ తయారీకి సుమారుగా పావు లీటరు క్రూడాయిల్ ఖర్చు చేయాలి. లేదా 500 గ్రాముల బొగ్గు మండించాలి. అంటే సీసాలోని లీటరు నీరు తయారీ కంటే ఏడెనిమిది రెట్ల నీరు సీసా తయారీకి ఖర్చు చేయాలి. దాదాపుగా తొమ్మిది లీటర్ల నీటి ఖర్చుతో లీటరు మినరల్ వాటర్‌తో నిండిన ప్లాస్టిక్ బాటిల్ తయారవుతుంది. అలాగే ఏడు వందల నుండి ఎనిమిది వందల గ్రాముల బొగ్గును మండించాలి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా యాభై బిలియన్ ప్లాస్టిక్ బాటిల్స్ చెత్తలోకి చేరుతున్నాయి.
మనం ఉపయోగించే కరెంటు, వాహనాలలో వాడే ఇంధనం, వంట చెరుకు, వంట గ్యాసు, మిల్లుల్లో తయారైన బట్టలు, పాదరక్షలు, రాతకు వాడే కాగితం, కలం, సెల్‌ఫోన్, సెల్‌ఫోన్ చార్జింగ్ ఇంట్లో వాడే రకరకాల పరికరాలు ఇవన్నీ మన కర్బన పాదముద్రను పెంచుతాయి. అంతెందుకు మనం విశ్రాంతిగా కూర్చుని ఉన్నపుడు కూడా నిమిషానికి పావులీటరు కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేస్తాం. రోజుకు 1.04 కిలోగ్రాముల కార్బన్ – డై – ఆక్సైడ్‌కు ఇది సమానం. అదే వ్యాయామం చేసే సమయంలో ఇంతకు ఏడెనిమిది రెట్లు కార్బన్-డై ఆక్సైడ్ విడుదల చేస్తాం.
ఒక లీటరు పెట్రోలు మండిస్తే 2.3035 కిలోల కార్బన్ డై ఆక్సైడ్ (co2) విడుదలౌతుంది. ఒక టన్ను co2 ను వాతావరణం నుండి తొలగించటానికి పదిహేను నుండి ఎనభై మూడు చెట్లు కావలి. చెట్లను పెంచటం ద్వారా కర్బన పాదముద్రను తగ్గించవచ్చు.
మన కర్బన పాదముద్రను క్రింది విధంగా లెక్కవేయచ్చు.
కరెంటు బిల్లు × 105
నెలవారీ గ్యాసు × 105
పెట్రోలు బిల్లు × 113
కారు, ద్విచక్రవాహనం
సంవత్సరంలో తిరిగిన దూరం × 0.79
విమానయానం చేస్తే సంవత్సరంలో ప్రయాణాలు × 1100
మొత్తం కూడితే వ్యక్తిగత కర్బన పాదముద్ర వస్తుంది.
ఇప్పుడు ఆలోచించండి, మనం కర్బన ఉద్గారాలు తగ్గించటానికి వ్యక్తిగతంగా ఏమైనా చేస్తున్నామా? మొక్కలు నాటి పెంచుతున్నామా? ఆలోచించండి.
దేశం అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికీకరణ జరగాలి. దీనికి విద్యు చ్ఛక్తి అవసరం. అంటే ఎక్కువ పారిశ్రామికీకరణ అంటే ఎక్కువ హరిత గృహ వాయువుల విడుదల. అంటే భూమి ఎక్కువగా వేడెక్కుతుంది. ప్రపంచ దేశాలన్నీ ఈ విషయమై సమావేశమై ఒక్కో దేశం ఎంత పరిమాణంలో కర్బన ఉద్గారాలను వెలువరించవచ్చో నిర్ణయించుకున్నాయి. ఈ ఒప్పందాన్నే ‘క్యోటో ప్రోటోకాల్ అంటారు. అయితే కొన్ని దేశాలు తమకు కేటాయించిన దానికంటే తక్కువ శిలాజ ఇంధనాలను వాడటం వలన వాటి కార్బన్ ఫుట్ ప్రింట్ తక్కువగా ఉంటుంది. అంతేకాక అక్కడి అటవీ సంపద ఎక్కువగా ఉండటం వలన కర్బన ఉద్గారాల విడుదల కంటే వినిమయం ఎక్కువ. ఈ రెండింటి మధ్య తేడా, అంటే విడుదల కంటే వినిమయం ఎక్కువగా ఉంటే దాన్ని కార్బన్ క్రెడిట్ (Carbon Credit) అంటారు. ఎక్కువ కర్బన ఉద్గారాలు వెలువరించే దేశాలు మొక్కల పెంపకం ద్వారా కార్బన్ క్రెడిట్‌ను పెంచుకుంటాయి. తక్కువ ఉద్గారాలు వెలువరించే దేశాలు ప్రత్యేకమైన బాండ్ల ద్వారా కార్బన్‌క్రెడిట్‌ను అవసరమైన దేశాలకు అమ్ముతాయి. ఈ కార్యక్రమం మొత్తాన్ని కార్బన్ ఆఫ్‌సెట్టింగ్ (Carbon offsetting) అంటారు.
వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే పరిశ్రమలు, అపార్ట్‌మెంట్ నిర్మాణాలలో డెబ్భై శాతం నేల ఖాళీగా ఉంచి తప్పనిసరిగా చెట్లు పెంచాలని ప్రభుత్వాలు నిబంధన విధిస్తున్నాయి.
స్థానిక వనరుల వినియోగంతో కర్బన పాదముద్రను తగ్గించవచ్చు. ఏ వస్తువునైనా దూరం నుండి దిగుమతి చేసుకున్నట్లయితే ఈ పాదముద్ర పెరుగుతుంది. ఆహారపదార్థాల వంటి వాటిని, కొన్ని వస్తువులను వృథా చేయటం వలన కూడా కర్బన పాదముద్ర పెరుగుతుంది. దేన్నైనా వృథా చేయటం చట్టాలకు చిక్కని నేరం. ఈ నేరం చేయకుండా ఎప్పటికప్పుడు నియంత్రించు కోవాలి.
వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పంచభూతా లను స్వచ్ఛంగా ఉంచుకోవాలని సనాతన ధర్మం చెబుతోంది. ఈ శాంతిమంత్రం అందరికీ తెలిసిందే. దీని అర్థాన్ని ప్రస్తుత ప్రపంచానికి అనుసంధానం చేసి ఆచరిస్తే ఈ భూమ్మీద సమస్త జీవరాశుల మనుగడ సుఖప్రదంగా ఉంటుంది.
పృథ్వీశాంతిః ఆపఃశాంతిః అగ్నిఃశాంతిః
వాయుఃశాంతిః అంతరిక్షగ్ శాంతిః ఆదిత్యశాంతిః
చంద్రమా శాంతిః నక్షత్రాణిశాంతిః ఓషధయః శాంతిః
శాంతిరేవ శాంతిః