భారతగడ్డపై ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు నాలుగోసారి తెరలేచింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు మూడో టైటిల్ వేట ప్రారంభించింది. ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టు హోదాలో, సకల హంగులకు స్థానబలాన్ని జతచేసి మరీ విజేతగా నిలవాలన్న పట్టుదలతో బరిలోకి దిగింది.
2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ సంరంభానికి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా అట్టహాసంగా తెరలేపింది. మొత్తం 10 జట్లు రౌండ్ రాబిన్ లీగ్ కమ్ సెమీఫైనల్స్ నాకౌట్ తరహాలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆతిథ్య భారతజట్టు హాట్ ఫేవరెట్‌గా పోటీలో నిలిచింది.
సకల హంగులతో…
పోటీ విపరీతంగా ఉన్న నేటి అంతర్జాతీయ క్రికెట్లో విశ్వవిజేతగా నిలవాలంటే జట్టు ఏదైనా సకలహంగులు ఉండితీరాలి. ప్రత్యర్థి ఎవరైనా దూకుడుగా ఆడగల నేర్పు, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో సమతూకంతో ఉండి తీరాలి. దీనికితోడు ఓపెనర్ల నుంచి లోయర్ ఆర్డర్ వరకూ నిలకడగా రాణించే బ్యాటింగ్ లైనప్, పేస్, స్పిన్ బౌలింగ్ విభాగాలలో కుదురైన బౌలర్లు, పాదరసంలా కదిలే ఫీల్డర్లు జట్టుకు ఊపిరిగా ఉంటారు. వీటితో పాటు ప్రపంచకప్‌నకు తగురీతిలో సన్నద్ధంకావడం, మెరుగైన ర్యాంకింగ్.. ఈ హంగులకు తోడు స్థానబలం (అభిమానుల అండ) సైతం అత్యంత ఆవశ్యకం. ఈ హంగులన్నీ ఉన్నజట్లకు మాత్రమే ప్రపంచకప్ గెలుచుకొనే అవకాశం ఉంటుందని గత నాలుగు దశాబ్దాల అనుభవం, రికార్డులే చెబుతున్నాయి.
ఆల్ రౌండర్ల బలంతో…
రోహిత్ శర్మ నాయకత్వంలోని 15 మంది సభ్యుల భారతజట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ఆటలోని ఏ విభాగంలో చూసినా మేటి జట్లలో ఒకటిగా ఉంది. రోహిత్ శర్మ- శుభ్ మన్ గిల్‌లతో కూడిన పవర్ ఫుల్ ఓపె నింగ్ జోడీకి.. విరాట్ కొహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లతో కూడిన కుదురైన మిడిల్, లోయర్ ఆర్డర్లు కొండంత అండగా ఉన్నాయి.
రోహిత్, శుభ్ మన్, విరాట్, రాహుల్, శ్రేయస్, ఇషాన్ సహా ప్రధాన బ్యాటర్లు అందరూ సన్నాహక సిరీస్‌ల్లో పరుగుల మోత మోగించడం ద్వారా కళ్లు చెదిరే ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసిరానుంది. పేస్ బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమీ, జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆల్ రౌండర్లు హార్థిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, స్పిన్ బౌలింగ్‌లో జాదూ స్పిన్‌త్రయం కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ లతో భీతికొలిపేలా కనిపిస్తోంది.
గాయాల నుంచి తేరుకొని…..
భారతజట్టుకు వెన్నెముక లాంటి యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్, నాలుగో నంబర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గాయాల నుంచి పూర్తిగా కోలుకొని నూటికి నూరుశాతం ఫిట్ నెస్ తో జట్టుకు అందుబాటులోకి రావడం, అపార అనుభవం కలిగిన రవిచంద్రన్ అశ్విన్ ఆఖరి నిమిషంలో జట్టులో చోటు సంపాదిం చడం భారత విజయావకాశాలను మరింతగా పెంచాయి.
పుష్కరకాలంగా ఎదురుచూపులు…
భారతజట్టు వన్డే క్రికెట్లో ప్రపంచకప్ అందుకొని పుష్కరకాలం గడచింది.1983లో కపిల్‌దేవ్ భారత్‌కు తొలిసారిగా ప్రపంచకప్‌ను అందిస్తే.. మరో ప్రపంచ కప్ కోసం 2011 వరకూ వేచిచూడాల్సి వచ్చింది. మహేంద్ సింగ్ ధోనీ నాయకత్వంలో సొంతగడ్డపై జరిగిన 2011 ప్రపం •కప్‌లో భారత్ రెండోసారి విజేతగా నిలిచిన తరువాత నుంచి గత 12 సంవత్స రాలుగా మరో ప్రపంచకప్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ లాంటి దిగ్గజ క్రికెటర్లకు ఇదే ఆఖరివన్డే ప్రపంచకప్ కావడంతో ఆరునూరైనా ట్రోఫీ నెగ్గితీరాలన్న పట్టుదలతో భారతజట్టు సిద్ధమయ్యింది.
9 మ్యాచ్‌అ రౌండ్ రాబిన్ లీగ్ సమరం….
తొలిదశ రౌండ్ రాబిన్ లీగ్‌లో ఒక్కోజట్టు తొమ్మిది మ్యాచ్‌లు చొప్పున ఆడనుంది. రౌండ్ రాబిన్ లీగ్ మొదటి నాలుగుస్థానాలలో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్లో పోటీపడతాయి. 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ దశలో భారత్ తన ప్రారంభ మ్యాచ్‌ను అక్టోబర్ 8న చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఐదుసార్లు విన్నర్ ఆస్ట్రేలియాతో ఆడనుంది. అక్టోబర్ 11న అప్ఘనిస్థాన్, 14న పాకిస్థాన్, 19న బంగ్లాదేశ్, 22న న్యూజిలాండ్, 29న ఇంగ్లండ్, నవంబర్ 2న శ్రీలంక, 5న దక్షిణాఫ్రికా, నవంబర్ 12న నెదర్లాండ్స్ జట్లతో భారత్ పోటీపడనుంది. నవంబర్ 15న ముంబై వేదికగా తొలి సెమీఫైనల్స్, నవంబర్ 16న కోల్ కతా వేదికగా రెండో సెమీఫైనల్స్ నిర్వహిస్తారు. నవంబర్ 19న అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టైటిల్ సమరం నిర్వహించ నున్నారు. సెమీఫైనల్స్ నుంచి ప్రతి మ్యాచ్‌కూ రిజర్వ్ డే సదుపాయం కల్పించారు.
నరేంద్ర మోడీ స్టేడియంలో మొదలై 46 రోజుల్లో 48వ మ్యాచ్‌గా నరేంద్ర మోడీ స్టేడియంలోనే నవంబర్ 19న ముగిసే ప్రపంచకప్ టైటిల్ పోరులో ఆతిథ్య భారత్ విజేతగా నిలవాలని శతకోటి అభి మానులు కోరు కొంటున్నారు. సకల శుభశకునాలతో పోటీకి దిగిన భారత్‌కు స్థానబలంతో పాటు కోట్లాది మంది అభిమానుల ఆశీస్సులు మెండుగా, దండిగా ఉన్నాయి.
– చొప్పరపు కృష్ణారావు