సంపాదకీయం

శాలివాహన 1945 శ్రీ శోభకృత్‌  ‌భాద్రపద బహుళ దశమి – 09 అక్టోబర్‌ 2023, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


గతంలో ఒకసారి చెప్పుకున్నట్టు కేరళలో ఏం జరిగినా దానిని వర్ణించడానికి మాటలు చాలవు. ఏదైనా సంచలనమే మరి! అక్కడ చర్చ్ ‌ప్రభావం చాలా ఎక్కువ. వీటి గురించి వెలువడే సమాచారం ఎప్పుడూ సంచలనమే. ముస్లిం మతోన్మాదం ఆ విషయంలో ఏ మాత్రం వెనుకబడి లేదు. క్రీస్తును చేరడానికి వారికి  అనేక చర్చ్‌లలో, వర్గాలను బట్టి అనేక విధానాలు ఉన్నాయి. అలాంటిదే ఇదుక్కి డయోసిస్‌ ‌సైరో మలబార్‌ ‌చర్చ్. ఈ ‌చర్చ్ ‌యాజమాన్యమే సరిగ్గా గాంధీ జయంతి రోజున ఫాదర్‌ ‌కురియకోస్‌ ‌మట్టంను ‘వికార్‌’ ‌బాధ్యతల నుంచి తొలగించింది. వికార్‌ అం‌టే ఎవరు? బిషప్‌-‌ప్రధాన మత గురువు తరువాతి స్థానంలో ఉండేవారు. మంకువ సెయింట్‌ ‌థామస్‌ ‌చర్చ్‌లో  కురియకోస్‌  ‌బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గాంధీ జయంతికే ఈ ముహూర్తం ముంచుకు వచ్చింది. ఎలాగంటే, కురియకోస్‌ ఆ ‌రోజున బీజేపీలో చేరారు. ఇందుకు ఆగ్రహించిన సదరు చర్చ్ ‌యాజమాన్యం కొన్ని గంటలలోనే పదవి నుంచి పీకేసింది. ఇదుక్కి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కేఎస్‌ అజీ ఫాదర్‌ ‌కురియకోస్‌కు పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇచ్చారు. కానీ ఫాదర్‌ ‌కురియకోస్‌ను తాత్కాలికంగానే బాధ్యతలను నుంచి తప్పించామని బుల్లి వివరణ కూడా ఇచ్చుకుంది యాజమాన్యం.

కేనన్‌ ‌చట్టం ప్రకారం ఒక చర్చ్‌లో మత గురువుగా పనిచేస్తున్న వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాలలో ఉండరాదు. అందుకే ఈ చర్య అని చెప్పాడు ఆ చర్చ్ అధికార ప్రతినిధి. ఇదో పచ్చి అబద్ధం. గతంలో తమ మతస్థుడికి పార్టీ టికెట్‌ ఇమ్మని పాలక్కాడ్‌ ‌క్రైస్తవ మతగురువు సాక్షాత్తు రాష్ట్ర సీపీఐకి లేఖ రాశారు. వామపక్ష ద్వయానికీ, చర్చ్‌కీ అక్కడే గట్టి అనుబంధమే ఉంది.  ఇంతకీ కురియకోస్‌ ‌వయసు 74 ఏళ్లట. కొన్ని మాసాలలోనే పదవీ విరమణ చేయబోతున్నారట. దేశ పరిస్థితులు బాగా ఆకళింపు చేసుకున్నారు కాబట్టి కురియకోస్‌ ‌బీజేపీలో చేరారని జిల్లా అధ్యక్షుడు అజీ ట్వీట్‌ ‌చేశారు. కురియకోస్‌ ‌వివరణ ఇంకా చక్కగా ఉంది. బీజేపీలో చేరడానికి నాకు ఎలాంటి అభ్యంతరాలు కనిపించలేదు అన్నారాయన. కానీ మణిపూర్‌ ‌హింసాకాండను కేరళ చర్చ్‌లు విమర్శిస్తున్న కాలంలో కురియకోస్‌ ఇం‌తపని చేయడమే వాటికి జీర్ణం కావడం లేదు.

మన దేశంలో చర్చ్ ‌వైఖరి ఇలా ఉంటే, మన ఇరుగు పొరుగు అఫ్ఘానిస్తాన్‌ను ఇష్టారాజ్యంగా ఏలుతున్న తాలిబన్‌ ‌మంత్రి ఏమన్నాడో కూడా గమనిద్దాం. రెండూ ఏకకాలంలో జరిగాయి! షరియా ప్రకారం పురుషులు, స్త్రీలు సమానం కాలేరు అంటున్నాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి నేదా మహమ్మద్‌ ‌నాదిమ్‌. ‌స్త్రీ పురుషులు సమానమేనని పాశ్చాత్య దేశాలు పనీపాటా లేక అంటూ ఉండవచ్చు. కానీ కాదంతే అంటున్నాడు ఈయన. స్త్రీ పురుషుల మధ్య తేడాను ప్రవక్త అల్లా తెలియచేశాడు. పురుషుడు పాలకుడు. అతడే సర్వంసహాధికారి. పురుషుడిని గౌరవించాలి. అతడి ప్రపంచాన్ని స్త్రీలు వినమ్రంగా ఆమోదించాలి అని బగ్లాన్‌ ‌విశ్వవిద్యాలయంలో ఉపదేశించాడు నాదిమ్‌. ఆ ‌దేశంలో బాలికలు, యువతులు విద్యాలయాలకి వెళ్లకుండా నిషేధించి చాలా కాలమే అయింది.

భారతదేశంలో అంటరానితనం ఉంది. కానీ ఆ దురాచారం కొనసాగడానికి భారతీయ సమాజంలోని సంస్కర్తలు అంగీకరించలేదు. అందుకోసం ఉద్యమాలు జరిగాయి. సజీవంగా ఉండే లక్షణం, సంప్రదాయం ఉన్నది కాబట్టి సమాజంలోని ఇలాంటి ఒక ప్రాణాంతక వ్యాధిని నిర్మూలించడానికే భారతీయ సమాజం నిజాయతీగా ఆరాటపడింది. చాలావరకు విజయం సాధించింది. కానీ అంటరానితనమే సాకుగా ఈ దేశంలో క్రైస్తవ మిషనరీలు కొన్ని శతాబ్దాలుగా మతాంతరీకరణలన•  యథేచ్ఛగా సాగిస్తున్నాయి. ఈశాన్య భారతంలో మిషనరీలు సాగించిన ఇలాంటి నిర్వాకం గురించి ఇప్పుడు దేశ ప్రజలు నమ్మకం తప్పడం లేదు. మతాంతరీకరణలో జాతీయ విద్వేషం ఉందని ముందునుంచీ సంఘ పరివార్‌ ‌చెబుతూనే ఉంది. ఇప్పుడు కురియకోస్‌ ఉదంతంతో అది మరొకసారి రుజువైంది. బీజేపీ భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆరాధించే సంస్థ. జాతీయ విలువలు, దేశభక్తి, హిందువుల ఐక్యత అవసరాన్ని గుర్తించిన ఆర్‌ఎస్‌ఎస్‌ ‌బీజేపీకి స్ఫూర్తి. అలాంటి పార్టీలో చేరిన ఒక క్రైస్తవ మతగురువును ఆగమేఘాల మీద చర్చ్ ‌పూజా బాధ్యతల నుంచి తప్పించడం ఎందుకు? భారతీయత మీద ఇంత వ్యతిరేకత ఏమిటి? మెజారిటీ ప్రజల విశ్వాసాల మీద ఇంత నిరసన ఎందుకు? ఇది కొత్తరకం అంటరానితనానికి అంకురార్పణ కాదనడం ఎలా? నిజం చెప్పాలంటే కొత్త అంటరానితనానికి భారత్‌లో చర్చ్ ఎప్పుడో బీజాలు వేసింది. హిందువులలో అగ్రకులస్థులు, నిమ్నకులస్థులు కూడా క్రైస్తవం స్వీకరిస్తున్నారు. అయితే మతాంతరీకరణ తరువాత అదే దూరం అక్కడ కూడా కొనసాగుతున్న   మాట పరమ సత్యం. ఈ అంశం గురించి ఇంకొంచెం లోతుకు వెడితే కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందన్న రీతిలోనే ఉంటుంది.

కానీ భారతదేశంలో కొన్ని రాజకీయ పక్షాలు, స్వయం ప్రకటిత మేధావులు చేస్తున్న పని ఏమిటి? బుజ్జగింపుతో, హిందూద్వేషంతో స్త్రీ పురుషునితో సమం కాదు అని చెబుతున్న మతం ఇక్కడ వ్యాప్తి కావడానికి దోహద పడడం కాదా? సరికొత్త అంటరానితనానికి బాటలు వేస్తున్న క్రైస్తవానికి సాగిలబడడం కాదా? సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటూ ప్రగల్భిస్తున్నది వీటి ప్రాపకం కోసం కాదా? ఆ క్రమంలో అడ్డుగోలుగా చేసే వాదనలకు, కుసంస్కారంతో చేసే దూషణలకు భావ ప్రకటనా స్వేచ్ఛ అని పేరు పెట్టడం లేదా? ఏమైనా కేరళ చర్చ్ ‌దేశ ప్రజల ముందు తన గురించి తానే పెద్ద చర్చకు అవకాశం ఇచ్చింది. జాతీయ భావాలకు చర్చ్‌లు దూరమన్న ప్రచారం నిజమేనా? అన్న ప్రశ్నకు తావిచ్చింది. ఈ విషయాన్ని భారతీయులు సమ్యక్‌ ‌దృష్టితో ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు ఉంది.

About Author

By editor

Twitter
YOUTUBE