గాజా సరిహద్దు దాటి హమాస్ చేసిన మెరుపుదాడి అమానుష క్రూర చర్యగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇది యూదుల పర్వదినాన (అక్టోబర్ 7, 23) జరగడం దారుణం. యూదులు, ముస్లింలు ఒకే తండ్రితో, ఇద్దరు తల్లులకు కలిగిన సంతానం. వీటికి ‘అబ్రహామిక్’ మతాలని పేరు. కాలక్రమేణా ఏసుక్రీస్తును శిలువ వేసిన కారణంగా, క్రైస్తవ సమాజం కూడా యూదులపైన పగబట్టింది. జన్మతః క్రీస్తు యూదుడేనన్న విషయం మరుగున పడిరది. జెరూసలెమ్ పట్టణం ఈనాటికి, బహుశ, ఇకపైన కూడా క్రైస్తవుల పుణ్యక్షేత్రమే. క్రీస్తు పుట్టింది ఆ నగరంలోనే. పగబట్టిన వైరివర్గాలు యూదులను చెల్లాచెదురు చేశాయి. విడిపోయిన యూదులు దేశదేశాలలో తలదాచుకున్నారు. జర్మనీ, ఫ్రాన్స్, యు.కె.లాంటి దేశాలకు సామూహికంగా వలసపోయారు. హిట్లర్ నాయకత్వంలో యూదులకు నిలువ నీడలేకపోయింది.
ఎన్నో కష్టనష్టాల పాలైన యూదులు తమను తాము కూడగట్టుకుని ఇజ్రాయెల్ తమ దేశంగా ప్రకటించారు. అమెరికా, భారత్‌లాంటి ప్రజాస్వామ్యాలు ఇజ్రాయెల్ ఉనికిని సమర్థించాయి. ఆర్థికంగా, ఇజ్రాయెల్ ప్రగతికి చేయూతనిచ్చి, ఆధునిక అణ్వాయుధాలు చేకూర్చి వారికి పెద్దన్నగా అమెరికా పేరు మోసింది. ఇది ఇస్లామిక్ దేశాలకు, మిగతా దేశాలకు కంటకప్రాయం అయింది. పడమట సూర్యాస్తమయం పశ్చిమ ఆసియాను ప్రభావితం చేస్తున్నట్టు కనిపిస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా హింసకు గురి అయిన యూదులు పాలస్తీనాకు వచ్చి తలదాచుకున్నారు. ఈజిప్టు మొదలు ఇరాన్ దాకా విస్తరించిన భూభాగాన్ని మధ్యాసియా అంటారు. ఇది దాదాపు ఇస్లామిక్ దేశాల సమాహారం. ఈ నరమేధంలో రెండు దేశాల హస్తం ఉన్నదని తెల్లం అవుతున్నది. ఇరాన్ హమాస్ దాడిని బాహాటంగా సమర్థించింది. ఈజిప్టులో ఇద్దరు ఇజ్రాయెలీలను కాల్చి చంపారు. యుద్ధం రణరంగానికే పరిమితం కాదని, ఇంటా బయట అన్ని కోణాల నుంచి చూడాలని, శాంతియుత సామాజిక జీవనం అందువల్ల అస్తవ్యస్థం కాక తప్పదని అంటారు.
లెబెనాన్, కటార్ లాంటి దేశాలు చేయి వేస్తున్నాయంటే, ఈ దాడి వెనుక పెద్ద కుట్ర ఉన్నదని, 2014 నుంచి మొదలైన ఈ అంతర్జాతీయ కుట్రను ఇజ్రాయెల్ నిఘావర్గం మొసాద్ ఎందుకు పసిగట్టలేదన్న ప్రశ్న బయలుదేరింది. ఎంతటి వారికైనా కనురెప్పవాలడం, పగవారు కనుగప్పి రావడం తప్పదు. దొంగ చాటుగా చొరబడి పసికందుల గొంతుకలు కోయడం, స్త్రీలను మానభంగం చేయడం వంటి యుద్ధనేరాలకు ఎప్పటికైనా మూల్యం చెల్లించవలసిందే. చివరికి ఈ యుద్ధం ఎలా పరిణమిస్తుందో వేచిచూడవలసిందే.
గాజా సరిహద్దులోనిది భారత్`పాకిస్తాన్ వివాదం లాంటిదేనని విశ్లేషకులు చెబుతున్నారు. 1945లో ఐక్యరాజ్య సంస్థ (యు.ఎన్) ఓ పద్ధతి ప్రకారం ఇజ్రాయెల్` పాలస్తీనా సమస్యను విభజన రేఖ ద్వారా పరిష్కరించింది. ఎంత కట్టుదిట్టంగా పరిష్కరించినా నూటికి నూరు శాతం హంసలా పాలు, నీరు వేరు చేయడం కుదరదు. ఉభయులూ ఎంతో కొంత సర్దుబాటు చేసుకోక తప్పదు. అంతర్జాతీయ సంస్థ తీర్పును ఇజ్రాయెల్ అంగీకరించినా, పాలస్తీనా ఒప్పుకోలేదు. ఇది హమాస్ ద్వారా దౌర్జన్యంగా జరుగుతున్న దాడి అని తెలుస్తూనే ఉన్నది. ఎడారిలో నీళ్లు దొరకకపోయినా, ఇరాన్‌లాంటి దేశాలు ఇసుకలో తైలంతీసి డాలర్లు పండిస్తున్నాయి. మధ్యయుగ మనస్తత్త్వంతో పాత కక్షలకు, రక్తపాతాలకు, జీవం పోస్తున్నాయి. ప్రస్తుతం ఎదురైన గడ్డు సమస్యకు స్వస్తి చెప్పకపోతే మూడవ ప్రపంచ యుద్ధం జరగవచ్చు. ప్రపంచశాంతిని కోరే ప్రజాభ్యుదయ, ప్రజాస్వామ్య దేశాలు ముందుకు వచ్చి ప్రళయాంతకం అయిన అణు ఆయుధాల ప్రయోగాన్ని ఆపు చేయాలి. గీత దాటిన హమాస్‌కు గుణపాఠం నేర్పాలి.
ఇజ్రాయెల్ సైన్యం (ఐ.ఆర్.ఐ), అక్టోబర్ 15 నాటికి కూడా కాల్పులు సాగిస్తున్న హమాస్ ఉగ్రవాదులను ఏరిపారవేయడానికి మరిన్ని చర్యలు చేబట్టింది. ‘శత్రువులు ఇంకా తిష్టవేసి ఉన్నారు’ అంటూ ఇజ్రాయెల్ సైనిక అధికారి, డెనియర్ హగరి అధికారికంగా ప్రకటించాడు. గాజాలో ఎనిమిది వందల ఉగ్రవాద శిబిరాలను సైన్యం ధ్వంసం చేశామని పాత్రికేయ సమావేశానికి భోగట్టా అందజేశారు. ప్రధానమంత్రి నెతన్యాహు సైన్యానికి పూర్తి స్వాతంత్య్రం ఇచ్చారని కూడా డేనియల్ చెప్పాడు.
ఉగ్రవాదులు బంధించిన పౌరులలో అమెరికన్లూ ఉన్నారని వ్యూహరచన వ్యవహారాల మంత్రి రాన్ థెర్మర్ అన్నాడు. ఈ భయంకరమైన ఉగ్రదాడిలో ఎందరు సమిధలయ్యారో, సమాధయ్యారో తొందరగా తేలుస్తాం అని ముక్తాయింపు పలికాడు. ప్రాన్స్‌లో దాదాపు ఐదు లక్షల మంది యూదులు ఉన్నారు. ఈ సంఘర్షణ ‘‘అంతర్జాతీయ’’ సమరం కావచ్చునని భాయభ్రాతులకు గురవుతున్నారు. ఇజ్రాయిల్, యు.ఎస్‌ల తర్వాత ఐరోపాలో ఎక్కువ సంఖ్యలో యూదు జనాభా ఉన్నది ఫ్రాన్స్‌లోనే. అక్కడే దాదాపు 65 మిలియన్ల అరబ్బీ ‘జాతి’ వర్గాలు ఉంటున్నాయి. ‘మేం స్థానికులమయ్యాం’ అంటారు డాక్టర్ హెర్వేరెబ్బీ. ఆయన ప్రస్తుతం నైరుతి ప్రాన్స్‌లోని బోర్డెక్స్ సాంస్కృతిక సంఘానికి సహ అధ్యక్షుడు.
‘‘మతిలేని ఈ మారణ హోమం మొదటికే మోసం,’’ అంటూ ప్రముఖ పత్రిక తన సంపాదకీయంలో బహుముఖంగా చర్చించింది. గాజా సీమోల్లంఘన ను మూడవ ‘‘ఇంతిఫాదా’’గా పేర్కొన్నది ‘ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్.’ ఇలాంటి సంఘటనలు 1987, 2000లో రెండుసార్లు జరిగాయి. గాజాలోని 2.3 మిలియన్ (23 లక్షలు) జనాభా భవిష్యత్తు అంధకారంలో పడినట్లే భావించాలి. ఇరాన్ అంతర్గత వివాదాలపైన నిఘా వేయడానికి బదులు హమాస్ పైన మొసాద్ దృష్టిని కేంద్రీకరించి ఉంటే ఈ దుర్ఘటన జరిగేది కాదేమో అంటున్నాయి అభిజ్ఞవర్గాలు. గాజాలోని ఉగ్రవాద సంస్థ హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాదీ కూటమి రెండూ చేతులు కలిపాయి అని, 1973 తర్వాత ఇజ్రాయెల్ తిరిగి ఇప్పుడే రణభేరి గట్టిగా మోగించిందని ‘‘ఏజన్సీ’’లు చెబుతున్నాయి.
ఈ యుద్ధం ఇంతటితో ఆగదు. చినికి చినికి గాలివానగా మారవచ్చు. తుపానుగా రేగకముందే తటస్థదేశాలు, విశ్వశాంతి కోసం అవసరమైన చర్యలు చేపట్టకపోతే ప్రపంచ సంగ్రామం అనివార్యం కావచ్చు. విశ్వగురు పీఠంపైన ప్రపంచ దేశాలు భారత్‌ను కూచోబెట్టాయి. నరేంద్రభాయ్ మోదీ నేతృత్వాన్ని రష్యా, ఇరాన్‌లు కూడా ప్రశంసించాయి. ప్రపంచ శాంతి కోసం సహకరించని ప్రతిపక్షాలను, నిరంతరం ప్రధానమంత్రిని దుయ్యబట్టడమే పనిగా పెట్టుకున్న ఇండీ కూటమిని భారత ప్రజానీకంతో పాటు ప్రపంచంలోని సభ్యసమాజం క్షమించదు. ప్రధానమంత్రి కార్యాలయం ఇజ్రాయెల్‌లోని భారతీయులను రక్షించుకునే ప్రయత్నం ప్రారంభించింది. విమానాల రద్దుతో పాటు అనేక చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షీ లేఖీ చెప్పారు. బాలివుడ్ నటి నుస్రత్ బరూచా ఎలాగో బతికి బయటపడ్డారు. భారత్ తరపున సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్థానికంగా ఉన్న భారతీయులు ముందుకు వచ్చారని రాయబారి నోర్‌గిల్లన్ ప్రకటించడం ముదావహం, భారత్‌కు గర్వకారణం.
– నిరామయ