– పి. చంద్రశేఖర ఆజాద్
ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన
‘‘ఎవరి గుండెలో వున్న బరువుని దింపు కోవాలన్నా అది ఇతరులతో పంచుకోవాలి. దురదృష్టవశాత్తూ నాకు అంత మంచి స్నేహితులు అతి తక్కువ. వారిని కూడా నేను ఈ విషయంలో దూరంగా వుంచాను. ఇప్పుడు నా స్వంత మనుషులు మీకు కూడా చెప్పుకోలేకపోతే నేను మనిషిగా మిగలను’’ అంటూ మాట్లాడటం మొదలు పెట్టాడు.
‘‘ఇది నేను నిర్మించుకున్న నాదైన ప్రపంచం. అందులో అడుగడుగునా మీ అమ్మమ్మ సహకారం వుంది. స్వప్న-అఖిల వున్నారు. అంతా బాగానే జరుగు తోంది. నిజానికి నన్ను వాళ్లు భరించారని చెప్పాలి. నాలో చాలా బలహీనతలు వున్నాయి. నేను చాలా మందికి ఐడెంటీని యిచ్చాను. అయితే అది నాలోనూ వుందని మీ అందరినీ పొగొట్టుకున్నాక తెలిసింది’’.
‘‘ఐడెంటీని కోరుకోవటం తప్పుకాదుగా తాతగారూ’’ అంది శ్వేత.
‘‘ఒక దశ వరకు కాదు. అలాంటి ఆరాటం లేకపోతే మనుషులు సాధించ టానికి ఏం వుండదు. పరిమితి దాటితే ప్రమాదం వస్తుంది. నాలో బలహీనత అతిగా ప్రేమించటం. నేను అలాంట ప్పుడు భిన్నంగా ప్రవర్తిస్తాను. నా డాటర్స్‌కి ఏం కావాలో ఓ ఫాదర్‌గా నా కంటే ఎవరికి తెలుసు అనుకుంటాను. వాళ్లకి కూడా కొన్ని కోరికలు వుంటాయని నేను అనుకోలేదు’’.
‘‘ఆ లక్షణాలు మీ అమ్మాయిల్లోనూ వున్నాయి’’ అంది ఆద్య.
ఆయన నవ్వాడు.
‘‘రాకుండా ఎలా వుంటాయి. వాళ్లు గోవింద్ బుద్ధ డాటర్స్. అవి మీకు సోకకుండా చూసుకోండి’’. ముగ్గురూ నవ్వుకున్నారు.
‘‘అసంతృప్తులు పెరిగాయి. నేను ఎక్కువ జోక్యం చేసుకుంటున్నాను. మాకు స్వేచ్ఛ లేదు అనే భావం వారిలో పెరిగిపోయింది. అందుకు బయటి వారు కారణం కావచ్చు. నేను అలాంటి వన్నీ మాట్లాడను. నా మీద కూడా అలాంటి ప్రభావాలు వుంటాయి కాబట్టి…’’ అని..
‘‘నేను ఎవరి జీవితాల మీద తీర్పులు చెప్పలేదు. కానీ నా సంపాదకీయాల్లో అనేక విషయాల గురించి మాట్లాడాను. అందువల్ల మా జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి అని ఉత్తరాలు రాసిన వారున్నారు. అదలావుంటే నా జీవితంలో నేను ఇలాంటిది ఫేస్ చేస్తానని అనుకోలేదు’’ అని కళ్లు మూసుకున్నాడు.
జరిగిన సంఘటనలు ఆయన కళ్ల ముందు కదిలిపోతున్నాయి.
‘‘చాలా జుగుప్సాకరమైన సంఘటనలు జరిగాయి. అందులో మీకు కొన్ని తెలుసు. ఇందులో నేరం ఎవరిది అని ప్రశ్నించుకుంటే అందరం బాధ్యత తీసుకోవాలి. మనం ప్రేమగా, అభిమానంగా వున్నప్పుడు ఎవరు ఎన్ని మాటలు అన్నా సరదాగా తీసుకుంటాం. ఓ సారి డిఫరెన్సెస్ వచ్చాక ప్రతి చిన్నమాట బూతుగానే వుంటుంది. చివరికి మన కుటుంబం చీలిపోయింది. అప్పుడు మధ్య వర్తులు వచ్చారు. రకరకాల చర్చలు జరిగాయి. ఓ దశలో నా ఆస్తి అంతా తీసుకోండి. నాకు నా పత్రిక చాలు అన్నాను. వాళ్లు మాకు మీ ఆస్తంతా అవసరం లేదు అన్నారు. చెరిసగం అన్నారు. అప్పుడు నేను నా శ్వేత, ఆద్యలకి నా ఆస్తిలో వాటా వుంది అనుకున్నాను. అలా మీ ఇద్దరికీ కొన్ని ఆస్తులు రాసాను’’.
‘‘ఈ విషయంలో ఇంతకు మించి లోతుకు వెళ్లటం నాకు ఇష్టం లేదు. దోషిని నేను. తప్పులన్నీ నావే. ఈ మాటలు నేను కోపంతో అనటం లేదు. సిన్సి యర్‌గా చెబుతున్నాను. ఎందుకంటే ఈ ఇంటికి పెద్దవాడిగా నేను వున్నాను. నేను బ్యాలెన్స్‌డ్ గా వుండి వుంటే ఈ సమస్యలు తలెత్తేవి కాదు. ఇంకా వివరణ కావాలా?’’ అని ఇద్దరినీ అడిగాడు.
‘‘అవసరం లేదు తాతగారూ’’ అన్నారు ఇద్దరూ.
‘‘ఇప్పుడు మీ గురించి చెప్పండి’’.
‘‘నేను ఐ.ఎ.యస్.కి ప్రిపేర్ అవుతున్నాను’’.
‘‘విన్నాను శ్వేతా’’.
‘‘నేను ఎం.ఎ.కి. రాబోతున్నాను. లిటరేచర్ చేస్తాననగానే ఇంటిలో గొడవ మొదలయింది’’.
‘‘అలా ఎందుకనుకున్నావు?’’
‘‘లిటరేచర్ డీల్ చేయని రంగం అంటూ వుండదు తాతగారూ… అది నేను మీకు చెప్పనవ సరం లేదు. నాకు ఉద్యోగం రాదనే అనుమానం లేదు. ఎందుకంటే మా తాతగారి పత్రికలు వున్నాయి. ఆయన దగ్గర అప్రెంటీస్‌గా• పనిచేయాలని వుంది. నేను ఎం.ఎ. కాలేజ్‌లో చేయాలా? మీ దగ్గర పని చేస్తూ చదువుకోవాలా అని ఆలోచిస్తున్నాను’’.
‘‘విజయవాడలోనూ మంచి కాలేజీలు వున్నాయి ఆద్యా… అయినా మా పత్రికలో పని చేయటానికి ముందు నువ్వు ఆలోచించుకో’’.
‘‘అదేంటి తాతగారూ…’’
‘‘ఇక్కడ నిర్ణయాలన్నీ గోవింద్ బుద్ధవి. అది నీకు ఇష్టం లేకపోవచ్చు’’ అన్నాడు.
‘‘నేను అప్రెంటీస్‌గా అన్నాను. అయినా నేను గోవింద్‌గారిని కన్విన్స్ చేయ గలనను కుంటున్నాను. అది కుదరకపోతే నేనే ఓ పత్రిక పెట్టుకుంటాను’’.
‘‘నాకు పోటీగానా’’.. అని హాయిగా నవ్వుతున్నాడు.
ఓ కెరటం ముగ్గురి పాదాలను తడిపి వెళ్లింది.
* * * * *
కాశీ నుండి రాజేశ్వరి వచ్చింది.
ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు అల్లుళ్లతో సమావేశం అయింది.
‘‘ఎందుకు నన్ను ఇప్పటికిప్పుడు రమ్మన్నారు?’’ అని అడిగింది.
‘‘ఇక్కడ ఆద్య. అక్కడ శ్వేతలతో సమస్యలు మొదలయ్యాయి అమ్మా… ఇప్పుడు వాళ్లు జరిగిపోయిన గొడవల్నీ తవ్వుతున్నారు. అసలేం జరిగిందో చెప్పమని అడుగుతున్నారు’’ అనగానే ఆమె ముఖం ముడుచుకుపోయింది.
‘‘ఇప్పుడు ఆద్య ఇంటి నుండి బయటకు వెళ్లి, తన ఫ్రెండ్ రూమ్‌లో చదువు కుంటోంది. ఇంట్లో జరుగుతున్న వాదనలను బట్టి చూస్తుంటే శ్వేత కూడా బయటకి వెళ్లిపోతుందనుకుంటున్నాను’’ అంది స్వప్న.
‘‘పెళ్లి కావలసిన ఆడపిల్లలు ఇలా చేయటం ఏమిటి? ఇవన్నీ బాగుండవు కదా’’ అంది రాజేశ్వరి.
‘‘వాళ్లు అలా అనుకోవటం లేదమ్మా… అదేదో సాహసం అనుకుంటున్నారు’’ అంది అఖిల. ఆమె నిట్టూర్చింది.
‘‘మళ్లీ మన కుటుంబంలో సంక్షోభం వచ్చింది అత్తయ్యా… కొత్త తరం కూడా చీలిపోయేలా వుంది’’ శ్రీనివాస్.
‘‘ఇదంతా మావయ్య మన మీద కక్ష తీర్చు కుంటున్నట్లు వుంది’’ ఆదర్శ్.
‘‘కక్షలు ఇంకానా! ఒకరినొకరు కాదు అనుకున్నాం. ఎవరి బతుకు వారు బతుకుతున్నాం. ఎదురెదురుగా వుంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయని దూరంగా వున్నాం. అయినా మనుషుల్ని ఈ పగలు వదలటం లేదా?’’
‘‘ఇక్కడున్నది మనుషులు కాదమ్మా… ఒకే ఒక్క వ్యక్తి. గోవింద్ బుద్ధ. తాత, నాయనమ్మలు ఆ పేరు ఎందుకు పెట్టారో, కట్టుకున్న భార్యనీ, పిల్లల్ని కూడా ఈ పెద్దమనిషి వదులుకున్నాడు. ఆ బుద్ధుడు ఇల్లు వదిలి వెళ్లాక వారి మీద ఇలా కక్షసాధింపులు చేయలేదు’’ అంది అఖిల.
‘‘అఖిలా… ఓ పక్క నుండి ఇదంతా పిల్లలు చేసారని చెబుతున్నారు. ఇంతలో మీనాన్న ఇదంతా చేస్తున్నాడని అంటున్నారు. నాకేమీ అర్థం కావటం లేదు. మనం ఏం జరిగిందో తెలుసుకోవాలి. నాకు ముందు శ్వేత, ఆద్యలతో మాట్లాడా లని వుంది’’.
‘‘ఈ పని తను కాకుండా ఎవరు చేస్తారు. పిల్లలకి ఇంత ధైర్యం ఎక్కడ నుండి వచ్చింది. మేం ఆ ఇంటి నుండి బయటకు వచ్చామంటే మాకు పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లలున్నారు. ఆడపిల్లలం ఎప్పుడయినా బయటకు వెళ్లాల్సిందే. వీళ్లకి ఇంత వరకు చదువులు పూర్తికా లేదు. అయినా మనల్ని ఎదిరిస్తున్నారు. చూస్తుండు రేపు ఇద్దరూ ఆయన పంచన చేరుతున్నారు’’ అంది స్వప్న ఖచ్చితంగా.
‘‘ఒప్పుకుంటాను. వాళ్లు ఎందుకు వెళ్లాలను కుంటున్నారు? తాతయ్య మీద ప్రేమా?’’
‘‘కాదు. బాగా సంపాదిస్తున్నాడు కదా… అందుకోసం’’.
‘‘అదేనా మీరు పిల్లల్ని అర్థం చేసుకుంది’’.
అందరూ ఒకరి ముఖం ఇంకొకరు చూసుకున్నారు.
‘‘అమ్మా… నువ్వు ఇలా మాట్లాడితే మేమేం చెప్పగలం’’ అంది అఖిల.
‘‘కాదమ్మా… మనం అన్ని కోణాల నుండి ఆలోచించాలి కదా… రేపు ఆయన పిల్లల్ని మీరే పంపించారు అంటాడు. అందుకే పిల్లల్తో గొడవ పెట్టు కున్నట్లు నటిస్తున్నారు. ఇదంతా నా ఆస్తి కోసమే కదా అంటే మీరేం చెబుతారు’’ అనగానే అందరూ ఆలోచనలో పడ్డారు.
‘‘అమ్మ చెప్పిందాంట్లో ఓ పాయింట్ వుంది. శ్వేత మొన్న అడిగింది. మీరు తాతని కాదను కున్నప్పుడు ఆయన ఆస్తులు ఎందుకు తీసుకున్నారు అని’’ అంది స్వప్న.
‘‘నువ్వేం అన్నావు?’’
‘‘అప్పటికప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడిగితే మైండ్ బ్లాంక్ అవుతుంది. ఏం సమాధానం చెప్పగలం’’ అన్నాడు శ్రీనివాస్.
‘‘చూస్తుంటే దీని వెనకాల చాలా పెద్ద కుట్ర వుంది. ఎలా అయినా మీరు నా దగ్గరకు రావాలి. నేను తప్ప మీకు దిక్కులేదు. ఆ మాట మీరు అని నా కాళ్లు పట్టుకోవాలి అని గోవిందు గారి ఉద్దేశం’’.
‘‘ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి’’ అంది రాజేశ్వరి.
‘‘నాకు తెలిసి మావయ్య గారికి వార్నింగ్ వెళ్లాలి. అది అత్తయ్య గారి చేతుల్లో వుంది’’ ఆదర్శ్.
‘‘ఏం నాయనా అది’’.
‘‘మీరు ఆయనకి విడాకుల నోటీస్ ఇవ్వాలి’’.
ఒక్కసారిగా నిశ్శబ్దం.
రాజేశ్వరి ముఖం పాలిపోయింది.
‘‘ఆయన మిమ్మల్ని అన్నమాటల కంటే ఇది బాధని కలిగిస్తోందా?’’
‘‘అసలు మనం ఆ ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడే ఈ పని చేసి వుంటే ఇప్పటికి విడాకులు అయిపోయేవి’’.
‘‘ఇంకా ఈ బంధం వుంది కాబట్టే ఆయన ఇన్ని నాటకాలు ఆడ గలుగు తున్నాడు’’ అందరూ తలొక మాట అంటున్నారు. రాజేశ్వరి మాత్రం మాట్లాడటం లేదు.
‘‘అమ్మకు ఇష్టం లేనట్లు వుంది. మనం బలవంతం చేయటం ఎందుకు?’’ అంది అఖిల.
‘‘ఆ రోజు అమ్మకు జరిగిన అవమానానికి మనం బాధపడ్డాం. రగిలిపోయాం. నాన్న మన ఇద్దరినీ ఏమీ అనలేదు. నాకయితే అప్పటి మాటలన్నీ గుర్తున్నాయి. ఇప్పటికీ నా గుండె మండుతూనే వుంది’’ అంది స్వప్న.
‘‘అవును. ఆ అవమానం నాదే. మీది కాదు’’ అంది రాజేశ్వరి.
‘‘అది కాదమ్మా’’.
‘‘నన్ను మాట్లాడనీయండి’’ అంది మధ్యలోనే.
‘‘నేనూ. ఆయనా ఇంకోసారి అది తేల్చు కుంటాం. నేను విడాకుల పేపర్స్ మీద సంతకం చేస్తాను’’ అనగానే అందరి ముఖాల్లో సంతోషం కనిపించింది.
‘‘దానికి ముందు ఓ పని జరగాలి’’ అనగానే మళ్లీ అనుమానంగా చూసారు.
‘‘ఇది నాకు-గోవిందు గారికి మధ్య నున్న సమస్య మాత్రమే కాదు. ఇద్దరు పెళ్లికాని ఆడపిల్లలు కూడా వున్నారు. అదీ ఆలోచిస్తున్నా’’.
‘‘నువ్వు వాళ్ల పెళ్లిళ్ల గురించి ఆలోచించ వద్దు. ఈ రోజుల్లో ఇలాంటి వాటిని ఎవరూ పట్టించు కోవటం లేదు’’.
‘‘మీ అమ్మాయిలు పట్టించుకున్నారు కదా…. రేపు వాళ్లని కట్టుకున్న వారికి కోపం వస్తే మీ వంశమంతా ఇంతే అని అనకుండా వుంటారా?’’
‘‘ఇప్పుడేమంటావమ్మా?’’ విసుగ్గా అంది స్వప్న.
‘‘ముందు నేను ఆద్యతోనూ, శ్వేతతోనూ మాట్లాడాలి. అప్పుడు మాత్రమే సంతకం పెడతాను’’ అంది.
‘‘ఆద్య అయితే ఇక్కడే వుంది. ఇప్పుడే రమ్మని పిలుస్తాను’’.
‘‘నేను ఇద్దరితోనూ ఎదురెదురుగా వుండి మాట్లాడతాను. నాలుగు రోజులు ఆలస్యం అయినా మునిగిపోయేదేం లేదు’’ అంది రాజేశ్వరి.
* * * * *
ప్రభాత్ తులసి ముందుకు వచ్చాడు ఉత్సాహంగా.
‘‘మావయ్య ఇప్పుడు విజయవాడలో వుంటున్నారు అని తెలిసింది’’
‘‘విజయవాడలోనా? అక్కడుండటం ఏమిటి?’’
‘‘గోవింద్ బుద్ధ అని మీడియా ప్రముఖుడు. అదే పత్రికాధిపతి’’
‘‘ఆ అబ్బాయి దగ్గర వుంటున్నారా? అతను నాకు తెలుసు. మన దగ్గరికి అప్పుడప్పుడు వస్తుండేవాడు. మీ మావయ్యంటే తనకి ఇష్టం. అతని ఫ్యామిలీ లోనూ యిబ్బందులు వచ్చాయని విన్నాను. ఆ పని మీద వెళ్లి వుంటారా?’’
‘‘తెలియదు అత్తయ్యా’’.
‘‘ఎప్పుడు వస్తారో’’ అంది.
‘‘అది కూడా తెలియదు’’.
‘‘కనీసం గోవింద్ ఫోన్ నెంబర్ దొరుకు తుందా?’’
‘‘అది పెద్ద పని కాదు. కొన్ని రోజులు ముంబయ్ లోని వారి ఆఫీస్‌లో మావయ్య వున్నారని తెలిసింది’’.
‘‘సరే… గోవింద్‌తో నేను మాట్లాడతాను’’ అంది.
* * * * *
సరయూ వసుంధరకి ఫోన్ చేసింది.
‘‘మమ్మీ తాత ఎక్కడవున్నారో తెలుసా?’’
‘‘తెలియదు. ఇప్పుడు తాతతో పనేంటి?’’
‘‘రాహుల్ ఓ సారి కలుద్దాం అంటున్నారు’’.
‘‘ఎందుకేంటి?’’
‘‘ఆయన సలహాలు తీసుకోవాలంటున్నారు’’.
‘‘రాహుల్ పక్కన వున్నాడా?’’
‘‘లేరు’’.
‘‘మీ తాతే కాదు. సలహాలు తీసుకోవటానికి లక్షల మంది దొరుకుతారు. ఆయన ఇప్పుడు రిటైరయ్యాడు. జౌట్‌డేటేడ్. ఆయన దగ్గర మీరు సలహాలు తీసుకోవటం ఏంటి? నాకు నచ్చలేదు’’.
‘‘ఇప్పటికీ ఆయన పేరు చెబితే నమస్కరించే వాళ్లు వున్నారు మమ్మీ…’’ అంది సరయూ.
వసుంధరకి కోపం వస్తోంది.
‘‘అయితే వెళ్లండి. రేపు ఆ మురికి సలహాలు ఎందుకు విన్నామా అని బాధ పడతారు’’ అంది కసిగా.
‘‘నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. మురికి సలహాలో, మంచి సలహాలో తెలియకుండానే నేనూ, రాహుల్ బిజినెస్‌లోకి దిగుతున్నామా? మమ్మీ వ్యాపారంలో వ్యక్తిగత ఇష్టాలతో, బంధాలతో సంబంధం వుండదు. అలావుంటే ఎవరూ ఎదగరు. ఆ రంగాలు వేరే వున్నాయి’’ అంది సరయూ.
‘‘నువ్వు ఇండియా వెళ్లాక మారిపోయావు’’.
‘‘ఇప్పుడే కదా లైఫ్ అంటే ఏమిటో తెలుస్తోంది’’.
‘‘మళ్లీ చెబుతున్నాను. ఇప్పటికే అమ్మమ్మ ఇండియాలో వుంది. ఇన్ని రోజులూ అమ్మను జాగ్రత్తగా చూసుకుంది, అమ్మ పేరుతో వున్న ఆస్తి కోసం. అది భువన వాళ్లకి కాకూడదు. అర్థం చేసుకో’’.
‘‘అమ్మమ్మకు ఆస్తి ఎంత వుంది? వెయ్యి కోట్లు వుందా?’’
‘‘నాకు తెలియదు’’.
(సశేషం)