– కల్హణ

పచ్చలు రాశి పోసినట్టుందా ఆ అడవి మధ్యలోని దేవదారు వృక్షం. వెండిధూళి పరుచుకున్నట్టున్నట్టే ఉంది ఆ దళసరి ఆకులు మీద. ప్రతి ఆకు గాలికి సుతారంగా ఊగుతూ ఉంటే, ఎండలో మరింత అందంగా ఉంది చెట్టు. చిరుగాలికి నది అలల అంచులు కదులు తున్నట్టు రమణీయంగా కదులుతున్నాయా  ఆ చెట్టు శాఖలు. దట్టమైన అడవి. అడుగడుగునా, అణు వణువునా పచ్చదనమే. అయినా ఆ దేవదారు చెట్టు పచ్చదనం ఏదో తేజస్సుతో వెలిగి పోతోంది. పవిత్రతో పరిమళిస్తోంది.

అందుకే పరవశించి చూస్తున్నాడు దిలీప మహారాజు. అడవంటేనే ఆయన సర్వం మరచి పోతాడు. అది ఎన్నెన్నో జీవరాశులకు ఆవాసం. రుషి పుంగవుల పేరుతో పుడమి మీద నడయాడే దేవతా మూర్తుల, జ్ఞానుల తపోభూమి. ఔషధజాతి మొక్కల కాణాచి. అమాయకత్వాన్ని చిరకాలం కాపాడడానికే ఉన్నట్టు కనిపించే గిరిపుత్రులకు అడవే నీడ. వనం, రాజ్య సంపదను ప్రతిబింబిస్తుంది.అంతేనా, రాజ్యానికి పెట్టని కోట. ఇక అందం గురించి చెప్పాలంటే! ఈ చరాచర సృష్టిని సౌందర్యవంతం చేసినవే అడవులు. అడవి లేని పుడమిని ఊహించగలమా!

తన కర్తవ్యం మరిచిపోకుండా తూరుపు దిక్కుకేసి ఒక్కసారి దృష్టి సారించాడు. అల్లంత దూరంలో నందిని.

 ఆ దేవదారు చెట్టు నీడకు కొంచెం ఇవతలే పచ్చికను కొరుకుతోంది.

కామధేనువు సంతానం నందిని. దేవతలు, మునులు అనే ఏమిటి! ముల్లోకాలు కూడా పూజించే గోమాత. ఆవగింజంత మచ్చయినా లేకుండా తెల్లని శరీరంతో, నల్లటి కనులతో రమణీయంగా ఉంటుంది నందిని. నెలవంకను పోలిన శృంగాలు ఆ గోవుకు మరింత సౌందర్యాన్ని ఇస్తున్నాయి. ఎంతసేపయినా చూస్తూనే ఉండాలని అనిపిస్తుంది. చిన్నగా తలవూపుతూ, గంభీరంగా అడుగులో అడుగు వేసుకుంటూ నడిచే నందినిని చూస్తుంటే నాలుగు పాదాల ధర్మం నడచి వస్తున్నట్టే ఉంటుంది. నిత్యపూజలో పూసే పసుపుతో ఆ గోమాత కాలి గిట్టలు ఆ రంగులోకి వచ్చేశాయి.

అయోధ్యను పాలిస్తున్న దిలీపుడు ప్రారంభించిన దీక్ష అవాళ 22వ రోజుకు చేరుకుంది. దిలీపుడు మహాచక్రవర్తి. దేవేంద్రుడికి సాయపడగల ధీరుడు. అంతటి సాయుధ సంపత్తి, సైనిక బలగాలు కలిగినవాడు. కానీ ఆ చక్రవర్తిత్వాన్ని చాటే, శౌర్యాన్ని సంకేతించే ఏ భుజకీర్తులూ ఇప్పుడు శరీరం మీద లేవు. నారబట్టలతో, విల్లంబులతో మాత్రమే ఆ కారడవిలో నడుస్తున్నాడు. మంచి వయసులో ఉన్న దిలీపుడు మానవరూపం ధరించిన సింహంలాగే ఉన్నాడు, ఆ వనంలో.

* * * * *

దిలీపుడు ఆదర్శనీయుడైన చక్రవర్తి.. న్యాయం, ధర్మం ఆయనకు రెండు కళ్లు. అందుకే సమయానికి వర్షాలు కురుస్తూ రాజ్యం సుభిక్షంగా ఉంది. కర్ష కులనీ, పండితులనీ, సామాన్య ప్రజలనీ అడవులలో తపస్సు చేసుకునే రుషులనీ కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. నూరు యజ్ఞాలు చేసి ఖట్వాంగుడు అన్న పేరు కూడా తెచ్చుకున్నాడు.

కానీ లేనిది ఒక్కటే- మనశ్శాంతి. కారణం సంతానం లేదు. ఇంత మహా సామ్రాజ్యానికి వారసుడు లేడు. తనతోటే తన వంశం అంతరించి పోవాలా? ఇదే అతడిని వేధిస్తున్న ప్రశ్న. ఆయన భార్య సుదక్షిణాదేవి మరింత కుంగి పోతున్నది.

ఒకరోజు ఇద్దరూ కలసి కులగురువు వసిష్టముని ఆశ్రమానికి వచ్చారు.

వసిష్టుడు, అరుంధతీ ఆ దంపతులను ఆహ్వానించారు.

తన సమస్య చెప్పాడు దిలీపుడు.

అయోధ్యకు దూరంగా అడవి అంచున ప్రశాంతంగా ఉంది ఆశ్రమం. సువాసనలతో కూడిన గాలి మెల్లగా వీస్తోంది. సాధు జంతువులు ఎలాంటి జంకూగొంకూ లేకుండా ఆశ్రమ ప్రాంగణంలో సంచరిస్తున్నాయి. రంగురంగుల పక్షులు ఆ కుటీరం స్తంభాలను చుట్టుకుని ఉన్న లతలతో దోబూచులాడు తున్నాయి. అరుగుల మీద కొన్ని పక్షులు పొందికగా కూర్చుని ఉన్నాయి. ఎక్కడో మరొక కుటీరం నుంచి మంత్రోచ్చాటన మధురంగా, మంద్రంగా వినిపిస్తోంది. మరోపక్క అప్పుడే వికసిస్తున్న మునికుమారుల గొంతు నుంచి ఓంకారనాదం వీనుల విందుగా వెలువడుతోంది.

 ఒక్క క్షణం మౌనం తరువాత వాత్సల్య పూరితమైన గొంతుతో అన్నారు వసిష్టులవారు.

‘‘మహారాజా! నీకు సంతానయోగం లేకపోలేదు. కానీ నీవు చేసిన చిన్న తప్పిదం వల్ల ప్రస్తుతం నీవు ఆ యోగానికి దూరంగా ఉన్నావు.’’

‘‘నావల్ల తప్పిదం జరిగిందా?’’ విస్తుపోయాడు దిలీపుడు.

‘‘ఔను. నీవు గతంలో దేవేంద్రునికి సహక  రించడానికి ఇంద్రలోకం వెళ్లావు. తిరిగి అయోధ్య వస్తుండగా దారిలో ఒక చెట్టు నీడన కామధేనువు విశ్రమించి ఉంది. నీవు ఆ పవిత్ర గోమాతను చూడలేదు. ఇది అక్షరసత్యం. గతంలో ఒకసారి ఆ లోకం వెళ్లినప్పుడు ఎంతో మమకారంతో, గౌరవంతో ఆ మహోన్నత గోమాతను పూజించావు. కానీ ఈసారి కామధేనువు వైపు నీవు చూడలేదు. ఇందుకు ఆ గోమాత మనసు నొచ్చుకుంది. దాని ఫలితంగానే ప్రస్తుతం నీవు సంతానం గురించి క్షోభకు గురి అవుతున్నావు. గోవును నిర్లక్ష్యం చేసినా, వాటి పట్ల నిర్దయగా ఉన్నా మానవజాతి మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్న మహా సత్యాన్ని నీవు విస్మరించావని నేను అనడం లేదు. కానీ గోవు కనిపిస్తే మనం మనసులో అయినా మొక్కుతాం. ఆ మహితాత్మ జీవి మీద మనకున్న గౌరవాన్ని మనం నిరంతరం వ్యక్తీకరిస్తూనే ఉంటాం. అది మన బాధ్యత. మనదైన పరంపర. తెలియక జరిగినా ఆ క్షణంలో కామధేనువు సమక్షంలో ఇందుకు సంబంధించిన లోపం జరిగిపోయింది మహారాజా!’’ అన్నాడు వసిష్టుడు.

తన మూలంగా ఒక గోవు బాధపడిందన్న వాస్తవం మహారాజును మరింత కలత•పడేటట్టు చేసింది. కానీ తాను తెలిసి తప్పు చేయలేదు. అలా అని ఎలా సర్దుకోగలడు! తాను మహారాజు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. పాలకుల విషయంలో అది శాశ్వతసత్యం. కొంత మౌనం తరువాత నెమ్మదిగా, దీనంగా అడిగాడు దిలీపుడు.

‘‘దీనికి ప్రాయశ్చిత్తం లేదా గురుదేవా?’’

‘‘లేకేమీ, ఉంది. కామధేనువు క్షీరసాగరం నుంచి పుట్టిన పుణ్యరాశి. మనందరికీ మాతృమూర్తి వంటిది. అలాంటి దేవత మనసును నొప్పించకుండా మనమే జాగ్రత్త పడాలి. కానీ కొన్నిసార్లు తప్పులు చేస్తాం. ఆ తప్పు దిద్దుకుంటే చాలు. దానికే ఆ దేవలోకపు గోవు సంతుష్టి చెందగలదు. కామధేనువు సంతానం నందిని. నందిని భూలోకంలోనే ఉంటుంది. పైగా మన ఆశ్రమంలోనే నివశిస్తోంది ఆ గోవు. ప్రస్తుతం వరుణుడు చేస్తున్న యాగం కోసం పాతాళలోకం వెళ్లింది. యాగానికి అవసరమైన క్షీర, ఘృతాలతో పాటు, రుత్విక్కులకు కావలసిన పెరుగు నందిని ద్వారానే అందుతున్నాయి. పంచామృతాలలో నందిని పాలు, పెరుగే వినియోగిస్తారు. నందిని మన ఆశ్రమానికి తిరిగి వచ్చిన తరువాత నీవు పూజించు. భక్తిగా అర్చించు. అమ్మ, అడవి, ఆవు మన జాతికి నిత్య పూజనీయాలు.’’

‘‘ఇది రాజ కుటుంబానికి పరిమితమైన సమస్య కాదు. ఒక జాతి మనుగడకు సంబంధించిన వాస్తవ మని అర్థమవుతోంది. ఆ పూజా విధానం ఏమిటో చెప్పండి గురుదేవా!’’ అన్నాడు దిలీపుడు.

‘‘నందినిని సేవిస్తే కామధేనువు ప్రసన్న మవు తుంది. నందిని నిత్యం అడవిలో సంచరిస్తుంది. ఆ సమయంలో నీవే రక్షగా ఉండాలి. అమ్మా! సుదక్షిణా! వేకువనే లేచి అప్పుడే పూచిన పుష్పాలతో నిత్యం నీ మగనితో కలసి ఆ గోమాతను పూజించాలి. నందిని, ఆ పవిత్ర గోమాత అడవికి వెళ్లినప్పుడు వెనుక నీ భర్త రక్షణగా వెళతాడు. నీవు ఆశ్రమంలోనే ఉండి, అదిగో…నందినికి జన్మించిన ఆ వత్సను నీవు సాకాలి. మీ దంపతులు ఇరువురు నందినిని భక్తిగా సేవించాలి. ఆ గోమాత ఆశీస్సులు పొందాలి. ఫలితంగా మీకు గొప్ప సంతానం ప్రాప్తిస్తుంది. ఇదంతా కఠోర శ్రమతో కూడినది. అయినా సహనంతో చేయాలి!’ అన్నాడు రాజగురువు.

* * * * *

నందిని వసిష్టుని ఆశ్రమానికి చేరుకుంది. ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా దిలీపుడు రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి సతీసమేతంగా ఆశ్రమానికి చేరుకున్నాడు.

వసిష్టుడు చెప్పినట్టే వచ్చిన మరుక్షణం నుంచే రాజదంపతులు నందిని సేవకు అంకితమయ్యారు. వేకువనే లేచి ఆశ్రమానికి సమీపంలోనే ఉన్న ఏరులో స్నానాదికాలు ముగించుకుని, అడవిలోకి వెళ్లి సువాసనలు వెదజల్లే పుష్పాలను తీసుకువచ్చి వాటితో నందినిని పూజించడం ఆరంభించారు. గరికగడ్డి తెచ్చి తినిపిస్తున్నారు. ఆ పుణ్యకార్యంలో వారు సంతానం లేదన్న బాధను సైతం తాత్కాలికంగా మరచిపోయారు. గోసేవలో ఉన్న మహాత్మ్యం వారిని తన్మయులను చేస్తోంది. గతం కంటే వారు ఎంతో అన్యోన్యంగా, ఆనందంగా ఉండగలుగుతున్నారు.

అడవిలో నందిని ఎటు వెళితే అటు వెళుతున్నాడు దిలీపుడు. ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడుతున్నాడు. నందిని విశ్రమిస్తే తాను జాగ రూకుడై కాపలా కాస్తున్నాడు.

సాయంత్రం కాగానే ఆ గోమాతనే అనుసరించి వచ్చే దిలీపుడు మొదట చేసే పని ఆశ్రమం దగ్గర ఉండే గోవత్సాన్ని తల్లి దగ్గరకి పంపించడం. గోధూళి వేళకి నిండ•గా కనిపించే నందిని పొదుగు నుంచి ఆ గోవత్సం తన్మయంగా పాలు కుడుచుకునేది. ఆ దూడ చాలినన్ని పాలు తాగిన తరువాత మిగిలినవి తనే పిండి ఆశ్రమంలో స్వయంగా అందిస్తున్నాడు మహారాజు.

* * * * *

‘‘అంబా!’’ ఒక్కసారిగా ఆర్తరావం.

దానితో అడవంతా ప్రతిధ్వనించింది. గుహలన్నీ మార్మోగాయి.

ఉలిక్కిపడి చూశాడు దిలీపుడు. నవనాడులు కుంగిపోతుండగా చుట్టూ పరికించాడు.

ఆ దేవదారు వృక్షం దగ్గరగానే ఉంది నందిని. కానీ ప్రాణభయంతో విలవిల లాడిపోతోంది.

అత్యంత బలశాలి అయిన ఒక సింహం తన వాడి గోళ్లను దింపడానికి ఆ గోమాత వీపు మీద ఆన్చి ఉంది.

ఒక్క ఉదుటన వెళ్లాడు దిలీపుడు. రక్తం ఉడికిపోతోంది.

బాణం తీయడానికి పొది వైపు చేయి చాచాడు. అక్కడ పొది లేనట్టే అనిపించింది. త్రుటికాలంలోనే  పొది నుంచి బాణం తీసి సంధించగల విలుకాడా యన. అదేమిటో! పెద్ద ప్రయత్నం తరువాత గాని బాణం అందుకోలేకపోయాడు ఆ లిప్తలో. తీరా బాణం తీశాక మంత్రించి సంధిద్దామంటే ఏమీ గుర్తుకు రావడం లేదు. విల్లు సహక•రించడం లేదు. వింటి నారి మీద బాణం అమరడం లేదు.

ఆ సింహం నందిని వీపు మీద నుంచి తన రెండు కాళ్లు తీసి, భూమ్మీద నిలబడి దిలీపునికేసి అత్యంత హేళనగా చూసి అంది.

‘‘అయిందా నీ శౌర్య ప్రదర్శన!? ఇక ఆ వృథా ప్రయాస కట్టిపెట్టు’’ అంది మనిషి గొంతుతో.

కుపితుడైపోయాడు దిలీపుడు. అదే సమయంలో విస్తుపోయాడు కూడా. మనుష్య  భాష మాట్లాడుతున్న ఆ సింహం మామూలు సింహం కాదని అర్థమైంది.

‘‘నీవు ఎవరవు? పరమ పవిత్రమైన ఈ గోవును ఎందుకు హింసించాలని అనుకుంటున్నావు? ఏం పాపం చేసింది ఆ సాధుజీవి?’’ అన్నాడు దిలీపుడు.

నందిని ఒక పక్కకు నిలబడి విచలిత నేత్రాలతో బేలగా మహారాజు కేసి చూస్తోంది. అదేమీ పట్టించుకోవడం లేదు సింహం. నందిని పారి పోతుందన్న భ్రమ, భయం కూడా లేనట్టే ఉంది. అవును, నందిని గోజాతిలో గొప్ప జీవి.

‘‘మహారాజా! ఈ దేవదారు చెట్టు పరిసరాలలోకి ఎవరు వచ్చినా నేను చంపుతాను. నా పేరు కుంభోదరుడు. నేను పరమశివుడి ప్రమథ గణాలలో ఒక భూతాన్ని. ఈ చెట్టు జగజ్జనని పార్వతీదేవి అమ్మవారిది. ఆ అమ్మే నాటింది. అపురూపంగా పెంచింది. ఒకసారి ఏదో జంతువు వచ్చి తినేస్తే, ఆమె ఎంతో బాధపడింది. ఆ బాధ చూడలేక నేను సింహం రూపంలో ఇక్కడే కాపలా ఉన్నాను. ఈ ఆవు నా పరిధిలోకి వచ్చింది. అందుకే చంపి తింటాను. ఇది తథ్యం!’’ అని ప్రకటించింది.

‘‘మృగరాజు రూపంలో ఉన్న కుంభోదరునికి వందనం.’’ అన్నాడు దిలీపుడు.

‘‘నేను సింహాన్ని. అలాగే పిలువు. అలాగే చూడు!’’ అన్నాడు కుంభోదరుడు.

‘‘ఆజ్ఞ!’’ వినయంగా వంగి అన్నాడు దిలీపుడు. మళ్లీ తనే అన్నాడు.

‘‘నీవు సాధారణ సింహానివి కాదు. కాబట్టి ధర్మం ఆలోచించు. నా విన్నపాన్ని  ఆలకించు. నా మాటలు కూడా విను. ఈ గోమాత• నా వంశాంకురానికి ఆధరువు. ఒక ధర్మానికీ, ఒక జీవన విధానానికీ, ఒక సంస్కృతికీ ఆలంబన ఆ గోవు. ఆ గోమాతను విడిచిపెట్టు. ఇది నా విన్నపం. ఇక నా మాట. నేను ఈ ధరాతలానికే చక్రవర్తిని. అయినా సవినయంగా అడుగుతున్నాను. నాయందు దయ ఉంచి ఆ గోవును క్షేమంగా వదిలిపెట్టు.’’ అన్నాడు దిలీపుడు.

సింహం మనసు కరిగినట్టు లేదు. అంతటి చక్రవర్తి కూడా దీనుడై సజల నేత్రాలతో మళ్లీ అన్నాడు.

‘‘గోరక్షణలో జరిగిన ఈ ఘోర తప్పిదం వల్ల మా గురుదేవులు నాకు ఇవ్వబోయే శాపం నుంచి రక్షించు. అలాంటి మహోన్నత తపస్వికి మనస్తాపం కలిగించానన్న బాధ నాకు జన్మజన్మల పాటు ఉండేటట్టు చేస్తూ, అంత ఘోరమైన శిక్ష విధించకు. ఆశ్రమం దగ్గర తల్లి కోసం ఎదురు చూసే ఆ గోవత్సం తన తల్లి ఇక లేదన్న శరాఘాతం వంటి సమాచారాన్ని విని తట్టుకోగలదా? ఆ లేగకు ఏం జరిగినా ఆ పాపం కూడా నాకే కదా! ఆ చిన్నారి ప్రాణికి తల్లిని దూరం చేయకు.’’ అన్నాడు, వినమ్రంగా చేతులు జోడించి.

‘‘నీవు మహావీరుడవని విన్నాను. కానీ ఇదేమీటి, ఈ దీనాలాపాన?’’ అంది సింహం.

‘‘మృగరాజా! గోబ్రాహ్మణ రక్షణ నా విధ్యుక్త ధర్మం. నిత్యంచేసుకునే సంకల్పంలో ఇది తప్పక చెప్పుకుంటాను కదా! నా ప్రారబ్ధం. ఇవాళ ఒక గోవు నా కళ్ల ముందు చావబోతోందన్న ఊహే నన్ను దహించివేస్తోంది. ఒక గోవును రక్షించకుండా నేను నా రాజ్యానికి కాదు కదా, ఆ మున్యాశ్రమానికి కూడా వెళ్లలేను.’’

‘‘అయితే ఏమంటావు?’’

రెండు క్షణాలు గడిచిన తరువాత స్థిరంగా మహారాజు గొంతు నుంచి ఈ మాటలు వచ్చాయి.

‘‘ఆ గోమాతను విడిచిపెట్టు. అందుకు బదులుగా నా ప్రాణం తీసుకో! నా శరీరాన్ని ఆహారంగా స్వీకరించి, నీ ఆకలి తీర్చుకో!’’ దృఢంగా అన్నాడు దిలీపుడు.

‘‘నీవు దిలీపుడవేనా! ఒక ఆవు కోసం నీ ప్రాణాలు వదులుకుంటావా? రాజ్యం వదిలేస్తావా? అయినా నీవే లేనపుడు ఇక సంతానం కావాలన్న నీ కోరికకు విలువేది? ఆ కోరిక ఫలించే దారేది అమాయకుడా! నీ గురువు శాపానికి భయపడు తున్నావా ఏమిటి? నీవు తలుచుకుంటే లక్ష ఆవులను ఇచ్చి ఆ ముని కోపం చల్లార్చగలవు.’’ అంది మృగరాజు. ఆ మాటలో దారుణమైన విరుపు.

చేతులు ఎత్తి నమస్కరించి అన్నాడు దిలీపుడు, సంయమనం కోల్పోకుండా.

‘‘నిజమే! లక్ష ఆవులను తెచ్చి ఇవ్వగలను. కానీ ఒక్క గోహత్యను కూడా నేను నా రాజ్యంలో అనుమతించలేను. ఈ గోవుతో, ఈ మహోన్నత గోజాతితో నా మానవజాతికి అవినాభావ సంబంధం ఉంది. నా వంశానికి ఆయువు పట్టు ఈ గోమాత. అందుకే నా ప్రాణం పోయినా నేను గోవును రక్షించుకోవాలి. మనిషి ప్రాణానికి ఇచ్చే విలువే, ఒక గోవు ప్రాణానికి మేం ఇవ్వాలి. ఆవుకు హాని తలపెట్టడమంటే ఒక జంతువును గాయపరచడమని కాదు. చంపి తినడమనీ కాదు. నీవు నా మాటను సరిగ్గా గ్రహించలేదు. నేను ముని శాపానికి భయ పడడం లేదు. గోహత్యకు కారణం కావడం వల్ల నా వంశానికి జరిగే ఘోరనష్టం గురించి క్షోభ పడుతు న్నాను. మృగరాజా! ఒక్క గోవును పోగొట్టుకున్నా ఈ ధరాతలానికి జరిగే హానిని తలుచుకుని తల్లడిల్లుతున్నాను. గోహత్యా పాతకం నీకు కూడా తగులుతుంది సుమా! ఇందుకు కారకుడనైన నాకు ఇంకా ఎక్కువ తగులుతుంది. గోవును చంపడమంటే జాతి మనుగడకు గొడ్డలిపెట్టు అని మానవజాతి విశ్వాసం. అందుకే వదిలిపెట్టుమని ప్రాధేయపడు తున్నాను మృగరాజా! ఇది నా విన్నపం! ఈ ధరాతలాన్ని ఏలే ప్రభువుగా కూడా చెబుతున్నాను. ఆవును విడిచిపెట్టు. నాకు ఆనందం కలగచేయి. మానవజాతికి మోదం కలిగించు.’’

‘‘ఇది బెదిరింపా? విన్నపం వంటి బెదిరింపా? లేకపోతే చక్రవర్తినన్న దర్పమా! నీకు మా మీద ఆధిపత్యం ఉందని ఎంత లౌక్యంతో చెప్పావు!’’ గడుసుగా అంది సింహం.

‘‘కాదు. మనం ఒక ఇంట్లో కాకున్నా, ఒకే నేల మీద నివశిస్తున్నాం. ఒకే రాజ్యంలో ఉన్నాం. ఈ నేల మీద నివశించమని ప్రకృతి నీకు వరమిచ్చింది. ఆ వరాన్ని నేను నిరాకరించలేను కూడా. ప్రకృతి మాకు కూడా అలాంటి వరమే ఇచ్చిందని నా నమ్మకం. నేను పాలకుడిని కాబట్టి అధికుడిని అనడం లేదు. నీవు సింహజాతిలో పుట్టావు కాబట్టి నిన్ను కించపరచడం లేదు. ప్రకృతి పట్ల మానవాళి అనుసరించవలసిన  కొన్ని శాశ్వత ధర్మాల విషయంలో ఒక గౌరవప్రద ఒప్పందం అవసరమని నా అనుభవం. నిన్నూ నీ జాతినీ నిర్మూలించడం నాకూ నా సైన్యానికీ కష్టం కాదు. కానీ నీ జాతిని నిర్మూలించి ఈ సంపదల కాణాచిని, ఈ తపోవనాన్ని, ఈ ఔషధాల నిలయాన్ని నాశనం చేసుకోలేను. ఈ అడవికి నీ జాతి రక్షాకవచం. అలాంటి దుశ్చర్యకు పాల్పడి మనిషిగా నా మీద శాశ్వతంగా ఉండిపోయే రక్తపు మరకను మోయలేను. ఇలాంటి తెగను నిర్మూలించిన నన్ను పైన దేవతలు మెచ్చరు. నేల మీద భావితరాలు క్షమించవు. కాబట్టి మనిద్దరం ఉమ్మడిగా ఆలోచించవలసినవి కొన్ని ఉంటాయి. నేను అడుగు తున్నది ఈ ఆవును వదలి పెట్టమని మాత్రమే. ఈ గోమాత రక్షణ బాధ్యత సాక్షాత్తు నా కులగురువు, మా ప్రత్యక్ష దైవం నాకు ఇచ్చారు. పై లోకాలో    ఉన్న నా పితరుల ఆత్మలు కూడా క్షణక్షణం గోరక్షణ గురించే ఘోషిస్తూ ఉంటాయి. వారు వైతరిణీ నదిని దాటేదే గోమాత సాయంతో కదా! నాగరికత పెరిగిన కొద్దీ, కాలం గడచిన కొద్దీ కొన్నింటిలో కొత్త విలువలు బయటపడుతూ ఉంటాయి. వాటి పట్ల అప్పటిదాకా ఉన్న అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. గోరక్షణ విషయంలో మాకు అలాంటి విలువ ఒకటి సంప్రాప్తించింది. నాగరికత లేని కాలంలో అన్నింటిని చంపి తిన్నాడు మనిషి. సకల జీవరాశులను భక్షించాడు. జంతువులు కూడా అంతే. కానీ కాలంతో పాటు జ్ఞానవంతుడైన మనిషి కొన్ని నియమాలు పాటించడం తన మనుగడకే అవసరమన్న నిర్ణయానికి వచ్చాడు. అదిగో, అక్కడ కనిపిస్తున్న ఆ మొక్క ఇవాళ ఒక పచ్చని భూజం. అంతే. రేపు ఆ మొక్కే ఒక ఔషధమని, మనిషికి స్వస్థత చేకూర్చే అమృతమని మనం గుర్తించ వచ్చు. ఆవు విషయంలో జరిగింది ఇదే. నా విన్నపానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయి. అందుకే ఈ వాదన. దీనిని గుర్తించు, గౌరవించు!’’

‘‘రాజా! నీ వాదన అందంగానే ఉంది. కానీ మాంసాహారం తప్ప ఇతర ఆహారాన్ని ఎరుగని నన్ను ఈ ఆవును వదిలిపెట్టి ఆకులలములు, కంద మూలాలు తినమంటావా ఏమిటి? ఇదేం ధర్మం?’’ అంది సింహం, పరిహాసంగా.

‘‘నీవు తిరుగులేని మాంసాహారివి. అది నాకు తెలియనిది కాదు. నేను కూడా ప్రస్తుతానికి శాకాహారిని కానీ, పుట్టుకతో మాంసాహారినే. మాంసమే తినాలంటే అనేక జంతువులు ఉన్నాయి. కానీ ఎంత త్యాగమైనా చేసి గోవును రక్షించుకోమని మా జాతి చరిత్ర ఆదేశిస్తోంది. పురాణాలు ఘోషిస్తున్నాయి. నా ధర్మం కోరుతోంది.’’ అని అగాడు దిలీపుడు.

 మళ్లీ కొన్ని లిప్తల తరువాత అన్నాడు.

‘‘ఈ ఒక్క గోవే ఏల? వశిష్టుని ఆశ్రమానికి ఈ ఒక్క ఆవుకు బదులు లక్ష ఆవులు తరలించు అని నీవొక ప్రతిపాదన చేశావు. ప్రత్యామ్నాయాన్ని సూచించడానికి వీలు కల్పిస్తూ నీవే ఒక సందర్భాన్ని సృష్టించి ఇచ్చావు, మృగరాజా! కాబట్టి చొరవ చేస్తున్నాను. అన్యధా భావించవద్దు. నా రాజ్యంలో, నా అధీనంలో ఎన్నో ఇతర జాతి జంతువులు ఉన్నాయి. నీవు మాంసాహారివి, అంతే.  నీకు ఆవు ఒక్కటే ఆహారం కాదు. ఆవు మాంసంతోనే నీవు బతకాలన్నా అది సాధ్యంకాదు. నీ ఆహారంలో అది కూడా ఒకటి అంతే. అందుకే చెబుతున్నాను. పోతరించిన అడవిదున్నలు కావాలా? రుచికి మారుపేరయిన హరిణాలు కావాలా? కుందేళ్లు, కణుజులు కావాలా? మెత్తని పక్షుల మాంసం కావాలా? బళ్ల కొద్దీ మేకమాంసం కోరతావా? జలచరాలను రాశుల కొద్దీ పంపించనా! ఇందులో ఏదైనా పంపుతాను. మరేదైనా సరే, నీకు ఆహారంగా పంపిస్తాను. కానీ ఒక్క గోజాతికి మాత్రం చేటు చేయకు. ఒక అద్భుత ప్రయోజనం కోసం, ఈ నేల, ఈ ప్రకృతి మొత్తం క్షేమం కోసం గోవులను వదిలిపెట్టమని వేడుకుంటున్నాను.’’ అన్నాడు మహారాజు, సజల నేత్రాలతో.

క్షణం ఆలోచనలో పడింది సింహం.

‘‘నీ ప్రాణాలే ఇస్తానని, నిన్నే ఆహారంగా స్వీకరించమని క్షణం ముందే అన్నావు. ఇప్పుడు మళ్లీ అధికారం ఉంది కదా అని నిస్సహాయమైన జంతురాశిని నాకు నైవేద్యం పెడతానంటున్నావు! ఇదేం ధర్మం! ఇదేం నిరంకుశత్వం?’’ అంది హేళనగా.

‘‘నన్నే ఆహారంగా స్వీకరిస్తే మంచిదే.  ముందే విన్నవించినట్టు నీకు ఆహారం కావడానికి నేను సిద్ధం! కానీ అది విపరిణామాలకు దారి తీస్తుందని నేను భయపడుతున్నాను. ఒక మహా ఘర్షణకు మూలమవుతుందని నా బాధ. కానీ మాట ఇచ్చేశాను కాబట్టి ఇక ఆ విపరిణామాల సంగతి నాకు అనవసరం.’’ అంటూనే ధనుర్బాణాలు అవతలికి విసిరి సింహం దగ్గరగా వచ్చి, తలవంచి మోకాళ్ల మీద కూర్చున్నాడు దిలీపుడు.

ఆ సింహం వాడి గోళ్లు తన శరీరంలోకి దిగితేనేమి! తన ప్రాణం అనంత వాయువులలో కలిస్తేనేమి? ఆ గోమాత ప్రాణం దక్కుతుంది. అది చాలు. ఇక్కడే ఉన్న గురుదేవునికీ, పై లోకాలలో ఉన్న తన పితరులకీ ఆగ్రహం రాకుండా చేయవచ్చు. ఈ గడ్డ మీద పుట్టే భావితరాలు కూడా తన నిర్ణయాన్ని హర్షిస్తాయి. ఈ నిర్ణయం ఒక గొప్ప సంప్రదాయానికి శ్రీకారం చుట్టగలిగితే అంతకంటే ఏం కావాలి! దానితో గోరక్షణ జరిగితే ఇంకేం కోరుకోవాలి! తన అంతిమ క్షణాలకు ఇంతటి ప్రయోజనం లభించబోతున్నందుకు తృప్తిగా నిట్టూర్చాడు మహారాజు.

కొన్ని లిప్తలు గడిచాయి.

వాడి గోళ్లు కాదు. సుకుమారమైన పూలరాశులు దిలీపుడి శరీరాన్ని తాకాయి. కాదు, పై లోకాల నుంచి వర్షిస్తున్నాయి. కళ్లు తెరిచాడు దిలీపుడు.

 ఆ సింహం అక్కడ లేదు.

పైన దేవతలు పూల వర్షం కురిపిస్తున్నారు.

‘‘రాజా! ఆశ్చర్యపడకు. ఆ సింహం ఒక భ్రమ. నిన్ను పరీక్షించడానికి దేవతలు సృష్టించారు. నీవే గెలిచావు. వరం కోరుకో!’’ అంది నందిని, మనిషి గొంతుతో.

‘‘గోమాతా! సాక్షాత్తు ఆ కామధేనువు సంతానం నీకేం కావాలని కోరితే, ఇంకేం కోరగలను! నాకు సంతానయోగం కలిగించు!’’ అన్నాడు దిలీపుడు, చేతులు జోడించి.

‘‘సంతోషం! నా క్షీరాన్ని కొద్దిరోజులు ఆకుదొన్నెతో నీ భార్య చేత తాగించు. మీకు కారణజన్ముడైన బిడ్డ పుడతాడు.’’ అంది నందిని.

* * * * *

ఆశ్రమానికి వెళ్లిన తరువాత జరిగిన కథంతా చెప్పాడు దిలీపుడు.

‘నీవు ధన్యుడవు రాజా!’ అని ఆశీర్వదించాడు రాజగురువు.

* * * * *

సుదక్షిణాదేవి గర్భం దాల్చింది. మగబిడ్డకు జన్మనిచ్చింది.

సాక్షాత్తు వసిష్టుల వారే అయోధ్యకు వచ్చి ఆ శిశువుకు రఘువు అని పేరు పెట్టారు.

తరువాత ఆ వంశానికి రఘు వంశమని పేరు వచ్చింది. అంతటి కీర్తిమంతుడయ్యాడు రఘువు.

* * * * *

అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తరువాత అరుంధతి ఒకరోజు వసిష్టుల వారితో కలసి వనంలో విహరిస్తూ ఈ మాట అన్నది.

‘‘మానవజాతి మనుగడకీ, గోవుల రక్షణకీ ఉన్న బంధాన్ని దిలీప మహారాజు అర్థం చేసుకున్న తీరు మహోన్నతంగా ఉంది. అంతేకాదు, దీనిని లోకానికి తెలియచేయడానికి అతడు నిర్మించుకున్న తత్త్వం వాస్తవికంగానూ ఉంది. దేవతలు కూడా మెచ్చగలిగే ఈ తత్త్వాన్ని ముందు తరాలు, యుగాలు కూడా అర్థం చేసుకుంటే ఎంత బావుంటుంది!’’

‘‘నాకేమనిపించిందో చెప్పనా విదుషీమణీ! ముందు అతడిలో ఒకింత ఆవేశం కనిపించినా, ఒక సాధు జంతువును రక్షించడానికి జరిగే ప్రయత్నంలో రక్తపాతం తగదన్న రీతిలో అతడు ఆ పరిస్థితి నుంచి బయటపడిన తీరు, ప్రదర్శించిన విజ్ఞత, అక్కడ దిలీపుని దృష్టి నాకు సంతోషం కలిగించాయి. సామదాన భేద దండోపాయాలన్నీ మహారాజు చేతిలోనే ఉన్నా, సింహానికి నచ్చ చెప్పి అంగీకరింప చేసిన తీరు పరమాద్భుతం. ఇది మానవజాతీ, సింహజాతీ కూడా అర్థం చేసుకోవలసిన విషయం. మనుషలమూ, నాగరికత తెలిసిన వారమూ అనుకుం టున్న వారికి కూడా ఇది చెప్పాలని ఎందుకు అనుకుంటున్నానంటే, యుద్ధాన్ని యుద్ధంతో ఆపలేం. రక్తపాతాన్ని రక్తపాతంతో నిరోధించలేం.

ఒక ధర్మాన్ని, ఒక విశ్వాసాన్ని రక్షించుకోవాలని మనసా వాచా కోరుకునే వాడు ఎవరైనా, అందుకు అతడు తన ప్రాణాన్ని పణంగా పెడితే లోకానికి నమ్మకం కలుగుతుంది. అంతేతప్ప తన విశ్వాసాన్ని తాను రక్షించుకోవడానికి ఎదుటివారి ప్రాణాలు అవసరమని చెబితే అది లోకం సహించే విషయం కాబోదు. ఏ ప్రాణినైనా ఈ పుడమి మీద దాని ఉనికే లేకుండా చేయాలన్నంతగా వ్యవహరించడం సరికాదు. అది అర్థం చేసుకోవాలి.’’ అన్నారు వసిష్ట ముని.

‘‘ఒక జాతి మనుగడకు పరోక్షంగా మీరు నిర్వహించిన భూమిక మహోన్నతం ఆర్యా! మీ వంటివారి ఆశీస్సులతో ధర్మం నాలుగు పాదాపైనా నిలబడుతూనే, సమస్త జీవరాశి సుభిక్షంగా ఉండాలి!’’ అన్నది అరుంధతి ఆనందం ఉప్పొంగుతుండగా.

‘‘తథాస్తు!’’ అన్నారు వసిష్టులవారు.

About Author

By editor

Twitter
YOUTUBE