– డా।। దేమె రాజారెడ్డి, న్యూరో సర్జన్, అపోలో
సెప్టెంబర్ 17 నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల ముగింపు సందర్భంగా
హైదరాబాద్ సంస్థానం నిజాం నియంత పాలన నుంచి భారత యూనియన్‌లో భాగం కావడం దేశ చరిత్రలో ప్రత్యేక ఘట్టం. ఆపరేషన్ పోలో పేరుతో సాగిన పోలీసు చర్య నిజాం పన్నిన పెద్ద కుట్రను భగ్నం చేసింది. చాలా సమస్యల నుంచి దేశాన్ని రక్షించి, భారతదేశ భవిష్యత్తుకు కశ్మీర్ స్థాయి సమస్య మరొకటి ఎదురుకాకుండా చేసిన చర్య కూడా. సంస్థానాల విలీనంతోనే భారత స్వాతంత్య్ర సమరానికీ, దాని ఫలితానికీ పరిపూర్ణత లభించింది. 565 స్వదేశీ సంస్థానాలను భారత యూనియన్‌లో అంతర్భాగం చేయకపోయి ఉంటే భారతజాతి సమైక్యత, సమగ్రతల కోణం నుంచి ఒక పెను ప్రమాదంలో శాశ్వతంగా ఉండిపోయేది. ఇటు భారత్‌కు లొంగను, అటు పాకిస్తాన్‌లో చేరబోను అంటూనే తెరచాటు వ్యవహారాలు నడిపించాడు నిజాం. ఎట్టకేలకు సెప్టెంబర్ 17, 1948న తన సంస్థానాన్ని భారత రిపబ్లిక్‌లో విలీనం చేయకతప్పలేదు. నాటి ఉపప్రధాని, హోంశాఖ మంత్రి సర్దార్ పటేల్ ఎదుట చేతులు కట్టుకుని నిలబడక తప్పలేదు. అందుకే అది చారిత్రక ఘట్టం. నిరంతరం పాఠాలు నేర్చుకోదగిన చారిత్రక సందర్భం.
ఇంత ప్రాముఖ్యం ఉన్నది కాబట్టే ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రిక సెప్టెంబర్ 18, 1949 నాటి సంచికను విమోచన తొలి వార్షికోత్సవ సంచికగా వెలువరించింది. దీనికి రాసిన సంపాదకీయం శీర్షిక, ‘చారిత్రక దినం’. ‘హైదరాబాద్‌లో ప్రస్తుత పరిస్థితి- పూర్వాపరాలు’ (జనాబ్ బకర్ అలీ మీర్జా), ‘హైదరాబాదు-ఆర్థికాభివృద్ధి’ (శ్రీ మందుముల నరసింగరావు), ‘సంస్థానంలో కమ్యూనిజం స్వరూపం’ (శ్రీ బూర్గుల రామకృష్ణారావు), ‘హైదరాబాదులో శ్రీ కె.యం.మున్షీ (శ్రీ పెండ్యాల వామన రావు), ‘భారతదేశ ఆర్థిక వ్యవస్థలో హైదరాబాద్ సమీకరణ’ (శ్రీ లక్ష్మీనారాయణ గుప్త), ‘రచనా స్వాతంత్య్రానికై అసువులర్పించిన అమరజీవి- షోయీబుల్లా ఖాన్’ (శ్రీ పులిగడ్డ సుబ్బారాయుడు), ‘హైదరాబాద్‌పై భారత ప్రభుత్వ పోలీసు చర్య’ (వ్యాసకర్త పేరు లేదు) ఇతర రచనలకు చోటు కల్పించారు.
గోలకొండ ముఖచిత్రంతో, లోపలి పేజీలలో ఆ చారిత్రక ఘట్టానికి సంబంధించిన చిత్రాలు, కొందరు వ్యక్తుల చిత్రాలను కూడా అందించారు.
ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు కాశీనాథుని నాగేశ్వరరావు. ఆయన గాంధేయ వాది. జాతీయవాది. స్వాతంత్య్రోద్యమంలో అగ్రభాగాన నిలిచినవారు. తన పత్రికను స్వరాజ్యోద్యమానికి అంకితం చేశారని అనుకున్నా అతిశయోక్తి కాదు. కాబట్టి ఆ పత్రిక వెలువరించిన ‘విముక్తి ప్రత్యేక సంచికను, అందులోని అంశాన్ని ఆ కోణం నుంచి చూడాలి. ఆ వాస్తవమే, ఆ దృష్టి కోణమే ఆ సంచికకు రూపు రేఖలు ఇచ్చి ఉంటుందంటే సత్యదూరం కూడా కాదు. కొన్ని వ్యాసాలతో ఉన్న ప్రత్యేక సంచిక మొత్తం విముక్తి పోరాట చరిత్రకు అద్దం పట్టేది కాదు. అయినా ఇలాంటి ప్రయత్నం హర్షణీయం. 1980 దశకం వరకు కూడా నిజాం విముక్తి పోరాటానికి సంబంధించిన సమగ్ర గ్రంథం వెలువడలేదన్న వాదన కూడా ఉన్నది. ఆ నేపథ్యంలో చూసినా ఈ ప్రత్యేక సంచికకు కొన్ని పరిధులు తప్పవనే భావించాలి.
ఆంధ్రపత్రిక ప్రత్యేక సంచిక అందించిన సంపాదకీయ ‘చారిత్రక దినం’ 1946 తరువాతి పరిస్థితుల మీద చేసిన బలమైన వ్యాఖ్యానం. ‘భారత ప్రభుత్వము అతి సౌమ్యముగా, అతి ఉదారముగా, స్నేహభావమున జరిపిన రాయబాములన్నియూ విఫలమాయెను. చివరకు భారత ప్రభుత్వమునకు దండోపాయమే శరణ్యమైనది. హైదరాబాదు విషమ పరిస్థితులను వేయికళ్లతో కనిపెట్టి వున్నామనియు, ఆ అదను వచ్చిన వెంటనే స్థితిగతులు పరిపక్వము కాగానే తగిన ‘శస్త్ర చికిత్స’ చేసెదమనియు పలుమార్లు అభయహస్తమిచ్చిన భారత ప్రధాని నెహ్రూ, ఉపప్రధాని సర్దార్ పటేల్ ప్రభృతులు ‘పోలీసు చర్య’ ద్వారా తమ వాగ్దానమును చెల్లించి, ప్రజల కృతజ్ఞతకు పాత్రులైరి,’ అని వ్యాఖ్యానించింది ఈ సంపాదకీయం. ఆపరేషన్ పోలో పూర్తయిన తరువాత సంవత్సరం పాటు మిలటరీ ప్రభుత్వం కొన్ని సంస్కరణలు తెచ్చిన సంగతిని కూడా ఈ సంపాదకీయం ప్రస్తావించింది.
‘హైదరాబాద్‌లోమ ప్రస్తుత పరిస్థితి’ అన్న వ్యాసంలో కొన్ని అంశాలు వాస్తవికతకు దూరంగానే ఉన్నాయి. అక్కడ ఉత్పన్నమైన మత విద్వేషాలు ఇటీవలివే అని అభిప్రాయపడడం వాస్తవానికి విరుద్ధమే. అదే నిజమైతే అంత పెద్ద పోరాటం ఎందుకు జరిగింది? కానీ నైజాం చేసిన గాయం భవిష్యత్తులో కూడా ఇరువర్గాల ప్రజలను వైషమ్యాల మధ్య మనుగడ సాగించకుండా జాగ్రత్త పడ డానికి ఈ లేపనం పూసి ఉండవచ్చు. ఇది తప్పుకాదు. హైదరాబాద్ రాష్ట్ర సహజవనరులు, ఆర్థిక పరిస్థితి గురించి మందుముల నరసింగరావు తన వ్యాసంలో చర్చించారు. ఇక్కడి పంటలు, మానేరు, తుంగభద్ర, కృష్ణ నదుల మీద నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల గురించి ఈ చిన్న వ్యాసంలో ఆయన చర్చించారు.
నిజాం సంస్థానంలో చైతన్యం, అది ఉద్యమ రూపం దాల్చడం గొప్ప పరిణామ క్రమం. అందులో సాంఘిక, మత, విద్యా విషయాలు తమ వంతు పాత్ర వహించాయి. ఆర్య సమాజ్, గ్రంథాల యోద్యమం వంటివీ ఉన్నాయి. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కూడా పనిచేశాయి. కానీ తెలంగాణ పోరాటమంతా తమ సొంతమన్నట్టు కమ్యూనిస్టులు ఈనాటికీ చెప్పుకుంటారు. అందులోని వాస్తవం ఎంతో బూర్గుల రామకృష్ణరావు తన వ్యాసం ‘సంస్థానంలో కమ్యూనిజం స్వరూపం’ తొలి వాక్యాల లోనే తేల్చేశారు. ‘అప్పుడప్పుడూ హైదరాబాద్ కమ్యూనిస్టు సమస్యకూ, ఆ సమస్యా పరిణామం, తీవ్రతకు పోలిక లేనట్టి అతిశయోక్తికరమైనట్టి ప్రాముఖ్యత ఇవ్వబడుతోంది. తెలంగాణంలో కమ్యూనిస్టులు పోలీసు చర్యకు పూర్వం చేసినట్టి, తర్వాత చేస్తున్నట్టి చర్యలకు బోలెడు ప్రచారం లభించింది. ఈ ప్రచారానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యమయినది ప్రచారం చేసుకోవటంలో వారికిగల నిపుణత్వమే,’ అన్నారాయన. బూర్గుల అభిప్రా యంలో ఆంధ్ర మహాసభను తమ ఆధిపత్యంలోకి ‘లాక్కొని’, ‘విచ్ఛిన్నం’ చేశారు కమ్యూనిస్టులు. కొందరు రచయితలు రజాకారులు చేసిన అత్యాచా రాల కంటే యూనియన్ సైన్యం చేసిన అరాచకాలే తీవ్రమైనవని వాదిస్తారు. ఈ వితండవాదంలో కమ్యూనిస్టుల దుందుడుకు చర్యలు మరుగున పడవేసే ప్రయత్నం జరిగింది. ‘తెలంగాణలో కమ్యూనిస్టుల చరిత్రను క్లుప్తంగా చెప్పివేయవచ్చు. ముందుగా వారి దౌర్జన్య కార్యక్రమం జనగామ తాలూకా (నల్గొండ జిల్లా)లో ఆరంభమయ్యాయి. ఆ తాలూకా ప్రజల్ని పీడించడంలో ఆరితేరిన విస్నూరు రామచంద్రారెడ్డి అనే ఒక చిన్న భూస్వామికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు చర్యలారంభించారు. ఈ చర్యల ఫలితంగా కమ్యూని స్టులకు, భూస్వామిక తత్వ్తాన్నెదొర్కోగలిగే నాయకులని, పీడిత రైతుల పాలిట రక్షకులని పేరు ప్రతిష్ట లభించి, బీదల సానుభూతి సహకారాలు కూడా లభించాయి. పోలీసు, రెవెన్యూ అధికారులు అవినీతిని వదిలి పేదరైతుల స్థితి గతుల్ని సకాలంలో సక్రమంగా విచారించినట్టయితే కమ్యూనిస్టులకు నిలవనీడ ఉండేది కాదు’ అన్నారు బూర్గుల.
కేంద్రం కేఎం మున్షిని నిజాంలో ఏజెంట్ జనరల్‌గా నియమించింది. ఈయన ఘనతను వివరించే వ్యాసం ‘హైదరాబాదులో శ్రీ కె.యం. మున్షి.’ బొలారం రెసిడెన్సీలో మొదటిగా జనవరి 5,1948న భారత పతాకం ఎగురవేసిన వారు మున్షియేనన్న సంగతి ఈ వ్యాసంలో వామనరావు గుర్తు చేశారు. ఏజెంట్ జనరల్‌గా ఆయన పదవి నల్లేరు మీద నడకలా మాత్రం సాగలేదు. ‘చివరకు మున్షీని హత్య చేయటానికి కూడా ప్రయత్నాలు ప్రారంభమైనట్టు నమ్మకంగా తెలియసాగింది’ అంటారు వ్యాసకర్త. వ్యాసం చివరి పేరా చదివితే పోలీసు చర్య కోసం వస్తున్న సైన్యానికీ, నిజాం సేనకీ మధ్య మరింత ఘర్షణ జరగకుండా నిరోధించినవారు మున్షీయేనని అర్ధమవుతుంది.
‘సెప్టెంబర్ 16 తారీకు రాత్రికి అసలు ఈ పోలీసు చర్య వైనమేమో తెలుసుకోవాలిని నైజాంకు కోర్కె పుట్టింది. మున్షిని పిలిచి సలహా అడగక తప్పలేదు. రెండు మూడురోజుల్లో భారత సైన్యాలు హైదరాబాదులో ప్రవేశించి నట్లయితే, చాలా దారుణ చర్యలు జరిగేవి. కానీ మున్షీ చతురత వల్ల హైదరాబాదు ప్రజల ప్రాణాలూ, భారత ప్రభుత్వ గౌరవమూ దక్కాయి. నైజాం, తాను లొంగిపోయినట్టు ఒప్పుకుని భారత సైన్యాలను ఆహ్వానించడానికి తయారైనాడు. మున్షీ తన సహజ ఔదార్యంతో నైజాంకు దారి చూపి పోలీసు చర్యకు దారుణ ఫలితాలేవీ సంభవించకుండా జాగ్రత్త వహించాడు. హైదరాబాదుకు కష్టకాలంలో ఆయనకు మిత్రుడిలా సాయపడ్డాడు.’ అని పేర్కొన్నారు వామనరావు.
‘ఒక చిన్నవర్గం హైదరాబాద్‌ను భారతదేశం నుంచి రాజకీయంగానూ, ఆర్థికంగానూ విడగొట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ హైదరాబాద్ సమస్యలెప్పుడూ భారతదేశ సమస్యల్తోనే ముడిపడి ఉన్నాయి’ అన్నారు ‘భారత ఆర్థిక వ్యవస్థలో హైదరాబాద్ సమీకరణ’ వ్యాసకర్త లక్ష్మీనారాయణ గుప్త. అలాగే ‘ఆర్థికశాస్త్రం తెలిసినవారికి హైదరాబాద్‌కెన్నడూ స్వతంత్ర ద్రవ్య చలామణి లేనేలేదని తెలిసిన విషయమే.’ అన్నారాయన.
‘ఆధునిక నాగరికయుగంలో రచనా స్వాతంత్య్రం కోసం తన జీవితాన్ని అర్పించి చరిత్రలో అమర స్థానాన్ని పొందాడు పత్రికా రచయిత షోయీబుల్లాఖాన్’ అంటూ ఘనంగా నివాళి ఘటిస్తూ సాగిన వ్యాసం ‘రచనా స్వాతంత్య్రానికై అసువులర్పించిన అమరజీవి’. ఒక ఘననివాళి అర్పిస్తూ రాసిన వ్యాసమిది. ఖాన్ జీవిత విశేషాలు, నిజాం మీద పోరాటంతో ఎదుర్కొన్న ఇక్కట్లు, ఇమ్‌రోజ్ పత్రిక నిర్వహణ, ఆఖరికి రజాకారుల చేతిలో మరణించడం ఇవన్నీ ఇందులో సవివరంగా వర్ణించారు.
ఆఖరి వ్యాసం ‘హైదరాబాద్‌పై భారత ప్రభుత్వ పోలీసు చర్య’. ఆపరేషన్ పోలో పేరుతో ప్రసిద్ధిగాంచిన ఈ చర్య పూర్వాపరాలను మొదటి పేరాలలో వర్ణించి, తరువాత అచ్చంగా ఇలాగే పూర్వం జరిగిన మరొక చారిత్రక ఘట్టం గురించి కూడా ఈ వ్యాసంలో గుర్తు చేశారు. ఆనాటి చారిత్రక ఘట్టం కూడా 1948 నాటి విమోచన ఘట్టం మాదిరిగానే సెప్టెంబర్ 13ననే ఆరంభం కావడం విశేషం. ‘సెప్టెంబర్ 13 అనడంతోనే వెనుకటి చరిత్ర జ్ఞాపకం రాక తప్పదు. 1727 సెప్టెంబర్ 13న ఇట్టి సంఘటనే జరిగింది. అదీ నిజాం గర్వభంగానికి సంబంధించినదే. మహారాష్ట్ర వీరుడు పీష్వా బాలాజీరావు ఇల్లాగే అప్పటి నిజాం నవాబు అధికార దురహంకారాన్ని అణచివేయడానికి ఆ రోజున హైదరాబాదు సంస్థానంపై దండయాత్ర ప్రారంభించాడు. ఆ నిజాం దాసోహం అని దాసుని తప్పు దండంతో సరి అని దణ్ణం పెట్టి ప్రాణాలు కాపాడుకున్నాడు.’ ఆఖరి నిజాం మీద జరిగిన దండయాత్రలో గూర్ఖాలు, సిక్కులు, మద్రాసు, సెంట్రల్ ప్రావిన్స్, బొంబాయి పోలీసులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక సంచికతో అర్ధం చేసుకోవలసినది- నిజాం పాలనలో హైదరాబాద్ సోదరులు పడిన కష్టాల పట్ల అందరికీ సానుభూతి ఉంది. సంస్థానం భారత యూనియన్‌లో కలవడం పట్ల ఆనందం కూడా ఉంది.
‘వీర తెలంగాణా- నా అనుభవాలు జ్ఞాపకాలు (రావి నారాయణరెడ్డి), ‘నా మాటే తుపాకీ తూటా’ (మల్లు స్వరాజ్యం), తెలంగాణ ప్రజా పోరాటం-పాఠాలు (పుచ్చలపల్లి సుందరయ్య), ‘ఎర్రజెండాలు’ (గంగినేని వెంకటేశ్వరరావు) వంటి పుస్తకాలు వచ్చినా ఒక పార్శ్వానికి పరిమితమైన పుస్తకాలే. నిజాం నవాబు సంపద మీద ఈ వ్యాసకర్త (డాక్టర్ రాజారెడ్డి), తెలంగాణ ఆంధ్ర మహాసభ, మరికొన్ని అంశాల మీద కుర్రా జితేంద్రబాబు వెలువరించిన పుస్తకాలు కూడా పూర్తి చిత్రాన్ని ఇచ్చేవి కావు. తెలంగాణ సాయుధ పోరాటం నాటికి ఐక్యంగా ఉన్న కమ్యూనిస్టులు తరువాత వేర్వేరు శిబిరాలలోకి వెళ్లారు. వాళ్ల అభిప్రాయాలు మారాయి.
కమ్యూనిస్టులే కీలకంగా ఉన్నారని చెప్పుకునే చరిత్రను అక్షరబద్ధం చేయడం దగ్గర కూడా అవి ప్రతిఫలిం చాయి.తెలంగాణ చరిత్ర సమగ్ర చిత్రం అందకపోవడానికి ఇదీ ఒక కారణమే. అయితే అది గతం. నిజాం విముక్తి పోరాటం 75 ఏళ్ల సందర్భంగా అయినా, తెలంగాణ పేరుతో, తెలంగాణ ఆత్మ గౌరవం పేరుతో అధికారంలోకి వచ్చిన రాజకీయ పక్షం, ఆ పార్టీ ప్రభుత్వం కొన్ని సంపుటాలుగా ఆ సమగ్ర చరిత్రను జనానికి అందించే ప్రయత్నం చేయకపోవడం విచిత్రమే.