సెప్టెంబర్ 10 విశ్వనాథ జయంతి
వేయిపడగలలో అంతరార్థమేమిటి? ఒక గ్రంథమేయుద్దేశ్యముతో వ్రాయబడుతుందో అదే దాని అంతరార్థం. ఆ ఉద్దేశం కనుక్కోవటము యెట్టా గా! అసలు మొదట కవి నేర్పుకలవాడైతే తన యుద్దే శాన్ని తన కావ్యంలో సువ్యక్తం చేస్తాడు. సువ్యక్తం చేయటమంటే వాచ్యంగా చెప్పటం కాదు. వాచ్యంగా చెబితే యది యుత్తమ కావ్యమే కాదు. నేర్పుగల పాఠకుఁడు జాగ్రత్తగా ఊహిస్తే యది అతనికి తెలిపేట్టు వ్రాస్తాడు. పూర్వం నుంచి మనదేశంలో నేర్పు గల కవి తన ప్రధానోద్దేశాన్ని కావ్యంలో యేర్ప రచేందుకు కొన్ని మార్గాలు వున్నై. వాటికి పారి భాషికంగా లింగములన్నారు. కావ్యము దేనితో ఉపక్రమిస్తున్నాఁడు అంటే మొదలు పెడుతున్నాడు. దేనితో ఉపసంహరిస్తున్నాడు. అంటే కావ్యం చివఱ దేనిని చెప్పాడు? సామాన్యంగా నేర్పరియైన రచయిత కావ్యానికి మొదటా చివరా కావ్యంలో తాను చెప్పదలచికొన్న అంతరార్థాన్ని నిక్షేపిస్తాడు. దానిని బట్టే ప్రధానంగా ఆ కావ్యంలో ఉన్న అర్థం తెలు స్తుంది. ఇట్లా మొదటా చివరా నిర్దేశించిన వాటిని బట్టి కావ్యార్థము కొంత తెలుస్తుంది. మఱిన్నీ యీ విషయాన్నే తనకావ్యంలో బహుస్థలాల్లో చెబుతూ వుంటాడు. ఇవి మూడు ప్రధానంగా కావ్యం యొక్క అంతరార్థాన్ని తెలియజేస్తాయి. నేర్పు లేని కవి యిల్లా చేసుకోలేడు. దేనితోనో మొదలు పెడతాడు. మఱేదో చివరికి తేలుస్తాడు. మధ్య అతని యిష్టము వచ్చినట్లు వ్రాస్తాడు. దీనినే మృచ్ఛకటికంలో శూద్రక మహారాజు విదూషకుని చేత ఆక్షేపింపచేశాడు. యేమనంటే – కుకవి కావ్యము వలె బీజంలో ఒకటి నిర్వ హణములో ఒకటియని. కావ్య ప్రయోజనం సరే. ఒక్కొక్కప్పుడీ ప్రయోజనం
యింకొక దాని మీద ఆరోపితమై యుంటుంది. ఇంచుమించుగా ఒక రూపకాలం కారమల్లే వుంటుంది. అచ్చంగా రూపక మైతే తెలుస్తుంది. ఏక దేశ రూపక మైతే మఱికొంచెం కష్టమవుతుంది. ఇల్లా కాకుండా కొన్నిచోట్ల వ్యాజంగా ఉంటుంది. అప్పుడు సామాన్య పాఠకునికి అందదు. ఈ లక్షణాలన్నీ వేయిపడగలలో ఉండటం మూలంగా కొందఱికి చప్పున అవగతం కాకపోవటంలో దోషమేమిన్నీ లేదు. తక్కినవన్నీ యెలా వున్నా యిందులో పసరిక అన్న పాత్ర కొంత మందికి అర్థం కావటం కష్టం కలిగిం చింది. కవి యెప్పుడూ ఆలోచిస్తే అర్థమయ్యేట్లే వ్రాస్తాడు. ఇందులో రామేశ్వరశాస్త్రి నాలుగు వివాహాలు చేసు కొన్నాడు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర కన్యలను. ఇది సాంకేతిక మైన విషయము. యదార్థ విషయము కాదు. శాస్త్రమంగీక రించిన విషయమైనా కవి దానిని ఉద్దేశింపలేదు. ఈ గ్రంథంలో ప్రతిచోటా ధర్మమును గుఱించే చెప్పబడుతూ వచ్చింది. పుస్తకము పేరే వేయిపడగలు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యా దేవత. ఈ తెలుగు దేశంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పాముగా ఆరా ధిస్తారు. ఆయన ఆదిశేషువు. ఆదిశేషువునకు వేయిపడగలున్నై. ఆ వేయిపడగల మీద భూమిని వహిస్తున్నాడని మన పురాణములు చెబుతున్నై. భూమిని సుబ్రహ్మణ్యే శ్వరుడు మోస్తున్నాడన్న మాట పౌరాణికమైన మాట గాని ఖగోళ విషయం కాదు. అనగా సహస్ర ముఖంగా ధర్మం ఉంటుంది. ఆ ధర్మము చేత భూమి పాలించబడుతుంది అన్న యర్థమే. సర్వత్రా ధర్మమే వుంటే అది సహస్ర ముఖంగా వున్నదని చెబుతాం. అది వేయిపడగలు. సుబ్బన్నపేట యొక్క గ్రామాధికారి నాల్గు పడగల పామును చూస్తాడు, అది చాతుర్వర్ణ్వ ధర్మము. అరుంధతికి రెండు పడగలు కనిపిస్తాయి. అది దాంపత్య ధర్మము. చివఱికి ఒక పడగే కనిపిస్తుంది. అది అంతా కలిపి ఏకరూపమైన ధర్మము. ఈ విషయం జాగ్రత్తగా చదివే పాఠకుడికి కావ్యం మొత్తం మీద తెలుస్తుంది. రామేశ్వరశాస్త్రి నాలుగు వర్ణములలో నుండి వివాహం చేసుకొన్నాడంటే యిదంతా వట్టి సాంకేతికము, ఈ దేశంలో ప్రధాన మతము వేద మతము. వేదాలు నాలుగు, వర్ణాలు నాలుగు. వర్ణాలు వేదధర్మాన్ని అనుసరించేవే కదా. అనాదిలో సంఘాన్ని పూర్వ ఋషులు నిర్మించినపుడు వేదమును రక్షించేందుకు బ్రాహ్మణుని నియ మించారు. అన్ని వర్ణాల యందు అతడు వేద ధర్మాన్ని రక్షించాలి. అనగా అన్ని వర్ణాలవారు తమతమ వర్గానుకూలంగా తమ ఆధారాల ప్రకారం తమ విధులననుసరించి వేదధర్మాన్ని పాలిస్తే సంఘము సువ్యవస్థితంగా వుంటుంది. ధర్మం సహస్రముఖంగా వర్థిల్లుతుంది. వేయిపడగలు భద్రంగా ఉంటాయి. ఇందులో వున్న సుబ్బన్నపేట ఒక్క యూరు కాదు. దేశానికంతటికీ అది చిహ్నము. జమీందారు కాదు. చాలామంది యిందులో వున్న జమిందారీ జమీం దారియని అది జమీందారీ విధానాన్ని సముద్ధరిస్తున్న పుస్తకమనీ అనుకోటం జరిగింది. ఇక్కడ జమీందారు రాజస్థానీయుడు. రాజనగా ఒక్క వ్యక్తే రాజు కాదు. దేశాన్ని పాలించే వాళ్ళందరూ కలసి ఒక రాజు. ఒకరాజు రాజ్యం చేసినప్పుడు కూడా ఆ రాజు ఒక్కడే చేయలేడు. దేశం మొత్తం మీద కొన్ని వేలమంది రాజుననుసరించేవారు ఉంటే, వాళ్ళ ద్వారా రాజు పాలించాడు. వేయి వ్యవహారాలలోను యితరుల చేత తెగతెంపులు కాని ఒక వ్యవహారం వుంటే దానిని రాజు తీర్చేవాడేమోకాని తక్కినవన్నీ రాజాధికారులే చేసేవారు. ఒక నియందనుగ్రహముంటే ఆ రాజు వానిని శిక్షించటం మానివేయవచ్చు, ప్రజాస్వామి కంలో కూడా రాష్ట్రాధ్యక్షుడు నూటికి కోటికి అట్టి క్షమాపణ చేయటం వున్నది. ఒకరాజు పాలించట మని కొందరు పాలించటమని ప్రజలే పాలించు కోటమనీ యివన్నీ వేర్లేకాని యదార్థానికి అన్ని దేశాలూ యెపుడూ చాలా కొంచెం భేదాలతో ఒకటే మోస్తరుగా పాలించబడుతూ వుంటవి. కనుక యిక్కడ జమీందారంటే పాలకవర్గము అని యర్థము. విజాతీయమైన భావాలకి లొంగిపోయి సంప్ర దాయము స్వజాతి లక్షణం మఱచిపోయిన పాలక వర్గం యిక్కడ జమీందారు చేత ఉద్దేశింపబడినది. జమీందారు రంగారావు కొడుకు హరప్ప జమీందారే కాని అతనియందు ధర్మము సురక్షితమైందని చెప్ప బడినది. ఎందుచేతనంటే అతడు దైవభక్తుడు. విద్య లను రక్షిద్దామనేవాడు. దేశం యొక్క సంప్ర దాయము లందభిమానం కలవాడు. సాధువు; నియమ వంతుడు. తన డబ్బు తీసికెళ్ళి గుఱ్రపు పందాలమీద బెట్టడు. పోయి మద్రాసులో మకాము వేయఁడు. గుర్రపు పందాలంటే గుర్రపు పందాలు కావు, విజా తీయ సంస్కృతి వ్యామోహానికది చిహ్నం. మదరా సంటే మదరాసు కాదు. అనాదినుంచీ యీ దేశం గ్రామనాగరికత కలది. మదరాసు పట్టణ నాగరికతకు చిహ్నము. లక్షలాది పల్లెటూళ్ళు ప్రధాన వృత్తి వ్యవ సాయము కల యీ దేశము ప్రధానంగా పరిశ్రమలు కల దేశాల యొక్క నాగరికత నవలం బించి చెడి పోతున్నదని తాత్పర్యము. అధికారులకు ప్రజలకు సంబంధంలేదు. ధనవంతులూ అధి కారులూ రాజ్యం చేస్తున్నారు. ఈ విషయం ఈ కావ్యంలో నిందింప బడింది. ధర్మారావు పేదవాడు. చదువుకొన్నవాడు. సాధువు. పూర్వ సంప్రదాయము లందిష్టము కలవాడు. అనగా ఆ భావములకు ప్రతినిధి. కావ్యము నందున్న వ్యక్తి సామాన్యంగా ఆ వ్యక్తి కాదు. ఆతడే భావాలకి ఆధారభూతుడవుతాడో ఆ భావాలకు లక్ష్యభూతుడుగా అనుకోవాలి.
కావ్యాలు సామాన్యంగా రెండు విధాలు. మొదటిది రసప్రధానమైన కావ్యము. రెండవది భావ ప్రధానమైన కావ్యము. రసప్రధానమైన కావ్యములో అక్కడక్కడ భావప్రధానమైన భాగాలుండవచ్చు. భావప్రధానమైన కావ్యంలో కూడా చాలచోట్ల రససాక్షాత్కారం కావచ్చు. ఇక్కడ భావమంటే ఒక ధర్మమని అర్థం. కావ్యంలో చెప్పబడే భావం కాదు. ఒక ధర్మాన్ని ప్రధానంగా బోధించేందుకోసం ఒక కావ్యం వ్రాయబడుతుంది. ఆ కావ్యంలో వున్న పాత్రలు ఒకానొక ధర్మానికి సాంకేతిక పురుషులుగా ఉంటారు. ఈ పేదవాడైన ధర్మారావు, సంప్రదాయ సిద్ధమైన విద్యాసంస్కృతుల యందు అభిమానం కలిగిన ధర్మారావు జమీందారు చేత తక్కిన సంఘం చేత యెల్లా నిరాదరింపబడ్డాడో యీ కావ్యంలో ప్రధా నంగా కనిపిస్తూ వుంటుంది. అనగా పాలక వర్గం, ధనికులు సంప్రదాయాన్ని, దేశీయ పాండిత్యాన్ని, దేశీయమైన సంస్కారాన్ని నిరాద రిస్తున్నారని దీని తాత్పర్యము.
సుబ్బన్నపేట యీ దేశానికంతటికీ లక్ష్య భూత మైన గ్రామంగా చెప్పబడింది. అందుకనే ఆ వూరు పేరు సుబ్బన్నపేట. సుబ్రహ్మణ్య శబ్దానికి సుబ్బన్న వికృతి. సుబ్రహ్మణ్వేశ్వరుడు వేయిపడగల స్వామి, వేయి ముఖాలయిన ధర్మానికి చిహ్నం. వేయి ముఖా లుగా ధర్మం పరిపాలింపబడ్డ యీ దేశము సుబ్బన్న పేటగా చెప్పబడింది. అంతేకాని ఒక ఊరుకాదు. ఇది ఒక జమీందారీ కాదు. ఈ సుబ్బన్నపేట మొదలు పెట్టడానికి ఒక ఆవూ, ఒక పాము ఆ ఆవుపాలు త్రాగుతూండటంతో మొదలైన కథ ఉంది. ఇలాంటి కథలు యీ దేశంలో అనేకచోట్ల ఉన్నై. కొంచెం మార్పులతో వుంటవి. అందుచేత దేశం యొక్క స్వరూపం చెప్పటం ఏమిటయ్యా. యీ దేశము యొక్క స్వరూపం అంటే యీ దేశము యొక్క సంస్కారం యొక్క పునాది అది. ఆధిదైవికము అన్న విషయము. అంతేగాని యిది నిజంగా పాము కాదు పాము పడగలూ కాదు. ఒకానొక పండితుడు యీ పుస్తకంలో పడగలూ లేవు పామూ లేదు అన్నాడట. చమత్కారంగా అన్నాడు నిజమే. ఉన్నది ధర్మము, సంప్రదాయము, భారత జాతి యొక్క సంస్కారము. ఇందులో రంగరాజమ్మ క్షత్రియ స్త్రీ. ఆమె రామేశ్వర శాస్త్రి యొక్క భార్య, మహా పతివ్రత. రసజ్ఞురాలు, జీవితము ననుభవించు వైభవము నెఱిఁగిన మనిషి, ఆమె వేదధర్మముననుష్టించుచు లోకము ననుభ వించిన క్షత్రియులకు చిహ్నము. ఆమె చనిపోవుచు రామేశ్వరశాస్త్రినే భావించెను. ఈ దేశమునందు క్షత్రియులు అనగా రాజ్యమును పాలించెడివారు. వారు కులము చేత క్షత్రియులు కానక్కరలేదు. ఈ దేశము యొక్క సంప్రదాయము వేదధర్మమూ పాలించుచూ, భావించుచూ పూర్వము నుండిరని దీని యర్థము. ఊరికే యొక పతివ్రత జీవిత కత వలె కనిపించును. ఈ కావ్యము నందు ప్రధానముగా సహస్రముఖమైన వేద ధర్మము ప్రతిపాదింపబడెనని తెలుసుకోవటం జరిగితే, ఈ గ్రంథంలో వున్న తక్కిన సర్వ విషయాలూ యిల్లా సువ్యక్తమౌతవి. ప్రధానంగా పసిరిక ఒకడు కనిపిస్తున్నాడు. ఇతడు మంగమ్మ బిడ్డ. చూస్తే పామల్లే వుంటాడు. ఈలలు వేస్తాడు. గాలిలో తేలిపోతాడు. రామేశ్వరశాస్త్రి చాతుర్వర్ణ్యానికి చిహ్నము అయితే, పసిరిక వ్యవసాయానికి చిహ్నం కదా. అయితే కావ్యంలో ఇలాంటి విషయాలు అంత అధునాతన నాగరికతా కాలంలో కూడా పత్రికలలో పడుతూనే వున్నవి… జరుగుతూనే వున్నవి. అందులో ఆశ్చర్యం లేదు కాని, ప్రధానంగా పసిరిక కృషికి చిహ్నం. అది అచ్చమైన పంచభూతముల బహిః ప్రకృతి మీద ఆధారపడి వున్నది. వాన కురవాలి, గాలి వీచాలి, ఎండలు కాయాలి, పంటలు పండాలి, పాములూ పిట్టలూ యధేచ్ఛంగా సంచరించాలి. ఇది వ్యవసాయం యొక్క స్వరూపం. ఇదంతా ఒక మనుష్యుని ఆకారంగా చేసి, వాణ్ణి పసిరిక అన్నాము, ఇంతే భేదము, ఈ వ్యవసాయము రెండు రకాలు. పండించే పొలం వాన ఆధారంతో పండితే దాన్ని దేవమాతృకలంటారు. ఆనకట్టలు కట్టి కాల్వలు తవ్వి పండిస్తే దానిని అదేవమాతృకలంటారు. భారవి తన కిరాతార్జునీయంలో దుర్యోధనుడు అదేవ మాతృకల క్రింద పంటలు పండించి ప్రజలను తన వశం చేసుకొన్నాడని వ్రాయ బడింది. ఇతరుల రాజ్యంకాజేసిన రాజు ప్రజలను వశంచేసుకొనేందుకు ఆదేవ మాతృకలను వృద్ధి చేస్తాడు. బాహుళ్యం మీద అదే చేస్తాడు. జనులందరు వానికి వశులవుతారు. ఈ శబ్దాలలో దేవుడన్న మాటకు మేఘుడని అర్థం. పల్లపుటూళ్ల పంటలవారు బోలెడంత విశ్రాంతి కలవాళ్లు. తేలికగా పండుతూ వుంటే బోలెడంత విశ్రాంతి వుంటే ధర్మాన్ని పాడుచేస్తారు. మూడువందల అరవై రోజులు పొలంలో పాటుపడ వలసినవాడు రాజకీయ, మత, సాంఘికాభి ప్రాయములమీదకు దండెత్తేందుకు వాడికి విశ్రాంతియేది? అటువంటప్పుడు ధర్మం ఆజ్ఞుల చేత పాలింపబడవలసి వస్తుంది. అందుకని పసిరిక గ్రామాధికారి చేతిన వున్న గడి యారం, ఫౌంటేను పెన్, చొక్కా, మొదలయినవి పెట్టుకొని వెళ్లే టప్పటికి పాము లతణ్ణి కరచినవి. ఈ రెండు నాగరికతలు అంత భిన్నములు. రెండూ రెండుగా రక్షింపబడితేనే ధర్మం రక్షింపబడుతుంది అని అర్థము. ఒక వృత్తిని మనుష్యుల యొక్క కామక్రోధాలు యెలా పాడుచేస్తాయో దేవదాసి చేత సూచితమైనది. అన్ని సిద్ధాంతాలు మొట్టమొదట మంచివే, మనుష్యుల కామ క్రోధాదుల చేత కాలము మీద వాటి లక్ష్యాలు చెడతవి. దానికి ప్రథమోదాహరణ దేవదాసి వృత్తి. ఈ అర్థాన్ని చెప్పేందుకు గిరిక సృష్టించబడ్డది. ఎంత క్రొత్త సిద్ధాంతమైనా అంతే. ప్రజాస్వామికము మంచిదే. ఆచరణలో యెంత దోషభూ యిష్టంవున్నది. అట్లాగే హిందూ ధర్మమున్నూ. అనాదిలో సర్వజగత్తు యొక్క క్షేమంతో సంప్రతిష్టింపబడ్డ ధర్మం. మానవునకు అధికార వాంఛ,స్వార్థము, పుట్టుకతో వున్నవి. సర్వధర్మాన్ని నాశనం చేస్తాడు. స్వార్థపరుల చేత యీ రీతిగా నాశనం చేయబడ్డ ధర్మాన్ని మరికొందరు స్వార్థపరులు అసలా ధర్మం యొక్క మూల స్వరూపమే చెడ్డదియని చెప్పి, తన స్వార్థానికి ఉపయోగపడే అధర్మాన్ని ధర్మంగా ప్రతిష్టిస్తారు. ఇది లోకవృత్తము. ఈ విషయం దేవదాసి కథలోని వ్యంగ్యము.
ఈ రీతిగా ఈ కావ్యంలో వున్న బహు విషయాలు స్వజాతికి సంబంధించిన, భారతీయ సంస్కృతికి సంబంధించిన, వేద ధర్మమునకు సంబంధించిన బహు విషయాలల్లో ఉండే గుణాలను చూపించి యెల్లా దుర్వ్యాఖ్యానం చేయబడ్డవో నిరూపించటానికి వ్రాయబడ్డది. అందుకనే కావ్యం చివర ఆహా! ఏమి కాలము! యేమి మార్పు అని 865 (865)వ పేజీలో ప్రారంభింపఁబడి రుక్మిణమ్మా రావుగారు, కేశవరావుగారు, దేవదాసి, గణాచారి అందరు పోయినారని వ్రాయబడి వున్నది. వారెవరెవ్వరు దేనికి దేనికి చిహ్నములో అక్కడే వ్రాయబడి వున్నది. ఆ చివరి రెండు పుటలు చదివినచో వేయిపడగల యంతరార్థము తెలియును. అంతయు సూచనగా నిచ్చటనేయున్నది. ఈ రీతిగా సహస్రముఖ ధర్మము నాశనమైనదని ఆహా యింకనేమి మిగిలినది, యేమి మిగిలినది అన్న యావేదన చేత చెప్పబడి చివరకు ధర్మారావరుంధతిని చూచి యిట్లన్నాడు ఔను, నీవు మిగిలితివి, ఇది నా జాతి శక్తి – నా యదృష్టము అని. అనగా ఈ దేశమునందు సర్వధర్మము నశించవచ్చును – కాని, దాంపత్య ధర్మము, పాతివ్రత్యము యెన్ని బిల్లులు పెట్టినను పోదని తాత్పర్యము. వట్టి లౌకికమైనది, వట్టి వికారమైనది యైన బుద్ధిగల యొకాయన ఈ కావ్యము చదివియున్నారు గదా ధర్మారావునకు రెండవ యరుంధతిని పెండ్లి చేయించుటను గూర్చి చివరకు సంకర వివాహము చేయింతివేమి యన్నాడు. కొందరి బుద్ధిలో అది పెండ్లి కానిచో, స్త్రీ పురుషుల మధ్య వయస్తారతమ్యము ప్రేమ క్రింద గొప్ప చేయఁబడి వివాహమన్నచో తప్పుగా పరిగణింపబడుచున్నది. ఇది యాధునికుల నాగరికతా సంపత్తి. ధర్మము యొక్క స్వరూపము తెలియకపోయినచో, నీ కావ్య మర్మమర్థము కాదు- యదభి ముఖముగఁ జెప్పిరో యల్లదాని తదభిముఖముఁగ జూచిన ధర్మ మొప్పు నప ముఖమ్ముగ జూచిన నఖిల దోష కలితముగదోచు ధర్మసంఘాతమెల్ల.
18.3.1955 జాగృతి వారపత్రిక