ఈ క్షణం 140 కోట్ల మంది భారతీయుల గుండె చప్పుళ్లను విన్నది. నిజమే ఈ క్షణం కోసమే ఇన్నేళ్లుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలే కాదు, భారత్ మొత్తం అక్షరాలా కన్నార్పకుండా చూసింది. చంద్రుడిని అందుకోవడానికి అన్ని శక్తి సామర్ధ్యాలనూ ధారపోసి, నెలలపాటు ఇంటి ముఖం కూడా చూడకుండా పనిచేసిన శాస్త్రవేత్తల, సాంకేతిక నిపుణుల ఆకాంక్ష నెరవేరుస్తూ.. ఇస్రో స్వప్నం సాకారం చేస్తూ.. అంతరిక్షంలో భారత ప్రతిష్ఠను మువ్వన్నెల జెండాలా ఎగురవేసింది చంద్రయాన్ 3 మిషన్. ప్రపంచ చరిత్రలో విశిష్టఘట్టంగా నిలిచింది. విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడి (ఆగస్టు 23)పై కాలిడింది. ఆశించినట్టే అది చంద్రుని దక్షిణ ధ్రువంపై సుఖంగా దిగి, చందమామని అందరి ఇళ్లలోకీ తీసుకువచ్చింది. అంతేకాదు, ఇక్కడ అన్వేషణ పూర్తి అయితే, మన పాలపుంత ఆవలి విశ్వ రహస్యాలను కనుగొనేందుకు ఇది ప్రవేశద్వారం కానుంది. మన మిడిమిడి జ్ఞానపు మేధావుల వ్యాఖ్యలలోని అజ్ఞానాన్ని పటాపంచలు చేసి చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా, కాలిడిన నాలుగవ దేశంగా భారత్ చరిత్రకెక్కింది. అంతేనా! ప్రయోగాల కోసం మరొక పెద్ద అడుగు వేస్తోంది. సూర్యవలయానికి ఇస్రో ఉపగ్రహాన్ని పంపుతున్నది. ఈ సంచిక మీ చేతిలో ఉండే సమయానికి ఆదిత్య -ఎల్ 1 ఆ వలయంలో తన పని మొదలుపెట్టి ఉండవచ్చు కూడా. పారిశ్రామిక విప్లవానికి దూరంగా ఉండిపోయి, వందల ఏళ్ల తరువాత ఐటీతో కాస్త కోలుకున్న భారత సాంకేతిక స్థాయి, ఇస్రో ప్రతిభతో అక్షరాలా తారస్థాయికి చేరింది. ప్రపంచాన్ని ఆకర్షించింది. ఈ క్షణం దేశాన్ని ఎంత ఉత్తేజపరిచిందో, చరిత్రలో అదొక మలుపుగా ఆవిష్కృతమయిన తీరును చదువుదాం. ఆ అనుభూతిని పదిలపరుచుకుందాం.
చంద్రయాన్ -2 వైఫల్యం సమయంలో నాటి ఇస్రో చైర్మన్ శివన్ తన జీవితంలో అపురూపమైన దానినీ, జీవన్మరణంగా భావించినదానినీ కోల్పోయి నట్టుగా వెక్కి వెక్కి ఏడవడం, అక్కడే ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అతడిని దగ్గరకు తీసుకుని వీపుతట్టి ఓదార్చిన దృశ్యాలు మనందరం చూశాం. అంతటి ఘోరమైన వైఫల్యాన్ని ఎదుర్కొన్నప్పటికీ, తమకు లభించిన ప్రోత్సాహంతో ఆ నిరాశ నుంచి తేరుకుని, ఆ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని, తప్పులను సవరించుకుని ఈసారి మిషన్‌ను విజయవంతం చేయాలని నాడే శాస్త్రవేత్తల బృందం సంకల్పం చేసుకుంది.
చోదన వ్యవస్థల (ప్రొపల్షన్స్ సిస్టం) నిపుణుల నుంచి ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ వ్యవస్థాపక డైరెక్టరు వరకు, చంద్రయాన్-2 వైఫల్యం తర్వాత బాధ్యతలు తీసుకున్న మిషన్ డైరెక్టర్ నుంచి మూడు దశాబ్దాలు అనుభవం కలిగి ఇస్రో సీనియర్ల వరకు చంద్రయాన్-3లో పాలుపంచుకుంటూ, మార్గదర్శనం చేసినవారిలో ఉన్నారు. ఈ విశ్వ రహస్యాలను తెలుసుకునేందుకు ఏకాంతంగా వెడుతున్న అంతరిక్ష నౌకకు అత్యున్నత ప్రతిభ కలిగిన వారు మార్గదర్శనం చేశారనడం అతిశయోక్తి కాదేమో! అందుకే, ఇది అంత తేలికైన పని కాదు, కొన్ని సంవత్సరాల కఠిన పరిశ్రమ.. కృషి అని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ పేర్కొన్నారు. చంద్రయాన్ -2 వైఫల్యాన్ని అధ్యయనం చేసి, దానిని నేర్చు కోవడం అన్నది తమకెంతో తోడ్పడిందని చెప్పారు. ఆ పరాజయాల నుంచి తాము నేర్చుకున్న పాఠాల కారణంగానే చంద్రుడిపై మృదువుగా దిగడం సాధ్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు.
విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగిన అనంతరం, దేశానికీ, సహచరులకు అభినందనలు తెలిపేందుకు వచ్చిన సోమ్‌నాథ్ ఈ లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పడిన కీలక సభ్యులను మొదటగా పరిచయం చేయడమే కాక వారు మాట్లాడేందుకు అవకాశ మిచ్చారు. ఎవరినీ వదిలిపెట్టకుండా, చంద్రయాన్ -3 విజయం అనేక సంస్థలకు చెందిన వేలాదిమంది ఇంజనీర్లు, సిబ్బంది అందించిన సేవల కారణంగా సాధ్యమైందన్నారు. చంద్రయాన్ 3 విజయవంతం అయ్యేందుకు ముందు మిషన్‌లో కొన్ని మార్పులూ, చేర్పులూ ఇస్రో చేసింది. ఇంతకు ముందు మిషన్‌లో పంపిన ల్యాండర్‌తో పోలిస్తే విక్రమ్ ల్యాండర్ బరువును 280కేజీలు పెంచడం వల్ల, అది గుర్తించిన పథం ద్వారానే చంద్రుడి ఉపరితలాన్ని చేరేందుకు అదనపు ఇంధనాన్ని అందులో ఉంచడం సాధ్యమైందని సోమ్‌నాథ్ వివరించారు.
భారతీయ రెండవ లూనార్ ల్యాండర్ అండ్ రోవర్ మిషన్‌గా పేర్కొంటున్న ఈ ప్రయోగం ద్వారా మూడు లక్ష్యాలను సాధించి, తమ శక్తిసామర్ధ్యాలను ప్రదర్శించాలని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మొదటగా, చంద్రుడి ఉపరితలంపై ఎంతో నియంత్రణతో విజయవంతంగా దిగడం, అక్కడి ఉపరితలంపై రోవర్ చరించడం, అంతిమంగా చంద్రుని ఉపరితలంపైనే శాస్త్రీయ ప్రయోగాలను చేపట్టడం.
అత్యంత చౌకగా ఇస్రో ప్రయోగాలు
అంతరిక్ష పరిశోధనలను, ప్రయోగాలను అత్యంత తక్కువ నిధులతో ఇస్రో సంస్థ, అందులోని శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేయడం వారికి దేశం పట్ల ఉన్న అంకితభావానికి, ప్రేమకు అద్దం పడుతుంది. ఉపగ్రహాల నుంచి ఇంత పెద్ద ప్రయో గాల వరకు దుబారా లేకుండా నిర్మించి, ప్రయోగాలు చేస్తున్నారు. ఇంకా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి అధికారికంగా ఎక్కని భారత్ అత్యంత తక్కువ ఖర్చుతో చేస్తున్న అంతరిక్ష ప్రయోగాలను గమనించి ప్రపంచం ముక్కున వేలేసుకుంటోంది.
మొన్న ప్రయోగించిన చంద్రయాన్-3కు అయిన ఖర్చు రూ. 615 కోట్లు (75 మిలియన్ డాలర్లు) మాత్రమే. ఇది అంతరిక్షంపై వచ్చిన ఇంటర్ స్టెల్లార్ అనే హాలీవుడ్ చిత్రానికి వెచ్చించిన 165 మిలియన్ డాలర్లలో సగమే కాదు, మన దేశంలోనే నిర్మించిన విఫల చిత్రం ‘ఆది పురుష్’ బడ్జెట్ అయిన రూ.700 కోట్ల కన్నా తక్కువ.
ఇస్రో చేస్తున్న ఈ ప్రయోగాలు సినిమా బడ్జెట్ల కన్నా తక్కువ కావడమే కాదు, అనేకమంది సెలబ్రిటీల, అంబానీ వంటి ప్రముఖుల గృహాలు, వాహనాల కన్నా తక్కువ కావడం ఇక్కడ చెప్పుకోవలసిన అంశం.
మొన్న మొన్ననే చంద్రుడిపైకి వెళ్లి చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగడంలో ఘోరంగా విపలమైన రష్యా లూనా-25 నిర్మాణానికి రష్యన్లు చేసిన ఖర్చు భారతీయ రూపాయలలో 1600 కోట్లు. ఇక చైనా చేపట్టిన తొలి చాంగె అన్వేషణ కోసం చేసిన వ్యయం రూ. 1752 కోట్లు. అమెరికా ప్రయోగాల ఖర్చు బిలియన్ల డాలర్లలో ఉండటం గమనార్హం.
అంతరిక్ష పరిజ్ఞానం కోసం ఒక సంస్థ
నాడు వెనుకబడిన దేశంగా ఉన్న భారత్‌లో కూడా మానవాళికి సేవలందించేందుకు అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించడం కోసం ఒక అంతరిక్ష సంస్థ ఉండాలనే భావనను డాక్టర్ విక్రమ్ సారాభాయ్ నాటి ప్రధానిలో నాటారు. ప్రపంచంలోని ఏ అంతరిక్ష సంస్థ అజెండా అదికాదు. అభివృద్ధి చెందుతున్న దేశాల అంతరిక్ష కార్యకలాపాలు చేపట్టడంలోని హేతుబద్ధతను కొందరు ప్రశ్నిస్తుంటారు. కానీ మాకు లక్ష్యంలో ఎటువంటి ద్వైదీభావం లేదు. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలతో చంద్రుడు లేదా గ్రహాలు లేక మాన్డ్‌స్పేస్ ఫ్లైట్‌లలో పోటీపడం. కానీ, మేం కనుక దేశీయంగా లేక అనేక దేశాల నేపథ్యంలో పాత్ర పోషించవలసి వస్తే, అత్యాధునిక సాంకేతికతలను మానవాళికి, సమాజ వాస్తవ సమస్యల పరిష్కారానికి దానిని అనువర్తింపచేయడంలో మనం రెండవవారిగా ఉండకూడదు అన్నది భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడి భావన.
ఇస్రో అవతరణ
అంతరిక్ష పరిశోధనల అవసరంపై 1962లో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ సలహా, సూచనలతో నాటి ప్రధాని జవాహర్‌లాల్ నెహ్రూ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (ఐఎన్‌సిఒ ఎస్‌పిఎఆర్)ను ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు. ఐఎన్‌సిఒ ఎస్‌పిఎఆర్ వృద్ధి చెంది 1969లో అణు ఇంధన విభాగం (డిఎఇ) ఇస్రోగా ఏర్పడింది. భారత ప్రభుత్వం 1972లో అంతరిక్ష విభాగాన్ని, అంతరిక్ష కమిషన్‌ను ఏర్పాటు చేసి ఇస్రోను దాని పరిధిలోకి తెచ్చింది.
ఎక్కడా తగ్గలేదు
నాసా చంద్రుడిపైకి మనిషిని పంపినప్పుడు ఇస్రో శైశవదశలో ఉన్న ప్రభుత్వ సంస్థ. భారతదేశంలో విజ్ఞాన పరిశోధన అంతగా పెరగని కాలంలోనే ఇస్రో వంటి సంస్థను ఏర్పాటు చేయాలని నాటి ప్రభుత్వం నిర్ణయించడం ఒక సాహసమే. ఆ సమయంలో ఇటు యుఎస్‌ఎ, అటు యుఎస్‌ఎస్‌ఆర్ అంతరిక్ష సాంకేతికత పరిజ్ఞానంతో భారీ ఆవిష్కరణలకు తెర లేపడమన్నది నాటి ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితుల పరిణామం. అమెరికా, సోవియెట్ రష్యా, జర్మనీ, చైనా వంటి దేశాలు అంతరిక్ష సాంకేతికతలను అభివృద్ధి చెందిన దేశాల మధ్య పోటీగా చూశాయే తప్ప మానవాళి ప్రాథమికావసరాలను తీర్చగల సామర్థ్యం వాటికి ఉందని గుర్తించలేదు. సామాన్య మానవుడికి మాత్రమే అటువంటి సాంకేతికతలను ప్రత్యేకంగా ఉపయోగించిన తొలి దేశం భారతదేశమే.
అంతరిక్ష విభాగం కింద ఇస్రోను వేరు సంస్థగా ఏర్పాటు చేసినప్పుడు అది బడ్జెట్‌కు సంబంధించిన, సాంకేతికత, నైపుణ్యాలలో లోపం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంది. ఆ సమయంలో డా।। విక్రమ్ సారాభాయ్, డా।। ఏపీజే అబ్దుల్ కలాం, డా।। సతీష్ ధావన్ వంటి నైపుణ్యం కలిగిన అతికొద్దిమంది శాస్త్రవేత్తలు మాత్రమే ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు అంతరిక్ష సాంకేతికతలను పంచుకోవడానికి గానీ, బదలాయించడానికిగానీ నిరాకరించాయి. ఇది నేటికీ కొనసాగుతున్నది. దీని కారణంగా లాంచ్ పాడ్‌లు, ఉపగ్రహాల నుంచి ప్రతి అంతరిక్ష ప్రయోగానికి సంబంధించిన సాంకేతికతలను ప్రతిదానినీ ఇస్రో స్వయంగా తయారు చేసుకోవలసి వచ్చింది.
పరాజయాలే విజయానికి మెట్లు
అత్యంత సాధారణ నిధులతో ఇస్రో చేపట్టిన అద్భుతాలను చూసి ప్రపంచమే విస్తుపోతున్నది. ప్రతి దశలోనూ పరాజయాలను విజయానికి మెట్లుగా మార్చుకుంటూ, పరాజయం మోపిన నిరాశలో మునిగిపోకుండా అక్కడి శాస్త్రవేత్తలు మొక్కవోని నిబద్ధతతో పనిచేయడం ప్రశంసనీయం. ఉన్న తక్కువ బడ్జెట్‌లోనే ఉపగ్రహాలను, ల్యాండర్లను, రోవర్లను తయారుచేసి, ఇంత తక్కువ ఖర్చులో కూడా అసాధారణ విజయాలను సాధించవచ్చనివారు రుజువు చేశారు. ఆఖరుకు చంద్రయాన్-3లో కూడా వారు ఇంధనాన్ని ఆదా చేస్తూ, రోవర్ ఎక్కువకాలం చంద్రునిపై అన్వేషణ చేసేందుకు వీలుగా ప్రయోగాన్ని రూపకల్పన చేశారు. అందుకే మన ల్యాండర్ చంద్రుడిని చేరుకునేందుకు 40 రోజులు పట్టింది. అయితే ఏమిటి? ఏ దేశమూ చేయలేని ఫీట్‌ని చేసి ‘డార్క్ సైడ్ ఆఫ్ ది మూన్’ గా పిలిచే చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగి విజయబావుటాను ఎగురవేసింది. ఆ ప్రాంతాన్ని ఎవ్వరూ అన్వేషించక పోవడం, అక్కడ సూర్యుడి కిరణాలు నెలలో 14 రోజులు మాత్రమే పడడం వల్లనే దానిని డార్క్ సైడ్‌గా పేర్కొంటారు. అంటే, మనకు 14 రోజులు, అక్కడ ఒక చాంద్రి దినమన్నమాట.
శాస్త్రవేత్తలకు సాధారణ వేతనాలు
ఇస్రో లేదా డిఆర్‌డిఒ లేదా బార్క్ (బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్)లో పనిచేసే శాస్త్రవేత్తలకు అభివృద్ధి చెందిన దేశాలలో వలె కాకుండా ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించినట్టే సగటు వేతనాలు చెల్లిస్తారు. అయినప్పటికీ మన శాస్త్రవేత్తలు అద్భుతమైన ఫలితాలను అందిస్తున్నారు. చిత్రమేమిటంటే, ఇంత ప్రతిష్ఠాత్మక సంస్థలో పనిచేసే ఇంజినీర్లలో 2శాతం మంది మాత్రమే ఐఐటిలు, ఎన్‌ఐఐటిల నుంచి వచ్చిన వారు. తమ రంగంలో ఎంతో అధ్యయనం చేసి, డిగ్రీలను పొందిన అనేకమంది ‘దేశం మనకేమిస్తోంది?’ అని ప్రశ్నించి, దేశం వదిలి వెళ్లే చాలామందివలె కాకుండా, ‘దేశానికి మనమేదైనా ఇవ్వాలి’ అన్న లక్ష్యంతో ఇక్కడే ఉండి పనిచేయడం ఎంతో ప్రశంసనీయమైన విషయం. మనవలె, కొండకచో మనకన్నా సామాన్య జీవితాలు గడుపుతూ, అసాధారణ విజయాలను సాధిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని కొందరు అజ్ఞానులు చేసే విమర్శలు వారు రెట్టింపు పట్టుదలతో పని చేసేం దుకు స్ఫూర్తినిస్తున్నాయే తప్ప వారిలో నిరాశను కలిగించక పోవడం వారి గొప్ప వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. జేబులో ‘రేనాల్డస్’ పెన్నులతో అత్యంత సామాన్య వేషభాషలతో కనిపించే మన ఇస్రో శాస్త్రవేత్తల మేధస్సు మాత్రం అమూల్యమైనదని, దేశంపట్ల ప్రేమ, బాధ్యత మొక్కవోనివని ఈ ప్రయోగం ద్వారా మరొక్కసారి రుజువు చేసుకున్నారు.
నైపుణ్యాలు కలిగిన వారి కొరత
ఇక్కడ మరొక విషయం చెప్పుకోవలసి ఉంది. భారతీయ శాస్త్ర, సాంకేతిక అంశాలు చదువుకుని, ప్రతిభ, నైపుణ్యం కలిగినవారంతా వేతనాల కోసమనో, ప్రతిష్ఠ కోసమనో నాసా వంటి సంస్థలకు సేవలందించే స్థితి దేశంలో ఉంది. దీనితో నైపుణ్యాలు కలిగిన కార్మికశక్తి ఇస్రోకు కొరవడింది. అయితే, ఈ మిషతో వారు ఏ ప్రాజెక్టునూ ఆలస్యం చేయలేదు. ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంది ఇస్రో. చంద్రయాన్, మంగళయాన్ వంటి ప్రధాన ప్రాజెక్టును పెద్దగా అనుభవం లేని 25-30 ఏళ్లలోపు వయస్కులైన శాస్త్రవేత్తలు, టెక్నీషియన్లు, సూపర్‌వైజర్ల తోడ్పాటుతో పూర్తి చేసింది. ఇటువంటి బృహత్కార్యాలు భారత్‌లో తప్ప మరెక్కడా సాధ్యం కావు.
దాదాపు 12 సంస్థల సహకారంతో చంద్రయాన్ 3 విజయవంతం
చంద్రయాన్ -3 మిషన్ విజయవంతంగా పూర్తి కావడంలో తోడ్పడిన ప్రధాన ఇస్రో కేంద్రాలు/ యూనిట్లు అనేకం ఉన్నాయి. ఇస్రో తన వెబ్‌సైట్‌లో ప్రస్తావించిన సంస్థలు –
– యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్, యుఆర్‌ఎస్‌సి, బెంగళూరు
– విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్, విఎస్‌ఎస్‌సి, త్రివేండ్రం
– లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్, ఎల్‌పిఎస్‌సి, త్రివేండ్రం, బెంగళూరు
– ఇస్రో శాటిలైట్ ట్రాకింగ్ సెంటర్, ఐఎస్‌టిఆర్‌ఎసి, బెంగళూరు
– స్పేస్ అప్లికేషన్స్ సెంటర్, ఎస్‌ఎసి, అహ్మదాబాద్
– లాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో- ఆప్టిక్స్ సిస్టమ్స్, ఎల్‌ఇఒఎస్, బెంగళూరు
– ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్, ఐఐఎస్‌యు, త్రివేండ్రం
– ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్, ఐపిఆర్‌సి, మహేంద్రగిరి
– సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఎస్‌డిఎస్‌సి- షార్
– నేషనల్ రీమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సి), హైదరాబాద్
– ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ, పిఆర్‌ఎల్
– స్పేస్ ఫిజిక్స్ లాబొరేటరీ, ఎస్‌పిఎల్
ఈ సంస్థలన్నీ కూడా చంద్రయాన్ మిషన్ -3 భావన, నమూనా రూపకల్పన, అభివృద్ధి, పరీక్ష, దానిని కార్యాచరణలోకి తీసుకువచ్చి మిషన్ సాకారం కావడంలో తోడ్పడ్డాయి.
ఆత్మనిర్భర్ భారత్‌ను సాకారం చేసేందుకు కృషి
చంద్రయాన్-3ను దాదాపుగా దేశీయ కంపెనీల నుంచి సేకరించిన పరికరాలతో నిర్మించింది ఇస్రో. చంద్రయాన్‌లో ప్రయోగించిన రాకెట్ కోసం, ల్యాండర్, రోవర్ వంటి వాటికోసం పలు విడిభాగాలను అంతరిక్ష, ప్రెసిషన్ ఇంజినీరింగ్‌కు సంబంధించిన పలు ఎంఎస్‌ఎంఇ పరిశ్రమలు తయారు చేసి ఇస్రోకు సరఫరా చేయడం అన్నది ఆత్మనిర్భర్ భారత్‌ను, మేకిన్ ఇండియా స్ఫూర్తిని ప్రతిఫలిస్తోందనడం అతిశయోక్తి కాదేమో. ‘మన చేత, మన వల్ల, మన కోసం’ అన్నట్టుగా చంద్రయాన్ ప్రయోగం జరగడం మనకు ఎంతో గర్వకారణం. ఈ మిషన్ కోసం విడిభాగాలను, పరికరాలను తయారు చేసిన సంస్థలలో హైదరాబాద్‌కు చెందిన సంస్థలు అనేకం ఉండడం తెలుగువారందరికీ గర్వకారణమైన విషయం.
విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్
దేశం యావత్ దృష్టినీ ఆకర్షించడమే కాదు, ప్రతి ఒక్కరూ గర్వపడేలా చేసిన చంద్రయాన్-3 మిషన్‌లో ప్రధాన పరికరాలు విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్‌లు. అంతరిక్ష రంగ ప్రాముఖ్యతను గుర్తించి దేశంలో అందుకు సంబంధించిన సంస్థల ఏర్పాటుకు కారకుడైన విక్రమ్ సారాభాయ్ జ్ఞాపకంగా ల్యాండర్‌కు విక్రమ్ అన్న పేరు పెట్టారు. అది తన పేరును సార్ధకం చేసుకుంటూ, తప్పటడుగు వేయకుండా చంద్రుడిపై దిగింది. ఇక చంద్రుడిపై విహరించి, అక్కడి సమాచారాన్ని సేకరించి, మనకు చేరవేసే రోవర్‌కు ‘ప్రగ్యాన్’ అని ఇస్రో పేరు పెట్టింది. సంస్కృతంలో ప్రగ్యాన్ అంటే జ్ఞానం అని అర్థం. విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ బయటపడీ పడగానే, ప్రగ్యాన్ మూన్‌వాక్‌కి వెళ్లిందంటూ ట్విట్టర్‌లో ఇస్రో సంస్థ ముచ్చటగా ప్రకటించింది. ఆరు చక్రాలు కలిగిన రోవర్, సౌరశక్తి ద్వారా పని చేస్తుంది. దానికి చంద్రుడి ఉపరితలంపై మేళనా లను విశ్లేషించేందుకు రెండు స్పెక్ట్రోమీటర్లను అమర్చారు. తాము దిగిన పరిసరాలలో రోవర్ దాదాపు 14 రోజులు అంటే ఒక చాంద్రమానం రోజు తిరుగుతుంది. చంద్రమాన రాత్రి కారణంగా అక్కడి వాతావరణం అతి శీతలంగా మారడంతో ఈ రెండూ జడంగా మారిపోతాయి. అయితే, ఇక అసలు పని చేయవేమో అని కూడా చెప్పలేం. ఎందుకంటే, మొదటగా వాటిని చంద్రుడిపై వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా తయారు చేశారు, రెండవది మళ్లీ సూర్యోదయం కాగానే, సూర్యకిరణాలు వాటిని తట్టిలేపి, జడ స్థితి నుంచి బయటపడేసే అవకాశం ఉంది. అయితే, ఇస్రో వాటికి ‘వన్ వే టికెట్’ ఇచ్చి పంపడంవల్ల అవి వెనక్కి తిరిగి రావు. అక్కడే భారత అన్వేషణ స్ఫూర్తికి గుర్తుగా ఉండిపోతాయి.
అన్వేషణ ఎందుకోసం?
చంద్రుడిపై మట్టిలో గల ఉపరితల సమీప ప్లాస్మా (అయాన్లు, ఎలక్ట్రాన్లు) సాంద్రతను ఈ మిషన్ అంచనా వేయనుంది. అదనంగా, చంద్రయాన్ -3 తాము దిగిన చోట సీస్మిక్ యాక్టివిటీ (భూకంపన చర్య)ను పర్యవేక్షిస్తుంది. చంద్రుడి మట్టిలో గల వివిధ రసాయనాలను కనుగొనాలన్నది మిషన్ లక్ష్యాలలో ఒకటి. గుర్తించిన ల్యాండింగ్ ఏరియా, దాని చుట్టు పక్కల గల చంద్రునిపై మట్టి, రాళ్లలో (మెగ్నీసియం, అల్యూమినియం, సిలికాన్, పొటాషియం, కాల్షియం, టైటానియం, ఐరన్ సహా) ప్రాథమిక కూర్పును నిర్ధారించేందుకు ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రో మీటర్ (ఎపిఎక్స్ఎస్) అనే పరికరాన్ని ఉపయో గించనున్నారు.
దక్షిణ ధ్రువంలోనే అన్వేషణ ఎందుకు?
ఈ ప్రాంతం అందరి దృష్టినీ ఆకర్షించడానికి కారణం ఇక్కడి నీటి ఉనికే కాదు, ఆ నీటిని రాకెట్ ఇంధనంగా ఉపయోగించవచ్చన్న భావన. అంతేనా, చంద్రుడిపై శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసుకు నేందుకు తోడ్పడడమే కాక, కుజగ్రహం, దాని ఆవలగల అంతరిక్షాన్ని అన్వేషించేందుకు ఇది ఒక ప్రయోగ వేదికగా ఉండాలన్నది ఆకాంక్ష.
చంద్రుడి దక్షిణ ధ్రువ ఉపరితలం లోతైన బిలాలతో కూడి ఉంటుంది. సూర్యుడి కిరణాలు పడే కోణాల కారణంగా, ఈ బిలాలలో అనేకం పూర్తి చీకటిగా ఉంటాయి. కొన్ని వేల లక్షల సంవత్స రాలుగా సూర్యకిరణాలు తాకని ఈ బిలాలలో హైడ్రోజెన్, వాటర్ ఐస్, ఇతర అస్థిర సమ్మేళనాలు ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇవి సౌర వ్యవస్థ తొలి దశ నుంచి ఉన్నవని శాస్త్రవేత్తల భావన. అత్యంత శీతలమైన ఉష్ణోగ్రతల కారణంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై చిక్కుకుపోయిన పదార్థమేదీ ఎక్కువ మార్పునకు గురికాకపోవడమే కాదు, ఈ విశ్వంపై తొలి జీవనానికి సంబంధించిన ఆధారాలను కలిగి ఉంటుంది. అందుకే, శాస్త్రీయ అన్వేషణలకు ప్రాముఖ్యత కలిగిన కేంద్రంగా ఈ ప్రాంతం ఉంది. సుదూర అంతరిక్ష ప్రయాణంలో ఇంధనం అన్నది అతిపెద్ద సవాలు. రాకెట్లు కూడా పరిమితంగానే ఇంధనాన్ని తీసుకుని, భూకక్ష్యను దాటి అంతరిక్షం లోకి వెడతాయి. ఎంత ఎక్కువ ఇంధనం ఉంటే, రాకెట్ అంత బరువుగా ఉండటమే కాదు, ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. ఇక్కడ గల నీటిని ఇంధనంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటే, సుదూర అంతరిక్ష యానానికి వెళ్లే రాకెట్లు చంద్రుడిపై ఆగి పెట్రోల్ బంకులో మనం పెట్రోలు పోయించు కున్నట్టుగా అవి ఇంధనాన్ని నింపుకుని ముందుకు పోవచ్చు. ఈ కారణంగా, అంతరిక్ష పరిశోధనలకు ఖర్చు చాలా మేరకు తగ్గుతుంది.
రష్యా లూనార్-25 వైఫల్యం
భారతదేశం చంద్రయాన్-3ను ప్రయోగించి, అది చంద్రుడిపై దిగే రోజు కోసం ఎదురుచూస్తున్న తరుణంలో రష్యా చంద్రుడిపై దిగే అంతరిక్ష నౌక లూనాను ప్రయోగించింది. అయితే, లూనా – 25 అనూహ్యమైన రీతిలో చంద్రుడి ఉపరితలంపై దిగకుండానే కుప్పకూలిపోయింది. సోవియట్ రష్యా చంద్రుడి ఉపరితలంపై కాలిడిన దాదాపు 47 ఏళ్ల తర్వాత అంతరిక్షంలో చంద్రుడికి సంబంధించి చేపట్టిన తొలి మిషన్ ఇదే కావడంతో సహజంగానే రష్యన్లు నిరాశపడ్డారు.
బీబీసీ విలాపం
భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ సమావేశ వేదిక నుంచీ చంద్రయాన్ -3 విజయం ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరిదీ అని చెప్పడం, ప్రతి ఒక్క దేశాధినేత భారత్ విజయాన్ని అభి నందించడం జరుగుతుండగానే ఒకనాటి సామ్రాజ్య వాద దేశంగా ఉన్న బ్రిటన్ ప్రచార అంగం బీబీసీ మాత్రం ఈ విజయాన్ని చూసి తట్టుకోలేకపోయింది. ఇప్పటికే బ్రిటన్ ఆర్ధిక వ్యవస్థను అధిగమించి ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ అవతరించ డాన్ని, చంద్రయాన్ భూమిపై దిగడమే కాదు, ఎవరూ దిగని దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగడమూ వారికి అస్సలు మింగుడు పడడం లేదు. అదే ఆగస్టు 23న బీబీసీలో జరిగిన చర్చలో ప్రతిఫలించింది. భారత్‌ను ఎప్పుడూ నిరుపేద దేశంగా, దానికి ఆర్ధికంగా ఇతరత్రా మద్దతు ఇచ్చేది తామేననట్టు ప్రదర్శించే బీబీసీ, ఇప్పుడు కూడా అదే తీరును చూపి, భారత్‌తో పాటు ఇతర దేశాల ప్రజల నుంచి కూడా విమర్శలను ఎదుర్కొంది
ఆ రోజు చర్చకు ప్రధాన యాంకర్‌గా ఉన్న పాట్రిక్ క్రిస్టీస్, భారత్ వంటి నిరుపేద దేశంలో నిధులను రాకెట్ ప్రయోగాల కోసం ఖర్చు చేసే బదులు దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను అందు లోంచి బయిటపడేసేందుకు చేయవచ్చు కదా అంటూ ఉచిత సలహా ఒకటి పారే శారు. అంతేకాదు, 2016 – 2021 నడుమ తమ దేశం ఇచ్చిన 2.3 బిలియన్ పౌండ్లను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడం అతడి జాత్యహంకారాన్నే కాదు కుళ్లు మోతుతనాన్ని కూడా బయటపెడుతోంది. పైగా, భారత్‌లో ఇంకా 700 మిలియన్ల మంది బహిర్గత మల విసర్జన చేస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అతడి అజ్ఞానానికి అద్దం పట్టేవిగానే ఉన్నాయి.
వాస్తవానికి, బీబీసీ ఏడుపును మనం విస్మరించ వచ్చు. ఎందుకంటే, మన వారి కన్నా ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నాం. కానీ ఆనంద్ మహేంద్ర మాత్రం ఊరుకోలేకపోయారు. మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర ట్విట్టర్‌లో దీనిపై తీవ్రంగా స్పందిస్తూ, భారత్ దరిద్రంలో కూరుకుపోవడానికి కారణం మీ దోపిడీనే అంటూ ధ్వజమెత్తారు. అంతేకాదు, భారత్ బంగారు చిలుక అని తెలిసే వచ్చిన బ్రిటిష్ దోచుకున్న సంపదలో అత్యంత విలువైనది కోహినూర్ వజ్రం కాదని, భారతీయుల ‘ఆత్మగౌరవాన్ని, మా సామార్ధ్యాల పై మాకు గల నమ్మకాన్ని’ అంటూ తీవ్రంగా సమాధానం చెప్పారు. తాము దోచుకున్నవారు హీనులన్న భావనను కల్పించడమే సామ్రాజ్యవాద దేశ లక్ష్యంగా ఉంటుందని, అందుకే తాము అటు టాయిలెట్ల లోనూ, ఇటు అంతరిక్ష పరిశోధనలోనూ పెట్టుబడి పెడుతు న్నామని, ఇది వైరుధ్యం కాదని ఆయన జవాబిచ్చారు. చంద్రుడిపైకి వెళ్లడమన్నది మా ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించు కోవడానికే, విజ్ఞానం ద్వారా పురోగతి సాధ్యమన్న భావనను అది సృష్టిస్తుంది. అంతేకాదు, అతి గొప్ప దారిద్య్రం ‘భావ దారిద్య్రం, ఆకాంక్షలు లేకపోవడం’ అని ఎడాపెడా పాట్రిక్‌ను వాయించేశారు.
ఇక సాధారణ ప్రజలు అయితే, భారత్ నుంచి దోచుకున్న 45ట్రిలియన్లకు పైగా సంపదతో దేశాన్ని నిర్మించుకున్నప్పటికీ, వారి దేశంలో పెరుగుతున్న దారిద్య్రం, ఆరోగ్య వ్యవస్థలు తిరోగమనం, అక్కడి గ్రూమింగ్ గ్యాంగ్స్, మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న అత్యాచారాలను పట్టి చూపుతున్నారు. అంతేనా? ఇక్కడి దేశ సంపదను దోచుకుని సంపన్నులైనా, బీబీసీ వంటి సంస్థలు భారత్‌లో పన్ను ఎగవేసి మర్యాదస్తుల వలె చెలామణి అవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆరోపణల, విమర్శల వర్షం కురిపించారు.
విదేశాలు సరే, స్వదేశంలోనూ విపక్షాల అసంతృప్తి
తప్పని తద్దినం అన్నట్టుగా చంద్రయాన్ 3 విజయాన్ని అభినందిస్తూనే మన ప్రతిపక్షాలు దాన్ని రాజకీయచేయడం ప్రారంభించాయి. ఇదంతా, ప్రథమ ప్రధాని నెహ్రూ చలవ వల్లే జరిగింది తప్ప అటు శాస్త్రవేత్తలకు కానీ, ఇటు వారిని ప్రోత్సహించిన ప్రభుత్వానికి గానీ ఎటువంటి గొప్పదనాన్ని ఆపాదించడానికి వీలులేదన్నట్టుగా వారి మాటల సరళి ఉంది.
నిజమే, నెహ్రూ ఇస్రో సంస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కానీ, అది ఆయనకు స్వయంగా వచ్చిన ఆలోచన కాదు కదా? మానవాళికి సేవలందిం చేందుకు అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించడం కోసం ఒక అంతరిక్ష సంస్థ ఉండాలని డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పోరగా ఏర్పడిన సంస్థ ఇది. అలా అంతరిక్ష సాంకేతిక ద్వారా సామాన్యులకు కూడా ప్రయోజనం చేకూర్చవచ్చన్న ఆలోచనను ఇచ్చింది విక్రమ్ సారాభాయ్ కనుకనే, ఈసారి ల్యాండర్‌కు ‘విక్రమ్’ అని పేరు పెట్టారు. అయితే, పక్కవారి గొప్పతనాన్ని, ప్రతిభను ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ నెహ్రూ జపాన్ని ప్రారంభించింది.
ఇంతటి గొప్ప ఘట్టాలు జరిగినప్పుడు, దానిని రాజకీయ కోణం నుంచి కాక దేశ ఔన్నత్యం, వైభవం కోణం నుంచి చూడం మన ప్రతిపక్షాలు నేర్చు కోవాలి. ప్రధాని మోదీ పట్ల తమకుగల గుడ్డి ద్వేషాన్ని దేశానికే వ్యతిరేకంగా అనువర్తింప చేస్తుంటే ప్రజలు గమనించరనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ప్రతి పౌరుడూ భారత్ సాధించిన విజయానికి గర్వ పడుతున్న వేళ, ప్రతిపక్షాలు ఇటువంటి రాజకీయాలు చేయడం చౌకబారుతనం, నేలబారుతనమే అవుతుంది.
మూడవ వరుస నుంచి మొదటి వరుసకు
నేడు వాణిజ్యం నుంచి సాంకేతికత వరకు భారత దేశాన్ని మొదటి శ్రేణిలో ఉన్న దేశంగా ప్రపంచం పరిగణిస్తోందని ప్రధాని అన్నారు. మూడవ వరుస నుంచి మొదటి వరుసకు చేసిన ప్రయాణంలో, ‘ఇస్రో’ వంటి సంస్థలు భారీ పాత్రను పోషించాయంటూ ప్రధాని మోదీ ఆ సంస్థను, అందులో పని చేస్తున్న శాస్త్రవేత్తలను ప్రశంసించారు.
ఆగస్టు 23 జాతీయ అంతరిక్ష దినోత్సవం
ఇంతటి ఘనవిజయం సాధించిన రోజైన ‘ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా ప్రకటించారు ప్రధాని. ఆ రోజున చంద్రుడిపై భారతదేశం తన జాతీయ జెండాను ఎగురవేసింది. కనుక, ఇప్పటి నుంచీ అది భారత్‌లో జాతీయ అంతరిక్ష దినోత్సవం అని ప్రధాని అన్నారు.
శివశక్తి పాయింట్
అలాగే, విక్రం ల్యాండర్ దిగిన ప్రదేశానికి ‘శివశక్తి పాయింట్’ అని ఆయన నామకరణం చేశారు. ‘శివ్ కీ బాత్ హోతీ హై తో శుభం హోతా హై ఔర్ శక్తి కీ బాత్ హోతీ హై తో మేరే దేశ్ కె నారీ శక్తీ కీ బాత్ హోతీ హై’ (శివుడిని తలచుకుంటే శుభం జరుగుతుంది, శక్తిని తలచుకుంటే నా దేశపు నారీ శక్తిని గురించి తలచుకోవడం జరుగుతంది) అంటూ చంద్రయాన్ 3లో మహిళా శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించడాన్ని పట్టి చూపుతూ వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ శివశక్తి పాయింట్ అన్నది భవిష్యత్ తరాలు ప్రజా సంక్షేమం కోసం సైన్సును ఉపయోగించేందుకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. ప్రజా సంక్షేమమే తమ అత్యున్నత నిబద్ధత అని పీఎం మోదీ స్పష్టం చేశారు.
ప్రపంచానికి వెలుగునిచ్చేందుకే…
చంద్రుడి చీకటి కోణంగా భావించే దక్షిణ ధ్రువ ప్రాంతంపై చంద్రయాన్ 3 దిగడాన్ని ప్రస్తావిస్తూ, భారత్ ఎప్పుడూ ప్రత్యేకంగా ఆలోచించి, ప్రపంచాన్ని ప్రకాశింప చేసేందుకు ఇటువంటి అంధకార ప్రదేశాలకు వెడుతుందని మోదీ అన్నారు. వినూత్నంగా, ప్రత్యేకంగా ఆలోచించడమే భారత విశిష్టత అని అన్నారు. ప్రపంచమంతా వెలుగును ప్రసరింపచేస్తూ ప్రకాశాన్నిచ్చేందుకు అంధకారమైన ప్రదేశాలకు వెళ్లే దేశం భారతదేశమని అన్నారు.
వైఫల్యమే అంతిమం కాదు
చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ 2 కుప్పకూలి, తన జాడలను వదిలిన ప్రదేశానికి ప్రధాని ‘తిరంగా’ అని పేరుపెట్టారు. వైఫల్యమే అంతిమం కాదనే విషయాన్ని అది మనకు గుర్తు చేస్తుందని అన్నారు. 2019లో ప్రయోగించిన చంద్రయాన్ 2 మిషన్ చంద్రుడిపై కుప్పకూలడంతో పూర్తిగా విజయవంతం కాలేదు. ఒకరకంగా చెప్పాలంటే, ఇది పాక్షికంగా విజయవంతమైంది. దాని ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలో విజయవంతంగా నిలువగలగడమే కాక ప్రస్తుతం విక్రం ల్యాండర్‌కు సంబంధించిన డాటాను భూమికి పంపడంలో తోడ్పడుతోంది. వాస్తవానికి చంద్రయాన్ 3 మిషన్ చంద్రుడి ఉపరితలంపై కాలిడే ముందే, చంద్రయాన్ 2 దానిని పలకరించడంతో శాస్త్రవేత్తలు ఉద్వేగానికి గురైన విషయం తెలిసిందే.
ప్రధాని ఇస్తున్న ప్రోత్సాహంతో ఆనందంతో తల మునకలవుతున్న శాస్త్రవేత్తలు ‘మిషన్ గగన్‌యాన్’కు తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఇప్పటికే గగనయాన్ కోసం పని జరుగుతోందని, ఈ ప్రయోగం కోసం ఉపయోగించే ఉపగ్రహం మార్క్ 3 సిద్ధమవుతోందని, దానిని మరింత బలోపేతం చేసే పక్రియ కూడా సాగుతోందని, అన్ని వ్యవస్థలను అభివృద్ధి చేశారని, గగన్‌యాన్‌కు కూడా అందరి తోడ్పాటునూ కోరుతున్నామంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రోవర్‌కు తప్పిన ప్రమాదం
ప్రస్తుతం చంద్రుడి మీద పరిశోధనలు చేస్తున్న రోవర్ ఆగస్ట్ 28న చిన్న గండం నుంచి గట్టెక్కింది. ల్యాండర్ నుంచి విడులైన రోవర్ ఒక బిలంలో పడబోయి తృటిలో తప్పుకుంది. దాదాపు నాలుగు మీటర్ల వెడల్పయిన బిలాన్ని గుర్తించింది. ఆ బిలానికి మూడు మీటర్ల దూరంలో ఉండగానే రోవర్ గుర్తించింది. ఇస్రో నుంచి వచ్చిన ఆదేశాల మేరకు బిలాన్ని తప్పించుకుని మరొక మార్గంలోకి రోవర్ మళ్లింది.
ఇప్పుడు సురక్షితమైన బాటలో ముందుకు నడుస్తున్నది. మొత్తం 14 రోజులు అక్కడ ఇది పరిశోధన చేస్తుంది.
××××××××××
140 కోట్లమంది గుం డె చప్పుళ్ల సామర్ధ్యానిది ఈ క్షణం
విక్రమ్ ల్యాండర్ భూఉపరితలంపై దిగడాన్ని మనంతటి ఉద్విగ్నతతోనే ప్రధాని మోదీ దక్షిణాఫ్రికా నుంచి దృశ్యమాధ్యమంలో వీక్షించారు. అది జరిగీ జరగగానే ఆయన శాస్త్రవేత్తలను అభినందిస్తూ, ఇటువంటి చరిత్రాత్మక ఘటనలు జరిగినప్పుడు జీవితం ధన్యమైపోతుంది. ఇటువంటి చారిత్రక ఘటనలు జాతి జీవనానికి శాశ్వత చేతన అవుతుందన్నారు. ఈ విజయం పట్ల ఉద్వేగంగా మాట్లాడుతూ-ఈ క్షణం విస్త్మతి చెందనిది. ఈ క్షణం అనుభూతికి అందనిది. ఈ క్షణం వికసిత భారత శంఖనాదానిది. ఈ క్షణం నూతన భారతావని జయ ఘోషది. కష్టాల కడలిని దా•వలసిన క్షణమిది. గెలిచి చంద్రపథంపై అడుగులు వేయాల్సిన క్షణమిది.140 కోట్లమంది గుండె చప్పుళ్ల సామర్ధ్యానిది ఈ క్షణం. నూతన శక్తి, నూతన విశ్వాసం, నూతన చేతనల క్షణమిది. ద్విగుణీకృతమవుతున్న భారత అదృష్టానికి హామీ ఇచ్చే క్షణమిది.
అమృత్ కాలంలోని మొదటి సంవత్సరంలోనే సఫలత అనే అమృత వర్షం కురిసింది. మనం ఇక్కడ భూమిపై సంకల్పం చేసి, చంద్రుడిపై దానిని సాకారం చేశాం. మన శాస్త్రవేత్తలు కూడా అన్నారు, ‘ఇండియా ఈజ్ నౌ అన్ ది మూన్’ అని. ఈరోజు అంతరిక్షంలో నూతన భారతం వేగంగా దూసుకు పోవడానికి మనం సాక్షులుగా ఉన్నాం. నేను ఇప్పుడు బ్రిక్స్ సమావేశం కోసం దక్షిణాఫ్రికాలో ఉన్నాను, కానీ ప్రతి భారతీయుడిలాగే నా మనసు కూడా చంద్రయాన్‌పై లగ్నమై ఉంది. కొత్త ఇతిహాసాన్ని లిఖించగానే ప్రతి భారతీయుడూ సంబరాలు జరుపుకోవడంలో మునిగిపోయాడు. ప్రతి ఇంట్లోనూ ఉత్సవం ప్రారంభ మైంది. ఎప్పటిలాగే నేను కూడా ఈ భారతీయులు, కుటుంబాలలో వెల్లివిరుస్తున్న ఉల్లాసం, ఉత్సాహంతో అనుసంధానమై ఉన్నాను. నేను టీం చంద్రయాన్‌కు, ఇస్రోకు, దేశంలోని శాస్త్రవేత్తలందరికీ హృదయపు లోతుల్లోంచి అభినందనలను అందిస్తున్నాను… ముఖ్యంగా, ఈ క్షణం కోసం ఏళ్ల తరబడి పరిశ్రమ చేసిన వారిని. ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం, భావుకతతో నిండిన ఈ అద్భుత క్షణంలో నేను 140 కోట్ల దేశవాసులకు కూడా కోటి కోటి అభినందనలు తెలుపుతున్నాను.
బెంగళూరులో ప్రధాని మోదీ ఉద్వేగ ప్రసంగం
చంద్రయాన్ 3 విజయవంతంగా దక్షిణ ధ్రువంపై దిగిన రోజు (ఆగస్టు 23)న బ్రిక్స్ సమావేశంలో ఉన్న మోదీ దృశ్యమాధ్యమం ద్వారా తన సంతోషాన్ని పంచుకుంటూ, శాస్త్రవేత్తలను అభినందించినప్పటికీ, భారతదేశానికి తిరిగి రాగానే మొట్టమొదటగా వారినే కలుసుకుంటానంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. తన గ్రీసు పర్యటనను ముగించుకుని నేరుగా బెంగళూరులోని హెచ్‌ఎఎల్ విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోదీ అక్కడ పెద్ద ఎత్తున చేరిన ప్రజలను ఉద్దేశించి ‘జై విగ్యాన్, జై అనుసంధాన్’ అనే నినాదాన్నిచ్చారు. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్‌లో శాస్త్రవేత్తలతో సమావేశమైన ప్రధాని మోదీ అత్యంత ఉద్వేగానికి లోనై, ఉద్విగ్నతతో శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురిపించారు. ‘మీ అంకిత భావానికి నా సెల్యూట్. మీ సహనానికి సెల్యూట్. మీరు కష్టపడి పని చేసిన తీరుకు నా సెల్యూట్, మీ స్ఫూర్తికి నా సెల్యూట్’ అంటూ ప్రధాని ఉద్విగ్నంగా శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేశారు.
‘శరీరాన్నీ, ఆత్మనూ కూడా సంతో షంతో ముంచెత్తే సందర్భాలు అత్యంత అరుదుగా జీవితంలో లభిస్తాయి… ఇంతటి అనందం చాలా అరుదుగా లభిస్తుంది’ అని మోదీ అన్నారు. ‘మేకిన్ ఇండియా’ను చంద్రుడిపైకి తీసుకు వెళ్లినందుకు శాస్త్రవేత్తలను ప్రశంసలతో మోదీ ముంచెత్తారు. సైన్సులో విశ్వాసముంచే ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ భారత్ సాధించిన విజయంతో భవిష్యత్‌పట్ల ఎంతో ఉత్సాహంతో ఉన్నారని చెప్పారు.
××××××××××
ఈ ఘనత మోదీకే దక్కుతుంది..
చంద్రయాన్ 3 విజయం ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకే చెందుతుందని ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ కుండబద్దలు కొట్టి చెప్పారు. మోదీని మీరు ప్రధానిగా, నాయకునిగా ఆమోదించవచ్చు. లేదా వ్యతిరేకించవచ్చు. అది మీ ఇష్టం. కానీ చంద్రయాన్ 3 విజయం ఆయనకే చెందుతుంది అని నంబి అన్నారు. మోదీకి ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ మీద విశ్వాసం లేదని ఆయన ‘న్యూ ఇండియన్’ చానల్‌కు చెప్పారు. చంద్రయాన్‌కు ఆ ప్రభుత్వాలు ఏమీ కేటాయించని విషయాన్ని కూడా ఆ మాజీ శాస్త్రవేత్త వెల్లడించారు. ప్రథమ ప్రధాని నెహ్రూ శాస్త్రవేత్తలను విశేషంగా ప్రోత్సహించారని, ఇస్రో ఆయన కాలంలోనిదేనని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో నంబి ఈ వ్యాఖ్యలు చేశారు.
×××××××
అంతర్గత అన్వేషణ కోసం ఆధాత్మికత, బహిర్గత అన్వేషణ కోసం సైన్స్: సోమనాథ్
ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతి ప్రయోగానికీ ముందు ఆలయానికి వెళ్లి పూజలు చేయించడం ఒక ఆనవాయితీ. రాకెట్ ప్రయోగం ముందు షార్‌కు సమీపంలో గల చెంగాళమ్మ ఆలయంలో నమూనాను కూడా తీసుకు వెళ్లి పూజలు జరిపించడం సంప్రదాయంగా వస్తున్నది.ఈ విషయం బహిరంగ సత్యమే అయినా, చంద్రయాన్ 3 విజయవంతం అయిన తర్వాత శాస్త్రవేత్తలు ఆలయాలకు వెళ్లడమేమిటంటూ పెద్ద ఎత్తున ఉదారవాదులు విమర్శలు ప్రారంభించారు.
దీనిపై ఇస్రో అధిపతి సోమనాథ్ వారికి ధీటైన సమాధానం ఇచ్చారు. తనకు అన్వేషణ అనేది ఎంతో ఆసక్తి కలిగించే అంశమని, అందుకే అంతర్గత అన్వేషణ కోసం ఆధ్యాత్మికను అనుసరిస్తానని, బహిర్గత అన్వేషణ కోసం శాస్త్రవేత్తను అయ్యానంటూ వారికి జవాబిచ్చారు. అంతేకాదు, తాను పుట్టిన కుటుంబానికి ఒక సంస్కృతి ఉంటుందని, దానిని తాను అనుసరించి ముందుకు తీసుకువెడుతున్నానని చెప్పారు. ప్రాచీన గ్రంథాలను చదవడం ద్వారా తాను అనూహ్యమైన విషయాలను కూడా తెలుసుకునేందుకు అవకాశం కలుగుతోందని ఆయన పరోక్షంగా వేదాలకు, సైన్స్‌కు గల సంబంధాన్ని కూడా తెలియచెప్పారు.
××××××××××
ఉద్విగ్నితకు లోనైన ప్రతి ఒక్క భారతీయుడు..
చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ దిగుతుందా? లేక గతానుభవాన్ని ఎదుర్కోవలసి వస్తుందా అన్న సంశయం, ఆశ నడుమ ఈ సన్నివేశాన్ని ఏ మాధ్యమం ద్వారా సాధ్యమైతే ఆ మాధ్యమం ద్వారా దేశంలోని 140 మంది కోట్ల భారతీయులే కాదు, విదేశాలలో ఉన్నవారు కూడా అత్యంత ఉద్విగ్నంగా వీక్షించారు. ఆ క్షణాలలో, ఆ తర్వాతా కూడా వారి మనసులోకి వచ్చిన భావన, నోటి నుంచి వచ్చిన మాటలు, చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశం ‘మన భారతదేశం’ అన్నవే. అంతేకాదు, బ్రిక్స్ సమావేశంలో ఉండి కూడా ఇస్రో శాస్త్రవేత్తల విజయాన్ని తాను కూడా కళ్లారా చూసి, అభినందించిన ప్రధాని పట్ల కూడా సానుకూలంగా స్పందించారు. ఒక సామాన్యుడు కోరుకునేది ఇదే. తాము చేసిన పనికి దేశాధినేత నుంచి గుర్తింపు, ప్రశంస రావాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అంతేతప్ప, బీజేపీ ప్రధాని అయితే ఒకరకంగా, కాంగ్రెస్ ప్రధాని అయితే మరొక రకంగా ఉండదు. బహుశ సోరోస్ సంస్థల నుంచి కోట్లాది రూపాయలు అందుకునే వ్యక్తులకు, సంస్థలకు ఆ భావన ఉండవచ్చేమో కానీ సాధారణ పౌరుడికి ఆ భావన ఉండదన్న విషయాన్ని 140 కోట్లమంది ప్రజలు రుజువు చేశారు.
××××××××××
ఇది చిరస్మరణీయ ఘట్టం
ఇదొక చిరస్మరణీయ ఘట్టం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవం మీదకు చేరగానే ముర్ము ఇస్రో శాస్త్రవేత్తలకు, సాంకేతిక నిపుణులకు తన అభినందనలు తెలియచేశారు. చరిత్రలో నమోదయ్యే రోజులు కొన్ని మాత్రమే ఉంటాయి. చంద్రయాన్ 3 మిషన్ విజయంతో మన శాస్త్రవేత్తలు చరిత్రను సృష్టించడమే కాదు, విశ్వం మీది కల్పనకు కూడా కొత్త రూపు ఇచ్చారని ఆమె అన్నారు. యావద్దేశం గర్వించదగిన ఇలాంటి క్షణాలు జీవితకాలంలో ఒక్కసారే వస్తాయి అని కూడా ముర్ము సమున్నతంగా వ్యాఖ్యానించారు.
××××××××××
100మంది మహిళా శాస్త్రవేత్తల కృషి కూడా…
ప్రతి కార్యక్రమం, ప్రాజెక్టులో మహిళా శాస్త్రవేత్తల / ఇంజనీర్ల భాగస్వామ్యం ఉండటం ఇస్రోలో ఆనవాయితీ. చంద్రయాన్-3 మిషన్‌లో రూపకల్పన, నమూనా, నిర్మాణం, పరీక్షించడం వంటి కీలక బాధ్యతలను 100మంది మహిళా సిబ్బంది చేపట్టి ప్రత్యక్ష పాత్రను పోషించారు.
ప్రధానంగా వారు మొత్తంగా అంతరిక్ష నౌక సమగ్రాకృతి, చంద్రయాన్-3 ని సాకారం చేయడం, బృంద నిర్వహణ; అంతరిక్షణ నౌక కూర్పు, సమగ్రం చేసి పరీక్షించడం; చంద్రయాన్ మిషన్ కార్యకలాపాల గ్రౌండ్ సెగ్మెంట్ ఏర్పాటు, అమలు; స్వతంత్రంగా, సురక్షితంగా, మెత్తగా భూమిపై కక్ష్యపై దిగడం కోసం ల్యాండర్ సామర్ధ్యాన్ని నిర్ధారించడానికి ల్యాండర్ నావిగేషన్ గైడెన్స్ అండ్ కంట్రోల్ సిమ్యులేషన్స్‌ను నిర్వహించడం; లేజర్ ఆల్టీమీటర్, లేజర్ డాప్లర్ వంటి కీలక సెన్సార్లను అభివృద్ధి చేసి, బట్వాడా చేయడం; కీలక ల్యాండర్ పవర్ డిసెంట్ ఫేజ్ (ల్యాండర్ దిగే కీలక దశ)లో కీలకపాత్ర పోషించే వెలాసి మీటర్, ల్యాండర్ హారిజంటల్ వెలాసిటీ కెమెరా తదితరాల అభివృద్ధి వంటివాటన్నింటిలో మహిళా శాస్త్రవేత్తలు ముఖ్య పాత్ర పోషించడం చెప్పుకోదగిన విషయం.
××××××××××
నాసా అధిపతి సంతోషం
చంద్రయాన్ 3 ప్రయోగం విజయం సాధించినందుకు అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ ‘నాసా’ అభినందించింది. 41 రోజులు ప్రయాణించి రోవర్ ఆగస్ట్ 23, సాయంత్రం 6.04లకు చంద్రుని దక్షిణ ధ్రువం మీదకు చేరింది. ఈ కార్యక్రమంలో నాసాకు భాగస్వామ్యం ఉన్నందుకు తాము గర్వపడుతున్నామని ఆ సంస్థ అధిపతి బిల్ నెల్సన్ వ్యాఖ్యా నించారు. రష్యా వారి లూనా 25 కూలిపోయిన మరునాడే భారత ప్రయోగం విజయవంతం కావడం అమెరికాను సహజంగానే సంతోషపెడుతుంది. జాబిల్లిపై అడుగుపెట్టిన నాలుగో దేశం భారత్‌కు అభినందనలు అని నెల్సన్ ట్వీట్ చేశారు.
××××××××××
ఇది అద్భుతం
చంద్రయాన్-3 విజయం అంటే అంతరిక్ష అన్వేషణలో భారత్ సాధించిన పురోగతికి ఇది నిదర్శనమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ వ్యాఖ్యానించారు. ఈ విజయం శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారత్ సాధించిన అద్భుత పురోగతికి కూడా అద్దం పడుతుందని ఆయన అన్నారు. ఇంతటి విజయం సాధించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలకు అభినందనలు అన్నారు పుతిన్.
××××××××××
ఇద్దరు ప్రధానుల ప్రోత్సాహం
భారతీయ అంతరిక్ష కార్యక్రమానికి ప్రోత్సాహాన్నిస్తూ ఆగస్టు15, 2003లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చంద్రయాన్ ప్రాజెక్టును ప్రకటించి చందమామ గురించి అందరిలో ఆసక్తి పెంచారు. వాస్తవానికి, చంద్రుడిపై అన్వేషణలకు భారత శాస్త్రీయ మిషన్‌ను పంపాలన్న ఆలోచన ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్‌లో జరిగిన ఒక సమావేశంలో ప్రస్తావనకు రావడం, 2000లో ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్• ఇండియా దీనిని ముందుకు తీసుకువెళ్లడం జరిగాయి. కొద్దికాలానికే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఐఎస్‌ఆర్‌ఒ -ఇస్రో) జాతీయ లూనార్ మిషన్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం, చంద్రుడిపై అన్వేషణకు భారతీయ మిషన్‌ను చేపట్టేందుకు ఇస్రోకు సాంకేతిక నైపుణ్యాలు ఉన్నాయని అది తేల్చడం జరిగిపోయాయి. తర్వాత 2003లో గ్రహ-అంతరిక్ష శాస్త్రాలు, భూమి శాస్త్రాలు, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, ఖగోళశాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్, సమాచారశాస్త్ర రంగాలకు చెందిన 100మంది ప్రముఖ శాస్త్రవేత్తలు చంద్రుడిపై అన్వేషణకు శ్రీకారం చుట్టమంటూ టాస్క్‌ఫోర్స్ చేసిన సూచనను లోతుగా చర్చించి పచ్చజెండా ఊపారు. సరిగ్గా ఆరు నెలల తర్వాత నవంబర్‌లో, భారత ప్రభుత్వం ఈ మిషన్‌కు ఆమోదముద్ర వేసింది.
చంద్రయాన్ 1 : అక్టోబర్ 22, 2008
ప్రభుత్వ ఆమోదముద్రతో ఇస్రో శాస్త్రవేత్తలు అత్యంత ఉత్సాహంతో పథకాన్ని విజయవంతం చేసే పనికి ఉపక్రమించారు. తొలిదశలో లూనార్ ఆర్బిటర్ (చంద్ర కక్ష్యలో పరిభ్రమించే యంత్రం)ను రూపొందించిన ఇస్రో 22 అక్టోబర్ 2008లో పిఎస్‌ఎల్‌వి-ఎక్స్ఎల్ రాకెట్ ద్వారా చేసిన చంద్రయాన్-1 ప్రయోగం ఘన విజయాన్ని సాధించింది. అందులోని మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ తొలిసారి చంద్రునిపై నీటి ఆనవాళ్లను కనుగొనడమే కాకుండా, చంద్రుడిని మ్యాపింగ్, దాని వాతావరణాన్ని ప్రొఫైలింగ్ వంటి పనులను కూడా చేపట్టి, ఇస్రోకు బోలెడు సమాచారాన్ని అందించింది.
చంద్రయాన్ 2: జూలై 14, 2019
ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితోనే 2008 సెప్టెంబర్ 18న మన్మోహన్ సింగ్ తొలి కేబినెట్ సమావేశం చంద్రయాన్-2కు ఆమోద ముద్రవేసింది. ప్రభుత్వాల ప్రోత్సాహంతో ఇనుమడించిన ఉత్సాహంతో ఇస్రో శా్త్ర•వేత్తలు పనిని ప్రారంభించినప్పటికీ, వారికి ఈ మిషన్‌లో అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ ప్రయోగం 2013 జనవరిలో చేయాలని నిర్ణయించినప్పటికీ, ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించకపోవడం, సరైన సమయంలో ల్యాండర్‌ను తయారుచేసి ఇవ్వడంలో రష్యా విఫలం కావడంతో దానిని 2016కు వాయిదా వేశారు. అయితే, 2015 నాటికి కూడా రష్యా దానిని అందచేయలేకపోవడంతో స్వతంత్రంగా దానిని తామే తయారు చేసుకోవాలని భారత్ నిర్ణయించుకుంది. మొత్తం మీద జులై 22 ,2019న చంద్రయాన్-2 మిషన్‌ను ఎల్‌విఎం3 రాకెట్ ద్వారా ప్రయోగించారు. నెలరోజులలోపే అంతరిక్ష నౌకను చంద్రుని కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టినప్పటికీ, సెప్టెంబర్ 6, 2019న చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగుతున్న సమయంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల ల్యాండర్‌తో అనుసంధానం తెగిపోయింది. కాగా, ఆర్బిటర్ ఇంకా శాస్త్రీయ డాటాను సేకరిస్తూ పని చేస్తూనే ఉండటమే కాదు మరొక 7.5 ఏళ్ల పాటు పనిచేస్తూనే ఉంటుందని అంచనా. కొన్ని వారాల కింద రష్యా పంపిన లూనా-25కి కూడా ఇటువంటి అనుభవమే ఎదురైనట్టు తెలుస్తోంది.
చంద్రయాన్ 3: జూలై 14, 2023
చంద్రయాన్ -2లో ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోవడానికి కారణమైన కొన్ని సవాళ్లను ఇస్రో శాస్త్రవేత్తలు పరిష్కరించి, చంద్రయాన్ -3ని పకడ్బందీగా రూపొందించారు. డార్క్ సైడ్ ఆఫ్ ది మూన్‌గా ప్రాచుర్యం పొందిన, అత్యంత కఠినమైన చంద్రుడి దక్షిణ ధ్రువం ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకు కారణాన్ని సరళంగా చెప్పాలంటే, చంద్రుని దక్షిణ ధ్రువంపై మంచు పరమాణువులు ఉన్నాయని భారత్ ప్రపంచానికి వెల్లడించడమే. భవిష్యత్‌లో గ్రహాల అన్వేషణలలో నీటి ఉనికి అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకోవచ్చు. నీటి జాడ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎన్నో కార్యకలాపాలు సాధ్యం అవుతాయి. గొప్ప గొప్ప నాగరికతలన్నీ విలసిల్లింది నదీతీరాలలోనే అని మనం మరచి పోకూడదు.
చంద్రయాన్-1బడ్జెట్ రూ.385 కోట్లు కాగా, చంద్రయాన్-2 మిగిలిన వాటితో పోలిస్తే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. చంద్రయాన్-2 కోసం చేసిన వ్యయం రూ.978 కోట్లు.
××××××××××
కొసమెరుపు
చంద్రుడి మీదకు ఆగస్ట్ 23న రోవర్‌ను పంపించిన ఇస్రో వారం రోజులకే సూర్యుడి గురించి పరిశోధనలకు శ్రీకారం చుట్టబోతున్నది. సౌర వాతావరణం గురించిన అధ్యయనం కోసం సెప్టెంబర్ 2, 2023నే ఆదిత్య-ఎల్ 1ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి ప్రయోగించబోతున్నది. ఆ రోజు ఉదయం 11.50 నిమిషాలకు ఆ ఉపగ్రహం తన ప్రయాణం ప్రారంభిస్తుంది. పీఎస్‌ఎల్‌వి-సీ 57 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరుగుతుంది. ఆదిత్య ఎల్ 1ను మొదట జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి పంపుతారు. తరువాత భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్ రేంజియన్ పాయింట్ 1(ఎల్ 1) లోకి మళ్లిస్తారు. భూమి నుంచి లాంగ్ రేంజ్ పాయింట్‌కు చేరడానికి 175 రోజులు పడుతుంది. దీని సాయంతో సౌర కొరోనాతో పాటు సూర్యుడి నుంచి ప్రసరించే అతి శక్తిమంతమైన కాంతి కిరణాల ప్రభావం, సౌర మండలంలోని గాలులపైనా అధ్యయనం చేస్తారు. ఆదిత్య ఎల్ 1 కూడా పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో రూపొందించారు.
దాదాపు 1500 కిలోల బరువు ఉండే ఈ ఉపగ్రహంలో ఏడు పేలోడ్లు ఉంటాయి. దీనిని బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ ఆధ్వర్యంలో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ పేలోడ్‌ను తయారు చేసింది. పుణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ అస్ట్రానమి అండ్ ఆస్ట్రో ఫిజిక్స్ శాస్త్రవేత్తలు సోలార్ అల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్‌ను తయారు చేశారు. సూర్యుడి ఉపరితలం మీద 6 వేల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. అయితే కొరోనా వద్ద 10 లక్షల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయి. అక్కడి ఆ ఉష్ణోగ్రతలలోని వ్యత్యాసానికి ఉన్న కారణాలను ఈ పరిశోధన అన్వేషిస్తుంది.
చంద్రుడు, సూర్యుడు పంచభూతాలలో కీలకమైన వ్యవస్థలు. అటు ఆధ్యాత్మికంగా, ఇటు పర్యావరణ పరంగా వాటి ఉనికి, ప్రాధాన్యం ఎనలేనివి. అందుకే వాటి గురించి పరిశోధన చేయాలన్న తృష్ణ బయలుదేరింది. ఇలాంటి ప్రయత్నం ఏ విధంగా చూసినా సాహసోపేతమైనది. కానీ పరిశోధన చేయాలి. అందులో భాగమే ఇదంతా.
- జాగృతి డెస్క్