ఆర్థిక అక్షరాస్యత అవగాహన
– మానవ చరిత్ర అంటే, ధనం విలువ కోల్పోయిన చరిత్రే!
– ద్రవ్యోల్బణం అంటే ఒకరకమైన పన్ను విధింపు వంటిదే. అయితే ఈ పన్ను విధించడానికి చట్టం ఏమీ ఉండదు.
– మిల్టన్ ఫ్రీడ్మన్
ఆధునిక సమాజంలో అన్ని రకాల మానవ సంబంధాలు మనీతోనే ముడిపడి ఉన్నాయి.
మానవుడు ఎప్పుడూ ఎక్కువగా కోరుకొనే వస్తువు ద్రవ్యం. రోజువారీ ఖర్చుల కోసం, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ఆర్థిక భద్రత కోసం మనకు కావలసిన ముఖ్య వస్తువు ధనమే!
ద్రవ్యంను నేరుగా ఎవ్వరూ వినియోగించు కోలేరు. ద్రవ్యానికి ప్రత్యక్ష ఉపయోగం లేదు. దానికి వినిమయ మాధ్యమంగా మాత్రమే ప్రయోజనం ఉన్న ది. వస్తుసేవలు కొనుగోలు చేయడానికీ, వస్తూత్పత్తి పక్రియకు అవసరమైన ఉత్పాదక వస్తువుల కొనుగోలుకీ మనం ద్రవ్యాన్ని ఉపయోగిస్తాం.
ఓ జీవిత సత్యం ఏమిటే!
ఏ వ్యక్తీ కేవలం ద్రవ్యం కోసమే ద్రవ్యాన్ని కోరుకోరు.
ఈ వ్యాసంలో ద్రవ్య- పుట్టుక, పరిణామక్రమం, సరఫరా, నిల్వలు, ఆవశ్యకత, వివిధ స్వరూపాలు, ద్రవ్య చెల్లింపులలో మార్పులు, ద్రవ్య మారకపు విలువలు, బ్యాంకులు, కేంద్ర బ్యాంకు ద్రవ్య సరఫరా, దాని నియంత్రణల గురించి తెలుసు కొందాం.
ఇటీవల భారతదేశం వర్చువల్ కరెన్సీల ఆవిర్భావానికి చోటు కల్పించింది. నేటి డిజిటల్ యుగంలో కరెన్సీల మార్పులపై తగిన అధ్యయనం చేయవలసిన ఆవశ్యకత ఉన్నది.
డిజిటల్ కరెన్సీల ద్వారా జరుగుతున్న ఆర్థిక లావాదేవీలు, వాటి పక్రియ, వాటివల్ల జరుగుతున్న పరిణామాలపై అంతర్‌దృష్టి, పర్యవసానాలపై అవగాహన అత్యవసరం.
భారతదేశ ఆర్థికవ్యవస్థలో డిజిటల్ కరెన్సీలు క్రియారూపకంగా తమ పాత్రను పోషిస్తున్నా, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చాలా భాగం పేపర్ కరెన్సీ లావాదేవీలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
కరెన్సీ అనేది కేవలం మార్పిడి మాధ్యమం. దీనితో కొనుగోలుదారులు, అమ్మకందారులు తమ వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోగలరు. కరెన్సీ ఇరువర్గాలూ ఆమోదించిన నిర్దిష్ట విలువకు కొలమానం.
సాధారణంగా కరెన్సీల నిర్వహణ, ఉత్పత్తి, నియంత్రణ, వాటి మారకపు విలువను ప్రభుత్వాలే నిర్ణయిస్తాయి.
కరెన్సీ సరఫరా, దాని పరిమాణాలు ఆర్థిక వ్యవస్థలో ధరల పెరుగుదల శాతాన్ని నిర్ణయిస్తాయి. కరెన్సీ చెలామణి వ్యాపార, వాణిజ్యాలను సులభతరం చేస్తుంది.
కరెన్సీ సరఫరా తగ్గినప్పుడు ఆర్థికమాంద్యం, కరెన్సీ అధిక సరఫరా/ చెలామణి వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడతాయి.
కేవలం వినియోగదారుని కొనుగోలు శక్తిని నిర్ణయించేది కరెన్సీ, దాని విలువ. ఒక వ్యక్తి ఎక్కువ మొత్తంలో ధనార్జన చేయటం ద్వారా అతడి ఆర్థిక, సామాజిక స్థితిగతులు మెరుగుపడి, జీవన ప్రమాణాలు పెరుగుతాయి.
ప్రభుత్వాలు దేశంలో కరెన్సీ సరఫరాను, వడ్డీ రేట్లను నిర్ణయించడం ద్వారా మార్కెట్ల స్థితిగతులను, వినియోగదారుల కొనుగోలు సామర్థ్యాలను నియంత్రణ చేస్తూ, ఆర్థిక స్థిరత్వానికి మార్గాన్ని సులభతరం చేస్తాయి.
కరెన్సీ ఉత్పత్తి, దాని పంపిణీ, దాని నియం త్రణపై పలు ఆర్థిక కొలమానాలు నిర్ణయిస్తారు.
వినియోగదారులు కొనుగోలు శక్తిని కరెన్సీ సరఫరా నిర్ణయిస్తుంది. ప్రభుత్వాలు చేసే కరెన్సీ ఉత్పత్తి, పంపిణీల ద్వారా ద్రవ్యరాశిని నియంత్రిం చడం, వడ్డీరేట్లను ప్రకటించటం వల్ల దాని ప్రభావం సమాజంలోని అనేకమందిపై పడుతుంది. మన దేశంలో కరెన్సీపై ఆధిపత్యం రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియాదే. మన దేశంలో నగదు, స్థూల దేశీయ ఉత్పత్తుల మధ్య నిష్పత్తి స్థిరంగా పెరుగుతూనే ఉంది.
రిజర్వ్‌బ్యాంక్ లెక్కల ప్రకారం దేశంలో 2,20,49 లక్షల కోట్ల నగదు చెలామణిలో ఉంది.
ప్రాచీనకాలంలో డబ్బులు వాడకంలో లేవు. ప్రజలు తమ ఉత్పత్తులను పరస్పరం మార్పిడి చేసుకొనేవారు. ఇదే వస్తుమార్పిడి వ్యవస్థ (బార్టరు).
నిజానికి కొనుగోళ్లు, అమ్మకం, అరువు తెచ్చుకోవటం, తిరిగి చెల్లించటం తదితర కార్యక్రమాల సౌలభ్యం కోసమే మొదట్లో ద్రవ్యం ఆవిష్కరించారు. ఈ విధినే వినిమయ మాధ్యమం అని వ్యవహరిస్తారు.
ప్రాచీన భారతీయ సమాజంలో ఒక వస్తువు ధరను ఇతర వస్తువుల పరిమాణంలో వ్యక్తపరిచే వారు. ఒక వస్తువుకు మరొక వస్తువును మార్పిడి/ విని మయం చేసే పద్ధతి చాలా అసౌకర్యమై నందువల్ల, వస్తుసేవల విలువను, ధర రూపంలో, ద్రవ్య యూనిట్లలో పేర్కొనటం జరిగింది.
దీనివల్లనే, సమాజానికి వ్యాపార కార్యక్రమాలను సులభతరం చేసేందుకు ద్రవ్యం అవసరమైంది.
ద్రవ్యోల్బణం (inflation)
అనేక దేశాలలో ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసే ప్రధానాంశం ద్రవ్యోల్బణం. ప్రపంచం నేడు తీవ్ర ద్రవ్యోల్బణ సమస్యను ఎదుర్కొంటోంది.
ఆర్థిక స్థితిగతులను, ప్రజల జీవన విధానాన్ని, వారి సంక్షేమం తదితర పలు అంశాలను నేరుగా ద్రవ్యోల్బణం ప్రభావితం చేస్తుంది.
ద్రవ్యోల్బణం అస్థిరమైన ఆర్థిక పరిస్థితులను నెలకొల్పుతుంది.
వస్తుసేవల ధరల గణనీయమైన పెరుగుదలను ద్రవ్యోల్బణం సూచిస్తుంది. దీని వలన డబ్బు విలువ పతనమౌతుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే, డబ్బు కొనుగోలు శక్తిని ద్రవ్యోల్బణం హరించి వేస్తుంది.
ఆర్థిక వ్యవస్థలో ఎంచుకున్న వస్తుసేవల ధరలు నిరంతరం పెరుగటంవల్ల కరెన్సీ కొనుగోలు సామర్థ్యం సన్నగిల్లి, దేశంలోని కరెన్సీ కొనుగోలు శక్తి తగ్గుతుంది.
ఉదాహరణకు….
2019 సంవత్సరంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల విలువ
రూ. 35,220.00
ధరలు పెరగటంవల్ల 2022లో అదే బంగారం 10 గ్రాముల విలువ
రూ।। 52,785.00
అంటే, ద్రవ్యోల్బణం వల్ల బంగారం ధరలో రూ.17,565.00 పెరుగుదలను గమనించవచ్చును.
పొదుపు చేసినవారు ద్రవ్యోల్బణం వల్ల ఎక్కువగా నష్టపోతారని అర్థం చేసుకోవాలి.
2019 సం।।లో ఒక లక్ష రూపాయలకు 28 గ్రాముల బంగారం కొనుగోలు శక్తి కలిగి ఉన్నప్పటికీ, పొదుపు కోసం బ్యాంకులో ఎఫ్‌డి జేయటవల్ల సుమారు రూ.19,500ని వడ్డీ రూపంలో పొంద గలుగుతాం. కానీ, 2022 నాటికి ద్రవ్యోల్బణం వల్ల కరెన్సీ విలువ తగ్గి, బంగారం విలువ పెరుగటం వల్ల కేవలం 22 గ్రాములే కొనుగోలు చేయగలుగు తారు. ఫలితంగా పొదుపు చేసినవారు నష్టపోయేది రూ.31,668.00.
ఉదా।।కు మన వద్దనున్న ఒక లక్ష రూపాయలను సంవత్సరానికి 6 శాతం వడ్డీకి ఒక ప్రభుత్వ బ్యాంకులో డిపాజిట్ చేశారనుకుందాం.
2019లో రిటర్న్ సుమారు 6 శాతం వడ్డీ, ద్రవ్యోల్బణం రేటు 4 శాతం.
నిజంగా మనకు వచ్చే వడ్డీ మొత్తం = వడ్డీ రేటు – ద్రవ్యోల్బణం రేటు. అంటే, 06 శాతం – 04 శాతం = 2 శాతం.
కేవలం 2%. అంటే, లక్ష రూపాయలపై ఏడాదికి రూ.6000 వడ్డీ రూపంలో పొందినా, ద్రవ్యోల్బణం వల్ల అందులో రూ. 4000 విలువ తగ్గి నిజంగా కేవలం రూ.2000 విలువ మిగులు తుంది. అదే ద్రవ్యోల్బణం రేటు 6 శాతానికి పెరిగినట్లు అయితే, నికరంగా మనం పొందే వడ్డీ శూన్యం. మనం వ్యక్తిగత అవసరాల కోసం ఎలాంటి బ్యాంకులో పొదుపుచేయకపోతే సంవత్సర కాలంలో లక్ష రూపాయలకు సుమారు 6000 /- విలువ కోల్పోవటం వల్ల మన లక్ష విలువ కేవలం 94,000/- గా మారుతుంది.
కనుక, పై ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకోవలసిన ముఖ్యాంశాలు
ఎ) స్థిరమైన లాభాలను సమకూర్చే రంగాలలో మన సొమ్ములను మదుపు చేయాలి.
బి) ద్రవ్యోల్బణ రేటు కన్నా అధిక శాతంతో లాభాలనివ్వగలిగే మదుపులనే ఎంచుకోవాలి.
సి) దీర్ఘకాలంలో రాబోయే పరిస్థి తులను దృష్టిలో ఉంచుకొని, లేదా కేవలం 5 శాతం, లేదా 10శాతం పన్ను మినహాయింపు పొందవచ్చునని అనేక మార్గాలలో పొదుపులను చేయుటంవల్ల ఆర్థికంగా నష్టపోవటం తథ్యం.
డి) బంగారం, వెండి లాంటి లోహాలు విలువలు అంతర్జాతీయంగా స్థిరంగా పెరుగుతుండడంతో వాటిని కొనుగోలు చేయటం ద్వారా కొంత మేరకు నష్టాలను తగ్గించుకోగలుగుతారు.
ద్రవ్యం కాల విలువ అంటే ఏమిటి?
ద్రవ్యపు కాల విలువ (ఱఎవ శ్రీబవ శీ వీశీఅవ) నేడు మన వద్దనున్న రూ.1000 విలువ, రేపటి కాలంలో రాబోయే రూ.1000 విలువకు ఎన్నడూ సరిసమానం కాదు. ద్రవ్యోల్బణం వల్ల ద్రవ్య రూపంలో ఒకే అంకెను కలిగి ఉన్న రూ.1000 కొనుగోలు శక్తి తగ్గటం వల్ల దాని వాస్తవిక విలువ సుమారుగా సంవత్సరానికి 10శాతం మేరకు తగ్గుతుంది. సూర్యరశ్మికి నదులలో నీరు ఆవిరిగా మారినట్లు, ద్రవ్యం కూడా ద్రవరూప లక్షణాలను కలిగి ఉంది. ధరల పెరుగుదల, అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతులు, రూపాయి మారకపు విలువలు మారటం, దేశీయ ఆర్థికరంగంలో వచ్చే మార్పులు మొదలైన పలు అంశాలవల్ల, ద్రవ్యపు నిజ విలువ (=వశ్రీ శీశ్రీబవ శీ వీశీఅవ) క్రమక్రమంగా క్షీణిస్తోంది.
ఉదాహరణకు నేడు మనవద్దనున్న రూ. 1000/-లను, 10% వడ్డీ లేదా రాబడివచ్చేలా మ్యూచువల్ ఫండ్స్‌లో పొదుపు చేసినట్లయితే కేవలం 2 ఏళ్ళ కాలంలో రూ.1210గా దాని భవిష్యత్ విలువ మారుతుంది. అంటే, భవిష్యత్‌లో రూ.1210 విలువ నేడు మనవద్ద నున్న రూ.1000/-లకు సరిసమానం.
దీనినే ఆర్థిక పరిభాషలో ద్రవ్యము కాల విలువగా వ్యవహారిస్తారు.
మీరు ఎవరైనా సంస్థవద్దగానీ, వ్యక్తి దగ్గర అప్పుగా రూ.1000/- తీసుకొని 10/- వడ్డీతో కలపి 2 ఏళ్ళ కాలంలో 1210/- తిరిగి చెల్లించినా, దాని నికర విలువ కేవలం రూ.1000/- మాత్రమే. ద్రవ్యరూపంలో వడ్డీ పొందిన వ్యక్తి సంతృప్తి పొందినా, వాస్తవానికి, తన సొమ్మును మాత్రమే అతడు తిరిగి పొందాడు.
(సశేషం)
– కె. గోపీకృష్ణ, విశ్రాంత ఉపన్యాసకులు