– క్రాంతి

ప్రపంచానికి కరోనా మహమ్మారిని పంచి అపఖ్యాతిపాలైన చైనా పోయిన  ప్రతిష్టను దక్కించుకోవడానికి కసరత్తు చేస్తోంది. అయితే పుట్టుకతో పుట్టిన బుద్ధి పుడకతలతో గాని పోదు అన్న చందంగా ఈ వ్యూహాలు కూడా వక్రంగానే ఉన్నాయి. భారతీయ మార్కెట్లలో కోల్పోతున్న ఉత్పత్తుల ఆదరణను నిలుపుకోవడం అందులో ఒకటి. దానితోపాటు భారతీయుల మెదళ్లను ప్రభావితం చేసే ప్రయత్నం మరొకటి. ఇందుకోసం వివిధ రంగాలను వినియోగించుకుంటోంది. చైనా మీద సానుకూల కథనాలను వండి వార్చేందుకు సినిమా, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, ‌సోషల్‌ ‌మీడియాలను వాడుకుంటోంది. దేశంలో వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ కుట్రలు వెలుగు చూశాయి.

‘చైనా, భారత్‌ ఒకేసారి స్వతంత్ర దేశాలైనాయి. విప్లవ సిద్ధాంతాలతో చైనా, ప్రజాస్వామ్య సిద్ధాంతా లతో భారత్‌ ‌ముందుకెళ్లాయి. ఇప్పుడు చైనా ఎక్క డుంది? భారత దేశం ఇంకెక్కడుంది. జనాభాలో సరిసమానంగా ఉన్న మనం, ఆర్థిక, రక్షణ, టెక్నా లజీలో చైనా కంటే వెనుకబడి ఉన్నాం..దీనికి కారణ మెవరు?’

ఓ తెలుగు యూట్యూబ్‌ ‌వ్లాగర్‌ అతివాగుడు ఇది. చైనాతో మన దేశం ఆర్థిక, రక్షణ రంగాల్లో ఎదుర్కొంటున్న ముప్పును ‘పనికిరాని సొల్లు కబుర్లు..’ అంటూ తేలికగా తీసి పారేశాడు. ఒకప్పుడు ఆంగ్లేయ మానసపుత్రులు మన దేశానికి జాడ్యంగా మారితే ఇప్పుడా స్థానాన్ని చైనా ఆక్రమించే ప్రయత్నం చేస్తోంది. భారతీయుల్లో తనపట్ల సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు ఆ దేశం పన్నుతున్న కుయుక్తులను గమనిస్తే దిమ్మతిరిగే వాస్తవాలు కనిపిస్తాయి.

కొద్ది వారాల క్రితం అన్వేష్‌ అనే ఈ యూ ట్యూబర్‌ ‌చైనాకు వెళ్లి వరుసగా కథనాలను తయారు చేసి వదిలాడు.. ‘నేను కమ్యూనిస్ట్ ‌భావజాలాన్ని ఆరాధిస్తాను.. మావోను చాలా ఇష్ట పడతాను… భారతదేశంలో కమ్యూనిజం మాత్రమే మార్పు తీసుకురాగలదని గట్టిగా నమ్ముతున్నాను’ అంటూ ఆ వీడియోల్లో చెప్పుకొచ్చాడు. చైనా గురించి ఇలాంటి సానుకూల వీడియోలు తయారు చేయడం ద్వారా 30 లక్షల రూపాయలు సంపాదించాడు.. ఈ విషయాన్ని స్వయంగా చెప్పుకున్నాడు.

ప్రతి దేశానికీ తనదైన అస్తిత్వం, ప్రత్యేకత ఉంటాయి. చైనాలో కమ్యూనిజానికి బాటలు వేసేందుకు నియంత మావో జెడాంగ్‌ 60 ‌నుంచి 80 లక్షల మంది సొంత ప్రజలను క్రూరంగా చంపే శాడు. తియాన్మెన్‌ ‌స్క్వేర్‌లో ప్రజాస్వామ్యం కోసం గళమెత్తిన వేలాదిమంది విద్యార్థులపై ట్యాంకులు తోలి దుర్మార్గంగా చంపేసిన దేశం చైనా.. ఇవన్నీ కళ్ల ముందు కనిపిస్తుంటే చైనా గొప్పదనాన్ని పొగిడేందుకు ఆయన వెనుక ఉన్న శక్తులు ఏమిటన్నది తేలికగానే అర్థం చేసుకుకోవచ్చు..

దశాబ్దం కిందట ఆమిర్‌ఖాన్‌ ‌నటించిన ‘పీకే’ చైనాలో రూ.1500 కోట్లు వసూలు చేసింది. ఇదొక ఉదాహరణ. భారత్‌లో అనేక చైనా కంపెనీలు, సంస్థలు వ్యాపారం చేస్తున్నాయి. మన దేశంతో చైనాకు సరిహద్దు వివాదాలు, తగాదాలు ఉన్నాయి. తరచూ చొరబాట్లతో కయ్యానికి కాలుదువ్వడం ఆ దేశానికి ఒక అలవాటుగా మారింది. ఈ అంశం నుంచి భారతీయుల దృష్టిని ఏమార్చేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తమ దేశానికి అనుకూలంగా, మనదేశానికి వ్యతిరేకంగా భారతీయుల ఆలోచనలు, అభిప్రాయాలను ప్రభావితం చేసేం దుకు చైనా అనేక కుట్రలను అమలు చేస్తోంది. ఇందుకోసం చైనా భారీ ఎత్తున డబ్బును ఖర్చు చేస్తోంది. ఈ ప్రణాళిక వేర్లు తెలుగు రాష్ట్రాలకు కూడా పాకాయి. అన్వేష్‌లాంటి వారు తెలిసోతెలియకో ఇందులో భాగస్వాములవుతున్నారు.

బయపడిన చైనా కుట్రలు

లా అండ్‌ ‌సొసైటీ అలయన్స్ ‌సెప్టెంబర్‌ 3, 2021‌న విడుదల చేసిన 76 పేజీల అధ్యయన నివేదికలో భారత్‌లోని వివిధ విభాగాలను ప్రభా వితం చేయడానికి చైనా అమలు చేస్తున్న పథకాలను చూడవచ్చు. ఇందులో కమ్యూనిస్టులు అనుసరిస్తున్న రహస్య, బహిరంగ కార్యకలాపాలను వివరించారు. జీ జిన్‌పింగ్‌ ‌నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ‌చైనా భారతీయ మీడియా, ప్రభావశీల వ్యక్తులు, సంస్థలకు నిధులు సమకూర్చడం, స్పాన్సర్‌ ‌చేయడం, పెట్టుబడులు పెట్టడం, విద్యార్థి వేతనాలు ఇవ్వడం, వినోద, పర్యాటకరంగాలను ఉపయోగించుకోవడం ద్వారా భారతీయ సమాజంలోకి చొచ్చుకుపోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇక విద్యాసంస్థలు, మేథోవర్గంపై గురి సరేసరి.

ఢిల్లీలో స్థాపించిన ఒక సంస్థ భారతీయుల్లో చైనా అనుకూల భావాలను నింపేందుకు చురుగ్గా పనిచేస్తోంది. ఈ సంస్థ విద్య, వాణిజ్యం, పర్యాటక రంగాలపై అధ్యయనం పేరుతో కొంతమందిని ఎంపిక చేసి చైనాకు పంపిస్తుంది. అక్కడ ‘శిక్షణ’ పొందినవారు చైనా ప్రభుత్వం, చైనా కమ్యూనిస్టు పార్టీలకు అనుకూలమైన భావాలను భారత్‌లో వ్యాపించేందుకు శ్రమిస్తారు.

మరోవైపు మే 3, 2023న సెంటర్‌ ‌ఫర్‌ ‌సోషల్‌ అం‌డ్‌ ఎకనామిక్‌ ‌పోగ్రెస్‌ ‌ప్రచురించిన మరో నివేదికను కూడా గమనించాలి. దక్షిణాసియాలో తన ఉనికిని పెంచుకునేందుకు అవసరమైన సాధనాలు, నమూనాలు, భాగస్వాములను చైనా ఎలా ఉపయో గించుకుంటోందో ఇందులో చూడవచ్చు. సోషల్‌ ‌మీడియాను చైనా ఉపయోగించుకుంటున్నదో చెప్పే ఒక అధ్యాయమే చేర్చారు. భారతీయులను లక్ష్యంగా చేసుకుంటూ సాంప్రదాయ ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ ‌మీడియాతో పాటు సోషల్‌ ‌మీడియా లాంటి కొత్త వేదికలను ప్రయోగిస్తోంది చైనా కమ్యూనిస్టు పార్టీ. ఒకరకంగా ఇది భారతదేశ సార్వభౌమత్వానికి, ప్రజా స్వామ్యానికి తీరని ముప్పు అంటూ ఈ నివేదిక పేర్కొంది. చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడంతో పాటు దేశ ప్రజలను కాపాడుకునేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ సూచించింది.

తిరగబడ్డ చైనా కథ

2013లో జిన్‌పింగ్‌ ‌చైనా అధ్యక్షుడైన తర్వాత ‘చైనా కథను చక్కగా చెప్పండి’ అంటూ చైనా మీడియా సంస్థలను ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా చైనాను గొప్పగా చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సూచించాడు. భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా చైనాకు సానుకూల ప్రచారం చేయాలని చైనా మీడియా సంస్థలను ఆదేశించాడు. భారతదేశంలో సోషల్‌ ‌మీడియా ప్రభావం ఎక్కువగా లేనందున, ది హిందూ వంటి వార్తాపత్రికలు, ది ప్రింట్‌, ‌స్క్రోల్‌, ‌ది వైర్‌ ‌వంటి వెబ్‌ ‌పోర్టల్‌లలో చైనా అనుకూల వార్తా కథనాలు ప్రారంభమయ్యాయి.

2002లో రజనీకాంత్‌ ‌నటించిన ‘బాబా’ చిత్రంలో ఒక గిరిజన జ్యోతిష్కుడు తన ఫోన్‌ను ‘‘ఇట్స్ ‌మేడ్‌ ఇన్‌ ‌చైనా, విత్‌ ‌టచ్‌ ‌స్క్రీన్‌’’ అని పేర్కొన టాన్ని డైలాగ్‌తో వినిపించాడు. పెయిడ్‌ ‌ప్రమోషనా,  కాదా తెలియదు, కానీ ఆ దృశ్యంతో చైనీస్‌ ‌ఫోన్‌లు నాణ్యమైనవి, చౌకైనవి అనే సందేశం సామాన్యుల దృష్టికి వెళ్లింది

డోక్లామ్‌ ‌వివాదం ప్రారంభమైనప్పుడు మన దేశంలో ఇంటర్నెట్‌ ‌వినియోగం, సోషల్‌ ‌మీడియా గణనీయంగా పెరిగింది. ‘బాయ్‌కాట్‌ ‌చైనా’ పేరుతో చైనా వస్తువుల బహిష్కరణ ప్రారంభమైంది. ఫలితంగా ‘చైనా బజార్‌’ ‌పేరుతో నడిచే కొన్ని వ్యాపారాలు ‘ఇండియాబజార్‌, ‌బాంబే బజార్‌’ ‌లాంటి పేర్లు పెట్టుకోవాల్సివచ్చింది. చైనీస్‌ ‌తయారీ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను ‘మేడ్‌ ఇన్‌ ‌చైనా’ అని కాకుండా ‘మేడ్‌ ఇన్‌ ‌పీఆర్‌సీ’ లేబుల్‌లతో విక్రయించే పరిస్థితి వచ్చింది. ప్రపంచ వాణిజ్య చరిత్రలో ఏ దేశంకూడా ఇలాంటి నకిలీ పేరుతో వ్యాపారం చేయడంలేదు.

ప్యాంగాంగ్‌ ‌సరస్సు దగ్గర చైనా సైనికులతో ఘర్షణలో భారతీయ సైనికుల వీర మరణం.. ఒప్పో, వివో చైనా మొబైల్‌ ‌కంపెనీల ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల నమోదు.. టిక్‌ ‌టాక్‌, ‌చైనీస్‌ ‌లోన్‌ ‌యాప్‌లపై నిషేధం వంటి సంఘటనలు భారతీయుల్లో వ్యతిరేకతను పెంచాయి. చైనాపై వ్యతిరేకత నేరుగా భారత్‌లోని కమ్యూనిస్ట్ ‌పార్టీలను ప్రభావితం చేసింది. రాజకీయంగా వాటి విశ్వస నీయత క్షీణించింది. అదే సమయంలో చైనాలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి 50 కోట్ల మంది అభిమానులు ఉన్నారని ఒక సర్వే చెప్పింది. దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం తమ దేశానికి చెందిన ‘విబో’ వంటి సోషల్‌ ‌మీడియా ప్లాట్‌ఫామ్‌లలో భారతదేశానికి అనుకూలంగా ఉన్న పదహారు లక్షల పోస్ట్‌లను బలవంతంగా తొలగించింది. వీటన్నింటికీ మించి ఐఫోన్‌, ‌ఫాక్స్‌కాన్‌ ‌తయారీ యూనిట్లు చైనా నుంచి భారత్‌కి తరలించడం చైనా ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ అని చెప్పాలి.

ఈ పరిణామాల తర్వాత చైనా మీడియా మేనేజ్‌ ‌మెంట్‌ ‌కొత్త వ్యూహాల అమలును ప్రారంభించింది. ప్రింట్‌ ‌మీడియా ప్రభావం తగ్గినందున సోషల్‌ ‌మీడియాను ఉపయోగించుకుంటోంది. భారతీయ భాషలలో వేలాది పేజీల కథనాలు, వీడియోలు నేరుగా చైనా నుండి సోషల్‌ ‌మీడియా ప్లాట్‌ఫారమ్‌ ‌లలో వెలువడుతున్నాయి. చైనా సాధించిన విజయా లను వివరించే వేలాది యూట్యూబ్‌ ‌ఛానెల్‌లు ఉన్నాయి. చైనా నుంచి కురిపిస్తున్న సొమ్ముతో ఫేక్‌ ‌వ్యూలు, ఫేక్‌ ‌కలెక్షన్లు రావడంలో పెద్దగా ఆశ్చర్య పడాల్సినదేమీ లేదు.

భారత్‌లో కమ్యూనిస్టు పార్టీలను, చైనా కంపెనీలను బలోపేతం చేసి లాభాలను ఆర్జించడం, సరిహద్దు వివాదాల సమయంలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ ప్రజల అభిప్రాయాన్ని ప్రభా వితం చేయడం చైనా అసలు లక్ష్యం. ఇది ఇలాగే కొనసాగితే ఇరవై ఏళ్ల క్రితం అమెరికాలో చైనా ఆడిన ఆటలు మన దేశంలో కూడా పునరావృత్తం అయ్యే ప్రమాదం ఉంది.

అమెరికా మార్కెట్లపై చైనా ప్రభావం

మనం 20 ఏళ్లు వెనక్కి వెళితే.. 2000 నాటికి అమెరికా ప్రపంచానికి ఒక సూపర్‌ ‌పవర్‌. ‌చైనా దీన్ని సవాలు చేసింది. అమెరికాకు దీటుగా చైనా ఆర్థిక, వాణిజ్య, ఆయుధ రంగాలలో ఎదిగేందుకు ప్రణాళికలు రూపొందింది. చైనా కమ్యూనిస్ట్ ‌పార్టీ మీడియా మేనేజ్‌మెంట్‌లో భాగంగా హాలీవుడ్‌ ‌చిత్రాలకు పరోక్షంగా నిధులు సమకూర్చారు. ప్రధానంగా ‘జాకీ చాన్‌’, ‘‌జెట్‌ ‌లీ’ వంటి హీరోలతో చైనీస్‌ ‌పాత్రలు, స్క్రిప్ట్‌లు రూపొందించారు. ‘షాంఘై నూన్‌’, ‘‌రష్‌ అవర్‌’ ‌వంటి అనేక హిట్‌ ‌సినిమాల ద్వారా అమెరికన్‌ ‌పెట్టుబడిదారులు కమ్యూనిస్ట్ ‌చైనాపై కల దృక్పథాన్ని చెరిపివేసి, అమెరికా-చైనా భాయ్‌ ‌భాయ్‌ అనే భావనను పరోక్షంగా నాటారు.

నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామాను మన మాజీ ప్రధాని మన్మోహన్‌ ‌సింగ్‌తో పోల్చవచ్చు. ఆయన తన పరిపాలనలో అమెరికాలో అవుట్‌ ‌సోర్సింగ్‌ ‌పోగ్రామ్‌కు తలుపులు తెరిచారు. ఒక రకంగా ఒబామా చైనా రివర్స్ ఇం‌జనీరింగ్‌, ‌కాపీరైట్‌ ఉల్లంఘన, డిజైన్‌ ‌దొంగతనాలకు పరోక్షంగా సహకరించారు. ఫలితంగా మొబైల్‌ ‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ‌గాడ్జెట్‌లతో సహా మొత్తం తయారీ రంగంలో చైనా ఆధిపత్యం ప్రారంభమైంది.

 నోకియా, బ్లాక్‌బెర్రీ, మోటరోలా వంటి మొబైల్‌ ‌దిగ్గజాలు మాత్రమే ప్రముఖ బ్రాండ్‌లు. తరువాత మోటరోలాను చైనీస్‌ ‌కంపెనీ ‘లెనోవా’ స్వాధీనం చేసు కుంది. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న హాలీవుడ్‌ ‌సినిమాల్లో ప్రధాన పాత్రలు చైనీస్‌-‌బ్రాండ్‌ ‌ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్‌ ‌గాడ్జెట్‌లను ఉపయోగి స్తున్నట్లు చూపిస్తున్నారు.

చైనా ప్రాయోజిత పర్యటన

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా చైనాపై విశ్వసనీయత దెబ్బ తిన్నది. ఈ నేపథ్యంలో తన పరపతిని పెంచుకోవడానికి ట్రావెల్‌ ‌వ్లాగర్లను ఉపయో గించుకుంటోంది. ఇందులో భాగంగానే అన్వేష్‌ ‌లాంటి కొంతమంది భారతీయ యూట్యూబ్‌ ‌వ్లాగర్లు చైనాలో పర్యటించారు. చైనాలో నివసిస్తున్న కొంతమంది భారతీయులు ఇప్పటికే భారతీయ భాషలలో యూట్యూబ్‌ ‌వ్లాగ్‌లను తయారు చేస్తు న్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే భారతీయ జర్నలిస్టులు తమ దేశంలో పర్య టించేందుకు వీసా ఇవ్వడానికి చైనా నిరాకరిస్తుంది. కానీ యూట్యూబ్‌ ‌వ్లాగర్‌లకు మాత్రం అనుమతి ఇస్తోంది. వీరు అక్కడికి వెళ్లి భారత్‌ ‌కన్నా  చైనాలోనే మెరుగైన పరిస్థితులు, విధానాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని వ్యాపించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అన్వేష్‌ ‌కరోనా మహమ్మారి పుట్టిన వుహాన్‌కు కూడా వెళ్లాడు. అక్కడ స్వేచ్ఛగా తిరుగుతూ చైనా పట్ల సానుకూల దృక్ఫథాన్ని ఏర్పరచాడు. ఇది ఒకరకంగా వుహాన్‌ ‌ఫిష్‌ ‌మార్కెట్‌, అక్కడి ల్యాబ్‌ను సందర్శించేందుకు అనుమతి నిరాకరణను ఎదు ర్కొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలను అపహాస్యం చేయడమే అవుతుంది. చైనా ప్రభుత్వం తన సొంత పౌరులను అణిచివేస్తున్న తీరును టిబెటన్‌ ‌బౌద్దులు, వీయిగర్‌ ‌ముస్లింలపై జరుపుతున్న దురాఘతాలను అన్వేష్‌ ‌తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశాడు. తియాన్మెన్‌ ‌స్క్వేర్‌ ‌ప్రాంతాన్ని చూపుతున్నప్పుడు, దాని చరిత్ర గురించి చర్చించవద్దని చైనా అధికారులు తనను ఆదేశించా రని అంగీకరించాడు.

భారత రాజకీయాలు, సాంస్కృతిక వారసత్వం, సామాజిక వ్యవస్థ, పేదరికం, సంపద పంపిణీ, రాజ్యాంగం, రిజర్వేషన్ల వ్యవస్థమీద అన్వేష్‌ ‌చేసిన వ్యాఖ్యలు ఆయనకు గల ‘సున్నా’ పరిజ్ఞానాన్ని బయట పెట్టాయి.  అనుమతి నిరాకరించిన చైనాను శత్రు దేశంగా భావించడాన్ని అన్వేష్‌ ‌తప్పు పట్టాడు. చైనా మన శత్రువు అని మనకు సరిగ్గా ఎవరు చెప్పారు? మోడీనా.. అమిత్‌ ‌షా? వంటి ప్రశ్నలను ఆయన సంధించారు. తన వ్యాఖ్యల్లో జగన్‌, ‌చంద్రబాబు, పవన్‌ ‌కల్యాణ్‌ల పేర్లు ప్రస్థావించారు.

సీపీఎంవారి తెలుగు దినపత్రిక ‘నవ తెలంగాణ’ అన్వేష్‌ ‘‌ప్రపంచ యాత్రికుడు’ పేరుతో రూపొం దించిన చైనా ట్రావెల్‌ ‌సిరీస్‌ను ప్రశంసిస్తూ జులై 23న ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అన్వేష్‌ ‌భారత రాజకీయాలు, నాయకత్వాన్ని విమర్శిస్తూ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇది ఉద్దేశ్యపూర్వకంగా రూపొందిం చిన స్క్రిప్ట్‌లా కనిపిస్తోంది. ఇదంతా చైనా కమ్యూనిస్టు నాయ కత్వంపై, అక్కడి మౌలిక సదుపాయాలపై సానుకూల అభిప్రాయాన్ని ఏర్పరచడానికి చేపట్టిన కుట్రలో భాగమా అనే అనుమానాన్ని బలపరుస్తుంది.

చైనా ప్రభుత్వం సాధారణంగా విదేశీ పర్యాటకు లపై గట్టి నిఘా పెడుతుంది. అన్ని ప్రాంతాలకూ వెళ్లకుండా పరిమిత ప్రదేశాలకే అనుమతిని ఇస్తుంది. అయితే అన్వేష్‌ ‌తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి నిషేధిత ప్రాంతాల్లో పర్యటించడం, డ్రోన్‌ ఎగరవేయడం గమనిస్తే ఇది కచ్చితంగా స్పాన్సర్డ్ ‌కార్యక్రమమేనని స్పష్టంగా అర్థమైపోతోంది. ఇది వాస్తవం కాదంటే భద్రతా చట్టాలను ఉల్లంఘించినందుకు అన్వేష్‌ను అరెస్టు చేసి ఉండాలి. అది జరగనందునే అనుమా నాలు బలపడ్డాయి.

చైనాలో విదేశాలకు చెందిన సోషల్‌మీడియా యాప్స్ ‌మీద నిషేధం ఉంది. మరి మన యూట్యూ బర్లు అక్కడి నుంచి వీడియోలు ఎలా అప్‌లోడ్‌ ‌చేయ గలుగుతున్నారు?

త్వరలో భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశ రాజకీయా లను ప్రభావితం చేసేందుకు చైనా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.. ఇక్కడ తమకు అనుకూలమైన ప్రభుత్వం రావాలని ఆరాటపడుతోంది. ఇందులో భాగంగానే చైనా ఇలాంటి కుట్రలకు తెరలేపిందనే వాస్తవాన్ని ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. అదే సమయంలో ఇలాంటి కుట్రల్లో తెలిసోతెలియకో భాగస్వాములు కాకుండా జాగ్రత్తపడాలి.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE