– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు
(బుర్రకథ)
చరిత్రకు ఛాయ సాహిత్యం. సృజనాత్మక సాహిత్య పక్రియతో అక్షరబద్ధమైన చారిత్రకఘట్టం త్వరగా జనం గుండెలను తాకుతుంది. దీనిలో తేదీలూ, కార్యకారణ సంబంధాలూ కంటే వైయక్తిమైన అనుభవాలకు చోటు ఎక్కువ. దానికి జనాన్ని కదిలించే శక్తి అధికం. ఇక ప్రదర్శన కళ అయితే చెప్పేదేముంది? అడ్లూరి అయోధ్యరామ కవి పోలీసు చర్యలు బుర్రకథ అలాంటిదే. 1922లో వరంగల్ జిల్లా, తాడికొండలో జన్మించిన అయోధ్యరామ కవి పత్రికా నిర్వాహకుడు, కవి, రచయిత. నైజాం విముక్తి పోరాట యోధుడు కూడా. ఆయన బుర్రకథలు, పద్యాలు, గేయాలు, నాటికల ద్వారా హైదరాబాద్ విలీనం చరిత్రను ప్రజలకు అందించారు. ఇందులో పోలీస్ చర్యలు బుర్రకథ బాగా ప్రాచుర్యం పొందింది. బుర్రకథ పక్రియలో ముగ్గురు కళాకారులు ఉంటారు. కథకుడు, ఇద్దరు వంతలు. బుర్రకథ రాజకీయ, ఉద్యమ స్పర్శ ఉన్న గాథలను జనం దగ్గరకు చేర్చడానికి ఉపయోగపడే బలమైన మాధ్యమం. ఆట, పాట, ఉద్విగ్నత, నాటకీయత ఇందులో ప్రత్యేకతలు.రామకవి కథలో నిజాం విముక్తి చరిత్ర ప్రతిఘట్టం, ప్రతి అడుగును వర్ణించారు. ఇదొక చారిత్రక ఆధారమే.
శ్రీ జయ వీర భారతికే జయము దిగ్విజయము
నైజాం భూమిని నడిచిన గాధను చెప్పెదము వినుడీ
జయము జయము మన భారత మాతకు జయము దిగ్విజయము
సర్దార్ (వల్లభభాయ్)కి జయము జయము
స్వామీజీ (రామానంద తీర్థ)కి జయము దిగ్విజయము
భారతదేశము సర్వ స్వతంత్రత బడయుట కొరకయ్యీ
పోరాటములు ఎన్నో చేసిన ఫలితమ్ము గానూ
భారతదేశమునూ వప్ప చెప్పుచూ ఇంగ్లీషోరు నిష్కృమించినారు
ఐతే తెల్లలు భారతభూమిని ముక్కలే చేశారో,
పాకీస్తానని హిందుస్తానని రెంటితో పోనీకా,
సంస్థానాలను చిన్నముక్కలీ రెంటిలో బెట్టారు.
ఐనా మన సర్దార్ పటేల్ కృషి ఫలవంతంబయ్యే
భారతభూమిని గల సంస్థానాలే బుద్ది తెచ్చుకొనెరా
కాశ్మీరొక్కటి నైజామొక్కటి మిగిలి పోయెనంటే… ఇలా సాగుతుంది. చరిత్రను, నేపథ్యాన్ని కూడా బుర్రకథ స్పృశిస్తూ, వ్యాఖ్యానిస్తూ సాగుతుంది. ఇక్కడ నైజామే మిగిలిపోయింది అంటూ కథలోకి వస్తాడు కథకుడు.
సర్దార్ (వల్లభభాయి) నయమున బల్కెరాసై
ఐనను నైజాం లొంగడే, అన్యాయంబును విడువడే.
అందుకు తోడు ఇత్తేహాదుల్ముసల్మీనురా.. సై
ఎన్నియో ఆశలు జూపెరాసై, అన్నింట నవ్వాబు నమ్మెరా.. సై
కాలగతి దలపోయక విర్రవీగెరా మందుడై అంతక్రితమే
ఎన్నోరీతుల బోధ చేసినా విననట్టీ ప్రభుకూ
విప్లవమంటే ఏమిటో తెల్పగ స్టేటు కాంగ్రెసపుడూ
నడుము గట్టెరా, దేశమునకొక పిలుపునివ్వగానే
కోర్టుల నుండి లాయర్లందరూ వృత్తి వదిలినారు
విద్యార్థులు బడికేగక చదువుల్ మానివేసినారు
ప్రతీ ఇంటిపై భారత్ జండా రెపరెపలాడిందీ
ఆ ఝండాలను ఎగురవేయగా నైజాం సర్కారూ
దాదాపిరువది వేలమందినే జైలున బెట్టారూ….
అప్పుడే, ఇత్తెవోదుల్ము సల్మీన్ ఏం చేసిందిరా అని వంత అడుగుతాడు. లక్షల భారత యూనియను ముస్లింలను రప్పించి రజాకారుల పేరున ఉద్యమ మొక్కటి నిర్మించే తమకు సలామనే వారినే హిందూ మంత్రులనుజేసి మిగతా మంత్రుల తమ అనుచరులనె స్థానములిప్పించే బయట నుండి కొందర్ని ధనాశలు చూపి రప్పించడమూ ఇక్కడున్న వార్ని బయట యూనియన్ ప్రాంతాలకు వెళ్ల గొట్టడమూ, మిగతా ముస్లిమేతరులని ఝుడిపించి, బాకులు చూపి, నానా హింసలు పెట్టి లొంగ తీసుకున్నారు అంటాడు కథకుడు.
కొంచెం ప్రజలెట జాగరూకులో
ఆ యూరంతయు కాల్చివేయుచు
లక్షల ఆస్తులు దోచి వేయుచు
మానవతులనే ఆపహరించుచు
యువకులందర్ని జైలు ద్రోయుచు
నానా హింసల పెట్టుచు నుండి రోయీ హరిహరి…
భారత జెండా కనిపడితేనే పీకి వేయువారూ
ఆగస్టు పదిహేను నలభై ఏడున స్వాతంత్య్రపర్వాన
ఇట్టి కేసులే కొన్ని జరుగగా అడిగె నిజామూను
నిజమిది కాదని భారత సర్కారుతో బొంకాడండి.
భారతనాణెము చెల్లదంచును
కానూనొకటి చేసె నిజాము
భారత సర్కారు సంజాయిషీడుగగ
బొంకి యాత్రీకులది కాదనియెనోయి హరిహరి
ఇట్లాంటి సంఘటనలు వందలకొద్ది జరిగినూ…
మరి మనవాళ్లు ఊరుకున్నారాని వంత అడిగాడు. ఇలా చెప్పాడు కథకుడు.
అరెరె సర్దారు హుంకరించెరా.. జునాఘడ్ నుండి
మెత్తటి మాటల లొంగడంచును విశ్వసించినారూ
భారత సేనలు తాత్కాలికముగా రప్పించుకున్నారు
శాంతిభద్రతలు నైజాంనెత్తిన బెట్టి వేసినారు
ఒక్క యథాతథ ఒడంబడిక చేసుకున్నారండీ…
వంత మరొక ప్రశ్నతో రజాకారుల దమనకాండను ప్రస్తావిస్తాడు కథకుడు. పేనుకు పెత్తన మొచ్చినట్టుగా మెలిగె నిజామండీ.. రజాకారుల వీర విహారము పెరిగిపోయెనండీ…. మొదటి నుండి స్టేట్ కాంగ్రెసు చెప్పినట్లు ఈ హైదరాబాదు రాష్ట్రము భారత యూనియన్‌లో చేరి తీరవలెననే చెప్పుతూ వచ్చింది. ఎందుకయ్యాంటే పరిసర రాష్ట్రాలన్నియు దీనికే బంధము గలదయ్యా…భాషా సంస్కృతి భౌగోళికముగా వేరే కాదయ్యా…బ్రిటిష్ కుట్రల ఆఖరి రూపమె ఇదయ్యా….
యథాతథపు ఒడంబడిక 1947 నవంబర్ ఆఖరివారంలో జరిగింది. ఆరునెలల కాలంలో అనుకోనన్ని ఘోరాలు జరిగినై. భారత సర్కార్ ప్రతి కూలముగానూ కానూన్లెన్నో చేయుచు, బొంకుచు కాలము గడుపుచునూ సిడ్నీ కాటన్ వంటి వ్యాపారుని చేతిలో నుంచుకొని కోట్ల డబ్బును లంచాలిస్తూ ఆటలాడు వారూ మారణాయుధముల్ మందు గుండునూ చేరవేసుకొనుచూ రజాకారులను సైన్యములను అభివృద్ధి చేసినారు. భారతదేశ గర్భము నందే బల్లెములైనారు…
ఇలాంటప్పుడు సాధ్యమైనంత వరకు రక్తపాతం లేకుండా లొంగ దీసుకుందామని విశ్వ ప్రయత్నంతో
మాటకు ముందూ సంప్రదింపులని.. తందానో
ఢిల్లీ లోపల బొంకుచు వచ్చెడి
నైజాం మంత్రివర్గము తోడ… తందానో
జూన్ ఒడంబడికను నామముతో… తందానో
జేసుకొనుటకై సిద్ధపడరా… తందానో
అప్పటికైనా లాయాఖాలీగ్రూప్…. తందానో
ముజ్లిస్‌కు దిగి నిరాకరించెరా… తందానో
అప్పుడు నైజాం రాచరికమ్ము అర్థమయ్యెనంతా రజాకారులా రాక్షస కృత్యాల్‌కని విని చూచారు. ఇక భరించలేమని వెంటనే వార్నింగిచ్చారు. చెన్నపట్నముకు పండిట్ నెహ్రూ వచ్చిన సమయాన స్టేట్ కాంగ్రెసు ఎప్పటికప్పుడు తెల్పినట్టి వివరాలన్నీ మనస్సులో వుంచుకుని ఈ నైజాం రణానికి ఒక్కపోలీసు ఆపరేషన్ మంచిదని చెప్పాడు.
ఈ రజాకార్లూ లాయఖాలీ ప్రభుత్వం ఎలా సంచరిస్తూండేవారంటే
మంచి మాటలను జెప్పుచూ.. సై
భారత సర్కారు తోడుతా.. సై
వైరములే లేకుండుచూ.. సై
యూనియనున గలుపుమని.. సై
హితవు జెప్పు వారెల్లరిన్
ఇమ్రోజ్ పత్రిక నడిపెడి వాడగు షోయబులాఖానూ
ఒక్కనాటి తన సంపాదకీయంలో నటులే వ్రాయ
ఆ జాతీయ ముస్లిమ్ యువకుని హత్యజేసినారు
ఇంకొక ఏడుగురిట్టులె ముస్లిమ్ సోదరులనగానే
వారి పెన్షనుల్ బంద్ చేసి నిర్బంధించారు
దానితో నిజాం ప్రభుత్వంలోని ఇద్దరు హిందూ మంత్రులగు జి. రామాచారి, జె.వి.జోషి గారలు కూడా ప్రజలకు జరిగే అన్యాయం చూసి తమ మంత్రి పదవులు వదిలేసినారు.
ఆచార్యుండగు భన్సాలీజీ ఈ దారుణములనూ కాంచిన వాడై నిరసన వ్రతమును పూననే పూనినాడూ. దీనితో ఈ నైజాం సమస్య అఖిల భారత సమస్యగా మారి 30 కోట్ల ప్రజలను అసంతృప్తిని రేకెత్తించింది. వెంటనే ప్రధాని నిజాంకు ఈ క్రింది విధముగా తెలిపాడు.
మా సేనలు మా బొల్లారము రావడానికయ్యే
ఏర్పాట్లన్నియు చేయగ వలయును. శాంతిని రక్షింపా
రజాకార్ల రాక్షస కృత్యాలే మీరు అణచలేరు, శాంతి భద్రతలు మా సేనలు అట నెలకొల్పగలవు. కానీ దీన్ని నిజాం అంగీకరించలేదు. మరొక వారం రోజులు గడిచినై. అప్పుడు రాజ గోపాలాచారి గారు కూడా టెలిగ్రాం ద్వారా
ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని మా సేనల బిల్చీ శాంతిభద్రతలు నెలకొల్పుటకై త్వరపడుట అవసరము. రజాకారులను రద్దు చేయమన్నాడు. నిజాం నవాబు అంగీకరించలేదు.
నలభై ఎనిమిది సెప్టెంబరు పదమూడవ తేదీన.. నైజాం ప్రజల దాస్య విముక్తికి నాంది సూత్రమయ్యే.. అష్ట దిక్కుల భారత సేనలు నడువ సాగినాయీ, స్టేటు కాంగ్రెసు వాలంటీర్లు త్రోవ నడుచుచుండా విజయవాడలో కదిలిన సైన్యం వడివడిగా పరుగెత్తి బొమ్మకల్లునే ఆక్రమించెరా… మరియొక దళమపుడే కోదాడను కొట్టివేసే… రజాకారులనెదిరిస్తూ షోలాపురము నుండి నడిచెడి సైన్యము కదిలించి నల్ల దుర్గమున రజాకారులను మట్టుబెట్టినాదీ.. వైరులు గూడా బలమగు ఘర్షణ చేసినారు.. వినరా విసనకర్ర వ్యూహమ్మున వచ్చెడి భారత సేనలటా. కొద్దిపాటివే సంఘర్షణలను ఈగల వలె గొడుతూ నాగపురము నుండి వచ్చెడి సేనలు ఆ రోజే బలార్షీయను స్టేషనునప్పుడే పట్టుకొనేనండీ… ఇది మొదటిరోజు వృత్తాంతము.
భారతసేనకు ఫలహారము వలె దొరకనె దొరికిందీ.. చెట్టు చెట్టును పుట్ట పుట్టనూ గాలించారండీ.. రజాకారులక నిలువున ప్రాణాలెగిరి పోయెనండీ యా అల్లా హముకూ కోయితో బచావురే అంటూ ఒకటే పరుగున వెనుకకే పారిపోయినారు. తెలతెల్లారెడి వేళకు రెండవరోజున.. కథ వినరా దౌలతాబాద్‌ను దుర్గము మనసేనలకే వశమయ్యే. ఖమ్మం మెట్టున మనసేనలు నైజాము నెదిరించే .. సూర్యాపేటకు దగ్గరదగ్గర జేరుచునుండెనురా… రాజసూరునే చేరి ఉస్మానాబాద్ పట్టుకొనే బీదరోరుగల్ విమానశాలల ధ్వంసము జేయబడే.. బాంబుల వర్షము ఫెళఫెళ మ్రోతల దిసలు భయము జెందే….
మూడవరోజు సంగతులన్నీ స్థిరముగానూ వినరా, అడ కత్తెర వలె కత్తిరించిరీ ఔరంగాబాదున్…ఖమ్మం దాటీ ఓరుగల్లు దిశ నడుచుచుండెసేనా బీదర్ గూడా స్వాధీనమై పోయెను… వేగంగా సూర్యపేటను దాటి వేసెరా శూరత జూపుచునూ. నాల్గవరోజూ రజాకార్లను పట్టుకోవడం, స్వాధీనమైన నగరాలను పునరావాసంగా చేస్తూ సాగుతుండిరి. ఐదవరోజు అనగా 17వ తారీఖున షోలాపూరూ విజయవాడల నుండి బైలుదేరూ సైన్యాలన్ని ఎనభై మైళ్ళ చేరువ నుండెనురా అంతక్రితం రాత్రి, అనగా 16వ తారీఖు వరకు నైజాం సేనాధ్యక్షుడగు ఎ. అడ్రూస్‌కు దక్షిణ భారత సైన్యమును ఈ పోలీసు చర్యల వ్యూహం నడిపించే కల్నల్, రాజేంద్ర సింహజీ ఈ విధంగా సందేశం పంపాడు.
ఇప్పటికైనా మా సైన్యంబుల.. తందానో
వీర పరాక్రమ విధమును.. తందానో
మీ రజాకారుల క్షీణతగాంచి.. తందానో
ఓటమినికనే నొప్పుకొనుచు.. తందానో
నిర్నిబంధముగ లొంగండోయి.. తందానో
రక్తపాతమును మాన్పగ వలెనంటేనో హరిహరి
ఆ సందేశము నైజాం నవ్వాబు చూచినాడు. బాబో లాయఖాలీ మంత్రివర్గము రప్పించాడండీ.. ఏమి చెప్పుతా రిప్పుడటంచును ప్రశ్న వేసినారూ.. నవ్వాబే పరిపాలనమంతా చేతికి దీసుకొనీ చేసిన దానికి వగ చెదననుచును చెప్పండీనాడు. రజా కారులను మీ ఇష్టముగా బంధించుమన్నాడు. శాంతిభద్రతలు మీరే సంరక్షించండన్నాడు. తాను రజ్వీచే కీలుబొమ్మగా మెలగితి నన్నాడు. తన మాటలనే త్రోసిపుచ్చుచు బంధించిరన్నాడు. దయతో ఇప్పటికేని తనను క్షమించండన్నాడు. వెంటనే నైజాం సేనలోడిన చిహ్నంబుగాను, తెల్లపతాకము నెత్తినారురా ఎల్ల సిపాయీలు. రాజేంద్రసింహుడు వెంటనే రాష్ట్రమంతటికీ మేజర్ జనరల్ చౌదరి గారిని రాష్ట్ర గవర్నరుగా నియమించాడు, శాంతిభద్రతలు నెలకొల్పంగానూ
భారతసేనలు వచ్చెరా /భాగ్య నగరిని జొచ్చెరా/ఎదురేగి అడ్రూస్‌నిల్చెరా/భీతితో శరణుజొచ్చెరా /పరిపాలన తన చేతిలో/తీసుకొనియె గవర్నరూ…
తాత్కాలికమగు సైనిక పాలన సాగుచునున్నాదీ.. అణువణువునే శోధించుచు రజాకార్లందర్ని బంధించిరోయ్ సైనికాధికారులు శోధిస్తూను.. రాష్ట్రములోని పల్లెపల్లెలో మోదములు పొంగే.. అడుగడుగునా ఈ సైనికులకు స్వాగతమే వెలిసే… రజాకారుల పీడ విరగడై పోయింది గానీ కమ్యూనిష్టుల కార్యము మాత్రము మిగిలియె యున్నది.
అదియును కొలదికాలములోనే అంతమొందునండీ
ముందు భవిష్యత్కార్యక్రమమును బాగుగా యోచించీ
ప్రజల పెన్నిధి సమముగ వెలిసిడి స్టేటు కాంగ్రెసును
అన్ని విధాల నమ్ముటే శ్రేయస్సంచును మరువకుడి
మిలటరీ పాలన పోవుట తోడనే మీదే ప్రభుత్వమురా,
ప్రతి యువకుడును ఓటిచ్చినట్టి వాడే ప్రతినిధిరా,
ఆ ప్రతినిధులతో కూడిన సంఘం ఆలోచించునురా,
రాష్ట్ర భవిష్యత్తంతయు వారే నిర్ణయించెదరురా,
ధర్మము న్యాయము శాంతి సౌఖ్య ప్రాధాన్యముగా వెలయు,
రైతు కూలీ ప్రజా కష్టాలన్ని మాయమగు వినరా
హిందూ ముస్లిం భేద భావములు రూపునకుండవురా
హరిజనాది బాధావృత జాతికి కష్టములుండవురా
నీతి నియమములచే పరిపాలన నిత్యము శోభిల్లూ
భారతదేశ భాగ్యమయ్యి మన రాష్ట్రము వెలయునురా
రామరాజ్య సమరాష్ట్రం బొప్పీరాజిల్లును గనరా
బోలో స్వతంత్ర భారత్‌కీ జై, బోలో సర్దార్ పటేల్‌కి
జై, బోలో ఆజాద్‌కీ స్టేట్ కాంగ్రెసుకు జయము జయమ్మను స్థిర చిత్తము తోడా
స్వామీ రామానందతీర్ధుని, సర్దార్ కేశవునీ, ఆచారీనీ, బొమ్మకంటి మొదలగు నాయకులా నాయకత్వమున నడిచిన మేలగు నంచును నమ్ముమురా!
జాగీర్దారీల్ అసమానత్వము రూపుమాపుటకునై హరి జనోద్దరణ, దున్ను వానిదే భూమియునగుటకునై స్టేటు కాంగ్రెసును మరువకున్నచో చేకూరును మేలు, నమ్మిన వానికె ఫలితమ్ము సుమ్మినా మాటలు వినుమోయ్
జయ జయ జయ జయ జయ జయ జయ జయ భారతికీ జయమౌ
తద్వారా హైదరాబాద్ స్టేట్ భారత యూనియన్‌లో చేరింది.
సర్వే జనాః సుఖినోభవంతు