గ్రామీణ బిహార్‌లో 1960ల్లోని తన స్వంత అనుభవాల నుంచి, స్వచ్ఛ భారత్ మిషన్ దాకా సాధించిన అభివృద్ధి వరకు దేశంలో పారిశుద్ధ్య ప్రాజెక్టుల పురోగతిని గురించి సులభ్ వ్యవస్థాపకుడు, దార్శనికుడు డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ సెప్టెంబర్ 2022లో రాసిన వ్యాసమిది. స్వచ్ఛత దిశగా భారత్ ప్రయాణంలో కీలక తత్వవేత్త, కార్యకర్త అయిన పాఠక్ ఇటీవలే మరణించారు. ఆయనకు నివాళిగా ఆయన మాటల్లోనే …
గ్రామీణ పారిశుద్ధ్యానికి సంబంధించిన శాస్త్రీయత, ఆర్ధిక కోణాలను తొలిసారి 1968లో తీవ్రంగా ఎదుర్కొన్నాను. గ్రామీణ బిహార్‌లో పుట్టిపెరిగిన నాకు, బహిరంగ మలవిసర్జన, లేదా డ్రై లెట్రిన్‌ల వల్ల కలిగే హాని గురించి బాగా తెలుసు. అయితే, బెతియాలో బిహార్ గాంధీ సెంటెనరీ కమిటీకి స్వచ్ఛంద కార్యకర్తగా పని చేస్తున్న సమయంలో ఈ అంశానికి సంబంధించిన పలు కోణాలను పూర్తిగా అవగాహన చేసుకోగలిగాను. వాస్తవానికి, మలవ్యర్ధాల అశాస్త్రీయ నిర్వహణ కారణంగా ఎదురయ్యే సవాళ్లు సంక్లిష్టమైనవే కాదు, ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి కూడా. అది కేవలం పారిశుద్ధ్యానికి సంబంధించిన విషయం కాదు, గ్రామీణ ఆరోగ్యం, వ్యక్తి ఆత్మగౌరవం, మహిళా సాధికారత, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థతో ముడిపడిన విషయం. 2022లో మనం మహాత్ముని 153వ జయంతిని జరుపుకుంటున్న నేపథ్యంలో, స్వాతంత్య్రానంతర భారతదేశంలో పారిశుద్ధ్య ఉద్యమ గతిని, ప్రాధాన్యతలను, ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2014లో స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్‌బిఎం)ను ప్రారంభించిన అనంతరం పారిశుద్ధ్య సంవాదపు అద్భుత పునరుజ్జీవనాన్ని సమీక్షించుకోవడం ఎంతో అవసరం, లాభదాయకం.
తొలినాళ్లలో సవాళ్లు
మార్చి 1970లో సులభ్‌ను ప్రారంభించక ముందుకాలంలో, భారత్ ‘క్యాచ్ 22’ (పరస్పర ఆధారిత పరిస్థితుల కారణంగా తప్పించుకోలేని సందిగ్థ లేదా క్లిష్టమైన స్థితి) అన్న నానుడిలో చిక్కుకుని ఉంది. పట్టణ మురుగునీటి వ్యవస్థ బాధాకర స్థాయిలో అసమగ్రం కాగా, గ్రామీణ మురుగునీటి వ్యవస్థ అసలు లేదు. దీనితో, డ్రై లెట్రిన్లు, బహిరంగ మలవిసర్జన మధ్యనే ఎంపిక చేసుకోవలసి వచ్చేది. దురదృష్టవశాత్తు ఈ రెండు ఎంపికలూ కూడా సమానంగా హానికరమైనవి. రెండూ దుర్వాసనతో కూడిన మురుగుకు దారి తీయడమే కాక, మట్టి లేదా భూకాలుష్యానికి, భూగర్భ జలాలు కలుషితం కావడానికి కారణ మయ్యాయి. మలంలో గల ప్రమాదకర సూక్ష్మక్రిములు ఎంత చలనశీలమైనవి, సమర్ధవంతమైన వంటే, అవి దాదాపు 30 అడుగుల దూరం వరకూ నీటి మూలాలను కలుషితం చేయగలవు. దీనిపై ఇసుక వేయడమన్నది పరిస్థితికి పాక్షిక విరుగుడు అయినప్పటికీ, భారత్‌లో సర్వసాధారణమైన వరదల సమయంలో పరిస్థితి అత్యంత దారుణంగా మారే అవకాశాలు ఉండేవి. అందుకే గ్రామీణ భారతంలో తరచుగా కలరా, నీటి ద్వారా సంక్రమించే ఇతర వ్యాధులు పెచ్చరిల్లు తుండేవి.
అత్యవసర వైద్య పరిస్థితులకు మాత్రమే కాకుండా, డ్రై లెట్రిన్లు, బహిరంగ మలవిసర్జన అన్నవి ఇతర సమస్యలకు కూడా దారి తీసేవి. పరిశుభ్రత, ఆరోగ్యం, ధర్మనిష్ఠ మధ్య గల తాత్విక లంకెలను పట్టి చూపే ఉపదేశాలు మన ప్రాచీన భారతీయ గ్రంథాలలో ప్రముఖంగా ఉన్నప్పటికీ, మన సమాజం ఎందుకో పారిశుద్ధ్యాన్ని ఒక సీమాంత లేక పరిధీయ సంభాషణగా మార్చింది. అలాగే, దానికి సంబం ధించిన ప్రతినిధులను, అంటే పారిశుద్ధ్య కార్మికులు, పాకీ పని చేసే కార్మికులను అస్పృశ్యులుగా ముద్రవేసి, పందులు, పశువులతో కలసి గ్రామ శివార్లలో నివసించేలా బహిష్కరించారు. ఈ సామాజిక కళంకం లేదా మచ్చ ఎంత కఠినంగా ఉండేదంటే, ఆ వర్గానికి చెందిన వ్యక్తులకు వేరొక వృత్తిని చేపట్టే అవకాశమే ఉండేది కాదు.
భారతదేశంలో, ముఖ్యంగా పేదల జీవనోపాధి, ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత (వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్ – WASH) సేవలు కీలకం. అపరిశుభ్ర పరిసరాలు, పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు మహిళలు, ఐదేళ్లలోపు పిల్లలు అత్యధికంగా ప్రమాదానికి లోనవు తారన్నది శాస్త్రీయంగా నిరూపితమైన అంశం. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఆరోగ్య సంక్షోభం, వేగంగా ఆర్ధిక కష్టాలకు గురయ్యే పరిస్థితి తరచుగా ఆ తరాన్ని మాత్రమే కాక తర్వాత తరాలను ప్రభావితం చేసేలా పెరుగుతాయన్నది సులభ్ ఐదు దశాబ్దాల సుదీర్ఘ వృత్తిలో గమనించిన విషయం. ఈ కారణాల వల్లే, మల అశాస్త్రీయ నిర్వహణకు పరిష్కారం కనుక్కోవడం అన్నది గ్రామీణ ఆర్ధిక వ్యవస్థపైనే కాదు, దాని సామాజిక నిర్మితిపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందని మనకు తెలుసు.
మురుగునీటి నెట్‌వర్క్ పరిమితం అయినందున, సులభ్ రెండు గుంతల ఫ్లష్ టాయిలెట్ (టూ పిట్ పోర్-ఫ్లష్ టాయిలెట్) అన్నది అత్యంత స్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడిన వ్యవస్థగా ఉద్భవించింది. ఇది అందుబాటు ధరలో, తేలికగా నిర్మించగల, విసర్జించిన మపదార్ధాన్ని ఎరువుగా మార్చడం ద్వారా కాలుష్యం, వ్యాధులకు కారకమైన దానినే మట్టిని మళ్లీ పునరుజ్జీవం చేసేదానిగా మార్చడం అన్న లాభాలను కలిగించింది.స్వచ్ఛ భారత్ మిషన్ సమయంలో గరిష్ట సంఖ్యలో నిర్మించిన మరుగుదొడ్లు సులభ్ టెక్నాలజీని ఉపయోగించాయన్న వాస్తవం దాని సాఫల్యతకు ప్రమాణంగా నిలుస్తుంది.
ఎస్‌బిఎం: ప్రధాన స్రవంతిలోకి పారిశుద్ధ్య చర్చను తేవడం
పారిశుద్ధ్యం, పరిశుభ్రత అన్నవి కేవలం ఉమ్మివేయడం, చెత్త వేయడం, బహిరంగ స్థలాలలో మూత్ర లేదా మల విసర్జన వంటి అనారోగ్యకరమైన అలవాట్లకు మాత్రమే పరిమితం కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. అవి శరీరానికి, మనసు రెండింటికీ సంబంధించిన అలవాట్లతో కూడి ఉంటాయి. సంపూర్ణమైన పరివర్తనకు అవసరమైన మూడు ముఖ్యాంశాలు – సమస్యలపై నిరంతర చర్చ, బలమైన విధానపరమైన జోక్యం, చురుకైన రాజకీయ నాయకత్వం అని నా అనుభవం సూచిస్తుంది.
మహాత్మాగాంధీ ఈ మూడింటినీ అవిశ్రాం తంగా, అనేకసార్లు తానే ఉదాహరణగా ఉంటూ ముందుకు తీసుకు వెళ్లారు. అయితే, 1948 అనంతర సంవత్సరాలలో, గ్రామీణ పారిశుద్ధ్యాన్ని తొలి పంచవర్ష ప్రణాళిక కార్యక్రమం (1951-56) పొందుపరిచినప్పటికీ, ఈ విషయంలో సుదీర్ఘకాల స్తబ్దతకు దేశం సాక్షిగా ఉంది. శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారీ ప్రగతిని సాధించి, అస్పృశ్యతను నిర్మూలించేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నప్పటికీ, పారిశుద్ధ్య స్థితిగతులు దాదాపుగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. అదృష్టవశాత్తు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తొలిసారి చారిత్రక ఎర్రకోట నుంచి మాట్లాడుతూ, ‘మహాత్మా గాంధీ హృదయానికి అత్యంత సన్నిహితమైన’ రెండు లక్ష్యాలు – పరిశుభ్రత, పారిశుద్ధ్యం పట్ల తమ ప్రభుత్వ నిబద్ధతను ప్రకటించారు. తర్వాత 2 అక్టోబర్ 2014లో ఎస్‌బిఎంను అధికారికంగా ప్రారంభించారు.
భారతదేశంలో పారిశుద్ధ్య స్థితిగతుల గురించి ప్రధానమంత్రి స్పష్టమైన అభిప్రాయాలు, కొంత మందికి అసంతృప్తిని కలిగించినప్పటికీ, పారిశుద్ధ్యంపై బహిరంగ చర్చను పునరుజ్జీవింపచేశాయి. దాదాపు ఆరు దశాబ్దాల అంతరం తర్వాత పారిశుద్ధ్య అంశాన్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చి, దేశంలో అత్యున్నత ప్రాధాన్యం కలిగిన దానిగా చేస్తా రనేందుకు ఇది స్పష్టమైన సంకేతం. ఈ ఉద్యమం సంచలనాత్మకమే కాక, ఇప్పటివరకూ తెరమరుగైన విషయాన్ని హఠాత్తుగా సర్వవ్యాప్తం చేసింది.
ఎస్‌బిఎం 2, దాని ఆవల
ఏదైనా ప్రగతిశీల చర్చను ముందుకు తీసుకు వెళ్లేందుకు తగిన మౌలిక సదుపాయాలను సృష్టించడం అత్యవసరం. ప్రస్తుత ప్రభుత్వం చెప్పింది చేసిందనే విషయాన్ని అంగీకరించడానికి నాకు ఎటువంటి సంకోచం లేదు. పారిశుద్ధ్యం రాష్ట్ర అంశమైనప్పటికీ, ఆర్ధిక, సాంకేతిక తోడ్పాటును కేంద్రం రాష్ట్రాలకు అందించింది. ఇందులో, ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12,000 ప్రోత్సా హకం, ప్రజా పారిశుద్ధ్య సముదాయాలు (సిఎస్‌సిలు)కి నిధులను సమకూర్చింది. పరిశుభ్రత ప్రవర్తనకు సంబంధించిన అంశమైనా, ప్రజలలో అవగాహన పెంచేందుకు భారీ స్థాయిలో సామర్ధ్య నిర్మాణ విన్యాసాలు, బహుళ మార్గాల ద్వారా సమాచారం, విద్య, కమ్యూనికేషన్ (ఐఇసి) చొరవలను ప్రారంభించారు. సులభ్ స్కూల్ శాని టేషన్ క్లబ్‌లకు సంబంధించిన నా స్వంత అనుభవం, ఐఇసి కార్యక్రమాల ప్రభావం సమర్ధవంతం, శాశ్వతం.
ప్రధాని మోదీ సామాజిక ఆధారిత విధానం అత్యంత లాభాలను అందించింది. 2014-15, 2019-20 మధ్య కాలంలో 10 కోట్లకు పైగా మరుగు దొడ్లను నిర్మించి, అక్టోబర్ 2, 2019న గ్రామీణ భారతం బహిరంగ మలవిసర్జన రహితమని ప్రకటన చేశారు. ఎస్‌బిఎం2ను 2020లో ప్రారం భించడమే కాక గోబర్‌ధన్ పథకం కింద బయో- గ్యాస్‌ను ప్రోత్సహిస్తూ గ్రామాలను బహిరంగ మల విసర్జనరహితంగా ఉంచడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా తన లక్ష్యాలను విస్తృతం చేసి, ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణ (ఎస్‌ఎల్ డబ్ల్యు ఎం)ను కూడా ఇందులో పొందుపరిచి, చెత్తరహిత నగరాలను సాధించాలని ప్రధాన లక్ష్యంగా పెట్టు కుంది. వార్షిక స్వచ్ఛ భారత్ సర్వేక్షణ్ (2017లో ప్రారంభించిన) లో గ్రామానికి ఒడిఎఫ్ హోదా లేదా ఒక నగరానికి ర్యాంక్ ఉండటం అన్నది ప్రస్తుతం అత్యధిక సామాజిక లాభాలను కలిగి ఉంది. అంతేకాక, ఆ ర్యాంకులు పాలన స్థితిగతుల ప్రత్యక్ష ప్రతిఫలం. ‘‘మనం మన చెత్త అలవాట్ల నుంచి బయిటపడి, మరుగుదొడ్లను మెరుగుపరచుకోకపోతే, మనకు స్వరాజ్యం పట్ల విలువ ఉండదు’’ అని ఒకసారి గాంధీ పేర్కొన్నారు. ఎస్‌బిఎంతో స్వరాజ్ నుంచి పారిశుద్ధ్యాన్ని వేరుచేయలేని ప్రాథమిక అంశంపై పట్టుబట్టడం అన్నది వాస్తవికతకు మరింత సన్నిహితం అయింది.
(ఆర్గనైజర్ నుంచి)