ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన
– పి. చంద్రశేఖర ఆజాద్, 9246573575
‘‘నువ్వు కంగారు పడకు. ఇది స్టడీస్ టైమ్. నాలుగయిదు రోజుల్లో కోపం తగ్గాక వస్తుందని అనుకోవద్దు. ఆద్య పట్టుదల నాకు తెలుసు. నేను తొందర్లో వస్తాను. మనం మాట్లాడుకుందాం’’ అంది స్వప్న.
‘‘ఈ విషయం శ్వేతకు చెబుతావా?’’
‘‘ఆలోచిస్తాను. నేను శ్రీనివాస్‌తో కూడా మాట్లాడతాను’’ అంది స్వప్న.
*****
గోవింద్ బుద్ధ రామకృష్ణకి ఏదో విషయం చెప్పాడు.
‘‘నిజమా’’ అన్నాడాయన.
తలూపాడు. ‘‘మంచిదే బుద్ధా… జనరేషన్ మారు తోంది. ఎవరి ప్లాన్స్ వారికి వుంటాయి. లెట్ దెమ్ ప్రోసీడ్’’ అన్నాడు.
ఆ తర్వాత ‘‘నాకు ముంబయ్ వెళ్లాలని వుంది’’ అన్నాడు.
‘‘కొంత కాలం మీరు ఇక్కడ వుంటే బాగుండునని పిస్తోంది సర్. మనం అనుకుంటున్న పనులు ఇప్పుడు ఓ రూపంలోకి వస్తున్నాయి. ఇప్పుడు మీరు ముంబయ్ అంటే రిత్విక్‌ని మీ దగ్గరకు పంపించాలి. నేను కూడా కొన్ని పనుల్లో బిజీగా వున్నాను. మన ముగ్గురం వుంటే మాట్లాడుకోవచ్చు’’.
‘‘అలాగే… ఇప్పుడు నేను ముంబయ్ వెళ్లి చేయగల పనులు లేవు. రిత్విక్‌కి వీసా తీసుకునే పనిలో వుండు బుద్ధా’’.
‘‘యు.యస్. వీసానా?’’
‘‘కాదు. యు.కే. వీసా… అది ఎంత త్వరగా పూర్తి అయితే అంత మంచిది’’.
‘‘ఈ రోజు నుంచే ఆ పనిలో వుంటాం సర్’’ అన్నాడు గోవింద్ బుద్ధ.
*****
యూనివర్సిటీకి వెళ్లబోతోంది శ్వేత.
అప్పుడు స్వప్న వచ్చి ‘‘అయిదు నిమిషాలు నీతో మాట్లాడాలి’’ అంది. తలూపింది.
‘‘ఆద్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది’’.
‘‘నాకు తెలుసు మమ్మీ… నాకు చెల్లి ఫోన్ చేసి చెప్పింది’’.
‘‘నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు?’’ ఆశ్చర్యంగా అడిగింది స్వప్న.
‘‘తను చదువుకుంటానికి ఫ్రెండ్ రూమ్‌కి షిఫ్ట్ అయింది. ఇంటి దగ్గర కంటే కంబైన్డ్ స్టడీ అయితే బాగుండును అనుకుంది. అయినా ఆద్య విషయం పిన్ని నీకు చెబుతుందని నాకు తెలుసు’’.
తన భావాలను అణుచుకుని ‘‘ఆద్య ఇంకేమన్నా చెప్పిందా?’’
‘‘అంటే….’’
‘‘ఇంట్లో గొడవల గురించి, తను ఇంటి నుండి ఎందుకు రూమ్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఇలాంటి విషయాలు’’.
‘‘నాకు ఏమీ చెప్పలేదు మమ్మీ… నేను ఫ్రెండ్ రూమ్‌కి మారాను అని మాత్రం చెప్పింది. ఏమన్నా గొడవలు జరిగాయా?’’
‘‘ఏదొకటి జరగకపోతే ఇంత సడన్‌గా బయటకు ఎందుకు వెళ్తుంది’’ అంది స్వప్న.
‘‘ఒకటి మాత్రం నేను చెప్పగలనమ్మా.. ఆద్య అంటే నాకు ఎడ్మిరేషన్ వుంది. నేను కొన్ని విషయాల్లో తన అభిప్రాయాలు తెలుసుకుంటుంటాను. ఐ.ఎ.ఎస్.లో అనేక సబ్జెక్ట్ లు వుంటాయి. ఒక్కోసారి తన విశ్లేషణ నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆద్య తొందరపడదు అని నా అభిప్రాయం. పిన్నితో చిన్న చిన్న డిఫరెన్సెస్ వున్నా… ఆ రిలేషన్‌ని తెంచుకునే అంత మూర్ఖంగా ఆద్య వుండదని అనుకుంటు న్నాను’’.
అప్పుడు స్వప్న ముఖం మారిపోయింది.
‘‘నేను ఆద్యని కలుసుకుంటాను. మాట్లాడతాను. ఇలాంటి వాటి విషయంలో ఆలస్యం జరగటం మంచిది కాదు. అప్పుడు సమస్యలు మరింత కాంప్లికేట్ అవుతాయి. నేను వస్తాను’’ అని వెళ్లిపోయింది.
స్వప్న అలానే నిలబడిపోయింది. అప్పుడు శ్రీనివాస్ వచ్చాడు.
‘‘నువ్వింకా ఆద్య గురించే ఆలోచిస్తున్నావా?’’ అనగానే అతనికేసి తిరిగింది.
‘‘అలా వున్నావేంటి?’’ అన్నాడు.
‘‘మనం శ్వేత గురించి కూడా ఆలోచించాలి శ్రీనివాస్’’ అంది.
‘‘ఇప్పుడేమయింది?’’
‘‘ఏమీ కాలేదు. నేను అఖిల దగ్గరకు వెళ్లి వస్తాను’’ అంది.
*****
‘‘హారికా… నేను వీసాకోసం ఈ రోజు వెళ్తున్నాను’’.
‘‘అమెరికన్ వీసాకా?’’
‘‘కాదు. యు.కె. వీసా కోసం’’.
‘‘అవుతుందంటారా?’’
‘‘అవుతుందనుకుంటున్నాను. సీనియర్ సిటిజన్స్‌కి అభ్యంతరం పెట్టరు. అలాగే నేను ఓ ప్రముఖ కంపెనీ తరపున వెళ్తున్నాను. అందులోనూ విజిటర్స్ వీసా కదా’’.
‘‘మొట్టమొదటిసారి విదేశం చూడబోతున్నారు. అందులోనూ ఈ మధ్య కాలంలో మీకు పాస్‌పోర్ట్ రెన్యూల్ అయింది. నాకు చాలా సంతోషంగా వుంది’’.
‘‘నువ్వు కూడా నా పక్కన వుంటే ఇంకా నాకు సంతోషం’’.
‘‘నాకు ఇల్లే లండన్. అమెరికా!’’
ఇద్దరూ నవ్వుకున్నారు.
‘‘ప్రయాణం ఎప్పుడో తెలిసిందా?’’
‘‘ముందు వీసా కన్ ఫామ్ కావాలి. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందో తెలుసా? ఇది నా అదృష్టం. ఇప్పటికే నేను లెజెండ్స్‌తో జర్నీలో వున్నాను. గోవింద్ గారు నా వెనక వుంటాను అన్నారు. అయితే ఇంత అదృష్టం అందిస్తారని నాకు తెలియదు. ఇప్పటి వరకు నా ప్రయాణం వేరు. ఇప్పుడు చేయబోతున్నది వేరు. నాకు టైం అవుతోంది. మళ్లీ మాట్లాడతాను’’ అని ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగాడు.
అక్కడ గోవింద్ నిలబడి వున్నాడు.
‘‘హారికతో….’’
‘‘విన్నాను. ఆశయాలలో, ఆవేదనలో నిండుగ నిలిచే తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గమూ అనే పదాలు నాకు చాలా ఇష్టం రిత్విక్’’ అన్నాడాయన.
*****
తులసి వసుంధర దగ్గరికి వచ్చింది. అప్పుడు తను సరయూతో మాట్లాడుతోంది. కూతురుతో మాట్లాడుతున్నప్పుడు వసుంధర కళ్లల్లో కనిపిస్తున్న ఆనందాన్ని గమనిస్తోంది. వసుంధరకి అమ్మ అడుగుల చప్పుడు కూడా వినిపించలేదు. ఫోన్ మాట్లాడటం పూర్తి అయ్యాక తృప్తిగా చూసుకుని తల పంకించింది. అప్పుడు అమ్మని గమనించింది.
‘‘ఎంత సేపయిందమ్మా వచ్చి…’’
‘‘నువ్వు సరయూతో మాట్లాడుతున్నప్పుడు’’.
వసుంధర ముఖంలో సన్నటి రేఖ మెరిసి మాయం అయింది.
‘‘నన్ను పిలిస్తే వచ్చే దాన్ని కదమ్మా’’.
‘‘అడుగులు వేయాలనిపించింది వసూ…’’ అని….
‘‘నేను ఇండియా వెళ్తాను’’ అనగానే ఉలిక్కిపడింది.
‘‘ఇండియానా?’’
‘‘అవును’’.
‘‘ఇప్పటికిప్పుడు నీకు తోడుగా రావటానికి నాకు కుదరదమ్మా’’.
‘‘జయమ్మ వుందిగా నాతో వస్తుంది’’.
‘‘నిలబడి మాట్లాడుతున్నావు. కూర్చోమ్మా’’.
‘‘ఫర్వాలేదు. ఇప్పటి దాకా విశ్రాంతి తీసుకున్నాను. నన్ను నిలబడనీ’’.
‘‘ఇప్పుడు నీకు ఇండియా వెళ్లాలని ఎందుకు అనిపించింది’’ అదోలా అంది వసుంధర.
‘‘అక్కడ నా రూట్స్ వున్నాయి వసూ… ఇప్పటి దాకా సరయూతో మాట్లాడుతుంటే నీ ఆనందాన్ని చూసాను. నాకు ఇంకో కూతురు వుంది. అలాగే రసజ్ఞ వుంది. కారణాలు ఏమైనా వారిని నేను మిస్సవుతున్నాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఈ వయసులో నాకు పట్టుదలలు అవసరమా అనిపిస్తోంది…’’
‘‘భువన దగ్గరికి వెళ్తే నీకు అవమానాలు జరుగుతాయి. ఈ వయసులో అవన్నీ నీకు అవసరమా?’’
‘‘వసూ… సరయూ నీకు ఒక్క ఆడపిల్ల కావచ్చు. రేపు ఇలానే వుంటుందా? ఏమయినా జరగవచ్చు. అప్పుడు సరయూని కాదనుకుంటావా?’’
వసుంధర మాట్లాడలేకపోయింది.
‘‘ఎక్కువ సమయం లేదు పరిష్కరించవలసిన సమస్యలు చాలా వున్నాయి. కొంతమందికి నేను క్షమాపణలు చెప్పాలి. కొంతమందిని కౌగలించుకుని తనివి తీరా ఏడవాలని వుంది’’ అంటున్నప్పుడు ఆమె గొంతు వణికింది.
‘‘ఇప్పటికి కూడా ఇలాంటి పని చేయకపోతే భగవంతుడు ఇంకో అవకాశం ఇవ్వడు. అప్పుడు బతికినంతకాలం ఏడుపు తప్ప ఇంకేం మిగలదు. అందుకని త్వరగా టిక్కెట్లు బుక్ చేయించు’’ అని వెనక్కి తిరిగి తన గదికి వెళ్లిపోతుంటే వసుంధరకి ఏం చేయాలో అర్థం కాలేదు.
అప్పుడు ఫోన్ రింగ్ అయింది.
‘‘రమేష్… సమయానికి ఫోన్ చేసావు. అమ్మ ఇండియా వెళ్తాను అంటోంది’’.
‘‘నిజమా!’’
‘‘ఇప్పుడే టిక్కెట్లు బుక్ చేయమంది. జయమ్మని తీసుకుని వెళ్తాను అంది’’.
‘‘నువ్వు ఆ విషయం గురించి ఆలోచించకు. తను ఏదో ఎమోషన్‌లో వున్నారు. నాలుగు రోజులు ఆగితే మళ్లీ మామూలుగా అయిపోతారు’’.
‘‘నాకు అలా అనిపించటం లేదు రమేష్. అమ్మ మనసులోకి ఇలాంటి ఆలోచన రాకూడదు. వస్తే తను అనుకున్నది చేస్తుంది’’.
రమేష్ మాట్లాడలేదు.
‘‘నేను ఓడిపోతున్నాను అనిపిస్తోంది!’’
‘‘ఎవరి మీద?’’
‘‘భువనేశ్వరి మీద’’.
‘‘నాన్సెన్స్ వసూ…నీ చెల్లి మీద నువ్వు ఓడిపోవటం ఏమిటి! అసలు వారికీ మనకూ ఏ విషయంలో పోలిక వుంది. ఆస్తుల విషయంలోనా… ఇంకే విషయంలో అయినా వాళ్లు మనకు సరితూగరు. నువ్వు వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. ఇందులో గెలుపు, ఓటములు ఏంటో నాకు అర్థం కావటం లేదు. అత్తయ్యని వెళ్తే వెళ్లమను. ఏమవుతుంది? మనది వేరే ప్రపంచం. ఇందులో నువ్వూ, నేనూ, సరయూ, రాహుల్ వున్నాం చాలు. నేను లంచ్‌కి రావటం లేదు. అది చెప్పటానికి ఫోన్ చేసాను’’ అని కట్ చేసాడు.
తన ముందు ఇంకో వసుంధర నవ్వుతున్నట్లు అనిపించింది.
ఈ పరిస్థితిని ఆమె జీర్ణించుకోలేకపోతోంది.
*****
ఎయిర్ పోర్ట్ నుండి శ్వేతని ఆద్య రూమ్‌కి తీసుకు వచ్చింది. అప్పుడు జూలీ వుంది. అక్కను పరిచయం చేసింది. ‘‘ఇంతకు ముందు మీ గురించి ఆద్య చెప్పింది. తను మీ గురించే ఎక్కువ మాట్లాడుతుంది. మీరంటే తనకు అడ్మిరేషన్. మీరు కాబోతున్న కలెక్టర్ కదా… నాకు కొంచెం పనుంది. మనం లంచ్‌లో కలుద్దాం’’ అని గడగడ మాట్లాడి వెళ్లిపోయింది జూలీ.
‘‘నేనంటే నీకు అంత ఎడ్మిరేషనా ఆద్యా’’ అంది శ్వేత.
‘‘అవును. నాకు వుంది నువ్వే కదా అక్కయినా, ఫ్రెండయినా!’’
‘‘ఇప్పుడు చెప్పు’’ అంది.
‘‘ప్రత్యేకంగా చెప్పటానికి ఒకే విషయం వుంది అక్కా…! ఇప్పటి వరకు మనం కొన్ని విషయాలు పట్టించుకోలేదు. మనది చదువుకునే వయసు. మన ఇంట్లో చాలా ఘర్షణలు జరిగాయి. అవన్నీ మనకు లీలగానే తెలుసు. ఆ ఘర్షణల సమయంలో గది తలుపులు మూసుకునేవి. మనల్ని దగ్గరకు రానిచ్చే వారు కాదు’’
‘‘పిల్లల ముందు తగాదా పడటానికి ఏ తల్లిదండ్రులూ ఒప్పుకోరు ఆద్యా’’ అంది శ్వేత.
‘‘అది మంచి లక్షణమే. నేను కాదనటం లేదు. మనం ఔట్ సైడర్స్‌గా మిగిలాం. కొన్ని విషయాలను ఓ పక్క నుండి మాత్రమే విన్నాం అవునా?’’ అంది ఆద్య.
తలూపింది.
‘‘ఇప్పుడు నువ్వు కలెక్టర్ కాబోతున్నావు. మెల్లగా నీకంటూ ఓ జిల్లాని కేటాయిస్తారు. ఇంకో డిపార్ట్‌మెంట్‌కి పంపించవచ్చు. అక్కడ కొన్ని వేల మంది ప్రజలు నీ నిర్ణయాల మీద ఆధారపడి వుంటారు. రేపు నేనూ అంతే. నా దృష్టిలో ఒకటుంది. అందుకు నేను ప్రిపేర్ అవుతున్నాను. దాని గురించి తర్వాత చెబుతాను. మన ఇంటిలో సమస్యలు వున్నాయి. అవి పరిష్కరించుకోకుండా ఇంకొకరికి ఏదన్నా చెప్పాలన్నా నాకు సిగ్గుగా అనిపిస్తోంది’’ అంది ఆద్య.
‘‘అవును… నాకు ఎప్పటి నుంచో ఇలాంటి ఆలోచన వుంది. దేనికయినా సమయం రావాలం టారు. అది ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నాను’’.
‘‘మన రెండు కుటుంబాల మధ్య ఆస్తుల తగాదా లేదు’’.
‘‘ఇప్పటి వరకు అమ్మా – పిన్నీ ఈ విషయంలో గొడవలు పడటం లేదు. అంత వరకు కరెక్ట్…’’
‘‘మరి తాతగారితో గొడవలు ఎందుకు? మనల్ని తాతగారితో మాట్లాడవద్దని ఎందుకు ఆంక్షలు పెట్టారు? చిన్నప్పటి నుంచి నాకు గాని నీకు గాని, తాతగారి ప్రేమ మాత్రం తెలుసు. మనల్ని రెండు కళ్లు అనుకున్నారు. ఆయన్ని ఎందుకు మనకు దూరం చేసారు. ఇది నా బాధ’’
‘‘ఇవన్నీ ఇగో ప్రాబ్లమ్స్ ఆద్యా’’.
‘‘నేను తాతగార్ని సపోర్ట్ చేయను. అలా అని వ్యతిరేకించను. పూర్తిగా ఏం జరిగిందో నాకు తెలియదు. నేను విన్నది కేవలం ఓ కోణం. ఇలా ఎన్ని రోజులక్కా!’’
చిన్నగా తలూపింది శ్వేత.
‘‘ఇంత ద్వేషమా… మాటలకి శక్తి వుంటుంది. నేను కాదనను. దాని వెనకాల ప్రేమ కూడా వుంటుంది. తాత తన కూతుర్లని ఏదో అనుంటారు. ఆయనకు తెలియకుండా గాయపరిచి వుంటారు. ఓసారి పంతాలు, పట్టుదలలు వచ్చినప్పుడు ఆ మాటలు ఓ పక్కనే వుండవు. తాతను ఏమీ అనలేదని అమ్మా-పెద్దమ్మా చెప్పగలరా?’’ అంది కాస్త ఆవేశంగా.
‘‘నేను అర్థం చేసుకుంటాను ఆద్యా’’.
‘‘ఇంట్లో నీకూ-పెద్దమ్మకి మధ్య ఘర్షణ వాతావరణం వుందో లేదో నాకు తెలియదు. నా విషయం చూడు. నేను జూలీతో స్నేహం చేయకూడదు. ఇది అమ్మ శాసనం. జూలీ డ్రెస్ చూసావు. తను వైన్ తాగుతుంది. సిగరెట్ తాగు తుంది. అది తన పర్సనల్ ఛాయిస్… బట్ షీ కెన్ ఎనలైజ్ ఎనీ థింగ్… అందులో మనకి నచ్చేవి వుంటాయి, నచ్చనివి, అంగీకరించ లేనివీ వుంటాయి. తనేం నన్ను ఫాలో అవమని నన్ను బలవంతం చేయదు. అసలు నేను ఇంటిలో నుండి ఎందుకు బయటకి వచ్చాను. నన్ను అర్థం చేసుకోమని వాళ్లు అంటారు. మీరు తాతని ఎందుకు అర్థం చేసుకోరు అని నేనూ అంటాను కదా!’’
‘‘చెప్పాను కదా… ఇవన్నీ ఇంతకు ముందు చిన్న స్థాయిలో వుండేవి. ఇప్పుడు డబ్బుల సమస్య కాదు. అందరూ సంపాదిస్తున్నారు ఆద్యా’’.
(సశేషం)