– పి. చంద్రశేఖర ఆజాద్, 9246573575
ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన
‘‘ఫోన్ ఎందుకు స్విచ్ఛాప్ అయింది’’ అన్నాడు.
‘‘సాంతం ఇంట్లోకి రానీయకుండానే ప్రశ్నలు మొదలు పెట్టారా?’’
‘‘అడిగిందానికి సమాధానం చెప్పటం నేర్చుకో…’’
‘‘నేను వెళ్లింది ఫెస్ట్‌కి. అక్కడ ఫోన్స్ అనుమ తించరు. ఎవరికి వాళ్లు ఫోన్లు మాట్లాడుకోవటానికి కాదు అక్కడికి వెళ్లింది. కొత్త విషయాలు నేర్చు కోవటానికి’’.
‘‘రాత్రి కూడా ఫోన్ ఓపెన్ చెయ్యవా?’’
‘‘రాత్రి కూడా ఫోన్ ఓపెన్ చేయలేదని మీరు ఎలా అంటున్నారు. పడుకునే ముందు నేను మెసేజ్‌లు చూసుకున్నాను. వాట్సప్ చూసాను. మీ దగ్గర నుండి నాకు సింగిల్ మెసేజ్ రాలేదు’’.
‘‘ఇంటి నుండి వెళ్లే ముందు నువ్వు అమ్మతో ఏం మాట్లాడావు?’’
‘‘నేను ఇంటి నుండి వెళ్లటం కాదు. జైపూర్ వెళ్తున్నాను అన్నాను. నాకెందుకు చెబుతున్నావు అంది’’.
‘‘ఆ మాట అందని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడ తావా? అమ్మ అనే గౌరవం నీకు లేదా? పదేపదే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతాను’’ అనే మాట ఎందుకు వస్తోంది’’.
‘‘మా మధ్య ఏ సంభాషణ జరిగిందో మీకు పూర్తిగా తెలియదు. ఈ ఇంటి నుంచి వెళ్లిపోవటం నాకు ఇష్టం కాదు. అయితే ఇక్కడున్న ప్రతి నిమిషం ఏదొక సాకుతో సాధించాలి అనుకుంటే మాత్రం నేను ఉండలేను. ఇంతకు ముందు ఇదే విషయం మీతో కూడా చెప్పాను’’.
‘‘అంటే నేను దుర్మార్గురాలిని. మీ అందరినీ సాధించటానికే నేను పుట్టాను. అదేగా ఆద్య గారు అంటున్నది’’.
‘‘నన్ను గారూ అని పిలవనవసరం లేదు’’
‘‘మీరు చాలా పెద్ద వారయిపోయారు కదా!’’ అంది అఖిల.
‘‘ఇలాంటి వ్యంగ్యాలు నాకు నచ్చవు నాన్నా… ఇక్కడ ఉండాల్సిన బంధం ఇది కాదు’’.
‘‘ఇంత త్వరగా నీలో ఈ మార్పు ఎందుకు వచ్చింది?’’
‘‘త్వరగా రాలేదు. ఎప్పుడో ఇది మొదలయింది. నా అలవాట్ల మీద, నేనేం తినాలి? ఏ బట్టలు కట్టు కోవాలి, ఏ చదువులు చదవాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడ కూడదు, ఇవన్నీ అమ్మ నిర్ణయిస్తోంది. శ్రుతి మించనంతకాలం భరించాను. అందుకే ఈ మధ్య నేను గట్టిగా మాట్లాడాను’’.
‘‘ఆవిడగారు ఏమందో తెలుసా? నేను మిమ్మల్ని కూడా భరించలేనంట. అందర్నీ దూరం చేసుకుని ఒంటరిగా బతుకుతానంట’’.
‘‘అమ్మను ఇలా అనవచ్చా?’’
‘‘ఇలాంటి ధోరణి మార్చుకోకపోతే నువ్వు ఒంటరిగా మిగలాల్సి వుంటుంది అన్నాను. ఇప్పుడు కూడా అదే అంటున్నాను’’.
‘‘అర్థమయిందిగా దాని పొగరు’’.
‘‘అమ్మా… మాట్లాడాల్సి వస్తే నేనూ చాలా మాట్లాడగలను’’.
‘‘మాట్లాడు’’.
‘‘ఎప్పుడు ఏం మాట్లాడాలో నాకు తెలుసు. ఓ పక్కన నేను ట్రావెల్ చేసి వచ్చాను. అలసిపోయాను. ఇంట్లోకి శత్రువు వచ్చినా మంచి నీళ్లు ఇవ్వటం మర్యాద. ఇలా వాకిట్లోనే యుద్ధం మొదలవుతుందని నాకు తెలియదు. మీకు నా గురించి అంత ఆరాటం ఉంటే ఒక్క మెసేజ్ అయినా ఎందుకు పెట్టలేదు?’’
‘‘మేమూ అదే అడుగుతున్నాం’’.
‘‘ఇక్కడ నుండి నేను తగాదా పడి వెళ్లాల్సి వచ్చింది. నన్ను ప్రేమగా పంపించ లేదు. మీ వ్యతి రేకత ఎంత వరకు వుందో చూద్దామనుకు న్నాను’’.
ఇద్దరూ మాట్లాడలేదు.
‘‘ఇది ఇంతటితో అయిపోయిందా? రోజూ ఇలా బాగోతం నడుస్తుందా?’’
‘‘బాగోతమా! ఇదీ మనకిచ్చే గౌరవం’’.
‘‘ఎవరు ఎవరికి ఎంత గౌరవం ఇస్తారో నేను చాలా కాలం నుండి చూస్తున్నాను’’.
‘‘ఇంకో మాట మాట్లాడితే చెంప పగల గొడతాను. శ్వేత ఇలానే మాట్లా డుతోందా?’’
‘‘స్వప్న పెద్దమ్మ కూడా నీలా మాట్లాడదు’’.
‘‘మాటకి మాట సమాధానం ఇస్తోంది. నేను భరించలేను’’ అంది అఖిల.
‘‘నన్ను మీరు భరించాల్సిన అవసరం లేదు. నేనే కొంత కాలం తప్పుకుంటాను. ఇప్పుడు నేను ప్రశాంతంగా చదువుకోవాల్సిన సమయం. ఇప్పటి కిప్పుడు బయటకి వెళ్లమన్నా నేను వెళ్లిపోతాను. లేదంటే రేపు వెళ్తాను’’.
‘‘ఎక్కడికి వెళ్తావ్… చూసే వాళ్లు ఏమనుకుం టారు?’’
‘‘అలాంటివి పట్టించుకోవటం ఎప్పుడో మానే సాం నాన్నా… అయినా ఏమనుకుంటారు? మనం ఇంకొకరికి చెబితే కదా తెలిసేది. ఇంటి దగ్గర చదవటం కష్టమని హాస్టల్లో చదువుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు’’ అని తన గదికి వెళ్లి పోయింది.
అఖిల కేసి చూసాడు ఆదర్శ్ . తన ముఖం జేవురించి ఉంది. ‘‘ఇప్పుడేం చేద్దాం అఖిలా?’’
‘‘వెళ్లమనండి. ఎంతకాలం మనకి దూరంగా ఉంటుందో అదీ చూద్దాం’’ అంది. ఆదర్శ్ చిన్నగా తలూపాడు.
————-
రామకృష్ణ ముందు ఓ డమ్మీ కాపీ ఉంది. అది పరిశీలిస్తున్నాడు. అతని ముందు గోవింద్, రిత్విక్ ఉన్నారు. అన్ని పేజీలు చూసాక ఆయన తలెత్తి వారిని చూసాడు.
‘‘మంచి ప్రయత్నం జరిగింది బుద్ధా… ముందు మనం పత్రికకి మంచి పేరు పెట్టాలి. తర్వాత మిగతా పనులుంటాయి కదా… డిక్లరేషన్ తీసుకోవాలి. ఎంత సమయం పడుతుంది?’’
‘‘మనం అవసరం అనుకుంటే వేగంగానే పనులు పూర్తి అవుతాయి’’.
‘‘దానికి ముందు ఇంకో పని చేయాలి బుద్ధా… నేను ఓ ట్రస్ట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను’’.
‘‘ఇప్పటికే ఉంది కదా’’.
‘‘అది కంపెనీ పేరు మీద ఏర్పాటు చేసాం. ఇది పూర్తిగా నా స్వంతం. అందుకు కావలసిన ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేయించు. ఈ ట్రస్ట్ ద్వారా పత్రిక వస్తుంది. అది ఆగిపోకుండా ఫిక్సెడ్ డిపాజిట్స్ చేయిద్దాం. ఇంక అందులో ఓ కమిటీని ఫామ్ చేద్దాం. అది పత్రికకు చెందిన సలహా మండలి. అందులో ఎవరెవరు ఉండాలో నువ్వు సజెస్ట్ చెయ్యి. ఇంక ట్రస్టీల గురించి, ఆ విషయం మనం మాట్లాడు కుందాం’’.
‘‘ఇందుకు మొత్తం ఎన్ని నిధులు సేకరించా లంటున్నారు?’’
‘‘ఎందుకు అలా అడిగావు బుద్ధా’’.
‘‘ఇందులో నా కంట్రిబ్యూషన్ కూడా ఉండా లని’’.
ఆయన కొద్ది క్షణాలు కళ్లు మూసుకున్నాడు.
రిత్విక్ ఆయననే చూస్తున్నాడు. ఆయన కళ్లు తెరిచాడు.
‘‘నువ్వు అలా అనటం నాకు చాలా సంతోషం కలిగించింది. నీ హృదయం నాకు తెలుసు. ప్రపంచం దృష్టిలో నువ్వు నేనూ కేవలం వ్యాపారవేత్తలం. అది నిజమే. అలా లేకుంటే ఈ స్థితికి వచ్చే వాళ్లం కాదు. కానీ మనం అంతా నాకే అని ఎప్పుడూ అనుకోలేదు’’ అన్నాడు.
అప్పుడు రాజన్ టీ అందించివెళ్లాడు.
‘‘మళ్లీ నేను మరిచిపోతాను. ఈ రాజన్ ఎవరి వాడు… ఎక్కడి వాడు… నన్ను నమ్ముకుని వచ్చాడు. నాతోనే ఉన్నాడు. అయిన వాళ్లందరూ దూరంగా జరిగిపోయారు. నన్ను వదలంది రాజన్ ఒక్కడే. అతనికి డబ్బుతో పని లేదు. లక్ష రూపాయలు ఇవ్వబోతే నేనేం చేసుకోను సార్ అంటాడు. ఇలాంటి మనుషుల్ని మన ఊర్లో చిన్నప్పుడు చూసాను. ఇంట్లో కూరగాయలు పండుతాయి. పొలంలో బియ్యం వస్తాయి. చిన్నదయినా స్వంత ఇల్లు. ఇద్దరే వుంటారు. పిల్లలు డబ్బులు పంపిస్తానంటే మేం ఏం చేసుకోవాలి అనేవారు. అందరికీ సహాయం చేసే వారు. వారికి డాక్టర్లు ఫీజులు తీసుకోరు. రిక్షావారు డబ్బులు తీసుకోరు. అలా ఎలాంటి జబ్బు లేకుండానే ప్రశాంతంగా వెళ్లిపోయారు’’.
‘‘అదృష్టవంతులు’’ అన్నాడు బుద్ధ.
‘‘నేనున్నా లేకపోయినా, రాజన్‌కి ఎలాంటి లోటు రాకూడదు. అతని పేరు మీద ఓ కోటి రూపాయలు డిపాజిట్ చేయాలి నాకు ఒరిస్సాలో కొన్ని భూము లున్నాయి అది మా వాళ్లకు తెలి యదు’’.
‘‘రాజన్‌గారు ఒప్పుకుంటాడా?’’ అన్నాడు రిత్విక్.
‘‘అది అతనికి ఎవరు చెబుతారు రిత్విక్… నేను చనిపోయిన రోజున ఆ డాక్యుమెంట్ రాజన్‌కి చేరుతుంది. తర్వాత అతను ఏం చేసుకుంటాడనేది మనకు అనవసరం’’.
‘‘బాగుంది సర్’’ అన్నాడు రిత్విక్.
‘‘మన పత్రికలో కొన్ని ఆటో బయోగ్రఫిలు ప్రచురించాలి. అది బహుశా నాతో మొదలు పెడదాం. అలాగే విశ్వం గురించి బుద్ధా చెప్పాడు. నాకు పరిచయం ఉన్న ఇంకొందరు ఉన్నారు. అలాంటి వారితో పాటు రాజన్ లాంటి వారిని మీరు గుర్తించాలి. రాజన్‌కి భార్య లేదు. చనిపోయింది. పిల్లలు లేరు. వారికి పిల్లలు లేరని చాలా బాధలు పడేవారు రిత్విక్. ఓసారి అతనేమన్నాడో తెలుసా…’’
ఇద్దరూ ఆయన్ని చూస్తున్నారు.
‘‘మీకు పిల్లలున్నారు.. అందరూ వున్నారు.. మీరు అదృష్టవంతులా? నేను అదృష్టవంతుడ్నా’’ అన్నాడు. అని నవ్వాడు.
‘‘మీరంటే అంత వినయంగా, భయంగా ఉంటాడు. అలా ఎలా అన్నాడు.’’
‘‘మీకు మా బంధం గురించి తెలియదు. ఎవరూ లేనప్పుడు మా ఇద్దర్నీ చూడాలి. నన్ను చాలా క్రిటిసైజ్ చేస్తాడు. మీరు ఇలా మాట్లాడకుండా ఉండటం మంచిది కాదంటాడు. రాజన్ గొప్ప సబ్జెక్ట్. మంచి నవల రాద్దువు గాని’’.
‘‘మీరు చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నారు. మనం మళ్లీ మాట్లాడుకుందాం సర్’’ అన్నాడు బుద్ధ.
‘‘మా బుద్ధా అంతే చిన్నప్పుడు నేను తనకి ఇన్స్పి రేషన్. ఇప్పుడు నాకు బుద్ధా ప్రేరణ. అందుకే ముంబైలో మావాడిదగ్గర ఉన్నాను. బుద్ధా ఇంకా ఎక్కువసేపు మాట్లాడను. నా ఆరోగ్యం గురించి నువ్వు వర్రీ కావద్దు. నాకు కోట్లకు కోట్లు సంపా దించటం గమ్యం కాదు. ఒక దశ దాటాక డబ్బుకి విలువ లేదు’’.
రిత్విక్‌కి అది నిజం అనిపించింది.
‘‘నీ అవసరానికి మించింది ఒక్క నయా పైసా అయినా ఎక్కువే. ఇంక కోట్లు ఏం చేసుకుంటాం…’’ అని రిత్విక్ కళ్లల్లోకి చూస్తూ…
‘‘ఈ రోజు నుంచి నిన్ను రచనలు మానేయ మంటాను. మానేస్తావా?’’
‘‘ఇంకా అలాంటి సంతృప్త స్థాయిని నేను అందుకోలేదు సర్’’.
‘‘అంటే నువ్వు క్రియేట్ చేయవలసింది ఏదో ఉంది. మా గమ్యం అదే. కొత్త పరిశ్రమ పెట్టాలంటే ముడిసరుకు కావాలి. అందుకు ఎన్నో ప్రయోగాలు చేయాలి. అప్పుడు ప్రకృతి గురించి అర్థం అవుతుంది. నేను కొన్ని పరిశ్రమలు పెట్టటానికి ఎంత రిస్క్ తీసుకున్నానంటే-అప్పటి వరకు సంపాదించింది పోయి రోడ్డు మీద నిలబడాలి.
ఆ రోజుల గురించి చెబితే థ్రిలింగ్‌గా వుం టాయి. నీకు వివరంగా చెబుతాను. మేం సైంటి స్టులం కాకపోవచ్చు. కొన్ని మేం ఆవిష్కరించాం. ఇప్పుడు నన్ను చచ్చిపొమ్మన్నా ఆనందంగా చచ్చి పోతాను. యస్… నాకు ఆ తృప్తి ఉంది’’ అన్నాడు.
————-
రూమ్ లోకి అడుగు పెట్టిన ఆద్యను చూసి ఆశ్చర్య పడింది జూలీ. ‘‘వెల్ కమ్’’ అంది.
తనకు చెందిన పుస్తకాలు, డ్రెస్‌లూ రెండు సూట్ కేసుల్లో తెచ్చుకుంది. మరికొన్ని వున్నాయి. అవన్నీ కదిలించలేదు. జూలీ ప్రత్యేకంగా గది తీసుకుని ఉంటోంది. జూలీకి తన గదిని ఇంకొకరితో షేర్ చేసుకోవటంనచ్చదు. అందుకని ముందుగా అడిగింది ఆద్య.
‘‘ఎగ్జామ్స్ అయ్యే దాకా నీ రూమ్‌లో ఉండాలను కుంటున్నాను. ఇప్పటికిప్పుడు హాస్టల్ అంటే కష్టం. నీకు ఇబ్బంది లేకపోతేనే. అంతగా అయితే నేను ఇంకో రూమ్ తీసుకుంటాను’’.
‘‘నీకు తెలుసు. నేను అందరు ఆడపిల్లల్తో ఎటాచ్ కాలేను. ఇది నా స్పేస్ అనుకుంటాను. నీతో రూమ్ షేర్ చేసుకోవటానికి నాకు ఇబ్బంది లేదు. ఎప్పుడు వస్తున్నావ్?’’
‘‘ఎనీ మూమెంట్’’ అంది ఆద్య.
గదిలో అన్నీ సర్దుకున్నాక అడిగింది జూలీ.
‘‘మీ పేరెంట్స్‌తో తగాదా పడి వచ్చావనుకుం టాను’’.
‘‘అది తగాదా అనుకోను. చిన్న అభిప్రాయ భేదాలు’’.
‘‘అవిలేకుండా ఎలా ఉంటాయి. అయినా నీకు కుటుంబం అంటే ఇష్టం. దాని గురించే ఎక్కువ మాట్లాడుతుంటావు. నువ్వు ఇలా నీ ఫ్యామిలీని బ్రేక్ చేస్తావనుకోలేదు!’’
‘‘ఇది బ్రేక్ చేయటం కాదు జూలీ… నేను నా వ్యక్తిగత స్వేచ్ఛ కోసం ఇంటి నుండి బయటకు రా లేదు. మా ఫ్యామిలీ రీయూనియన్ కోసం వచ్చాను’’.
‘‘నిజమా… అందుకోసం కూడా ఫ్యామిలీ నుండి బయటకు వస్తారా!’’
‘‘ముందు మన గురించి మనకు క్లారిటీ వుండాలి. మనం ఏంచేయాలను కుంటున్నామో క్లారిటీ వుంటే మనం ఎలాంటి పద్ధతుల్నయినా అనుసరించవచ్చు జూలీ’’ అంది ఆద్య.
————-
అఖిల స్వప్నకు ఫోన్ చేసింది.
‘‘అక్కా ఆద్య వెళ్లిపోయింది’’.
‘‘వెళ్లిపోవటంఅంటే నువ్వుసరిగ్గా చెప్పు అఖిలా’’.
‘‘ఇంటి నుండి వెళ్లిపోయింది’’
‘‘జైపూర్ నుండి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వెళ్లింది? ముందు జరిగింది చెప్పు’’ అంది కాస్త ఆందోళనగా … అంతా విన్నాక అడిగింది.
‘‘ఇందులో ప్రేమ కోణం ఉందా?’’
‘‘అదింకా తెలియదు. ప్రస్తుతం జూలీ అని తన ఫ్రెండ్ రూమ్‌లో వుంది అని ఆదర్శ్ చెప్పాడు. ఆ అమ్మాయిని ఓ సారి ఇంటికి తీసుకు వచ్చింది. నాకు ఆ అమ్మాయి నచ్చలేదు. నువ్వు జూలీతో స్నేహం చేయటం నాకు నచ్చలేదు అన్నాను. ఎందుకో చెప్పు… నీకు జూలీ గురించి ఏం తెలుసు. తనో జీనియస్ అంది’’.
‘‘ఇంతకూ జూలీ ఎవరు?’’
‘‘తెలియదు. తను విడిగా రూమ్ తీసుకుని వుంటోంది. అంత వరకు మాత్రం తెలుసు’’.
‘‘ఆదర్శ్ ని ఓ సారి వాళ్ల ఫ్యామిలీ గురించి తెలుసుకోమను అఖిలా….’’
‘‘అలాగే…’’
‘‘ఇంటి నుండి వెళ్తున్నప్పుడు ఆదర్శ్ డబ్బులు యిచ్చాడా?’’
‘‘ఆద్యకు డబ్బులతో అవసరం ఉంటే ఇంత అహంకారం వచ్చేది కాదు. ఇంటి దగ్గరే ఉండేది. మనం చెప్పిన మాటలు వినేది. తన ఎకౌంట్‌లో చాలా డబ్బులు ఉన్నాయి’’.
‘‘ఈ కాలం పిల్లల గురించి మనం త్వరపడి ఓ నిర్ణయానికి రాకూడదు అఖిలా. తన దగ్గర డబ్బులు లేకపోయినా ఇంటి నుంచి వెళ్లి ఉండేది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాల్సింది’’.
అఖిల ముఖంలో ఫీలింగ్స్‌మారాయి.