– శ్రీమతి పఠానేని శ్రీశైల భ్రమరాంబ

సెప్టెంబర్‌ 19 ‌వినాయక చవితి

మనదేశంలో త్రిమూర్తులతో సమానంగా వినాయకుని పూజిస్తారు. ఏ మహత్కార్యానికైనా ముందుగా వినాయకుని పూజించి, తమ సత్కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగించమని ప్రార్థిస్తారు. అక్షరాధ్యానం చేసే ముందు ‘గణేశాయ నమః’  అని గణపతికి నమస్కారం చేస్తారు. పంచమ వేదముగా పరిగణిస్తూన్న మహాభారత రచనకి వ్యాసమహర్షి దగ్గర గణపతి లేఖకుడుగా ఉండి, భారతం భూలోకంలో శాశ్వతంగా ఉండేటట్లు ప్రతిష్టించాడు. మానవుల చేతనే కాక దేవతల వల్ల కూడా వినాయకుడు సర్వదా పూజలు అందుకుంటూనే ఉంటాడు. వినాయకుని పుట్టుకను గురించి అనేక పురాణాల్లో ఎన్నో విధాలైన గాథలున్నాయి.  అది ఆయన గాథకు ఉన్న ప్రాచుర్యానికి నిదర్శనం. ఈ విశాల దేశంలో పలు ప్రాంతాలలో పలు గాథలు ఆయన పేరుతో ప్రసిద్ధమైనాయి.

లింగ పురాణంలో విఘ్నేశ్వురుని జన్మ ఇలా ఉంది. రాక్షసులు శిపుని కోసం ఘోర తపస్సు చేసి అనేక వరాలు పొంది, దేవతలను హింసించే వారట. రాక్షసుల హింసలు సహించలేక దేవతలు శివునకు మొర పెట్టుకున్నారు. శంకరుడు విఘ్నేశ్వరుని సృష్టించి, రాక్షసుల తపస్సుకు విఘ్నాలు కల్పిస్తూ దేవతలకు తోడ్పడమని ఆజ్ఞాపించాడు. ఈతడు విఘ్నాలు కల్పించడానికి, విఘ్నాలు నివారించడానికి కూడా సమర్ధుడు, కనుక అప్పటి నుంచీ ప్రతి కార్యారంభంలోనూ.. పూజలు అందుకుంటున్నాడు. కాబట్టి విఘ్నేశ్వరుడను నామంతో ప్రసిద్ధి.

ఈ వినాయకుణ్ణి గురించి ఎన్నో గాథలున్నాయి. ఆయనకు అనేక నా మాలు న్నాయి… గజ రూపుడనీ, ఏకదంతుడినీ, మూషిక వాహనుడనీ, బ్రహ్మ చారియని, లంబోదరుడనీ వర్ణిస్తూ స్తోత్రాలు చేస్తారు.

‘‘మరొక పురాణంలో వినాయకుడు బ్రహ్మచర్య దీక్షా స్వరూపుడుగా వర్ణించ బడినాడు. బ్రహ్మచర్యం సకలార్ధ సిద్ధిదాయకమని మన పూర్వుల దృఢ విశ్వాసం. అందుచేతనే విఘ్నేశ్వరునకు కూడా వివాహం చెయ్యకుండా ఉంచేశారు. అందుకే ‘‘విఘ్నే శ్వరుని పెండ్లికి వేయి విఘ్నాలు’’ అనే సామెత కూడా ఉంది. శివపురాణం మాత్రం వినాయకునకు సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు భార్యలు ఉన్నట్లు చెబుతుంది.

వినాయకుని గురించి ఇంకా ఎన్నెన్నో గాథలు ఉన్నాయి. గణపతిని అనేక పేర్లతో పూజిస్తారు. వాటిలో ముఖ్యమైనవి ఎనిమిది. 1.లక్ష్మీగణపతి 2. క్షిప్రగణపతి, 3. సిద్ధి గణపతి, 4. చింతామణి గణపతి, 5. శక్తి గణపతి, 6. ఉచ్ఛిష్టగణపతి, 7. ఏకాక్షర గణపతి 8. కుమార గణపతి.

భాద్రపద శుద్ధ చతుర్థికి సిద్ధివినాయకుని పూజిస్తే ఆటు పైన సరిగ్గా ఆరు నెలలకు వచ్చే ఫాల్గుణ శుద్ధ చవితినాడు పుత్రగణపతి వ్రతం.. ఇల్లాంటివన్నీ పంచాంగంలో ఉన్నాయి.

భాద్రపద శుద్ధ చవితినాడు సిద్ది వినాయక వ్రతం చేసి పాండవులు విజయం పొందారనీ, ఈ వ్రతాన్ని చెయ్యమని ధర్మరాజుకు శ్రీకృష్ణుడే ఉపదేశించాడనీ స్కంద పురాణంలో ఉన్నట్లు హేమాద్రి ప్రతి ఖండంలో తెలిపాడు. భవిష్యోత్తర పురాణంలో కూడా ఈ వ్రత మహాత్మ్యం చాలా గొప్పగా వర్ణించబడింది. వినాయక చవితినాడు చంద్రదర్శనం చేస్తే, నీలాప నిందలు వస్తాయనీ, ఆ పరిహారార్థంగా శ్యమంతకో పాఖ్యానం కథ చెప్పుకోవాలనీ, వినాలనీ పురాణా ల్లోనూ, వ్రతాల్లోనూ ఉంది. ఈ భాద్రపద మాసం వర్షాకాలంలో ఉత్తర భాగం కాబట్టి  ప్రకృతి అంతా ప్రౌఢ వయః పరిపాకంలో, అతి రమణీయ మనోహరంగా, ఇంద్రధనుస్సులతో ఎంతో ఇంపుగా ఉంటుంది. తొలికారు సస్యములన్నీ ఫలోన్ముఖానికి వస్తూంటాయి. సిద్ధముగానున్న అపూర్వ సస్య ఫలాగమము, మధ్యా సరసస్య ఫలాభ్యుదయము నిర్విఘ్నముగా సాగ వలెనని వాంఛిస్తూ వినాయక చవితి పర్వదినం నాడు సిద్ధి వినాయకుని పూజిస్తాము.

వినాయకుని పుష్పములతోనూ, పత్రములు, దూర్వాంకురములతోను పూజించి, ఉండ్రాళ్లు, కుడుములు నైవేద్యం పెట్టి వ్రతం పరిసమాప్తి చేసిన అనంతరం వినాయకునకు ఉద్వాసన చెబుతారు. సర్వ కార్యము ముగిసిన తర్వాత  పూజింపబడిన వినాయక విగ్రహం ధాన్యపు గాదెలో దాచుట కూడా ఒక ఆచారము. గాదెలో ధాన్యం ఎప్పుడూ అక్షయమై ఉండాలనే వాంఛతో సిద్ధి వినాయక విగ్రహాన్ని అందులో ఉంచుతారు. అలా ఆ విగ్రహం గాదెలో ఉన్నందువల్ల వినాయకుని వాహనమైన మూషికాలు ఆ గాదెను ఖాళీ చెయ్యవని కూడా ఒక నమ్మకం. దేవతలచేత, మానవులచేత, అన్ని లోకాల వారిచేత ముందుగా పూజింపబడే వినాయకుని పూజ భాద్రపద శుద్ధచవితినాడు ప్రారంభించి తొమ్మిదిరోజులు వరుసగా చేస్తారు. ఆ రోజులనే గణపతి నవరాత్రులు అని అంటారు. తర్వాత గణపతిని ఊరేగింపుతో అన్ని వీధులూ  త్రిప్పి, ఆ విగ్రహాన్ని చెరువులోనో, బావిలోనో కలుపుతారు. వెంటనే ఆ చెరువులోని మట్టిని గణపతి విగ్రహం తీసుకువెళ్లిన పళ్లెంలో వేసుకుని ఇంటికి తెచ్చుకుంటారు. ఆ మట్టిని ధాన్యపు కొట్లల్లోనో, పురులకో, గాదెల్లోనో, లేక ధాన్యం పెట్టుకునే గదుల్లోనో చల్లుతారు. ఇవి మన పూర్వ సాంప్రదాయాలు.

యుగయుగాల నుండి కూడా మహాదొడ్డ నాయకుడుగా మన వినాయకుడు ప్రసిద్ధి వహించాడు. అట్టి వినాయకుని పర్వదినమైన  చవితినాడు వినాయక పూజకి ఉపక్రమిద్దాం-చవితి నుంచి తొమ్మిదిరోజులూ ద్విగ్విజయంగా  ఈపూజలు జరగాలని వేడుకొందాం. యావత్తు భారత దేశంలోని పంటలూ సమృద్ధిగా పండించమని ప్రార్థిద్దాం.

(31.8.1962 ‘జాగృతి’ సంచిక నుంచి కొన్ని భాగాలు)

About Author

By editor

Twitter
YOUTUBE