భాద్రపద శుద్ధ చవితినాడు వినాయకుని పూజించుట మన సాంప్రదాయము, ‘సర్వాత్వా కర్మాణి కుర్వీత’’ అను వాక్యముననుసరించి మనము చేయు ప్రతి కర్మను తెలిసి చేయవలయును. మన భారతీయ పర్వ దినములలో ‘‘వినాయక చతుర్ది’’ ఒకటి. దీనిని గూర్చి శాస్త్రములందు అనేక విధము లుగా యున్నది. ఇందు వినాయకుని స్వరూపం, వాహనము, వివాహము విషయములు సమగ్రముగా చర్చించబడుచున్నవి.

పురాణ కథలు

వినాయకునిగూర్చి పురాణగాథ•లెన్నో గలవు. చవితి వినాయకునకు ప్రీతికరమైన తిథియని ధర్మశాస్త్రములు తెల్పుచున్నది. ఇందులో పార్వతి నలుగు పిండితో చేసిన బొమ్మ ఉదంతం చాలా ప్రసిద్ధి.

దక్షిణాయణమున దేవతలు నిద్రింతురు. అందు తదియ గౌరి, విదియ విశ్వకర్మ, చవితి గణపతి ఇట్లే ఆయా తిథిలందు ఆయా దేవతలు నిద్రింతురు. నిద్రించు తిథిగాన చవితినాడు పూజనీయుడు గణపతియని వామన పురాణము వలన తెలియును. పార్వతితో చెలికత్తెలగు జయా విజయాలు ‘‘శివునికి నందీశ్వరాది పరివారము చాలా యున్నది. నీకు లేకుండుట చాలా చిన్నతనము గాన నీవును పరివారమును సంపాదింపుము’’ అనిరి. ఆ మాటపై ఆమె స్నానం చేయుచూ నలుగు తీసి యొక బాలునిగా యొనర్చి వస్త్రాభరణములు అలంకరించి ద్వారముకడ నిలబెట్టెను. శంకరుడంతలో అచటకు వచ్చి లోపలకు పోబోవ ప్రయత్నింప ఆ బాలుడడ్డు పెట్టెను. అంతట కోపించి, శివుడు వాని తలను శూలముచే ఖండించెను. శాంకరి కోపించి జగత్సాంహరము చేతునని చెప్ప, దేవతలు ఆమెను శాంతింపచేయుటకు, ఆమె కుమారుడు దేవ జ్యేష్ఠుడనియు, అతనినెల్లరు ముందుగ పూజింప వలయుననియు తెలిపి, పునర్జీవితుని చేసిరి. అప్సరసలు గొనిపోయిన ఆ బాలుని తలను గొనితెచ్చుటకు వారిని బంపెను. అప్సరసలు కానరారైరి. తుదకుత్తరాభి ముఖముగా పరున్న ఏనుగు తల తెచ్చిరి. ఆ తల అతికించి, త్రిమూర్తులు తమ తమ తేజస్సులను ఆ మూర్తి యందు వేదమంత్రముచే ప్రతిష్టించిరి. ఇవి కాక కొన్ని కథలు కూడా ఉన్నాయి. అవి మరుగున పడుతున్నాయి. అందులో ఒకటి.

ఆనాడు చవితిగాన చవితి గణపతి పూజా రోజుగా నిర్ణయింపబడెనని శివ పురాణము చెప్పుచున్నది. ఒకనాడు శివుడు మంధరాద్రిపై విహరించుచూ, పార్వతిని ‘‘కాళీ’’ (నల్లని దానా) అని పిలిచెను. దానికి ఆమె కోపించి బ్రహ్మను గూర్చి తపము చేసెను. అంత బ్రహ్మ వరమీ యరాగా తనను కనిపెట్టుకొనియున్న ‘పులికి’ ముందు వరమియమని పలికెను. దానిపై బ్రహ్మ ఆ పులిని ‘‘వినాయకుని’’గా చేసెను. పార్వతికి స్వర్ణచ్ఛాయ నిచ్చెను. ఆనాడు చవితి గాన గణపతి పూజరోజని మరియొక పురాణము చెప్పుతున్నది. ఇట్లు పురాణములు పలు విధములుగా గణపతి పూజా తిథిని, పుట్టుకను గూర్చి చెప్పుట కానవచ్చు చుండెను.

ఏక దంతుడు

ఒకప్పుడు పరశురాముడు శంకర దర్శనమునకు రాగా శివభగవానులు ఒంటరిగాయున్నారు, వెళ్ల వీలు లేదని గణపతికడ్డెను. అంత పరశురాముడు కోపించి, ఒక దంతమును విరిచెనని బ్రహ్మాండ పురాణమును, విష్ణువు తన అంశను పార్వతి యందు ప్రవేశపెట్ట కుమారుడు పుట్టెననియు, శని ఆ బాలుని చూడరాగా ఆ బాలుని శిరము తెగిపోయెననియు, అంతట విష్ణువు గరుడ వాహనమునెక్కి పుష్ప భద్రవనమునకేగి, ఆట ఉత్తరాభిముఖముగా నిద్రించు వొక యేనుగు తల తెచ్చి అతి కెననియు, కుమార స్వామి దంతమును విరిచిననియు బ్రహ్మ వైవర్తనము నందును, దక్షయజ్ఞమున వీరభద్రుడు దంతము విరిచిననియు మరియొక పురాణమును చెప్పుచున్నది. ఈ కారణముల వలన గణపతికి ఏకదంతుడు పేరు కలిగెనని తెలియుచున్నది.

వినాయకుని వివాహము మూషిక వాహనము

సాబరియను బ్రాహ్మణుని భార్య, మనోమయిని క్రౌంచుడను గంధర్వుడు మానభంగము చేయ చూచిన, ఆమె యేడ్చెను. ఆ ఏడ్పు సాబరి విని, ఆ గంధర్వుని ఎలుకవు గమ్మని శపించెను. వాడు కాళ్లమీద పడి యేడ్చినంత, గణపతికి వాహనమై పూజింపబడుదువని అనుగ్రహించెను. మరియు ‘‘అగ్నిర్దేవేభ్యో నిలాయతః ఆఖూరూపం కృత్వా పృథివీ రిప్రా విశతః’’ (తైత్తిరీయ 1.8-6-1) అను మంత్రము ప్రకారము, ఆఖువనగా మూషికము. ఇందు అగ్ని మూషిక రూపం ధరించి భూమిని తవ్వెనని యున్నది. గణపతి అయిన బ్రహ్మ అప్పుడు అగ్ని వాహనమై సృష్టియందు వ్యాపక స్థితిని పొందినదని చెప్పవలయును. భూమిని త్రవ్వెన నుటలో పృధివీతత్వమయిన మూలాధారము నకు గణపతి అధిష్టానదేవత.అతని వాహనము మూషిక మని ప్రసిద్ధం. కాబట్టి వేదసారమును తెలుపు ఈ పురాణములు వేదకథనే యిట్లు చెప్పినవి. ‘‘శూర్పకర్ణుడు’’ అను పేరుకు బ్రహ్మాండ పురాణమున ‘‘అగ్నిని ప్రకాశింపచేసినవాడు’’ అని నిర్వచనము చెప్పినది. అట్లు చెప్పుటచే పై మంత్రార్థము సరిపోవుచున్నది.

చంద్రదర్శనము

‘సింహమందు సూర్యుడుండగా శుక్ల పక్ష చతుర్థియందు చంద్రుని చూడరాదు, అట్లు చూచిన అపవాదు కలుగునని మార్కండేయ పురాణము, కన్య యందు సూర్యుడుండు రెండు పక్షముల చతుర్థి యందు చంద్రుని చూడరాదనియు, అట్లు చూచిన అపవాదు కలుగునని పరాశర భవిష్య పురాణము లందున్నది. ఆ దోషం శాంతించుటకై ‘‘సింహ ప్రసేనమవధీత్సింహో జాంబవతాహతః! సుకుమారః మారో ధీస్తవ హేష శ్యమంతకః।।’’ అని పఠించ వలయునని చెప్పబడెను, గణపతి మరుగుజ్జు రూపం చూచి చంద్రుడు నవ్వగా పార్వతి ఆనాడు చంద్రుని చూడరాదని శపించెనని మరియొక కథ.

అసలు గణపతి ఆత్మకు, మనస్సుకు చంద్రుడు దేవతలు. చంద్రుని దర్శింపరాదనగా మనస్సుకు సంకల్పములు (కోరికలు) కలుగచేయరాదని, సంకల్ప స్థితిలో, నిర్వికల్ప సమాధిలో బ్రహ్మను సంధానము చేయవలయును. అట్లు చేయనివాడు లోకనింద పాలగును. దానికే అపవాదని భావము. అది పోవుటకు పై శ్లోకమును చదువ వలయును. ఈ శ్లోకమునకు ఆ భావమునకు సంబంధమేమి? అప్పుడు ‘సింహః’ అను పదము సింహమును చెప్పదు, సింహరాశిని చెప్పును. ఆ రాశి సూర్యునిది, అట్టి ఆ రాశి జాంబవంతునిచే చంపబడినదనగా ‘జాంబవంతుడు ఋక్షపతి – ఋక్షమనగా నక్షత్రము. నక్షత్రాధిపతి చంద్రుడు. దానిచే సింహరాశిని చంద్రుడు అతిక్రమించెనని అర్థము. జాంబవంతుడు కన్యను, కృష్ణునకిచ్చెననుటలో గూడ యిట్లే అర్థము చెప్పవలయును. అనగా చంద్రుడు సింహరాశి కన్యలో ప్రవేశించెనని అర్థం. కాబట్టి ఓ సుకుమారా! ఓ జీవ! (ఓ అజ్ఞానీ) మారోదీః = ఏడవకుము. ఈ మణి నీది. ఈ మణి సూర్యవర ప్రసాద లబ్ధం. అనగా సూర్య లభ్యమైనది ప్రాణశక్తి, అదే జ్ఞానం, ఈ జ్ఞానము నీదే అనగా నీకు స్వయం నీవే. ‘‘తత్వమసి’’ అను జ్ఞానమిదే. ఇది కలిగిననాడు నీకు రోదనంతో పనిలేదు. ఇట్లు ఆత్మ నిగ్రహం నిలుపుకున్నవాడు అపవాదు నొందడని తెలుపుట. ఇది ఆ శ్లోక భావము. ఇటయింకను శాస్త్రార్థము చేయుటకు సావకాశమున్నది.

దూర్వలు

గణపతి సగుణ బ్రహ్మయగు ప్రజాపతి. ‘అతడేకంవిశతి. సంఖ్యారూపుడు’ అని సూచించుటకు ఇరువది యొక్క దూర్వలు (గరికపోచలు) సమర్పింప వలయును (సర్త్వాదిగుణముచే యజ్ఞ సమిధలు నిరవది యొకటని ఎరుగునది). పిత్తో ప్రదేశకము వల్లనే స్వప్నములు సంభవించును. దూర్వామూల కషాయమున పిత్త శాంతికరమని, పిత్తగుణ కార్యములయిన స్వప్నములనది నశింపచేయునని వైద్యశాస్త్రము చెప్పుచున్నది. ‘దూర్వాదుస్నప్న నాశిని’ అను శ్రుతి చెప్పుచున్నది. ప్రస్తుతము, సృష్టియంతయు, ఈశ్వర స్నప్నముగాన, దానిని నివారించినగాని తత్వావబోధ కలుగదు గాన ఈ దూర్వాపూజ చెప్పబడెను.

వక్రతుండుడు

వక్రమనగా-వామం, వ్యతిరేకం. ఆత్మకు సవ్యం, సృష్టికి అపసవ్యం. ఈ రహస్యమునే వామాచార, దక్షిణాచారములని మంత్రశాస్త్రము తెలుపును. అట్టి సృష్టికర్త గణపతి కాబట్టి ‘‘వక్రతుండాయ నమః’’ అని చెప్పి యెర్ర వస్త్రములు సమర్పించవలయును. యెరుపు రజో గుణమునకు గుర్తు. సృష్టికి రజో గుణము కారణము. రజో గుణప్రధానుడు బ్రహ్మ. గాన నెర్రవస్త్రము లీయవలయునని చెప్పబడెను. ఈ అర్థం లోన పెట్టుకొని ‘వక్రతుండాయ’ అను పేరుకు రాబోవు కల్పమునకు బ్రహ్మయని బ్రహ్మాండ పురాణమును, సృష్టికర్తయే, అని పద్మ పురాణమును చెప్పినవి.

సూర్యచంద్రుల గతిని బట్టియే తిథులు కలుగుచున్నవి. వారి నడక విశేషమును బట్టి ఆయా కాలములలో క్రొత్త శక్తులు పుట్టును. ఆ విషయం తెలుసుకున్న ఋషులు, శివ, నాగ, గౌరి, యిత్యాది పేర్లతో వ్రతములు కల్పించి, ఆ శక్తి యొక్క ఫలమును పొందుటకై మనకు సులభమార్గం చూపినారు. అట్టి కాలశక్తిలో ఒక భాగమే ఈ గణపతి కూడా. సగుణ (ఇహసుఖఫలమునకు) నిర్గుణ (ఆముష్మికఫలమునకు) రెండును చేసి ఫలములు పొందవచ్చును. వేద, పురాణములందు ఈ ఫలముల కొరకే అనేక పేర్లతో అనేక దేవతలను సృష్టించి వాటికనేక కథలను కల్పించి చిత్ర విచిత్ర గతులలో చమత్కరించినవి.

ఆనాడు ఒకసారి ఆకాశం వంక చూడండి, ఈ చతుర్దినాడు సూర్యుడు సింహయందుండగా; చంద్రుడు సూర్యస్వామ్యం గల హస్తా నక్షత్రమునదుండ, శుక్లపక్షమై, తిథి, ప్రాణభాగమైన మధ్యానవ్యాపిని కాగా, ఈ దేవతమునకు పూజనీయు డగుచున్నాడు. ఆకాశమున కూడా ఈ చిత్రమీనాడు చూడవచ్చును. శివపురాణమున తల ఖండింపబడి ఏనుగు తలగలిగినవాడు అని యున్నది. భాద్రపదంలో శుద్ధ చతుర్థినాడు సూర్యచంద్ర గతిలో, హస్తకలవాడు. హస్తయనగా హస్తకధిపతి సూర్యుడు. అతడు ముఖంగా యుండి, అతని యాధిపత్యముగల హస్తలో చంద్రుడించుక వెనుక యుండుటచే హస్తిముఖుడు చంద్రుడె. తల ఖండింపబడుట మొదలు వివరములు. ఆకాశమున నానాటికి సూర్యచంద్ర గతిలో కలుగు ప్రకాశంబట్టి యున్నది. ఇట్టిచో మనం నేడుపాసించు, గణపతి కాలచక్రములో; సౌరప్రధానమయి ప్రాణ భాగమగుటచే జ్ఞానదాతయయ్యెను. జ్ఞానమునకును, అర్చనాది మార్గములకును, దేవతల దివరాత్రములకు, గరిష్ఠ సంబంధమున్నది. కాబట్టి, జ్ఞానదాతయు గణపతి నారాధించి, జ్ఞానము బొంది, సర్వవిఘ్నములు పోగొట్టుకొని సిద్ధిని పొందుడు అని చెప్పుటకు సంశయము లేదు.

‘‘ఆచార్య అరుణ శ్రీ’’ 

(27.8.1954 జాగృతి ప్రచురించిన వ్యాసం ఆధారంగా)


జాతీయోద్యమ గణేశుడు

హిందూ సమాజ పునరుజ్జీవనోద్యమానికి గణేశుడి ఆశీస్సులు ఉన్నాయి. లోకమాన్య బాలగంగాధర తిలక్‌ ‌నిర్మించిన ఈ పునరుజ్జీవ నోద్యమం వెనుక వినాయకుడు ఉన్నాడు. కొంత రూపురేఖలు మారినా ఇవాళ దేశమంతా కనిపిస్తున్న సామూహిక వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలు తిలక్‌ ‌మహరాజ్‌ ‌ప్రారంభించినవే.

భారతీయ సమాజం తనదైన ఉనికిని, అస్తిత్వాన్ని కోల్పోయి సాంస్కృతికంగా నిస్తేజంగా మిగిలి ఉన్న సమయంలో తిలక్‌ ‌గణేశుడి ఉత్సవాలను ప్రారంభించారు. 1893లో ఆయన మహారాష్ట్రలో ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మనదైన జీవనం కోసం, మనదైన తాత్త్వికతను పునరుద్ధరించడం కోసం ఆయనకు ఆ సమయంలో అలాంటి ప్రయత్నం అవసరమైంది. అనేక విధాలుగా చీలిపోయి ఉన్న హిందువులను ఆయన సామూహిక వినాయక పూజలతో ఐక్యం చేయాలని సంకల్పించారు. అంతకు ముందు పీష్వాలు కూడా ఇలాంటి ప్రయత్నం చేశారు. కానీ తిలక్‌ ‌కాలానికి ఇలాంటి సామూహిక భక్తి కార్యక్రమం అవసరం మరింత పెరిగింది. అందరూ ఎవరి ఇళ్లలో కూర్చుని వారు వినాయకుడిని పూజించే కంటే, సామూహిక ఉత్సవాలలో అందరినీ ఏకం చేస్తే కాగల కార్యాన్ని గణేశుడే పూర్తి చేస్తాడని తిలక్‌ ‌నమ్మారు. ఆయన ఆలోచన 1893లో కార్యరూపం దాల్చింది. తొమ్మిదిరోజుల పాటు కులాల సంగతి మరచి, ఆ తారతమ్యాలు పక్కన పెట్టి అంతా కలసి ఒకే పందిరి కింద విఘ్న నాయకుడిని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే అంతా కలసి నిమజ్జనోత్సవంలో పాల్గొనడం మరొకటి. కలసి పూజలు చేయడం, అడుగులో అడుగు కలిపి నడవడం. మళ్లీ చాలా కాలానికి హిందూ సమాజం నేర్చుకున్నది.

ఎన్నో ఫలితాలను ఇచ్చి, ఒక ఐక్యతకు బీజాలు వేసిన గణేశ ఉత్సవాల నిర్వహణ అంత సులభంగా ఏమీ సాధ్యం కాలేదు. ఇటు సమాజంలోని కొందరు ఛాందసవర్గాల నుంచి, అటు ప్రభుత్వం నుంచి ఆయన అవరోధాలు ఎదుర్కొన్నారు. కానీ ఆయన వలె ఆలోచించే స్వాతంత్య్ర సమరయోధులు ఆనాడు ఎందరో ఉన్నారు. వారే లాలా లాజ్‌పతిరాయ్‌, ‌బిపిన్‌చంద్ర పాల్‌, అరవింద ఘోష్‌, ‌రాజ్‌నారాయణ్‌ ‌బోస్‌, అశ్వినీకుమార్‌ ‌దత్త మొదలైనవారు. వీరంతా    తిలక్‌ ఆలోచనను సమర్ధించారు. సంస్కృతి ఆధారంగా రాజకీయోద్యమం నిర్మాణం కావాలన్న దృక్పథం కలవారే వారంతా. స్వతంత్ర దేశానికి భారతీయత పునాదిగా ఉండాలని కోరుకున్నవారు కూడా. మిగిలిన ప్రాంతాలలో కొంత తక్కువే అయినా సామూహిక గణేశ ఉత్సవాలు మహారాష్ట్రలో ఎంతో విజయం సాధించాయి. దాని ఫలితమే కావచ్చు. అక్కడ జాతీయోద్యమ ప్రభావం కూడా చాలా ఎక్కువ. ఆ రాష్ట్రంలోని వార్ధా, నాగ్‌పూర్‌, అమరావతి పట్టణాలు దీనికి చిరునామాగా కూడా మారాయి.

వినాయక చవితి ఉత్సవాలు బ్రిటిష్‌ ‌ప్రభుత్వాన్ని కూడా భయపెట్టాయి. రౌలట్‌ ‌కమిటీ ఈ ఉత్సవాల గురించి ప్రభుత్వాన్ని హెచ్చరించవలసి వచ్చింది. పేరుకు వినాయక చవితి ఉత్సవాలే అయినా ఈ నేపథ్యంతో యువతరంలో బ్రిటిష్‌ ‌వ్యతిరేకత పెరుగుతున్నదని ఆ కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరిం చింది. ఇవాళ్టికి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్‌, ‌రాజస్థాన్‌, ‌కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులలో వీటి ప్రభావం గణనీయంగానే ఉంది. కొంత స్వరూపం మారి ఉండవచ్చు. అయినా వీటి అవసరం నేడూ కనిపిస్తున్నది. హిందువుల ఐక్యతకు ఇప్పటికీ బెడద ఉన్నది. దాని నుంచి భారతీయ సమాజాన్ని రక్షించు కోవడానికి ఈ ఉత్సవాల ద్వారా వచ్చే ఐక్యత ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఉత్సవాల పవిత్ర తను కాపాడుకోవడం కూడా అవసరం. వీటి స్ఫూర్తిని విస్మరించకుండా, తిలక్‌ ఆశించిన జాతీయ స్ఫూర్తి అడుగంటకుండా కొనసాగించాలి.

About Author

By editor

Twitter
YOUTUBE