– సుజాత గోపగోని, 6302164068

సీఎం కేసీఆర్‌ ‌రాజకీయ చతురత గురించి ఏకాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్లను అడిగినా ఠక్కున చెప్పేస్తారు. తెలంగాణ రాష్ట్ర సమితిని ఉద్యమ పార్టీగా నడిపించిన నాటి నుంచి ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి ఫక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందించాక ఆయన సాగించిన ఎత్తుగడలు, అమలు చేసిన వ్యూహాలను కథలుగా చెప్పుకుంటారు. రాజకీయ విలువలను పక్కనబెట్టి నియంతృత్వ ధోరణితో ముందుకెళ్తున్న తీరుపై విపక్షాలే కాదు, రాష్ట్రంలోని సామాజిక, ప్రజాసంస్థలు కూడా తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోశాయి, పోస్తూనే ఉన్నాయి. శాసనసభకు జరిగిన రెండు ఎన్నికల్లోనూ సెంటిమెంట్‌ను అస్త్రంగా వాడుకొని గద్దెనెక్కారు కేసీఆర్‌. ఆ ‌సెంటిమెంట్‌తోనే విపక్షాలను కనుచూపు మేరలో కానరాకుండా చేశారు. సెంటిమెంట్‌ అ‌స్త్రంతో ప్రజలు, ఓటర్లు కూడా కేసీఆర్‌కు, ఆయన పార్టీకి అండగా నిలిచారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. సెంటిమెంట్‌ ‌పటాపంచలైంది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ.. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)‌గా పేరు మార్చుకుంది. ఎలక్షన్‌ ‌కమిషన్‌ ‌ఫార్మాలిటీస్‌ ‌కూడా పూర్తయ్యాయి.

కేసీఆర్‌ ఇటీవల కాలంలో వారంలో దాదాపు మూడు రోజులు రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రాలకు.. ముఖ్యంగా మహారాష్ట్ర బాట పడుతున్నారు. అంటే, తెలంగాణ అనే ప్రాంతీయ సెంటిమెంట్‌కు తిలోదకాలిచ్చేశారు. బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్‌ఎస్‌ ‌తెలంగాణ సెంటిమెంట్‌ను అంతగా రక్తి కట్టించే అవకాశం లేదు. దీనిపై రాజకీయ నాయకులకే కాదు.. తెలంగాణ ప్రజలకు కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈసారి బీఆర్‌ఎస్‌ ‌గెలుపు నినాదం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, కేసీఆర్‌ ‌వ్యూహ తంత్రాలు తెలిసిన వాళ్లు మాత్రం ఈ వాదనలన్నీ కొట్టిపారేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి అసలు విపక్షం అనేది లేకుండా చేసేందుకు కేసీఆర్‌ అనుసరించిన విధానాలను ఏకరువు పెడుతూ, మరోసారి వాటిని గుర్తుచేస్తున్నారు. గతంలో ఎన్నికల సమయంలోనే ఓటర్ల నాడిని పట్టుకొని ఎన్నికల గోదాలోకి దూకినట్లే, ఈసారి కూడా అలాంటి మైండ్‌ ‌గేమ్‌ ‌మొదలెట్టారని చెప్పుకుంటున్నారు.

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో త్రిముఖ పోటీ నెలకొంది. అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కు తోడు.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ ‌పార్టీ కూడా నువ్వా.. నేనా అంటూ ఎదురేగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు అనుకూల వాతావరణం ఎలా సృష్టించా లన్న యోచనలో కేసీఆర్‌ ‌నిమగ్నమయ్యారని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు కాకుండా.. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకే ఎత్తుగడలు వేస్తున్నారని ఆయన సన్ని హితులు అంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన మొదట్లో పునరేకీకరణ అంటూ నినాదాన్ని ఎత్తుకొని.. ప్రతిపక్షాలను దాదాపు లేకుండా చేసేశారు. ప్రజల్లో సెంటిమెంట్‌ను రగిల్చి, నాయకుల్లో పునరేకీకరణ నినాదం తీసుకొచ్చి కాంగ్రెస్‌ ‌పార్టీని బలహీనం చేసేశారు. తెలుగు దేశం పార్టీని నిర్వీర్యం చేసేశారు. ఇక, 2018 ఎన్నికల తర్వాత అయితే కాంగ్రెస్‌ ‌పార్టీ కకావికలమై పోయింది. హస్తం పార్టీ బలహీనం కావడం, అదే సమయంలో బీజేపీ కార్యకలాపాలు పెరిగి ఆ పార్టీ పుంజుకుంది. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యమనుకున్న కేసీఆర్‌.. ‌తన రాజకీయ చతురతతో, అధికార అండతో ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మరోవైపు.. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలోనూ కాంగ్రెస్‌ ‌పార్టీ అనూహ్యంగా పుంజుకోవడం మొదలెట్టింది. దీంతో, అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు కేసీఆర్‌ ‌కుయుక్తులు పన్నుతున్నారన్న చర్చ మొదలయ్యింది.

ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లోని ఇద్దరు నాయకులు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు సోషల్‌ ‌మీడియాలో వైరలవుతున్నాయి. రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ప్రభుత్వ విప్‌, ‌చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విపక్షాల విషయంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతు న్నాయి.‘కాంగ్రెస్‌ ‌పార్టీ వాళ్లను ఏమీ అనవద్దు. వాళ్లు మన వాళ్లే. మనమే కొందరిని ఆ పార్టీలోకి పంపించాం. ఎన్నికలయ్యాక వాళ్లు మళ్లీ మన పార్టీలోకే వస్తారు’ అని బాల్క సుమన్‌ ‌బహిరంగ సభలో వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న వెంకటేష్‌ ‌నేత (పెద్దపల్లి ఎంపీ) తిరిగి బీఆర్‌ఎస్‌లోకే వచ్చారని కూడా ప్రస్తావించారు. పక్కనే ఉన్న వెంకటేష్‌ ‌రెండు చేతులు పైకెత్తి ‘విన్‌’ ‌సింబల్‌ ‌చూపెట్టారు. ఇక్కడ వెంకటేష్‌ ‌నేత విషయానికి వస్తే.. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌తరఫున చెన్నూరులో బాల్క సుమన్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాతి పరిణామాలతో బీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే బాల్క సుమన్‌ ‌చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి దీశాయి. కేసీఆర్‌ ‌కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని ఈటల రాజేందర్‌ ‌సహా పలువురు నేతలు కొంతకాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. 30 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులకు కేసీఆర్‌ ‌ఫండింగ్‌ ‌చేస్తున్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ ‌కూడా ఆరోపణలు చేస్తున్నారు. గతంలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా.. బాల్క సుమన్‌ ‌వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను కూడా ఒకింత కలవరానికి గురిచేసేలా ఉన్నాయి. ఇక, ఓ సందర్భంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కుక్కల్లా మొరగకుండా, వారిని పిల్లుల్లా మార్చేందుకే కేసీఆర్‌ ‌బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని వ్యాఖ్యానించారు.  బీఆర్‌ఎస్‌లో కీలక నేతలు చేసిన ఈ వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులు సీరియస్‌గా ప్రస్తావిస్తున్నారు. ప్రతిపక్షాలను దెబ్బకొట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేసే వ్యూహాలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేల పట్ల ఆయన వైఖరి ఏమిటనేది ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతున్నాయని అంటున్నారు. తెలంగాణ రాజకీయ పునరేకీకరణ కోసం కాకుండా, ప్రతిపక్షా లను చంపేసి.. తన పార్టీని బలోపేతం చేసుకోవ డానికే కేసీఆర్‌ ‌పునరేకీకరణ ఎత్తులు వేశారని అర్థమవుతోందంటున్నారు. తొలుత కాంగ్రెస్‌ను, ఆ తర్వాత బీజేపీని బలహీనం చేయడానికి కేసీఆర్‌ అమలు చేసిన వ్యూహాలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తన వ్యూహాలతో కాంగ్రెస్‌ ‌పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిందని కేసీఆర్‌ ‌భావించారు. కానీ, రేవంత్‌ ‌రెడ్డి టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం, కర్ణాటక ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్‌ ‌పార్టీ మళ్లీ పుంజుకోవడం గమనార్హం. అందుకే, ఇప్పుడు మళ్లీ కేసీఆర్‌ ‌తన వ్యూహాలకు పదును పెట్టారని, బాల్క సుమన్‌ ‌వంటి నేతల వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత విపక్షాలను దెబ్బకొట్టడానికి కేసీఆర్‌ ‌తొలి నుంచీ ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. 2014 ఎన్నికల తర్వాత ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తోపాటు మిగిలిన ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి రాజకీయ పునరేకీకరణ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతోపాటు టీడీపీ శాసన సభ్యులనూ టీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకున్నారు. అప్పటి పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యం లేకుండా చేసిన కేసీఆర్‌.. అదే వ్యూహాన్ని 2018 ఎన్నికల తర్వాత మరోసారి కాంగ్రెస్‌పై ప్రయోగించారు. ఆ పార్టీ తరఫున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో విలీనం చేసుకుని సీఎల్పీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. దీంతో కాంగ్రెస్‌ ‌తరఫున గెలిచిన వాళ్లు బీఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా ఆ పార్టీ విశ్వసనీయతనే దెబ్బతీశారు. వరుస పరిణామాలతో కాంగ్రెస్‌ ‌పార్టీ నిర్వీర్యమైంది.

అయితే, 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలు కొత్తమలుపు తిరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలు అందుకున్న బండి సంజయ్‌.. ‌దూకుడుగా వ్యవహరించారు. నాలుగు ఎంపీ సీట్లను సాధించి ఊపు మీద ఉన్న బీజేపీకి సంజయ్‌ ‌దూకుడు ఇంకా కలిసివచ్చింది. కాంగ్రెస్‌ ‌ప్రజాప్రతినిధుల విశ్వసనీయతను కేసీఆర్‌ ‌దెబ్బతీయడం వల్ల ఏర్పడిన శూన్యతను బీజేపీ కొంతమేర ఆక్రమించగలిగింది.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌, ‌బీజేపీ మధ్య చీలిపోతే అంతిమంగా తన పార్టీకే ప్రయోజనం కలిగిస్తుందని భావించిన కేసీఆర్‌.. ‌బీజేపీనే లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ గ్రాఫ్‌ను మరింత పెంచారు. ఈ క్రమంలో బండి సంజయ్‌ ‌నాయకత్వంలో దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ‌సిటింగ్‌ ‌సీట్లనే కైవసం చేసుకున్న బీజేపీ.. జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లోనూ గట్టి పోటీ ఇచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలోనూ పోటాపోటీగా నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీదారుగా అవతరించింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌బలహీనం కావడంతో ఇక పోటీ బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ మధ్యనే అన్న అభిప్రాయం ప్రతి ఒక్కరిలో ఏర్పడింది. తదనంతర పరిణామాల్లో ఢిల్లీలో చోటుచేసుకున్న లిక్కర్‌ ‌స్కామ్‌లో కేసీఆర్‌ ‌కూతురు కవిత పేరు తెరపైకి వచ్చింది. అదే సమయంలో నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన ప్రయత్నంపై స్టింగ్‌ ఆపరేషన్‌ ‌చేసిన కేసీఆర్‌ ‌ప్రభుత్వం.. దీని వెనక బీజేపీ కీలక నేత ఒకరు ఉన్నారని ఆరోపించింది. అటు లిక్కర్‌ ‌స్కామ్‌, ఇటు స్టింగ్‌ ఆపరేషన్‌ల నేపథ్యంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇక్కడే కేసీఆర్‌ ‌కొంత వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్‌.. ‌బీజేపీ జాతీయ నాయకత్వంతో సయోధ్య కుదుర్చుకు న్నారన్న ప్రచారం జరిగింది. అయితే బీజేపీ జాతీయ నాయకత్వంతో కేసీఆర్‌ ‌సయోధ్యలో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తప్పించారన్న ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కానీ, బీజేపీ నేతల దూకుడు ఏమాత్రం తగ్గలేదు.

రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్‌, అటు బీజేపీ రెండూ బలహీనంగా ఉన్నాయని, ఇక తమకు ఎదురు లేదని భావించిన బీఆర్‌ఎస్‌ ‌నేతలకు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పరిణామాలు షాక్‌ ఇచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌ఘన విజయం సాధించి కమలం పార్టీని గద్దె దించింది. ఈ ప్రభావం పొరుగు రాష్ట్రమైన తెలంగాణపై బలంగా పడింది. బీఆర్‌ఎస్‌ ‌వ్యతిరేక వర్గాలన్నీ కాంగ్రెస్‌ ‌పార్టీనే ప్రత్యామ్నాయంగా చూడటం మొదలుపెట్టాయి. అదే సమయంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనంటూ కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. ఇది ప్రజల్లోకి, ముఖ్యంగా మైనారిటీ వర్గాల్లోకి వేగంగా వెళ్లడం మొదలైంది. దీంతో కాంగ్రెస్‌ ‌వేగంగా పుంజుకుంది. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ కాంగ్రెస్‌ ‌గ్రాఫ్‌ ‌పెరుగుతూ వస్తోందనీ అంటున్నారు. బీఆర్‌ఎస్‌లోని అసంతృప్త, వ్యతిరేక వర్గాలు ప్రతిపక్షాల వైపు మొగ్గు తున్న క్రమంలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అందుకే, ఇప్పుడు మరోసారి బీజేపీని, కాంగ్రెస్‌ను దెబ్బకొట్టడా నికి కేసీఆర్‌ ‌పావులు కదుపుతున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.కానీ, కేసీఆర్‌ అం‌చనాలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన కుదరడం లేదని, ఇందుకు ఇటీవలి సర్వేలే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు.

About Author

By editor

Twitter
YOUTUBE