సంపాదకీయం
శాలివాహన 1945 శ్రీ శోభకృత్ అధిక శ్రావణ బహుళ షష్ఠి – 07 ఆగస్ట్ 2023, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
జ్ఞాన్‌వాపి వివాదం గురించి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ మొదటిసారి మాట్లాడారు. ఏఎన్‌ఐ వార్తా సంస్థతో జరిపిన ముఖాముఖీలో ఆయన ముస్లిం వర్గాలను ఉద్దేశించి ఈ మాటలు చెప్పారు. ‘జ్ఞాన్‌వాపి ప్రాంతాన్ని ఇంకా మసీదు అని పిలవడం సబబు కాదు. అక్కడ ఉన్నది జ్యోతిర్లింగం. ఆ లింగాన్ని మేమేమీ ప్రతిష్టించలేదు. హిందూ దేవీదేవతా విగ్రహాలు ఉన్నాయి. కాబట్టే ముస్లిం వర్గం నుంచి ఒక ప్రతిపాదన రావాలని నేను అభిప్రాయపడుతున్నాను. చారిత్రక తప్పిదం జరిగింది. మేమే ఆ తప్పిదాన్ని సరిచేస్తామని వారే ముందుకు రావాలి’ అని యోగి సూచించారు. ‘ఇంకా దానిని మసీదు అని పిలిస్తే వివాదం అలాగే ఉంటుంది. అక్కడ త్రిశూలం ఎందుకు ఉన్నదో ప్రజలు ఆలోచించాల’ని కూడా అన్నారాయన. ఇంత హుందాగా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా దాని గురించి కొంచెం కూడా ఆలోచించకుండా, వెంటనే మాటల యుద్ధానికి దిగడం, ఒక వర్గం మీడియా సంచలనం చేయాలని చూడడం ఇప్పుడు కనిపిస్తున్నది.
ఇందులో ఎక్కువమందిని ఉలికిపడేటట్టు చేసినది- జ్ఞాన్‌వాపిని ఇంకా మసీదు అని పిలిస్తే వివాదాస్పదంగానే ఉంటుందని యోగి నిర్ద్వంద్వంగా చెప్పడం. ఇది 1990నాటి కాలం కాదనీ, ప్రార్థనాస్థలాల చట్టం ఒకటి ఉందని గుర్తుంచుకోవాలని ముస్లింలు చెబుతున్నారు. ఇంకా జ్ఞాన్‌వాపి అంశం కోర్టులలో ఉండగా ఆ అంశం మీద వ్యాఖ్యానించడం నేరమవుతుందని చెబు తూనే దాని గురించి గంటల కొద్దీ మాట్లాడుతున్నారు. ఆలయాన్ని కూల్చి జ్ఞాన్‌వాపి మసీదును కట్టారా లేదా అన్న అంశం తేల్చడానికి సర్వే నిర్వహించా లని పురావస్తు సర్వే శాఖను అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు నిర్ణయం సరైనదా కాదా అన్న అంశాన్ని విచారించిన సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించనున్నదన్న వార్తల నేపథ్యంలో యోగి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకోవడం సహజమే. ప్రస్తుతం కాశీలో పూజలు అందుకుంటున్న విశ్వేశ్వరుని మందిరాన్ని ఆనుకుని జ్ఞాన్‌వాపి మసీదు ఉంటుంది.
జ్ఞాన్‌వాపి అంశం ఆగస్ట్, 2021లో మొదటిసారి దేశం దృష్టికి వచ్చింది. మసీదు పేరుతో పిలుస్తున్న ఆ కట్టడం మీద ఉన్న దేవతకు నిత్యం పూజాదికాలు నిర్వహించుకునే అవకాశం కల్పించాలని ఐదుగురు మహిళలు వారణాసి సివిల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఏప్రిల్ 8, 2022న వారణాసి కోర్టు జ్ఞాన్‌వాపి ప్రాంగణంలో సర్వే జరపవలసిందని ఆదేశించింది.
ఇక్కడ రెండు విషయాలను పరిశీలించవలసిన అవసరం కనిపిస్తుంది. మొదటిది- ప్రతి మసీదులోను శివలింగాన్ని చూసే ప్రయత్నం చేయవద్దని ఇదే జ్ఞాన్‌వాపి వివాదం తారస్థాయిలో ఉన్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్‌జీ భాగవత్ ప్రకటించిన సంగతి గుర్తు చేసుకోవాలి. ఆయన దూరదృష్టితో చేసిన సూచన ఇది. కానీ భారతదేశంలో ఇస్లాం పాలనాకాలంలో కావచ్చు, తరువాత కావచ్చు, మొత్తం 30 వేల నుంచి 40 వేల హిందూ దేవాలయాలు ముస్లిం మతోన్మాదుల మౌఢ్యంతో నేలమట్టమైన సంగతి ఏమిటని డాక్టర్ సుబ్రహ్మణ్యంస్వామి వంటివారు ఎప్పటి నుంచో నిలదీస్తున్నారు. అంటే అవన్నీ మళ్లీ ముస్లింలు నిర్మించి ఇవ్వాలని వారు అభిప్రాయపడుతున్నారని అనుకోనక్కరలేదు. చరిత్రలో ఇస్లాం మతోన్మాదం గురించి అమాయకత్వం నటిస్తున్న సెక్యులరిస్టుకీ, అది మా విశ్వాసం అని ఇప్పటికీ నమ్ముతున్న వారి కళ్లు తెరిపించడానికీ తెరమీదకు తెస్తున్న వాదం. అయితే ఆర్‌ఎస్‌ఎస్, ఇంకొందరు పెద్దలు మొదటి నుంచి సామరస్యానికి పెద్ద పీట వేసే విధంగానే మాట్లాడు తున్నారు. హిందువులు పరమ పవిత్రంగా భావించే మూడు పుణ్యక్షేత్రాలు – కాశీ, మధుర, అయోధ్య. వీటిని అప్పగించడానికి ముస్లింలు పెద్ద మనసుతో అంగీకరించాలి అనే. ఇప్పుడు ఆ మాటనే యోగి ఆదిత్యనాథ్ పునరుద్ఘాటిం చారు.
ఇక కోర్టు పరిధిలో ఉన్న అంశం గురించి ముఖ్యమంత్రి ఎలా మాట్లాడ తారు అన్న ప్రశ్న గురించి. ఎలా చూసినా అయోధ్య వివాదం నూరేళ్లు న్యాయస్థానాలలో మగ్గింది. బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ అడ్వాణి రథయాత్ర జరిపినప్పుడు కూడా అయోధ్య అంశం కోర్టులోనే ఉంది. కానీ ఆ సమ యంలో సెక్యులర్ పార్టీలలో ఉంటూ మౌల్వీలను తలదన్నే తీరులో మాట్లాడిన ముస్లిం నాయకులంతా కూడా అప్పుడే ఎదుగుతున్న బీజేపీని అడ్డుకోవడానికి అయోధ్యను అడ్డంపెట్టుకునే కదా విమర్శలకు తెగబడ్డది! అయోధ్యలో రామమందిరం కాకుండా ఇంకేదైనా కట్ట వచ్చునని బయట తీర్పులు రాలేదా? ఆఖరి తీర్పు వచ్చిన తరువాత కూడా అయోధ్యలో ఎప్పటికైనా మళ్లీ అదే స్థలంలో మసీదు నిర్మిస్తామంటూ వాచాలత్వం ప్రదర్శించినవారు లేరా? అసలు కోర్టు తీర్పుల మీద, కోర్టుల మీద కనీస గౌరవం ఉన్నవారు షాబానో తీర్పునే శిరోధార్యం అనేవారు. తమకి అనుకూలంగా నిర్ణయాలు వస్తే కోర్టులు చాలా గొప్పవి. లేదంటే మత విశ్వాసాలు రంగంలోకి దిగుతాయి.
జ్ఞాన్‌వాపి మీద యోగి లేదా, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ పెద్దలు ఇంతవరకు పెదవి విప్పలేదు. మొదటిసారి యోగి హుందాగా ఒక ప్రతిపాదన చేశారు. జరిగిన చారిత్రక తప్పిదాన్ని దిద్దుకుందామంటూ ముస్లింలు ముందుకు రావాలని కోరారు. అలాంటి చారిత్రక తప్పిదాలు అబద్ధమని ముస్లింలు సహా ఎవరూ ఢంకా బజాయించలేరు. కాబట్టి యోగి ప్రతిపాదనలోని వాస్తవికత గురించి వారు ఆలోచించవచ్చు. లేదా న్యాయ స్థానాలు వాటి పని అవి ఎలాగూ చేస్తాయి. కానీ ఆ నిర్ణయాలనైనా గౌరవించే సంసిద్ధత ఉండాలి. అయోధ్య ముగిసిన అధ్యాయం కాబట్టి, యోగి ముస్లింలను కోరినది రెండుసార్లు పెద్ద మనసు చేసుకోమని మాత్రమే. అంతేతప్ప 30 నుంచి 40 వేల సార్లు పెద్ద మనసు చేసుకోమనడం లేదు.