శాలివాహన 1945 శ్రీ శోభకృత్‌  ‌నిజ శ్రావణ శుద్ధ ద్వాదశి – 28 ఆగస్ట్ 2023, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


‌నాలుక అబద్ధం చెప్పినా, నరాలు నిజాన్ని కక్కేస్తాయి. రాజకీయ భాష నేర్చిన నాలుక ఎన్ని విన్యాసాలనైనా చేయగలదు. కానీ వారసత్వాన్నీ, మూలాలనూ నరాలలో ప్రవహించే నెత్తురు విస్మరించలేదు. సానుకూల, ప్రతికూల భావనలతో ఈ మధ్య వినిపించిన రెండు ప్రకటనలు దీనినే రుజువు చేస్తాయి. ‘భారతీయ ముస్లింలు ప్రధానంగా హిందూధర్మం నుంచి ఇస్లాంలోకి మారినవారే. ఇందుకు తిరుగులేని ఉదాహరణ కశ్మీర్‌ ‌లోయ. ఒకనాడు అధిక సంఖ్యాకులైన పండిత్‌లను ఇస్లాంలోకి మతం మార్చారు’ అన్నారు కశ్మీర్‌ ‌డెమాక్రటిక్‌ ‌పోగ్రెసివ్‌ ఆజాద్‌ ‌పార్టీ నాయకుడు గులాం నబీ ఆజాద్‌. ‌నిద్ర నటిస్తున్న ఉదారవాదులు, చరిత్రకారులు, రాజకీయ నేతలను కదిపే వ్యాఖ్యలివి. ఆరు వందల ఏళ్ల క్రితం కశ్మీర్‌లో ఉన్న ముస్లింలు అంతా ఎవరు? కశ్మీరీ పండిత్‌లేనని దోడా జిల్లాలో మాట్లాడుతూ ఆజాద్‌ ‌వ్యాఖ్యానించారు. ఇస్లాం 1500 ఏళ్ల క్రితమే ఉనికిలోకి వచ్చింది. కానీ హిందూధర్మం పురాతనమైనది. పది మందో ఇరవై మందో వారు (ముస్లింలు) బయటనుంచి వచ్చారు. అందులో కొంతమంది మొగలాయిల సైన్యంలో ఉన్నారు అని ఆజాద్‌ ‌చెప్పారు. ఇస్లాం ఈ దేశంలో జనించలేదన్న సంగతి ఒక వాస్తవం అని ఆయన నిష్కర్షగా చెప్పారు. తాను హిందూ ముస్లిం ఐక్యతనే ఆకాంక్షిస్తున్నానని, రాజకీయాలలో మతం ఉపయోగించుకోవడం అంటే  బలహీనతను ప్రదర్శించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎంత యాదృచ్ఛికమో! ఆజాద్‌ ‌వ్యాఖ్యకు ఒక కొనసాగింపు సంభవించింది. అఖిల భారత మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ‌ముస్లిమీన్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసి  తన నేపథ్యంలోని మహా సత్యాన్ని ఒకానొక బలహీన క్షణంలో బయటపెట్టారు. ఆ నేపథ్యం గురించి వచ్చిన ఒక వ్యాఖ్య మీద స్పందిస్తూ, ‘అవును, మా ముత్తాత హిందువు, పేరు తులసీరామదాస్‌’ అం‌టూ గుట్టు విప్పారు. నోరు విప్పితే సంఘ పరివార్‌ని ఒక మాట అనడం రివాజు కాబట్టి ఆ ఒప్పుకోలుకు తోకను తగిలించారు. అదేమిటో, సంఘీయులు ఒక కథ అల్లదలిచినప్పుడల్లా నా పూర్వికులు బ్రాహ్మణులు అన్న సంగతి వారికి గుర్తుకొస్తుంది అన్నారాయన. ఒవైసి ముత్తాత హైదరాబాద్‌ ‌బ్రాహ్మణుడనీ, ఆయనను ఇస్లాంలోకి మార్చారనీ 2017 ప్రాంతంలో బీజేపీ ఎంపీ, రచయిత రాకేశ్‌ ‌సిన్హా వెల్లడించారు.

ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకుడు ఆచార్య ప్రమోద్‌ ‌కృష్ణమ్‌ ‌మరొక వాస్తవాన్ని ధ్రువీకరించారు. ఈ సందర్భంలో అది గుర్తు చేసుకోవాలి. ‘కాషాయం అంటే చిందులు తొక్కే కొందరు హిందూద్వేషులు కాంగ్రెస్‌ను కబ్జా చేశారు. వీళ్లకి భారతమాతాకీ జై అన్న నినాదం నచ్చదు. దేశాన్ని ముక్కలు చేయాలని అనుకుంటున్న వీళ్లంతా పార్టీలో పెద్ద పెద్ద స్థానాలు ఆక్రమించార’ంటూ భారీ ఆరోపణే చేశారు. ఇది ఎందుకు చేయవలసి వచ్చింది! శ్రీ కల్కి ఆశ్రమ నిర్వాహకుడు కృష్ణమ్‌ ‌తిలక ధారణ చేస్తారు. వీటిని ఆ పార్టీలో చాలామంది ఈసడించుకుంటున్నారట. తనను కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ నుంచి తప్పించిన కారణమూ అదేనని కృష్ణమ్‌ అభిప్రాయపడ్డారు. గీతాప్రెస్‌కు గాంధీ శాంతి పురస్కారం ప్రకటించడాన్ని తన పార్టీ నాయకులు తప్పు పట్టినప్పుడు కూడా కృష్ణమ్‌ ‌తీవ్రంగానే స్పందించారు. కాంగ్రెస్‌ ‌మీద హిందూ వ్యతిరేక ముద్ర వేయాలని బీజేపీ కోరుకుంటూ ఉంటే, ఆ కోరికను సొంత పార్టీ వారే తీరుస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీ ధోరణి గురించి ఇలాంటి మాటలు ఇప్పటికే చాలా సందర్భాలలో వినిపించాయి.

భారత్‌ను పరాయి మతాలు గాయపరచడం ఎంత వాస్తవమో ఇక్కడ ఒకరు న్యాయబుద్ధితో అంగీకరిస్తే, ఇంకొకరు వక్రబుద్ధితో చెప్పారు. ఇస్లామిక్‌ ‌హింస కారణంగానే భారతదేశానిది గాయపడిన నాగరికత అయింది. పాకిస్తాన్‌ ‌వాళ్లు ఈ విషయం బాహాటంగానే చెబుతారు అన్న అర్థంలో నోబెల్‌ ‌బహుమతి గ్రహీత వీఎస్‌ ‌నయీపాల్‌ ‌పలికిన మాటలు అచారిత్రకం కాదని వాస్తవాలు చెబుతున్నాయి. అయినా మన దేశవాళీ ఉదారవాదులు, నాటు మేధావులు ఆయనను దుమ్మెత్తి పోశారు. అది వేరే విషయం. నయీపాల్‌ ‌ప్రపంచానికి చాటిన మంచిమాట ఉంది. కత్తి మొనతో మారిన కాలమాన పరిస్థితులు,  రక్తపాతాల నేపథ్యంలో కొందరు మతం మారారు. ఆరాధనా పద్ధతులు వేరయ్యాయి. అంతమాత్రాన వారు తమ గతాన్ని నిరాకరించవలసిన పనిలేదు అన్నదే ఆయన ఉద్దేశం. ‘అయోధ్యలో వివాదాస్పద కట్టడాన్ని కూల్చడం మంచి పరిణామం. హిందువులలో తమదైన ఆత్మ పరిశీలన మొదలు కావడం ఆనందించదగినదే’ అని నమ్మిన నయీపాల్‌ ఏ ‌మాట అన్నా కుహనా సెక్యులరిస్టులు దుమ్మెత్తి పోయడం వింతకాదు. ఇక్కడ గురజాడ అప్పారావు ‘పెద్ద మసీదు’ కథ అదే ఆవిష్కరించింది. అది ఒక జాతికి తగిలిన గాయం. చరిత్ర నుంచి వర్తమానం తప్పించుకోలేనట్టే, ఏ సమాజమూ, సమూహమూ  తన నేపథ్యాన్ని చెరిపి వేయలేదు. ఆ విషయాన్ని గుర్తించడానికి కొందరైనా ముందుకు వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఒవైసి వంటివారు కూడా తప్పక నోరు విప్పుతున్నారు.

ఇలాంటి ప్రకటనలను వెలువరించడం వెనుక ఉద్దేశాలు ఎలాంటివైనా ఈ దేశం వాటిని స్వాగతిస్తుంది. కొంతకాలంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పెద్దలు చెబుతున్న మాట ఇప్పటికైనా వారి తలకెక్కడం ఆహ్వానించదగినది. అలా అని ఇదంతా ఇవాళ్టి ముస్లిం సమాజం తమ మతాన్ని వదిలిరమ్మని చెప్పడానికి కాదు. ఎప్పుడో పెద్దలు తీసుకున్న నిర్ణయంతో ప్రధాన స్రవంతి చింతనకు దూరమైనా గతాన్ని నిరాకరించకండి అని చెప్పేందుకే. ఆ దృష్టితో దేశంలో శాంతియుత వాతావరణం, సౌభాత్రం నింపే వాతావరణాన్ని బలపరచమనే. ఇవాళ కావలసింది అదే. కానీ అలాంటి ప్రయత్నాలకు విఘాతం కలిగించాలనుకునే శక్తులు ఇంకా ఈ దేశంలో రాజకీయ నేతలుగా చలామణి అవుతున్న సంగతి గుర్తించాలని కృష్ణమ్‌ ‌వంటివారి ప్రకటనలు హెచ్చరిస్తున్నాయి.

About Author

By editor

Twitter
YOUTUBE