జేబులో డబ్బులు పెట్టుకుంటే ఎవడు కొట్టేస్తాడో అనే బాధ ఇప్పుడు లేదు. బ్యాంకు క్యూలలో నిలబడి డబ్బులు డ్రా చేసుకొని చెల్లించాల్సిన పరిస్థితి లేదు.  దుకాణంలో ఏదైనా కొంటే, చిల్లర లేదనే వంకతో షాపు వాళ్లు మనకు అనవసరమైన వస్తువులను అంటగట్టే స్థితీ లేదు. కూరగాయల నుంచి క్రెడిట్‌ ‌కార్డుల చెల్లింపుల వరకూ బ్యాంకు ఎకౌంట్లో డబ్బులుంటే భౌతికంగా వాటిని తీసి వాడే పని లేదు. ఎందు కంటే, ఇప్పుడు కాయగూరలు అమ్మే వారి నుంచి బంగారం దుకాణాల వరకూ యూపీఐ ద్వారా చెల్లింపులను అంగీకరిస్తున్నాయి. కోవిడ్‌ అనంతర ప్రపంచంలో క్యాష్‌లెస్‌ ‌ట్రాన్సాక్షన్స్ (‌నగదురహిత లావాదేవీలు) పెరిగిపోయాయి. భారత్‌ ఈ ‌రకమైన మార్పును  అంగీకరించడంలో మొదటి వరుసలో నిలిచిందనడం అతిశయోక్తి కాదు. నల్లధనాన్ని అంతం చేసేందుకు చేపట్టిన డీమానిటైజేషన్‌ ‌డ్రైవ్‌తో పాటుగా కొవిడ్‌ ‌మహమ్మారి సమయంలో సామాజిక దూరపు ఆంక్షలు  కూడా  డిజిటల్‌ ‌చెల్లింపుల మౌలిక సదుపాయాల దిశగా పౌరులను నడిపాయన్న వాస్తవం మనందరికీ తెలిసిందే. నిజానికి ఈ భారతీయ డిజిటల్‌  అద్భుతం అన్నది నేడు ఆర్థిక వ్యవస్థలో అత్యంత ఎక్కువగా వ్యాఖ్యానిస్తున్న, పరిశీలిస్తున్న అంశం.  ‘చైతన్యపరచడం’ ద్వారా ఎంత భారీ ప్రవర్తనాపరమైన మార్పులు తీసుకురావచ్చో నేడు ఇది ప్రపంచానికి చూపుతోంది.

అత్యంత సంప్రదాయబద్ధమైన, యధాతథ స్థితికి అలవాటుపడిన మన దేశంలో చాపకింద నీరులా ఈ విప్లవం చోటు చేసుకోవడం విశేషం. పెద్దగా ప్రచారం లేకుండా నిశ్శబ్దంగా చేతిలో ఫోన్‌ ఉన్న ప్రతిఒక్కరూ ఈ పద్ధతి అనుసరించేలా చేయడం ఆశ్చర్యపరిచే విషయం. ఇది కేవలం మన జీవితాలను సులభతరం చేయడమే కాదు భారత ఆర్ధిక వ్యవస్థను సానుకూలంగా ప్రభావితం చేసిందనడం అబద్ధం కాదు. ఈ ఏడాది జనవరి నాటికి దాదాపు 200 డాలర్ల (సుమారు రూ. 2లక్షల కోట్లు) విలువైన ఎనిమిది బిలియన్ల (800 కోట్ల) లావాదేవీలు ఈ యూనిఫైడ్‌ ‌పేమెంట్‌ ఇం‌టర్‌ఫేస్‌ (‌యూపీఐ) ద్వారా చోటు చేసుకోవడం ప్రపంచాన్ని కూడా ఆశ్చర్యపరుస్తున్న విషయం. నేడు భారత దేశంలో అన్ని చెల్లింపులు 40శాతం డిజిటల్‌ ‌పద్ధతిలోనే చేస్తున్నారని నేషనల్‌ ‌పేమెంట్స్ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌దిలీప్‌ అస్బే వెల్లడించారు. అత్యంత వేగంగా విస్తరించిన ఈ వ్యవస్థను దాదాపు 300 మిలియన్ల పౌరులు, 50 మిలియన్‌ ‌వర్తకులు ఉపయోగిస్తున్న విషయాన్ని అస్బే చెప్పారు. చిన్న చిన్న లావాదేవీలకు అంటే కప్పు చాయికి రూ.10, కాయగూరలవారికి చెల్లించే చిన్నమొత్తం కూడా యూపీఐ ద్వారా చెల్లిస్తుండ డంతో, మొత్తం లావాదేవీలలో 50శాతం చిన్న, సూక్ష్మ లావాదేవీలేనని వర్గీకరించారు. అత్యంత వేగంగా యూపీఐ విస్తరించడానికి ప్రధాన కారణం ఇలా చిన్న మొత్తాలు చెల్లించే అవకాశం ఉండడమే అని చెప్పవచ్చు. నిన్నటివరకూ, నగదు ఆధారంగా నడిచిన ఆర్ధిక వ్యవస్థలో దీనిని ఒక ముఖ్యమైన ప్రవర్తనా మార్పుగా అభివర్ణించక తప్పదు.

కాగా, భారత్‌లో అందుబాటులో ఉన్న తక్కువ డాటా ధరల వల్ల, స్మార్ట్ ‌ఫోన్‌ ‌మారుమూల గ్రామాల వరకూ విస్తరించడం వల్ల మాత్రమే ఇది సాధ్య మైందని అంతర్జాతీయ విత్తనిధి (ఐఎంఎఫ్‌) ఒక పత్రంలో పేర్కొనడం విశేషం. అంతేకాదు, భారత దేశంలో కొత్త వినియోగదారులను సులువుగా నమోదు చేసుకు నేందుకు ‘ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌’ ‌సౌలభ్యతను టెలికాం కంపెనీలకు ప్రభుత్వం కల్పించడం కూడా యూపీఐ విస్తరించడానికి దారి తీసిందని ఆ పత్రం పేర్కొంది. అంటే, యూపీఐకి, మొబైల్‌ ‌ఫోన్లు, డాటాకు గల సహజీవన సంబంధాన్ని కూడా ఆ పత్రం పట్టి చూపింది. అయితే, యూపీఐ లావాదేవీలు సాగించడానికి ఆ వ్యక్తికి బ్యాంకు అకౌంట్‌ ‌కూడా అవసరం. ఎందుకంటే, యూపీఐ రెండు బ్యాంకు ఖాతాల నడుమ నగదు బదిలీకి సౌలభ్యతను కల్పిస్తుంది. భారత ప్రభుత్వ చేపట్టిన విధానాల కారణంగా, బడుగు, బలహీనవర్గ జనాభాకు ‘జన్‌ ‌ధన్‌ ‌యోజన’ పేరుతో ‘జీరో బ్యాలెన్స్’ అకౌంట్లకు ప్రభుత్వం స్వీకారం చుట్టడంతో ఇది విజయవంతం అయిందన్నది వాస్తవం. అంతర్జాతీయ విత్తనిధి లెక్కల ప్రకారం దేశంలో 77.5 శాతం ప్రజలు 2021 నాటికి బ్యాంకు అకౌంట్‌ను కలిగి ఉన్నారు.

భారతదేశం తక్షణ చెల్లింపుల వ్యవస్థను దేశీయంగా రూపొందించడంతో అది వాణిజ్యాన్ని పునర్నిర్మించడమే కాకుండా, మిలియన్లమంది పౌరులను అధికారిక ఆర్ధికవ్యవస్థలోకి లాక్కొని వచ్చింది. సార్వజనీన డిజిటల్‌ ‌మౌలిక సదుపాయా లకు పునాదిని వేసి, ఆరోగ్యవంతమైన, బలమైన పబ్లిక్‌, ‌ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వం దానిని నిర్మించింది. గత ఏడాది భారత్‌లో జరిగిన ఇన్‌స్టాంట్‌ ‌డిజిటల్‌ ‌ట్రాన్సాక్షన్స్ (‌తక్షణ డిజిటల్‌ ‌లావాదేవీలు) అభివృద్ధి చెందిన దేశాలైన యునైటెడ్‌ ‌స్టేట్స్, ‌బ్రిటన్‌, ‌జర్మనీ, ఫ్రాన్స్‌కన్నా ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ‘‘ఈ నాలుగింటినీ కలిపి, తిరిగి నాలుగుతో హెచ్చ వేయండి-ఆ వచ్చే మొత్తానికన్నా ఇవి ఎక్కువ’’ అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌జనవరిలో జరిగిన వరల్డ్ ఎకనమిక్‌ ‌ఫోరం సందర్భంగా వెల్లడించడం, దేశ ప్రగతికి అద్దం పడుతుంది. ఇది జీవితాన్ని మరింత సౌకర్యవంతం చేయడమే కాక, కోట్లాది మంది భారతీయులకు రుణం, పొదుపు వంటి బ్యాంకింగ్‌ ‌సేవల విస్తరణకు, ప్రభుత్వ కార్యక్రమాలు విస్తారంగా లబ్ధిదారులకు చేరుకోవడానికి, పన్నుల వసూలుకు తోడ్పడింది. జీ20 ఆర్ధిక మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ,  సౌలభ్యంతో జీవించడానికి మార్గాన్ని సుగమం చేసిన ఉచిత ప్రజా ప్రయోజనం భారత్‌లోని ఈ డిజిటల్‌ ‌చెల్లింపుల పర్యావరణ వ్యవస్థ అని అభివర్ణించారు. తక్కువ ఖర్చుతో ఆవిష్కరణలు జరిగేందుకు ప్రభుత్వం వేసిన రైలు పట్టాల వంటిది ఈ డిజిటల్‌ ‌మౌలిక సదుపాయాలు అని కూడా ఆయన అన్నారు.

గతంలో ఎన్నడూ లేని స్థాయిలో వేగవంతమైన సాంకేతిక ఆవిష్కరణ అన్నది అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్రసానుకూల ప్రభావాన్ని కలిగి ఉండటమే కాక ఆర్ధికవృద్ధిని ఎలా పరుగులు తీయించగలదో భారత్‌ ‌చేసి చూపించింది. ప్రపంచం లోని నిరుపేద దేశాల పరిస్థితిని మెరుగు పరచగల నూతన భావనలు కలిగిన ఇన్‌క్యుబేటర్‌గా తనను తాను ప్రదర్శించుకుంటున్న భారతదేశం ఈ పబ్లిక్‌-‌ప్రైవేటు నమూనాను ఎగుమతి చేయాలను కుంటోంది, చేయడం ప్రారంభించింది కూడా. ఈ చొరవలకు కేంద్రంగా ఉన్నది జెఎఎం త్రయం-జన్‌ ‌ధన్‌ ‌ఖాతాలు, ఆధార్‌, ‌మొబైల్‌. ‌భారతదేశ ఆర్ధిక పర్యావరణ వ్యవస్థ మొత్తాన్నీ విప్లవీకరించేందుకు మూలస్తంభాలుగా నిలిచినవి ఈ మూడే.

మొదటి స్తంభం, పిఎం జన్‌ధన్‌ ‌యోజన- ప్రతి వయోజనుడైన భారతీయుడికి బ్యాంక్‌ ‌ఖాతాను అందుబాటులోకి తేవడం ద్వారా ఆర్ధిక వృద్ధిలో సమ్మిళితం చేయాలన్న లక్ష్యంతో దీనిని ప్రారంభిం చారు. 2022 ఆర్థిక సంవత్సరం నాటికి 46.25 కోట్ల బ్యాంకు ఖాతాలను తెరవగా, అందులో 56 శాతం మహిళల పేరిట ఉన్నాయి. తిరిగి ఇందులో 67 శాతం గ్రామీణ, సెమీ-అర్బన్‌ ‌ప్రాంతాలలో తెరిచారు. వీటి మొత్తం విలువ రూ. 1,73,954 కోట్లు.

రెండవ స్తంభం ఆధార్‌. ‌దేశంలోని గుర్తింపు సేవలను పూర్తిగా పరివర్తనకు లోను చేసిన వ్యవస్థ ఇది. ఆధార్‌ ఐడీని రెండు కారకాల (టూ ఫ్యాక్టర్‌) ‌ప్రమాణీకరణ లేదా బయోమెట్రిక్‌ ఐడీలద్వారా డిజిటల్‌ ‌ప్రమాణీకరణ కోసం ఉపయోగించవచ్చు. బ్యాంకులు, టెలికాం కంపెనీలవంటి సంస్థలకు ఆధార్‌ ఆధారిత ప్రమాణీకరణ అనేది శక్తిని ఇస్తోంది. నేడు 99 శాతం మంది వయోజనులకు బయోమెట్రిక్‌ ‌గుర్తింపు సంఖ్య ఉంది. ఇప్పటివరకూ 1.3 బిలియ న్లకు పైగా ఐడీలను జారీ చేశారు. ఈ గుర్తింపు కార్డులు బ్యాంకుల ఖాతాలను తెరవడాన్ని సులభ తరం చేయడమే కాక ఇన్‌స్టాంట్‌ ‌పేమెంట్‌ ‌సిస్టం (తక్షణ చెల్లింపు వ్యవస్థ)కు పునాది అయ్యాయి.

ఇక మూడవ స్తంభం మొబైల్‌ ‌ఫోన్‌. ‌భారతదేశ టెలికాం రంగపు మూల డిజిటల్‌ ఆవిష్కరణను ప్రదర్శిస్తున్న పరికరమిది. ఒక ప్రైవేటు కంపెనీ ధడాలున రంగంలోకి ప్రవేశించిన తర్వాత, డాటా ధరలు 95శాతం మేరకు పడిపోయాయి. ప్రతి భారతీయుడికీ తక్కువ ధరలో, సులువుగా ఇంటర్నెట్‌ అం‌దుబాటులోకి రావడానికి ఇది మార్గాన్ని సుగమం చేసింది. ఇది తిరిగి ఇ-కామర్స్, ఆహార బట్వాడా, ఓటీటీ వేదికలు భారత దేశంలో ప్రారంభమై వేగంగా దూసుకు పోవడానికి కారణమైంది. అన్నింటికన్నా ప్రధానంగా భారతదేశంలోని అత్యంత మారుమూల ప్రదేశాల వరకూ డిజిటల్‌ ‌చెల్లింపుల వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్‌ఫోన్లు ప్రజల్లోకి విస్తృతంగా చొచ్చుకొని పోవడం, టెలిఫోన్‌ ‌కంపెనీలు ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తీసుకురావడం, ఆధార్‌ ‌ధ్రువీకరణ ఆధారంగా జన్‌ధన్‌ ‌ద్వారా ఆర్ధికంగా కలుపుకు పోవడంతో భారతీయ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థ నమూనా మార్పు (పారడైమ్‌ ‌షిఫ్ట్)‌కు లోనైంది. ఈ పరివర్తనే యూనిఫైడ్‌ ‌పేమెంట్స్ ఇం‌టర్‌ఫేస్‌ (‌యూపీఐ)ను సంభావితం చేసింది. ఇదే, ఒక బ్యాంకుకు అనుసంధానమైన ఖాతాకు నగదు రహిత చెల్లింపుల పద్ధతిలో సులభంగా చెల్లించే పద్ధతిలోకి భారతదేశం మారడాన్ని అత్యంత వేగవంతం చేసింది.

పీపీపీ నమూనాలో యూపీఐ

నేషనల్‌ ‌పేమెంట్స్ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా (ఎన్‌పీసీఐ) నాయకత్వంలోని పబ్లిక్‌-‌ప్రైవేటు భాగస్వామ్య వ్యవస్థ యూపీఐ. ఇది అంతర్‌నిర్వహణ వేదిక (ఇంటర్‌ ఆపరబుల్‌). ఈ ‌వేదిక వందలాది బ్యాంకులు, డజన్లకొద్దీ మొబైల్‌ ‌పేమెంట్‌ ఆప్‌లను ఎటువంటి ట్రాన్సాక్షన్‌ ‌చార్జీలు లేకుండా  అందిస్తుంది. ఫిన్‌టెక్‌, ‌బ్యాంకులు, టెలికాం కంపె నీలు ఈ వేదికను అనుసరిస్తూ, వ్యాపారి అమ్మక కేంద్రం (పీఒఎస్‌)‌వద్ద క్యూర్‌ ‌కోడ్‌ను ఏర్పాటు చేయడం వంటి చర్యల ద్వారా యూపీఐ వృద్ధికి తోడ్పడ్డాయి. డిజిటల్‌ ‌చెల్లింపుల వ్యవస్థ పటిష్టత గురించి మాట్లాడుతూ, గోప్యత, ఆవిష్కరణల నడుమ ప్రభుత్వం సరైన సమతుల్యతను సాధించిందని జి-20 షెర్పా అమితాబ్‌ ‌కాంత్‌ ‌పేర్కొనడం గమనార్హం. డాటా వ్యక్తికి చెందినది కావడం, తాను చేపట్టిన ప్రతి లావాదేవీకి సమ్మతిని తెలిపే హక్కు అతడు/ ఆమెకు ఉంటుందని ఆయన అన్నారు.

డిజిటల్‌ ‌పేమెంట్‌ ‌వ్యవస్థ విజయవంతం కావడానికి కారణం కేవలం డిజిటల్‌ ‌చెల్లింపు మౌలికసదుపాయాల పటిష్టతపై ఆధారపడడం కాదని, ప్రజలు నగదు నుంచి డిజిటల్‌ ‌వ్యవస్థ వైపుగా మొగ్గేలా వారి ప్రవర్తనను ప్రోత్సహించడమేనని ఆయన అన్నారు. ఏ రకమైన మార్పు అయినా తన కీలక సమూహపు ఔచిత్యాన్ని నిర్ధారించే అంతర్‌ ‌దృష్టితో కూడిన ఆవిష్కరణల ద్వారా వ్యవస్థ పట్ల విశ్వాసం, అందుబాటు ఆధారంగా ఉండాలి. ఇందులో, నిరంతరం బిజీగా ఉండే టీస్టాళ్లు, మిర్చిబజ్జీ, టిఫిన్‌ ‌బళ్లు, కాయగూరలు అమ్మే బళ్లలో, చిన్న స్టాళ్లలో వ్యాపారి ఖాతాలోకి డబ్బు జమ కాగానే, ఎంత అయిందో చెప్పే ‘సిరి’ వంటి గొంతుకతో ప్రకటించే వాయిస్‌ ‌బాక్సుల వంటి చిన్న ఆవిష్క రణలు ఉన్నాయి. ఇది వ్యాపారులలో నమ్మకాన్ని పెంచేందుకు తోడ్పడింది.

రూపే కార్డును, యూపీఐ ప్రభుత్వం ప్రవేశ పెట్టకముందు వీసా, మాస్టర్‌ ‌కార్డులదే హవా. చేతిలో డబ్బు లేకుండా షాపింగ్‌ ‌చేయడానికి, ఆన్‌లైన్‌ ‌లావాదేవీలకు ప్రజలు వీటినే విస్తృతంగా వినియో గించేవారు. అయితే, దెబ్బకు ఠా అన్నట్టుగా వచ్చిన యూపీఐతో ఇవి వెనుకబడిపోయాయి. ముఖ్యంగా ప్రజలు ఈ క్రెడిట్‌ ‌కార్డులను ఉపయోగించి లావా దేవీలు చేసినప్పుడు అందుకు దాదాపు 2.5 శాతం ఫీజును చెల్లించవలసి వచ్చేది. యూపీఐ రంగంలోకి రాక ముందు వరకు మార్కెట్లను ఏలిన ఈ సంస్థలు 2014లో ఫీజుల రూపంలో వచ్చిన 1 బిలియన్‌ ‌యూఎస్‌ ‌డాలర్ల లాభాన్ని తమ దేశానికి చేరవేశాయి. కానీ, యూపీఐ స్వల్ప ఫీజులతో ఆ సౌకర్యాన్ని కల్పించడంతో ప్రజలు అటే మొగ్గడం మొదలైంది. ప్రస్తుతం కార్డుల ద్వారా జరుగుతున్న లావాదేవీలలో 60 శాతం రూపే కార్డువి కాగా, వీసా, మాస్టర్‌ ‌కార్డులు 40శాతంతో సరిపుచ్చు కోవలసి వస్తోంది. అయితే, క్యూఆర్‌ ‌కోడ్‌లు, ఫోన్‌ ‌నెంబర్లకు డబ్బును పంపే అవకాశం కలగడంతో మొత్తం ఆన్‌లైన్‌ ‌చెల్లింపులలో కార్డుల ప్రాముఖ్యం తగ్గిపోతోందన్న మాట కూడా వాస్తవమే. నేడు భారతీయ మార్కెట్‌లో వినిమయ సరళి, వారి దృక్పధంలో వచ్చిన భారీ ప్రవర్తనా మార్పు గమనించదగినది. పెరుగుతున్న ఆదాయాల కారణంగా మారుతున్న వినియోగదారుల ఎంపికలను వేగంగా వృద్ధి చెందుతున్న భారత్‌ ఆర్ధిక వ్యవస్థ వీక్షిస్తోంది. భారతీయ మార్కెట్లు ప్రీమియమై జేషన్‌ (అధికలాభాల) సరళికి సాక్షిగా ఉన్నాయి. ఇది భారత్‌లో వ్యాపారాన్ని, వ్యవస్థాపకతను, వినియోగ సరళులను విప్లవీకరించి, భారతీయ డిజిటల్‌ ‌చెల్లింపుల పర్యావరణ వ్యవస్థను ఒక గేమ్‌ ‌ఛేంజర్‌గా, ప్రపంచానికి స్ఫూర్తిగా మారడానికి దారి తీసింది.

******

ప్రపంచాన్ని చుట్టేస్తున్న యూపీఐ

యూనిఫైడ్‌ ‌పేమెంట్‌ ఇం‌టర్‌ఫేస్‌ (‌యూపీఐ) వంటి భారతీయ డిజిటల్‌ ‌చెల్లింపు వ్యవస్థలు సజావుగా సరిహద్దు ఆవల లావాదేవీలు చేసేందుకు ఆకర్షణీయమైన ఉపకరణంగా నేడు ప్రపంచం భావిస్తోంది. ప్రస్తుతం యూపీఐ చెల్లింపు లను అంగీకరిస్తున్న దేశాలలో సింగపూర్‌, ‌మలే సియా, యూఏఈ, ఫ్రాన్స్, ‌నేపాల్‌, ‌యూకె, బెల్జియం, నెదర్‌ల్యాండ్స్, ‌లగ్జంబర్గ్ ‌వంటి పశ్చిమ ఐరోపా దేశాలు ఉన్నాయి. భీమ్‌ ఆప్‌ ‌ద్వారా యూపీఐ లావాదేవీలను అనుమతించిన తొలి దేశం భూటాన్‌. ‌జులై 2021లోనే భూటాన్‌ ‌డిజిటల్‌ ‌చెల్లింపుల వ్యవస్థలోకి ప్రవేశించింది. ఎన్‌ఆర్‌ఐలు భారీ ఫీజును చెల్లించకుండా లేదా అతి స్వల్ప మూల్యంతో స్వదేశానికి ఈ వ్యవస్థ ద్వారా నగదును పంపవచ్చు. దీని కారణంగా, భారత్‌లో విదేశీ మారకం ఎక్కువగా జమ అవుతుంది.

రూపే, యూఏఈ వంటి తన డిజిటల్‌ ‌చెల్లింపుల నెట్‌వర్క్‌ల వంటి భారతీయ చెల్లింపుల వ్యవస్థకు సంబంధించిన భిన్న రూపాలను అంగీకరించిన దేశాలలో ఫ్రాన్స్, ‌యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రయిన్‌, ‌సింగపూర్‌, ‌మాల్దీవ్స్, ‌భూటాన్‌, ఒమన్‌లు ఉన్నాయి. సింగపూర్‌ ‌యూపీఐ విలీనీ కరణను పూర్తి చేసుకుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌జి-20 డిజిటల్‌ ఎకానమీ వర్కింగ్‌ ‌గ్రూప్‌ ‌సమావేశంలో వెల్లడించారు.

అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఎన్‌ఐపిఎల్‌ (ఎన్‌పీసీ•ఐ ఇంటర్నేషనల్‌ ‌పేమెంట్స్ ‌లిమిటెడ్‌) ‌రూపే, యూపీఐలకు భారీ ఆమోదిత నెట్‌వర్క్‌ను నిర్మించేందు కు భిన్న దేశాలతో భాగస్వామ్యానికి ప్రయత్నిస్తోంది. ఎన్‌ఐపిఎల్‌ను 2020లో ఏర్పాటు చేశారు. ఇది నేషనల్‌ ‌పేమెంట్స్ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా (ఎన్‌పిసిఐ) అనుబంధ సంస్థ. భారతదేశం ఆవల రూపేను, యూపీఐను ఉపలభ్యం చేసేందుకు కట్టుబడి ఉన్న సంస్థ ఇది. యూపీఐని అంతర్జాతీయం చేయడం అన్నది అటు వ్యాపారులకు, ఇటు యూజర్లకు అనేక రకాలుగా తోడ్పడుతుంది. వ్యాపారులు విస్తృత కస్టమర్‌ ‌బేస్‌ను చేరుకోవడానికి, భారతీయ కస్టమర్ల నుంచి చెల్లింపులను అందుకోవ డానికి తోడ్పడుతుంది. ఆన్‌లైన్‌ ‌లావాదేవీలు మొదలైన తర్వాత పెరిగిన సైబర్‌ ‌నేరాల నేపథ్యంలో వినియోగదారుల ఖాతాలను పరిరక్షించేందుకు రెండు కారకాల ధృవీకరణను ఉపయోగిస్తుంది. అందుకే, ఇంత భారీ స్థాయిలో లావాదేవీలు జరుగుతున్నప్పటికీ మోసాలు తక్కువ స్థాయిలోనే ఉంటున్నాయి.

అంతర్జాతీయ స్థాయిలో దీనిని ఉపయోగించడ మన్నది భారతీయ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థలో చెప్పుకోదగిన మైలురాయి. భారత్‌లో తన విజయం తర్వాత అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థలో కూడా అంతరాయం కల్పించగల సంభావ్యత యూపీఐకి ఉండడం విశేషం. ప్రస్తుతం అంతర్జాతీయ లావా దేవీల ఖరీదు చాలా ఎక్కువగా ఉంది. యూపీఐని అంతర్జాతీయం చేయడం అన్నది సరిహద్దు ఆవల చెల్లింపుల ఖరీదును తగ్గించేందుకు తోడ్పడుతుంది.

అంతర్జాతీయంగా యూపీఐ వినియోగంలోకి వస్తే డాలరు ప్రాముఖ్యం తగ్గి, రూపాయికి విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌ ‌యుద్ధం మొదలైన తర్వాత, రష్యా బ్యాంకులు స్విఫ్ట్ (SWIFT) – సొసైటీ ఫర్‌ ‌వరల్డ్‌వైడ్‌ ఇం‌టర్‌ ‌ఫైనాన్షియల్‌ ‌టెలికమ్యూనికేషన్స్ ‌వ్యవస్థను ఉపయో గించు కోవడంపై యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌నిషేధం విధించింది. దీనితో రష్యాతో వాణిజ్యాన్ని నిర్వహించ డానికి సంప్రదాయంగా స్విఫ్ట్‌ను ఉపయో గిస్తున్న భారత్‌ ‌సహా పలు దేశాలలో అంతరాయం ఏర్పడింది. అప్పటి నుంచి భారత్‌ ‌దీనికి పరిష్కారాన్ని కనుగొనేం దుకు, భారతీయ రూపాయలలో వ్యాపార సెటిల్‌ ‌మెంట్లను ప్రోత్సహించడం, అందుకు అవసరమైన విధివిధానాలను అమలులోకి తేవడానికి ప్రయత్నిం చింది. ఈ నేపథ్యంలో 19 దేశాలతో ఒప్పందాలు చేసుకునేందుకు ఏర్పాట్లు జరగడమే కాదు, జులై 2022లో విదేశీ బ్యాంకులు భారతీయ రూపాయలలో చెల్లింపులను జరిపేందుకు భారతీయ బ్యాంకులలో వోస్ట్రో (Vostro) ఖాతాలను తెరి చేందుకు రిజర్వ్ ‌బ్యాంకు అనుమతించింది. దీనితో, ఇతర దేశాలతో మనం రూపాయలలో లావాదేవీలు జరిపేందుకు ద్వారాలు తెరిచినట్టు అయింది.

ఇతర దేశాలు కూడా ఇదే మార్గంలో పయనిస్తూ, తమ తమ దేశాల కరెన్సీలలో వ్యాపార లావాదేవీలను కొనసాగించేందుకు ఈ పద్ధతిని అవలంబిస్తే, నిన్నటి వరకూ ఆర్ధిక, సైనిక బలంతో విర్రవీగిన యూఎస్‌ ‌కోరలు పీకినట్టు అవుతుంది. స్విఫ్ట్ ‌వ్యవస్థలో ఆర్ధిక లావాదేవీల ద్వారా ప్రపంచంపై పెత్తనం, ఆంక్షలను చెలాయించిన అమెరికా ఇప్పుడు తగ్గక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఎప్పుడైతే, దేశాలు తమ తమ కరెన్సీలలో వ్యాపార లావాదేవీలు ప్రారంభిస్తాయో, అప్పుడు ప్రపంచమారకంగా ఉన్న డాలరు విలువ పతనం కావడమే కాక డీడాలరీకరణకు మార్గం సుగమం అవుతుంది.

About Author

By editor

Twitter
YOUTUBE