– రాజనాల బాలకృష్ణ

2024 లోక్‌సభ ఎన్నికలు ఇంకా ఎంతో దూరంలో లేవు. మరోవైపు, ‘మూడ్‌ ఆఫ్‌ ‌ది నేషన్‌’‌ను బట్టి చూసినా, వివిధ సంస్థలు నిర్వహించిన, నిర్వహిస్తున్న సర్వేలను బట్టి చూసినా, ముచ్చటగా మూడవసారి ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ అధికారంలోకి రావడం ఖాయమనే విషయం ‘సర్వ’ జనులకు స్పష్టమైంది. సుస్థిర అభివృద్ధితో భారత ఆర్థిక వ్యవస్థను సమున్నత స్థాయికి చేర్చడంతో పాటు, దేశాన్ని ప్రపంచ పటంలో ‘విశ్వగురువు’గా నిలిపే ‘సంకల్ప’ బలంతో ముందుకు సాగుతున్న మోదీ ప్రస్థానాన్ని అడ్డుకోవడం అయ్యే పనికాదని విపక్షాలు సహా ఏ ఒక్కరిలోనూ ఎలాంటి అనుమానం లేదు. అందుకే, మోదీకి సమఉజ్జీ లేరని విపక్ష కూటమి నేతలు మీడియా చర్చల్లో బహిరంగంగా అంగీకరిస్తున్నారు. మరో దారి లేకనే సిద్ధాంతాలకు ‘తూచ్‌’ ‌చెప్పేసి, రాజకీయ విభేదాలను పక్కన పెట్టి అధికారం కోసం జట్టు కడుతున్నారు. అదే విషయాన్ని సిగ్గువిడిచి మరీ చెప్పుకోవడం విచిత్రం. ఎర్రకోట కోట నుంచి త్రివర్ణ పతాకం సాక్షిగా మళ్లీ అధికారం తమదేనని మోదీ విశ్వాసం ప్రకటిస్తే, విపక్షాలు పార్లమెంట్‌ ‌నుంచి పలాయనం చిత్తగించాయి.

మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తే సమీప భవిష్యత్‌లో మరో పార్టీ లేదా మరో కూటమి అధికారంలోకి రావడం అయ్యే పనికాదనే నిజాన్ని విపక్షాలు ముందుగానే పసిగట్టాయి. అదే జరిగితే, ఇక అక్కడితో తమ రాజకీయ భవిష్యత్‌కు తెర పడినట్లే అనే భయం విపక్ష నాయకులను వెంటాడుతోంది. ముఖ్యంగా, వరుసగా రెండుసార్లు ‘చారిత్రక’ ఓటమిని చవి చూసిన కాంగ్రెస్‌ ‌పార్టీ ‘హ్యాట్రిక్‌’ ‌పరాభవం నుంచి తప్పించుకునేందుకు ఇతర ప్రతిపక్షాలను కలుపుకునే క్రమంలో కాళ్ల బేరానికి సైతం సిద్ధమైంది. చివరకు కాంగ్రెస్‌ ‌పార్టీని ఇటు ఢిల్లీలో అటు పంజాబ్‌లో నామరూపాలు లేకుండా చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి దాసోహమయ్యే స్థాయికి హస్తం పార్టీ చేరింది. అలాగే, అవినీతికి ‘కేరాఫ్‌ అ‌డ్రస్‌’‌గా మారిన ప్రాంతీయ, కుటుంబ పార్టీలు ఆత్మరక్షణలో పడిపోయాయి. మోదీని ఎదుర్కోవడం ఏ ఒక్కరి తోనూ అయ్యే పని కాదనే నిర్ణయానికి వచ్చాయి. అందుకే కురువృద్ధ కాంగ్రెస్‌ ‌సహా బీజీపీ/ఎన్డీఏ వ్యతిరేక పార్టీలన్నీ ఒకటయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. మంచిదే.. ఒంటరిగా కాకపోయినా మూకుమ్మడిగా అయినా, ప్రతిపక్షాలు ప్రస్తుత ప్రభుత్వ విధానాలలోని లోపాలను ఎత్తి చూపి, ప్రత్యామ్నాయ విధానాలు, ప్రణాళికతో ముందుకు వస్తే కాదనేది ఉండదు. రెండు పార్టీలు, రెండు కూటములు, రెండు విభిన్న రాజకీయ, ఆర్థిక విధానాలను బేరీజు వేసుకుని రెండింటిలో ఏది మంచిదో, ఏది చెడ్డదో ప్రజలు నిర్ణయించుకుంటారు. సమయం వచ్చినప్పుడు సరైన తీర్పునిస్తారు.

కానీ, అదేమి దౌర్భాగ్యమో ఈరోజు, ఐ.ఎన్‌.‌డి. ఐ.ఎ (ఇండియా)గా నామకరణం చేసుకున్న 26 పార్టీల కొత్త కూటమికి ప్రజల ముందుంచేందుకు ఒక ప్రత్యామ్నాయ ఎజెండా, ప్రణాళిక, కార్యక్రమం వంటివి లేవు. ఇక నాయకత్వం విషయమైతే చెప్పనే అక్కరలేదు. వీటన్నిటినీ మించి పరస్పర విశ్వాసం అసలే లేదు. ‘నువ్వొకందుకు పోస్తే నేనొకందుకు తాగుతున్నాను..’ అన్నట్లుగా వ్యవహారం సాగుతోంది. నిజానికి, పదేళ్లు దేశాన్ని పాలించిన యూపీఏకి, ప్రస్తుత ఇండియా కూటమికి ఒక్క పేరులో తప్ప మరో తేడా లేదు. యూపీఏ పేరును, ఆరు వంకర్లు, ఐదు మధ్య చుక్కలతో ఇండియన్‌ ‌నేషనల్‌ ‌డెవలప్‌మెంట్‌ ఇం‌క్లూసివ్‌ అలయన్స్ (ఐ.ఎన్‌.‌డి.ఐ.ఎ- ఇండియా)గా మార్చుకున్నారు.

సరే.. విపక్షాల ‘ఇండియా’ ప్రహసనం చివరకు ఎలా ముగుస్తుందనే ప్రశ్నను కాసేపు పక్కన పెడితే ఈ ప్రహసనం సాగుతున్న క్రమంలో ప్రతిపక్షాల పెద్దలు పార్లమెంట్‌ ‌లోపల, వెలుపల వ్యవహరిస్తున్న తీరు దేశ, విదేశాల్లో చేస్తున్న ప్రసంగాలు అనేక అనుమానాలకు ఆస్కారం ఇస్తున్నాయి. విపక్ష సభ్యులు సభ్యత, సంస్కారం మరచి ప్రవర్తిస్తున్న తీరు, చేస్తున్న ప్రసంగాలు వారి ప్రతిష్టనే కాదు, రాజకీయ సభామర్యాదలకు సైతం తలవంపులు తెచ్చేలా ఉంటున్నాయి. ముఖ్యంగా ‘తుకడే తుకడే గ్యాంగ్‌’‌ను వెంటపెట్టుకుని ‘భారత్‌ ‌జోడో’ యాత్ర సాగించిన రాహుల్‌ ‌గాంధీ ప్రవర్తన, పలుకులు ఆయన రాజకీయ ప్రస్థానం ఎటు వైపు సాగుతోందనే విషయంలో పలు అనుమానాలకు తావిస్తోంది. నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన అహంకారాన్ని ఏ మేరకు తగ్గించుకున్నారో, ఈ దేశం గురించి, మన సంస్కృతీ సంప్రదాయాల గురించి ఏమి తెలుసుకున్నారో, ఏమి నేర్చుకున్నారో కానీ పార్లమెంట్‌లో ఆయన ప్రవర్తన కన్ను గీటటాలు, కౌగిలింతల స్థాయి నుంచి మరో పది మెట్లు పతనమై ‘ఫ్లైయింగ్‌ ‌కిస్సులు’ విసిరే స్థాయికి దిగజారింది. కాగా, అనర్హత వేటు నుంచి తాత్కాలిక ఉపశమనం పొంది లోక్‌సభలో అడుగు పెట్టిన రాహుల్‌.. ‌విపక్షాల అవిశ్వాస తీర్మానంపై చేసిన ప్రసంగం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

చాంతాడంత రాగం తీసి చివరకు అదేదో పాట పాడినట్లుగా ఆయన ప్రసంగం సాగింది. రాహుల్‌ ‌గాంధీని దేశ్‌ ‌కీ నేతగా చూపేందుకు ఏ మాత్రం సంకోచించకుండా గొంతును అరువిచ్చే రాజ్‌దీప్‌ ‌సర్దేశాయ్‌ ‌వంటి వారు కూడా అవిశ్వాస తీర్మానంపై రాహుల్‌ ‌గాంధీ ప్రసంగం విషయంలో పెదవి విరిచారు. అంతేకాదు, 20 ఏళ్లకు పైగా పార్లమెంట్‌ ‌సభ్యుడిగా ఉన్న రాహుల్‌ ‌గాంధీ.. ఈ రెండు దశాబ్దాల కాలంలో గొప్పగా చెప్పుకోదగిన ప్రసంగం ఒక్కటీ చేయలేదని విచారం వ్యక్తంచేశారు. అంటే, రాహుల్‌ ‌ప్రసంగం ఆయన అభిమానులను సైతం ఎంతగా నిరాశకు గురిచేసిందో వేరే చెప్పనక్కరలేదు. రాహుల్‌ ‌గాంధీ తన ప్రసంగంలో ‘మణిపూర్‌లో భారతమాత.. హత్యకు గురైంద’నే.. దిగజారుడు వ్యాఖ్యలు చేసి, తన స్థాయిని మరింత దిగజార్చు కున్నారు. అందుకే రాహుల్‌ను తన మీడియా మిత్రులు కూడా ఛీ.. అనక తప్పలేదు.

నిజానికి, రాహుల్‌ ‌గాంధీ మాత్రమే కాదు, అహంకారం, అజ్ఞానం, అసమర్థతలకు మారు పేరుగా నిలిచిన ‘ఘంమ్డియా’ కూటమి నాయకులు, పార్లమెంట్‌ ‌వర్షకాల సమావేశాల్లో ప్రవర్తించిన తీరు దేశానికే తలవంపులు తెచ్చేలా ఉందంటే ఎవరూ కాదన లేరు. ఇక్కడే ఒక ప్రధాన ప్రశ్న ముందుకు వస్తోంది. విపక్షాలు ఎందుకు ఇంతలా దిగజారి ప్రవర్తి స్తున్నాయి? ఎందుకు, తమ బలహీనతలను, భయాలను బయట పెట్టుకుంటున్నాయి? మూడోసారి మోదీ.. అనగానే ఎందుకు అంతలా ఉలిక్కిపడుతున్నాయి? అని అడిగితే ఇందుకు సమాధానం ఒక్కటే. ఆశించిన ఫలితాలు చేజారి పోయినప్పుడు, కాళ్ల కింద నేల కదిలిపోతున్నప్పుడు, ఇటు చూసినా.. అటు చూసినా.. ఎటు చూసినా.. అన్ని దిక్కులా అష్టమ దిక్కే దర్శనం ఇస్తున్నప్పుడు నిస్పృహకు గురికావడం సహజం. ప్రస్తుతం దేశంలో విపక్షాల పరిస్థితి అదే. కాబట్టి పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ ఆ పార్టీల నాయకులు గీత దాటి ప్రవర్తిస్తున్నారు. ఒక విధంగా దురహంకారాన్ని చూపుతున్నారు. సభ ఆగ్రహానికి గురవుతున్నారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ ‌పక్షనేత అధీర్‌ ‌రంజన్‌ ‌చౌధురి చేసిన వ్యాఖ్యలు, ఆయన ప్రవర్తన సభాహక్కుల ఉల్లంఘనకు దారి తీశాయి. లోక్‌సభ స్పీకర్‌ ‌సభ ఆమోదంతో ఆయన వ్యాఖ్యలను ‘ప్రివిలేజ్‌’ ‌కమిటీకి పంపించారు. ప్రివిలేజ్‌ ‌విచారణ పూర్తయ్యే వరకు స్పీకర్‌ ఆయన్ని సస్పెండ్‌ ‌చేశారు. అలాగే, రాజ్యసభలో తప్పటడుగులు వేసిన ఆప్‌ ఎం‌పీ రాఘవ్‌ ‌చద్దా, అదుపు తప్పి ఆవేశం ప్రదర్శించిన తృణమూల్‌ ‌పార్టీ రాజ్యసభ సభ్యుడు డెరెక్‌ ఒ‌బ్రెయిన్‌ ‌కూడా ‘సస్పెన్షన్‌’‌కు గురయ్యారు.

అధీర్‌ ‌రంజన్‌ ‌చౌధురి అన్నట్లుగా గతంలో ఎప్పుడూ ప్రధాన ప్రతిపక్ష నేతను సస్పెండ్‌ ‌చేసిన సందర్భం చరిత్రలో లేకపోవచ్చు. ఇదే తొలిసారి కావచ్చు. ఆ ‘గౌరవం’ పొందిన వ్యక్తి నేత అధీర్‌ ‌రంజనే కావచ్చు. కానీ, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అని ఆలోచిస్తే ఆత్మపరిశీలన చేసుకుంటే తాను చేసిన తప్పేమిటో ఆయనకే తెలిసి వస్తుంది. కానీ, ఆయన ఆ పని చేయలేదు. నిజానికి, ప్రధానమంత్రి, ఇతర మంత్రులు ప్రసంగించే సమయంలో, సభలో చర్చలు జరుగుతున్నప్పుడు.. అసందర్భ వ్యాఖ్యలు, విమర్శలు చేయడాన్ని అధీర్‌ ‌రంజన్‌ అలవాటుగా మార్చుకున్నారు. ‘మణిపూర్‌’ ‌విషయంపై మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి, నీరవ్‌ ‌మోదీకి ముడి పెడుతూ నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఈ ఒక్కటే కాదు, గతంలోనూ అధీర్‌ ‌రంజన్‌ ‌ప్రధాన మంత్రిని, పార్లమెంట్‌ను, దేశాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషి చెప్పినట్లుగా నిరాధార ఆరోపణలు చేయడం, నిందలు మోపడం ఒకరకంగా చూస్తే ఆయనకు అలవాటుగా మారిపోయింది. అలాగే, స్పీకర్‌ అవకాశం ఇచ్చినా తమ తప్పుడు ఆరోపణలను ఉపసంహరించుకుని, క్షమాపణ చెప్పకపోవడం వల్లనే అనివార్య పరిస్థితిలో స్పీకర్‌ ‌చర్యలు తీసుకోక తప్పలేదు. గతంలోనూ అధీర్‌ ‌రంజన్‌ ‌రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అంటూ సంబోధించి అవమానపరిచారు. అయితే, పొరపాటున నోరుజారానని, అందుకు చింతిస్తున్నానని పేర్కొంటూ చివరకు క్షమాపణలు చెప్పారు.

ఇక ఆప్‌ ‌రాజ్యసభ సభ్యుడు రాఘవ చద్దా విషయానికి వస్తే.. ఆయన ఏకంగా సభలో ఉన్న ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజ్యసభలో ఢిల్లీ సర్వీసెస్‌ ‌బిల్లుపై చర్చలో పాల్గొన్న ఈ యువ ఎంపీ, ఈ బిల్లుపై హౌస్‌ ‌కమిటీ వేయాలని కోరారు. అంతవరకు బానే ఉంది. కమిటీలో ఉండే సభ్యుల పేర్లనూ ఆయనే సూచించారు. అది కూడా కొంతవరకు అంగీకరించవచ్చు. కానీ, సభ్యుల అనుమతి లేకుండా, అదీ అధికార కూటమికి చెందిన సభ్యుల పేర్లను కమిటీకి సూచించడంతో వివాదానికి తెర లేచింది.

ఎన్డీఏకి చెందిన సస్మిక్‌ ‌పాత్ర, ఎన్‌. ‌ఫాంగ్నాస్‌ ‌కొవ్వాక్‌, ఎం. ‌తంబిదురై, నరహరి అమీన్‌లు తమ అనుమతి లేకుండా తమ పేర్లను చేర్చారని, తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ఫిర్యాదు చేయడంతో రాజ్యసభ చైర్మన్‌ ‌వారి ఫిర్యాదులను ప్రివిలేజ్‌ ‌కమిటీ విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తయ్యే వరకు చద్దాను సస్పెండ్‌ ‌చేశారు. ఇక తృణమూల్‌ ‌సీనియర్‌ ‌సభ్యుడు డెరెక్‌ ఒ‌బ్రెయిన్‌ ఒకటికి పదిమార్లు సభా కార్యక్రమాలకు అడ్డుతగలడంతో పాటుగా నేరుగా, సభాధ్యక్షునితో పలుమార్లు వివాదానికి దిగి ‘సస్పెన్షన్‌’‌ను కొని తెచ్చుకున్నారు. డెరెక్‌ ఒ‌బ్రెయిన్‌ ‌ప్రవర్తన విషయంలో చైర్మన్‌ ‌పలుమార్లు హెచ్చరించినా ఆయనలో మార్పు రాలేదు. అందుకే ఆయనను సస్పెండ్‌ ‌చేయవలసి వచ్చిందనే విషయం సభా కార్యక్రమాలను చూసిన ఎవరైనా అంగీకరిస్తారు. అయితే, రాహుల్‌ ‌మొదలు రాఘవ చద్దా వరకు విపక్షాల సభ్యులు, నాయకులు ఎందుకు మర్యాద మరుస్తున్నారన్నది ఇప్పుడు భేతాళ ప్రశ్నగా మారింది.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE