సంస్కృతంలో వెలువడిన మహాకావ్యాలలో మొదటిది వాల్మీకి రామాయణం కావడంతో దానిని ‘ఆది కావ్యం’గా అభివర్ణిస్తారు. వేల ఏళ్ల కింద రచించిన ఈ గ్రంథం వైవిధ్యభరితమైన ఆదర్శ జీవిత విలువలను అందిస్తుంది. అయితే, వాల్మీకి రామాయణంలోని వ్యూహాత్మక కోణంపై సమాజం శ్రద్ధ వహించలేదు. రాముడిని ఆదర్శ కుమారుడిగా, భర్తగా, రాజుగా అభివర్ణించేవారే ఎక్కువగా కనిపిస్తారు తప్ప ఆయన వ్యూహాత్మక ఆలోచనలను వెలుగులోకి తెచ్చినవారు బహు తక్కువ.
కౌటిల్యుని ముందు కాలంలోని వ్యూహాత్మక ఆలోచనా/ రచన సంప్రదాయంలో రామాయణ స్థానం చెప్పుకోదగినది. సమకాలీన అంతర్జాతీయ సంబంధాల సిద్ధాంతం (ఐఆర్‌టి) ఐరోపా కేంద్రంగా, యధాతథ స్థితిని సమర్ధిస్తూ, అందరినీ కలుపుకుపోదు. ఇందులో భారతీయ విజ్ఞానానికి పాశ్చాత్య మేధావులు చోటు కల్పించలేదు. అయితే, భారతీయ మేధావి, పండితుడు అయిన బినయ్‌కుమార్ సర్కార్ అంతర్జాతీయ సంబంధాలలో భారతీయ దృక్పథం అన్న అంశాన్ని అధ్యయనం చేసి, 1919లో అంతర్జాతీయ సంబంధాల పట్ల భారతీయ వైఖరి అన్న అంశంపై ‘హిందూ థియరీ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్’ అన్న ఇతివృత్తంతో ‘అమెరికన్ పొలిటికల్ సైన్స్ రివ్యూ’ అన్న పత్రికలో వ్యాసాన్ని ప్రచురించి, చర్చను ప్రారంభించాడు. అనంతరం కాలంలో వి.రామచంద్ర దీక్షితార్, జార్జ్ మొడెల్‌స్కీ, జిటి డేట్, ఆర్‌ఎస్ యాదవ్, కౌశిక్ రే, అరుణా నార్లికర్, అమృతా నార్లికర్, ప్రస్తుత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సహా పలువురు ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్లారు. డా।। వివేక్ కుమార్ మిశ్రా ఫిబ్రవరి 2023లో ‘ఇండిక్ పరస్పెక్టివ్ ఆన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్’ అన్న పుస్తకాన్ని సంకలనం చేయడం ఈ దిశలో ఒక నిర్మాణాత్మక చర్యనే చెప్పాలి. ‘రామాయణ్ మే సామరిక్ సంస్కృతి: అంతర్‌రాష్ట్రీయ సంబంధోంకా ఇండిక్ సిద్ధాంత్’ అన్న పేరుతో పుస్తకాన్ని రచించి డాక్టర్ అనూప్ కుమార్ గుప్తా ఈ భావనను మరింత ముందుకు తీసుకువెళ్లడం అభినందనీయం.
‘వ్యూహాత్మక సంస్కృతి’ అన్న భావన జాతీయ భద్రతకు సంబంధించింది. భారతదేశం స్వాతంత్య్రం సాధించిన తర్వాత భారతీయ వ్యూహాత్మక అంశాల సైద్ధాంతిక, ఆచరణాత్మక కోణాలపై పని సాగింది. అయితే, మేధావులు మన ప్రాచీన సాహిత్యంలో ‘వ్యూహాత్మక సంస్కృతి’ అధ్యయనానికి తగిన ప్రాధాన్యతను ఇవ్వలేదు. సాధారణంగా రామాయణాన్ని మతపరమైన, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహితీ, సామాజిక కోణాల నుంచి చూసి అర్థంచేసుకుంటారు. కానీ, అది కూడా ముఖ్యమైన వ్యూహాత్మక అంశాలు గల గ్రంథం. ఈ కీలక కోణానికి మేధావులు, పండితులు ఎప్పుడూ ప్రాముఖ్యతనిచ్చి, ఆవైపుగా దృష్టి పెట్టలేదు. డా।।అనూప్ కుమార్ గుప్తా రచించిన ఈ పుస్తకం, రామాయణంలో వ్యూహాత్మక సంస్కృతికి సంబంధించిన సమగ్ర విశ్లేషణ అని చెప్పవచ్చు.
రామాయణంలోని వ్యూహాత్మక అంశాన్ని విశ్లేషించడం అన్నది భారతీయ అంతర్జాతీయ సంబంధాల సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత అంతర్జాతీయ సిద్ధాంతం ఐరోపా కేంద్రంగా ఉంటూ, ఐరోపా విలువలు, మూల సూత్రాలకు ప్రాముఖ్యతను ఇస్తున్నది. దీనికి ప్రధాన కారణం భారతీయ మేధావులు తమదైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే దిశగా పని చేయకపోవడమే. ప్రస్తుత అంతర్జాతీయ సంబంధాల సిద్ధాంత వర్ణపటం నుంచి వి•ంచి, దానిని మరింత సమగ్రం, సమ్మిళితం చేయడమే కాక అధికారం, దానికి సంబంధించిన అంశాలపై భారతీయ అవగాహనను అభివృద్ధి చేసేందుకు ఈ పుస్తకం తోడ్పడుతుంది.
ఈ పుస్తకాన్ని తొమ్మిది అధ్యాయాలుగా విభజించారు. తొలి అధ్యాయం వ్యూహాత్మక సంస్కృతికి సంబంధించిన వివిధ అంశాలను, మహా వ్యూహాన్ని (గ్రాండ్ స్ట్రాటజీ) గురించి చర్చించడంతోపాటు పాశ్చాత్యేతర అంతర్జాతీయ సిద్ధాంతాలను అభివృద్ధ్ధి చేయవలసిన ఆవశ్యకతను, ప్రత్యామ్నాయంగా భారతీయ సిద్ధాంతాన్ని అభివృద్ధి ఎలా చేయాలన్న అంశం గురించి వివరణాత్మకంగా విశదీకరిస్తుంది. రెండవ అధ్యాయంలో, సమకాలీన భారతదేశంలో వ్యూహాత్మక సంస్కృతిపై ప్రసంగాలను విస్తృతంగా విశ్లేషించి, చర్చించారు. మూడవ అధ్యాయంలో, ప్రాచీన భారతదేశ వ్యూహాత్మక సంస్కృతిపై సమగ్ర విశ్లేషణను ఇచ్చారు. ఆ తరువాతి అధ్యాయాలు రామాయణంలో వ్యూహాత్మక సంస్కృతి, భౌగోళిక వ్యూహాత్మక పర్యావరణంతోపాటుగా రావణుడి పాలనలో లంక అస్థిర విస్తరణను గురించి చర్చిస్తాయి. ఐదవ అధ్యాయంలో రావణుని వ్యూహాత్మక ఆలోచనల స్వభావాన్ని, ఆరవ అధ్యాయంలో రావణుని వ్యూహాత్మక ఆలోచనల విశ్లేషణను అందించారు. ఏడవ అధ్యాయంలో రాముడి వ్యూహాత్మక ఆలోచనలను చర్చించి, ఎనిమిదవ అధ్యాయంలో వాటిని విశ్లేషించారు. చివరి అధ్యాయంలో రామాయణంలోని వ్యూహాత్మక సంస్కృతి హేతుబద్ధతను చర్చిస్తూ, అంతర్జాతీయ సంబంధాల సిద్ధాంతంలో భారతీయ దృక్పధాన్ని నెలకొల్పడంలో రామాయణాన్ని వ్యూహాత్మకంగా అధ్యయనం చేయడం ఎందుకు ఉచితమో వివరించారు.
కనుక, ఈ పుస్తకం ప్రధానంగా రామాయణంలోని వ్యూహాత్మక సంస్కృతి, మహావ్యూహంపై దృష్టి పెడుతుంది. రచయిత రామాయణంలోని రెండు వ్యూహాత్మక సంస్కృతులకు సంబంధించిన రెండు రూపావళుల గురించి విస్తృతంగా వివరించారు. ఒకవైపు రాముని వ్యూహాత్మక సంస్కృతి నమూనా, మరొకవైపు రావణుని వ్యూహత్మక సంస్కృతి ప్రతిరూపం కనిపిస్తాయి. వ్యూహాత్మక ఆలోచన, వ్యూహాత్మక ప్రవర్తనలలో రామ, రావణుల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. రాముడి వ్యూహాత్మక సంస్కృతిలో మూల విలువ ఆధ్యాత్మిక అద్వైత భావం కాగా, రావణుని వ్యూహాత్మక సంస్కృతికి పునాది భౌతికవాదం. రాముని ఆలోచనలో ఆదర్శవాదం, యదార్ధత మధ్య అద్భుతమైన సమతుల్యత కనిపిస్తుంది. కానీ రావణుని ఆలోచనలో దూకుడుతో కూడిన వాస్తవికత లేదా యదార్ధత మాత్రమే ఉంటుంది.
రాముడి వ్యూహాత్మక ఆలోచన రాజకీయ, సైనిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పద్ధతులను ప్రతిఫలిస్తుంది. ఇందుకు భిన్నంగా రావణుని ఆలోచన కేవలం భౌతికవాదం, సైన్యంపై ఆధారపడినట్టు కనిపిస్తుంది. రాముడి వ్యూహాత్మక ఆలోచనలో న్యాయం, ప్రజా సంక్షేమం కోసం శక్తిని ఉపయోగించడం, ధర్మాన్ని కాపాడేందుకు యుద్ధం చేయడంలో ఎటువంటి సంకోచం ఉండదు. భిన్నంగా రావణుడు ఆలోచనలో అధికారమనేది పెత్తనం చెలాయించేందుకు, విస్తరణకు, ఇతరులను అణచివేసేందుకు ఉపయోగించడం కనిపిస్తుంది. కనుక, రాముడి భావజాలం, రావణుడి భావజాలానికి మధ్య ఉన్న తేడాని, ధర్మం, అధర్మం మధ్య ఉన్న వ్యత్యాసంగా చూడవచ్చు. రాముడి, రావణుడి వ్యూహాత్మక ఆలోచన, వ్యూహాత్మక ప్రాధాన్యతల గురించి ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించారు.
రామాయణ గ్రంథాన్ని చదవడం, వ్యూహాత్మకంగా అధ్యయనం చేయడం ద్వారా భారతీయ విజ్ఞాన సంప్రదాయంలోని వ్యూహాత్మక రచన, సంస్కృతి వంటి కీలకమైన అంశాన్ని పరిశీలించి, అందించడంలో పుస్తక రచయిత చేసిన కృషి ఎంతో ప్రశంసనీయం.
(- ఆర్గనైజర్ నుంచి)